పిట్టగోడ కథలు-1

0
8

[box type=’note’ fontsize=’16’] డాబా పైన పిట్టగోడ మీద కూర్చుంటే ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని కథలో… అంటూ చిన్ననాటి నేస్తాలను, ఊసులను గుర్తు చేసుకుంటున్నారు కవయిత్రి ఈ కవితలో. [/box]

[dropcap]సం[/dropcap]దు చివర చింత చెట్టు
ఆ వెనకాతల యేటి తట్టు
డాబా పైని పిట్టగోడపై కూర్చుని
భూమి ఆకాశం నిండిపోయేటన్ని
కథలు ఎన్ని చూశానో

చిరిగిన గౌను వెనుకుని, చింపిరి జుట్టుతో
కాలికి చెప్పులు లేకుండానే, మట్టినే మెత్తగా
ఐపొమ్మని శాసించి, పరుగెడుతున్న సీత
సాయింత్రాలు చల్లబడగానే చింత చెట్టు కింద
నాకోసం ఎదురుచూసిన ఘడియలు

సీత రాకుండా నే ముందెళితే
ఎటూ ఊసుపోదనీ ఊపిరాడదనీ
ఆలస్యంగా వెళ్ళాలన్న నా పంతం
సీమ చింతకాయలు, పుల్ల చింతకాయలతో
సీతతో దెబ్బలు తిన్న చందం

పిట్టగూడు కట్టి, పక్షులకి ఇల్లిచ్చి
అవి దిగేవరకూ రోజూ గుడ్లప్పగించి చూట్టం
గుడ్డులోంచి పక్షిపిల్లలు బయటికొస్తే
మా వల్లే అని బడాయి పోవడం

రిబ్బను రంగుల చక్రం చేతిలో పట్టుకుని
చెట్టు చుట్టూ పరిగెత్తి గాలిని ఓడించడం
ఎండకి డస్సి, నీడలో కూర్చుని
నీటిపై ఉన్న ఓడలని మట్టిలో గీయడం

బడికి వెడుతూ, వస్తూ చెట్టు పక్కన ఉన్న
చిన్న గేరు రంగు బండకి దండాలు పెట్టడం
అక్కడే ఉన్న పిలక పంతులు పెట్టే
అటుకులు బెల్లం పుట్నాలు తినడం

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కథలో ఎన్ని జ్ఞాపకాలో
ఆలోచనలకే సుంకం వేస్తే భూమిపై సగం భారం తగ్గిపోదా

జ్ఞాపకాలకే బహుమతులిస్తే సంతోషం సగం బలం అవ్వదా !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here