పిజ్జా అమ్మాయికొక లేఖ

0
12

[కన్నడంలో శ్రీ విజయ్ దారిహోక రచించిన ‘Pizza Hudugigondu Patra’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు.]

[dropcap]ఆ[/dropcap] రోజు నాకు బాగా గుర్తుంది. వీకెండ్ శుక్రవారం సాయంత్రం, ఇన్ ఆర్బిట్ మాల్ లోని రెండవ అంతస్తులోని ఫ్లోరినా పుడ్ కోర్ట్ చాలా రద్దీగా ఉండింది. నా సహోద్యోగులతో పాటు పిజ్జా హట్‌లో ఆర్డర్ చేయడానికి నిల్చున్నప్పుడు ఆర్డర్ డెస్క్‌లో నువ్వున్నావు. క్యూ చాంతాడులా ఉన్నది చూసి చిరాగ్గా తల అటూ ఇటూ తిప్పుతున్నవాడికి అకస్మాత్తుగా కనబడ్డది నువ్వు, నీ మొహం!

అలా చెప్పాలంటే చుట్టూ ఎన్ని అందమైన మొహాలు లేవని! కానీ ఆ రోజు నిన్ను చూసినప్పుడు మాత్రమే ఎందుకంత ఆకర్షణ! ఏ కాలపురుషుడి కుట్ర ఇది! అలసట ఎరుగని నీ మొహం నిండా చిరునవ్వు.. నీ ఎర్రటి యూనిఫార్మ్ రంగు నీ బుగ్గలక్కూడా!

నా ఆర్డర్ తీసుకుని అటూ ఇటూ చూస్తున్నప్పుడు నీ చెవులకున్న పెండ్యులం లోలకుల మృదువైన నాట్యం.. నా ఎడదలో రేపింది మధుర తరంగం..

నువ్వు నెక్స్ట్ ప్లీజ్ అనకుంటే నేనక్కడనుండి కదిలేవాణ్ణా..?

***

ఆ రోజు మనస్సులో వేసవి సెగ.. మళ్ళీ శుక్రవారం వచ్చింది.. దగ్గరలోని ఆఫీసు ముగించి వచ్చాను. మళ్ళీ నువ్వు.. అదే చిరునవ్వు.. ఒన్ మార్గరిటా ప్లీస్ అన్నాను.. మళ్ళీ నావైపు చూశావు.. నువ్వేమో బిల్లింగ్‌లో మగ్నం.. అదెలాంటి అమాయకమైన, ఆర్ద్రమైన, గుండ్రని కళ్ళు నీవి! దిద్దినట్టున్న, సమాన దూరంలో ఉన్న కనురెప్పల కురులు.. కొద్దిగా నల్లటి కాటుక టచప్ ఇచ్చినట్టుంది.. పింక్ రబ్బర్ బ్యాండ్‌తో మెహందీ అద్దిన, పద్ధతిగా వెనిక్కి కట్టిన పోనీటైల్.. అన్నీ కళ్ళకు కట్టినట్టుగా గుర్తున్నాయి అమ్మాయ్!

ఇక ప్రతి వీకెండుకి రావడం మొదలెట్టాను. పిజ్జా నెమ్మదిగా తింటూ, చల్లబడేదాకా.. చూసేవాణ్ణి నిన్ను. కళ్ళు మూసుకుని.. అలా ఎన్ని శుక్రవారాలు గడిచాయో లెక్క పెట్టలేదు.. మనిద్దరి కళ్ళు అవెన్ని సార్లు కలవలేదు చెప్పు? కానీ నీలో ఏ మాత్రం తేడా కనిపించలేదు.. నువ్వేమో! నీ పనేమో! కానీ అదే చిరునవ్వు.. ఇతర సమయల్లో నువ్వు ఆల్మోస్ట్ మూగదానివి అంటే ఎవరైనా నమ్ముతారో లేదో.. అంత మితభాషివి నువ్వు.. ప్రపంచంలోని సందడి నాకెందుకని పట్టించుకోక పోతే మాత్రమే ఇంత నిర్మలమైన ముఖచర్య వీలవుతుంది మరి!

***

ఆ రోజు రాత్రి.. పదిగంటలయ్యింది. మాల్ లోని ఔట్లెట్లన్ని ఒక్కొక్కటిగా మూయడం ప్రారంభించారు. నువ్వు కూడా ఇంటికెళ్ళాలని ఆత్రపడుతున్నావు. నీ చిన్ని బ్యాగును తీసుకుని బయలుదేరావు, నన్ను చూసీ చూడనట్టు..! నీ వెనకాలే సహజంగానే కొంచెం దూరంలో వెంటాడాను. మాల్ లోని ఎస్కలేటర్ దిగగానే బయట భోరున వర్షం కురవడం కనిపించింది. ఎక్జిట్ వద్ద జనం గుమిగూడారు. చాలా సేపటి దాకా వర్షం ఆగే సూచనలు కనబడలేదు. గుంపులో నిన్ను వెతికాను. ఆ! అక్కడ.. కురిపిస్తున్న మబ్బులను, కురుస్తున్న వర్షాన్ని దీక్షగా, నిస్సహాయంగా చూస్తున్న నీ కళ్ళు కనిపించాయి. అప్పుడప్పుడు నీ చిన్ని చేతులను బయటికి చాచి, వర్షం ఎంత పడుతోందో తెలుసుకునే సాహసం చేస్తున్నావు..!

“బాగా వర్షం పడుతోంది కదూ!”

ఒక్కసారి నావైపు చూసి మళ్ళీ బయటికి చూడసాగావు నువ్వు.. “ అవును.”

మనసంతా తడిసిపోయిన నన్ను ఈ బయటి వర్షం ఏం చెయ్యగలదు..!

కొంచెం సేపటికి వర్షం తగ్గింది. మాల్‌కు వచ్చిన వాళ్ళు తమ తమ కార్లలో తొందరగా వెళ్ళిపోసాగారు. వాళ్ళకు దారి చూపిస్తూ గార్డుల విజిల్స్.. నువ్వు నింపాదిగా రోడ్డుకు అటు వైపున్న ఆటోల దగ్గరకు వెళ్తే అక్కడ ఈ వర్షం మూలాన రోడ్లన్నీ జామ్ అయిన్నట్టుంది.. ఏ ఆటో కూడా రానట్టుంది.

దిక్కు తోచనట్టు నువ్వు నిలబడ్డం చూసి, నేను నీ వద్దకు వచ్చి జంకుతూనే అడిగాను

“ఏ వైపు వెళ్ళాలి?”

“మాదాపుర్ వైపు..”

“అలాగా! నేనుండేది కూడా అక్కడే! (పచ్చి అబద్ధం) ఆటోలు దొరికేలా లేవు. ఇలాగే నిలబడితే అర్ధరాత్రయిపోతుంది. రండి. అలా నడుస్తూ వెళ్తే చేరుకుంటాం..”

నువ్వు కొంచెం సేపు అటూ ఇటూ చూసి తలాడించావు.

“ఇంత వర్షం కురుస్తుందనుకోలేదు” మాటలు ప్రారంభించాను.

నువ్వేమో భీత హరిణంలా.. కానీ చిరునవ్వు మాత్రం చెదరలేదు.. ఇదేంటి.. బై బర్త్. లేదా బై డిఫాల్ట్ నవ్వును మొహం పైనే పెట్టుకుని పుట్టుండాలి ఈ అమ్మాయి అనుకున్నాను.

వర్షం తరువాత వీచే గాలికి నీ ముంగురులు అలవోకగా కదిలాయి.

“ఈ రోజు గొడుగు మరచిపోయాను”.. ఇది చెప్పేటప్పుడు కూడా కళ్ళల్లో సామాన్యంగా కనిపించే విసుగు కాకుండా అమాయకపు నవ్వు కనిపించి కరగి పోయాను..

వర్షం ఇంకా పూర్తిగా ఆగిపోలేదు. అలా చూస్తే నా ఆఫీసు బ్యాగులో ఉన్న చిన్న గొడుగును బయటికి తీయలేదు తెలుసా! ఆ సంగతి వింటే నవ్విపోతావు నువ్వు!

చాలా సేపటి దాకా మాటల్లేవు. ఈ దారి ఇలాగే సాగుతూ పోతుంటే ఎంత బావుణ్ణు అనుకున్నాను.

“మీ పేరేంటి? ఏం చేస్తుంటారు?” నువ్వడిగావు.

‘అబ్బ! పిజ్జా ఆర్డర్ తీసుకోవడం కాకుండా వేరే విషయాలు కూడా మాట్లాడడానికి వస్తుంది ఈమెకు..!’ అనిపించింది.

“ఇక్కడే హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనియర్‌గా ఉన్నాను, ఏదో బతుకు తెరువుకు..”

“ఓకె! గుడ్!” అని గమ్మునయిపోయావు నువ్వు.

నడుస్తున్న దారంతా మాటల సద్దు కంటే నీళ్ళు, చల్లటి గాలి చప్పుడే ఎక్కువగా వినిపించింది. అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే విద్యుల్లత. అంతే!

చివరికి నాకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది.

“మీకు చాలా థ్యాంక్స్!” అని చెప్పేటప్పుడు కూడా నీ కళ్ళు నా వైపు చూడలేదు. “మీ ఇల్లెక్కడ?”అని కూడా అడగలేదు నువ్వు.. నన్ను అక్కడే వదిలేసి తిరిగి కూడ చూడకుండా మరో వీధిలోకి చరచరా వెళ్ళిపోయావు.

నీ సల్వార్ కమీజ్, పైన దుపట్టా మాత్రం వెళ్ళడానికి మనసొప్పక మళ్ళీ మళ్ళీ నావైపు తిరిగి చూసినట్టు అనిపించింది నాకు..!

తరువాత ఏ రోజూ అలా వర్షం కురవలేదు. పిజ్జా హట్‌లో కూర్చుని దూరం నుండి నిన్ను అప్పుడప్పుడు చూసేవాణ్ణి. నీలో తేడా ఏమీ కనిపించలేదు.

ఎందుకలా సతాయించావు నన్ను?.. డ్యూటీ ముగించేసి ఆటో పట్టుకుని నువ్వంతకు నువ్వు వెళ్ళిపొయేదానివి. నాతో ఒక్కసారైనా మాట్లాడలేదు!

ఒక వారంపాటు నేను వేరే ఏదో ప్రయాణం పైన వెళ్ళాల్సి వచ్చింది. తరువాతి వారం జ్వరం వచ్చి పడుకున్నాను. రూమ్‌మేట్లను ప్యారా అసిటమాల్ తెచ్చివ్వండ్రా అంటే దాంతో పాటే ఓల్డ్ మంక్ రమ్ కూడా తెచ్చి పెట్టారు వెధవలు.

కోలుకున్న తరువాతి వారం ఆఫీసులో ఒక నెలపాటు విపరీతమైన పని ఒత్తిడి. ఆఫీసు అవగొట్టి మళ్ళీ నిన్ను చూడాలని ఆల్మోస్ట్ పరిగెత్తుకుని వచ్చాను. రద్దీ అంటే రద్దీ నీ కౌంటర్ వద్ద. దూరం నుండే నిన్ను చూసి ఊరట తెచ్చుకున్నా. కానీ ఎందుకో నీ ముందుకు రావాలనిపించలేదు.

నీ డ్యూటీ అయిపోయేదాకా కాచుకుని, ఆటోలు ఎక్కే జాగాలో నుంచున్నా. వేగంగా వస్తూ, నువ్వు నన్ను చూసి అలా నిలబడి పోయావు.. గుర్తుందా.. మొహం తిప్పేసి వెళ్ళిపోతావేమో అనుకున్న నాకు ఒక అరగడియ పాటు నీ మొహం పైన ఎందుకో చుట్టూతా ఉన్న దీపాల కిరణాలు చెదరి ప్రతిబింబించినట్టు అనిపించింది. ఇంకొద్దిగా నీ ముందుకు వచ్చి పరీక్షగా చూశాను.. అరె! నీ రెండూ కళ్ళల్లోనూ సన్నగా కనబడుతున్న కన్నీరు!

అది సరే కానీ ఆ ఏడుపులోనూ నీ మందహాసం తగ్గదా.. ! హ.. హ..

దాం తర్వాత జగమే మారినది మధురముగా ఈవేళ.. గుర్తుందా.. గింజుకునే నీ చేతులను నా చేతుల్లోకి మొట్టమొదటి సారిగా దాచుకున్న మొదటి క్షణం.. వేడి రక్తం ప్రవహించే నా చేతులలో నీ చల్లని మృదు హస్తం.. ఒకింత మౌనం.. నువ్వేమో మందస్మితవు.. ఎదురుగా నువ్వుంటే ఎన్నెన్ని రాగాలో.. పాట హమ్మింగ్ చేసింది గుర్తుందా అమ్మాయ్..?

ఎలాగో ఏమో మనవాళ్ళను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. నువ్వు పిజ్జా హట్ ఉద్యోగం మానేశావు. మనం ఫ్లాట్ కొన్నాం. మీ కాపురం కలకాలం వర్ధిల్లాలని మన స్నేహితులు దీవించారు.

పెళ్ళి తరువాత కూడా నువ్వు మితభాషివే. మందస్మితవే.. దేనికీ విసుగు చెందేదానివి కాదు. నీ వయసు వాళ్ళకందరికీ నువ్వంటే ఎంతో గౌరవం.. మురిసిపొయేవాళ్ళు.. మన పక్కింటి ఆంటీ, అంకుల్ నీ నవ్వును చూసి ‘ఎక్కడినుండి తెచ్చావమ్మా ఆ నిష్కల్మషమైన నవ్వు?’ అని ముచ్చట పడిపొయారు గుర్తుందా?

ఒక్కోసారి నువ్వు కదలకుండా నిద్రపోయేటప్పుడు నిన్నే రెప్పవేయకుండా చూసేవాణ్ణి. అప్పుడు కూడా నీ పెదాల అంచున చిరునవ్వు.. నింపాదిగా, నువ్వు లేవకుండా చూసుకుని, నీ పెదాలకు నా పెదాలు, నీ నుదుటికి నా నుదురు తగిలిస్తూ.. నిట్టూర్చేవాణ్ణి. సఖివి నువ్వు.. సుఖిని నేను..

ప్రతి వ్యాలెంటైన్ డే కి నీకో ప్రేమలేఖ.. దాంతో పాటు ఒక బొకే.. ‘ఎందుకీ ఫార్మాలిటీ? నువ్వుంటే చాలు. మరింకే సంతోషమూ నాకొద్దు’ అనేదానివి నువ్వు.

ఇద్దరూ పిజ్జా హట్‌కు వెళ్ళి అదే పిజ్జా ఆర్డర్ చేసేవాళ్ళం.. ప్రతి సంవత్సరం.. పాత జ్ఞాపకాలు ఎంత తీపి.. ఎంత రోమాంచనం.. కదూ !

ఈ రోజు 2021 ఫిబ్రవరి 14. వ్యాలెంటైన్స్ డే. అన్నిటినీ గుర్తు తెచ్చుకుని వాట్సప్‌లో పంపుతున్నాను. ఇంకా నలభై అయినా దాటలేదు నేను.. ఎందుకో టైప్ చేస్తుంటే వేళ్ళు వణుకుతున్నాయి.. అద్సరే. తొందరగా నీ వాట్సప్ చూసి నేను పంపిన మెసేజెస్ చదువు. నువ్వు చదివావు అనడానికి వచ్చే బ్లూ టిక్ కోసం కాచుకుంటాను.

అలా కాచుకుంటే ఏం లాభం.. ఇక్కడే ఉంది నీ మొబైల్.. అది కూడా నా వద్దనే ఉంది. చల్లగా.. నువ్వు క్యాన్సర్‌కు బలై మూడు సంవత్సరాలు కావస్తోంది. నమ్మబుద్ధవడం లేదు.. ఇప్పుడే మరోసారి ఇంట్లోని అన్ని రూములనూ చూసి వస్తున్నాను. ఎక్కడైనా ఉంటావేమో అని! బహుశ బయటికి వెళ్ళుండవచ్చు అనుకుంటాను. అలా ఊరికే ఊరటకు..!

ఈ కన్నీళ్ళు ఇంకుతాయన్న మాటే కనిపించడం లేదు. అలా జలపాతంలా వస్తూనే ఉన్నాయి. ఏం చెయ్యను?

ఆప్ సే మిల్ కర్ హమే యే జిందగీ.. అచ్ఛీ లగీ..! భూపిందర్ పాడిన గజల్ పాటను మళ్ళీ మళ్ళీ వెయ్యడం అలెక్సాకు అలవాటయిపోయింది.

నా మదిలో నువ్వు ఎల్లప్పుడూ ఉంటావని నాకు తెలుసు. కానీ అబద్ధం ఎందుకు చెప్పాలి?.. ఒక్క అరగడియ నీ చిరునవ్వును కళ్ళారా చూడాలని ఆశ. నీ చేతిని మనసారా పట్టుకోవాలని ఆశ నాకు! ఒకసారి కనిపించి మాయమైతే ఏం ఇబ్బంది నీకు!

ఆ రోజు ఆఖరి రోజు నువ్వు ఇక నిష్క్రమించేటప్పుడు నీ చెయ్యి నా ఎద పైని చొక్కాను గట్టిగా పట్టుకుంది. నన్ను వదిలిపోవడం నీకు సుతరాం ఇష్టముండలేదు అని అనిపించినప్పుడల్లా కళ్ళు వర్షించడం ఆపవు.

నా ప్రియమైన పిజ్జా అమ్మాయీ

కొండంత ప్రేమను పంచి

ఎక్కడికి పారిపోయావు?

భూమిపైకి చిరుపాత్రగా వచ్చి

మరలి వెళ్ళేప్పుడు కూడా

చిరునవ్వు మరువనన్నావు!

నీ ప్రేమను ఎల్లప్పుడూ ఆశించే గిరాకీ నేను!

కన్నడ మూలం: శ్రీ విజయ్ దారిహోక

తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here