ప్లాన్ ఫ్లాపయ్యింది

1
6

[dropcap]ఆ[/dropcap]షోరూమ్‍లో, రవికి రెండు టి షర్ట్స్ బాగా నచ్చాయి. కానీ ఒకటే కొనాలి, ఎలా అని ఆలోచించాడు. కొనుక్కునేది ఎప్పుడూ తనతోనే ఉంటుంది కాబట్టి, ఆ రెండో దాన్ని ట్రైల్ వేసి వదిలెయాలనుకున్నాడు. వెంటనే ట్రైల్ రూమ్ లోకి వెళ్ళి ఆ టి షర్ట్ వేసుకుని రెండు మూడు సెల్ఫీలు దిగాడు. తర్వాత బయటకు వచ్చి, దాన్ని పక్కన పడేసి, కొనాలనుకున్న దాన్ని బిల్ చేయించడానికి గాను లైన్‌లో నిల్చున్నాడు. లైన్ కొంచెం పెద్దదిగానే ఉంది. ఆ పక్కనే ఉన్న లైన్ మాత్రం కొంత ఖాళీగా ఉంది. అటువైపుకి చూశాడు. ఓ అమ్మాయి, స్టయిల్‌గా బబుల్ గమ్ నములుతూ ఓ సారి రవి వంక చూసింది. ఆమెనీ, ఆమె కళ్ళనీ చూడగానే, కర్చీఫ్ తీసి మూతి తుడుచుకున్నాడు. ఆమె చిన్నగా నవ్వింది. రవి కూడా చిన్న నవ్వు నవ్వాడు. ఆమె రవి చేతిలోని టి షర్ట్ చూసి, “గివ్ మీ, ఐ విల్ మేక్ ఇట్ బిల్” అంది.

ఆమె వంకే చూస్తూ, చేతికి టి షర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా, నుంచున్న శవంలా, కళ్ళప్పగించి మరీ అలా చూస్తూనే ఉండిపోయాడు. ఇంతలో ఆమె బిల్ చేయించేసింది.

“థాంక్ యు” అని డబ్బులు ఆమెకి ఇచ్చేశాడు. ఆమె, “ఇట్స్ ఒకే” అంటూ టి షర్ట్ ఇచ్చేసి, ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంతలో భార్య దగ్గరనుండి ఫోన్ రాగానే, విసుగ్గా కట్ చేసి ఫోన్ సైలెంట్‌లో పెట్టాడు. తర్వాత, అయస్కాంతం ముక్కకి ఇనప ముక్క ఆకర్షితమైనట్టు, రవి అప్రయత్నంగా ఆమె నడిచివెళ్లిన వైపే  అడుగులు వేస్తూ నడిచాడు.

తర్వాత ఆమె జ్యూలరీ ఫ్లోర్ లోకి వెళ్లిపోయింది. రవికి ఎందుకో ఆ షాపింగ్ మాల్ నుండి బయటికి వెళ్ళబుద్ధి కాలేదు. కాలు కాలిన పిల్లిలా అక్కడక్కడే తిరుగుతూ ఉండిపోయాడు. ఓ క్షణం ఆమెని గుర్తు చేసుకుంటూ, ‘ఆమె ఎంత బావుందీ, ఓ ట్రైల్ వేసి చూద్దాం. ముందు ఆమెతో ఎలా అయినా మళ్ళీ ఓ సారి మాట్లాడాలి. ఆమె కనిపించగానే వెళ్ళి, ఇంగ్లీష్‌లో చక చకా నాలుగు ముక్కలు నా గురించి చెప్పి పరిచయం చేసుకుంటాను’ అని ఓ క్షణం ఆలోచించి, ‘ఛ, ఛ  వద్దు. మరీ సేల్స్ బోయ్ ఏదో ప్రాడక్ట్ గురించి చెప్పే ముందు పరిచయంలా అనిపించినా అనిపిస్తుంది. కనక, ఆమె జ్యూలరీ ఔట్లెట్ నుండి బయటికి రాగానే, ఓ పూల బొకెతో వెళ్ళి, దాన్ని స్టయిల్‌గా ఆమెకి ఇస్తూ, యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటాను, దాంతో ఆమె ఒకింత ఇంప్రెస్ అయిపోయి, నా వలలో పడుతుంది. అయినా ఇంత వరకూ ఎంత మంది అమ్మాయిలని లైన్‌లో పెట్టలేదూ, ఈమె ఓ లెక్కా’ అని అనుకుంటుండగానే ఒక సేల్స్ గర్ల్ వచ్చి “ఏం కావాలి సార్” అంటూ అడిగింది.

“రొమాన్స్” అని ఆమె వంక ఓ క్షణం కక్కుర్తిగా చూసేసి, “అదే, అదే రొమాన్స్ పెర్ఫ్యూమ్ కావాలి” చెప్పాడు చిన్న చిరునవ్వుతో.

“అయితే మీరు బయటికి వెళ్ళాలి” అని సీరియస్‌గా అని, “అదే సార్, ఆ బ్రాండ్ బయటే దొరుకుతుంది. ఇక్కడ అలాంటివి దొరకవు. అనవసరంగా మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి” చెప్పింది మింగేసేలా చూస్తూ.

“పర్లేదు, ఇక్కడ  అచ్చం అది కాక పోయినా, అలాంటిది దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను” అని ఆమెతో అంటుండగానే, ఆమె జ్యూలరీ ఔట్లెట్ నుండి బయటికి వచ్చింది. ‘హమ్మయ్య షాపింగ్ అయిపోయినట్టుంది. చేతిలో బోలెడు బేగేజెస్ కూడా ఉన్నాయి. జ్యూలరీ కూడా కొన్నట్టుంది.’ అనుకున్నాడు ఆమె చేతుల్లో ఉన్న సంచుల వంక చూస్తూ.

అవన్నీ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతూనే షాపింగ్ మాల్ నుండి బయటికి వచ్చింది. అటూ ఇటూ చూస్తోంది. ఇదే మంచి అవకాశం అన్నట్టుగా రవి పెద్ద అడుగులు వేసుకుంటూ నడిచాడు. ఆమె దగ్గరకి వెళ్ళి “కొన్ని నాకివ్వండి, మిస్” అని ఆగాడు.

“సౌమ్య” అందామె మామూలుగా చూస్తూ,

“నా పేరు రవి. ఎక్కడికెళ్లాలి మీరు”

“రామ్ నగర్” చెప్పిందామె.

“అరె నేను కూడా అటువైపే వెళ్తున్నాను. రండి” అని ఆ తీసుకున్న పాకెట్స్‌ని కార్ వెనకాల పెట్టేసి ఆమె కోసం ముందు డోర్ తీశాడు.

ఆమె కార్ నెంబర్ ఫోటో తీసుకుని ఎవరికో వాట్సప్ చేసింది. తరువాత రవి ఫోటో కూడా.

రవి చూసి నవ్వుకున్నాడు. “సరే రండి మేడమ్” అన్నాడు.

డ్రైవింగ్ చేస్తున్నా ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె అతనికి కనబడేలా తన నల్ల పూసలు తీసి చీర కొంగుకి పైన వేసుకుంది. అది చూసి రవి తనలో తను చిన్నగా నవ్వుకున్నాడు.

క్షణం తర్వాత “మీ హస్బండ్ ఏం చేస్తుంటారు” అడిగాడు

“ఆయన అమెరికాలో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మొన్ననే ఓ సారి వచ్చి వెళ్లారు. మళ్ళీ ఎపుడో తెలీదు. ఈసారి వస్తే అతనితో వెళ్లిపోవాలి.” చెప్పింది రవి వంక చూస్తూ.

ఏదో క్లూ దొరికినట్టు కొంచెం సిగ్గుపడుతూ “ఓకె” అన్నాడు. కొద్ది సేపటి తర్వాత “రవి, ఇక్కడే నే ఉండేది.ఇదే మా అపార్ట్మెంట్” అంది.

“ఒహ్హ్ నైస్.” చెప్పి “అదీ” అని ఆగిపోయాడు

“కాఫీ?” అందామె నవ్వుతూ

‘నా రొట్టె విరిగి జామ్‌లో పడింది’ అని మనసులో అనుకుని, పైకి “షూర్” అని సెల్లార్‌లో కార్ పార్క్ చేసి లిఫ్టులో ఇద్దరూ ఐదవ ఫ్లోర్‌కి వెళ్లారు.

రూమ్ లాక్ తెరుస్తూ “నేను వర్క్ ఫ్రమ్ హోం. నేనొక్కదాన్నే ఉంటాను.” చెప్పింది

“ఐ సీ” అన్నాడు లోనికి అడుగేస్తూ. రవికి ఇల్లు మొత్తం చూపించింది సౌమ్య. ఆత్రంగా వెళ్ళి బెడ్ రూమ్ తెరవబోయాడు.

“ఇది పర్శనల్ బెడ్రూం. నీకు ఎంట్రీ లేదు” చెప్పింది మరో సారి నవ్వుతూ

తర్వాత కాఫీ తాగేసి, రవి అక్కడినుండి వెళ్లిపోయాడు. తర్వాత, సౌమ్య రమ్మన్నపుడు వెళ్ళి, తనని అక్కడా ఇక్కడా డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడం పరిపాటైపోయింది.

ఓ సారి చెప్పా, పెట్టకుండా సౌమ్య ఫ్లాట్‌కి  వెళ్ళి సర్‌ప్రైస్ చెయాలనుకున్నాడు. కానీ అప్పటికే ఒకతను తనతో పాటు సోఫాలో కూర్చున్నాడు. ‘అరె ఈమె హస్బండ్ అమెరికా నుండి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డాడా ఏవిటి ఖర్మ’ అని మనసులో అనుకున్నాడు.

ఇంతలో, సౌమ్య పక్కన కూర్చున్న ఆ వ్యక్తి  “హాయ్” అంటూ పలకరించాడు.

సౌమ్య లేచి “రవీ, నువ్వనుకున్నట్టు ఇతను మా హస్బెండ్  కాదు. నా ఫ్రెండ్ వేణు. ఇక్కడ నాకు ఏ కష్టం వచ్చినా మొదట కాల్ చేసేది వేణూకే. ఫ్రెండ్ అంటే నువ్వనుకున్నట్టు కాదు. ఏవీ ఆశించని ఫ్రెండ్. అతని కళ్ళలో ఎప్పుడూ నేను, చవకబారు చూపుల్నీ, లేకి కక్కుర్తీనీ గమనించలేదు” అని వేణు వైపు చూస్తూ, “ఇతను రవి, నువ్ వారం పాటు ఊరు వెళ్లిపోయావ్, సరిగ్గా కక్ష కట్టినట్టు అప్పుడే నా కారు రిపేరు వచ్చింది. సరే ఓ రోజు కాళ్లీడ్చుకుంటూ షాపింగ్‌కి వెళ్లానా, అక్కడ నన్ను చూసి చొంగ కార్చుకుంటూ కనిపించాడు రవి. తర్వాత కార్లో లిఫ్టు ఇస్తా అన్నాడు. సరే అని అప్పటి నుండి రవి వీక్నెస్ కనిపెట్టి, అతన్ని ఓలా కాబ్ డ్రైవరులా వాడేశానంటే నమ్ము.” అంది సౌమ్య నవ్వుతూ

రవికి నవ్వు రాలేదు. కొంచెం సీరియస్‌గా లేచి “వస్తాను” అన్నాడు.

“నో నీడ్ రవి, ఇక నుండి వేణు కార్ ఉందిగా. నీతో, ఐ మీన్ నీ కార్‌తో పని పడదు. నీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, చేయకూడడా అని ఓ ట్రైల్ వేశాను. నువ్వు ఫెయిల్ అయ్యావ్. ఇంకో విషయం, అమ్మాయిలు టి షర్ట్స్ కాదు, ట్రైల్ వేసి వదిలేయడానికి ” చెప్పింది వ్యంగ్యంగా నవ్వుతూ.

దాంతో బిక్కచచ్చిపోయి, చచ్చు చూపులతో ‘ప్లాన్ ఫ్లాపయ్యింది,ఛ,ఛ’ అనుకుంటూ బయటికి నడిచాడు రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here