ఒక కొత్త అనుభూతినిచ్చే ప్లే బ్యాక్

4
10

[dropcap]హు[/dropcap]షారు ఫేమ్ దినేష్ తేజ్, మల్లేశం ఫేమ్ అనన్య నాగల్ల కీలకపాత్రల్లో హరిప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ప్లే బ్యాక్’. ఆహా ఓటీటీ ప్లాట్ఫాంపై విడుదల అయింది. ఇది వరకే వెండి తెరపై విడుదల అయి మంచి పేరు తెచ్చుకుంది.

‘ప్లే బాక్’ సినిమా నాకు కాస్త ప్రత్యేకమైనది. నా సన్నిహితుడు, ఆప్తుడు మానస్ జమ్మిశెట్టి అసోసియేట్ డైరెక్టర్‌గా ఈ సినిమాకి పని చేయటం విశేషం.

అయినా ఈ రివ్యూని నిష్పక్షపాతంగా వ్రాస్తున్నాను సుమా.

హెచ్.జీ.వెల్స్ నవలలో చర్చించిన ‘టైం మషీన్’ భావన అనేక హాలీవుడ్ సినిమాలకు, ఇతర భాషా సినిమాలకు ప్రేరణ అన్నది అందరికీ తెలుసు.

మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు వ్రాసిన నవల లిటిల్ రాస్కెల్ లో అనుకుంటా ప్రారంభ వాక్యాలు ఇలా ఒక కొటేషన్‍తో ప్రారంభం అవుతాయి.

“Half of life is If”

అంటే – అలా జరిగుంటే బాగుండు అని అనుకోవటంలోనే జీవితంలో సగభాగం ఖర్చు అయిపోతుంది. ఇలాంటి ఊహ నుంచి పుట్టినవే ఈ సినిమాలు నవలలూ అన్నీ కూడా.

ఇంగ్లీష్ గ్రామర్ లో ‘ఇఫ్ కండీషన్స్’కి అందుకే ప్రత్యేక స్థానం ఉంది.

సాధారణంగా మనం ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాము, గతంలో అలా జరిగి ఉంటే ఎంత బాగుణ్ణు అని. చాలా సంవత్సరాల క్రితం ఒక తమిళ సినిమా చూశాను.

ఒక యువకుడు ఇంటర్వ్యూకి అని బయలు దేరి సిటీ బస్ స్టాప్‌లో నిలబడతాడు. ఆ బస్సు దొరికి ఇంటర్వ్యుకి వెళ్ళి ఉద్యోగం దొరికి అతను ఆనందంగా ఉన్నట్టు ఒక కథనం, అతనికి బస్సు మిస్స్ అయి అతను ఇంటర్యూకి వెళ్ళలేక వేరే ఇతర నాటకీయ పరిణామాలు అతని జీవితంలో చోటు చేసుకున్నట్టు ఇంకో కథనం, ఇవి రెండు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. ఎక్కడా బోరు కొట్టకుండా అన్ని క్లాసు ప్రేక్షకులను రంజింపచేస్తూ దర్శకుడు అద్భుతంగా తీశాడు.

అరె, మన చేతిలో ఏమి లేదు కద, మనం అందరం విధి ఆడే వింత నాటకంలో పావులం అన్న ఆధ్యాత్మిక అనుభూతికి గురయి ప్రేక్షకుడు బయటికి వస్తాడు ఆ తమిళ సినిమా చూశాక.

అదే విధంగా అనేక కొరియన్ డ్రామాలలో, హాలివుడ్ సినిమాలలో గతంలోకి టైం మషీన్‌లో వెళ్ళి గతాన్ని మార్చగలిగితే ఎలా ఉంటుంది అన్న భావనని స్పృశించటం ఇదివరకూ బాగానే జరిగింది.

మన తెలుగులో సింగీతం శ్రీనివాసరావు గారి ‘ఆదిత్య 369’ లో గతంలోకి టైం మషీన్‌లో వెళ్ళటం అన్న భావనని పూర్తి కమర్షియల్ హంగులతో తీయటం జరిగింది.

ఏదైనా అద్భుతం జరిగి మన వర్తమానాన్ని మనం మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది అన్న భావనని ఇది వరలో అన్న గారి ‘యమగోల’, ఎస్వీ కృష్ణారెడ్డి గారి ‘యమలీల’లో చర్చించటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫక్తు మాస్ మసాల చిత్రాలు. ఎక్కడా కూడా మసాల సినిమా గ్రామర్‌ను వీడి కాస్తా మేధావిత్వంతో తీద్దాం అన్న ప్రయత్నం జరగలేదు.

ఎస్వీ కృష్ణారెడ్డి గారి యమలీల లోని మదర్ సెంటిమెంట్, సుకుమార్, మహేష్ బాబుల నెంబర్ వన్‌లో అమ్మా, నాన్నల ప్రేమకి దూరమైన హీరో యొక్క మదర్ సెంటిమెంట్ అప్పుడప్పుడు గురుతు వస్తాయి ఈ చిత్రంలో. మెత్తం మీద హార్ట్ టచింగ్ ఫీలింగ్‌ని తెప్పించటంలో దర్శకుడు సఫలీకృతుడు అయ్యాడు. ఈ సినిమాకి కథ వ్రాసింది, వన్ నేనొక్కడినేకి కథ వ్రాసింది ఒక్కరే.

ఒక్క ముక్కలో కథ చెప్పాలి అంటే, గతంలోకి వెళ్ళి, అమ్మ ప్రాణాన్ని కాపాడుకోవడం అన్న పాయింట్ మూలం ఈ సినిమాకి.ఈ ఫాంటసీ ఆలోచనకి చక్కటి కథని వ్రాసుకుని, చక్కటి కథనంతో, మంచి టీం వర్క్ తో తీయబడ్డ సినిమా ఇది.

హరిప్రసాద్ జక్కా గతంలో ‘వన్ నేనొక్కడినే, 100% లవ్, దర్శకుడు, ఏప్రిల్ 28 న ఏమి జరిగింది?’ తదితర చిత్రాల ద్వారా తన ప్రతిభని వివిధ విభాగాలలో నిరూపించుకుని, పూర్తిస్థాయి దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఈ ప్లే బాక్ అని గూగుల్ సమాచారం.

దర్శకుడిగా హరిప్రసాద్ జక్కాకి మంచి భవిష్యత్ ఉంది అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. మదర్ సెంటిమెంట్ వన్ నేనొక్కడినే లో పండినంతగా ప్లే బాక్‌లో పండలేదు అని అనిపించింది. పోలిక లేకుండా ఒపెన్ మైండ్‌తో చూస్తే అద్భుత ప్రయత్నం అనడంలో సందేహం లేదు.

కథ:

టైటిల్స్‌కి ముందే ఓ జంట హత్యల దురాగతం మనకు కనిపిస్తుంది. గుడి ద్వారం వద్ద కూర్చున్న అనాథ అయిన ఓ పసి బాలుడు అనుకోకుండా చూడటం జరుగుతుంది ఈ హత్యలను. ఇది ప్రారంభ సన్నివేశం.

అది అర్ధరాత్రి కావటం, మెరుపులు, ఉరుములు, పిడుగులు ఈ అర్ధరాత్రి హత్యకి మరింత హారర్ నేపథ్యాన్ని జోడిస్తాయి. ప్రారంభమే ఉత్కంఠ కలిగించేలా ఉండటం వల్ల ఇంక ప్రేక్షకులు అతుక్కుపోతారు సీట్లకి.

ఆ చిన్న కుర్రాడు భయపడి పారిపోతాడు. హంతకుడు (టీఎన్నార్) వాడిని వెంబడిస్తాడు. అనాథ అయిన ఆ పసి బాలుడు సుజాత (అనన్యా నాగల్ల) ఇంటి పెరడు లోకి వచ్చి స్పృహ తప్పి పడిపోతాడు.ఆచూకి కనుక్కోలేక టీఎన్‌ఆర్ నిరాశగా వెళ్ళిపోతాడు.

ఇంకో సీన్లో, కార్తీక్ (దినేష్ తేజ్) జర్నలిస్టుగా స్థిరపడాలని ప్రయత్నం చేస్తూ టీవీ ఆఫీసుల చుట్టూ తిరుతుతూ ఉంటాడు. అతని మిత్రుడి అత్యుత్సాహం వల్ల ఇల్లు ఖాళీ చేసి, హుటాహుటిగా ఇల్లు వెదుక్కోవాల్సి వస్తుంది. ఆ ఎమర్జెన్సీ కారణం వల్ల ఊరి చివర ఇందిరానగర్ కాలనీ అనే అభివృద్దికి నోచుకోని కాలనీలో ఒక పాత ఇల్లు, బ్రోకర్ సాయంతో దొరుకుతుంది. అతను తన స్నేహితుడితో ఆ ఇంటికి అద్దెకు వస్తాడు. కార్తీక్‌కు ఆ ఇల్లు చాలా అలవాటయిన ఇల్లు లాగా అనిపిస్తుంది. లైట్ స్విచ్చు ఎక్కడ ఉంది, ఏ కిటికీ తీస్తే ఏమి కనిపిస్తుంది, తన వైట్ బోర్డు సరిగ్గా ఎక్కడ అమర్చుకోవాలో లాంటి దేజావూ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అతనికి.

కార్తీక్ ఆ ఇంట్లో ఓ పాత మోడల్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను చూస్తాడు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సుజాత (అనన్య నాగల్లా) నుంచి ఫోన్ వస్తుంది. నిజానికి ఆ ఫోన్‌కి కనెక్షన్ ఎప్పుడో రద్దు అయి ఉండటం విశేషం. అయినా ఫోన్ కాల్ రావటమే విచిత్రం. అలా వారిద్దరు మాట్లాడుకుంటున్న నేపధ్యంలో సుజాత ఉన్నది 1993లో, కార్తీక్ బ్రతుకుతున్నది 2019లో అని తెలుస్తుంది ఇది మరో ట్విస్టు.

అసలు సుజాత-కార్తీక్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్న కార్తీక్ ఫోన్ ద్వారా గతంలో సుజాత భవిష్యత్‌ను ఏ విధంగా మార్చాడు? ఈ మొత్తం కథలో అసలు టెలిఫోన్ పాత్ర ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.

ఒక టెలిఫోన్‌ను వేదికగా ఉపయోగించి రెండు వేర్వేరు కాల వ్యవధులను పరస్పరం అనుసంధానించే భావన చాలా బాగుంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆద్యంతమూ బాగా చూపారు.

ఇక లుక్స్ పరంగా దినేష్ తేజ్ బాగున్నాడు మరియు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో అతని నటన కూడా బాగుంది. నటి అనన్య నాగల్లా తనకు చేతనయింత మేరా బాగా చేసింది. ఈమె సాధన చేస్తే మరింత మంచి నటిగా రాణిస్తుందనటంలో సందేహం లేదు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌లో నాటకీయత కాస్త తగ్గించి ఇంకా కాస్త సహజంగా నటించి ఉంటే బాగుండేదేమో అనిపించింది ముఖ్యంగా ఎమోషన్లు పండించే సందర్భాలలో.

కథ వ్రాసుకోవడంలో రచయిత యొక్క మెచ్యూరిటి కనిపించింది. గతంలోని ఆ అమ్మాయికి వర్తమానంలోని ఈ హీరోకి మధ్య ఉన్న అనుబంధంని చిత్రీకరించటంలో రచయిత చాలా హుందాతనం పాటించాడు.

టీవీ5 న్యూస్ ప్రెజంటర్ మూర్తి ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. ఆయన నటుడిగా అనుభవం ఉందో లేదో తెలియదు కానీ చాలా అనుభవజ్ఞుడైన నటుడిలా ఈజ్‌తో నటించాడు, కొన్ని సీన్లలో అయన మెథడ్ ఆక్టింగ్ కూడా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. ఆయనకి వీరతాడు వేయవచ్చు.

టిఎన్ఆర్‌ది ఈ సినిమాలో అతి కీలక పాత్ర. గతంలోనూ వర్తమానం లోనూ కూడా కనిపిస్తూ భయపెడతాడు. ఆయన కనిపిచ్చినపుడల్లా ఒక స్పెషల్ మ్యూజిక్ పెట్టి ఉంటే బాగుండేది. టీఎన్‌ఆర్ గారికి పెద్దగా డైలాగులు లేకపోయినా స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ స్పందన, అర్జున్ కళ్యాణ్ వారి పాత్రలలో మెప్పించారు. అర్జున్ కళ్యాణ్ గూర్చి ఊరికే బాగా చేశాడు అని వదిలేయలేస్తే దోషమే. అతని నటనలో ఈజ్ ఉంది. కథలో కీలక సమయాల్లో వచ్చి ప్రియురాల్ని కాపాడుకునే సందర్భాలలో ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్ ఇస్తాడు. మూగ ఆరాధకుడిగా బాగా నటించాడు. ఆ రోజుల్లో నిజంగానే ఇంతటి తెంపరితనం ఉండేది కాదు ప్రేమికుల్లో. ఈ అంశం బాగా పట్టాడు డైరెక్టర్.

కథకు మూలస్తంభం లాంటి బాల నటుడు ముద్దులొలుకుతూ భలే ఆకట్టుకుంటాడు అందర్నీ.

కొన్ని సైడ్ లైట్స్

టీఎన్‌ఆర్ గారికి ప్రారంభంలో నివాళి అర్పించడం సమయోచిత చర్య. కాసేపు బాధేసింది ఆ స్లైడ్ చూసి. ఈ సినిమాలో కథకి అనుగుణంగా టిఎన్‍ఆర్ పాత్రని హింసించేటప్పుడు అరెరె ఆయన్ని కొట్టొద్దండిరా అని అరిచి చెప్పాలి అనిపించింది. తనికెళ్ళ భరణి చెపుతారు ఒక దగ్గర, మమ్మల్ని ప్రేక్షకులు ఎంత ఏవగించుకుంటే విలన్‌గా మా పాత్ర అంత పండినట్టు అని. సరిగ్గా ఆ మాటలు సూట్ అవుతాయి ఈ సినిమలో టీఎన్ఆర్ గారికి. ఒక మంచి నటుడిని కోల్పోయామే అని బాధ కలుగుతుంది ఆయన్ని చూసినంత సేపు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యలో సామాన్యుడైన గ్రామీణుడి పాత్రకీ, ఇందులో విలన్ పాత్రకి పోలికే లేదు. ఆయా పాత్రల్లో జీవించే నటుడు ఆయన అని అనిపించింది.

ఈ చిత్రం 1993 మరియు 2019 సమయాల మధ్య ఉండడంతో, ప్రధాన తారాగణానికి సంబంధించిన చాలా ఎపిసోడ్‌ల విషయంలో ప్రేక్షకులు గందరగోళానికి గురి అవకుండా హేండిల్ చేసిన విధానం చాలా బాగుంది. సమయోచితంగా గుజరాత్ భూకంపము ఎపిసోడ్ వాడుకున్న విధానం బాగుంది.

చెట్టు మాయవడం, ఇంటి వెనుక ప్రత్యక్షం అవడం బాగుంది. అదే చెట్టు మొదట్లో 1993లో ఫోటోలు తవ్వి దాచి పెడితే ఒక కొరియర్ సర్వీస్ లాగా 2019లో ప్రత్యక్షమవడం, ఫోన్ స్క్రూ తీసి ఫోన్ బాడిలో కీలకమైన ఫోటోలు పెడితే హీరోకి అవి అందటం ఇలాంటి వన్న్నీ దర్శకుడు తీసుకున్న స్వేచ్చాయుత చర్యలు. అవన్నీ బాగున్నాయి.

మెట్రో, ఆధార్ కార్డ్, వెబ్ సైట్, సెల్ ఫోన్స్ ఇవేవి హీరోయిన్‌కి తెలియక పోవటం మనల్ని కూడా ఆలోచింపచేస్తాయి. అరె పాతిక సంవత్సరాలలో మనం ఎన్ని అద్భుతాలు చూశాము కద అని.

1993 నాటి వాతావరణాన్ని చూపించేందుకు ఆర్ట్ డైరెక్టర్‌కి ఒక మంచి అవకాశం ఈ చిత్రం ద్వారా వచ్చినప్పటికి, బడ్జెట్ పరిమితుల కారణంగా అనుకుంటా చాలా సందర్భాలలో ఉత్తినే మమ అనిపించారు. ఒకే వీధిని మెట్రో లైన్ లేనప్పుడు, మెట్రో ఉండగానూ చూపించి ఉండవచ్చు. ప్రేక్షకులు అబ్బ అని థ్రిల్ అయి ఉండేవారు.

అదే విధంగా అప్పటి ప్రధాన వాహనాలు మారుతి 800, మారుతి ఎస్టిం, మేటిజ్ కార్లు, ఆర్టిసి బస్సులు అప్పటి కలర్, మోడల్స్‌తో, బజాజ్ చేతక్, ఎల్ ఎం ఎల్ వెస్పా స్కూటర్లు, అప్పుడప్పుడే వస్తున్న కేబులు టీవి ప్రసారాలు, పంజగుట్ట ఫ్లై ఓవర్ లేనప్పుడు, సెంట్రల్ షో రూం లేకుండా ఉండే జంక్షన్ ఇలా ఎన్నో విన్యాసాలు చేసి ఉండవచ్చు.

ఇంకా హీరో హోండా, ఇండ్ సుజుకి, కవాసాకి బజాజ్, యమహా ఆర్ ఎక్స్ 100 విరివిగా నడుస్తున్న కాలం అది. అవన్నీ చూపించి ఉండవచ్చు. అఫ్‌కోర్స్ నేను రంధ్రాన్వేషణ చేసినట్టు అనిపిస్తు ఉండవచ్చు. పీరియడ్ ఫిలింస్‌లో ఉన్న అడ్వాంటేజి మరియు రిస్కు కూడ ఇదే.

ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కి నేను కాస్తా తక్కువ మార్కులు ఇస్తాను. డైరెక్టర్ తెలివిగా మేనేజి చేశాడు.

రిచర్డ్ అటెన్ బరో గాంధీ, టైటానిక్ మూవీల లాగా కాకున్నా కాస్త రిచ్‌గా ఈ దిశగా ప్రయత్నం చేసి ఉండవచ్చు. లాండ్ లైన్ కూడ 1993 నాటికి ఇలా బండగా నల్ల ఫోన్లు కాకుండా రంగుల్లో బటన్ ప్రెస్ టైపువి అందుబాటులో ఉండినవి.

వార్తలు చూపటానికి అప్పటికి ఇంకా ప్రయివేట్ కేబుల్ చానెల్స్ వారికి అనుమతి లేదు. ఆ విషయం చక్కగా చూపారు. వార్తలను దూరదర్శన్‌లో వచ్చినట్టు చూపారు. అప్పటికి రీలు ఉండే కెమెరాలు అందుబాటులో ఉండేవి. అదే చూపారు. కెమెరా రీలు తీసి లాబ్‌లో ‘కడగటానికి’ ఇచ్చి రెండ్రోజులు అయ్యాక తెచ్చుకోవాల్సిన రోజులు అవి. బాగా చూపారు. ఇంకా కోనికా వచ్చి సకురా గానో, లేదా సకూర వచ్చి కొనికా గానో మారుతున్న కాలం అది. విపరీతంగా ఆడ్స్ వచ్చేవి అప్పట్లో., ఇంకా కోడక్, ఆగ్ఫా,, ఫ్యూజీ ఫిలిం గట్రా కూడా స్టుడియో వాతావరణంలో చూపించి ఉండవచ్చు.

కాడ్ బరీస్ చాక్లెట్ అప్పటి రాపర్ చూపారు. అది గమనించాను. 1993 నాటి ఫాషన్‌కి అనుగుణంగా లూజ్ షర్ట్స్, బ్యాగీ పాంట్సు, పెద్ద కళ్ళ జోడులతో భలే ఆకట్టుకుంటాడు అర్జున్ కళ్యాణ్.

టైం పీరియడ్‌కి సంబంధించి ఎక్కువ లోపాలు కనిపించే అవకాశం లేకుండా తెలివిగా, మెయిన్ స్ట్రీట్స్ గట్రా చూపకుండా, కాలనీలలో, ఓపెన్ గ్రౌండ్స్ లో అదీ చీకట్లో, సాయంత్రాలలో కథ నడిపారు.

గతానికి సంబంధించి. ఐషర్ మిని ట్రక్కు అప్పట్లో ఐషర్ అన్న అక్షరాలు చిన్నగనూ మిట్సూబిషి అన్న అక్షరాలు పెద్దగానూ, మిట్సుబిషి లోగో తోనూ వచ్చేవి అప్పట్లో.అది పరిగణలోకి తీసుకోలేదు అనుకుంటా. ఆ బాలుడిని దాచేసే టెన్షన్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా ఇది పట్టించుకోరు.

చక్కగా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించటానికి హెచ్ఎంటీ వాచీలు చూపారు కానీ అప్పటికే టైటాన్ వాచీలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. రేబాన్ గ్లాసెస్ ఇండియాలోకి వచ్చిన కొత్తలు అవి.

26 సంవత్సరాలు అంటే మరీ పూర్వకాలం ఏమి కాదు. కానీ ఫాషన్స్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికి. ఈ విషయంలో కూడా మరింత శ్రద్ద వహించి ఉండవచ్చు.

మొత్తంగా చూసుకునట్టయితే “ప్లే బ్యాక్” అనేది ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ప్రస్తుతం, గతంలను టెలిఫోన్ సంభాషణతో కొత్తగా చూపిస్తూ, అప్పటికి ఇప్పటికి మధ్య ఉన్న ఆసక్తికరమైన క్షణాలు చూపిస్తూ, బలమైన కథ కథనంతో మదర్ సెంటిమెంట్‌ని ఆద్యంతం పండిస్తూ సాగిన అద్భుతమైన చిత్రం అని చెప్పవచ్చు. మాస్ ప్రేక్షకుల కోసం అనే కోణంలో ఒక్క సీన్ కూడా లేదు. కనీసం ఒక మదర్ సెంటిమెంట్‌తో ఒక పాట పెట్టి ఉంటే (సుడిగాడులో చెప్పినట్టు ఫామిలీ సాంగ్ లాగా) ఖచ్చితంగా ప్లస్ అయ్యేది.

ఆల్బర్ట్ ఐనిస్టిన్ చెప్పినట్టు ఫిజిక్స్ లోతుల్లోకి వెళ్ళే కొద్ది దేవుడు ఉన్నాడు అన్న భావన బలపడుతుంది. ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు కూడా ఆధ్యాత్మికత ఫిజిక్స్ వేరు వేరు కావు అన్న భావన కల్గుతుంది.

ఈ చిత్రం కూడా మనల్ని బాగా ఆలోచింపచేస్తుంది. ఆద్యంతం ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. మంచిని స్థాపించడంలో భాగంగా దుష్టులైన వారిని చీడపురుగులను నిర్మూలించినట్టు సకాలంలో నిర్మూలిస్తే భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుంది కద అని అనిపిస్తుంది.

మంచి చేస్తే మంచే జరుగుతుంది అన్న కర్మ సిద్ధాంత భావన సామాన్యుడికి కూడా కలగజేయటంలో దర్శకుడు సఫలీకృతుడు అయ్యాడు.

చివరి సీన్లు చూసి తేలిక పడ్ద మనసులతో ఇంటిదారి పడతాడు ప్రేక్షకుడు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు హరిప్రసాద్ జక్కా టెలిఫోన్‌ను ద్వారా రెండు వేర్వేరు కాల వ్యవధుల మధ్య పోలికలను చూపించే ఆలోచన బాగుంది కానీ తనకున్న బడ్జట్ పరిమితుల్లో ఎగ్జిక్యూషన్, క్యాస్టింగ్ మరియు ప్రొడక్షన్ డిజైన్ విషయాల్లో రాజీ పడ్డారు. కానీ అవుట్ పుట్ విషయంలో ఏమీ ఢోకా లేదు. తనకున్న పరిమితుల్లో అద్భుతంగా తీశాడు. ఏదేమైనా ఇలాంటి కొత్త తరహా సినిమా తీయాలనే ఆయన ఆలోచనను మాత్రం ప్రశంసించాల్సిందే. ఇక కమ్రాన్ సంగీతం, అతని నేపథ్య స్కోరు సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. బుజ్జి.కె సినిమాటోగ్రఫీ బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉంది. నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ పని కూడా ఒకే. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికి నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు : దినేశ్ తేజ్, అనన్య నాగల్ల, అర్జున్ కళ్యాణ్, టీఎన్‌ఆర్

దర్శకత్వం : హరిప్రసాద్ జక్కా

నిర్మాత‌లు : ప్రసాద్‌రావ్ పెద్దినేని

సంగీతం : కమ్రాన్

సినిమాటోగ్రఫీ : కె.బుజ్జి

ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి

చివర్లో ఒక పిట్ట కథ:

కొన్నేళ్ళ క్రితం ఒక యువకుడు మాఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. కుదురుగా కూర్చుని అడ్మిన్, మార్కెటింగ్ చూసుకోవడం అతని విధి. చక్కటి జీతం, మంచి వాతావరణంలో పని. ఎవరైనా ఎగిరి గంతేసి చేసుకుంటూ ఉండిపోయేవారు. ఈ కుర్రాడు చేరిన కొన్ని రోజులకే ఉద్యోగం మానేసి వెళ్ళి పోయాడు.

నాకు తర్వాత తెలిసింది ఏమిటి అంటే, నేను రచయితను కాబట్టి నా దగ్గర రచనలు, స్క్రీన్ ప్లేకి సంబంధించి మెళకువలు నేర్చుకుందామన్న ఉద్దేశంతో నా దగ్గర చేరాడట ఆ కుర్రాడు. నాకు తెలియదు కద ఆ సంగతి. నేను ఎంత సేపున్నా ఆఫీసు పని, ఆఫీస్ మాటలే మాట్లాడుతు ఉండటంతో విసుగొచ్చి వెళ్ళిపోయాడు.

ఆ కుర్రాడికి కథా రచనలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విభాగాల మీద ఉన్న ఆసక్తి అంత తీవ్రమైనది. సుఖంగా కుర్చుని చేసే ఉద్యోగం వదిలేసి, చివరికి తానెన్నుకున్న గమ్యం వైపు సాగిపోయాడు.చక్కటి అవకాశం తెచ్చుకున్నాడు. అతనెవరో కాదు, ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్స్‌లో ఒకరైన మానస్ జమ్మిశెట్టి. అతనికి కథా రచనా పరంగా నేను నేర్పించినది ఏమీ లేకున్నా నన్ను తన గురువులలో ఒకరిగా భావించడం అతని సంస్కారం. తన డెవలెప్‍మెంట్స్ ఎప్పటికప్పుడు నాకు తెలుపుతు ఉంటాడు. ఆల్ ది బెస్ట్ మానస్.

తీర్పు:

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్, కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకర్షిస్తుంది. మామూలు ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభుతిని ఖాయంగా ఇస్తుంది. మీకు కాస్త సమయం దొరికితే ఈ వారాంతంలో ఆహాలో ఈ సినిమా చూసేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here