అమ్మ గొప్పతనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం – PLEASE LOOK AFTER MOTHER

1
8

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ద[/dropcap]క్షిణ కొరియా రచయిత్రి క్యున్-సూక్-షిన్ రాసిన PLEASE LOOK AFTER MOTHER అనే ఈ నవల 2009లో మార్కెట్లోకి వచ్చిన పది నెలలలోనే కొరియాలో ఒక మిలినయ్ కాపీలు అమ్ముడుపోయింది. దీన్ని ఇంగ్లీషులోకి అనువదించిన చి–యంగ్-కిమ్‌కి 2011లో మాన్ ఏషియన్ లిటరరీ ప్రైజ్ లభించింది. ఆ ఇంగ్లీషు అనువాదం కూడా 2012లో రెండు మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. కొరియన్ భాష నుండి ఇంగ్లీష్ లోకి అనువదించబడిన నవలలో ఎక్కువగా ప్రజాదరణ పొందిన నవలగా ఇది నిలిచిపోయింది.

ఈ నవల ఇంత మందిని చేరడానికి కారణం ఇందులోని ఎమోషనల్ కంటెంట్ అయితే దానితో పాటు రచయిత్రి శైలి కూడా ఆకట్టుకుంటుంది. ఒక ముసలి తల్లి సియోల్ స్టేషన్‌లో తప్పిపోతుంది. ఆమె కుటుంబం ఆమెను వెతికించే ప్రయత్నం చేస్తారు. చదవడం రాయడం రాని ఒక గ్రామీణ మహిళ ఆమె. కుటుంబం ఆమె సేవను ఆమె ఉనికిని పెద్దగా పట్టించుకోదు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళూ. ప్రతి రోజు విపరీతంగా శ్రమపడుతూ కుటుంబానికి అన్ని అందేలా పని చేసుకుంటూ పోవడమే ఆమెకు తెలిసింది. పిల్లలకి వండిపెట్టడం, వారి చదువులకు అవసరాలకు కావలసినవి సమకూర్చడం, ఇదే ఆమె జీవితం. కాని తిరిగి ఆమెకు ప్రేమను ఇవ్వాలని కనీసం ఆమె పనులను, కష్టాన్ని గుర్తించాలని అనుకోరు ఆమె భర్త పిల్లలు. ఆమె కూడా ఎప్పుడూ వారి నుండి ఏమీ ఆశించదు. ఒక అర్ధ శతాబ్దం పాటు మూగగా వారికి చాకిరి చేస్తూ వారిని జీవితంలో ముందుకు నడిపిస్తూ మౌనంగా ఒంటరిగా మిగిలిపోతుంది.

ఆమె భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలుంటాయి. కావాలనుకున్నప్పుడు బైట ఆనందాలు, అనుభవాల కోసం అందరినీ వదిలి కొన్ని రోజులు తిరిగి రావడం అతని స్వభావం. కాని అతను ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారి, కుటుంబం అతన్ని ఎంతో ఆదరించి, ప్రేమించి మళ్ళీ తమ జీవితాలలోకి ఆహ్వానిస్తుంది. ఇంటి పెద్దగా అతని స్థానం సురక్షితం. అతని భార్యగా స్థానంలో ఉంటూ తల్లిగా మారిన ఆమెకు అందరికి తనను తాను ఇచ్చుకోవడమే తెలుసు, శ్రమ పడడమే తెలుసు, అన్ని సందర్భాలలో కూడా తన కోరికలు, ఆశలు మర్చిపోయి పిల్లల పక్కన నిలవడమే తెలుసు. కాని దాని బదులుగా అమె శ్రమకు కనీస గుర్తుంపు దొరకక పోగా, అందరికీ తల్లిగా మాత్రమే మిగిలిపోయిన ఆమె పట్ల కుటుంబ సభ్యులందరికీ ఎన్నో తలకు మించిన అంచనాలుంటాయి. అందరికీ అన్నీ అందించడానికే మాత్రమే ఆమె జీవితం అన్నట్లుగా కుటుంబం ఆమెతో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాను ఒక వ్యక్తిని అని, కోరికలున్న మనిషిని అని కూడా ఆమె మర్చిపోతుంది. ఆమె శారీరిక మానసిక శ్రమను కూడా గుర్తించలేనంత నిర్లక్ష్యంగా ఉంటారు కుటుంబ సభ్యులు. ఆమె కేవలం తల్లి మాత్రమే, వారి అవసరాలు తీర్చే ఒక యంత్రం. వారి సౌకర్యాలకు భంగం రాకుండా జీవించడమే ఆమె కర్తవ్యం అన్నది వారందరి భావన. ప్రపంచంలో అందరినీ, అన్నిటీనీ ప్రేమించి, తన వంతుగా అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించే ఆమె మంచితనం ఎవరికీ అర్థం కాదు.

ఆమె తప్పిపోయినప్పుడు, అప్పుడు అందరికీ ఆమె విలువ అర్థం అవుతుంది. ఆమెతో వారి జీవితాలు ఎంతలా ముడిపడి ఉన్నాయో, వారి జీవితాలు సుఖంగా గడవడానికి ఆమె ఏం త్యాగాలు చేసిందో వారికి ఆమె లేని సమయంలో అర్థం అవుతుంది. ఆమె రోజూ ఏం చేసేది, ఎవరిని కలిసేది, ఆమె అలవాట్లు ఏంటీ, దినచర్య ఏంటి అన్నది ఆమెను వెతుక్కునే సమయంలో వారు తెలుసుకుంటారు. కుటుంబాన్ని కలిపి ఉంచడానికి ఆమె పడ్డ శ్రమ వారికి అప్పుడు అర్థం అవుతుంది. ఆమె గురించి అసలు తమకేమీ తెలీదనీ తెలుసుకుంటారు. ఎందరో అనాథలకు ఆమె తల్లి అని, భర్త తరుపు బంధువులను ఏ నాడు పట్టీంచుకోని భర్త వెనుక ఉండి ఆమె అందరినీ తనవారిగా చూసుకున్న విధానం, ఇవన్నీ ఆమె లేనప్పుడే వారికి తెలుస్తాయి. ఆమె సంతానం అంతా కూర్చుని వారి జీవితంపై ఆమె ప్రభావాన్ని అర్థం చేసుకుని ఆమె పట్ల వారి నిర్లక్ష్య ధోరణికి సిగ్గుపడతారు. ఒక వ్యక్తిగా తల్లిని ఏనాడు గుర్తించకపోయినా ఆమె వారికి ఇచ్చిన చేయూత తలచుకుని పశ్చాత్తాపంతో రగిలిపోతారు.

నవల మనసుకు హత్తుకునే శైలిలో రాస్తారు రచయిత్రి. పతి అధ్యాయం కూడా నలుగురి పిల్లల ఆలోచనలతో నడుస్తుంది. ఆమె పిల్లలు, భర్త, అందరూ తమపై ఆమె చూపిన ప్రేమను, ప్రదర్శించిన ఓర్పుని, వారిని ఎన్నో సార్లు క్షమించి, కాపాడిన ఆమె గొప్పతనాన్ని మొదటిసారి గతంలోకి వెళ్ళి తల్లిని ఒక వ్యక్తిగా చూస్తూ ఆమె తరుపున ఆలోచిస్తూ తామందరూ ఆమెకు చేసిన అన్యాయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆలోచిస్తూ ఉంటారు. తల్లి ప్రేమను ఎంత సాధారణమైన వస్తువుగా తమ హక్కుగా భావించి నిర్లక్షం చేస్తుందో కుటుంబం చాలా హృద్యంగా చిత్రిస్తుందీ నవల. ఆరోగ్యకరమైన మానవ సంబంధాలను గమనిస్తే మనకు కనిపించేది వారి మధ్య వారు ఏర్పరుచుకున్న డిటాచ్మెంట్. అలా కాకుండా విపరీతమైన ప్రేమ మాత్రమే ఉన్నప్పుడు మానవ సంబంధాలలో మిగిలేది వేదన ఒంటరితనం మాత్రమే. ఇది అందరం ఒప్పుకోవలసిన వాస్తవం. అసలు అనుబంధాలంటేనే వివిధ సందర్భాలలో మనతో మనం రాజీ పడడం. సర్దుకుపోవడం. ఈ సర్ధుకుపోవడం వెనుకాల చాలా మానసిక బాధ ఉంటుంది. అది కలగకుండా, ఉండాలంటే ఆ బాధ తీవ్రత తగ్గించుకోవాలంటే కావల్సింది నిర్లిప్తత. డిటాచ్మెంట్. బాధ్యత అనో, ప్రేమ అనో, గౌరవం కోసమో మనిషి మానవ సంబంధాల మధ్య రాజీ పడుతూనే ఉంటాడు. కాని ఈ రాజీ మనిషిని క్రుంగదీస్తుంది, ఒంటరిని చేస్తుంది, జీవితం పట్ల ఆశను కోరికను మెల్లగా చంపేస్తుంది. బాధను మిగిలిస్తుంది. అదే చాలా మంది స్త్రీల జీవితంలో కనిపించే వేదన. ఇంట్లో శాంతి సుఖం కోసం స్త్రీలు చాలా సందర్భాలలో ఇలా రాజీ పడి నలిగిపోతూ ఉంటారు.

వారి ఆ భాధను కుటుంబం గుర్తించనప్పుడు, వారి ఉనికి ఎవ్వరికీ పట్టనప్పుడు, స్త్రీలు అనుభవించే ఒంటరితనం చాల వేదనాభరితంగా ఉంటుంది. కుటుంబం స్త్రీలకు భద్రత పేరుతో ఇంతటి వేదనను కూడా మిగులుస్తుందని చాలా స్పష్టంగా, చెప్పిన నవల ఇది. తామందరూ తమ ప్రవర్తనతో తల్లిని ఎంత ఒంటరిగా చేసారో గుర్తించి ఆ కుటుంబం తమ ప్రవర్తనకు సిగ్గుపడడం చివర్లో చూస్తాం. తమ జీవితాలలోంచి మాయమయిన తరువాత తల్లిని ఒక స్త్రీ రూపంలో చూస్తూ ఆమె బాధను అర్థం చేసుకున్న ఆ కుటుంబం తమ పొరపాట్లను దిద్దుకునే అవకాశం కోసం తపించి పోతారు.

తమ కోసం నిరంతరం తపీంచిపోయే తల్లుల గురించి ఆలోచించే తీరిక, అవసరం లేని ప్రస్తుత ఆధునిక మానవ సమూహం ఈ నవలను స్వీకరించిన పద్దతి లోనే ఈ నవలలోని తల్లి ప్రతి ఇంటిలో ఉన్నదని అర్థం అవుతుంది. మొట్టమొదటి సారి ఆ పిల్లలు తల్లి జీవితం గురించి ప్రశ్నలు వేసుకుంటారు. నాన్న ఎందుకు అమ్మతో పాటు కాకుండా అమ్మ ముందు నడుస్తాడు? నాన్న పరస్త్రీలతో నడిపిన సంబంధాలను అమ్మ మౌనంగా ఎలా స్వీకరించింది, నాన్నను ఎలా క్షమీంచగలిగింది? అతని కోసం ఎందుకు ఎదురు చూసింది? కుటుంబం లోని పెద్దలెవ్వరూ నాన్న సంబంధాలను ఎందుకు ప్రశ్నీంచలేదు? కనీసం గమనించినట్లు కూడా ఎందుకు ప్రవర్తించలేదు? అమ్మ వ్యక్తిగా ఎలాంటిది? ఆమె ఆలోచనలు ఏంటీ? కోరికలు ఏమిటి? అసలు మాకు ఇన్ని వసతులు ఎలా సమకూర్చగలిగింది? ఇన్ని ప్రశ్నలు ఆ అమ్మ వారి మధ్య ఉన్నప్పుడు వారు వేసుకుని ఉంటే కథ మరోలా ఊండేదేమో.

ఆ తల్లి దొరకదు. వారు వెతుకుతూనే ఉంటారు. ప్రశ్నలు వేసుకుంటూనే ఉంటారు. అలాంటి ప్రశ్నలు ప్రతి ఇంట పిల్లలు వేసుకోవాలని కోరుకుంటారు. తాము అనుభవిస్తున్న వేదన, పడుతున్న పశ్చాత్తాపం మరొకరి జీవితంలో ఉండకుండా ఉంటాలంటే తల్లులను వ్యక్తులుగా చూసి అర్థం చేసుకోమని ఇందులో ప్రతి పాత్ర తనదైన రీతిలో వేడుకుంటుంది. చదివే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లక మానవు. అందుకే ఈ పుస్తకం చాలా మందిని కదిలించింది. ప్రపంచ సాహిత్యంలో ఒక అద్భుతమైన నవలగా ఇది నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here