క్లారెల్ ఎస్టీవెజ్ నాలుగు కవితలు

0
11

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. క్లారెల్ ఎస్టీవెజ్ రాసిన The Longest Winter, Blossoms, If the stars could speak, Falling In Love అనే నాలుగు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1.పొడవైన శీతాకాలం

~

ఎందుకంటే పొడవైన శీతాకాలం,
లోయలు పర్వత మార్గంలో
వణుకుతూ గుసగుసలాడేది కాదు.
దాని చక్కటి తెల్లటి ముసుగుతో,
చెట్లకు పల్లెలకు స్నానం చేయిస్తుంది
పొడవైన శీతాకాలం,

మీ దృష్టిలో శీతాకాలం ఎలా స్థిరపడిపోయిందంటే
బూడిద రంగు ఉదాసీన పదాలతో
మీ పెదాలను మరకలు చేస్తుందని
మధురమైన రాగాలనాలపించే
మీ స్వరాన్ని దొంగిలిస్తుందని..

చూడబోతే
మీ చేతుల్లో నేను ఒక పువ్వునని
మీరు మర్చిపోయినట్లున్నారు
మీ నుండి ఏమీ ఆశించనప్పటికీ
వేగి వాడిపోయిన హృదయంతో-
నేనిలా
అడగాల్సి వస్తుంది
మీరు నాకు సూర్యుడిని ఎప్పుడు తిరిగి ఇస్తారని

***

2. వికసనం

~

శీతాకాలపు వృక్షాల
ఆచ్చాదన లేని కొమ్మలు
నాతో ఇలా చెబుతాయి
నేనిలా ఎప్పటికీ ఉండలేనని
నేననుకున్నప్పుడు,
నేనెవరినో
నేనేంటో
నాకు తెలిపింది చెట్టు

క్షీణిస్తున్న నా దేహాన్ని మనసుని
సాంత్వన పరిచాయా మాటలు
ఆ వృక్షం నాతో
ఇలా అన్నది కదా..
“ఒంటరిగా ఉండకు”
“ఒంటరినని భావించకు”-
“నాతో పాటు ఎదుగు,
నాలా ఎదుగు”

***

3. నక్షత్రాలే గనుక మాట్లాడగలిగితే..

~

తారలే మాట్లాడగలిగితే
నేన్నిన్ను ఒక నిశ్శబ్ద ప్రశాంత
సురక్షిత స్థలానికి నిన్ను
సాయంత్రపు నడకకు ఆహ్వానిస్తాను
ఆ గాలి తెమ్మెరలే గనుక
పున్నమి రాత్రులలో ప్రేమ గీతాన్నొకదాన్ని
ప్రేయసి కోసం ఆలపిస్తుంటే

చంచలమైన అనుభూతి ఏదో
దడదడలాడుతూ
నా హృదయాన్ని ఆక్రమిస్తుంది

నా నమ్మకాన్ని పొందిన
ఆ నక్షత్రాలే గనుక
మాట్లాడగలిగితే
అవి నీతో ఏమి చెప్పి ఉంటాయి

ఆ తారల మాటలు నువు వినగలిగితే
నాకు నీపై ఉన్న ప్రేమాభిమానాలు తెలుస్తాయి
నా ఊహల్లో, ఆలోచనల్లో
నీకెంతటి సమున్నత స్థానం ఉందో
ఆ తారలకు బాగా తెలుసు

ఆ నక్షత్రాలే మాట్లాడితే
నేను నిన్ను ప్రేమిస్తున్నానని
అవి నీకు చెబుతాయి
తిరిగి నను ప్రేమించమని
తారలు నీకు ప్రేమగా
సిఫార్సు చేస్తాయి!!

***

4. ప్రేమలో పడటం

~

భూమిలో దాక్కున్న మందుపాతర లాంటిది ప్రేమ
ఒక్క తప్పటడుగు చాలు
పడిపోవడానికి,పేలిపోవడానికి
ఇక నీ హృదయం నీది కాదు
ఎవరి కొరకో
నిను వేధించడం మొదలెడుతుంది!!

మూలం: క్లారెల్ ఎస్టీవెజ్

తెలుగు సేత: హిమజ


క్లారెల్ ఎస్టీవెజ్ 28 ఫిబ్రవరి 1998న న్యూయార్క్‌లో జన్మించి అక్కడే జీవిస్తున్నారు.

క్లారెల్ ఎస్టీవెజ్ ఒక యువ కవయిత్రి రచయిత్రి. ఆమెకి ‘ది విష్‌ఫుల్ బాక్స్’ అనే వెబ్‌సైట్ ఉంది. క్లారెల్ తన చిన్ని కవితలతో మనుషుల్లోని లోపాలను, నిండుదనాలను ప్రపంచానికి చూపించడానికి వెబ్‌లో ఈ స్థలాన్ని రూపొందించారు. ఎవరి ఊహ వారికి వారికంటూ ఓ గుర్తింపును ఒక ఇమేజ్‌ను ఇస్తుంది. క్లారెల్ సృష్టిని ఆమె పగటి కలల నుండి రాసిన పోస్ట్‌కార్డ్‌లుగా భావించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here