డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ రెండు కవితలు

0
11

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ రాసిన My Mother, I will fly అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1. మా అమ్మ

~

సాగర ఉత్తుంగ తరంగాలు
బంగారు వర్ణంలో మెరిసే ఇసుక తిన్నెలు
యాత్రీకుల అచంచల విశ్వాసం
రామేశ్వరం మసీదు వీధి
అన్నీ ఒక్కచోట నీలో సంలీనమవుతాయి

అమ్మా ! నా తల్లీ !
ఆ స్వర్గం నుంచి దయగల చేతులతో
నా సంరక్షణ కోసం నువు వచ్చావమ్మా
నాకు అప్పటి యుద్ధపు రోజులింకా గుర్తున్నాయి
ప్రతి రోజూ ఒక సవాలుగా
జీవితం గడచిన రోజులవి
సూర్యోదయానికి ముందే నిదుర లేచి
మైళ్ళ కొద్దీ నడచి మందిరం వద్ద
సాధు గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్న కాలం
తిరిగి మైళ్ళ కొలది వెనక్కి నడిచి
అరబ్బీ తరగతులు విన్న సమయం
ఇసుక గుట్టలు ఎక్కి దిగి రైల్వే స్టేషను చేరుకొని
దినపత్రికలు చేతబట్టి ఆలయనగరపు
ప్రముఖులకు అందించే పని..
సూర్యోదయపు కొన్ని గంటల పిదప
పాఠశాలకు పయనం
సాయంత్రం వేళ రాత్రి చదువుకు ముందు
ఏదో ఒక వ్యవహారం,పని,పని
ఇదంత ఒక చిన్న పిల్లవాడి బాధ

నా తల్లీ,
సర్వశక్తిమంతుడి దయ కోసం మాత్రమే ఐదుసార్లు మోకరిల్లి,
తల వంచి నమస్కరించి
నీ ప్రార్థనను పవిత్ర శక్తిగా మార్చావు
నా తల్లీ
నీ దృఢమైన భక్తి నీ పిల్లల బలంగా మారింది
ఎవరికేది అత్యంత అవసరమో
వారితో నీకున్న మంచివన్నీ పంచుకున్నావు
నువ్వెప్పుడూ ఇచ్చేదానివి గానే ఉన్నావమ్మా
ఎవరికేది ఇచ్చినా ఆ భగవంతుడిపై
నమ్మకంతోనే ఇచ్చావు తల్లీ

నా పదేళ్ల వయసు నాటి రోజు నాకింకా గుర్తుంది.
నా అన్నలు అక్కలు,నాకంటే పెద్దవాళ్ళు
అసూయ పడేలా నేను నీ ఒడిలో నిద్రపోతున్నానమ్మా
పౌర్ణమి రాత్రి, నా ప్రపంచం నీకు మాత్రమే తెలుసు తల్లీ! నా తల్లి!
అర్ధరాత్రి నా మోకాలిపై పడుతున్న
నీ కన్నీళ్లతో నేను మేల్కొన్నాను
నీ బిడ్డ బాధ నీకు తెలుసు, నా తల్లి.
నీ శ్రద్ధగల చేతులు, నా నొప్పిని సున్నితంగా తొలగించాయి
నీ ప్రేమ, నీ శ్రద్ధ, నీ విశ్వాసం
భయం లేకుండా
ఆ దేవదేవుని దయతో ప్రపంచాన్ని
ఎదుర్కొనే శక్తిని నాకు ఇచ్చింది.
ఆ దైవం గొప్ప తీర్పు ఇచ్చే రోజున
మనం మళ్ళీ కలుసుకుందాం నా తల్లీ!
నీకివే నా నమస్సులు

***

2. నేనెగురుతాను

~

నేను ఎగురుతాను, ఎగిరి తీరుతాను
నేను శక్తి సామర్థ్యాలతో పుట్టాను.
నేను మంచితనంతోను నమ్మకంతో పుట్టాను.
నేను గొప్ప ఆలోచనలు కలలతో పుట్టాను.
నేను గొప్పతనంతో పుట్టాను.
నేను ఆత్మవిశ్వాసంతో పుట్టాను.
నేను ఎగిసే రెక్కలతో పుట్టాను.
కాబట్టే నేను పాకేందుకు నిర్దేశించబడలేదు
నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగురుతాను
నేనెగురుతాను నేనెగురుతాను..

మూలం: డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్

తెలుగు సేత: హిమజ


డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ భారత మాజీ రాష్ట్రపతి. దేశం గర్వించే గొప్ప శాస్త్రవేత్త. మిస్సైల్ మాన్‍గా పేరుగాంచిన కలామ్ చక్కని కవి, రచయిత. అత్యంత సరళమైన, నిరాడంబరమైన జీవితం గడిపిన కలామ్‍కు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడడం లక్ష్యంగా ఉండేది. రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం ఎన్నో విద్యాసంస్థలలో ప్రసంగాలు చేసి విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ వీరి ఆత్మకథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here