పూచే పూల లోన-1

1
14

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[dropcap]ర[/dropcap]హదారికి ఆనుకుని ఉన్న చిన్న టీ కొట్టు ఈ రోజు ఎందుకో సందడిగా ఉంది. ఆ కొట్టుకి ఆనుకుని ఉన్న డొంక రోడ్డు మీదుగా అలా ఓ పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేస్తే వచ్చే ఒక అతి విచిత్రమైన భవనం వైపు అలా కొన్ని కార్లు వెళ్ళిపోతున్నాయి. అదేదో చంద్రముఖి ఇల్లు కాదు. ఈ మధ్యనే అత్యాధునికమైన డిసైన్లతో తయారైంది. అక్కడికి వెళుతూ ఓ కప్పు టీ నోట్లో పోసుకుని దారి అదేనని రూఢిగా తెలుసుకుని అటుగా వెళ్తున్నారు జనం. ఈ మధ్య కారులో ఏ దారీ తెలియని వాడిలా ఎందుకో ప్రయాణాలు చేస్తున్నాను. లారీ డ్రైవర్లకు లారీయే ఇల్లు. నాకు నా కారే ఇల్లుగా మారి చాలా కాలం అయింది. ఆ సర్వీస్ సెంటర్ వాడు “ఆఫర్స్ ఉన్నాయి సార్, మార్చేయండి” అన్నాడు.

“ఇంజన్ స్టార్ట్ అవుతుందా?” నేను ఎప్పుడూ అడిగే ప్రశ్న అది.

వాడు సమాధానం చెప్పడు. ఓ కాగితం తెచ్చి అన్నీ వ్రాసుకుని పొమ్మంటాడు. నన్ను బాగు చేయాలనుకునే వాడు బాగుపడ్డాడు కానీ నేనూ, నా వాహనం, నా పనిముట్లు, నా ఆలోచనలూ అలానే ఉంటాయి ‘మీరు మారరు’ అన్నట్లు చూసాడు. “మారని వాడే మనిషి” అన్నాను. సాయంకాలానికి బండి రెడీ చేసిచ్చాడు. “ఓసారి హైవే మీదకి తీసికెళ్ళి చూడండి సార్” అన్నాడు.

ఆ మాట పుచ్చుకుని ఇలా వచ్చాను. ఆ కొట్టు వాడు టీ తెచ్చాడు.

“ఏముంది ఆ రూట్లో?”

అతను నవ్వాడు.

“ఏదైనా పెద్దోళ్ళ ఫార్మ్ హవుసా?”

“కాదు సార్. హీరో సమీర్ కుమార్ లేడూ?”

“ఉన్నాడు. ఒకప్పుడు బావుండేవాడు”

“అతని ఇల్లు సార్. బాగా పెద్దవాడైపోయాడు. ఇక్కడ సెటిల్ అవుతున్నాడు”

“అవనీ! దానికి ఈ గోల ఎందుకు?”

“ఇరవై ఏండ్ల జైలు శిక్ష అనుభవించి ఇవాళే విడుదలయి ఇక్కడికి వస్తున్నాడు”

ఇదో విచిత్రం. మీడియా వాళ్ళకి మేత ఉండాలి. అది ఎక్కడ అన్నది ప్రధానం కాదు.

టీ త్రాగి బండి స్టార్ట్ చేసి ఆ డొంక తిరగకుండా ముందరికి వెళ్ళి ఎందుకో ఆగాను. ఓ సారి వాడ్ని చూద్దామా? అనుకున్నాను. దాదాపు ముప్పయి ఏండ్ల క్రితమే వాడి దారి, నా దారి మారిపోయాయి. గొడవలో ఇరుక్కున్న తరువాత కూడా పలుకరించలేదు. కారు దిగి సిగరెట్ ముట్టించి ఆ దిక్కుగా ఉన్న ప్రకృతి వైపు చూసాను. ఆ రహదారికి అటూ ఇటూ అద్భుతమైన వాతావరణం. అలా చూపు ఆనినంత వైపు చూస్తే చక్కని లోయ అది. దాని వెనుక ఉన్న చెట్ల మాటు మబ్బులు కొద్ది సేపు అక్కడ నేలను తాకి తిరిగి ఆకాశంలోకి లేస్తున్నట్లున్నాయి. అందమైన అనుబంధాలు కాలపు రాపిడికి ఆవిరైపోతాయి. నన్ను లోపలికి రానిస్తాడా? ఏమో. జైల్లో ఉన్నప్పుడు కూడా చూడటానికి వెళ్ళలేదు. రచయితలు బుద్ధి లేని బుద్ధిజీవులని చాలా అనేవాడు. నాకు మనసు కూడా లేదు కదా? మనసులోని మర్మమును తెలుసుకో అన్న త్యాగరాజు కీర్తనను వాడు మందు బాటిల్ తెరుస్తూ ‘మనసు లేని మర్మమును తెలుసుకో’ అని పాడేవాడు. ఎందుకో కారు రివర్స్ చేసాను. ఆ టీ కొట్టువాడు చూస్తుండగా డొంక దారిలోకి మళ్ళించాను. నా ప్రక్కగా ఓ ట్రాక్టర్‍లో కుర్రాళ్ళు డప్పులు కొట్టుకుంటూ వెళుతున్నారు.

***

సామాన్యంగా గోవా అనగానే చాలా మందికి బీచ్‍లు, బికినీలు తప్ప మరేదీ మనసులోకి రాదు. దక్షిణ గోవాలో గల అద్భుతమైన ఆలయాలు, సారస్వతులు, ఒకనాటి ఋగ్వేదం యొక్క అధ్యయనం వంటికి జ్ఞప్తికి రావు. మంగేశీ నుండి మరికొంత దూరం ప్రయాణం చేసి ఒక రిసార్ట్‌లో సేద తీర్చుకుంటున్న రోజులవి.

ఒక పూల తోట కనిపిస్తోంది. దానిని దాటిన చూపు సముద్రం లోని నీలిమ వైపు సాగింది. ఆ చివార్న క్షితిజం సాయంసంధ్య వేళ ఈశ్వరుని చిరునవ్వుకి జటాజూటం, గెడ్డం లోంచి తొంగిచూస్తున్న తెల్లని పలువరుసగా ఉంది. వెనుక నల్లని కొండలు. నాకూ ఓ స్వగృహం ఉందనట్లు సూర్యుడు జుట్టు మోపులా కనిపిస్తున్న ఆ కొండల చాటుకి వెళ్ళిపోతున్నాడు. నాలుగైదు టేబుళ్ళ దగ్గర కళాపోషకులు రంగు నీళ్ళు సేవిస్తూ రంగులను ఆస్వాదిస్తున్నారు.

ఒక కెమెరా మెడలో వేసుకుని ఒక కుర్రాడు, అతని ప్రియురాలు కాబోలు, ఆ చెట్ల చాటున, పూల మొక్కల చాటున, రక రకాల భంగిమలలో నిలబెట్టి ఫొటోలు తీస్తున్నాడు. అలసిపోతున్నప్పటికీ చిరునవ్వులు చిందిస్తోంది భామ! కెమెరా పట్టుకున్న ప్రతివాడికీ ఏవో సాంకేతిక సిద్ధాంతాలు అందరికీ చూపించాలని ఆరాటం. కలం పట్టుకున్న ప్రతివాడు సాహిత్యం గురించి మాట్లాడాలనుకోవటాం పొరపాటు! నాలుగు క్రికెట్ మ్యాచ్‍లు టివీలో చూసి క్రికెట్‍లో ఎక్స్‌పర్ట్ అనేసుకోవటం కూడా పొరపాటు. ఓ పూల మొక్క వెనుక ఒకళ్ళని నిలబెట్టి సృష్టిలోని అందమంతా అతనికి అర్థమైందనుకోవటమే కాదు, సూటిగా ఆ అమ్మాయికి చెప్పేస్తున్నాడు కూడా. ఆ మొక్కకు ఉన్న పూలు చిత్రంగానే ఉన్నాయి. పసుపు పచ్చని రంగులో సంధ్యకాంతిని ప్రతిబింబింప జేస్తున్నప్పుడు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక మొక్కజొన్న కండెకు గల తోలును కొద్దిగా పైకి లాగి విప్పినట్టు ఆ పూలు రేకులను పైకెలా మడుచుకున్నాయో తెలియటం ఏదు. ఆ అమ్మాయిని వాటికి ప్రక్కగా నిలబెట్టాడు.

“ఆ పూలను చూడు” అన్నాడు. చూసింది.

“నవ్వు”

నవ్వింది. ఆ అమ్మాయి ఆకుపచ్చని స్కర్ట్, గంధం రంగు టాప్ వేసుకుని ఉంది. స్కర్ట్ మోకాలి దాటి ఉంది.

“నిన్ను నువ్వు ఆ పువ్వు అనుకో కొద్ది సేపు”

చిత్రంగా చూసింది.

“మొహం అలా పెట్టకు”

“ఎలా పెట్టాలి?”

“నవ్వు మొహం కావాలి”

ఏదో ప్రయత్నం చేసింది.

“ఏడ్చినట్లు నవ్వావు”

“నా వల్ల కాదు”

“తొందరగా. చీకటి పడిపోతోంది”

అక్కడ కూర్చున్నవారు ఈ విన్యాసాన్ని ఎగాదిగా చూసున్నారు. దగ్గరగా ఉన్న ఒక టేబుల్ దగ్గరకి వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చున్నాను. నాకు కుడి ప్రక్కగా కూర్చున్న వ్యక్తి గెడ్డం చక్కగా పెంచాడు. ఏ లోకంలోనో ఉన్నాడు.

“కమాన్..”, అంటున్నాడు కుర్రాడు. “..చక్కగా, చిలిపిగా నవ్వు”. అమ్మాయి ఈసారి బాగానే నవ్వింది. టకటకా నాలుగైదు స్నాప్స్ చేసాడు.

“ఆ రేకులు పైకి లెచినట్లు స్కర్ట్ అంచు కొద్దిగా.. పైకి లేపి పట్టుకో. నాకు సిమెట్రీ కావాలి. అంతకంటే మరేమీ లేదు.. సీరియస్ అవకు!”

అమ్మాయి సీరియస్‍గానే ఉంది. కానీ అర్థం చేసుకుంది. చిన్నగా మడతల పైకి అని పూల వైపు చూసింది. ఫొటోగ్రాఫర్ బ్రహ్మానందం పొందేసాడు.

“టూ గుడ్” అంటూ క్లిక్‍లు కొట్టి అమ్మాయి వైపు పరుగు తీసి దగ్గరకు తీసుకున్నాడు. ఇద్దరూ అలా నడుచుకుంటూ అలా ప్రకృతిలోకి వెళ్ళిపోయారు.

నా ప్రక్కనున్న వ్యక్తి కుర్చీలో వెనక్కి వాలిపోయి వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడో ఏమో నిట్టూర్చాడు.

“ఒక అద్భుతమైన కోణంలో కెమెరా పట్టుకుని ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఈ కోణం లోకి వచ్చేవరకు ఎన్ని సంవత్సరాలైనా ఫరవాలేదు, ఇలాగే ఉంటాననుకోవటం ఎలా ఉంటుంది? కెమెరా పట్టుకుని అటువంటి వారిని వెతుక్కుంటూ లోకమంతా గాలిస్తూ ఆ ఒకరో ఇద్దరి కోసమో తిరుగుతూ పనికిమాలిన వాళ్ళందరినీ కెమెరాలో బంధించటం ఎలా ఉంటుంది?” – నన్ను ఒక్క గ్రుక్కలో అడిగాడు.

మైకంలో లోకమంతా మమేక మవుతుంది. ఈ ప్రశ్న మైకంలో అడిగినా రసగంగా ప్రవాహానికి చిన్ని పాత్రలో అర్ఘ్య ప్రదానం చేసి పైకి చూసినట్లు నన్ను చూసాడు.

“కెమెరా పట్టుకున్నంత మాత్రాన ఎవరైనా దాని ముందుకు ఎందుకు రావాలి?” అడిగాను.

“వస్తారు..”, అన్నాడు గ్లాసును గుండ్రంగా తిప్పుతూ. “..ఎంచుకున్న కారణం గొప్పదైతే రాక మానరు!”

ఇప్పటి వరకూ గల సంశయం తీరిపోయింది. ఇతను ఎవరో కాదు. ఈ మధ్యనే తారాస్థాయికి వెళుతున్న హీరో సమీర్ కుమార్. ఈ గెడ్డంలోంచి ఇతను మాట్లాడక పోతే గుర్తు పట్టేవాడిని కాదు. ఇతనికి ఎవరో డబ్బింగ్ చెబుతారనుకున్నాను, కాదు. ఇతని గొంతే వాడతారని అర్థమైంది. టేబుల్ మీద నుండి నా మొహం వైపు పాకాడు.

“నేను సమీర్. మీరు?”

“సుందర్.”

“ఓ, పాడతారా?”

“లేదు. కొన్ని రచనలు చేసాను”

వెనక్కి వాలి ఆకాశంలోకి చూసాడు. కళ్లు మూసుకున్నాడు. చిత్రంగా నవ్వాడు.

“ఎందుకు?”

“అంటే?”

“ఎందుకు చేసారు అని”

“మీరు తప్పుగా విన్నారు. నేను రచనలు చేసానన్నాను. హత్యలు అనలేదు!”

“ఊ. నిజమే. నేను మరోలా అడిగాను. దేనికి వ్రాసారు? పత్రికలకా? సినిమాలకా? నాటకాలకా? సీరియల్స్‌కా?”

“అన్నిటికీ”

“ఊ. ఇక్కడ దేనికి వెతుక్కుంటున్నారు? పాత్రకా? ఏదో నేస్తానికా? శరీర ధర్మానికా? మనశ్శాంతికా? లేక ఏదో.. సరైన ఏంగిల్, కోణం దొరక్కపోదనా?”

హోటల్లో కూడా నన్ను బేరర్ ఇన్ని ఐటమ్స్ చెప్పి వేధించలేదు. నన్ను చూసి “రెండు ఇడ్లీ, ఒక వడ చెప్పనా?” అంటాడు. తన మనసుతో నస పెట్టుకుని దానిని కాదనలేక ఎవరికో ఔనని చెప్పలేక సాలెగూడు లాంటి ఊబిలో ఊగిసలాడుతూ ఆలోచనలలను వద్దనలేక, తెచ్చిపెట్టుకున్న సుఖం వెక్కిరిస్తుంటే ఈగలా గిలగిలా తన్నుకుంటూ ఎవరో శాశించిన దానికి శ్రమపడిపోతూ అలసిపోయి మసలుకుంటూ అసలు నేను ఎవరిని అని తనని తాను అడుక్కుంటూ జీవించే వారి కోవకు చెందిన వారెందరో చివరికి గోవాకి చేరతారా అనిపించింది.

“చిన్న పరిశోధన” అన్నాను

“దేనికి పరిశోధన?”

“సౌరాష్ట్రకి, సరస్వతీ నదికీ, ఈ సముద్ర తీరానికి మధ్య ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇక్కడ నివసిస్తున్న వారి పుట్టు పూర్వోత్తరాల మీద దృష్టి సారించాము..”

విరగబడి నవ్వాడు.

“ఎందుకలా నవ్వుతారు?”

“నా దృష్టి మటుకు ఉండవలసిన చోట ఉండదు. మీరందరూ గొప్పవారు. ఎక్కడైనా, దేనిమీదనైనా దృష్టి సారించాలనుకుంటే అలా చేసేస్తారు”

“ఏదో గరీబోళ్ళం సార్”

“ఓ. ఇదో మాట మళ్ళీను”

“ఈ రిసార్ట్‌లో రెస్ట్ తీసుకుంటున్నారా?”

సూర్యాస్తమయం అవుతోంది. దూరంగా అక్కడక్కడ నీటి మీద దేని తాలూకో తెలియటం లేదు కానీ అలా మెరుపులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ వెలిగిపోయిన ప్రకృతి చీకటిలోకి వెళ్ళిపోయింది.

“నా నుండి తప్పించుకుని వచ్చి కొన్నాళ్ళు దాక్కున్నాను” గ్లాసు ఖాళీ చేసాడు. నేను ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వాడు.

“సుందర్.. సుందర్ కదూ మీ పేరు? ఊ.. సుందర్ గారూ, నాకూ ఒక అన్వేషణ అలవాటైంది. ఎప్పుడో, బాగా చిన్నప్పుడు. ఒక్కోసారి ఓ అడవి దారిలో బాగా దట్టంగా పెరిగిన చెట్ల మధ్య లోంచి సూర్యోదయం అయినప్పుదు కిరణాలు అలా ప్రసరించి అక్కడ రాలి పడిపోయిన ఆకుల మీద వాల్తాయి. రెండు క్షణాలు అవి మెరిసిపోతాయి. అలా అని వాటిని తొక్కకుండా ఆ దారిని నడవాలని రూలు లేదు కదా?”

“పోలిక బాగుంది”

“ఓ. రచయితలతో ఇదే సమస్య. గెడ్డం తెగినా, గుండె కోసుకుపోయినా రెండూ ఒకటేనని చెప్పి పోలిక బాగుందంటారు!”

“వాస్తవాలు అర్థం కావు మాకు. అంతేనా?”

“అలాక్కాదు. అన్నింటినీ రంగుల్లో చూడటం ఎలా? కొన్నింటినైనా వదిలెయ్యండి ప్లీజ్.”

“వదిలేస్తాను. చెప్పండి”

“ఏం లేదు చెప్పేందుకు.”

లేచి నిలబడ్డాడు. కుర్చీకి వేలాడుతున్న కోటు తీసి భుజాన వ్రేలాడదీసాడు. చేయి పైకి వేసి ఎటో చూపిస్తున్నాడు.

“కెమెరా పట్టుకుని అలా ఆ కుర్రాడు అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు చూడండి..”

“అవును”

“ఆ చివార్న ఉంది గెస్ట్ హౌస్. ఈ దిక్కుమాలిన సెలెబ్రిటీతో మాట్లాడాలి మరోసారి అని అనిపిస్తే అలా వచ్చేసి పెద్ద వెతుక్కోక్కర లేదు. బాటింగ్‍కి దిగిన వాడు చుట్టూతా ఓ మారు చూసినట్లు అలా చూడండి. ఏదో మూల ఏదో చూస్తూ కుర్చీలో వాలిపోయి ఉంటాను.”

“ఏం మాట్లాడాలి?”

నాలుగు అడుగులు వేసి ఆగాడు. గెడ్డం గోక్కున్నాడు. కాల్లో ముల్లు గుచ్చుకున్నవాడిలా నోట్లోంచి వింత సౌండ్ చేసాడు.

“అబ్బా! సుందర్ సారూ! రచయితలైన వాడు ఇంత ప్రాక్టికల్‍గా ఉండకూడదు. నేను మాట్లాడుకుందాం అన్నాను. లెక్చర్ ఇవ్వండీ వచ్చి అని అన్నానా?”

“హహహ! రచనలు చేస్తానూ అంటే ఎందుకు చేసారని అడిగారు కదా?”

“వామ్మో! ఇంత జ్ఞాపకమా? వద్దు సార్! ఎనీ వే! మీరు డ్రింక్ చేయరా?”

“నో. మజ్జిగ బ్యాచ్!”

“ఓ. సర్లెండి. రండి, కూర్చుందాం. మందు కొట్టేవారు కొట్టనివారితో కూర్చోరు ఎక్కువగా. కానీ నేను వాళ్ళతోనే కూర్చుంటాను!”

“ఎందుకలాగ?”

ఏదో చెప్పబోయి ఆగాడు.

“రండి, ఓ సాయంత్రమో, రాత్రో.. అప్పుడే చెబుతాను!”

అలా కాళ్ళీడ్చుకుంటూ చెట్ల మధ్యలోంచి వెళ్ళిపోయాడు.

ఖచ్చితంగా చలనచిత్ర రంగంలో ఆడవలసిన ఆట తెలియనివాడు. జనం మెల్లగా పెరుగుతున్నారు. ఆ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన స్టేజ్ మీద మైకు ముందుకు ఓ కుర్రాడు గిటార్‍తో ప్రత్యక్షమైనాడు. గాలి చల్లగా ఉంది. యువతీయువకుల సంఖ్య పెరుగుతోంది. సంచీ సద్దుకుని లేచాను. కొంత దూరం వెళ్ళాక వెనుక నుంచి ఎవరో పరుగున వచ్చినట్లు అనిపించింది. అటు తిరిగాను. బేరర్ చేతిలో పుస్తకం పట్టుకున్నాడు.

“సార్” అంటూ నేను మరిచిపోయిన పుస్తకాన్ని చేతికిచ్చాడు.

“థాంక్స్” అని ఓసారి పుస్తకాన్ని చూసుకున్నాను.

‘అందాల గోవా’ – దాని టైటిల్. ఎవరో చెబితే కొన్నాను. నిజమే. ఇక్కడ వదిలేస్తే ఎలా?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here