పూచే పూల లోన-13

0
10

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్ సుందర్‍ని వెంటపెట్టుకుని కారులో వెడుతూ తన గతాన్ని చెప్పడం కొనసాగిస్తాడు. తానో మనిషిలా ఎందుకు బ్రతకకూడదంటూ, తన నేపథ్యం తలచుకుని బాధపడతాడు సమీర్. అతనిలో భావుకత పాళ్ళు ఎక్కువ ఉందనీ, పైగా కళాకారుడనీ అంటాడు సుందర్. తండ్రి చేసే చెడ్డ పనులన్నిటికీ అమ్మ మౌనంగా ఉండిపోవడం, ఎదురు చెప్పకపోవడం తనకి అంతుపట్టలేదని సమీర్ అంటాడు. ఈ దారుణమైన వ్యవస్థలో ఆవిడ అవస్థ పడడం తప్ప మరేం చేయలేరని అంటాడు సుందర్. దారిలో ఓ చోట ఓ లోయలో కనిపిస్తున్న ఊరిని చూపించి అది వీరమాణి ఊరు అని చెప్తాడు సమీర్. ఆ ఊరికీ చరిత్ర ఉందని చెప్పి, మెల్లగా కారుని అక్కడికి పోనిస్తాడు. గూడెం చేరాక, ఇద్దరూ కారు దిగి నడుస్తూంటారు. ఆ ఊరి గురించి చెబుతూ, అక్కడ.. మైనింగ్ వ్యవస్థకి వ్యతిరేకంగా తానొక ఉద్యమం ప్రారంభించానని చెబుతూ జరిగిన సంఘటనలని సుందర్‍కి వివరిస్తాడు. సమీర్ ఇంటి బయట ఎవరో గుమిగూడి కేకలు పెడుతుంటారు. సమీర్ తండ్రి కోపల్ బయటకి వచ్చి ఎవరు వాళ్ళని అడుగుతాడు. రాణోలు సార్ అంటూ జవాబిస్తారు కాపాలావాళ్ళు. కొద్దిగా భయపడిన కోపల్ వాళ్ళేకేం కావాలట అని అడుగుతాడు. వాళ్ళ గూడెంలోని అమ్మాయిలు కావాలట అని జవాబొస్తుంది. ఆయన లోపలికొచ్చి ఫోన్ చేస్తాడు. అవతల వైపు ఫోన్ తీసిన వ్యక్తి – రాణోల గూడెంలోని అమ్మాయిల జోలికి వెళ్ళద్దని చాలాసార్లు చెప్పాననీ, మీరు వినలేదని అంటాడు. తాను వాళ్ళ జోలికి వెళ్లలేదని అంటాడు కోపల్. వాళ్ళ అమ్మాయిలని వాళ్ళకి అప్పజెప్పండంటాడు ఆ వ్యక్తి. వాళ్ళ అమ్మాయిలెవరూ నా దగ్గర లేరని అంటాడు కోపల్. అయితే తానేమీ చేయలేనని అంటాడా వ్యక్తి. మీరు చెయ్యగలిగి ఉండి కూడా ఏమీ చెయ్యటం లేదని అంటాడు కోపల్. ఫోన్ పెట్టేసి, బయటకు వచ్చి ఆ గుంపుని శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాణోలు వినరు. సంఘర్ష్ కరప్ అని అరుస్తూ గేటు దూకి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇక చదవండి.]

[dropcap]త[/dropcap]న సొంత రిసార్ట్‌లో కాళ్ళు పిట్టగోడ మీదకి ఆన్చుకుని జీవితంలో మొత్తం కోల్పోయిన వాడిలా రెండు చేతులూ నావి కావన్నట్లు జారవిడిచి – జరిగిన అవమానానికి ఎలా చింతించాలో కూడా తెలియదన్నట్లు కూర్చున్నాడు కోపల్. ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద ట్రేలో గ్లాసులు ఖాళీ అవుతున్నాయి. మందర పర్వతం క్షీర సముద్రాన్ని చిలికి చిలికి అలసిపోగా ఏదో ఒక అమృతపు చుక్క భూమి మీద పడగా అది కోరికలు తీర్చే కదంబ వృక్షమైతే ఈ ప్రాంతాన్ని శోభస్కరంగా పాలించిన కదంబ వంశపు రాజులు శౌర్య పరాక్రమాలనే కీర్తిని స్థాపించి వెళ్ళిపోయారు. భూమిని పాలించటమా, భూమిని త్రవ్వటమా అనేది వింత ప్రశ్న! డబ్బు కోసం వ్యాపారాన్ని విస్తరింపజేయటం మంచిదే. ఒక దేశన్నీ, ఒక ప్రాంతాన్నీ కుళ్ళపొడిచి అక్కడి జనాభాని బానిసత్వంలోకి దిగజార్చి మానవత్వాన్ని మంట కలిపి నేనే రాజునని చెప్పే దోపిడీలో ఈ భూమికి ఋణపడి ఉన్న ఆసాములు పంచుకున్న పాత్ర అనిర్వచనీయమైనది! అరాచకాలకు, హింసలకు ఓర్చుకుని కూడా ‘మేం దొంగలం కాము’ అని తేల్చిన శ్రామికులు ఎంత ధన్యులు?

“ఫోన్ చెయ్యి” అరిచాడు కోపల్.

అక్కడి మేనేజర్ మరల ఫోన్ చెయ్యటానికి లోపలికెళ్ళాడు. దూరంగా సూర్యాస్తమయం అవుతోంది.

“ఈ పూలు ఇక్కడెందుకున్నాయి?”, అరిచాడు కోపల్.

ఓ కుర్రాడు ముందరకొచ్చాడు.

“సార్ మొన్ననే తెచ్చారు సార్, బావుంటాయి అన్నారు”

“అవి నా ఇంట్లో ఉండాలి. ఇక్కడ కాదు”

మేనేజర్ వచ్చాడు. “సార్, బయలుదేరి అరగంట అయింది అని ఇంట్లో చెప్పారు”

“ఊ. ఆ కాగితాలు తయారయ్యాయా?”

“యస్ సర్” అతను ఆ ఫైల్ టీపాయ్ మీద పెట్టాడు. పళ్ళు పట పటా కొరుకుతూ దాన్ని తిరగేసాడు కోపల్.

“ఈ పూలు.. కాదు మొక్కలు నువ్వే తెప్పించావా?”

“అవును సార్. క్రిందటి వారం ఎవరో కలాన్‍గూట్ నుండి ముంబై తీసుకుని వెళుతుంటే అడిగాను. కొద్దిగా ఎక్కువ ఖర్చు అయింది. కానీ నాకే ఇచ్చేసారు. ఎలా ఉన్నాయి సార్?”

“ఇక్కడ బాలేవు”

“అంటే..”

“హ హ.. నా చేతిలో పైప్ బాగుంటుంది. సిగరెట్ బాగుండదు కదా?”

“యస్ సర్”

“ఈ పూలు నా బంగళాలో బాగుంటాయి. పది మందీ వచ్చి సంతలో తిరిగినట్లు తిరిగే చోట కాదు. అవునా?”

“సార్”

“అక్కడికి పంపించెయ్”

“అలాగే సార్”

అతను వెళ్ళిపోయాడు. చీకటి పడింది. సన్నని లైట్ల కాంతిలో అతని తెల్లని షర్ట్ కొద్దిగా మెరుస్తోంది. దూరంగా సముద్రంలో ఏదో నౌక తాలూకు కాంతులు తళుక్కు తళుక్కుమంటున్నాయి. జీపు శబ్దం అయింది. ఎస్. పి. పులస్కర్ యూనిఫార్మ్‌లోనే ఉన్నాడు. అటూ ఇటూ చూసుకుంటూ లోపలికి వచ్చాడు. రెండు చేతులూ వెనక కట్టుకుని నిటారుగా నిలబడి ఈయనను ఓ చూపు చూసి నిట్టూర్చాడు. ఓ ఓరచూపు గోడ మీదకి పెట్టి ఉన్న అతని కాళ్ళ వైపు పోనిచ్చి తెలివిగా మరల అతన్ని చూశాడు. కోపల్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు.

“పులస్కర్..” మెల్లగా అన్నాడు. “..ఆ డ్రస్సు తొడుక్కుని స్వారీ చెయ్యటమనేది ఇలా నాలాంటి వాళ్ళ దగ్గరకొచ్చి నిట్టూర్చేందుకు కాదు”

పులస్కర్ ఎందుకో కళ్ళెగరేసాడు. కాలితో అక్కడున్న కుర్చీని కొద్దిగా తన వైపుకు లాగాడు. మెల్లగా కూర్చున్నాడు.

“జరిగిన దానికి బాధపడుతున్నాను” గంభీరంగా అన్నాడు.

కోపల్ టీపాయ్ మీది బాటిల్ లోంచి గ్లాసు నింపాడు. దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు సగం నిండిన గ్లాసులోంచి పులస్కర్‍ని చూసాడు.

“నిజం చెప్పు”, అన్నాడు.

“..”

“ఈ దాడి గురించి నీకు తెలీదా?”

వెనక్కి వాలాడు పులస్కర్. చెయ్యి అడ్డం పెట్టాడు. కోపల్ ఆ చెయ్యిని దగ్గరకి తీసుకుని గ్లాసులోకి బలవంతంగా పెట్టి ఆ చేతితోనే గ్లాసును కవర్ చేసాడు. పులస్కర్ రుచి చూసినట్లు సేవించాడు.

“రాణోలకూ, నాకు మంచి సంబంధాలున్నాయి. కానీ ఇలా జరిగే ప్రతి దాడీ, నాకు తెలిసి జరుగుతుందని మీరు అనుకోకూడదు”

“ఊ. అసలు ఈ గూడెం వాళ్ళు రంగంలోకి దిగారంటే నువ్వు పెద్దగా ఏమీ చెయ్యలేవు. అవునా?”

“చెయ్యటానికి ఆర్డర్స్ ఉండవు. మీకు సమాచారం చెప్పగలం. అంతమటుకే”

“ఊ. నాకు నువ్వంటే చాలా ఇష్టం”

“సార్”

“ఆ ఫైల్ చూడు”

పులస్కర్ ఫైల్ తీసి చదవటం ప్రారంభించాడు. కుర్రాడు చక్కగా వేయించిన జీడిపప్పు ప్లేట్లో అందంగా అమర్చి అక్కడ పెట్టాడు. పైలు చదువుతూనే జీడిపప్పు నములుతున్నాడు పులస్కర్.

“ఇదేంటి?” అడిగాడు.

కోపల్ గట్టిగా నవ్వాడు.

“రేపు వాన పడుతుంది, అని జోస్యం చెప్పాక పడిందనుకో, అదో కిక్కు. అవునా?”

“అవును”

“పడకపోతే కావాలని తప్పు చెప్పానని చెప్పి కప్పిపుచ్చుకుంటే మరో కిక్కు. అవునా?”

“..”

“ఆ ఫైల్ నీదే తీసేస్కో. మెడల్ తెచ్చుకో”

ఇది నా మెడల మీదకి రాదు కదా అని ఆలోచించాడు పులస్కర్.

“ఇది నాకు అర్థం కాలేదు సార్. ఆరువందల మందిని వెట్టి చాకిరీ నుండి విముక్తులను చేస్తున్నట్లు వ్రాసి సంతకం చేసారు. మీకు నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంటే నేను ముందు నోటీసును పాత డేటుతో తయారు చేసుకోవాలి. నాకు గిఫ్టా ఇది?”

“అవును”

“మరి మీకు లేబర్?”

“రెట్టింపు జీతానికి కార్వార్ నుండి కొన్నాను”

గ్లాసు ఖాళీ చేసాడు పులస్కర్.

“కుశావతీ నదిలో నీరెంతో తెలుసా పులస్కర్?”

“తెలీదు”

“ఈ గ్లాసు ఖరీదు చెయ్యదు”

“నిజమా?”

“అవును. తాగేసావు మరి”

ఇద్దరూ వింతగా నవ్వారు.

“మరి అక్కడ లేబర్ మాయమైతే వాళ్లు ఏం చెయ్యాలి? అది మరో సమస్య కాదా?”

“అక్కడ రాణోలు ఎందరో.. ఆడా, మగా, చాలా గట్టోళ్లు మరి. గొంజాలిస్ గాడికి పని చెయ్యటం లేదా!”

“చేస్తున్నారు”

“ఇప్పుడు నాకు చేస్తారు”

పులస్కర్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తగిలిన దెబ్బకు మరోలా ఆలోచించాడు కోపల్. ఇది తనకు మరో సమస్యగా మారబోతోంది. గొంజాలిస్ తనకు ప్రాణమిత్రుడు.

సిగరెట్ ముట్టించాడు పులస్కర్.

“పులస్కరా..”, నవ్వుతూ అడిగాడు కోపల్. “..నీ సర్వీస్‍లో ఎంత మంది అమ్మాయిలను చూసావు?”

మద్యం సేవించే వాళ్ళలో రకాలున్నారు. రాజా మహారాజులది ఒక రకం. రాజసం ఉన్నవారు ఏ రోజూ బరి దాటరు. భావుకులైన కవులు చిన్ని గ్లాసుకే కావాలని ఆవలి గట్టు దాటుతారు. వాస్తవానికి నిగ్రహం తప్పరు. అలా కనిపించి అందరినీ మోసం చేస్తారు. సైన్యంలో ఉండేవారు విపరీతంగా సేవించినా మర్నాడు ఏడు గంటలకు చక్కని మార్చ్‌ఫాస్ట్ చేస్తారు.  పైవాడికి హద్దు లైన్ ఆఫ్ కంట్రోల్‍లా కనిపిస్తూ ఉంటుంది. పోలీస్ ఫోర్స్‌లో ఉన్నవారు రాజకీయాల్నీ, వ్యాపారాలనీ, ప్రశాసనాన్నీ, ప్రజలనీ అందరినీ కలిపి కాక్‍టెయిల్‍లా త్రాగేవారు!

“చాలా మందిని చూసాను సార్”

“బాగా హద్దు మీరి.. కసిగా కనిపించిన వారెవరు?”

“సార్, నచ్చిన వాళ్ళెవరైనా కసిగానే ఉంటారు”

“కళ్ళల్లోంచి మత్తును జారవిడిచే కొంకణీ కన్యలను చూడలేదా?”

“లేదు సార్”

గ్లాసు ఖాళీ చేసాడు కోపల్.

“ఇంత వరకూ రాణోల కన్యలను తాకలేదు. ఇక తాకకుండా ఉండలేను పులస్కారా..”

నీలాకాశంలో ఏదో విమానం లైట్లను విరజిమ్ముతూ ఎటో పోతోంది. పులస్కర్ అలవాటుగా కుడివైపు మీసంలోని వెంట్రుకలను తడుముతున్నాడు. కథ అర్థమవుతోంది అతనికి. చుట్టూతా చూసాడు. దగ్గరలో నిలుచున్న కుర్రాళ్ళను వెళ్ళమని సైగ చేసాడు. వాళ్లు చీకట్లోకి జారుకున్నారు. కోపల్‍కి దగ్గరగా జరిగాడు పులస్కర్.

“సార్..” అన్నాడు.

“యస్?”

“రాణోలు మీ మీద దాడి ఎలా చేసారో ఆలోచించారా?”

“కేర్ ఎ బూట్ యార్”

“మీ అబ్బాయి సమీర్ కుమార్ మీకు ఇంట్లో కనిపించి ఎన్ని రోజులయింది?”

అప్పటి వరకూ గోడ మీద ఆన్చి ఉంచిన కాళ్లు ఒక్కసారి క్రిందకి జారాయి. టీపాయ్ మీద గట్టిగా చేతులు ఆన్చి లటుక్కున లేచి నిలబడ్డాడు కోపల్.

***

కారు అలా ఆ కొండల మధ్యలో అలలను దాటుకుంటూ వెళుతున్న నావలా పోతోంది. సమీర్ నడుపుతుంటే అసలు డ్రైవ్ చేస్తున్నాడా అనే అనుమానం వస్తుంది.

“సుందరం గారూ..” చెబుతున్నాడు. “..గతించినది ఒక హీరో జీవితం – తెర మీద, తెర వెనుక కూడాను. అసలు ఒక సామాన్యమైన వ్యక్తి హీరో ఎందుకవుతాడు? ఎలా అవుతాడు? ఆలోచించారా?”

“తెగింపు”

కారు ఆగింది. చుట్టూతా చూసాడు.

“అదే ముగింపా?”

“అంతే. కారు ఎందుకాగింది?”

“నా ఆలోచనా ప్రవాహం ఆగడం వలన”

మెల్లగా ముందుకు వెళ్లింది.

“రచయితలు పెద్ద పెద్ద మాటలు చెబుతారనుకున్నాను. మీరు ఎక్కువ మాట్లాడరు”

“ఎక్కువగానూ మాట్లాడను”

“నిజమే. న్యాయం, ధర్మం వంటివి తల మీద తలపాగాలా చుట్టుకుని అందరికీ కనిపించేలా, ఆ చెట్టులా, పైకి ఎలుగెత్తి చాటే ప్రతి వాడి మీదా పిడుగుపాట్లు పడి అలా ఎండిపోయి కనిపించటం సామాన్యం!”

“కానీ ఇన్ని పచ్చని చెట్ల మధ్య లోకం ఆ చెట్టునే చూస్తుంది. పలు వర్ణనలు చేస్తుంది”

“నేను ఆ రోజుల్లో ఇల్లు వదిలేసాను. రాణోలను జతపరుచుకున్నాను”

ఏమైందో తెలియదు. ఒక్కసారిగా యు-టర్న్ చేసి ఎడమ ప్రక్కకు కారు ఆపేసాడు. మమ్మల్ని దాటి ఓ టాటా సుమో మాకు విరుద్ధంగా దూసుకుపోయి ఓ పదిహేను అడుగుల దూరంలో ఆగింది.

“మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు”, అన్నాడు సమీర్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here