పూచే పూల లోన-15

0
11

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తమను ఫాలో అవుతున్న సుమో గురించి మాట్లాడుకుంటారు సమీర్, సుందర్. మనల్ని వెంబడిస్తున్నట్లయితే, వాళ్ళ సుమో కూడా ఎందుకు ఆగిందని అడుగుతాడు సుందర్. వాళ్ళేం చేస్తారో చూసి అప్పుడు ముందుకు వెళ్దామని అంటాడు సమీర్. మాట్లాడుతూనే కారు డెక్‍లో ఉన్న ఒక గన్‍ని చేతిలోకి తీసుకుంటాడు సమీర్. ఇంతలో ఆ సుమో నుంచి దిగిన ఒక వ్యక్తి వచ్చి సమీర్‍ని పలకరిస్తాడు. మీరు సమీర్ కదా అని అడిగి, తన పేరు ఫర్నాండిజ్ అని చెప్తాడు. వాళ్ళు మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నారు అంటూ సుమోలో ఉన్న వృద్ధ దంపతులని చూపిస్తాడు. వాళ్ళు రిసార్ట్‌లో సమీర్‌కు ప్రక్కగా కూర్చుని ఏదో ప్రార్థనలు చేసినవారు. జాగ్రత్తగా రోడ్డు దాటి వచ్చి వాళ్ళిద్దరూ సమీర్ కారులో ఎక్కి కూర్చుంటారు. మన ఇంటికి వెళ్దాం పద అంటారు. అదెక్కడ ఉందని సమీర్ అడిగితే, తప్పు అలా మాట్లాడద్దు, నువ్వు మా మనవడివి అని అంటారు వాళ్ళు. ఆ వచ్చినదెవరని సమీర్ అడిగితే స్టెల్లాకి మేనమామ కొడుకని చెప్తారు. స్టెల్లా ఎవరని సమీర్ అడిగితే, వృద్ధులిద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకుని, స్టెల్లాకి అన్యాయం చేయవద్దని అంటారు. సుందర్ తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ వృద్ధుడు తన పేరు సెబాస్టియో అని చెప్తాడు. ఆమె నేను మిసెస్ సెబాస్టియో అని అంటుంది. తమ గురించి క్లుప్తంగా చెప్పి, సమీర్ తమ మనవడని, అన్నీ మర్చిపోయాడని అంటారు. సమీర్ క్రైస్తవుడు కాడని సుందర్ అంటే, ముందు ఇంటికి వెళ్దాం అంటారు. వాళ్ళు దారి చెప్తే, సమీర్ కారు నడుపుతుంటాడు. మీ ప్రార్థనలు ఫలించాయాని సుందర్ వాళ్ళని అడిగితే, అవునంటారు. సుందర్, సమీర్ మాట్లాడుకుంటారు. అక్కడికి వెళ్ళి స్టెల్లా ఎవరో చూడాలని అనుకుంటారు. ఇక చదవండి.]

[dropcap]ర[/dropcap]చయిత అనేవాడు జరుగుతున్న కాలంతో పాటు ఓ అడుగు దూరంగా ఉంటూనే ప్రయాణించటం రచన అని గట్టిగా నమ్ముతాను నేను. తాళం తప్పకుండా లయలో పాల్గొనడంలో ఒక ఆనందం ఉంది. అందరి లయలో బలంగా ప్రవేశించి విశ్వాంతరాత్మ జరుపు సన్నివేశాన్ని కలలో చూసే అవసరం ఉండదు. కానీ ఒక మారు కిటికీ అవతల నుండి తాకే చల్లని మలయమారుతంలా తాకి ‘ఓ, ఇక్కడో ప్రపంచం ఉన్నది’ అని ఆలోచించటం ఒక అనుభూతి. అది లేని ప్రాంతంలో ఆలోచన లేదు, రచనా లేదు. సమీర్ కుమార్‍తో కలిసి నడుస్తున్నానో తెలియదు, కావాలని అంతా గమనిస్తూ నడుస్తున్నానో తెలియదు..

గేటు దగ్గర కారు ఆపాడు సమీర్. ముసలి జంట ముందు దిగిపోయింది. ఆదుర్దాగా లోపలికెళ్ళి ఒక పుస్తకంతో బయటకు వచ్చారు. మమ్మల్ని గేటు దగ్గరే ఆపేసారు. పెద్దాయన పుస్తకంలోని ఏదో గుర్తు పెట్టిన కాగితం తీసి చదవడం ప్రారంభించాడు. పెద్దావిడ కళ్ళల్లో విపరీతమైన భక్తిని ప్రదర్శిస్తూ రెండు చేతులూ ఆకాశం వైపు చూపిస్తూ ఆ చదివిన వాటి మరల భావయుక్తంగా అంటోంది. అప్పటికే అక్కడికి చేరిన ఒకరిద్దరు గంట వాయిస్తున్నారు. ఈ దృశ్యం రోజూ లభ్యం కాదు కాబట్టి చుట్టుప్రక్కల వాళ్లు గుసగుసలు చెప్పుకుంటూ చూస్తున్నారు. సమీర్ నడుము మీద చేతులు పెట్టుకుని ఎవరి కోసం, చెయ్యండి అన్నట్లు చూస్తున్నడు. ఇద్దరూ మోకాళ్ళ మీద కూర్చుని మరి కొంతసేపు ప్రార్థన చేసారు. చివరకు లేచి మాకు దారి చూపించారు. ఇల్లంతా పండుగ వాతావరణం విరబూస్తున్నది. విశాలమైన నాలుగంతస్తుల మేడ అది. సన్నని పాచి రంగు గోవాకు ప్రత్యేకత. కిటికీ తలుపులు, అద్దాలతోను, వాటి ఫ్రేములపై తెల్లని రంగు ఒక విధానంగా పాటిస్తారు. పోర్టికోలు రెండు కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు చాలా కార్లు ఉండేవనే ఆలోచన వచ్చింది ఎందుకో. ప్రస్తుతం ఒక పాత ఫియట్ కారు – తెల్లని రంగులో మెరిసిపోతోంది. ప్రేమతో పెంచుకున్న కారులా ఉంది..

హాలు లోకి అడుగుపెట్టాం. నిజం ఏమిటో తెలియదు. ఈ వృద్ధ జంటకు సమీర్‍తో ఏమనుబంధమో తెలియదు. స్టెల్లా ఎవరో తెలియదు. అంతా వట్టి మాట. అయితే వీళ్లు నటిస్తున్నారా? ఆ అవసరం ఏంటో అసలు తెలియదు. కాకపోతే వీళ్ళిద్దరి తన్మయత్వం చూస్తే అలా అనిపించదు. పెద్దాయన మా ఇద్దరినీ చేతులు పట్టుకుని మరీ నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు. ఎదురుగా ఉన్న అల్మీరాలో రకరకాల పుస్తకాలు కనిపిస్తున్నాయి. లాన్ టెన్నిస్ రాకెట్ ఒకటి గోడకి దిష్టిబొమ్మలా తగులుకునుంది. అర్ధచంద్రాకారంగా అమర్చిన మెట్లకి సరిగ్గా మధ్యలో క్రింద ఓ ఆలోచింపజేసే పెయింటింగ్ ఉంది. ఆరు లేదా ఏడు గుడారాలు ఒకదాని వెనుక ఒకటి ఆ పెయింటింగ్‍లో ఉన్నాయి. మధుకర్ గవడే గారు ఉంటున్న ఇంట్లో ఆ ముసలావిడ గదిలోని పెయింటింగులు గుర్తుకొచ్చాయి. గుడారాల మధ్యలో దీపం వెలుగుతున్నట్లు కనిపించటం లేదు కానీ దాని తాలూకు వెలుగు బయటకి ప్రసరిస్తున్నట్లు చిత్రీకరించటం అద్భుతం! వెనుక సముద్రం మామూలుగానే ఉన్నా నన్ను మరిచిపోవద్దు అంటోంది. ఆ పెయింటింగ్ క్రింద ఓ చిన్న గూట్లో వేటకు వెళ్ళేటప్పుడు తొడుక్కునే గమ్ బూట్స్‌లా ఉన్నాయి. షో కోసమైనా ఎక్కడా గన్నులు లేవు.

ఓ కుర్రాడు ఓ ట్రాలీలో డ్రింకులు, మరేవో పెట్టుకుని మెట్లకున్న అవతలి ప్రక్కనుంచి ప్రత్యక్షమయ్యాడు. నన్ను చూసి నిట్టూర్చాడు. తప్పులేదు. సమీర్‍ని చూసి అలా ఉండిపోయాడు. ముఖం ఎందుచేతనో వెలిగిపోయింది. వాస్తవానికి మద్యం సేవిమ్చేవారి మధ్య ఆద్యంతం ఉండే అనుబంధం అనంతమైనది! ఒకరి కళ్లల్లోంచి ఒకరు సూటిగా తాగయ్యగలరు!

ట్రాలీ దగ్గరగా తెచ్చి మా ఇద్దరి ముందూ గ్లాసులు పెట్టాడు. ఒక చాలా చిన్న సైజు బాటిల్ నుంచి కేవలం నాలుగైదు చుక్కలు పోసి నీరు నింపాడు. నేను సమీర్‍ని అనుమానంగా చూసాను. సమీర్ నవ్వాడు.

“ఇది తీసుకోండి”

“ఎందుకు?”

“ఎవరైనా తీసుకోవచ్చు”

“అంటే?”

“మందు అలవాటు లేని వారు కూడా!”

“ఎందుకని?”

“ఇది కేవలం ఒక సుగంధ ద్రవ్యం. మీ భాషలో చెప్పాలంటే మడిగట్టుకున్న వారు కూడా మామూలుగా త్రాగేస్తారు!”

“నాకొకటి అర్థం కాదు..”

“చెప్పండి..” గ్లాసు తీసుకున్నాడు సమీర్.

“ఈ ఇల్లెంతో అలవాటుగా అనిపిస్తోంది మీకు. చక్కగా అతిథ్యం స్వీకరిస్తున్నారు. సమస్య పెద్దదవుతోందనిపించటం లేదా?”

“ఏ సమస్య అలా అవుతోందో తెలుసుకోవాలంటే డాక్టర్ ఇదే పని చేస్తాడు. తనకి తెలిసిన రోగం బయట పడేవరకూ ఒక విధమైన మందు ఇస్తూ పోతాడు. అది బయటపడ్డాక దానికి వైద్యం చేస్తాడు”

“మీరు త్రాగుతున్న మందు అదన్న మాట!”

“కరెక్ట్. లోపలికి తోసి చెప్పండి, ఎలా ఉందో”

రుచి చూసాను. రోస్ వాటర్‍లా అనిపించిది. కానీ కాదు. రెండు గుటకలు పోనిచ్చి చూసాను.

“బావుంది” అన్నాను.

 ఆ కుర్రాడు సమీర్‍కు డ్రింకు తయారు చేసాడు. ఎక్కడి నుండో సన్నని సంగీతం వినిపిస్తోంది.

మా పైన వ్రేలాడుతున్న షాండిలియర్ లోంచి లైటు వెలిగింది. ఇది ఖచ్చితంగా గోవాకి వాస్కోడగామా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిందా లేక ఏకంగా సముద్రమే గోవాకి వచ్చినప్పుడు వచ్చినదా అని తేల్చుకోవటం కష్టమే అనిపించింది. కానీ ఇలాంటి ఇంట్లో ఎంతో మందున్నారో తెలియదు.. అలా అనుకుంటుండగానే నేనుండగా ఎంతోమంది అక్కరలేదు అన్నట్లు లావుగా ఒకావిడ అప్పుడే నిద్ర లేచినట్లు ఉన్న మొహంతో ఎక్కడి నుండో ప్రత్యక్షమైపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే అంత శరీరంతో కూడా దాదాపు పూర్తిగా వంగి నమస్కారం చేసుకుంది. ఆ ప్రక్రియకు ముగ్ధులమై ఇద్దరం కూడా లేచి నిలబడి ఆ వందనాన్ని స్వీకరించాం! ఆమెతో పాటు మేము కూడా సుఖాసీనులమైనాము.

“ఇది ఇక మీ ఇల్లు” అనేసింది ఆమె!

సమీర్ నీదా నాదా అన్నట్లు నన్ను చూసాడు. డ్రింకు తీసుకున్నాడు.

“ఎందుకలాగ?” అడిగాడు.

“మేమందరం నీ వాళ్ళమే”

బయట సన్నగా వాన బయలుదేరింది. ఒక ఇల్లు మనం కట్టుకున్నందుకు మనదవుతుందా? దానిని గట్టిగా పట్టుకుని అందులో ఉంటున్నందుకు మనదవుతుందా? ఒక ఇంట్లో పుట్టి ఆ ఇంటిలోని వారందరూ మనలను కానివారిగా కాకుండా, పనికిరానివారిలా కాకుండా వారి వారిలా చూసుకున్నప్పుడు ఒక ఇల్లు మనదవుతుందా?

“మీరెవరు?” అడిగాడు సమీర్.

ఆమె ముఖం చిన్నబోయింది. కళ్ల నీరు తుడుచుకుంది. నన్ను జాలిగా చూసింది. బహుశ అందరూ పుచ్చుకునేదే పూర్తిగా పుచ్చుకోలేని ఈయనెవరా అన్న బాధ అందులో ఉన్నదేమో..

“సమీర్..”, మెల్లగా అంది, “..మా లోకాన్ని నువ్వు ఎలా మరిచిపోయావని అడగలేను. మతిమరుపు ఏ కారణం చేతనైనా రాగలదు. ఏదైనా బాధను మరిచిపో అనగలం, మరిచిపోలేము. కానీ మనుషులను కావాలని మరిచిపోవటం భావ్యం కాదు. నేను ఎవరినో గుర్తులేదా?”

సమీర్ తరహా చూస్తుంటే చిత్రంగానే ఉంది. నిజంగానే అంతా మరిచిపోయాడా?

ఎందుకో లేచాడు సమీర్. తనకు కుడివైపు గల కిటికీ దాకా వెళ్లాడు. నడుము మీద చేతులు పెట్టుకుని అదే పనిగా కురుస్తున్న వానలోకి చూస్తున్నాడు.

“మేం చేసిన తప్పేంటి? చెప్పండి”, ఆమె నన్ను నిలదీసింది. అది నిజానికి నేను అడగవలసిన ప్రశ్న!

“నాకేమీ తెలియదండి”

“మీరు..”

“నా పేరు సుందర్”

“సుందర్.. అంటే?”

“నేనొక రచయితను. ఇటీవలే సమీర్‍తో పరిచయం అయ్యింది”

“సినిమాలకు కథలు వ్రాస్తారా?”

“కాదు”

“ఓ. సమీర్ గురించి అంతా తెలుసా?”

“తెలుగు సినిమాలలో హీరోగా మంచి పేరు సంపాదించినట్లు మటుకు తెలుసు. అతని వ్యక్తిగత జీవితం పెద్ద అవగాహన లేదు.”

సమీర్ కిటికీకి ఆనుకున్నాడు.

“ఒక్క విషయం చెప్పండి..”

నేను చెయ్యి అడ్డు పెట్టాను. “చూడండీ.. మీరు ఏం చెప్పినా నాకు ఎలా అర్థమవుతుంది? నేను ఈ ప్రాంతం వాడిని కూడా కాను”

ఆమె నిట్టూర్చింది. లేచి మెట్ల దాకా వెళ్ళింది. నాలుగు మెట్లు ఎక్కి ఆగిపోయింది. పై నుంచి ఒక అమ్మాయి క్రిందకి దిగుతోంది.

“సెల్లా..”, ఈమె అన్నది. ఆ గుసగుస లాంటి సవ్వడిలో ఒక బాధ, ఒక నిట్టూర్పు, ఒక ఆధారశిలను తనివితీరా కౌగిలించుకున్న ఒక ఆర్తనాదం – మూడూ అణిగిమణిగి అంతా ఒక రహస్యంలా వినిపించింది.

ఆ శబ్దం సమీర్‍ను కూడా తాకినట్లుంది. ఇటు తిరిగాడు సమీర్. మోకాలు వరకు ఆరెంజ్ కలర్ గౌను, పైన తెల్లని బ్లౌజ్, చెక్కిళ్ళ మీది నుండి జారిపోతున్న ముంగురులతో ఆ అమ్మాయి అందం ఎవరినైనా కదిలించేయగలదనిపించింది!

నేనెప్పుడు నిలబడిపోయానో నాకే తెలియదు. నన్ను చూసి ఆగిపోయింది. ఇల్లంతా కలయచూసి సమీర్‍ని చూసి చిరునవ్వు నవ్వింది. ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన పక్షి ఏదో పట్టుకొచ్చి తన పసిపిల్లల ముందు నిలబడగానే ఆ చిన్ని పసిగుడ్డులు మురిసిపోయినట్లు ఏదో తీపి అనుభవం ఆ చిరునవ్వు లోంచి జారిపోయి అంతలోనే మాయమైంది. సమీర్‍ను చూస్తూనే ఇటు మెట్లు దిగుతోంది.

ఒక అందాన్ని స్మరిస్తూ అందంగా మారుతారు కొందరు. ఆ అందమే మరెవరినో స్మరిస్తూ మరింత అందంగా మారిన వైనంలో మరి మరి సమీర్‍ను చూసుకుంటూ అప్పుడే నడక నేర్చిన జింకలా చిన్ని చిన్ని గెంతులు వేసుకుంటూ మెట్లు దిగుతోంది స్టెల్లా!

సీతాకోక చిలుక రెక్కలను పట్టుకున్నంత సున్నితంగా తన అందమైన వేళ్ళతో గౌనును పట్టుకుని జాగ్రత్తగా దిగుతోంది ఆ అమ్మాయి. హాల్లోకి దిగుతూ దగ్గరకు వస్తుంటే ఒక్కసారికి సముద్రమే పైనుంది ఆ ఎదురుగా ఉన్న పెయింటింగులోకి జారినట్లు అనిపించింది.

సమీర్‍ను గమనించాను. ఆలోచనలో పడ్డట్లున్నాడు. స్టెల్లా నాకు వంగి వందనం చేసింది. సమీర్ వైపు తిరిగింది.

గోవా లోని అందమంతా పాలకోవాలా ఒక్క చోటే నిలబడ్డట్లనిపింది!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here