పూచే పూల లోన-16

0
13

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కారులో ఎక్కించుకున్న ముసలి జంటతో పాటు వాళ్ళ ఇంటికి చేరుతారు సమీర్, సుందర్.  ముందు వృద్ధులిద్దరూ దిగి లోపలికి వెళ్ళి ఏదో ఓ పుస్తకాన్ని తెచ్చి, ఓ పేజీ తెరిచి చదవడం ప్రారంభిస్తాడు.  ఆ పెద్దవిడ ఆయన చదివిన వాటిని మరల భావయుక్తంగా అంటూ ఉంటుంది. అక్కడికి చేరిన ఒకరిద్దరు గంట వాయిస్తారు. ఇరుగుపొరుగు వాళ్ళంతా ఈ దృశ్యాన్ని చూస్తూ గుసగుసలాడుకుంటారు. పెద్దవాళ్ళిద్దరూ కాసేపు ప్రార్థన చేస్తారు. తరువాత లోపలికి వెళ్తారు. ఈ వృద్ధ జంటకూ సమీర్‍కూ ఏమి సంబంధమో, స్టెల్లా ఎవరో సుందర్‍కి అర్థం కాదు. ఇల్లంతా పరికించి చూస్తాడు. ఇంతలో ఓ కుర్రాడు ట్రాలీలో డ్రింకులు తెస్తాడు. సమీర్, సుందర్ ముందు రెండు గ్లాసులు పెట్టి చాలా చిన్న సైజు బాటిల్ నుంచి కేవలం నాలుగైదు చుక్కలు పోసి నీరు నింపుతాడు. అది సుగంధ ద్రవ్యమని, మద్యం కాదని, తాగమని చెప్తాడు సమీర్. ఈ ఇల్లంతా మీకు అలవాటయినట్లుగా ఉంది, ఆతిథ్యం చక్కగా స్వీకరిస్తున్నారు, సమస్య పెద్దదవుతున్నట్లు అనిపించడం లేదా అని సుందర్ సమీర్‍ని అడుగుతాడు. ఇంతలో ఓ లావుపాటి ఆవిడ ప్రవేశిస్తుంది. వంగి నమస్కరించి, ఇక నుంచి ఇది మీ ఇల్లు అంటుంది. సమీర్ తనదా, సుందర్‍దా అన్నట్లు సుందర్ కేసి చూస్తాడు. ఇంతలో బయట సన్నగా వాన మొదలవుతుంది. హఠాత్తుగా ఆమెని మీరెవరు అని అడుగుతాడు సమీర్. ఆమె కన్నీళ్ళు పెట్టుకుని, అన్నీ మరిచిపోయావా సమీర్, నేనెవరో గుర్తులేనా అని అంటుంది. ఆమె సుందర్‍ని ప్రశ్నిస్తుంది. తనకేమీ తెలియదనీ, తానీ ప్రాంతం వాడిని కానని, సమీర్ ఓ హీరోగా మాత్రమే తెలుసని అంటాడు సుందర్. ఇంతలో మెట్ల మీద నుంచి స్టెల్లా అనే అందమైన యువతి దిగి వస్తుంది. ఆమె అందం చూసి అబ్బురపడతాడు సుందర్. స్టెల్లా సుందర్‍కి వందనం చేసి, సమీర్ వైపు తిరుగుతుంది. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మీర్ కుమార్ వ్యక్తిత్వం లోకి తొంగి చూసే ప్రయత్నం నేను చేయలేదు. గోవాని తెలుసుకుందామని వచ్చాను. అదలా ఉంచి చుట్టూతా ఏవేవో జరిగిపోతున్నాయి. అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ డైరీలో ఏదో వ్రాయటం ప్రారంభించాను. స్టెల్లాను చూసాక దాదాపుగా మతి పోయిందనే చెప్పాలి. ఈ ప్రాంతానికీ, ఈ ప్రజలకీ, దీని చరిత్రకీ ఒక చక్కని నివాళి ఇవ్వాలనిపించింది.

కొద్ది రోజుల క్రితం కృష్ణప్రసాద్ గారు చూపించిన ఓ పుష్పం తాలూకు ప్రతిబింబం వద్దన్నా అలా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆయన నడుస్తూనే ఉంటారు కానీ అకస్మాత్తుగా ఏదో గని దొరికినట్లు ఆగిపోతారు. దాదాపుగా మోకాళ్ళ మీద కూర్చున్నారు ఆ రోజు.  మాట్లాడితే ఏదో అంతా చెడిపోతుందన్నట్లు పెదాల మీద వేలు పెట్టారు. చిన్నగా నవ్వుకుని దగ్గరకెళ్ళాను. పసుపు పచ్చ, ఆరెంజ్ రంగుల మిశ్రమంలో ఉన్న పువ్వు అది. రేకులు సగం విచ్చుకుని కొద్దిగా సిగ్గుపడుతూ ఒదిగిపోయినట్లున్నాయి. బాగా విచ్చుకున్న ఎర్రని రేకు ఆ సిగ్గును దాచాలనే ప్రయత్నం చేస్తున్నట్లుంది.

“దీనిని ఇక్కడ దేవఖేల్మో అంటారు. ఆంగ్లంలో కాన్నా అంటారు. దీని ఎదుగుదల ఎలా ఉంటుందో చూడండి”

నిజమే. నిటారుగా, చక్కగా, నిక్కబొడుచుకున్నట్లుంది. కృష్ణప్రసాదు గారు చాలా సున్నితంగా దాని నడుము మీద వేళ్ళు పెట్టారు.

“ఇక్కడ చూడండి. నిజానికి అన్నీ ఆకులు, రేకులే. దూరం నుంచి చూస్తే గట్టి నడుమనుకుంటారు..” కొద్దిగా వంచి చూపించారు.

“నిజానికి, దీనికసలు నడుము లేదు. అందమైన అమ్మాయి ఇది!”

కాదా? కానీ ఎక్కడా తొణికే స్వభావం లేదు.

ప్రసాద్ గారు పూర్తిగా లీనమైపోయారు. అటువంటి మరో మొక్క దగ్గరికి తీసుకెళ్ళారు.

“చూడగానే మీరు పెద్ద హీరో కాకపోవచ్చనుకుంటారు. కదా?”

“అనుకోనక్కరలేదు. ముందర ఎవరైనా అది నిర్ధారించుకునే నా దగ్గర కొస్తారు”

“కరెక్ట్. కానీ మీరు హీరోనే. ఎందుకో చెబుతా వినండి. జేబులో ఏముందో ఎలా తెలియాలి?”

“ఊ. ఇంతకీ ఈ మెక్క ఏమంటోంది?”

ఆయన మెల్లగా ఆ రెమ్మల మాటున గింజలను చూపించాడు.

“ఎలా ఉన్నాయి?”

“మామూలు గింజలే”

“కాదు”

“ఏదైనా రోగాన్ని నయం చేస్తాయా?”

“సార్, ఎప్పుడూ రోగాలూ, మందులేనా?”

“మరి?”

“గెస్ చేయండి”

“ఊ.. వంటలో..”

ఆయన తల బాదుకున్నారు.

“రండి..” అంటూ నాలుగడుగులు వేయించాడు.

“ఎప్పుడైనా గన్ గట్టిగా పట్టుకున్నారా?”

“పట్టుకున్నాను. నన్నూ ముగ్గురు గట్టిగా పట్టుకున్నారు, ఇంకాస్త గట్టిగా”

“అబ్బా, మాస్టారూ! పోనే బుల్లెట్లు చూశారా?”

“చాలా..”

“మీకో సంగతి చెబితే ఆశ్చర్యపోతారు. ఈ గింజలు పెద్దవైతే ఏ బుల్లెట్లకీ తీసిపోవు”

అక్కడే ఆగిపోయాను. సిగ్గుతో తల వంచుకున్న పడతి లాంటి వయ్యారం గల అందమైన పూలమొక్క. ఆకులతోనే నడుమును తయారు చేసుకున్న వైనం. ఆ పూలలోని సౌందర్యం సూర్యోదయం, సూర్యాస్తమయాలనే తలపిస్తుంది. ఆ మొక్కలు అందించే గింజలు ఇంత గట్టివా?

“అవును. సిపాయ్ విప్లవం జరిగినప్పుడు బుల్లెట్లు నిండుకున్నప్పుడు మన వీరులు వాడిన బుల్లెట్లు ఇవే. ఇప్పటికీ ట్రెయినింగ్‌లో షూటింగ్ నేర్పేటప్పుడు ఈ గింజలనే కొన్ని చోట్ల వాడతారు. ఇలా రండి..”

అక్కడ ఓ పెద్ద చెట్టు ముందర నిలుచున్నారు. “ఇవి చూడండి..” అన్నారు.

అక్కడి ఆ మహావృక్షం మీద ఎన్నో గాయాలున్నాయి.

“ఇవన్నీ ఈ బుల్లెట్ల గాయాలే!”

“ఒక పూల మొక్క ఇంత హింసలో పాల్గొంటుందా?”

“అబ్బా, ఈ రచయితలతో ఇదే ఇబ్బంది. ఊ.. అలా అంటే, ఇంకో విషయం చెప్పాలి. ఈ గింజలు మరో చోట ఉపయోగపడతాయి. కాయంబ్ అంటే ఏంటో తెలుసా?”

“ఈ ప్రాంతంలో ఎక్కడో ఏదో ఊరులా ఉంది. ఇక్కడ పేర్లన్నీ హలాంతాలో లేక ఎక్కడికి పోవాలో అన్నట్లుంటాయి.”

“మరీ అంత హేళన పనికిరాదు సార్, ఒక్కొక్క మాటకీ ఒక్కొక్క నిర్దిష్టమైన..”

నమస్కారం పెట్టాను.

“కాయంబ్ అంటే ఏమిటో చెప్పెయ్యండి. ఆ చివార్న ఆ టీ పోసేవాడు ఎప్పటి నుండో  రమ్మంటున్నాడు”

అటు చూసారు.

“అదేముంది! నేను పోయిస్తాను. కాయంబ్ అంటే ఒక వాయిద్యం.. సంగీతజ్ఞులకు తెలుసు. అందులో వాడే వాటిల్లో ఇవి ప్రధానమైనవి”

“శభాష్. పువ్వు పరిమళిస్తుంది, అందాన్ని పంచుతుంది, ఆహ్లాదాన్ని సృష్టిస్తుంది, వద్దు వద్దు ఇక బ్రతకను అనే వారికి జీవితం పట్ల ఆశను కలిగిస్తుంది. అవసరమైన చోట గుండె నిబ్బరం చేసుకుని గుండ్లు పేల్చి చంపేస్తుంది. కావాలనుకున్నప్పుడు చక్కని సంగీతమై అలరిస్తుంది..”

కృష్ణప్రసాదు గారు కళ్ళు మూసుకుని ఆ మాటలను ఆస్వాదిస్తున్నారు.

“బాగుంది. ఈ మాటలన్నీ గోవాకు సమైక్యంగా వర్తిస్తాయి. ఈ ప్రాంతం యొక్క అందమైన చరిత్ర యావత్తూ ఇక్కడ పూచే పూలలో ఒదిగిపోయి ఉందంటే ఒట్టు. మీరు నా మాట నమ్మాలి!”

“ఇదీ ఆలోచించాలి”

“ఇదే కాదు. కాయంబ అనే సంగీత వాయిద్యం ఏ ప్రాంతానికి చెందినదో తెలుసా?”

“మంచోరే! కాయంబ్ అంటేనే ఓ ప్రాంతం అనుకున్నవాడ్ని!”

“హ హ.. ఆ ప్రాంతం పేరు రియూనియన్!”

“ఛా”

“అంటే? నేను అబద్ధం చెబుతున్నాననా?”

“కాదు. అదెక్కడ? దగ్గరలోనేనా?”

“నో. ఆఫ్రికా ఖండానికి ఆనుకుని ఉన్న మాస్కరీన్ ద్వీపాలలో ఒక భాగం. ఇది ఫ్రెంచ్ వారి విదేశీ ప్రాంతం. కొన్ని చారిత్రకాత్మకమైన కారణాల వలన దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రియూనియన్ అన్నారు”

“ఈ పుష్పానికి, రియూనియన్‍కీ ఏమైనా సంబంధముందా?”

“తెలియదు. మిమ్మల్ని ఎవరైనా అమ్మాయి వదిలేసిందా?”

“ఇంత స్నేహం పనికిరాదు”

ఆయన నవ్వారు.

“అదేమి?”

“నేను ఎవరినైనా వదిలేసానా అని అడగలేదు. ధన్యవాదాలు”

“ఇది స్నేహం కాదు..”, నా భుజం మీద చెయ్యి పెట్టి జాగ్రత్తగా చెప్పారు.. “.. వాస్తవం! రచయితలను చాలామంది వదిలేస్తారు”

“ఎందుకలాగ?”

“వారి లోని అందమంతా కాగితాల మీదకి జారిపోయి ఆ కాగితాలన్నీ మరెక్కడికో జారిపోయి వారు కేవలం ఈ గింజల్లా, కఠినంగా, క్రూరంగా మిగిలిపోయి వికృతంగా కనిపిస్తారు.

“కేవలం కనిపిస్తారా?”

“కాదు, అనిపిస్తారు”

“కానీ నిజం..”

“కానీ కాదు. నిజం కూడా అంతే”

***

ఎందుకో స్టెల్లా గురించి తలచుకున్నప్పుడల్లా కాన్నా ఇండికా అనే ఈ ‘దేవఖేల్మో’ పుష్పం పదే పదే గుర్తుకొచ్చింది. చిటారు కొమ్మనున్న పువ్వు అలా గాలి తాకిడికి తెగినట్లు మెట్ల మీదుగా అలా అలా తరలి వచ్చి నిటారుగా నిలబడి ‘రియూనియన్’ కోసం సమీర్‍ను కాంక్షిస్తున్నట్లున్నది. ఇంత కాలం మరి ఏం జరిగింది? ఈమె ఏం చేస్తోంది? తన లోని బుల్లెట్లను కాపాడుకుంటోందా? అంతా విచిత్రంగా తోచింది.

అదంతా అలా ఉంచి నాకు మటుకు ఆ అస్తమిస్తున్న సూర్యుని బింబం అలా సముద్రంలోకి వెళ్లిపోతుంటే, అక్కడక్కడ ఈ రిసార్టులో దీపాలు వెలుగుతుంటే, గిటార్ పట్టుకుని ఇద్దరు యువకులు స్టేజ్ మీదకు వెళుతుంటే, ఎందుకో మరో లోకంలోంచి మరో సంగీతమే వినిపిస్తోంది. చెట్ల చాటుగా ఉంటూనే మాయమైపోతాడు సూర్యుడు. కాయంబ్ అనే వాయిద్య నిటారుగా ఉన్న కర్రల మాటుగా నాదాన్ని పలికించే వాయిద్యం.

“గుడ్ ఈవినింగ్..” అంటున్నాడు కుర్రాడు. “..మన జీవితంలో ఒకరోజు అయిపోయింది. యస్ ఆర్ నో?”

“యస్” అందరూ అరిచారు.

“మంచి లేదు, చెడు లేదు. అయిపోయిందంతా అబద్ధమే”

గోలెట్టారు జనం.

“నిజం ఒక్కటే”

“ఏంటది?”, గోలగా అన్నారు.

“మనం, మన మాట, మన పాట.. మన ఆట!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here