పూచే పూల లోన-18

0
14

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ వృద్ధ దంపతుల ఇంట్లోంచి బయటకొచ్చిన సమీర్, సుందర్‍తో కలిసి కారులో బయల్దేరుతాడు. ఏం జరుగుతోందో తనకి అర్థం కాలేదంటాడు సుందర్. తనకీ అర్థం కావడం లేదంటాడు సమీర్. మీరు ఇంట్లోంచి పారిపోయినట్లు అర్థమైంది అని అంటాడు సుందర్. తాను పారిపోలేదని, బంధాలను తెంచుకుని ఇవతలికి వచ్చేసానని అంటాడు సమీర్. ఇల్లు ఎందుకు వదిలారని సుందర్ అడిగితే, కొద్దిగా చరిత్ర చెప్పాలి అంటూ మొదలుపెట్టి తమ వంశంలోని పూర్వీకులు ఎందుకిలా తయారయ్యారో చెప్తాడు సమీర్. తండ్రి తన కోసం తెగ వెతికించాడనీ, చేతికి చిక్కకపోతే చంపించే ఆలోచన కూడా చేశాడని అంటాడు సమీర్. నమ్మని సుందర్ చిన్నగా నవ్వుతాడు. తన మీద తండ్రికి ప్రేమ లేదని చెప్పి, ఒక చోట కారు ఆపి ఒక షెడ్డు లాంటి ప్రాంతానికి తీసుకువెళ్తాడు. తన రెండో జన్మని అక్కడే పొందానని చెప్తాడు. అర్థం కాలేదని సుందర్ అంటే, వివరంగా చెప్తాడు సమీర్. ఒకసారి తనను అక్కడ దుండగులు చుట్టుముట్టారనీ, విపరీతంగా కొట్టారనీ, తాను పల్లెతు మాట కూడా మాట్లాడలేదనీ చెప్తాడు. విసుగెత్తిన ఆ రౌడీలు ఇంకా చితక్కొట్టారనీ, అయినా తన నోటి వెంట అమ్మా, అయ్యా అనే మాటలు రాలేదని చెప్తాడు. ఇంతలో ఒక బండి తమను దాటుకుని వెళ్ళిందని, కొంచెం ముందుకు వెళ్ళి ఆగిందని చెప్తాడు. అందులోంచి భీకరమైన ఆకారం గల ఒక మనిషి దిగాడని చెప్తాడు సుందర్. ఆ మనిషి పేరు వీరమణి అని సమీర్‍ని కొట్టడానికి వచ్చిన ఒక రౌడీ చెప్తాడు. ఇక చదవండి.]

[dropcap]నా[/dropcap] చుట్టూ ఊరకుక్కల్లా నిలబడ్డ వారంతా నాలుగడుగులు వెనక్కి వేసారు. ఏం జరుగుతోందో నాకర్థం కాలేదు. కళ్ళ ముందు ఎవరూ స్పష్టంగా కనిపించటం లేదు. ఊపిరి పీల్చ గలుగుతున్నానని తెలుస్తోంది. అలా గోడకి అనుకున్నాను కానీ కాళ్ళు తేలిపోతున్నాయి. అప్పటి వరకూ నన్ను గుద్దుతూనే ఉన్న అతను వీరమణికి సలాం చేసి తప్పుకున్నాడు.

నల్లగా పొడుగ్గా భీకరంగా ఉన్నాడు వీరమణి. లోపల టైట్‍గా ఉన్న కట్ బనియన్ వక్ష స్థలాన్ని మరింత గట్టిగా ప్రదర్శిస్తోంది. ఎత్తు పళ్ళ వలన నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాడు కానీ సీరియస్‍గానే ఉన్నాడు. అక్కడ పడి ఉన్న తుప్పు పట్టిన సైలెన్సర్‍ని తీసుకుని ఎందుకో నిమిరాడు.

“కొట్టటం ఎందుకు ఆపేసావు?” మెల్లగా అడిగాడు.

“నేను అలిసిపోతున్నాను కానీ వీడి నోట్లోంచి అమ్మా, అయ్యా అన్న మాట రావటం లేదు”

వీరమణి తన తలని కుడి వైపు మెల్లగా వంచాడు.

“కుర్రాడు కొత్తగా ఉన్నాడు..” అన్నాడు. “..ఈ వైనం కూడా కొత్తగా ఉంది. ఎవరు?”

“కోపాల్ సార్ కొడుకు”

కళ్లు చిట్లించాడు వీరమణి.

“పెద్ద కొంపలో పడి పెద్ద నేరాలు చేసి చిన్నగా నీకు దొరికిపోయాడా?”

“కాదు, కోపాల్ ఈడ్చుకు రమ్మన్నాడు”

నన్ను ఆశ్చర్యంగా చూసాడు వీరమణి.

“ఏం చేసావు? పారిపోయావా?” నా భుజం మీద చెయ్యి పెట్టాడు.

నేను మాట్లాడ లేదు.

“అమ్మాయి గొడవా?”

మొదటిసారి అతని కళ్ళల్లోకి చూసాను. నాకు కుడి వైపున ఒకడున్నాడు.

వాడు కొద్దిగా ముందరకొచ్చాడు.

“అమ్మాయి కాదు, అమ్మాయిలు”

వీరమణి విరగబడి నవ్వాడు. నన్ను కిందా మీదా చూసాను.

“వార్ని, ఇంత అందంగా ఉన్నాడే అనుకున్నా. ఇందుకా? ఒరేయ్, నాతో మాట్లాడు. పారిపోవటం దేనికి?”

నేను పారిపోయానా? ఇల్లు వదిలేసానా? లేక ఒక గీత గీసానా అన్నది నాకే తెలియదు. మిగతావన్నీ వాటంతట అవే ఇలా జరిగిపోతున్నాయి.

“అమ్మాయిలు వాడి సమస్య కాదు, వీడి అయ్య సమస్య” చెవిలో ఊదినట్టు చెప్పాడు వాడు.

వీరమణి కళ్లు పెద్దవి చేసాడు. ఏదో తీవ్రంగా ఆలోచించాడు.

“ఎక్కడ దాక్కున్నావు?” మెల్లగా అడిగాడు.

నేనేమీ మాట్లాడలేదు. ఆ సైలెన్సర్‍ని ప్రేమగా నిమిరాడు.

“ఇదేంటో తెలుసా?” అడిగాడు. “..బైక్‍లో వాడే సైలెన్సర్. బండి ముందుకు దూకుతున్నా దాని జోరు పూర్తిగా తెలియనీయకుండా శబ్దాన్ని కంట్రోల్ చేస్తుంది.  నువ్వు సైలంట్ గానే ఉన్నావు. ఎక్కడికో దూకుతున్నావు. అర్థమవుతోంది. నీకు తల్లి లేదా?”

“ఉంది..”, వాడు చెప్పాడు.

“ఆరిబుల్.. (హారిబుల్)” అన్నాడు.

ఆ సైలెన్సర్‌ను ఉన్న పళంగా రెండు ముక్కలు చేసాడు. నన్ను చూస్తూనే ఆ ముక్కలని విసిరేసాడు.

“నీ తల్లిని కూడా తీసుకుని పారిపోలేదా?”

“..”

“అర్థమైంది. మన తల్లులు దేవతల లాగా కళ్లు మూసుకుంటారు. ఇంటికి పోతావా?”.. అంటూ తిరిగాడు. “..మాట్లాడడేంటి? మూగోడు కాదు కదా?”

నేను కళ్ళు పైకి ఎత్తాను.

“మా.. సాంతేరీ” అన్నాడు.

(సాంతేరీ మాత ఈ ప్రాంతానికి ఇలవేలుపు. సాంతేరీ అంతే పాము పుట్ట. ఆ పుట్టనే అమ్మవారిగా కొలుస్తారు. సంతానం లేని వారు కొలిస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం వీరికుంటుంది. మంగేశీ లోని శివాలయం దగ్గర మహాలసా మందిరం దగ్గర సాంతేరీ మాత దేవస్థానం కూడా ఉంటుంది. ఒక చరిత్రకారుడు ఈ అమ్మవారి ఉపాసనను అద్భుతంగా వర్ణించాడు. మట్టి లోని సూక్ష్మాతిసూక్ష్మమైన కణాలతో చీమలు పుట్టను ఏర్పాటు చేస్తాయి. ఆ పుట్టలోకి పాములు చేరటం పక్కన పెడితే, ఆ మన్ను యొక్క ప్రాశస్త్యం వైపు దృష్టి మరచాల్సి ఉంటుంది. ఆ మన్ను పవిత్రమైనదంటారు. అందుకు నిదర్శనాలు లేకపోలేదు. పాము పుట్ట మీద ఏ జంతువు విసర్జన చెయ్యదు. అనేక కార్యాలలో ఈ మన్నును ఇంట్లో పెట్టి నవధాన్యాలను, మొక్కలను పెంచుతారు. హైందవ సంప్రదాయంలో, సూక్ష్మమైనది పవిత్రమన్నది వేదాంతం. లోపలికి వెళితేనే సూక్ష్మం ఎదురవుతుంది. ఆలయాలలో, గర్భగుడులు పాము పుట్ట ఆకారంలో ఉండటం విశేషం!)

నా బుగ్గ మీద తన వేళ్లతో నిమిరాడు వీరమణి. రోడ్డు మీదకి చూపించాడు.

“నీలో హీరో ఉన్నాడు..” అన్నాడు.

“దారికి రాకపోతే చంపెయ్యమన్నాడు కోపాల్”

నిట్టూర్చాడు వీరమణి.

“అంటాడు. మదపిచ్చి అందరి ప్రాణాలూ తీసుకుంటుంది. తల్లి, తండ్రి, కుటుంబం – అన్నీ ఆవిరైపోతాయి. పిల్లల్ని కడుపులో పెట్టుకోవటం సంప్రదాయం. పొట్టన పెట్టుకోవటం కూడా చూస్తున్నాం..”

ఆ రోడ్డు మీద ఏదో లారీ వెళ్ళటంతో నీళ్ళు ఒక్కసారిగా పైకి చిమ్మాయి. వీరమణి నన్ను ఎందుకో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.

“ఈ సైలెన్సర్‍తో కొట్టి నీ సైలెన్సును బ్రేక్ చేయిద్దామనుకున్నాను. కానీ దమ్మున్నోడివి. మూలగటం కూడా చెయ్యటం లేదు. ఏం చెయ్యాలనుకుంటున్నావు?”

ఏం మాట్లాడాలో తెలియలేదు. రెవాన్‍లో మిత్రులు ఏదో నాకు టైం పాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద గూండా నాకు అండగా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏదో హీరోలా బ్రతుకుదామనుకుంటే ఇలాంటి సమర్థ దుర్జనులతో చేరి విలన్ అయిపోతే? జీవితం అనేదే ఒక విలన్. నైతికంగా జీవించగలగటమే హీరోయిజమ్.

“నా బతుకు నన్ను బతకనివ్వండి” మెల్లగా నసిగాను. అందరూ దగ్గరగా వచ్చారు. వీరమణి ఎందుకో చిరునవ్వు నవ్వాడు.

“నిజం చెబుతాను నీకు – చల్ల లోంచి చిలికిన వెన్న లాంటి తిన్ననైన, చల్లనైన నిజం – “

కనురెప్పలు పైకి లేపాను. కొత్త వార్త ఏదైనా చెబుతాడా?

“ఎవరి బ్రతుకూ, ఎవరూ బ్రతకలేరు. ఎవరి జీవితమైనా అతుకులనే కుతకుతలాడుతుంది. ఈ రోజు వీళ్లు.. రేపు మరెవరో..”

“తట్టుకునే దమ్ముంది”

అలాగా అన్నట్లే తల ఆడించాడు. ఎడమ చేయి ఎప్పుడూ అదోలా గుండ్రంగా తిప్పుతూ ఉంటాడు వీరమణి.

“నీ ఇష్టం. నా బండి ఎక్కితే మరో ప్రపంచం. ఈ కథ ఇక సమాప్తం. ఆ పైన పెటపెటలాడే ఆకాశంలో పిడుగు కూడా నీ జోలికి రాదు. కానీ రేయ్, ఇది నీ ఇష్టం. నన్ను తలచుకో, నీకు ఆసరాగా ఉంటాను. ఆలోచించుకో..”

వీరమణి వెనక్కి తిరిగిపోయాడు. అతని వెనుక వీళ్లంతా కూడా నన్ను అదోలా చూస్తూ వెనుదిరిగారు. ఆ బండి డ్రైవర్ స్టార్ట్ చేసి ఈ పాడుబడ్డ షెడ్ ముందుకు తెచ్చాడు. వీరమణి సిగరెట్ తీసి ముట్టించాడు. ఇటు తిరిగాడు.

“రాణోలు గొడవ పడింది నీ ఇంట్లోనే కదూ?”

అవునన్నట్లు తల ఊపాను. ఎందుకో ఓ గర్వంతో కూడిన నవ్వు వదిలాడు.

“మైనింగు గొప్ప విద్యరా..” అన్నాడు. “..ఎంత లోతుకు వెళితే అంత బంగారం. నీకో చోటు చూపిస్తాను. మైనింగ్ చేస్తావా?”

“నాకు ఆ పని నచ్చదు. భూమిని కుళ్ళదీసి ఎందుకు బావుకోవాలి?”

అటు తిరిగాడు.

“ఏమిటి? నేను భూమిని కుళ్ళదీస్తున్నానా? మరి భూమి లోంచే కదరా అన్నీ జన్మిస్తున్నాయి?”

“భూమి ఆనందంగా పంపిస్తున్నదది. అది ప్రకృతి సహజంగా ప్రేమతో పంచి పెట్టేది”

చాలా కోపంగా చూసాడు. రోడ్డు వైపు గబగబా వెళ్ళిపోయాడు. అతి కష్టం మీద నాలుగు అడుగులు అక్కడి వరకు వేసాను. అతను బండి ఎక్కాడు. అది ముందరికి దూకింది. ఎందుకో బండి ఆపాడు.

“ఉండు. కుర్రాడేడో చెప్పాలనుకుంటున్నాడు”

నిజమే. ఎందుకో ఓ ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా బండి వరకూ వెళ్ళాను.

“నేను మెకానిక్ షెడ్ పెట్టుకుంటాను” అన్నాను.

బండి దిగిపోయాడు వీరమణి.

“నీ వెనుక ఉన్నది ఒకప్పుడు నా షెడ్డే. ఇప్పుడు నీది. ఏం కావాలంటే అది తీస్కో. నువ్వు పారిపోవటానికి పుట్టలేదు. రిపేర్ చెయ్యటానికి పుట్టావు. బాగు చేయటం నీ పని. మా సాంతేరీ..” అంటూ వెళ్ళిపోయాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here