పూచే పూల లోన-2

0
14

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సుందర్ అనే రచయిత ఈ కథని చెబుతుంటాడు. అతను ఈ మధ్య కారులో ఏ దారీ తెలియని వాడిలా ఎందుకో ప్రయాణాలు చేస్తుంటాడు. తన కారు పాతదైపోయినా, దాన్నే బాగు చేయించి మరీ వాడుతుంటాడు. ఆ కారే అతని ఇల్లు. ఓ రోజు  గోవాకి బయల్దేరుతాడు. దారిలో ఒక చోట చాలా మంది జనాలు, మీడియా వాళ్ళు ఒక ఇంటి వైపు వెళ్ళడం కనిపిస్తుందతనికి. టీ కొట్టువాడిని అడిగితే, అది మాజీ హీరో సమీర్ కుమార్ ఇల్లు అని, ఇరవై ఏళ్ళు శిక్ష అనుభవించి ఆ రోజే విడుదలై అక్కడికి వస్తున్నాడని చెప్తాడు. టీ తాగి కారు పోనిస్తూ కొంచెం ముందుకి వెళ్ళి ఆగి, పోనీ వాడ్ని చూద్దామా అని సమీర్ గురించి అనుకుంటాడు. దాదాపు 30 ఏళ్ళ క్రితం తామిద్దరం స్నేహితులమని గుర్తు చేసుకుంటాడు. జైల్లో ఉన్నప్పుడు తాను చూడడానికి కూడా వెళ్ళలేదనీ, ఇప్పుడు రానిస్తాడో లేదో అనుకుంటాడు. గతంలోకి వెళ్తాడు. మంగేశీ నుండి కొంచెం దూరంలో ఉన్న రిసార్టులో సేద తీరుతుంటాడు సుందర్. గోవాలోని అందమైన వాతావరణాన్ని, ఫొటోలు తీసుకుంటున్న యువజంటని చూస్తాడు సుందర్. అప్పుడు అక్కడ యాదృచ్ఛికంగా నటుడు సమీర్ పరిచయమవుతాడు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాకా, గోవాకెందుకు వచ్చారని సమీర్ అడుగుతాడు. సౌరాష్ట్రకి, సరస్వతీ నదికీ, ఈ సముద్ర తీరానికి మధ్య ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయనీ, వాటిని పరిశోధించడానికి వచ్చానని చెప్తాడు సుందర్. తను నుండి తాను తప్పించుకుని  కొన్నాళ్ళు దాక్కోడానికి వచ్చానని చెప్తాడు సమీర్. తనని కలవాలనుకుంటే, తన గెస్ట్ హౌస్‌కి రావచ్చని చెప్పి వెళ్ళిపొతాడు సమీర్. సుందర్ తన బసకి బయల్దేరుతాడు. ఇక చదవండి.]

[dropcap]‘పా[/dropcap]రాదిసో’ భవనంలోకి అడుగుపెట్టాను. చాలా కాలం క్రితం పోర్చుగీసు పద్ధతిలో కట్టిన భవనం అది. పెద్దగా జన సందోహం లేదు. ఇక్కడికి రమ్మన్న వ్యక్తి మధుకర్ గవడె ఎంతో కాలంగా నన్ను ఆహ్వానిస్తు ఉన్నాడు. ఇంత కాలానికి వచ్చినందుకు అతని భావ ప్రదర్శన ఎలా ఉంటుందో అని ఎందుకో ఓసారి ఊహిస్తూ అక్కడ లోపలికి వెళ్ళాను. విశాలమైన హాలు కనిపిస్తోంది. ఆ గోడలకి ఆనుకుని సన్నని సోఫాలున్నాయి. ఎవరూ కనిపించలేదు. నాలుగడుగులు ముందుకు వేసి చుట్టూతా చూశాను.

“యస్?” వెనుక నుండి వినిపించింది. అటు తిరిగాను.

తలుపు చాటుగా టి.షర్ట్‌లో ఓ వింత వ్యక్తి ఉన్నాడు. మర్యాదగా అతని దగ్గరకు వెళ్ళాను. ఒక పాత చెక్క టేబుల్ మీద ఓ బీరు బాటిల్‌ను పదే పదే చూస్తూ ఏదో మొబైల్‍లో మాట్లాడుకుంటున్నాడు. నన్ను, నా అవతారాన్ని చూసి మెల్లగా, ఆ మొబైల్‍ను ప్రక్కన పెట్టాడు.

“మధుకర్ గవడె ఎక్కడుంటారు?” అడిగాను.

పెదవి విరిచాడు. అతనికి ఏ మాత్రం పనికిరాని వ్యక్తినని చాలా స్పష్టంగా తేల్చుకున్నాడు. పారాదిసో అంటే ఇదే కదా? లాభం లేదని మొబైల్ తీసి నంబరు కొట్టాను.

“హలో..”

“సార్, పారాదిసో లో మీరు కనిపించటం లేదు. ఎవరో మనుషుల పొడ గిట్టని వాడున్నాడు”

“ఆ.. ఎక్కడున్నారు? అర్థమైంది. మీరు తిన్నగా ఆ హాల్లోకి వెళ్లిపోయారు. అది కాదు. బయటకి వచ్చి దాని కుడి ప్రక్కనున్న మెట్లెక్కి పైకి రండి. నేను ఇక్కడే ఉన్నాను”

వెనక్కి తిరిగాను. బయటకు వస్తుంటే అతను ఈల వేసాడు. తన కార్డు నాకు ఇస్తున్నాడు. ఆ కార్డు మీద ‘కార్వాల్లో’ అని ఉంది.

లేచి దగ్గరకొచ్చాడు.

“నా పేరు కార్వాల్లో. ఈ హాలు ఒక్కటీ నాది. హోటల్ పెట్టుకోవాలనే ఆలోచన ఉంటే మాట్లాడుదాం.”

జీవితం ఎంత విచిత్రమైనది? నిజమే. గెడ్డం పెంచుకుని ఓ గుడ్డ సంచీ భుజనా తగిలించుకున్నంత మాత్రాన ఒకడు రచయిత ఎందుకవ్వాలి? లేక ఒక కళాకారుడో, బొమ్మలు గీసేవాడో అని అందరూ ఎలా అనుకోవాలి? మంచి విషయం ఏమిటంటే నన్ను అడుక్కునే వాడనుకోలేదు. హోటల్ పెట్టుకునేవాడిలా అంటే.. ఆ డబ్బు ఉన్నవాడే అనుకున్నాడు. ఆ హాలు తలుపు దగ్గర మరో నాలాంటి ఏ కోవకూ చెందనివాడు దర్శనమిచ్చాడు. అసలు మనుషులను ఎందుకు విభజించాలి? అని ఆలోచిస్తుండగా ఆయన చేయి ముందరకి చాచాడు.

“గవడె.. మధుకర్ గవడె” అన్నాడు.

చరిత్ర సంగతి ప్రక్కన పెడితే ఈయనది మరో చరిత్రలా ఉంది. పాంటు చాలా అడ్డదిడ్డంగా తొడుక్కున్నట్లున్నాడు. అందులోకి షర్ట్‌ను దోపే ప్రయత్నంలో లోపం స్పష్టంగా కనిపించింది. నిజానికి అది ఆ పాంట్ లోకి వెళ్ళనంటోంది. స్వాతంత్ర్యం కోరుకుంటున్నది. కళ్ళజోడు అసలు మాట వినటం లేదు. జారిపోతానంటోంది. ఆయన నన్ను చూస్తున్న తీరు ఆకలిగా ఉన్న ఆడపులి చూసిన తీరు! ఆ చాచిన చేయిని ఆదరించకపోతే కాలు కూడా లేచే ప్రమాదం లేకపోలేదని గ్రహించాను. చేయి పట్టుకున్నాను. మీసాల చాటున ఓ చిత్రమైన నవ్వు అలా మెరిసింది. ఇద్దరం బయటకు వచ్చి మెట్లెక్కుతున్నాం. పారాదిసోకి దారి ఇంత సన్నగా ఉంటే ఎలా అనిపించింది. స్వర్గానికి నిచ్చెన ఇలానే వేస్తారనిపించింది.

“ఏమంటాడు వాడు?”

“ఆ హాల్లో హోటల్ పెట్టుకోమంటాడు”

“పెట్టండి. నేను రోజూ వస్తాను”

మెట్లు ఎక్కి ఆ పారాదిసో లోకి ప్రవేశించాను. వెలిసిపోయిన పసుపు పచ్చ రంగు పెయింటింగ్ ఆ గోడలను మరింత పాతవిగా చూపిస్తున్నది. మధుకర్ లోపలి నుంచి రెండు మంచి నీళ్ళ బాటిల్స్ తెచ్చి సోఫా ముందుంచాడు.

“మీ ఆలోచన గొప్పది..”, అన్నాడు కూర్చుంటూ. “..ఎందరు సంచరించినా ఎందరు వంచన చేసినా ఏ చరిత్రా మారదు. మీకు మార్పు గురించి కావాలా? వెనక్కి వెళ్లి ఇంకాస్త లోతుగా చూడగలిగే ఓర్పు కావాలా?”

గోవా పద్ధతిలో ఒక పొడుగ్గా ఉన్న స్కర్ట్, టిషర్ట్‌లో ఓ వనిత ఎంతో దిగాలుగా తన ముఖారవిందాన్ని ఒలకబోస్తూ నిలుచుంది. మామూలుగానే నేను ఒకరిని చూసి వీరి వయసు ఇంట ఉంటుంది అని ఎప్పుడూ చెప్పలేను. మంచి వయసులో ఉన్నవారిని వృద్ధులుగాను, వయసు మీద పడ్డ వాళ్లని వృద్ధులై అదోలా కనిపిస్తున్న యువకులుగానూ భావించి చాలాసార్లు అనుకోని ఇబ్బందులకు గురైన సందర్భాలున్నాయి. ఈమె కూడా నువ్వు నా వయసుని నిర్ధారించవలసిన అవసరం ఏ మాత్రం లేదన్నట్లు చూసి మధుకర్ వైపు తిరిగింది. తెలుగులో చక్కగా మాట్లాడుతున్న ఈ చరిత్రకారుడు కొంకణీలో ఏదో గణగణమనిపించాడు. ఆమె నన్ను వీడు ఇంతేనా అన్నట్లు చూసి ఓ చిరునవ్వు.. అతి చిరు నవ్వు ఒకటి పారేసి గబగబా లోనకెళ్ళిపోయింది!

“మనిషి మనిషిని చంపుకుంటూనే ప్రపంచ చరిత్రను అందరికీ పంచాడు.”

“కరెక్ట్”

“దాని వెనుక కథలతో నాకు పని లేదు”

“మరి?”

“ఈ అద్భుతమైన ప్రకృతిని ఇందరు ఎలా చూసారు? ఎందుకలా చూసారు? ఏమి చేసారు? అది కావాలి.”

దీర్ఘంగా చూసాడు మధుకర్.

“ఆలోచించాలి..” అన్నాడు. “..నిజమే. మట్టి అదే, గాలి అదే, నీరు అదే. దీనిని ఎంత దోచుకున్నా ఎక్కడికీ తీసుకెళ్ళలేరు. ఇక్కడ ఏం చేసారన్నది మంచి ప్రశ్న.”

“ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, బాగా పాతదైపోయిన ప్రతిది ఏదో తెలియని అందాన్ని దాచేసుకుందా అని ప్రశ్న ఎదురవుతుంది.”

మధుకర్ తన గదిని ఏదో వెతుకుతున్నట్లుగా పరికించాడు.

“అందంతో పాటు మనుగడ సాగించే పద్ధతి కూడా మరో ప్రపంచాన్ని చూపిస్తుంది”

“అక్కడ కథలు కనిపిస్తాయి”

ఆ పురాతనమైన చెక్క కుర్చీలోకి వెనక్కి జారిపోయి పళ్ళికిలించాడు మధుకర్.

“క్రింద ఆ కార్వాల్లో హోటల్ పెట్టుకోమన్నాడు కదూ?”

“అవును. ఆ హాల్లో మటుకే. నాకు అర్థం కాలేదు. ఆ హాలు ఒక్కడానికే యజమాని ఎలా అవుతాడు? అవునూ.. ఇది మీరు అద్దెకున్నదా? స్వగృహమా?”

“ఇది ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నది ప్రస్తుతం. దీని వయసు కనీసం ఆరు వందల సంవత్సరాలు. వారసత్వం నిలుపుకుని పోరాడి చివరకు ఆ కార్వెల్లో మిగిలాడు. ఆ హాలు ఒక్కటీ అతనికి చెందుతుందని నిర్ధారించారు. ఆ హాలు కొనాలన్నా ఎవరూ కొనలేరు. పోనీ వ్యాపారానికీ ఎవరూ ముందుకు రారు.”

ఆ మహిళ రెండు కప్పులు టీ తెచ్చి, నాలుగే నాలుగు విచిత్రమైన బిస్కెట్లు పెట్టింది. మా ఇద్దరికీ చక్కని విభజన చేస్తున్నట్లు మధ్యలో పెట్టింది.

“మీకు మూడు, నాకు ఒక్కటి” అన్నాను.

ఆమెకేమీ పట్టనట్టు వెళ్ళిపోయింది.

“మీరెలా ఉన్నారిక్కడ?” అడిగాను.

“ప్రభుత్వం వారు ఓ దర్జా ఇచ్చారు ఇలా. ఆ గొడవలు అన్నీ ముగిసే వరకూ ఇదిగో, ఈమె సహాయానికిచ్చి నన్ను ఇక్కడ పడి ఏడవమన్నారు. ఏదో పని చూపించాలి కాబట్టి పొద్దున్న పూట ఓ క్లార్క్ వస్తాడు.. ఇవాళ రాలేదు.”

“అంటే మీరు ప్రభుత్వం తరఫున ఏదో బృహత్కార్యం చేస్తున్నారన్న మాట”

టీ కప్పు పట్టుకునే లేచాడు.

“రండి” అంటూ లోపలికి తీసుకెళ్లాడు. పారాదిసో వాస్తవానికి పెద్ద భవనమే. లోపల చాలా గదులున్నాయి. నేను మెల్లగా వెనుక నడిచాను. ఒక కారిడార్ లోంచి ముందుకు వెళ్ళాం. ఈ మహిళ ఎదురవుతుందనుకున్నాను. ఎక్కడ దాక్కుందో తెలియలేదు..

కొద్దిగా చీకటిగానే ఉంది. జాగ్రత్తగా ఓ తలుపు తోసాడు. లోపలికి ముందు ప్రవేశించి నన్ను ఆహ్వానించాడు. లోపలికెళ్లి అలాగే నిలబడిపోయాను. కళ్ళు జిగేలుమన్నాయి. అదొక విశాలమైన హాలు. కనీసం ఓ నలభై పెయింటింగులున్నాయి. గోడల మీద శాశ్వతంగా ఉండిపోయిన దృశ్యాలు వాటి మీద ఒక్కొక్కటిగా పడుతున్న బల్బుల ప్రకాశం వలన మేలి ముసుగు తీసి నన్ను నువ్వెలా చూస్తావో నేను ఓ కంట చూస్తానులే అని చిరునవ్వుతో చెబుతున్న సుందరీమణులలాగా కనిపించాయి. ఈ లోకంలోకి వచ్చేసరికి నా వెనుక ఓ పడక కుర్చీ ఉందని, అందులో ఓ వయో వృద్ధురాలున్నదనీ అర్థమైంది. చర్మం ముడతలు పడ్డప్పటికీ ఆవిడ ముఖం లోనూ, కళ్లల్లోనూ కాంతి ఏ మాత్రం తగ్గలేదు. ఎంతో అందంగా నవ్వింది.

“ఈమె పేరు ఏంజెలినా”, చెప్పాడు మధుకర్. “..చుట్టూతా మీకు కనిపిస్తున్న చిత్రాలన్నింటినీ ఒక చోట చేర్చి ఒకే చిత్రంగా మలచినప్పుడు మీకు కనిపించే ఏకైక సజీవ శిల్పం!”

ఆ శిల్పం నిద్ర పోతోందో తెలియదు, ఆలోచిస్తోందో తెలియదు. పసిపిల్లల చిరునవ్వు పెదాల చివర ఓ గుర్తులా దాచుకున్నట్లు అలా వదిలేసి మధ్య మధ్యలో కళ్ళు తెరచి చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని బాధగా చూసి మరల దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ కాలం గడుపుతున్నట్లుంది.

గోడ వైపు చూసాను. అలల మీది నురగ నేలను తాకుతున్నప్పుడు ఆవిరైపోయే చిత్రీకరణ. సముద్రం మీది నల్లని మేఘాలు ఒక్కొక్కటీ ఇక్కడికి దూకుతున్నాయా అన్న ఆలోచన కలుగుతోంది. ఒక్కసారిగా చూస్తే అది గోడ అని ఎవరికీ అనిపించదు. సముద్రం ఎవరినైనా అలోచింప జేస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ పారాదిసోలో బంధింపబడినందుకో ఏమో ఇక్కడ సముద్రమే వింతగా ఆలోచిస్తున్నట్లుంది..

మధుకర్ ఫాన్ వేసి కిటికీ తలుపు ఒకటి వేసి కర్టెన్ తప్పించాడు. ఇక్కడ కూడా కాంతి ప్రసరించాలి అన్నట్లు సూర్యరశ్మి ఆ పరిసరాలను తాకింది. అది తాకిన వైపుకి నా దృష్టి మళ్ళింది. కొద్ది సేపు ఆలోచిస్తే కానీ ఆ చిత్రం అర్థం కాలేదు. పచ్చిక మధ్యలోంచి పొడుగ్గా ఒక స్తంభం లాంటి ఆకారం అలా ఆకాశం అంచుల్లోకి వెళ్లిపోయింది. దాని క్రింద అటు తిరిగి కూర్చున్న ఓ జంట వీపుల మీద ఆకుల నీడలును, వారి ప్రక్కన ఆకారం మార్చిన ఆ నీడలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ చెట్టు ఏమిటో అర్థమైంది. ఆ బొమ్మ ఫ్రేమ్‍కు గల బంగారు వన్నె గీతకు ఓ అంగుళం దూరంలో ఎండుటాకులు దాదాపు కదులుతున్నట్లే ఉన్నాయి..

మరో చిత్రం – పోర్చుగీస్ పద్ధతిలో భవనాలు అటూ ఇటూ ఉన్నాయి. వాటి మధ్యలోంచి దూరంగా సముద్రం కనిపిస్తోంది. అటువైపుగా వెళుతున్న ఓ జంట శరీరం మీద పూర్తి దుస్తులతో ఉన్నారు. కొద్ది దూరంలో ఓ జంట సగం దుస్తులతో, సముద్రానికి దగ్గర కేవలం ఈతకు వెళ్తున్నట్టు దుస్తులలో ఉన్నారు.

మధుకరి కిటికీ దగ్గర సిగరెట్ ముట్టించి బయటకు చూస్తున్నాడు. వాహనాల శబ్దం పెద్దదవుతోంది. కొద్దిగా అటు తిరిగాను. హోటల్లో నాలుగు టేబుళ్ళు, నలుగురు మనుషులు ఉన్నారు. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో అమ్మాయి నిలబడి ఉంది. తలుపు దగ్గర ఇద్దరున్నారు..

ఈ చిత్రాలు ఏదో అంతరంగంలో దీర్ఘకాలంగా మథనపడుతూ గీసినట్లున్నాయి. చూస్తున్నవాడు ఆలోచించాలనో లేదా ఏదో అర్థం చేసుకోవాలనో అనుకున్నారా లేక అనుభవాలను కాగితం మీద కథలలా కాకుండా కాన్వాస్ మీద అలలలా, ప్రతిబింబాలలాగా లేక ప్రతిరూపాలలా ఏదో వింత ధ్వనిని ప్రతిధ్వనించేలాగా ఉన్నాయి.

మధుకర్ కిటికీ మూసేసాడు. ఏంజెలినా కుర్చీ ప్రక్కన క్రింద పడిపోయిన శాలువా తీశాడు. జాగ్రత్తగా కప్పాడు. ఎదురుగా ఉన్న గోడ చివార్న అప్పటి వరకూ నేను ఓ పెయింటింగ్ అనుకుంటున్న తలుపును జాగ్రత్తగా తోసి నన్ను రమ్మని సైగ చేసాడు.

కొద్దిగా ఆగమని లైట్ వేసాడు. లోపలికి వెళ్లాను. లోపల ఏవో మ్యూరాల్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‍తో చేసిన కొన్ని బొమ్మలూ ఉన్నాయి. మధుకర్ జాగ్రత్తగా వాటి మధ్య లోంచి వెళ్ళి ఒక చోట నిలబడ్డాడు.

“ఇది ఎవరి శిల్పమో తెలుసా?”, అడిగాడు.

“ఇక్కడ సజీవంగా ఉన్నవాళ్ళనే పెద్దగా గుర్తు పట్టలేను. ఆ మాటకొస్తే ఇంటికెళ్ళాక నా వాళ్ళనే రెండు మూడు సార్లు చూడాల్సి ఉంటుంది.”

మధుకర్ నవ్వాడు.

“రచయితలు కేకు మీద ఐసింగ్ లాంటి వాళ్లు. ఈ ఐసింగ్ మాటలలో పడేసి కేకు కొనుక్కుందాం అనుకునే లోపు ఐస్‍లా జారిపోతారు.”

చెయ్యి అడ్డు పెట్టాను.

“మంచి నీళ్లల్లో కలుపుకుని తాగేస్తే చల్లబడతారు. ఇంతకీ ఎవరీయన?”

“చితర్‍కర్”

“పేరు విన్నాను”

“పేరే చితర్‍కర్. అంటే చిత్రాలను గీసేవారు. ఈ ప్రాంతం లోని అతి పురాతనమైన కళాకారుడు. ఆ హాల్లో కూర్చొని ఉన్న ఏంజెలినా కుటుంబానికీ, ఈయన కుటుంబానికీ తరతరాల నుండీ అనుబంధాలున్నాయి”

ఇద్దరం బయటకి వచ్చాం. ఏంజెలినా చిరునవ్వు చిందిస్తూ తన లోకంలో నిదురిస్తోంది.

“ఇవన్నీ ఈవిడ కళాఖండాలు” అన్నాడు మధుకర్.

ఆమె వెనుక గోడ మీద మరో సముద్రం కనిపిస్తోంది. నీలాకాశాన్ని సగం చేసి మధ్యలో క్షితజాన్ని చేర్చినట్లుంది. అక్కడక్కడ దిద్దిన రంగుల వలన ఆ సముద్రం లోతులో మరేదో ఉన్నదనిపిస్తోంది.

ఏంజెలినా ముఖం మీది చర్మపు ముడతల అంచున ఎన్ని క్షితిజాలు ఉన్నాయేమో అనిపించింది. మరో ప్రపంచం ఆమె ఎద లోపల నిదురిస్తున్నది. ఆ శబ్దాలు కనిపించీ కనిపించకుండా ఆమె శ్వాసనిశ్వాసాల ద్వారా వినిపిస్తోందా? ఏమో!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here