[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[చాలా కాలం క్రితం పోర్చుగీసు పద్ధతిలో కట్టిన ‘పారాదిసో’ అనే భవనంలోకి అడుగుపెడతాడు సుందర్. మధుకర్ గవడె అనే వ్యక్తి ఆహ్వానం మేరకు అక్కడికి వస్తాడు సుందర్. హాలులో ఎవరూ కనబడరు. దూరంగా ఓ తలుపు చాటున విచిత్ర వేషధారణలో ఉన్న ఒకతను కనబడితే, మధుకర్ గురించి అతన్ని అడుగుతాడు. తనకి తెలియదని చెప్తాడు. సుందర్ వెనక్కి తిరగగా అతను పిలిచి, తన కార్డు ఇచ్చి, తన పేరు కార్వాల్లో అనీ, ఆ హాలులో హోటల్ పెట్టే ఆలోచన ఉంటే మాట్లాడుదామని అంటాడు. ఇంతలో అక్కడికి మధుకర్ వస్తాడు. సుందర్‍ని తన గదిలోకి తీసుకువెళ్తాడు మధుకర్. తన గురించి చెప్తాడు మధుకర్. టీ తాగాకా లోపలికి మరో హాలులోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న పెయింటింగ్‌లను చూపిస్తాడు. ఆ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ఏంజెలినా అనే వృద్ధురాలిని పరిచయం చేస్తాడు. అక్కడ గీసిన చిత్రాలలో సముద్రం ఎంతో అందంగా కనిపిస్తుంది సుందర్‍కి. మరికొన్ని బొమ్మలు సుందర్‍ని ఆకర్షిస్తాయి. తరువాత మరో గదిలో ఉన్న మ్యూరల్స్ చూపిస్తాడు మధుకర్. అక్కడ ఉన్న చితర్‍కర్ అనే కళాకారుడి శిల్పాన్ని చూపించి, ఆయన గురించి వివరిస్తాడు మధుకర్. బయటకి వచ్చేటప్పుడు – ఆ కళాఖండాలన్నీ ఏంజెలినావేనని చెప్తాడు మధుకర్. చూసిన వాటిని మనసులో ముద్రించుకుని బయటకు వస్తాడు సుందర్. ఇక చదవండి.]
పంజీమ్ నుంచి కర్మాలి అనే ఊరుకు బయలుదేరాం. నాకు కేటాయించిన డ్రైవర్ సర్వకాల సర్వావస్థల యందు ఎందుకో నవ్వుతూనే ఉంటాడు. మొబైల్‍లో మాట్లాడుతూనే ఉంటాడు. ఆగినప్పుడల్లా ఓ గుడ్డ తీసుకెళ్ళి తుడుస్తూనే ఉంటాడు. ఎవరితో ఆ తెలియని భాషలో మాట్లాడుతాడో అర్థం కాదు. ఓ క్షణం ఆ పనయ్యాక, ఓ చిన్న సైజు పనుంది అంటే ఆపేసి విరగబడి నవ్వుతాడు. పని చూసుకుని తిరిగి వచ్చాకా, ఆ ఫోనులో మాట్లాడుతూనే ‘వచ్చావా?’ అన్నట్లు తల ఊపుతూ లోపలికెక్కి కూర్చుంటాడు.
ఏది ఏమైనా నన్ను, నా పిచ్చులను, వెర్రులను ఇంత ఓపిగ్గా చక్కగా అవగాహన చేసుకున్న వ్యక్తి తారసపడ్డందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.
కారు ముందుకు పోతోంది. మడ్‍గాంవ్‌కి, వాస్కోకి గల రైల్వే లైను అలా దూరంగా కనిపిస్తోంది. గోవా రాష్ట్ర రాజధాని ఐన పన్‍జిమ్‍కు రైల్వే స్టేషన్ లేదు. విమానాశ్రయం కూడా దూరమే. ఈ కర్మాలి అనే స్టేషన్ నుంచి పన్‍జిమ్‌కు రైలు పడితే బాగుండుననిపించింది. మొబైల్ మ్రోగింది.
“హలో”
“కిరణ్”
కిరణ్ నాకు హైదరాబాదులో రచనా వ్యాసంగంలో సహాయపడుతూ ఉంటాడు. చిన్న గీతలూ, పెద్ద గీతలూ కనిపించే నా వ్రాతను ఒక గీతలోకి తెచ్చి పెడుతూ ఉంటాడు.
“చెప్పు కిరణ్”
“మీరు పామిలా గార్డెన్స్‌లో సమీర్‌ని కలిసారా?”
ఆశ్చర్యం వేసింది. ఇతనికెలా తెలిసింది?
“అవును. కాకపోతే కొన్ని చిత్రమైన పరిస్థితులలో కలిసాను. ఇంకా అతను సమీర్ కుమారేనా అనే అనుమానం కూడా ఉంది”
“అతను సమీర్ కుమారే సార్”
“మీకెలా తెలుసు? అవునూ, నేను పామిలా గార్డెన్స్‌లో కలుసుకున్నట్లు ఎవరు చెప్పారు?”
“అదంతా తరువాత చెబుతాను సార్. నేను ఫోన్ చేసింది ఎందుకంటే..”
“ఎందుకని?”
“ఎవరు మిమ్మల్ని కాల్ చేసి అతని గురించి అడిగినా తెలీదని చెప్పండి”
“ఏదైనా పెద్ద సమస్యా?”
“అవును. నిర్మాతలూ, దర్శకులూ, ఆఖరుకి కొన్ని ఇతర సంస్థలూ కూడా వెతుకుతున్నారు”
“ఓ. నిర్మాతల గురించి వదిలెయ్యండి. ఇతరులు ఎందుకు?”
“ఇప్పుడొద్దు లెండి. తరువాత చూద్దాం. ప్రస్తుతానికి ఇది చాలు. ఉంటాను. గోవా బావుందా?”
“గోవా ఎప్పుడూ బాగానే ఉంటుంది”
“ఎన్‍జాయ్ సార్”
ఫోన్ కట్ చేసాడు. ఏం జరిగుంటుంది ఈ సమీర్‍కు?
కర్మాలి లోకి వచ్చినట్లుంది కారు. డ్రైవర్ ఒక షాపు ముందు ఆపాడు.
“కాఫీ?” అన్నాడు. వాడికి ఇంత మర్యాద ఎందుకో అర్థం కాలేదు.
“వద్దు..” అన్నాను. “గుడికి పద”
నిన్ను ఎవరూ బాగు చేయలేరన్నట్లు నవ్వాడు. కార్ స్టార్ట్ చేసాడు.
“మీరు కాఫీ త్రాగుతుండగా ఈ గుడి గురించి చెబుదామనుకున్నాను..” అతను అన్నాడు. “..అందుకు ఆపాను. నేను కాఫీ, టీ ఏదీ త్రాగను!”
“పోనీ ఇప్పుడు..”
“ఇప్పుడు కూడా త్రాగను”
“కాదు. ఇప్పుడు చెప్పు”
“ఐదవ శతాబ్దపు గుడి సార్ ఇది. పన్నెండవ శతాబ్దంలో దానిని పెద్దది చేసారు.”
“ఇంకా?”
“ఇంతకంతే ఇంకేమీ తెలియదు సార్”
ఈసారి నవ్వటం నా వంతయింది. ఈ మాత్రం చెప్పటానికి దారిలో కారు ఆపి కాఫీ త్రాగమంటాడు. నాతో పాటు అతనూ నవ్వాడు. గుడి వెళ్ళే లోపు మరలా మొబైల్ పట్టుకున్నాడు. గుడి పెద్దదేమీ కాదని విన్నాను.
కారు దిగి జాగ్రత్తగా చూసాను. ఒకప్పుడు కూడా ఇది చిన్న గుడే అయి ఉండాలి. ఎన్నో మార్పులకి గురైనట్లు తెలుస్తోంది.
మెల్లగా లోపలికి నడిచాను. బ్రహ్మ యొక్క విగ్రహం దాదాపు ఆరడుగులుంది. శిల్పం అందంగా ఉంది. పరిసరాలు మామూలుగా ఉన్నాయి. నమస్కారం చేసుకుని ఇవతలికి వచ్చాను.
అలా రోడ్డు వైపు నడుస్తూ ఎందుకో ఆగాను. నా ఎదురుగా ఓ రాయి మీద ఓ అమ్మాయి కూర్చునుంది. పావురం రంగు చీరలో, అదే రంగు రవికలో ఎంతో అందంగా ఉంది. చేతిలో ఓ కాగితాల పాడ్ ఉంది. జాగ్రత్తగా చూస్తే ఆ గుడి స్కెచ్ వేస్తున్నట్లుంది. తల ఎత్తి పైకి చూసింది. నేను అడ్డమేమోనని ప్రక్కకి జరిగాను. నన్ను పట్టించుకోలేదు. అటు ప్రక్కగా వెళ్లి లాన్‍లా ఉన్నచోట చతికిలబడ్డాను. స్కెచ్ పూర్తయినట్లుంది. భుజాన ఉన్న బాగ్ లోంచి ఓ పుస్తకం తీసి ఏదో చదవటం ప్రారంభించింది.
“మధుకర్” ఎందుకో గట్టిగా అన్నాను.
నన్ను ఓ చూపు చూసి మరల పుస్తకం లోకి వెళ్లిపోయింది.
ఎందుకో తలెత్తి “తెలుగా?” అంది. ఇదేంటి? నేనేమీ మాట్లాడలేదే.
“ఎలా చెప్పారు?” అడిగాను.
పుస్తకం చూపించింది. దాని మీద ‘మధుకర్’ అని తెలుగులో ఉంది.
“ఓ” అన్నాను.
“ఈ గుడికి రోజుకి ఇద్దరి కంటే రారనిపిస్తోంది” నవ్వుతూ అంది.
కొద్దిగా దగ్గరకు వెళ్లాను.
“ఏమంటాడు మధుకర్ ఈ గుడి గురించి?”
“మధుకర్ ఏంటి అంత దగ్గరివాడా మీకు?”
“అవును. నిన్ననే కలిసాను”
చిరాగ్గా మొహం పెట్టింది
“ఇలా ఎందుకు చాలామంది మాట్లాడుతారు?”
“అదేంటి? నేను నిజం చెబుతున్నాను.”
ఆమె లేచింది. కొంత దూరం అలా నడిచాం.
“మధుకర్ గారి పుస్తకాలలో ఉన్నది నమ్మవచ్చంటారా?”
“చాలా చిక్కు ప్రశ్న మేడమ్!”
“ఈ మేడమ్‍కి పేరుంది”
“మంచి పేరు అనుకున్నాను”
ఆగిపోయింది.
“మీరు కథలు వ్రాస్తారా?”
“అవును”
“ఎలా చెప్పానో తెలుసా?”
“ఎలా?”
“ఈ మాటలు వింటుంటే తెలియటం లేదూ? పేరు, మంచి పేరు.. రకరకాల అర్థాలు..!”
“మీరేం చేస్తూ ఉంటారు?”
“పేరు సంపాదిస్తూ ఉంటాను”
“ఏవండీ, ఆట పట్టించేందుకు నేనే దొరికానా?”
“ఇంతకీ మీ పేరు?”
“సుందర్”
కొంత ఆలోచించింది.
“మరి మీ మంచి పేరు కూడా చెబితే వినేస్తాను”
ఎందుకో అటూ ఇటూ చూసి చిరునవ్వు నవ్వింది. కొద్దిగా తల వంచింది.
“చిత్ర”
“..”
“ఇప్పుడు ఈ పేరు ముందు జయ, విజయ, ఇలాంటివి ఉన్నాయా లేవా అని అడక్కండి”
“నాకు ఒక విషయం అర్థమవుతోంది”
“ఏంటది?”
“మీరు చాలా మంది రచయితలతో అనవసరమైన అనుబంధాలు లేదా పరిచయాలు ఎక్కువగా పెట్టేసుకున్నట్లున్నారు”
విరగబడి నవ్వింది. అటూ ఇటూ ఊగిపోయింది. ఆమె జడ కదలినప్పుడు వదులుగా ఉన్న ఆ ముంగురులు గాలికి ఎగిరినప్పుడు ఏదో అందం ఎక్కడో కదిలించేటట్లు కనిపించింది.
“అలా ఏం లేదు. కానీ రచయితలతో చాలా జాగ్రత్తగా ఉంటాను”
“ఇంకా ఏం చేస్తూ ఉంటారు?”
“రచయితలతో జాగ్రత్తగా ఉండటం పెద్ద పనేమీ కాదు”
“మీకు రచయితలతో పని లేదు. అర్థమైపోయింది. అసలు ఏం చేస్తూ ఉంటారు?”
అక్కడ వరుసగా కొన్ని బెంచీలున్నాయి. ఓ బెంచీ మీద కూర్చుంది. పర్స్ లోంచి ఓ కార్డు తీసి ఇచ్చింది.
చిత్ర అని ఉంది. దాని క్రింద ఓ రెడ్ కెమెరా బొమ్మ ఉంది. ‘డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్’ అని వ్రాసి ఉంది. ఈమె బెంగుళూరుకు చెందినట్లు తెలుస్తోంది.
“ఊ. మరి కెమెరా ఏది?”
“అదే తేడా. మేం మీలా ఓ చోట కూర్చుని అలా మనసులో మెదిలిన ఆలోచనలని కాగితాల మీద పెట్టి కళ్ళు మూసుకుని పడుకునే వాళ్లం కాదు”
ఏంటి ఈ అమ్మాయి? కలిసి పట్టుమని పది నిమిషాలు కాలేదు. కడిగి పారేస్తోంది?
“అది నిజమో కాదో తరువాత చెప్పుకుందాం. మరి ఏం చేస్తారన్న ప్రశ్న మిగిలిపోయింది”
“మేము నిజమే చెబుతాం. ఇక్కడ దాచేందుకేమీ లేదు. ఎంతో పరిశోధన చేసి కెమెరాలో బంధించి ఇదిగోండి ఇదీ కథ అని చెబుతాం”
“మేము ఏం చేస్తామని మీ అభిప్రాయం?”
మంచి నీళ్ళ బాటిల్ తీసి గడగడా త్రాగింది. చివరికి గుటక బుగ్గల మధ్యలో బుడగలా ఆపి నన్ను చూస్తూ బాటిల్ మూత బిగించింది. ఏ మాత్రం ఎక్కువ మాట్లాడినా నా మీద ఊసేస్తుందనిపించింది. అలా జరగలేదు. నిదానంగా మ్రింగి చెయ్యి అడ్డం పెట్టింది.
“చేతికొచ్చింది వ్రాసి ఇది నమ్మండి అంటారు”
“ఊ.. నమ్మమని ఎవరూ అడగరు. సృష్టి లోని నిజాలను కళ్ళతో చూసినా చాలామంది నమ్మరు. రచన నమ్మకాలను బట్టి సాగదు, నమ్మించేందుకు అంతకంటే సాగదు. ఇంతకీ మధుకర్ ఈ మందిరాన్ని గురించి ఏమంటాడు?”
పుస్తకం తీసి పేజీలు తిప్పింది.
“కర్మాలి అనేదీ కారంబోలిమ్ అని కూడా పిలవబడుతుంది..” చదువుతోంది. “..డొమినికన్ వాళ్ళు 1560 నుండి 1812 లోపల దాదాపు 270 ఆలయాలను ధ్వంసం చేసారు. ఈ కాలంలో ఓ ఇరవై సంవత్సరాలు బ్రేక్ వచ్చింది. సత్తారి అనే ప్రాంతం 1773-75 లో పోర్చుగీస్ వారి చేతిలోకి వచ్చింది. పోర్చుగీసు వారు ఎంతో మందిని హింసించినా ఈ ప్రాంతంలోని రాణేలకు ఎంతో భయపడేవారు. అందువలన హిందూ దేవాలయ్యాల్లోని విగ్రహాలను ఇక్కడికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారంటాడు. ఈ బ్రహ్మ విగ్రహాన్ని సత్తారి లోని నాగర్‍గాంవ్‌కి కర్మాలి నుండి తెచ్చినట్లు ఆధారాలున్నాయట.”
టక్కున లేచింది.
“రండి” అంది. వెనుకనే నడిచాను. తూనీగ కూడా కొద్దిగా ఆగుతుందేమో. అలా చకచకా పరుగులు తీసేస్తోంది. ఇంతకీ నా మీద ఈ పెత్తనమేంటో అర్థం కాలేదు! గుడి వెనుక భాగానికి తీసుకెళ్ళింది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ మాటకొస్తే గోవాలోని ఏ చక్కని ప్రదేశాని కెళ్లినా ముందుగా ఆకట్టుకునే అంశం ప్రశాంతత ఒకటి. అక్కడ ఎత్తుగా ఉన్న చోట ఓ వృక్షం కనిపిస్తోంది.
“ఇదేమిటో తెలుసా?” అడిగింది.
“ఆ పుస్తకంలో మధుకర్ చెప్పి ఉంటాడు”
“కాదు. దగ్గరగా రండి. ఇక్కడ వ్రాసి ఉంది”
నిజమే అక్కడ ‘కదంబ’ అని ఉంది.
“ఇప్పుడు దీని చరిత్ర చెబుతారా?”
“అక్కరలేదు. నిజానికి ఈ ప్రాంతానికీ, కదంబ వృక్షానికీ, కదంబ రాజుల పరిపాలనకీ ఎంతో అనుబంధం ఉంది. ఈ కదంబ వృక్షం మన పురాణాలలో ఎంతో మహిమాన్వితమైనదని చెప్పారు. అమ్మవారిని కదంబవనప్రియవాసిని అంటారు. ఒక బ్రాహ్మణుడు స్థాపించిన రాజవంశం ఈ కదంబ వంశం!”
అక్కడ పూజారి ఎందుకో తల ఆడిస్తున్నాడు.
“ఇది పవిత్రమైనది. నమస్కారం చేస్కోండి” అన్నాడు.
నమస్కారం చేసుకుని గుడిలోంచి బయటకు వచ్చాం.
దీర్ఘాలోచనలో పడిపోయాను. మనతో కాలానికి ఏ సంబంధమూ ఉండదు. మనం కాలం లోకి వచ్చాము. చుట్టూతా ఉన్న ఈ ప్రకృతి ఎప్పటికీ ఉన్నదే. దీనితో పెట్టుకున్న సంబంధమే చిత్రమైనది. ఈ చిత్ర ఎవరో కానీ ఏ మాత్రం కొత్త లేదు. ఎప్పటి నుండో పరిచయం ఉన్నవాడితో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతోంది. ఈసారి నా అడుగులు వేగంగా సాగుతున్నాయి. ఆమె నా వెనుక నడుస్తోంది.
“ఏంటి మాస్టారూ! అలా ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నారు?”
“కదంబ వ్యవహారం ఆలోచింపజేస్తోంది”
“ఊ. చెప్పానుగా రచయితల గురించి? అందరూ ఇంతే. ఆ పూజారి గారు మనలని నమస్కారం చేసుకోమన్నందుకూ, మనం కలిసి ఒకేసారి నమస్కారం చేసుకున్నందుకు, ఇద్దరికీ ఏదో అయిపోతుందనే ఒక స్పందన కలిగిపోయి ఓ సినిమా ఇంతలోనే, అదే షార్ట్ ఫిల్మ్ చూసేసి అర్జెంటుగా ఏమి వ్రాయాలి అని ఆలోచిస్తున్నారు. అంతే కదూ?”
నవ్వీ నవ్వకుండా అలా ఆమెనే చూస్తూ నిలబడి పోయాను. ఎందుకో అలా ఆగిపోయి కొద్దిగా సీరియస్‍గా చూస్తోంది.
“ఏమంటారు?” మరల అడిగింది.
“నా కారు అదుగో అక్కడుంది” అన్నాను. అటు చూసింది.
“ఓహో, నేనన్నది నిజమేనన్న మాట. వెళ్ళిపోదామా కారులో అనేగా అడుగుతున్నారు?”
వామ్మో! ఏంటి ఈ స్పీడు?
“కాదు నేను వెళ్ళే సమయం అయింది అంటున్నాను. ఎక్కడన్నా డ్రాప్ చెయ్యాలా అని అడుగుతున్నాను. కదంబ వృక్షం వలన మనకేమీ జరగదు. భయపడవద్దు.”
“నా కార్డు మీ దగ్గరుంది”
“అవును మొబైల్ నెంబరు ఉంది. పలకాలనుకుంటే పలకండి. రచయితనే. మీరనుకున్నట్లు పనికిమాలినవాడిని కాను.”
గట్టిగా నవ్వింది.
“ఆ మాట అనలేదు. మీరు కార్డు ఇవ్వరా?”
“మేము సెలెబ్రిటీలం కాము. నెంబరు కొడతాను. సేవ్ చేస్కోండి. మీకు ట్రాన్స్‌పోర్ట్ ఉందా?”
“వుంది. వస్తుంది. సీ యూ!”
నా డ్రైవర్ అప్పటికే పళ్లికిలిస్తున్నాడు.
(ఇంకా ఉంది)