పూచే పూల లోన-35

0
11

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కేఫ్ నుంచి బయల్దేరుతారు జో, సుందర్. పెండుకుళి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అని సుందర్ అడిగితే, దాని గురించి జో వివరిస్తాడు. సాయాజీ గారి నుంచి తాను నేర్చుకున్నవాటి గురించి చెప్తాడు. కామవాంఛ పెంచడంలో పెండుకుళి ప్రభావం గురించి విన్న సుందర్ ఆలోచనల్లో పడతాడు. పెండుకుళి రహస్యాన్ని ఈ విధంగా వాడటం సాయాజీ చేస్తున్న తప్పు కదా అని సుందర్ అంటే, ఆయన దాన్ని మందులానే వాడారు, జనాలే దాన్ని స్వార్థంగా వాడుకుంటున్నారని అంటాడు జో. గూండాలు అక్కడ కట్టి పడేసిన వ్యక్తి సామాన్యుడు కాడనీ, పెండుకుళికి మరో ఆకు కలిపి సాయాజీ గారి దగ్గర ఓ మందు తీసుకుని, తన అక్రమ శారీరక సంబంధాలు బయటపడకుండా చూసుకునేవాడని చెప్తాడు. తిరిగి ఆ భవనం వద్దకి చేరతారు జో, సుందర్. పాడుబడ్డ గేటును తోసుకుని లోపలికి వెళ్తారు. జో చిన్నగా ఈల వేసేసరికి అక్కడ కునికిపాట్లు పడుతున్న వాచ్‍మన్‍ లేస్తాడు. లోపల లైట్ ఉందా అని అతన్ని అడుగుతాడు జో. లేదంటాడు. మొబైల్ లైట్‍లో చూడగలరా అని సుందర్‍ని అడుగుతాడు. మరో దారి లేనప్పుడు తప్పదంటాడు సుందర్. అక్కడ ద్వారం పక్కన ఉన్న టైల్ మీద రాసి ఉన్న ‘ఏంజలినా కుబెర్టిన్’ పేరుని చూసి, ఆ పేరుని ఎక్కడో విన్నానని అంటాడు సుందర్. ఎక్కడ విన్నావని జో అడిగితే, గవడే గారింట్లో ఉంటారావిడ అని చెప్తాడు. అది ఆమె భవంతి అని, అద్భతమైన పెయింటింగులు వేసిన మనిషి అనీ, ఆమె ఆర్టిస్ట్ మటుకే కాదు, చరిత్రను అనుభవించి కళాఖండాలను సృష్టించిందని చెప్తూ. లోపల ఉన్న పెయింటింగులను చూపిస్తాడు జో. అక్కడ ఉన్న ఓ బొమ్మని చూపించి – ఆ సాయంత్రం జ్యోతి గట్టిగా అరచి క్రింద పడిపోయి ఈ భంగిమ లోనే ఏడవటం ప్రారంభించింది, అవునా అని జో అడగడంతో, అవునన్నట్లు తల ఊపి సుందర్ దీర్ఘంగా నిట్టూరుస్తాడు.]

[dropcap]పె[/dropcap]యింటింగ్‌ను జాగ్రత్తగా చూసాను. సామాన్యంగా ఎవరైనా కన్యనో లేక ఇతర స్త్రీనో హింసించినప్పుడు ఆ విధంగా ముడుచుకుని పోయి ఆర్తనాదం చేయటం చూస్తాం. జ్యోతిని ఆ విధంగా ఎవరు చేయలేదే? సరిగ్గా ఈ భవంతిలోకి అడుగుపెట్టే ముందరే ఈ అమ్మాయికి ఇటువంటి స్పందనలు ఎలా ఏర్పడ్డాయి? ఇందులోని బొమ్మలతో బాగా పరిచయం ఉన్న జోవాక్విమ్‌కి ఎక్కడో ఏదో మెరిసి మరో ప్రపంచం లోకి తొంగి చూస్తూ అధ్యయనం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

“నీకేమనిపిస్తోంది?”, ఆడిగాను.

“ముందరైతే వింతగా ఉంది.”

“ఒక్కోసారి ఎంచుకున్న విషయంలోకి దీర్ఘంగా లోతుగా వెళ్ళిపోయిన వారు అందులోంచి ఇవతలకి రాలేక పరకాయ ప్రవేశం చేసి తిరిగి వారి అస్తిత్వంలోకి రానందుకు మరో వ్యక్తిలా ప్రవర్తిస్తారు. స్కిజోఫ్రినియాలా వైద్యులు వర్ణిస్తారు.”

జో అక్కడున్న విరిగిపోయిన చెక్క బల్ల మీద కూర్చున్నాడు.

“ఈ అమ్మయి రీసెర్చ్ చేస్తోందా?”

“అని నేననుకోను.”

“ఏం చేస్తోంది?”

“పెయింటింగ్ తన హాబీ”

“ఈ గోడల మీద, లోపల, ఇంకా ఎన్నెన్నో చిత్ర విచిత్రవైన బొమ్మలున్నాయి. మనిషి దౌర్జన్యం ఎంత దూరం వెళుతుంది అనేందుకు నిదర్శనాలు”

“చూద్దాం.”

“కొద్దిగా ధైర్యం ఉండాలి”

జో ని జాగ్రత్తగా చూసాను.

“అవునూ, ఇవన్నీ మాకు చూపించాలని ఎందుకనిపించింది?”

“సమీర్ ఆదేశం!”

ఆలోచించాను. సమీర్‌తో ఏదో మామూలు సహచర్యం అనుకున్నాను. అతను ఏదో ఒక విచిత్రమైన పథకంలో అన్నట్లు అర్థమవుతోంది. అలా కాజువల్‍గా కనిపించినా ఎంతో జాగ్రత్తపడపడి కూడా, పోలీసులు ప్రత్యక్షం అయ్యే సమయానికి చక్కగా ఎక్కడికో పోయి దాక్కున్నాడు.

“ఎక్కడున్నాడు సమీర్?”

జో గెడ్డం గోక్కున్నాడు.

“అది చెప్పను కానీ మీరు కలవాలనుకుంటే పిలిపించగలను”

“వద్దు. ఇంతకీ ఎందుకు చూపించమన్నాడు?”

“నాకు తెలియదు. రండి. గుండె ధైర్యం ఉందా?

“జో.. ఈ సజీవ శిల్పాలు ఒకప్పటి మానవ జీవితాలకు ప్రతిబింబాలు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఆ కాలంలో బ్రతికి ఉండటం. అంతే కదా? ఎంతగానో ఆ చిత్రహింసలను అనుభవించిన వారి బాధ ఊహకు అందనిది. వారి చిత్రాలను కూడా చూడలేని వారమా?”

“రండి”

లోపలికి వెళ్లాం. మొబైల్ లోంచి లైటు వెలుగుతోంది. లోపల ఒక పెద్ద హాలు ఉంది. ఎదురుగా ఉన్న గోడ మీద ఒక చాలా పెయిటింగ్ ఉంది.

నలుగురు మనుషులు ఒకడిని క్రింద పడుకోపెట్టి కాళ్లతో తొక్కుతున్నారు. అతన్ని సంకెళ్లతో బిగించినట్లు కనిపిస్తోంది. అక్కడక్కడ ఇవతలకి తొంగి చూస్తున్న ఎముకల మీదుగా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. బాధతో తల పూర్తిగా మా వైపు ఒరిగి ఉంది. వెల్లకిలా పడుకోపెట్టి చిత్రహింసలు పెడుతున్నట్లుంది. ఒకడు సంకెళ్లను జారవిడుస్తూ అతని కళ్లల్లోకి అప్పుడప్పుడు గుచ్చుతున్నాడు. అలా హింస పెడుతున్న వ్యక్తుల ముఖాలను పరిశీలించాను.

“ఎవరిని చూస్తున్నారు?” జో అడిగాడు.

“ఈ పని అప్పగింపబడిన వారిని చూస్తున్నాను”

“వారిలో స్పందనలుండవు, వధశాలలో పని చేసేవారికి రక్తానికీ, నీటికీ మధ్య వ్యత్యాసం ఉండదు. హింసింపబడుతున్న మనిషి ఎవరిని చూస్తున్నాడో ఆలోచించండి”

ఎవరిని చూస్తాడు? చూసేందుకేముంది? ప్రాణం ఎందుకు పోవటం లేదు అనే ఆలోచనకు లోనై క్రూరమృగాలు కూడా చేయని చేష్టలకు అలవాటు పడి మనుషుల మధ్య పనికిమాలిన మరో మానవునిగా మరల జన్మించకూడదనే నిశ్శబ్ద ఆర్తనాదం చేయటం తప్ప?

అతని కళ్ల వైపు చూసాను. జో అన్నది నిజమే. కళ్ళు విప్పారి ఉన్నాయి. వెల్లకిలా పడుకుని ఉన్నప్పుడు తన వెనుక ఎవరున్నారు అని కలలో చూస్తున్నాడా? సహాయం అర్థిస్తున్నాడా? ఆ ఆలోచన ఎన్నడో మానుకునుంటాడు. ఇటు తిరిగాను. మొబైల్ లోని లైటులో జో ఆ జుట్టులో, గెడ్డంలో రకరకాల ఆలోచనలను రేకెత్తిస్తున్నాడు. అతను ఆ లైటును నా కోసం ఈ పెయింటింగ్ ఉన్న గోడ ఎదురుగా ఉన్న గోడ వైపుకు మరలించాడు. నా శ్వాస నిశ్వాసలు ఎందుకో అప్పుడప్పుడు బిగుసుకుని, మధ్యలో ఎవరినో విదిలించుకుని, అలా తేరి, ఇలా ఆరి నాతోనే ఆడుకుంటున్నాయి.

ఎదురుగా అన్నాది నిజం కాదు, కేవలం బొమ్మే అయి ఉంటే బాగుందనిపించింది. అలా ఎవరైనా చెప్పగలరా? వారిని వెతకాలనిపించింది.

ఇద్దరూ బలిష్ఠులు ఒక స్త్రీని నగ్నంగా మధ్యలో ఉంచి ఇతనికి చూపిస్తున్నారు. ఒకడు ఇతన్ని చూపిస్తున్నాడు. మరొకడు ఆమెను అతనికి చూపిస్తున్నాడు. దైన్యంతో కళ్లు మూసుకుంటున్న ఆమె కంటిని తెరిచి పట్టుకున్నాడు. వాడి ముఖంలో వెకిలి నవ్వు కనిపిస్తోంది..

ఏమి చేయలేక కళ్ళు మూసుకున్నాను. ఎందుకో తెరచి మొదటి పెయింటింగ్ చూసాను.

“ఆ కళ్లు ఏమంటున్నాయి?” జో మార్దవమైన కంఠంతో అడిగాడు.

“చెప్పలేను”

అతను నా భుజం తట్టాడు.

“మీ మాటలలో వినాలనుంది. సమీర్ మీ గురించి చాలా చెప్పాడు”

“ఏ దైవాన్నైతే నమ్ముకొని ఉదయమే లేచి ప్రార్థించి ఊళ్లోకి వెళ్లానో, పూచే ప్రతి పువ్వులోనూ ఏ దైవాన్నైతే చూపి తరించానో, మబ్బుల వెనుక చంద్రుడి లీలను సృష్టిలోనున్న అద్భుతం అనుకున్నానో, సూర్యోదయం ఒక సుందరమైన ఈశ్వరుని విన్యాసం అనుకున్నానో, అదంతా అబద్ధం కదా? ఈ పరిస్థితిలో స్పష్టిలో ఉన్నది ఏమీ లేదు. బాధా లేదు, దుఃఖం లేదు. లీలా లేదు, నిజం లేదు. ఉన్నది హింస ఒక్కటే. ఒకవేళ ఈ దింపుడు కళ్ల ఆశతో ప్రాణాలు కోల్పోయి స్పష్టికర్త ముందర నిలబడితే – నీ సృష్టి నీ లాగే ఎంతో అద్భుతంగా ఉంది. నీక్పిప్పుడేం కావాలి అని నేనే అడగాలి అనుకుంటాను. పంచేంద్రియాలతో, పాంచభౌతికంగా ఏ జన్మ అక్కరలేదు. అవసరమే అనుకుంటే ఓ చిన్ని మొక్కలో అతి చిన్న పువ్వుగా పుట్టి అలానే రాని పోనీ.. ఈ బాధితుడే రచయిత అయితే..”

జో తల ఆడిస్తూనే ఎందుకో చిరునవ్వు నవ్వాడు.

“యస్”

“ఈ బాధితుడే రచయిత అయితే ఆ సృష్టికర్త ముందర నిలబడి నీ మాడర్న్ ఆర్ట్ ఏం బాలేదని గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు”

జో లైట్ బంద్ చేసాడు. ఒక్కసారి చిమ్మ చీకటి. అలాగే నిశ్శబ్దం కమ్ముకుంది.

“ఇవి కల్పనలా? లేక ఎవరైనా కావాలని నిజాలు తెలియాలని వేయించిన పెయింటింగులా?”

“సార్, ఇంక్విసిషన్ అనేది ప్రాపంచిక చరిత్రలోనే అతి దారుణాతి దారుణమైన ప్రక్రియ. పది మందికీ తెలియపరచేందు కోసం హింస జరుగుతున్నప్పుడు వేయించిన పెయింటింగులివి.  సరిగ్గా వెయ్యకపోతే ఆ కళాకారుని కూడా హింసపెట్టేవారు. నేను చీకటి చేసింది నాలో కలిగిన అలోచనను చెప్పటానికి..”

“చీకటి ఎందుకు?”

“గుడ్డివారు ఎవరు?”

“కంటి చూపు లేని వారూ, కళ్ళు లేని వారూ”

“కరెక్ట్”

“చీకటిని చూడగలిగిన వారు?”

“జీవితం గురించి తెలుసుకున్న వారు”

కొద్ది సేపు జో ఏమీ మాట్లాడలేదు. మెల్లగా అన్నాడు,

“చీకటినే చూసేవాడు?”

“మరొకరి జీవితంతో పని లేని వాడు”

అతను మరో భాషలో తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది.

“చీకటిలో చూడగలిగే వాడు?”

ఆలోచించాను. ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను -”నిరంతరం శోధిస్తూ ఆత్మ జ్యోతిని వెలిగించుకునే వాడు”

“బాగుంది. అటువంటి వారు ఇలాంటి పనులు చేయవచ్చా?”

“స్వామి వివేకానంద 1893లో ఒకసారి రాచోల్ సెమినరీకి వచ్చారు. అక్కడ మూడు రోజులున్నప్పుడు ఆయన వ్రాసిన మాటలు గుర్తుకొస్తున్నాయి.”

జో రికార్డ్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది..

“..భారత దేశంలో ప్రచారం చేయబడుతున్న క్రైస్తవ మతం ఎంతో భిన్నమైనది. ఆయన ఈ మాటలు శ్రీలంకకు చెందిన ఒక బౌద్ధ భిక్షువు ధర్మపాలుడినే ఆయనకి చెప్పారు. ‘ఎపిస్కోపల్, ప్రెస్బిటేరియన్ చర్చ్ ల్లోని ఎందరితోనో నాకు పరిచయం ఉంది. వారు మీ మతంలో చెబుతున్నట్లు ఎంతో విశాల హృదయులు, శ్రద్ధావంతులు. నిజమైన తత్త్వవేత్త, అన్ని చోట్ల ఎంతో ఉదారంగా ఉంటాడు. అతనిలోని ప్రేమ అలా చేయిస్తుంది. మతుమన్నది ఎవరికైతే వ్యాపారమో వాళ్ల బుద్ధి సంకుచితమవుతుంది. మోసానికి పాల్పడతారు. వాళ్లు మతం లోకి పోటీ, పోట్లాట, స్వార్థం, తగువు, హెచ్చుతగ్గులు తీసుకుని వస్తారు.’ – ఇక్కడ మతం కేవలం వ్యాపారానికి ముడిబడి వచ్చింది. ఆ కాలంలో తూర్పుకు తిరిగి దండం పెట్టుకునే వారిని, అటు తిరిగి నమాజ్ చేసుకునే వారిని క్రైస్తవ మతంలోకి దౌర్జన్యంగా మార్పిడి చేసి హింసించారు. పోర్చుగీస్ వారు ఇక్కడి స్పైస్ వ్యాపారాన్ని చేతిలోకి తీసుకునే క్రమంలో దారుణానికి ఒడిగట్టారు. 1510, 11, 1515 సంవత్సరాల నుండి పోర్చుగీస్ వారిని ఇక్కడి స్థానికులను వివాహాలు చేసుకునేందుకు ప్రోత్సహించి ఒక అతి పెద్ద యూరేసియా జనాభాని సృష్టించారు.

ఆల్బుఖర్ఖ్ హయాంలో 1540లో ఇక్కడికి ఈ ఇంక్విసిషన్ వచ్చింది.”

జో లైట్ వేసాడు.

“నా ఆలోచన చెబుతాను”

“యస్”

“ఇతరులు నీ పట్ల ఎలా ఉండాలనుకుంటావో వారి పట్ల నీవలా ఉండు అన్నది క్రైస్తవ సిద్ధాంతం.”

“కరెక్ట్”

“మరి ఇతరులు వారి మతంలోకి రమ్మని చెప్పినప్పుడు వారిని మరో మతంలోకి ఎందుకు మారుస్తున్నారు?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here