పూచే పూల లోన-37

0
10

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పాడుబడిన ఆ భవనంలోని పెయింటింగులను చూస్తూ మతమార్పిడి గురించి మాట్లాడుకుంటారు జో, సుందర్. జో మాటలని బట్టి చూస్తే బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడని అనుకుంటాడు సుందర్. అక్కడ ఉన్న ఆరు కోణాల బొమ్మని చూపిస్తాడు జో. అది స్టార్ ఆఫ్ డేవిడ్‍ అని చెప్తే, జ్యూల మతచిహ్నం కదా, ఇక్కడ ఉందేమిటి అని అడుగుతాడు సుందర్. ఆ భవనంలోని పెయింటింగులన్నీ ఒక్కసారి వేసినవి కావనీ, ఎప్పటి నుంచో వస్తున్నాయని చెప్తాడు జో. కొన్ని తరాల జీవితాలే ఇతరుల పాలన వలన ఎన్నో వాయిదాలు పడిపోయాయనీ, తమవి జీవిత ఖైదీ జీవితాలని అంటాడు జో. తాము పెరినియల్స్ పూల వంటి వాళ్ళమని అంటాడు. సుందర్‍ని ఏదైనా మాట్లాడమని అంటాడు. సుందర్ కిటికీలోంచి చూస్తుంటే, ఏం చూస్తున్నారనీ అడుగుతాడు జో. ‘ఏ మూలనో దాగుంది యథార్థం.. ముళ్లలోనూ, మామూళ్లలోనూ మూలుగుతోంది మానవత్వం’ అంటాడు సుందర్. ఆ జ్యూ చిహ్నం ఇక్కడెందుకుందో చెప్పలేదని అంటాడు సుందర్. ఆ జ్యూ చిహ్నం వెనుక ఉన్న కథని వివరిస్తాడు. ఆ బొమ్మలో ఉన్నది 1543 నాటి ఒక డాక్టరనీ, క్రిస్టియానిటికి విరుద్ధంగా కొన్ని ప్రస్తావనలు చేశాడనీ, అందుకని అప్పటి బిషప్ ఇతను క్రైస్తవుడు కాడు, జ్యూ అని నిర్ధారణ చేసి దండన విధించాడని చెప్తాడు జో. ఆనాడు జరిగిన ఘటనలను వివరిస్తాడు. ఈ సంఘటన దారుణమైన గోవా ఇన్‍క్విసిషన్‌కి నాంది పలికిందని చెప్తాడు. చరిత్రంతా చీకటే అని అంటాడు. ఇదంతా ఆవేదన కలిగిస్తోందని అంటాడు సుందర్.- ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] భవనం లోంచి ఇవతలకి వచ్చాక ఏదో కాలమహిమ లోంచి ప్రయాణించి మనసులో బాధ పెట్టుకొని చుట్టుతా ఉన్న వాళ్లని మరో విధంగా చూడాలా లేక మనలో మనం ఏదో మథనపడుతూ ఉండాలా అనే ఆలోచనలను ఏం చెయ్యాలి అనే కొత్త సమస్య కొద్ది పాటు నన్ను కలవరపెట్టింది. జో ఇవన్నీ ఎందుకు నాకు చూపిస్తున్నాడు అన్నది మరింత ఆలోచింప చేస్తోంది.

బైక్ మీద కూర్చుని దగ్గరలో ఉన్న హోటల్ వరకూ ప్రయాణం చేసాం. ఆ చిన్ని హోటల్, చిన్న చిన్ని చెక్క టేబుల్సు, గుండ్రంగా ఉండే కుర్చీలతో ముచ్చటగా ఉంది. జో ని చూడగానే ఆ మేనేజరు దగ్గరగా వచ్చి కౌగిలించుకున్నాడు. ఇద్దరం ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాం.

“గోవా చరిత్ర బాగా అధ్యయనం చేసినట్లున్నారు” అన్నాను.

“అధ్యయనం కాదు. ఎక్కువగా ఎంతో మంది దగ్గర విన్నాను. గాలికి తిరిగాను. గాలి ద్వారా కూడా విన్నాను. పూలలోంచి ఎటువంటి మందులు చేస్తారు అన్నది మటుకు కష్టపడి నేర్చుకున్నాయి. నన్ను చాలా మంది డాక్టర్ అనుకుంటారు. కొందరు ఫార్మాసిస్ట్ అనుకుంటారు”

“మీరేమనుకుంటారు?”

“నేను పాడతానంటాను. నాకు పాటంటే ప్రాణం. నా పూలను పాటలతో కూడా ఆడిస్తాను”

“జెరినియో డియాస్ గురించి చెప్పారు, అతనూ డాక్టరే. అతన్ని దారుణంగా శిక్షించటం ‘గోవా ఇన్‌క్విసికన్’కు నాంది అని అన్నారు. ఎందుకు?”

చక్కని బిస్కట్లు, చిక్కని టీ వచ్చి టేబుల్ మీద కూర్చున్నాయి.

జో నిట్టూర్చాడు. మెల్లగా టీ త్రాగుతూ చెప్పాడు:

“డియాస్‍ని బూడిడ చేసిన తరువాత కాథెడ్రల్ చర్చ్‌లో బిషప్ అందరికీ ఒక మాట చెప్పాడట. హోలీ ఇన్‌క్విసికన్‌కి ‘బుల్’ అనేది ఉంటుంది. అది ప్రధానమైన అంశం. దానిని చదివి వినిపించాడు.

క్రైస్తవుల తప్పిదాలకు ప్రస్తుతానికి కేవలం బహిష్కరణే ఉంటుందని చెప్పాడు. సాటి క్రైస్తవులు చేస్తున్న తప్పిదాలను తెలియపరచకపోతే కూడా అందే శిక్ష ఉంటుందన్నాడు. హోలీ ఇన్‌క్విసిషన్ లోని ఇతర ప్రాతిపదికలను పోర్చుగీస్ మహారాజు అనుమతి లేకుండా వాడబోమని అన్నాడు. ఆ తరువాత ఈ ఇన్‌క్విసిషన్‌ను పూర్తిగా అమలు చేయమని మొదటిసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మోలుక్కాస్ నుంచి పోర్చుగల్ మహారాజు డి. జోవావో (3) కు 16 మే, 1545 న లేఖ వ్రాసాడు”

“అబ్బా.. డేట్లతో సహా చెబుతున్నారు? మీరు సామాన్యాలు కారు”

“అది పెద్ద విషయం కాదు. ఏడాదికి 365 రోజులుంటే నా జీవితంలో ప్రతిరోజూ ఒక విషయం, ఒక విశేషం ఉంటుంది. అలా అన్ని తేదీలనూ చరిత్ర లోని ఏదో ప్రముఖమైన దానితో పోల్చుకుని నన్ను నేను ఓ పెద్ద వ్యక్తిగా ఊహించుకుంటూ ఉంటాను”

“ఆలోచించాలి”

“వద్దు, అనుభవించటం లోనే అధ్యయనం ఉంది. ఆ పెయింటింగులు చూస్తే ఆలోచించారా? అనుభవించారా?”

చిక్కు ప్రశ్న వేసాడు. జరగుతున్న వాటినో లేక జరిగిపోయిన వాటినో కాగితం మీద జరుగుతున్నట్లు, జరిగిపోతున్నట్లు చిత్రీకరించటం మంచి రచయితల పని. దృశ్యాన్ని గోడల మీద జరిగినట్లు చూపించారు ఎవరో. కొన్ని అలా గీయకపోతే చంపుతామన్నారట! అంత పెద్ద భవనంలో నిజంగా ఇన్‌క్విసిషన్ ఉరిగిందా? ఊహకు అందటం లేదు. పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంటే వాళ్లు సీలు వెయ్యలి కదా? ఏమో.

“ఆలోచించ కుండానే అనుభవించాను” చెప్పాను.

“ప్రాన్సిస్ వ్రాసినది చెబుతాను”

“చెప్పండి”

“‘ఇక్కడి కైస్తవుల అవసరాలను నివేదిస్తున్నాను..’ అంటూ, ‘మహరాజు గారు, ఇక్కడ హోలీ ఇన్‌క్విసిషన్‌ను స్థాపించ వలసియున్నది. ఇక్కడ చాలా మంది జ్యూయిష్ సిద్ధాంతాలతో బ్రతికేస్తున్నారు. అందులోనూ మహమ్మదీయు వర్గం వారు సిగ్గు లేకుండా, దేవుడంటే భయం లేకుండా ఉన్నారు. వీళ్లు పలు చోట్ల వ్యాపించి ఉండటం వలన ఎందరో ప్రసంగకర్తల అవసరం, ఇన్‌క్విసిషన్ అమలు ఎంతైనా ఉంది’ అని వ్రాసాడు”

“ఆ లేఖ చదివి ఈ క్రౌర్యాన్ని నేరుగా ఇక్కడ దింపేసారా?”

“అంత తొందరగా జరగలేదు. అప్పటి పోర్చుగల్ మహారాజు చెయ్యలేదు. జనవరి 15, 1551 న పి. ఎమ్. న్యూన్స్ బారెట్టో అనే ఒక జెస్యుట్ ఫాదర్ – రోమ్ లోని ఫాదర్ జనరల్‌కు ఒక లేఖ వ్రాసాడు”

“అంటే ఇన్‌క్విసిషన్ కేవలం పోర్చుగీస్ వ్యవహారం కాదన్నమాట”

జో వింతగా నవ్వాడు.

“మత ప్రచారానికి కేంద్ర కార్యాలయాలు లేకుండా ఎలా? మారుమూల ప్రాంతాలలో కూడా జరిగే వాటికి దర్శకత్వ బాధ్యతలు ఎవరివి?”

“ఓ. ఇంతకీ ఈయకేం వ్రాసాడు?”

“ఇది ఆసక్తికరమైనది. నా బుర్రకి అర్థమైనది ఏమిటంటే సహజీవనం అనేది మతోన్మాదులకు గిట్టదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల కంటే ఈ భరత భూమి మీద ఇన్‌క్విసిషన్ చాలా అవసరం అన్నాడు ఈ పెద్దమనిషి. దానికి కారణం ఏమిటంటే ఇక్కడి క్రైస్తవులు – జ్యూలు, మహమ్మదీయాలు, హిందువులతో కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో విస్తరించి ఉండటం చేత చైతన్య రహితంగా ఉంటున్నారు అన్నాడు. ఇన్‌క్విసిషన్ వలన ఏర్పడే భయం వలన సరైన దారికి రాగలరని పేర్కొన్నాడు. అంతే కాదు. ఇక్కడి జనం సహజీవనాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నారు. దండన వలన తప్ప వీరు బాగు పడరన్నాడు!”

“ఐతే ఈ సందేశం ఆలోచింపజేసిందన్న మాట”

“ఇది కూడా కాదు. ప్రతి ఘటనకీ అటూ ఇటూ రెండు ప్రపంచాలుంటాయి. అవి పరిస్థితుల మీదుగా మధ్యలోని గీత వైపుకు ప్రయాణం చేస్తాయి. 1551లో ఈ మాటలు వినిపించినప్పటికీ 1557లో అప్పటి పోర్చుగల్ మహారాజు చనిపోయాక ఆ దేశంలో పరిస్థితులు మారి 1560లో అలెక్సో డియాస్ ఫాల్కావో అనే వ్యక్తి దీనిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చాడు.”

“జో, నాకొకటి అర్థం కాలేదు. ఆ ప్రక్రియకు భయపడిన వాళ్లు మామూలుగా మతాన్ని మార్చుకుంటే సరిపోయేది కదా అని అనుకున్న వారు లేరా? ప్రతిఘటించారా?”

“అదే వ్యాపారం లోని కీలకమైన భాగం. వాళ్ల పద్ధతిలో మతాన్ని పాటించటం లేదు అనే ప్రాతిపదిక మీద దారుణమైన హింస సాగించారు”

“ఏమొస్తుంది? ఏమీ లాభం దాని వలన?”

“కొన్ని తరాల వరకూ కేవలం దాసులుగా, కూలీలుగా మిగిలిపోతారు. స్పెయిన్, ఈజిప్ట్ కొద్దిగా వున్నంగా వ్యవహరించాయి. స్థానికంగా మతాన్ని మార్చుకున్న వారి పట్ల ఈ క్రౌర్యం వాళ్లు ప్రదర్శించలేదు. మతమూ, మతోన్మాదము, వ్యాపార విస్తీర్ణం, ఆర్థికాభివృధ్ధి – ఇవన్నీ చరిత్ర నిశ్శబ్దంగా చూసిన విశ్వ మానవ ప్రవర్తన సార్”

జో దగ్గర గూఢమైన విశ్లేషణ ఉన్నదని అర్థమైంది.

“మీలో ఒక మేధావి ఉన్నాడు”, అన్నాను.

“నాకు తెలియనిది చాలా వుంది. కానీ ఒక్క విషయం నా గురించి నాకే బోధ పడలేదు”

“ఏంటది?”

“నేను పట్టుకుని శోధించినదేదీ నన్ను నిరాశపరచలేదు. ఎవరు నన్ను ముందుకు తోస్తారో తెలియదు”

“తుమ్మెదలకు పూల గురించి ఎవరు చెబుతారు?”

జో తల గాలిలో ఊపాడు. ఫోన్ మ్రోగింది. చిత్ర నంబరు అది.

“హలో”

“సార్”

“చెప్పండి”

“ఎక్కడున్నారు?”

“ఊర్లోనే ఉన్నాను. ఏంటండీ?’

“జ్యోతి బాగానే ఉంది. ఇంకా రెండు ఆయిల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నారు. ఒక వారం తర్వాత పంపిస్తారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులెవరైనా వస్తే బాగుంటుందన్నారు”

“ఓ. చెప్పారా ఎవరికైనా?”

“జ్యోతి ఎవరి గురించీ చెప్పటం లేదు. ఆమె మొబైల్‌లో అన్ని నంబర్లూ చూసాను. ఏం చెయ్యాలో తెలియటం లేదు”

“మాట్లాడుతోందా?”

“తక్కువ. ఏదో అలోచిస్తున్నట్లు ఎటో చూస్తూ ఉంటుంది”

“భోజనం చేస్తోందా?”

“ఫరవాలేదు”

“నిన్ను గుర్తు పడుతోందా?”

“గుర్తుపడుతోంది. కానీ అనుమానంగా చూస్తోందన్న అనుమానం నాకు కలుగుతుంది”

“మేం దారి లోనే ఉన్నాం. టేక్ కేర్”

***

పన్‌జిమ్ లోకి వచ్చే సరికి దాదాపు రాత్రి పదయింది. రాత్రి ఎనిమిది తరువాత రోడ్ల మీద పెద్దగా ఎవరూ కనిపించరు.

ఆస్పత్రిలో బండి పార్క్ చేసి లోపలికి నడిచాం. జ్యోతి ఉన్న వైపు లౌంజ్‌లో ముగ్గురు కూర్చునే కుర్చీలో పాపం చిత్ర కునికిపాట్లు పడుతోంది.

జో నా భుజం తట్టి మరో వైపు వెళ్లిపోయాడు.

నిద్ర లేపటం ఎందుకని దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాను.

కొద్ది సేపటికి చిత్ర సద్దుకుని లేచింది.

“ఎంత సేపైంది వచ్చి?”, అడిగింది.

“పది నిముషాలు”

“రండి..” అంటూ లేచింది.

“ఏమైనా తిన్నావా?”

“అయిపోయింది. ఇప్పుడే”

ఇద్దరం జ్యోతి గదిలోకి వెళ్లాం. ఆమె బెడ్ మీద లేదు. కిటికీకి దగ్గరగా ఎక్కడినుండో తన కాన్వాస్ నిలబెట్టుకుని ఏదో గీస్తోంది. జుట్టు విరబూసుకుని ఉంది.

“జ్యోతీ..!” చిత్ర చాలా మెల్లగా అంది..

ఇటు తిరిగింది జ్యోతి. కళ్లు పెద్దవి చేసింది. పళ్ళు పటపటా కొరికింది. చేతిలోని పెన్సిలును పిప్పి పిప్పి చేసింది. చిత్ర భయంతో నన్ను గట్టిగా పట్టుకుంది. జ్యోతి మెల్లగా లేచి నిలుచుంది. రెండడుగులు వేసి ఎందుకో ఆగింది. అప్పుడే మా వెనుక తలుపు దగ్గర జో వచ్చినట్లు చూసినట్లుంది జ్యోతి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here