పూచే పూల లోన-38

0
13

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఆ భవనంలోని పెయింటింగులను చూస్తూ ఆవేదనకు లోనవుతాడు సుందర్. అసలు ఇవన్నీ జో తనకెందుకు చూపిస్తున్నాడో అని అనుకుంటాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడ్నుంచి బయటకు వచ్చి ఓ చిన్న హోటల్‍కి వస్తారు. గోవా చరిత్రను బాగా అధ్యయనం చేసినట్లున్నారని సుందర్ అంటే, అధ్యయనం కాదని, చాలా మంది నోట విన్నానని చెప్తాడు జో. బిస్కట్లు తిని, టీ తాగుతూ జెరినియో డియాస్‍ని శిక్షించటం గోవా ఇన్‍క్విసిషన్‍కు నాంది ఎలా అయిందని సుందర్ అడుగుతాడు. అప్పుడు జో – ఆ కాలంలో గోవాలో జరిగిన సంఘటనల గురించి వివరిస్తాడు. తరువాత, ఆ భవనంలోని ఆ పెయింటింగులు చూసి ఆలోచించారా? అనుభవించారా? అని సుందర్‍‌ని ప్రశ్నిస్తాడు. ఆలోచించ కుండానే అనుభవించానంటాడు సుందర్. తరువాత గోవాలో ఇన్‍క్విసిషన్‍ ఎలా అమలయిందనే వివరిస్తాడు జో. అతని దగ్గర గూఢమైన విశ్లేషణ ఉన్నదని సుందర్ గ్రహిస్తాడు. ఇంతలో చిత్ర ఫోన్ చేసి జ్యోతికి జరుగుతున్న చికిత్స గురించి చెప్తుంది. జ్యోతి కుటుంబ సభ్యులెవరైనా వస్తే బాగుంటుందని డాక్టర్ అన్నాడని చెప్తుంది. ఆమె ఫోన్‍లో నెంబర్లన్నీ చూశాననీ, ఏం చేయాలో తోచడం లేదని అంటుంది. నిన్ను గుర్తుపడుతోందా అని సుందర్ అడిగితే, గుర్తుపడుతోంది కానీ అనుమానంగా చూస్తోందని చెప్తుంది చిత్ర. మేము వస్తున్నామని చెప్తాడు సుందర్. సుమారు రాత్రి పదిగంటల సమయంలో ఆసుపత్రికి చేరుతారు జో, సుందర్. లౌంజ్‌లో ముగ్గురు కూర్చునే కుర్చీలో పాపం చిత్ర కునికిపాట్లు పడుతూంటుంది. జో మరో వైపు వెళ్తాడు. సుందర్ అక్కడున్న కుర్చీలో కూర్చుంటాడు. కాసేపటికి చిత్రకి మెలకువ వచ్చి సుందర్‍ని చూస్తుంది. ఇద్దరూ జ్యోతి గదిలోకి వెళ్తారు. జ్యోతి మంచం మీద ఉండదు. కిటికీ దగ్గర నిల్చుని కాన్వాస్ మీద ఏదో గీస్తూంటుంది. చిత్ర ఆమెని పిలిస్తే, కళ్ళు పెద్దవి చేసి, పళ్ళు కొరికి చేతిలోని పెన్సిల్‍ని పిప్పి పిప్పి చేస్తుంది జ్యోతి. అప్పుడే తలుపు దగ్గరకి వచ్చిన జో ని చూస్తుంది జ్యోతి.- ఇక చదవండి.]

[dropcap]మే[/dropcap]మిద్దరం ప్రక్కకి జరిగాం. ఇద్దరు ‘జో’లు ఒకరినొకరు వింతగా చూసుకుంటున్నారు. జ్యోతి రెండడగులు వెనక్కు వేసి కుర్చీలో కూర్చుంది. జో అలా నిశ్చింతగా నిలబడ్డాడు. మా ఇద్దరినీ కూర్చోమని సైగ చేసాడు. ఇద్దరం జాగ్రత్తగా కూర్చున్నాం. చిత్ర ఎందుకైనా మంచిదనుకుందేమో తలుపుకు దగ్గరగా కూర్చుంది. జో చాలా జాగ్రత్తగా జ్యోతిని పరిశీలిస్తున్నట్లున్నాడు.

“టీ త్రాగావా?” అడిగాడు.

ఏదో ఆలోచిస్తున్నట్లు చూసి ఎందుకో పళ్లు ఇకిలించింది.

“త్రాగుతావా?”, ఈసారి ఇలా అడిగాడు.

కుర్చీలోంచి లేచింది. జోని చూపించింది. నన్ను చూపించింది. చిత్రను చూపించింది. తనను తాను చూపించుకుంది. చూపుడు వేలు బిగుసుకుంది. మిగతా చెయ్యి యావత్తూ వణుకుతోంది. అక్కడున్న ప్లాస్కు చేతిలోకి తీసుకుంది. జాగ్రత్తగా మూత విప్పింది. అక్కడన్నా ఒక్క కప్పులో పోసింది. కొంత క్రింద పోసింది. ఆ కప్పు పెట్టుకుని చుట్టుతా చూసింది.

చిత్ర కొద్దిగా కదిలింది.

“మనిద్దరిలో ఎవరో ఒకళ్ల మీద పోసేస్తుంది”, సన్నగా గొణిగింది.

“నా మీద పెద్దగా కోపం ఏదీ లేదు”, నేనూ మెల్లగా నసిగాను.

“ఇక్కడ ఏదీ నిర్ధారణగా చెప్పలేం సారూ!” పెదాలు కదపకుండా పలికింది చిత్ర.

“అసలు జీవితంలో నాకు ఇప్పటి వరకు ఏదీ నిర్ధారణగా అర్థం కాలేదు.”

“ఇప్పట్లో అయ్యే అవకాశం కూడా లేదు.”

“ఎందుకని?”

“అన్నీ జరిగిపోతున్నాయి.”

“అంటే?”

“మనలో ఎవరికీ ఏ ప్రమేయం లేదు”

జ్యోతి దగ్గర అన్ని ఒక్క కప్పు తప్ప ఇదిలో మరో కప్పు లేక పోవటం నన్ను కించిత్ కలవర పరచింది.

“మేడమ్..” మెల్లగా అన్నాను.

“అతిథి కోసమైనా ఒక కప్పు ఉంచాలని ఆలోచించలేదా?”

“అతిథి అంటే!”

“ప్రస్తుతానికి నేను”

“నేను పేపర్ కప్పుల్లో త్రాగుతూ వచ్చాను”

“అదైనా లేదా?”

“ప్రస్తుతానికి లేదు”

“మిలిటరీ కాంటీన్‌లో ఏమైనా ఈ మధ్య కాలం పని చేసావా?”

“లేదు”

జ్యోతి జాగ్రత్తగా టీ త్రాగుతోంది. జో కదలకుండా నిలబడున్నారు. ఎక్కడో, ఏదో చూస్తూ నిలబడే టీ త్రాగింది జ్యోతి.

“ఖాళీ కప్ప మన వైపు గాలిలో ప్రమాణం చేసి రావచ్చు. రెడీగా ఉండాలి” చిత్ర చిన్న గొంతులో చంపుకుంటోంది. నాకు నవ్వు ఆగదని తెలిసి మరీ ఏడిపిస్తోంది.

కప్పు జాగ్రత్తగా ఆ టేబిల్ మీద పెట్టింది. గబుక్కున ఆ ఫ్లాస్క్ జో వైపు విసిరింది. చాలా చలాకీగా పట్టుకున్నాడు.

చిత్ర అప్పటికే లేచి నిలబడింది.

“మీతో కలుపుకుని మూడు.. ఎందుకులెండి, పడి ఉంటుంది. నాలుగు తెచ్చెయ్యండి” అంది.

జో నవ్వాడు.

“పేస్ట్రీలేమైనా కావాలా మేడమ్?” అన్నాడు.

“ప్రస్తుతానికి వద్దు”

జ్యోతి తిరిగి కూర్చీలో కూర్చుని కిటికీ బైటకి చూసింది. ఎందుకనో, మరి ఏమనుకున్నాడో ఏమో, జో ఫ్లాస్క్ తీసుకుని వెళ్లిపోయాడు.

సిస్టర్ ఓ ట్రే తీసుకుని వచ్చి మా ఇద్దరినీ చూసి చక్కగా నవ్వింది. జ్యోతికి బిపి చూస్తున్నంత సేపూ ఆమె కిటికీ లోంచే చూసింది. ఇటువైపు తిరగనే లేదు. సిస్టర్ అన్నీ సద్దుకుని తలుపు దాకా వచ్చేసింది.

“డాక్టర్ గారు ఎప్పుడొస్తారు!” అడిగాను.

“రేపు ఉదయం పది గంటల తరువాత”

నేను బైటకి వచ్చేసాను.

“వెళ్లిపోతున్నారా?”, చిత్ర గొంతు వినిపించింది.

“లేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు..”

చిత్ర బయటికి వచ్చింది. ఇద్దరం అలా కారిడార్ లోంచి నడుచుకుంటూ లౌంజ్ లోకి వచ్చి కూర్చున్నాం.

“ఏం చేయాలనుకుంటున్నారు?”

“ఇదెక్కడి గొడవ? నాకేంటి సంబంధం?”

“నాకు మటుకు ఏం సంబంధం? ఎమర్జెన్సీ కేర్ వరకు బాగుంది. తరువాత నేను మటుకు ఏం చెయ్యగలను?”

“ఎవరూ ఏం చెయ్యలేరు. అమ్మాయి ఈ లోకంలో ఉంటే ఏదైనా సాధ్యం. కొద్దిగా కష్టపడి అమ్మాయి తాలూకు మనుషుల గురించి ఎలాగో అలాగా వాకబు చెయ్యాలి. జో కి చెప్పి పోలీసుల సహాయం చేసుకోవాలి. అది పెద్ద కష్టం కాదు.”

“జో మటుకు ఎందుకు పట్టించుకోవాలి? ఇవన్నీ సమస్యలే కదా?”

“జో..”, వెనక్కి వాలాను. “..చిత్రా! జో సామాన్యుడు కాడు. అదలా ఉంచు. అసలు ఈ అమ్మాయి నీతో ఎలా కలిసి ఉంది?”

“ఫొటోగ్రఫీ, స్కెచింగ్ కోసం మా డాక్యుమెంటరీలో పని చేస్తోంది. నేనుంటున్న రూమ్ లోనే ఉంటుంది. నాకు ఆ విధంగా మరి బాధ్యత ఉంటుంది. కాకపోతే అది ఎంత మటుకు? ఎన్ని రోజులు అన్నది పెద్ద ప్రశ్న..”

“ఇదే విచిత్రం. నన్ను నేను రచయితగా చెప్పుకుంటాను. నిన్ను నవ్వు సమాజాన్ని ఉద్ధరించే డాక్యుమెంటరీ మేకర్‌గా పెద్ద సినిమా చూపించావు.. ఇద్దరం ఇలా ఎన్ని రోజులూ అని ఆలోచిస్తున్నాం!”

“నేనేమీ సినిమా చూపించలేదు. మీ గురించి అలవాటుగా కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడాను. న్యాయం మాట్లాడాలి. ఎవరు మటుకు ఏం చెయ్యగలరు?”

మా ప్రక్కగా జో ప్లాస్క్ తీసుకుని అలా వెళ్లిపోతున్నాడు. చేతిలో ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి.

“జో” అన్నాను.

ఇటు తిరిగి మా దగ్గరకొచ్చి కూర్చున్నాడు.

“మిమ్మల్ని వెళ్లిపోమన్నదా?”

“లేదు. మేమే వచ్చేసాం” అన్నాను.

“ఎందుకు?”

“మాట్లాడుకోవాలని”

“ఓ..”

టీ పోసాడు జో. చెరో కప్పూ అందుకున్నాం. అతనూ ఓ కప్పు పోసుకున్నాడు.

“మీకు మంచి పనే అప్పచెప్పింది”, చిత్ర అన్నది.

జో సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.

“నేను డాక్టర్‌తో మాట్లాడాను..” చెప్పాడు. “..పారానాయిడ్ స్కిజోఫ్రినియాలా ఉంది అన్నాడు. ఇలాంటి వారికి అటాక్ వచ్చినప్పుడు రకరకాల శబ్దాలు, మాటలు, దృశ్యాలు చాలా గట్టిగా వినిపించటం, కనిపించటం జరుగుతాయి. ఒక నెల రోజులు మందులు వాడాకా కొద్దిగా మామూలు పరిస్థితులు రాగలవు అన్నాడు.”

“పూర్తిగా తగ్గదా?”

“కష్టమన్నాడు. చాలా విషయాలను పరిశోధించి గాని చెప్పలేమన్నాడు.”

“ఈ మాధవ్ అనే అతని సంగతి ఏంటి?”, అడిగాను.

“నిజమే..!” చిత్ర అంది, “..ఆ సంగతి మరచిపోయాం. గవడె గారిని సంప్రదించి అతన్ని కలుసుకుంటే చాలా లాభం ఉండవచ్చు.”

ఆలోచించాను. అసలు జ్యోతి పరిస్థితి ఇలా అవటానికి అతనే కారణమైతే అతన్ని తెర మీదకి తీసుకుని రావటం సరైన పని కాక పోవచ్చు.

“ఇది జబ్బు అని మీరనుకుంటున్నారా?”, జో అడిగాడు.

“ఏమనుకోవాలి?” అడిగాను.

“నాతో అందరూ సహకరిస్తే నేను పూర్తిగా నయం చేయగలను.”

చిత్ర చేతులు కట్టుకుంది.

“నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి..”, చెబుతున్నాడు. “..సుందర్ సార్ ఆ భవనంలో చూసారు. జ్యోతి ఏ రకమైన పరిస్థితిలో క్రింద పడి గోల చేసిందో లోపల అదే రకం పెయింటింగ్ ఉంది. ఇది డాక్టర్లకు అర్థమవుతుందా?”

నేనేదో చెప్పబోతుంటే చెయ్యి అడ్డు పెట్టాడు జో.

“సార్, కొన్ని కోట్ల న్యూరాన్లు మన కళ్ళ వెనుక ఉంటాయి. కొన్ని లక్షల ఇతర న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటాయి. మనకి తెలిసింది చాలా తక్కువ.”

ఎందుకో ఆగిపోయి నిట్టూర్చాడు. ఉన్నట్టుండి లేచి నిలుచున్నాడు.

“ఇప్పుడు జ్యోతి ఏం చేస్తోంది?” అడిగాడు.

“కిటికీ దగ్గర కూర్చుంది”, అన్నాను.

అటు వైపు బయలుదేరాడు. ఇద్దరం అనుసరించాం. ఎందుకో వేగంగా నడిచాడు జో. రూమ్ దగ్గర ఆగాం, తలుపు దగ్గరకు వేసి ఉంది. మెల్లగా తోసాం..

జ్యోతి కాన్వాస్ మీద ఏదో స్కెచ్ వేస్తోంది..

ఈసారి పిచ్చి మాకు ఎక్కినట్లయింది!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here