పూచే పూల లోన-48

0
11

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పరిస్థితి గంభీరంగా మారుతోందనీ, సమీర్ కేసులో తనని కూడా ఇంటరాగేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటాడు సుందర్. ఎవరినీ నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. జ్యోతికి నయం చేసేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఇంతలో బెల్ మ్రోగుతుంది. కొద్ది సేపు ఆగి, గట్టిగా, ‘యస్?’ అంటాడు. బెల్ మళ్ళీ మ్రోగుతుంది. లేచి వెళ్ళి తలుపు తీస్తాడు. గుమ్మంలో చిత్ర ఉంటుంది. తన సంచీలోంచి ‘కుందా’ అనే స్వీట్ తీసి టేబుల్ మీద పెడుతుంది. జ్యోతి వలన తన డాక్యుమెంటరీకి మరింత ఆదరణ పెరిగిందని చెప్పి, వివరాలు వెల్లడిస్తుంది. చిత్ర చూపించిన ఓ చిత్రపటాన్ని చూస్తాడు. కదంబ రాజుల కాలంలో ఒక అణ్వాయుధపు వివరాలు ఇక్కడ ఆర్కియాలజీ వారికి దొరికాయట, అది పంచశబ్ద ఉపాసనకు చెందినదని గవడే వివరించారని చెప్తుంది. నీ పని గురించి గవడే గారికి తెలుసా అంటే, తెలుసంటుంది. మరెందుకు ఆయన ఏమి తెలియని వాడిలా ఉంటాడని అడుగుతాడు సుందర్. భూగర్భం వాళ్ళు అలాగే ఉంటారంటుంది చిత్ర. జ్యోతి ఎలా ఉందని అడిగితే, మామూలు నడవడిలోకి వస్తోందని అంటుంది. కానీ ఆ అమ్మాయిలో వేరే ఎవరో దాగి ఉండి అప్పుడప్పుడు ఇవతలకి వస్తున్నారా అనిపిస్తుందంటూ, క్రితం రాత్రి జరిగిన ఘటన గురించి వివరిస్తుంది. ఇంతలో సుందర్‍కి అతని అసిస్టెంట్ కిరణ్ ఫోన్ చేస్తాడు. తాను అక్కడికి వస్తున్నానని, లొకేషన్ పెట్టమని అడుగుతాడు. తాను ఎందుకు సోఫోలో కూర్చున్నానో తెలుసా అని అడిగి, అందుకు కారణం చెబుతుంది చిత్ర. – ఇక చదవండి.]

[dropcap]కృ[/dropcap]ష్ణప్రసాద్ గారు ఆ ఉద్యానవనంలో ఉన్నారు అంటే ఇంతే సంగతులు. బస్ స్టాప్‌లో ఉన్నారు అంటే చాలా తేలిక. అక్కడికెళ్లి చూస్తే బెంచ్ మీద వెతికినా చుట్టు ప్రక్కల వెతికినా దొరికిపోతారు. రైల్వే స్టేషన్‌లో ప్రకటన ఇచ్చేస్తే చాలు. ఇక్కడ అలా కుదరదు. ఏ చెట్టుతో మాట్లాడుతున్నారో తెలియదు, ఏ పుట్టలోకి వంగి జాగ్రత్తగా తొంగి చూస్తున్నారో తెలిదు, ఏ మొక్క గురించి ఎవరికి చెబుతున్నారో తెలియదు. చేసేది లేక లోపలికి నడిచాను. చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. మనిషికి ఒకే ప్రాణం. తల్లి మరిన్ని ప్రాణాలకు ప్రాణం పోస్తుంది. కళాకరుడు ఒకేసారి తన ప్రాణం నుండి మరిన్ని భిన్నమైన అందమైన కళాకృతులకు ప్రాణం పోసి నిలుపుతాడు. ఒక జన్మలో వేయి జన్మలు జీవిస్తాడు. రచయిత ఎన్నో ఆలోచనలకు ప్రాణం పోసి తన మానాన తాను వెళ్లిపోతాడు. గాయకుడు చిరస్థాయిగా ఎన్నో పాటలకు ప్రాణం పోసి వాటిని ఇతరుల గళాలలో చిరంజీవులుగా ఉండమని ఆశీర్వదిస్తాడు!

కృష్ణప్రసాద్ గారు ప్రతి ఆకులో, ప్రతి పువ్వులో, ప్రతి బెరడులో ప్రాణం పోసారు.

“సార్”, వెనుక నుండి వినిపించింది.

ఎవరూ కనిపించ లేదు. ఓ పొదలోంచి ఆ సన్నని దారి మీదకి వచ్చి దర్శనం ఇచ్చారు.

“దీని పేరు చిడ్డో.”

“ఛా.”

“అదేంటి? పేరు నచ్చలేదా?”

“పేరు సరే. ఏంటి దీని ప్రత్యేకత?”

ఆయన పింక్ రంగులో ఉన్న పూలను చేతిలో పట్టుకునున్నారు. చిన్నగా, అందంగా ఉన్నాయి

“ఆంగ్లంలో ఇంపేషియన్స్ అంటారు” నవ్వటం మొదలుపెట్టారు.

“ఎందుకలాగ?”

“హిందీలో చిఢ్‍నా అంటే చిరాకు పడటం అని అర్థం. అందుకే చిడ్డీ అంటారు.”

“ఇది దేనికైనా పనికి వస్తుందా? మా ఆవిడకి..”

ఆయన ఆగిపోయాడు.

”ఏమైంది?” అడిగాను.

“పెళ్లయిందా?”

“అనుమానమా?”

“అదేంటండీ? మీకు పెళ్లవటం ఏంటండీ?”

“ఇదెక్కడి గొడవ! రచయితలు పెళ్లి కానట్లుంటారా ఒక పెళ్లి కాకుడదన్నట్లుంటారా?”

“అలాక్కాదు..”

“కొంపదీసి మీకు పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలున్నారేంటి?”

“లేరు. ఉన్నా మీకు ఇచ్చే పని లేదు.”

“నేను అడగలేదు.”

“అయినా ఇవ్వను.”

“ఎందుకు? రచయితలు మంచివారు కారా?”

“కారు.”

“ఎందుకని?”

“మంచివాళ్లని ప్రాక్టికల్‍గా బ్రతకనీయరు.”

“కరెక్ట్.”

“అంటే ఒప్పుకుంటున్నారన్నమాట.”

“ఒప్పుకుంటాను. ప్రాక్టికల్ జీవితంలో పస ఉండదు. అది నిర్వీర్యం, అన్నీ లెక్కల్లో చూస్తారు. అందలం ఎక్కాం అనుకుంటారు. హృదయాన్ని మరచిపోతారు. కల్పన అనేది కరిగిపోయి మనిషి భావాలకు దూరమై కరుణను, దాని ప్రాభవాన్ని మరచిపోతాడు. బ్రతికి ఉండి కూడా మరణిస్తాడు.”

నన్ను ఒక వింత మొక్కను చూసినట్లు చూసారాయన.

“నమస్తే..” అన్నారు. “..ఈ దిక్కుమాలిన లెక్చర్ల వల్లనే నాకు రయితలు నచ్చనిది.”

ఆయన చేతిలోని పూలను తీసుకున్నాను.

“మీకు ఇవి చాలా అవసరం”, అన్నారు.

“ఎందుకని?”

“ఇందులోంచి తీసిన రసం ఎంతో సహనాన్ని, ఓర్పును ఇస్తుంది.”

“నన్ను ఇరిటేట్ చేయాలని కంకణం కట్టుకుంటే నేనేమీ చెయ్యలేను.”

“అంతే కాదు. ఈ పేరుతోనే హోమియోలో ఇంపేషియన్స్ అన్నే బాచ్ ఫ్లవర్ రెమెడీ ఉంటుంది.”

“ఓ.”

“అవును. బైపోలార్ సమస్య ఉన్నవాళ్లకే పని చేస్తుంది. అంతే కాదు. గుట్ర అనే మూన్ ఫ్లవర్ రసాన్ని దీనితో కలిసి ఇస్తే స్కిజోఫ్రేనియా మటుమాయమవుతుంది.”

“నేను దానికోసమే వచ్చాను.”

“ఏమైంది? ఎవరికి?”

“సరిగ్గా మంచి మాటతో మందువేసారు.”

“నాకు మందు తయారు చేయటం చేతకాదు. పూలు మీకు ఇవ్వగలను.”

“అదలా ఉంచండి. మూన్ ఫ్లవర్‌లో ఏమైనా రహస్యాలున్నాయా?”

ఆయన ఆలోచనలో పడ్డాడు.

“కొన్ని విన్నాను.”

“మచ్చుకి..”

“పౌర్ణమి నాడు వీటి శక్తి అధికం. అది మొదటిది. ఆ రోజు దీని మందు ఎక్కువగా పని చేయగలదు.”

“ఇంకా?”

“ఏదైనా పరిశోధన చేస్తున్నారా?”

“లేదు. అవసరం ఉంది.”

“ఈ పువ్వు పుప్పొడిని నాలుక అంచున పెట్టుకుని భవిష్యత్తు గురించి చెబుతారు.”

“అవి నిజావుతాయా?”

“తెలీదు.”

“ఇంకా ఏంటి విశేషం?”

పక్కనే ఉన్న ఒక రాతి బెంచ్ మీద కూర్చున్నారు. ఓ కుర్రాడొచ్చి రెండు గాజు గ్లాసులు అందించాడు. రంగు విచిత్రంగా ఉంది.

“ఇది చిరాకు తగ్గటానికి లేక మరేదైనా..”

నవ్వారాయన.

“బలం పెరగటానికి.”

“ఎందుకు?”

“ఇతరుల బుర్రలు తినడానికి.”

“గుడ్. ఏదో చెబుతూ ఆగిపోయారు.”

“ఇది నేను చరిత్రకారుల వద్ద విన్న కథ”

తోటలో గాలి అద్భుతంగా వీస్తోంది. కృష్ణప్రసాద్ గారు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుపుతూ వచ్చారు. ఈ రోజు నా పంట పండినట్లే అనిపించింది.

“కదంబ రాజుల కాలం అది..” ఆయన చెబుతున్నారు. “..ఇక్కడ ఒక ఆచారం ఉండేది. పంచ శబ్ద ఉపాసన అనేది మీరు వినే ఉంటారు.”

“విన్నాను. ఔడవ రాగాల వ్యవహారం.”

“అంతే కాదు.. అయిదు రేకుల పూలను అయిదో రకాలుగా అమర్చి హవనం చేసేవారు. అందులో ధర్మపూర్ణాహుతికి ఈ గొట్రు అనబడే పూలను, మందార పూలు ప్రత్యేకంగా వాడేవారు..”

మందారం అనగానే వెన్నెముక అలర్ట్ అయింది.

ఈ రెండు రకాల పూలనూ దండలుగా అల్లుకున్న కన్యలను అయిదు మందిని యజ్ఞవాటికలో అయిదు అడుగుల దూరంలో యజ్ఞవేదిక ఆకారంలో కూర్చోబెట్టేవారు. ఇప్పుడు నలుగురు కూర్చున్నాక అయిదవ కన్య ఎక్కడ కూర్చుంటుందన్న సందేహం మీకు కలుగుతుంది. యజ్ఞగుండం పైన ఒక మంచె ఉంటుంది. దాని మీద భైరవి అలంకరణలో కొద్దిగా ఛాయ తక్కువ ఉన్న అమ్మాయిని కూర్చోపెట్టేవారు.”

“అంటే ఈ హవనంలోని వేడి తగిలి పూనకం రావాలనా?”

“కాదు. అలాంటిదేమీ లేదు. ఈ పొగ తాకిన పూలు – ఆ అమ్మాయి మెడలో ఉన్న హరం లోనివి మూన్ ఫ్లవర్ యొక్క తెల్లని రంగు – మందారం రంగులో మారి; మందారం పూలు తెల్లగా మారేవి అని అంటారు. అలా మార్పుకు గురైన పూల నుండి రసం చేసి ఆమెకు నివేదించేవారు. ఆమె స్వీకరించిన తరువాత ఆమె కళ్లు విప్పార్లి కాళిక లాగా నాలుక బయట పెట్టినప్పుడు ఆమెను అందరూ దేవతలా కొలిచి ఆశీర్వాదం పొందేవారు. ఒక నాలుగున్నర గంటల వ్యవధిలో ఆమెకు అనేకమైన అతీంద్రియ శక్తులు లభించేవని నానుడి.”

“ఆ సమయంలో ఆమె ఏం చేసేది?”

“చాలా చెప్పారు.. ప్రధానంగా శత్రు సైన్యాల స్థావరాలు, వాటి వివరాలు, ప్రత్యేకమైన ఆయుధాలు తయారుచేసే విధానాలు, రాజ మహారాజుల రహస్యాలు, కొన్ని కనీ వినీ ఎరుగని పేర్లు ఇలా ఎన్నో..”

ఆయన చెబుతూ వెడుతుంటే, జ్యోతి అటువంటి పూలదండలను తొడుక్కుని నాలుక బయటకు చాచినట్లు, నా మనసు ఊహించేసుకుంటోంది..

“మీరు ఎప్పుడైనా ఈ పూలను అటువంటి వాటి కోసం ఎవ్వరికైనా ఇచ్చారా?”

“భలేవారే. ఆ పనికి అని చెప్పి ఎవరూ కొనరు.”

“కానీ ఆ రెండూ అడిగారంటే అర్థమైపోతుంది కదూ?’

“అవును. అక్కడక్కడ ఇప్పటికీ ఈ విద్య ఉపాసనలో ఉంది.”

“నాకు మూడు గంపలు కావాలి.”

ఆయన ఉలిక్కిపడి లేచారు.

“మూడు.. గంపలా? ఏంటవి?”

“ఒకటి మూన్ ఫ్లవర్, ఒకటి మందారం, ఒకటి చిడ్డో.”

“ఏం చేసుకుంటారు?”

“వైద్యానికి.”

ఆయన ఓ కుర్రాడిని కేక వేసాడు.

“సార్..” మెల్లగా అన్నాడు. “..ఎవరికని అడగను. వైద్యం ఎవరు చేస్తారో తెలుసుకోవచ్చా?”

“నాకే ఇంకా తెలియదు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here