పూచే పూల లోన-56

0
10

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గవడె గారింట్లో తనకెదురయిన సంఘటనలను గురించి సుందర్‍కి చెబుతుంటాడు మాధవ్. గజిబిజిగా ఉన్న వ్యవహారాలన్నీ మెల్లగా అర్థమవుతుంటాయి సుందర్‍కి. ఆ ప్రింట్‍లో ఏముందని అడిగితే, కళాపరంగా చూస్తే అదో అద్భుతమనీ, లౌకికంగా మాత్రం తాను తలపెట్టిన నేరమని అంటాడు మాధవ్. వివరంగా చెప్పమంటే, ఆ ఫొటోలో జ్యోతి కాళికలా ఉందనీ, మందారాలను మాలగా వేసుకుని ఉందనీ, కళ్లు ఎర్రగా ఉన్నాయనీ, కుడి చేతిలో కొడవలి, ఎడమ చేతిలో ఎవరిదో జుట్టు, తెగ నరికిన తలకాయ.. భయంకరంగా, అందంగా ఉందని చెప్తాడు మాధవ్. తానా ఫొటో తీయలేదని చెప్పినా సి.ఐ. వినలేదనీ, ఆ డిజిటల్ కార్డు నీదే కదా, ఆ అమ్మాయిని డ్రగ్గింగ్ చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేశావని సి.ఐ. అన్నాడని మాధవ్ చెప్తాడు. తాను ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇవ్వలేదని, ఆ అమ్మాయిని టెస్ట్ చేయమని అడిగితే, అవన్నీ తర్వాత చూద్దాం ముందు పోలీస్ స్టేషన్‍కి నడు అంటాడు సి.ఐ. అమ్మాయి కంప్లయింట్ ఇచ్చిందని చెప్తాడు. అప్పుడు గవడెగారు జోక్యం చేసుకుని – డ్రగ్స్ విషయంలో నిర్ధారణ లేదని, అమ్మాయితో మరోసారి ధ్రువీకరించుకుంటే మంచిదని చెప్పి, జ్యోతిని పిలుస్తాడు. జ్యోతి వస్తుంది. మాధవ్‍ని ప్రేమించావా అని అడిగితే లేదంటుంది, అతను నిన్ను ప్రేమించాడా అంటే కాదంటుంది. మరి ఎందుకిలా చేశాడు అని అంటే, నన్ను వాడుకుని ఏదైనా అవార్డు పొందాలనుకున్నాడేమో అంటుంది. నిన్ను బలవంతం చేశాడా అంటే లేదని చెప్పి, తనని పాడు చెయ్యటానికి ఆ ఫొటోలు చాలవా అని అడుగుతుంది. మాధవ్‍కి గట్టిగా వార్నింగ్ ఇవ్వమని సి.ఐ.కి చెప్తుంది. అతడేదో చెప్పబోతే, అతన్ని బాల్కనీకి ఉన్న పిట్టగోడ మీదకి బలంగా వంచి గబ గబా హల్లోకి వెళ్లి కాలు మీద కాలు వేసుకుని సింహగర్జన చేస్తుంది జ్యోతి. బెదిరిపోయిన సి.ఐ. మాధవ్‍ని స్టేషన్‍కి పదమంటాడు. గవడె అతన్ని ఆపి, ఆ స్టేట్‍మెంట్ ఇక్కడే తీసుకోమని, తాను సాక్ష్యంగా ఉంటానని అంటాడు. స్టేట్‌మెంట్ ఏమీ వద్దని, ఆ అమ్మాయిని కంప్లయింట్ వెనక్కి తీసుకోమనండి అని చెప్పి సి.ఐ. వెళ్ళిపోతాడు. గవడె మాధవ్‍ని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]మా[/dropcap]ధవ్ చెప్పుకుంటూ వెళ్తుంటే గవడె అనే వ్యక్తి ఒక పూర్తి విలన్‌గా కనిపిస్తున్నాడు.

“ఆయన అంత మాట అన్నాడా?”, అడిగాను.

“అంత మాట అంటే ఏంటండి? నేనేదో ఆయన దగ్గర దాస్తున్నట్లు, మైనింగ్ విషయంలో మోసం చేస్తున్నట్లు ఆయన అనుకోవటమే కాదు, గట్టిగా నమ్ముతూ వచ్చారు.”

“ఇంతకీ తరువాత ఏం జరిగింది?”

“ఆయన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, ఎవరికో ఫోన్లు చేస్తూ నన్ను కొద్ది సేపు పట్టించుకోలేదు. చివరికి ఆయన కుర్చీ లోకి వచ్చి నిట్టూర్చారు.

‘మాధవ్..’, గంభీరంగా చెప్పారు.. ‘నేను ఆర్కియాలజీలో మునిగి తేలుతూ, ఒకటి గాదు, ఎన్ని ప్రాంతాలు చూసానో నాకే గుర్తు లేదు. ప్రభుత్వం వారు నన్ను ఇక్కడ కూర్చోపెట్టి తమాషాలు చూడడం లేదు. నా దగ్గర నుండి చాలా ఆశిస్తున్నారు. ఎప్పుడైనా ముంబయి వెళ్లి మా ఇల్లు చూస్తే ఇంటి నిండా నీకు అవార్డులే కనిపిస్తాయి.’

‘మీరు గొప్పవారు సార్.’

‘కాదు. ఈ అవార్డులతో నాలుక గీసుకోలేను కదా?’

‘అదేంటి సార్?’

‘మాధవ్, నువ్వు కుర్రాడివి. పైకి రావలసిన వాడివి. ఒక జీవిత సత్యం చెబుతాను, విను.’

‘చెప్పండి సార్.’

‘ప్రతిభ గల వాడికీ, లేదా నైపుణ్యం గలవాడికీ, కేవలం ఆత్మవిశ్వాసం ఉన్న వాడికీ మధ్య తేడా ఉంటుంది.’

‘ప్రతిభ ఉన్నవారికి ఆత్మవిశ్వాసం ఉండదా?’

‘ఆలస్యంగా ప్రవేశిస్తుంది. ఎందుకో తెలుసా?’

‘తెలియదు. ఆలోచించాలి’

‘ప్రతిభ గల ప్రతివాడు ముందర అన్నింటినీ అనుమానిస్తూ ఉంటాడు.’

‘కరెక్ట్.’

‘మిగతా వాళ్లు ఆత్మవిశ్వాసంతో చుట్టుతా గల పరిసరాలను పరికించి అక్కడ కన్నా వాటిని ఎలా ఉపయోగించుకొని ముందుకు వెళ్లిపోవాలి అని ఆలోచిస్తారు. అంతే కాదు, సాధించి తీరుతారు. అర్థమైందా?’

‘అవుతోంది’

‘అసలు విషయం తెలుసా? అసలు ప్రతిభ ఉన్నవాడు మన ముందుకు రాడు.’

‘ఎందుకని?’

‘ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లిపోయిన వాడు అందరికీ ప్రతిభావంతుడిగా కనిపిస్తాడు.’

‘నన్ను ఏం చెయ్యమంటారు సార్?’

ఆయన నవ్వాడు.

‘మాధవ్, ఏం చెయ్యక్కరలేదు. కుశావతీ పరివాహక ప్రాంతంలో కోర్టాలిమ్ దాటి సముద్రానికి యాభై మైళ్ళ ఈశాన్య ప్రాంతంలో నాకు కో-ఆర్డినేట్స్ కావాలి.’

ఆలోచించాను. ఇది కరెక్టగా నా కెమెరాలో జ్యోతి కనిపించని సన్నివేశం. ఇదెందుకు అడుగుతున్నారాయన?

‘సార్. అక్కడే నాకు కొన్ని ఫోటోలో పడలేదు.’

‘అక్కడే ఏదో వింత చరిత్ర ఉన్నది మాధవ్. శాస్త్రపరంగా ఎంత వెతికినా తెలియనిది నీ ద్వారా నాకు కొంత అర్థమవుతోంది. ఒక పని చెయ్యి, జ్యోతిని మరల అటువైపు తీసుకుని వెళ్ళు.’

‘ఓ.’

‘అవును. అక్కడికి వెళ్లి ఫొటోగ్రఫీలో నిమగ్నమయిపోవాలి. నేను ఒక్కడినే జీపులో వెనకాలే వస్తూ గమనిస్తూ ఉంటాను.’

‘జ్యోతి ఒప్పుకోవాలి.’

‘జాగ్రత్తగా మాట్లాడితే ఒప్పుకుంటుంది.’

‘ఇద్దరినీ జైలుకు పంపిస్తే?’

‘చూద్దాం. నువ్వు మటుకు ఇక్కడే ఉండు. నీకేం కాదు’ అన్నారు.”

అంత వరకు చెప్పి మాధవ్ తిరిగి ఈ చిత్రమైన కూపంలోకి నరిక ప్రారంభించాడు. నేను అతన్ని అనుసరించారు. ఒక్కొక్క మెట్టు దిగుతున్నాం.

“మరి అరెస్ట్ ఎందుకయ్యావు మాధవ్?”

“రెండు రోజుల తరువాత ఎవరో నలుగురు మనుషులు వచ్చారు. రెండు జీపుల్లో అందరం బయలుదేరాం.”

“జ్యోతి వచ్చిందా?”

“అదే ఆశ్చర్యం – జ్యోతి కూడా వచ్చింది. నాతోని కూర్చుంది..”

“నీతో గొడవపెట్టుకోలేదా?”

“అస్సలు లేదు. ఏదీ జరగనట్లే ఉంది.”

“ఓ.. ఇంత మంది మగవాళ్ల మధ్య కూడా ఎటువంటి భయమూ లేదా?”

“లేదు. ఏదేదో మాట్లాడుతూనే ఉంది. అప్పుడప్పుడూ ఏదో పాడుతూ ఉంది.”

మొత్తానికి ఈ ‘సాయా’ అనే కూపంలోకి పూర్తిగా దిగినట్లున్నాం.

ఇది ఒక అద్భుతమైన ప్రపంచంలా ఉంది. నేను ఒక వైపు, మాధవ్ వైపు ఉన్నాం. మెట్లు ఇక కనిపించటం లేదు. దారి ప్లెయిన్‌గా ఉంది. మా ఇద్దరి మధ్య నుంచి సన్నగా ఏదో నీరు ప్రవహిస్తోంది. అక్కడక్కడ గబ్బిలాలున్నాయి. ఎక్కడైనా కొంత ఆకాశం కనిపిస్తుందేమోనన్న ఆశ ఉన్నది. ఒక్క సారిగా మాధవ్ ఆపాడు.

“సార్, ఇటు చూడండి” అన్నాడు.

మా ఎడమ వైపు పైకి చూసాను. గోడ మీదుగా పాకుతున్న కొన్ని మొక్కలు ఏదో ద్వారంలా దేనినో కాపాడుతున్నట్లున్నాయి.

“మనం ఇంకా ముందరికి వెళ్లవలసిన అవసరం లేదు సార్.”

“ఎందుకు?”

“ఆ ద్వారంలో పూలతోనే సాయా అని ఉన్నది.”

నాకైతే ఏమీ కనిపించ లేదు.

“రండి..” అన్నాడు మాధవ్. అతని వెనక నడిచాను. మెల్లగా పైకి ఎక్కాం ఇద్దరం. బహుశః ఈ మాయల ఫకీర్ ఇక్కడే ఉండవచ్చు..

ఆ తీగ క్రింద చెయ్యి పెట్టి చెవిని ఆన్చాడు మాధవ్.

“ఎవరు మీరు?” ఎక్కడి నుందో వినిపించింది. క్రిందకి చూసాం. పూల మాలలతో భయంకరంగా అలంకరించుకున్న ఓ యువతి అప్పటికే ఓ పిస్టల్ తీసి పట్టుకునుంది. మేము భయంగా చూస్తుండగానే తన చెయ్యి క్రిందకి దించేసింది. మా వెనకల ఎవరినో చూస్తోంది. అటు తిరిగాం.

బాగా వయసు మీద పడ్డ ఒకాయన ఆమెను వెళ్లిపోమని సైగ చేసాడు.

ఆయన వెనుక ఓ బండ లాంటి తలుపు తెరుచుకుంది. లోపలికి రమ్మని సైగ చేసాడు ఆయన.

కొద్దిగా భయంగా, కొద్దిగా ఆశ్చర్యంగా, అనుమానంగా లోపలికి దూరి చుట్టూతా కలయ చూసాం ఇద్దరం.

అద్భుతమైన హలు అది. సహజంగానే చల్ల గాలులు వీస్తున్నాయి. ఆయన ఒక ట్రేలో పండ్లు, పూలు తెచ్చి మా ముందర ఉంచాడు.

“సాయా ఎలా ఉంది?” అడిగాడు.

ఒడ్డు మీదకి వచ్చి ఎండిపోతున్న చేపని మరల నీళ్లల్లోకి తోసి ఎలా ఉంది అని అడిగితే అది చెప్పేదేమి ఉండదు. నీ వలన బ్రతికే ఉన్నాను అంటుంది. సమాధానం కోసం ఆయన నిరీక్షించ లేదు. ఒక నవ్వు నవ్వి ‘కూర్చోండి’ అని సైగ చేసి ఏదో డ్రింకులు తెచ్చి ముందర ఉంచాడు. వాటిని సేవించే పనిలో పడిపోయాం. ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ నుంచో వచ్చి నా సంచీలని తీసుకుని మోకాళ్ల మీద కూర్చున్నారు.

గబగబా ఆ పూలను ఏరి వాళ్లు తెచ్చుకున్న కుండలలోని నీటి లోకి వేసేసి ఖాళీ సంచులను నా ముందర చక్కగా మడత పెట్టి ఇచ్చేసారు.

“అమ్మాయి పేరు?” మరాఠీలో అడిగారు.

“జ్యోతి”, మాధవ్ చెప్పాడు.

“పూర్తి పేరు?”

ఇద్దరం ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకొన్నాం,

“తెలియదా?”

నేను వెర్రివాడిలా నవ్వాను. మొబైళ్ళు పనికిరాకుండా పోయాయి. ఏం చెయ్యగలం? అయినా పూర్తి పేరు ఎందుకు?

“అవసరమా?”

ఒకమ్మాయి ఏదేదో గబగబా వాగేసింది. మాధవ్ అనువాదం చేసాడు.

“సార్ పేరుకు, కాదు, పేరులో శబ్దం ఉంటుంది. పంచ శబ్ద ఉపాసనకి పూర్తి పేరు చాలా అవసరం.”

నేను కొద్దిగా దగ్గాను.

“జ్యోతి అనే తెలుసు”

“నో”, అంది ఆమె. “..పేరు అసలు వేరే ఉంది.”

ఇది కూడా మాధవ్ అనువాదం చేసాడు.

“ఈమెకెలా తెలుసో అర్థం కావడం లేదు.”

“నీకూ తెలియదా మాధవ్? కలిసి తిరిగావు కదా?”

“సార్, నేను ఇలాంటివి ఎవరినీ అడగను.”

ఆలోచించాను. మన తెలుగు పేర్లు ఎలా ఉంటాయి?

“జ్యోతిలక్ష్మి” అన్నాను. ఆ అమ్మాయి తల అడ్డంగా ఊపింది.

“అరుణజ్యోతి”

మరల చప్పరించింది.

“..జ్యోతిర్మయి..” ఎందుకో వెలిగి అన్నాను.

వెంటనే ఆ అమ్మాయి నన్ను ఎందుకో ఆగమన్నట్టు సైగ చేసి, కళ్ళు మూసుకుని ఏవేవో లెక్కలు వేసింది. చిటికె వేసి ‘కరెక్ట్’ అని కూడా వచ్చిన అమ్మాయితో లోపలికి వెళ్ళిపోయింది.

మాధవ్ కూడా ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. బాగా అలసిపోయాడులా ఉంది.

“జ్యోతిర్మయి..” సన్నగా గొణిగాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here