పూచే పూల లోన-65

0
13

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ముందుకు వెళ్ళిన సమీర్ – మూడో యూనిట్ దగ్గరకి చేరుకుంటాడు. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతూంటుంది. అంతా హడావిడిగా ఉంటుంది. సెట్‌లో చాలామంది ఉండడంతో ఎవరితో మాట్లాడాలో సమీర్‍కి అర్థం కాదు. రజనీశ్ గారు కనబడలేదు. ఇద్దరు ఓ గోడకానుకుని నిలుచుని ఉంటే వాళ్ళ పక్కనే వెళ్ళి నిలుచుని షూటింగ్ చూస్తుంటాడు. ఈ లోపు రజనీశ్ వస్తాడు. రెడీ అని అరుస్తారెవరో. హీరో హీరోయిన్లపై సన్నివేశాన్నిచిత్రీకరిస్తున్నారు. రజనీశ్ ఆశించినట్టుగా, హీరో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వలేకపోతాడు. ఆయన తన పద్ధతిలో హీరో గ్రహించేలా.. రెండు మూడు సార్లు చేయిస్తాడు. ఈసారి కొద్దిగా బాగా వచ్చిన, హీరో కళ్ళలో ఆశ కనిపించలేదంటాడు రజనీశ్. అప్పుడు హీరోయిన్ ఏం చేయాలో ఆమెకు వివరిస్తాడు రజనీశ్. ఇక్కడ క్లోజ్ షాట్ రావాలని అసిస్టెంట్ డైరక్టర్‍కి చెప్పి, మళ్ళీ టేక్ చేస్తాడు. ఈ హీరోహీరోయిన్లిద్దరూ మునుపటి కన్నా బాగా చేసినా, రజనీశ్‍కి నచ్చదు. మళ్ళీ కట్ చెప్తాడు. ఇద్దరు ఒకే ముగింపు ఇవ్వాలి, ఎలా? అని అడుగుతాడు. ఎవరికీ జవాబు తోచదు. చివరికి సమీర్ ‘శ్వాసతో చెప్పాలి’ అని అంటాడు. రజనీశ్ లేచి వెనక్కి తిరిగి చూసి, సమీర్‍ని గుర్తుపట్టి ఆశ్చర్యపోతాడు. – ఇక చదవండి.]

[dropcap]ర[/dropcap]జనీశ్‌తో పాటు అందరూ ఇటు తిరిగారు. రజనీశ్ తన కాప్ తీసి నెత్తి మీదకి చెయ్యి పోనిచ్చాడు.

“నరేశ్ ఎక్కడ?”, గట్టిగా అరిచాడు.

జనం లోంచి ఒకడు పరుగులు తీస్తూ వచ్చాడు.

“సార్”

“జయంతి ఆర్ట్స్‌ది ఎన్నో షెడ్యూల్‍లో ఆగింది?”

“రెండు”

“కె.కె. రాడా?”

కె.కె. అంటే కృష్ణకుమార్. పెద్ద హీరో.

“సమాధానం ఏదీ లేదు సార్.”

కాప్ పెట్టుకున్నాడు రజనీశ్.

‘నాతో రా’ అంటూ నరేశ్‌కి సైగ చేసాడు. అతను వెనక నడిచాడు.

నా వైపు తిరిగి “కమాన్”, అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌కి ఏదో చెప్పు చెప్పి నాతో, నరేశ్‌తో బయటికి వచ్చాడు రజనీశ్. కారు ఎక్కమన్నాడు. మాట్లాడకుండా ఎక్కి కూర్చొన్నాను. నరేశ్ డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాడు. కారు కదిలింది.

“ఎప్పుడొచ్చావు ముంబయికి?”

“ఈ రోజే”

“ఎక్కడున్నావు?”

“స్నేహితుని రూమ్‌లో”

“ఓ.. నేను స్నేహితుడిని కానా?”

“…”

“యస్?”

“మీ స్థాయిలో స్నేహం అంటే..”

“సమీర్, స్నేహానికి స్థాయిలతో పని లేదు. నేనొక ఊహని. ఆ ఊహ అలా బ్రతికేస్తూ ఉంటుంది. ఊహకి తగిలిన ప్రతిదీ స్నేహమే. యస్ నరేశ్?”

“సార్, కరెక్ట్.”

“ఇతని పేరు సమీర్.”

అతను నా వైపు తిరిగి అదోలా చూసాడు. అదే పరిచరం చేసుకోవటం అంటే అని అర్థమైంది.

“నరేశ్..”

“సార్.”

“ఇతనికి మన గెస్ట్ హౌస్‌లో వసతి ఏర్పాటు చెయ్యి.”

“సార్.”

“సిద్దయ్యకి ఫోన్ చేసి ఆఫీస్‌కి రమ్మను.”

“ఆయన ఆఫీసులోనే ఉన్నాడు సార్.”

“దేనికి?”

“పేపర్లో ఏదో వార్త వచ్చిందట, అది పట్టుకుని పొద్దున నుంచీ మీ కోసం కూర్చుని ఉన్నాడు.”

“ఏంటిట వార్త?”

“తెలియదు సార్.”

ఇటు తిరిగాడు. నన్ను భుజం మీద ఎందుకో తట్టాడు.

“ఎప్పుడైనా సినిమాల్లో చేసావా?”

“లేదు.”

“సినిమాలు చూసావా?”

“చూస్తాను.”

“నా సినిమాలు?”

“చూసాను. బాగుంటాయి.”

“నచ్చకపోయినా చెప్పవచ్చు. నేనేమీ అనుకోను.”

“నిజమే చెబుతున్నాను సార్.”

“నా సినిమాలలో ఏది నచ్చుతుంది?”

“బోర్ కొట్టవు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలలోనే ఒక డ్రామా జరిగిపోతుంది.”

నరేశ్ వెనక్కి తిరిగాడు.

“సినిమా స్టడీస్ చేసారా?”

“లేదు.”

“మరి బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నట్లు చెబుతున్నారు?”

“నా మిత్రునితో చర్చిస్తూ ఉంటాను.”

“ఓ.”

కారు ఆఫీసు ముందు ఆగింది. ముగ్గురం లోపలికి నడిచాం. రజనీశ్‌కి అందరూ సలామ్‌లే. కూర్చున్నవాళ్లు కూడా లేచి నిలబడ్డారు. ఆయన గదిలోకి వెళ్లాం. గోడల మీద, అల్మారాలలో అన్నీ అవార్డులు, కప్పులు, ఫొటోలు.. కళ్లు బైర్లు కమ్మేసాయి. నరేశ్ ఏవో సద్దేసి వెళ్లిపోయాడు.

కుర్తా, పైజామాలో ఒకాయన లోపలికొచ్చాడు.

“ఏంటండి సిద్దయ్య గారూ?” అడిగాడు రజనీశ

“నన్ను ముంచేస్తున్నారెందుకు?” ఆయన అన్నది అంత మటుకే.

“డాష్ బోర్డ్ చెక్కతో చేస్తారు..”

ఆయన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

“డాష్ బోర్డు..?”

చెయ్యి అడ్డం పెట్టాడు రజనీశ్.

“డాష్ బోర్డ్ అనేది డైవింగ్‌లో వాడతారు. ఒలింపిక్స్ చూళ్ళేదా?”

ఆయన ఆముదం త్రాగినట్లు మొహం పెడుతుండగానే ట్రేలో మూడు గ్లాసులు వచ్చాయి. ఆ కుర్రాడు ఏదో డ్రింక్ పోసాడు. నేను చెయ్యి అడ్డు పెట్టాను.

“మజ్జిగ బాబూ?” అడిగాడు రజనీశ్.

“అవును.”

“లస్సీ.”

అతను వెళ్ళిపోయాడు. సిద్దయ్య గారు గ్లాసు తీసుకున్నారు. రజనీశ్ గ్లాసు ఆయన గ్లాసుకు తాకించారు. ఈ మనిషి మటుకు కోపంగానే కొన్నాడు.

రెండు గుక్కలు లోపలికి పోనిచ్చాడు.

“డాష్ బోర్డ్ ఏంటి?”, అడిగాడు.

“దాని మీద నిలబడి, దానిని గట్టిగా తన్ని కొద్దిగా పైకి ఎగిరి నీళ్ల లోకి దూకేస్తారు.”

“ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది.”

“ఎందుకని?”

ఆయన పేపర్ కటింగ్ టేబుల్ మీద పెట్టాడు.

“బాగానే ప్రింట్ చేసాడు”, అన్నాడు రజనీశ్.

“రజనీ..” ఆయన నసిగాడు, “..కామెడీ చేస్తున్నారు. కోట్ల రూపాయల సినిమా. నా బ్రతుకేం కావాలి?”

“ఏం కాదు. కె.కె. కబురు పంపలేదు, కబుర్లు చెబుతున్నాడు.”

“నో.. షెడ్యూల్ ఆగిపోయినందుకు, ఇప్పుడు ఈ వార్త ఎవరు ప్రచురించారు?”

“నేనే.”

ఆయన టేబుల్ మీద పడిపోయాడు. రజనీశ్ పిచ్చి పిచ్చిగా నవ్వాడు.

నా లస్సీ లోపలికి వచ్చింది. ఆ వార్తా పత్రిక కటింగ్ నా చేతిలో పెట్టాడు రజనీశ్. జాగ్రత్తగా చదివాను.

‘మనసు పలికె చిత్రం షూటింగ్ హీరో కృష్ణకుమార్ డేట్స్ దొరక్కపోవటం వలన ఆగిపోయింది. నిర్మాత సిద్దయ్య – ఎంతో ఉన్నతమైన విలువలతో నిర్మిస్తున్న చిత్రమని ఇప్పటికే పలు సార్లు పేర్కొనటం జరిగింది. సినీ వర్గాలలో ఈ విషయం మీద చాలా వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు రజనీశ్‌కి, కె.కె.కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని, హీరోయిన్ సారిక కూడా పలుసార్లు సబ్జెక్ట్ మార్చమన్నట్లు విశ్వసనీయమైన వర్గాల ద్వారా సమాచారం. ఇదిలా ఉండగా దర్శకుడు రజనీశ్ మరో చిత్రం పగలే వెన్నెల షూటింగ్ జోరుగా సాగుతోంది..’

సిద్దయ్య గారు లేచి కూర్చున్నారు.

“ఏంటండీ ఈ జోక్? దీని బదులు నన్ను డాష్ బోర్డ్‌గా వాడుకొని ఒక్క తన్ను తన్ని..”

చెయ్యి అడ్డు పెట్టాడు రజనీశ్.

“డాష్ బోర్డ్ మీరు కాదు.”

“మరి?”

“కె.కె.”

“అంటే?”

“హీరోని మార్చేస్తున్నాను.”

ఆయన గ్లాసు ఖాళీ చేసేసాడు.

“అడ్వాన్సు?”

“నాకు సంబంధం లేదు.”

“భగవంతుడా? ఏంటిది?”

రజనీశ్ సిగరెట్ ముట్టించాడు.

“రజనీశ్ తన లోకానికి తానే రాజు. నా లోకం నాతోనే నడుస్తుంది.”

సిద్దయ్య గారు ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆపేస్తే చాలా కష్టం. ఇప్పటికే చాలా ఖర్చు అయి ఉంటుంది. ఒక పెద్ద హీరో, ఒక పెద్ద హీరోయిన్, ఒక పేరుగల కమర్షియల్ దర్శకుడితో చేస్తున్న సినిమా మధ్యలో ఆగిపోవటం ఏ నిర్మాతకైనా మంచిది కాదు.

“ఆలోచించి చేస్తున్నారా?”

రజనీశ్ నవ్వాడు.

“కె.కె.ను నేను మలచాను. దిష్టిబొమ్మలా ఉన్నవాడిలో ప్రాణం నింపాను. ఈ రోజు నాకు కథలు చెబుతున్నాడు. ఇది న్యాయమా?”

“సార్, ఈ సినీ రంగంలో న్యాయాన్యాయాలుండవు. దొరికితే పని, లేకుంటే అంతే.”

“సిద్దయ్య గారు, నేను సిద్ధహస్తుడను. మాణిక్యాలను సృష్టించగలను. అది ఒప్పుకుంటారా?”

నేను నా లస్సీ గ్లాసు ప్రక్కనున్న టీపాయ్ మీద పెట్టి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి మొహం కడుక్కుని ఇటు తిరిగాను.

“ఇతన్ని జాగ్రత్తగా చూడండి..” రజనీశ్ అంటున్నాడు.

ఆయన నన్ను ఎగాదిగా చూసాడు. అటు తిరిగాడు.

“మన క్రొత్త హీరో..”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here