పూచే పూల లోన-68

0
11

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

 

[సమీర్‍కి జో ఫోన్ చేస్తాడు. హలో టైగర్ అని పలకరిస్తే, జోని తనతో మామూలుగా మాట్లాడమని అంటాడు సమీర్. ప్రేమ పొంగి అలా పలకరించానని అంటాడు జో. ఎలా ఉన్నావని అడుగుతాడు. విషయాలు తెలిసాయా అని సమీర్ అడిగితే, తెలిసాయని చెబుతూ, ఇది గోవాకి సంబరమని అంటాడు. తనకి భయంగా ఉందని సమీర్ చెబితే, మనం భయపడేవాళ్ళల్లో కాదు, భయపెట్టేవాళ్ళల్లో ఉంటామంటూ, సమీర్‍కి ధైర్యం కలిగేలా మాట్లాడుతాడు జో. నువ్వెలా ఉన్నావు జో అని సమీర్ అడిగితే, కాసేపు మౌనంగా ఉండి, బానే ఉన్నాననీ, ప్రస్తుతం తాను గిటార్ వాయించి, సమీర్ బల్ల మీద కూర్చుని తానే డ్రమ్స్ కొడుతున్నాననీ చెప్తాడు జో. రెండూ ఒకేచోట కూర్చుని వాయించవచ్చు కదా అని సమీర్ అడిగితే, నేను నీలా వాయించాలి కదా అని అంటాడు జో. కొంత సంభాషణ జరుగుతుంది. ఎవరిని కదిలించిన తన వెనుక గుసగుసలు తప్ప ఎవరూ ఎదురుగా వచ్చి మాట్లాడడం లేదనీ, వీళ్లతో కలసి ఎలా పని చేయాలో అర్థం కావటం లేదని అంటాడు  సమీర్. సమీర్‍కి ఉత్సాహం కలిగించే మాటలు చెప్తాడు జో. కొంకణి సాహిత్యం గురించి, ఆంగ్ల సాహిత్యం గురించి ఎవరికీ లెక్చర్లు ఇవ్వవద్దని, ఎవరికీ ఆసక్తి ఉండదనీ, ఊరికి వింటున్నట్టు నటిస్తారని అంటాడు. ఎవరైనా నిజంగా ఆసక్తి చూపితే, క్లుప్తంగా చెప్పమని అంటాడు. జోక్స్‌ని జోక్స్‌లానే స్వీకరించమని చెబుతూ, సమీర్‍ని మాత్రం ఎన్నడూ జోక్స్ వేయద్దని, డైరక్టర్‍ని ఎప్పుడూ గౌరవించమనీ సూచిస్తాడు జో. తనకి ఏది కావాలో మొహమాటం లేకుండా చెప్పడం అలవాటు చేసుకోమని సమీర్‍కి చెప్ఫి ఫోన్ పెట్టేస్తాడు జో. ఇంతలో డ్రైవర్ వచ్చి కారు రెడీ అంటాడు. ఎక్కడికి అని అడిగితే, హీరోయిన్ సారిక ఇంటికి అని చెప్తాడు డ్రైవర్. రెడీ అయి వచ్చి కారెక్కుతాడు సమీర్. కారు ముంబయి వీధుల గుండా సాగుతుంది. తన జీవితం మరో పరుగుకై సిద్ధమవుతున్నట్లు అనిపిస్తుందతనికి. – ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]రు గేటు దగ్గర ఆగింది. ఈ డ్రైవర్ చాలా సీరియస్‌గా ఉంటాడు.

“అప్పుడే దిగకండి సార్”, అన్నాడు.

“ఎందుకు?”

“ఆవిడ ఏడు గంటల ఇరవై ఐదు నిముషాలకు రమ్మన్నారు.”

“అవును.”

“మనం పావు గంట ముందరున్నాము.”

“లోపలికి రానీయరా?”

“ఒక విధంగా అంతే.”

“ఎందుకలా? సమయ పాలనా?”

నవ్వాడు. అదోలా నవ్వాడు.

“సమయ పాలన గురించి నాకు తెలియదు కానీ ముహూర్త పాలన.”

“ఓ. దీనికో ముహూర్తమా?”

“అవును సార్. కరెక్ట్‌గా ఏడు ఇరవై అయిదుకి ఆవిడే వచ్చి గేటు తెరుస్తుంది.”

“శభాష్.”

“వేరే ఎవరు గేటు తెరవటానికి లేదు.”

“అదేమిటి మళ్లీ?”

“మర్యాద. గౌరవం.. అలాంటివి.”

“ఓ. ఒకవేళ ఆ సమయానికి మనం రాలేకపోతే? గేటు మూసేసి వెళ్లిపోతుందా?”

“పదకొండు నిముషాలు అక్కడే నిలబడుతుంది.”

“అదేం లెక్క?”

“తెలియదు. మనం ఏదైనా కారణం ఆలస్యం అయినందుకు చెప్పకపోతే ఆవిడ ఇంట్లోకి భవిష్యత్తులో ప్రవేశం ఉండదు.”

“సిద్ధాంతం నచ్చింది, మనతో ఇక మాట్లాడేదా?”

“అలా ఏమీ లేదు. ఖచ్చితంగా బాగానే మాట్లాడుతుంది, నవ్వుతుంది, నవ్విస్తుంది. కానీ ఆవిడ సమయం మటుకు మనకు దొరకదు.”

“ఓ. ఇంతకీ మానం ఈవిడని ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాము?”

“మనం కాదు సార్. మీరు.”

“సర్లే. నీకేమైనా తెలుసా?”

“డ్రైవర్లకు రోడ్డు మీదనే కన్ను, ఇంకెక్కడా చూపు ఆనదు.”

మాట్లాడతుండగా గేటు మీద ఓ మృదువైన చెయ్యి కనిపించింది.

“సార్, గబుక్కున దిగండి. ఆవిడ ముహూర్తం చూసేసుకున్నట్లుంది.”

గబ గబా దిగాను. షర్ట్ సద్దుకుని గేటు ముందర కొచ్చాను. గేటు మెల్లగా తెరుచుకుంది..

ఒక బొమ్మకి ఆలోచన వచ్చి, ఆలోచనతో ప్రాణం లేచి వచ్చి, ప్రకృతి లోకి ఎందుకో తొంగి చూసి, దాని గురించి ఏదో అవగాహనలోకి వచ్చి, సంభాషించకుండానే విప్పారిన కళ్లతో ఏదో బాసను ప్రస్తావించి రండి, నాకూ, నాదీ అనే మరో లోకం ఉన్నాదన్నట్లు ఓ చిన్ని చిరునవ్వు చిందించి ఆ చిరునవ్వుకు చిరుజల్లులా, ఓ చిన్న కుదుపుతో తల ఆడించి “రండి” అంది.

కాళ్లకి రబ్బరు చెప్పులు కనిపిస్తున్నాయి. ఒంకుల జుట్టుతో ఉన్న జడ సన్నగా కదులుతున్నది. ముఖ ద్వారం వైపు దారి కనిపిస్తున్నప్పటికీ దారి చూపిస్తున్నది.

లోపలికి వెళ్లి కొద్ది సేపు చుట్టుతా చూసాను. గోడల నిండా రావి ఆకుల మీద గీసిన బొమ్మలు స్వాగతం పలుకుతున్నాయి.

సోఫాలో కూర్చుని చిరునవ్వు నవ్వాను.

“మీ టేస్ట్ బాగుంది”, అన్నాను.

గ్లాసులో నుంచి నీళ్లు నింపి కళ్ళు పెద్దవి చేసింది.

“నా టేస్ట్ అని ఎలా అంటారు?”

నిజమే. ఇదేంటి? అలా అనేసాను. కానీ ఆలోచించ లేదు.

“ఎవరిదైనా కావచ్చు. నచ్చకపోతే మీరు ఉంచగలరా?”

“ఇది బాగుంది. కాకపోతే అవన్నీ నావే. థాంక్యూ!”

“ఊ.. ఒక ఆకుకి పెయింట్ అవసరమా?”

“అంటే? ఊరకే రాలిన ఆకులను ఏరుకుని వచ్చి ఇక్కడ అతికిస్తే సరిపోతుందా?”

“నో నో. ఆకులకు సహజంగా రంగు, రూపు, డిజైన్లు ఉన్నాయి అన్నది నా ఆలోచన.”

“సహజంగా ఉన్నవన్నీ అందమైనవే. కానీ ఇలా కూడా చెయ్యవచ్చు అని చెప్పగలిగింది కూడా అందమైన ఆలోచనే.”

“తప్పకుండా.”

“చెప్పండి”, కాలు మీద కాలు జాగ్రత్తగా వేసుకుంటూ అడిగింది.

“ఏంటి?”

చిత్రంగా చూసింది. పక్కున నవ్వింది.

అమ్మాయిలు సామాన్యంగా ఎందుకో నవ్వి నోటి మీద ఎందుకో చెయ్యి పెట్టుకుంటారు. ఈ అమ్మాయి ఎక్కువ నవ్వేసేనేమో అనుకున్నట్లు పక్కున నవ్వి టక్కున ఆపేసి అటూ ఇటూ తల ఊపింది.

“మీరు.. మీరు నన్ను కలవాలనుకున్నది..”

“సారీ. నేను మిమ్మల్ని కలవాలనుకోలేదు.”

“వాట్?”

“అవును. రజనీశ్ కలవమన్నారు. అంచాత మీరు చెప్పాలి.”

“రజనీశ్ కలవమన్నారా?”

“అవును.”

“ఓ! నాకు తెలియదు. నాకు అమృత్.. అంటే ప్రొడక్షన్ మేనేజర్ ఏం చెప్పారంటే మీరు కలవటానికి వస్తున్నట్లు రజనీశ్ చెప్పామన్నారని చెప్పి టైం, డేట్ చెప్పి ఉంటానండీ అన్నాడు. టైం నేనే తరువాత సెట్ చేసి నేను మీకు తిరిగి చెప్పమన్నాను.”

“ఊ. బాగుంది. ఒకే. మనం ఒక మీటింగ్ చేస్కొవాలని ఆయన కోరిక. అర్థమైంది. చూడండీ, నాకు ఇదంతా కొత్త. అంచాత మీరే నాకు చెప్పాలి.”

“ఏంటి?”

మరల పక్కున నవ్వింది,

“బాగుందండీ సారిక గారు! కామెడీ షో లా ఉంది.”

“గుడ్. మీరు చాలా సింపుల్‌గా, సూటిగా మాట్లాడతారు.”

గట్టిగా నవ్వి వింతగా చూసింది.

“చాయిస్ లేదు.”

గట్టిగా నవ్వి, వింతగా చూసింది.

“కామెడీగా మాట్లాడతారు.”

“అర్థమైంది.”

“ఏంటి?”

“రజనీశ్ గారు నేను ఎలా మాట్లాడతానో తెలుసుకొనేందుకు మిమ్మల్ని కలవమన్నట్లు అర్థమైంది.”

“ఓకే. మీరు గోవా నుంచి వచ్చారు.”

“అవును.”

ఓ కుర్రాడొచ్చాడు. ఒక ట్రాలీ తెచ్చి మా మధ్యలో పెట్టాడట. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి అందులోంచి తీసి టీపాయ్ మీద పెట్టాడు.

అతన్ని వెళ్లమని సైగ చేసింది.

“తీస్కోండి” అంది. ఆ గొంతులో తీస్కోరా అన్న మాట స్ఫురించింది.

“నన్ను ఏమీ అడగాలని లేదా?” సరదాగా అడిగింది.

“అడక్కుండానే ఇవన్నీ వచ్చేసాయి కదా?”

తల పట్టుకుంది.

“అయ్యబాబోయ్, చాలా కష్టమండీ మీతో మాట్లాడటం. అవి ఎవరైనా తెప్పిస్తారు.”

“మరి? ఇంకా ఏమైనా ఉందా?”

“సమీర్ గారూ? సీరియస్. మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం ప్లీజ్.”

“ఓ. బాగుంది. అడక్కుండానే హీరోవి అన్నారు. అత్యంత గ్లామర్ గల హీరోయిన్, పేరున్న నటి, కళాకారిణి ముందర ఇలా కూర్చున్నాను.”

“ఊ.. నేను మీరన్నవన్నీ ఒప్పుకోకూడదు. కాకపోతే అవి పేపరు మీద ఉన్నాయి. అది మార్కెట్, దానిని మర్కటాలు స్పష్టిస్తాయి. దయ చేసి ఆ చిత్ర విచిత్ర శబ్దాలకు అర్థాలుంటాయి అని అనుకోవద్దు!”

ఇంత మాట వినిపించినందులకు, అది కూడా ఇంత తొందరగా విన్నందుకు కొద్దిగా ఆశ్చర్యమే వేసింది. ఆ హాల్లో ఓ మూల ఒక చక్కని సితార్ కనిపిస్తోంది.

“సితార్ వాయిస్తారా?”

“అవును. ఇప్పుడదెందుకు?”

“బావుందండోయ్, మీరు కూడా నాలాగా మాట్లాడితే ఎలా? వాయిస్తారా అని అడిగాను కానీ వాయించమనటం లేదు కదా?”

“కరెక్ట్.”

“ఏం లేదండీ. మీరన్న మాట.. మార్కెట్ మర్కటం గురించి.. ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఆ వాయిద్యం తనంతట తానే మ్రోగి ఏదైనా రాగం పలుకుతుందేమో అనుకున్నాను.”

కళ్ళు ఎగరేసింది సారిక.

“ఏమో అనుకున్నాను. రజనీశ్ ఎప్పుడు పొరపాటు చెయ్యరు.”

“ఒకరిని అంటే ఒక హీరోని తప్పించి నన్ను పెట్టుకున్నారు. మీకు అభ్యంతరం లేదా?”

చిరునవ్వు నవ్వి చిన్నగా తల ఆడించింది.

“అవి మన చేతులలో ఉండవు. కాకపోతే ఇలా జరిగినందుకు ఆయనతో మరలా సినిమా చేయను అని అనుకోలేను. ఈ వృత్తిలో అన్నీ మామూలే.”

“వృత్తిలో మిత్రులుంటారా?”

“ఏ మాత్రం ఉండరని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. సర్వస్వాన్ని ధారపోసిన స్నేహితుల గురించి విన్నాను, చూసాను కూడా. ఓ.కే. ఒకటి చెప్పండి.”

“ఏంటి?”

“హీరోలా ఎలా అనిపిస్తోంది?”

“ఒక హీరోయిన్‌తో మాట్లాడగలిగినందుకు ప్రస్తుతానికి హీరోలా అనుకుంటున్నాను.”

“పీరు మాట వెతుక్కోరు కదా?”

మరల సితార్ మ్రోగితే బాగుండుననిపించింది.

“సారిక గారూ, ఏదీ వెతుక్కోవలసిన అవసరం లేని కోట్ల ఆస్తికి ఏకైక వారసుడిని, సిద్ధాంతానికి కట్టుబడి ఏది వెతుక్కోవాలో కూడా తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి ఒక మెకానిక్ పని చేసుకుంటుంంగా ఈ వెండితెర నన్ను వెతుక్కుంటూ వచ్చింది.. వదిలెయ్యండి. బోర్ కొడుతుంది..”

“తప్పు సమీర్ గారూ, ఒకరి స్వగతం ఇంకొకరికి ఎందుకు బోర్ కొట్టాలి? ఖచ్చితంగా ఎప్పుడైనా పూర్తిగా వింటాను. నేనూ మీలాంటి మనిషినే.”

ఆపిల్ జ్యూస్ గ్లాసు ఖాళీ చేసి జాగ్రత్తగా అక్కడ పెట్టాను.

“మీరు నాటకాల నుంచి వచ్చారని విన్నాను” అంది.

“నిజాలని కూడా దగ్గరగానే చూసాను..”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here