పూచే పూల లోన-69

0
8

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హీరోయిన్ సారిక ఇంటికి చేరుతాడు సమీర్. గేటు దగ్గర కారు ఆగుతుంది. అప్పుడే దిగవద్దని చెప్తాడు డ్రైవర్. ఎందుకని అని సమీర్ అడిగితే, ఆవిడ ఏడు గంటల ఇరవై ఐదు నిముషాలకు రమ్మన్నారనీ, తాము పావుగంట ముందే వచ్చామనీ చెప్తాడు. లోపలికి రానీయరా అని సమీర్ అడిగితే, ఒక విధంగా అంతేననీ, సారికకి ముహూర్తాలంటే బాగా నమ్మకమని, కరెక్టుగా ఏడు ఇరవై అయిదుకి ఆవిడే వచ్చి గేటు తెరుస్తుందని చెప్తాడు. కాసేపటికి సారిక చేయి గేటు మీద కనబడగానే, కారు దిగుతాడు సమీర్. లోపలికి ఆహ్వానిస్తుంది సారిక. ఇంటి అలంకరణ చూసి బాగుందని అభినందిస్తాడు. కాసేపయ్యాకా, ఎందుకు నన్ను కలవాలనుకున్నారో చెప్పండి అంటుంది. తాను ఆమెను కలవాలనుకోలేదని, రజనీశ్ కలవమన్నాడని చెప్తాడు. ఎందుకని ఇద్దరూ కాసేపు అనుకుంటారు. తాను ఎలా మాట్లాడతానో తెలుసుకొనేందుకు ఆమెను  కలవమన్నట్లు భావిస్తాడు సమీర్. తరువాత తమ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటారు. ఒక హీరోని తప్పించి తనని పెట్టుకున్నారనీ, మీకేం అభ్యంతరం లేదాని అడుగుతాడు. లేదంటుంది. మాటల సందర్భంలో తన గతం గురించి కొద్దిగా చెప్పి ఆపేస్తాడు. మరోసారి ఎప్పుడైనా పూర్తిగా వింటానంటుంది. మీరు నాటకాలనుంచి వచ్చారని విన్నానని అంటే, నిజాలని కూడా దగ్గరగా చూశానని చెప్తాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] రాత్రి ఏ ఒంటిగంటకో మెలకువ వచ్చింది. మామూలుగా ఒకసారి పడుకోగానే ఈ మర్నాడు ఉదయం తప్ప మద్యలో లేవటం అలవాటు లేదు. ఒక్కసారిగా అన్నీ అనుకోకుండా జరిగిపోతున్నందుకు మనసు లోలోన మరో విధంగా ఊపిరి పీలుస్తున్నదా అనే ఆలోచన కలిగింది. కాస్త గాలి పీలుస్తే బాగుంటుందనిపించి డాబా మీదకి వచ్చాను. ముంబయి సిటీ రాత్రి ఎక్కువ జీవిస్తుంది. మెరుపులన్నీ రాత్రి పూటే..

ఒక అందమైన అమ్మాయితో, అందునా ఒక నటీమణితో దగ్గరగా కూర్చుని మాట్లాడటం, హావభావాలను గమనించటం, తిరిగి  అ అమ్మాయి గురించి ఆలోచించటం ఇదే ప్రథమం. ఆడతనంలో అందాన్ని ఏ విధంగా నిర్వచిస్తారు? అని చాలా సార్లు కొంకణీ సాహిత్యంలో చదివి చదివి అలసిపోయాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆవిష్కరించారు. ఒక విశేషమైన నేపథ్యంలోంచి నుయ్యి లోంచి ఇవతలకి వచ్చిన వానిలా, బయట పడ్డందుకు ఒక స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని నాకు తెలుకుండానే నేను ఆవిష్కరిస్తూ వస్తున్నాననిపించింది. జీవితం అనేది జీవించాలి. కానీ అడగడుగునా విశ్లేణనను వాడుకోకూడదు. కానీ సారిక ముఖ కవళికలు నన్ను నమిలి మింగేస్తున్నాయి. ఏదైనా మాట్లాడి తల కొద్దిగా ప్రక్కకు తిప్పి కళ్లను విప్పార్చి చిరునవ్వును సిద్ధం చేసుకుంటున్నట్లు పెదాలను గట్టిగా నొక్కుకుంటూ నా విన్యాసాలను పరీక్షించే వైనం నన్ను ముగ్ధుడను చేసింది.

విరిసిన సుమమైనా ముడుచుకుంటుంది. సారిక యొక్క వికసించిన ముఖారవిందం అలా ఎల్లవేళలా సక్రియం గానే ఉంటుందా అనిపించింది. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు డాబా మీదకి వచ్చారు. నన్ను బొత్తిగా గమనించినట్లు లేదు. ఓ మూల రాళ్లతో ఏర్పరచిన వసతి మీద కూర్చున్నారు. అర్ధరాత్రి దాటాక ఈ సమయంలో ఏంటి వీళ్లకి?

చక్కగా రెండు బాటిల్స్, గ్లాసులూ తీసి కార్యక్రమం ప్రారంభించారు.

“రెండు డైలాగులు చెప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది” ఒకడు అంటున్నాడు.

“రజనీశ్‍కి అసలు ఏం కావాలో ఆయనకే తెలియదు.”

“కరెక్ట్.”

“అలా కాదు అంటాడు కానీ ఎలాగ అన్నది చెప్పడు.”

“పోనీ చేసి చూపిస్తాడా?”

“నో.”

“అసలు నన్ను తియ్యమనండి షాట్.”

“కరెక్ట్.”

ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న మరో సినిమాలోని షెడ్యూల్ అని అర్థమైంది. పిట్టగోడ మీద కూర్చున్నాను.

“ఎన్నైనా చెప్పురా.. ఓ మాటనుకుందాం.”

“చెప్పు.”

“జీవితాంతం అసిస్టెంట్ డైరెక్టర్లగానే ఉండాలని ఈ బాటిల్ మీద రాసేసారు.”

“బాటిల్ కాదురా, నుదుటి మీద.”

“కాదు. నేను నిజమే చెబుతున్నాను.”

“ఎందుకలాగ?”

“ఓ పాటలో ఉంది చూడు, మందు..”

“మందు?”

“బాటిల్ అనేది మందు ఇంకొకరికి పోయగలదు. అది త్రాగలేదు.”

“వామ్మో! అద్దీ మాటంటే. ఇప్పుడు ఏదో ఎక్కింది ఎక్కడికో.”

“కరెక్ట్.”

“శభాష్.”

“అక్కడ కొత్త హీరోట.”

“అవును.”

“చూసావా?”

“లేదు.”

“నేనూ చూడలేదు. అలా గోవా వెళ్లాడు, ఇలా తెచ్చుకున్నాడు కొత్త మొహాన్ని.”

“ఎన్నాళ్ళుంటాడో?”

“రజనీశ్ ఖిలాడీ రా.”

“అవును.”

“ఎంతమందినైనా మారుస్తాడు కానీ సారికను మార్చడు.”

“అవునొరెయ్.”

“ఏంటి?”

“సారికను ఎందుకు పెళ్లి చేసుకోడు?”

ఎప్పుడు గోడ దిగానో తెలియదు. నాలుగడుగులు వాళ్ల వైపు వేసాను. ఇద్దరూ నా వైపు తిరిగారు.

“ఏంటి భయ్యా, రండి, టైం పాస్!”

ఎందుకెళ్లానో తెలియదు, దగ్గరగా వెళ్లి కూర్చున్నాను.

“అరేయ్, గ్లాసు కావాలిరా.”

నేను చెయ్యి అడ్డు పెట్టాను.

“సారీ అలవాటు లేదు!”

“ఓ. ఇక్కడేం చేస్తున్నారు?”

“మిత్రుడు ప్రొడక్షన్‌లో ఉన్నాడు. ఎక్కడికో వెళ్లి ఇంకా రాలేదు.”

“ఓ, కూర్చోండి..”

పల్లీల ప్లేటు అందించాడు. నాలుగు పల్లీలు నోట్లో వేసుకున్నాను.

“కొత్త హీరో పేరేంటి సార్?” అడిగాను.

“సమీర్.”

“ఓ. అసలు హీరోని ఎందుకు మార్చారు?”

“రజనీశ్ అదో టైప్ సార్.”

“ఆ పాత హీరో మాట వినేవాడు కాదా?”

“అయ్యో, రజనీశ్‍తో చాలా సినిమాలు చేసాడు.”

“మరి?”

“జనం చాలా చెప్పుకుంటున్నారు. ఏది నిజమో తెలియదు.”

ఆలోచించాను. కొద్దిగా కథను ముందుకు తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాను.

“ఓ రెండు నాకు చెప్పండి బ్రదర్..”

“ఏ ఊరు మీది?”

“గోవా.”

“ఓ. ఆ హీరోదీ గోవానే, తెలిసుండాలే మీకు.”

“గోవాలో ఎక్కువ లేను లెండి.”

“ఊ. రజనీశ్ ఈ సినిమా ఎంతో ప్రాణం పోసి చేస్తున్నాడు.”

“అయితే?”

“ఎక్కడో ఆ పాత్రలో ఇతను సరిపోడనిపించిందని కొందరి అభిప్రాయం.”

“అదేం కాదండీ..”  ముందు కూర్చున్న వాడు అన్నాడు, “..రజనీశ్ చెక్ పెట్టాడు.”

“ఎవరికీ? ఆ హీరోకా?”

“కాదు.”

“నిర్మాతకా?”

“కాదు.”

“మరి?”

“సారికకి.”

నా ప్రక్కన కూర్చున్నవాడు మూట గుటకలు మింగాడు. మామూలుగా వదంతులు నమ్మకూడదంటారు. కొందరు వాటిల్లోనూ సగం నిజం ఉంటుందంటారు. ఊరకే పొగ రాదంటారు..

“అరేయ్, చెక్ రాజుకి పెడతారు. సారికకు చెక్ ఎందుకురా?”

అతను బాటిల్ పట్టుకుని లేచాడు. ఎక్కడి నుంచో సిగరెట్ తీసి ముట్టించాడు. సినిమా మనుషులకి ఇది ఒక నిర్దిష్టమైన అంశం. ఆ సరళిలోనే ఏవేవో పుట్టుకొస్తాయి. సూటిగా పొగ వదిలాడు.

“తమ్మీ, ఈ ఇండస్ట్రీలో పుట్టినోళ్ళు ఇక్కడోళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుని మరల నాలుగు రోజుల తరువాత మరో పెళ్లి చేసుకున్నవారిని ఎందరిని చూసాం?”

“అందరూ అలాంటోళ్ళే.”

“మరి? రజనీశ్, సారిక ఎంతో దగ్గరయినట్లు అందరూ అనుకున్నారు కదా?”

“అనేసారు కూడా.”

“మరి? ఆవిడ గారు మరొకరికి దగ్గరవుతుంటే చూస్తూ కూర్చునేందుకు రజనీశ్ ఎర్రోడు కాదు కదా?”

“ఓ. ఆయన్ని ప్రక్కకు తప్పించి తెరచి రాజు అన్నాడు.”

“ఏమంటారు?” నా వైపు తిరిగి అడిగాడు.

నేను పెదాలు విరిచాను.

“ఏముందీ..”, అన్నాను. “..సినిమాలోంచి తీసేసినంత మాత్రాన ఒకవేళ అదే నిజమైతే నిజజీవితంలో విడిపోరుగా?”

“ఊ… అదీ నిజమే. ఇక్కడ ఓ తిరకాసుంది. సారిక ‘ఆయన లేకపోతే నేను చెయ్యను’ అని అనలేదు.”

“అవును. క్రొత్త హీరోని ఒప్పుకుంది కూడా.”

“ఇదే ఆలోచించాలి.”

సిగరెట్ క్రింద పరేసాడు.

“వృత్తి సార్. మనుషులని ఇలా వాడుకుని అలా పారెయ్యాలి.”

నాకు అతని వైనం చూసి నవ్వొచ్చింది.

“సార్, మీరు స్క్రిప్ట్ రైటర్ అవ్వాల్సింది.”

“అలాగే అడుగుపెట్టాను. ఇలా మిగిలాను.”

తిరిగి క్రింద కూర్చుని బాటిల్ ఖాళీ చేసాదు. నన్ను ఒక్కింత జాగ్రత్తగా చూసాడు.

“ఎక్కడో చూసినట్లుంది సార్..”, అన్నాడు. “..ఎక్కడా.. ఎక్కడా.. మీరేం చేస్తూంటారు?”

రెండో అతను అడిగాడు, “మీ పేరేంటి సార్?”

“సమీర్.”

పిచ్చిగా నవ్వారు ఇద్దరూ,

“ఆ కొత్త హీరో పేరూ అదే..”

ఎందుకో ఒక్కసారిగా ఆగిపోయి నన్ను మరింత జాగ్రత్తగా చూసి ఎందుకో లేచి నిలబడ్డారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here