పూచే పూల లోన-74

0
12

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సారిక ఇంటి ముందు కారు ఆపిస్తాడు సమీర్. వాచ్‍మన్ అతని కోసమే ఎదురుచూస్తున్నట్టుగా, కారు వద్దకి వచ్చి, తనతో రమ్మంటాడు. సమీర్ కారు దిగి అతనితో కలిసి నాలుగడుగులు వేస్తాడు. మేడం ఇంట్లో లేరనీ, కారుని పంపించేసి కాస్త ముందున్న చౌరాస్తా వరకు నడుస్తూ రమ్మన్నారని సారిక చెప్పమందని చెప్తాడు. సమీర్ కారుని పంపించేసి, కుడి వైపు చౌరస్తా వైపు నడుస్తాడు. సారిక ఫోన్ చేస్తుంది. నడుస్తున్నానని చెప్తాడు. సిగ్నల్ దాటిన తరువాత రావి చెట్టు దగ్గర తన కారు ఉందని చెప్తుంది. అక్కడికి వెళ్ళి సారికని కలుస్తాడు. చాట్ తిందామా అని అడిగితే, ఏం మాట్లాడడు. కార్లో కూర్చోమని చెప్తుంది. సమీర్ కూర్చుని డోర్ వేస్తాడు. నోట్లో ఏదో చప్పరిస్తూ ఉంటుంది సారిక. వింతగా ప్రవర్తిస్తుంది. కారుని అమితవేగంగా ఫోనిస్తూ ఓ గుట్టని గుద్దేయబోయి ఆపుతుంది. సమీర్ తనకి నవ్వు రావడం లేదంటాడు. దాంతో మళ్ళీ వేగంగా పోనించి, దూరంగా సముద్రం కనిపిస్తున్న చోట, ఓ ఫెన్స్‌ని గుద్దబోయి ఆపుతుంది.  సమీర్ దిగబోతాడు. వెళ్ళవద్దని అంటుంది. ఆమెదో బాధలో ఉన్నట్టుందనీ, తనతో ఏదో చెప్పాలనుకుంటుందని సమీర్ అంటాడు. ఎందుకీ మాటలు అని అంటుంది సారిక. జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి, కారు దిగిపోతాడు సమీర్. చిన్నగా వాన పడుతూంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాకా చూస్తే, ఆ ప్రాంతమంతా ఇదివరకు తనకు కలలో కనిపించిన ప్రాంతంలానే అనిపిస్తుంది. సారిక వెనకాల వచ్చి కారు ఆపి దిగి, తనూ తడుస్తూ నడవడం మొదలుపెడుతుంది. డోర్ తీసి ఆమెను కూర్చోబెట్టి, తానూ కారులో కూర్చుంటాడు. చివరికి ఓ బంగళా ముందు ఆపుతుంది. ఎవరికో ఫోన్ చేసి రెండు గొడుగులు తెమ్మంటుంది. ఓ పెద్దాయన రెండు గొడుగులు తీసుకుని వస్తాడు. ఒక గొడుగు తను వేసుకుని లోపలికి వెళ్తుంది. మరో గొడుగును ఆయన సమీర్‍కి పడతాడు. మేడ మీద ఇంట్లోకి వెళ్ళాకా, గొడుగులు పక్కనబెట్టి, స్నాక్స్ తెమ్మని చెప్తుంది. ఇక్కడే డిన్నర్ చేద్దామని అంటుంది. తన ప్రవర్తనకి ఏమీ అనుకోవద్దని అంటుంది. – ఇక చదవండి.]

[dropcap]“దే[/dropcap]నికి సారీ?”, అడిగాను.

సారిక గట్టిగా తల పట్టుకుంది.

“నేను ఎప్పుడు ఏం చేస్తేస్తానో నాకు తెలియదు సమీర్. జీవితం ఇలా సాగిపోతోంది.”

సామాన్యంగా ఈ రంగంలో ఎందరో డ్రగ్స్ తీసుకుంటారని తెలుసు. ఎన్నో మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతూ ఉంటారని తెలుసు. కాకపోతే మొదటిసారి ఇంటికి వెళ్లినప్పుడు అంత చక్కగా రిసీవ్ చేసుకొని ఆదరించి ఎంతో హుందాగా ప్రవర్తించిన ఈమె ఇంత బేలగా, లోతైన సమస్యలతో బాధపడుతూ దాదాపు పిచ్చిదానిలా ఎందుకు ప్రవర్తించిందో ఆలోచిస్తుంటే రేపు పొద్దున ఈమెతో కలసి నటించటం ఎలా అని తలుచుకుని నాకే పిచ్చి ఎక్కుతోంది.

“నువ్వు చాలా ధైర్యవంతురాలివి సారిక, కూల్‍గా ఉండు”, అన్నాను.

“నిజమే. కానీ ఒక్క నిజం చెబుతాను సమీర్.”

“యస్?”

కళ్ళు పైకెత్తి నవ్వింది.

“మన డైరక్టర్ గొప్పవాడు.”

“ఎందుకు?”

“భలే అంశాలను క్షణంలో ఆణిముత్యాలను పట్టినట్టు పట్టేస్తాడు. వాటిల్లో ఈ ‘యస్’ ఒకటి.”

“ఊఁ.. ఈ మాట చిన్నప్పటి నుండే అలవాటు. అలవోకగా అనేసాను. అదే బహుశః నా ప్రాణం తీస్తోంది.”

“కాదు..”

అక్కడ ప్లేట్‍లో పెట్టిన స్నాక్స్ సర్దుతూ, గట్టిగా నొక్కి వక్కాణించింది.

“కాదు సమీర్.. ప్రాణం తీయటం కాదు, ప్రాణం పోస్తోంది.”

“ఎలా?”

“నేను జీవితాంతం నో నో లలో నలిగిపోయాను.”

“ఎవరి నో లు?”

“ఎవరివి వుంటాయి? మా పేరెంట్స్.. యస్ అనాలన్నా నో తోనే బదులిచ్చారు. నిన్ను చూడగానే వింతగా అనిపించింది.”

“పుట్టుకతో ఎవరో స్వతంత్రులు కారు సారికా, స్వతంత్రపు ఆలోచనల ద్వారా మనం ఎదగాలి. నేను కోట్ల ఆస్తిని, గోవాను రెండు మూడుసార్లు కొని అమ్మేయగలిగే తండ్రిని వదివేసి, ఒక కారు షెడ్‌లో ఓ ప్రాణమిత్రునితో కాలం గడుపుతూ ఇక్కడిక వచ్చాను.”

యాపిల్ జ్యూస్ గ్లాసు తీసుకుని చిన్నగా పెదవి తడిపింది సారిక.

నేనూ ఓ గ్లాసు తీసుకున్నాను.

“డ్రింక్ తీసుకోవా?” అడిగింది.

“లేదు.”

“మరి గ్లాసు ఎంతో అలవాటున్న వానిలా పట్టుకున్నావు?”

“అలా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నది అది ఇలానే ఉంటుంది అనుకుని అనుభవించెయ్యటమే నటన. ఇదే అంతే.”

“అంటే డ్రింక్ పుచ్చుకుంటే బావుండునేమో అనే ఆలోచన ఉన్నది. అంతేనా?”

“హ.. హా.. ఆలోచన దేనికి ఉండదు చెప్పు? అన్నిటికీ ఉంటుంది, అనుభవించేయాలి. దట్సాల్.”

“నేను కారు అలా నడిపి, పిచ్చి పిచ్చిగా వ్యవహరించి ఇబ్బంది పెట్టాను. నేను చిన్నప్పుడు నుండీ దేనినీ ఆపుకోలేను. అదే నా సమస్య. ఇంతకు ఎందుకు వదలి వచ్చేసావు?”

“అమ్మాయిల కోసం.”

పక్కుమని నవ్వబోయి తమాయించుకుంది, ఆ నోట్లోది నా మీద స్ప్రే అవుతుందేమో అనుకున్నాను.

“నేను జాగ్రత్తగానే విన్నాను కదూ?”

“అవును.”

“అది కాదు. అమ్మాయి బదులు అమ్మాయిలు అన్నావు. ఎంత మంది?”

“రోజుకొకరు.”

“నిజమే. నేను పిచ్చిదానినే, అందరూ ఇలా ఆటపట్టిస్తూనే ఉంటారు.”

“లేదు. నేను నిజమే చెప్పాను.”

సోఫాలో వెనక్కి కూలబడింది. కొద్దిగా కొంటెగా చూసింది.

“ఊఁ.. ఏమో అనుకున్నాను.”

“ఏమనుకున్నావు?” కొద్దిగా ముందుకు వంగాను.

“..”

“రాముడు, మంచి బాలుడు అనుకున్నావు కదూ?”

గ్లాసు ఖాళీ చేసింది. టీపాయ్ మీద పెట్టి కాలు మీద కాలు వేసుకుంది.

“అలా అనుకోలేదు.”

“యస్? ఎలా అనుకున్నావు?”

ఐస్ ముక్క గొంతులో అడ్డుకున్నట్లు మొహం పెట్టింది.

“ఆ యస్ ముక్క ఐస్ ముక్కతో కొట్టినట్లు అంటావు. అది కాక ఇంకేదైనా అనరాదూ?”

“ఇంతకీ ఏమనుకున్నావు?”

“నిజం చెబుతాను.”

“యస్..” చేయి అడ్డు పెట్టాను, “..ఓకే. చెప్పు.”

“మంచివాడే కానీ మెల్లమెల్లగా చెడిపోగలడు అనుకున్నాను.”

“ఊఁ.. నిజంగా అలా చెడిపోతూ ఉన్నప్పుడు చూస్తూ ఉందామని అనుకున్నావా?”

“మేము నటించే వాళ్ళం.. మేము కాదు, మనం. అంతకంటే ఏం చేయగలం?”

“తోటి నటుడిని ఆదుకోలేరా?”

“దేనికని ఆదుకోవాలి? వినగలరు అనిపిస్తే అబ్బాయి, ఇలా కాదు, ఇలా అంటాం. ఆ తరువాత ఎవరి దారి వారిదే. అదే ప్రొఫెషన్.”

“కరెక్ట్. చెడిపోయే ముందు ఏం చేయాలనుకున్నావు?”

అదోలా చూసింది.

“నేను ఇంత సేపు ఎవరితోనూ ఇలా.. నాలుగు రోజుల పరిచయం లోనే ఎన్నడూ మాట్లాడలేదు సమీర్.”

“ఎందుకు? అందరూ చెడిపోయిన వాళ్లల్లా కనిపించారా?”

“కాదు. మాట్లాడాలనిపించలేదు.”

“నేను మోసం చేసినట్లే కదా?”

“కాదు. ఎక్కడో, ఏదో మరో మోసం ఉంది. మీ ఇంట్లో బంగారు బాబులా ఉంటే అనుకున్నది జరిగేదేమో?”

“తప్పకుండా.”

“కారు షెడ్ లోకి వెళితే ఎవరొస్తారు?”

“ఎందుకు రాకూడదు?”

“ఓ.. ఎవరో ఓ ఆణిముత్యం దొరకవచ్చు. ఒకటీ అర.. ఆ తరువాత ఎవరూ ఉండరు.”

“ఊఁ.. అమ్మాయిలు ప్రవృత్తులు లొంగదీసుకున్న ప్రకృతి పరంపరలు.”

“సొంత డయలాగా లేక ఎవరిదైనా కొట్టేసారా?”

“నాదే. మీ ఇంట్లో నో నో అన్నట్లు మా ఇంట్లో అన్నిటికీ యస్ యస్..”

“అందుకు ఈ యస్ అనేదాన్ని ఇన్ని సార్లు అంటున్నావు?”

“నో..”

నవ్వింది.

“ఈ యస్ అనేది నా స్వంతం. మా ఇంట్లో వినిపించే యస్ నా కోసం కాదు. కాలానుగుణంగా ఏర్పడిన గోవా సంస్కృతి పట్ల ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది.”

“ఓ..”

“ఒక ప్రాంతం ఇలా ఎందుకు ఏర్పడింది అన్న ఆలోచన కలిగింది.”

“ఓ. అంచాత ఒక్కో అమ్మాయినీ పరిశోధిస్తూ వచ్చారు!”

లేచి నిలబడి మరీ నవ్వాను. అటూ ఇటూ తిరిగాను.

“సారికా..” అన్నాను. “..అమ్మాయిల గురించి పరిశోధన అక్కరలేదు.”

“ఎందుకు?

“అమ్మాయిలకి అమ్మాయిలే అద్దాలు.”

“మరో అమ్మాయిని ప్రక్కన పెడితే చాలు, సినిమా కనబడి పోతుంది.”

“ఊఁ.. మా మీద హస్యమైనప్పటికీ ఆలోచనను ఒప్పుకుంటున్నాను.”

“హ.. హ.. చూసావా? ఒక్కసారిగా మా మీద అనేసావు. ఎంత తేలిగ్గా వర్గీకరణ అయిపోతుంది..?”

“కాకపోతే?”

కొద్ది సేపు కాళ్లు కదిపి తిరిగి కూర్లున్నాయి. నాలుగు జీడిపప్పులు నోట్లో వేసుకున్నాను.

“నేను ఇల్లు వదిలింది అమ్మాయిల వేటలో కాదు.”

సారిక అలర్ట్ అయింది. రెండు చేతులూ బుగ్గల మీద పెట్టుకొని “యస్?” అంది.

చిన్నగా నవ్వాను.

“మా నాన్న నిరంతర వేటనుండి ఇవతలకి వెళ్లేందుకు.”

చేతులు తీసేసింది. దీర్ఘంగా శ్వాస విడిచింది. వెనక్కి వాలింది. ఇంట్లో పనులు చూసుకునే పెద్దాయన వచ్చాడు.

“అమ్మా.. డిన్నర్ రెడీ.”

మెట్ల మీదుగా పైకి వెళుతున్నాం. నా కుడివైపు గోడ మీద చక్కని పెయింటింగ్ ఉంది. మెట్లు దిగుతున్న అమ్మాయి.. క్రింద చేతులు చాచి ఎదురు చూస్తున్న అబ్బాయి! అమ్మాయికి దాదాపు ప్రక్కగా నిలబడి వెనక్కి తిరిగి నా వైపు చూసింది. పెయింటింగూ చూసింది. చిరునవ్వు నవ్వింది.

“నేను చేతులు చాచలేదు” అన్నాను.

“అక్కర లేదు. పైకి రండి.” అంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here