పూచే పూల లోన-78

0
13

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[టీవీ ఛానెల్‍లో ఇంటర్వ్యూ ముగిసాకా, ఓ కాలేజీ వాళ్ళు తమ స్నాతకోత్సవానికి సమీర్‍ని ఆహ్వానిస్తారు. సమీర్ ప్రసింగించే ముందుగా, సమీర్‍ని ప్రసంగానికి ఆహ్వానించిన విద్యార్థి మాట్లాడుతూ, జీవితానికి, తెరకీ మధ్య సంబంధం ఉన్నదా, ఉంటే ఏంటి? సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా లేక సమాజం సినిమాని ఎలా చూపించాలో, ఆ కాలానికి అలానే చూపిస్తుందా అని ప్రశ్నిస్తాడు. నిజ జీవితంలో హీరో ఎవరు? హీరోలు లేకుండా వెండి తెర లేదా? హీరోల అవసరం లేకుండా నిజ జీవితం కొనసాగదా వంటి ప్రశ్నలకు సమీర్ జవాబివ్వాలని కోరుకుంటాడు. సమీర్ మాట్లాడుతూ – హీరోలంటే సినిమా హీరోలు మాత్రమే కాదనీ, కుటుంబంలోనూ, సమాజంలోనూ హీరోలుంటారని చెప్తూ.. గోవా గురించి చెప్తాడు. సమాజంలోని దురాచారాలను ఎదుర్కునేవారు హీరోలనే చెప్పి ప్రసంగం ముగిస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. సారిక కూడా చప్పట్లు కొట్టడంతో, కారు నడుపుతున్న సమీర్‍ వర్తమానంలోకి వస్తాడు. సారిక దేనికో తొందరపడుతున్నట్టు గమనిస్తాడు. తనకి దగ్గరైన వారి గురించి, రజనీశ్ గురించి మాట్లాడుకుంటారు. సినీరంగంలో మూడు రకాలవారుంటారని అంటాడు సమీర్. బ్రూటల్‌గా హానెస్ట్‌గా ఉన్నావని అంటుంది సారిక. – ఇక చదవండి.]

[dropcap]సా[/dropcap]రిక పట్ల ఎటువంటి దురాలోచన నాకు కలుగలేదు. సహజంగానే నా మనసు ఏనాటి నుండో ఒక విధమైన విశ్లేషణకు అలవాటు పడిపోవటం వలన ఆమె ప్రవర్తన, వ్యవహారం గురించి ఆలోచించటం ప్రారంభించాను. ఒక్కోసారి తీవ్రంగా బాధపడ్డాను కూడా. నాకు దగ్గరవ్వాలనే సంకేతాలు చాలా సార్లు ఇచ్చింది. ఎప్పుడైనా నేను ఆమె తల్లిదండ్రులు, కుటుంబం గురించి కనుక్కునే ప్రయత్నం వేసినప్పుడు చలా చలాకీగా దాటేసేది. డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టేది.

“వస్తాయి, పోతాయి.. ఆ అలల లాగా” అన్నది ఓ సాయంత్రం.

జుహు బీచ్‌లో ఎవరికి దొరకని చోట రహస్యంగా బుక్ చేయించుకుంది. అలాంటివి ఎన్ని చేసినా  మేమిద్దరం ఎలా పేపరుకెక్కే వాళ్ళమో అర్థం అయ్యేది కాదు. కొత్తల్లో కోపం వచ్చేది. కానీ ఏం చేయలేని పరిస్థితి. మీడియా వాళ్లను కోప్పడటం కంటే అలా సముద్రంలోకి పిచ్చి పట్టిన వాడిలా వెళ్లిపోవటం మంచిది!

“ఏం వస్తాయి? ఏం పోతాయి?”

“డబ్బులు..”

“ఇంకా?”

“బంధాలు, అనుబంధాలు.”

“ఏది మిగిలి ఉంటుంది?”

“ఏమీ మిగలదు.”

“వచ్చే పోయే వాటిలో ఏదో ఒకటి ముఖ్యమైనదే కాదా?”

కొంటెగా చూసింది.

“సమీర్, వచ్చే పోయేవి కావు. మొదటి రోజు నుండే అంతుపట్టకుండా పారిపోయేది చాలా ప్రధానమైనది.”

“ఏంటది?”

“కాలం.”

“ఓ. నిజమే. అది కూడా ఎక్కడా నిలబడదు. అది ఎందుకు ముఖ్యం?”

“అది మనం పుట్టినప్పటి నుండే మన లెక్క చెబుతుంది. ఏది ఎలా ఉన్నా ఆ ముల్లు ఆగదు.”

“అయితే?”

“ఆ క్షణంలోనే జీవించెయ్యాలి. మన సమయం అయిపోయిన తరువాత కూడా మన పని లోకంలో మిగిలిపోవాలి. మాడిపోయిన కాడను చూసి ‘అయ్యో, మాడిపోయింది అని కాదు, ఓ.. ఉన్నంత సేపూ వెలిగిపోయింది’ అనుకోవాలి!”

“ఊ.. కాలిపోయింది అనుకోకూడదు.”

“అవును.”

“ఈ మాటలు బలే ఉన్నాయి. ఏదో సినిమాలోవా?”

“కావచ్చు. రాత్రి పడుకునే ముందు ఎందుకో గుర్తుకొస్తూ ఉంటాయి. రచయితలెందరో మహానుభావులు ఎన్నో వ్రాస్తూ ఉంటారు. కొన్ని గుండెలకు హత్తుకుని పోతాయి. కొన్ని నిజ జీవితాలని పలకరిస్తాయి. కొన్ని వెక్కిరిస్తాయి.. కొన్ని నవ్విస్తాయి. కొన్ని ఏదో గాయపడ్డ చోట చమ్మగా వ్రాసి నవ్వుతాయి. మంచి మాటలు అబద్ధాలైనా ఫరవాలేదు.. ఎందుకో వినాలనిపిస్తుంది! ఏమీ మాట్లాడవా?”

ఈమెలో ఏదో బాధ నిరంతరం సాధిస్తున్నట్లనిపిస్తుంది.

“నాలాంటి స్నేహితులు ఎంతమంది?”

“ఇంత దగ్గరగా ఎవరూ రాలేదు.”

“నేను వచ్చానా? నువ్వు తెచ్చుకున్నావా?”

ఒక్కసారి కదిలింది.

“ఆ గుట్ట మీద నుంచి తోసేస్తాను” అని చిలిపిగా చూసింది. మళ్ళీ తమాయించుకుంది.

“అయినా సమీర్, ఎవరినైనా ఊరికే తెచ్చుకోవచ్చా? అలా ఎవరైనా వచ్చేస్తారా?

“రోజు రోజుకీ మరీ దగ్గరవుతున్న సమీర్, సారికలు.. మొన్న పత్రికలో వార్త. నిన్న..”

చెయ్యి అడ్డం పెట్టింది.

“అది వార్త కాదు. నిజమే. మనం దగ్గరగానే ఉంటున్నాం.”

“నిజమే. దగ్గర అంటే?”

నన్ను జాగ్రత్తగా చూసింది. అస్తమిస్తున్న సూర్యుని ఎర్రని కాంతి చెంపల మీదుగా ఒక్కసారి మెరిసింది. ఏమీ మాట్లాడలేదు.

“యస్?”

ఈసారి కళ్ళు పెద్దవి చేసి సూటిగా కళ్ళల్లోకి చూసి గట్టిగా శ్వాస పీల్చింది. కళ్ళు మూసుకుంది. ఇంజక్షన్ ఎవరో పొడిచినట్లు గొంతు బిగించి పెదాలు చిట్లించింది.

“సమీర్”

“యస్?”

“నో.. మరోసారి ఆ ‘యస్’ అని అన్నావంటే ఈసారి నేను దూకేస్తాను.”

“ఊ.. అనను. కానీ నాకది అలవాటు.”

“నో. నీ శక్తి అది. నీ బలహీనతా అదే.”

“ఏమో.”

“అందరూ ప్రశ్న వేసేటప్పుడు ‘అవునా?’ అంటారు. నువ్వేంటి? ‘యస్’ అని మాయ చేస్తావు?”

“ఏమో. నాలో ఇంత మాయ ఉందని తెలియదు.”

“అమా.. యకులు!”

“థాంక్యూ.”

“అడుగుతాను.”

“ఏంటి? అమయాకుడినే?”

“అవును.”

“ఏమని?”

“ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నావు?”

“ఓపిక ఉన్నంతవరకు.”

“ఓ.”

“ఎందుకు?”

“నేను అన్ని చెయ్యలేను. జనం ముసలి మగాళ్లని కూడా ఒప్పుకుంటారు కాని ఒక్క ఏడాది వయసు పెరిగినా అమ్మాయిలను ఒప్పుకోరు.”

“ఒప్పుకుంటారు.. ఆంటీలుగా!”

“నో.. నేను చెయ్యను. అవును సమీర్! నేను కాకుండా వేరే హీరోయిన్‍లతో సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది?”

“బావుంటుంది.”

“బాగానే ఉంటుందా? చాలా బాగుంటుందా?”

“చాలా బాగుంటుంది.”

“అంటే నాతో నీకు బాగుండదన్న మాట.”

“ఈ మధ్య.”

“అదేంటి?”

“ఏమో. దగ్గరవుతున్న దగ్గర నుండి నీ ముందర లైట్లు, కెమెరాలు చూడలేకపోతున్నాను.”

“అంటే? నాలో  ఏదో మరో సారికను ఊహించుకుంటున్నావు. అవునా?”

“లేదు. ఊహ కాదు సారికా, అదేంటో నువ్వే కాదు, నాకు ఎవరు దగ్గరయినా ఆడ అయినా మగ అయినా ఎందుకో పబ్లిక్‍లో చూడాలనుకోను.”

సారిక ఎన్నడూ మాట వెతుక్కోదు.

“పబ్లిక్ లోనే ఉండేవాళ్ళు దగ్గరయినప్పుడు?”

“ఏదో దగ్గరున్నది ఎక్కడికో తప్పిపోయినట్లు అనిపిస్తుంది.”

“అవునా? మై గాడ్! ఎందుకలా?”

“తెలియదు. రెండు వత్తులు వేసి పెట్టుకున్న దీపం ఎలెక్ట్రిక్ వెలుగులో ‘నన్ను చూడనక్కరలేద’న్నట్లనిపిస్తుంది.”

“సమీర్! నువ్వు ఓ స్టార్‍వి! ఓ గొప్ప నటుడివి. కళాకారుడివి. చాలా సాధించావు. ఎన్నో అవార్డులు అందుకున్నావు. ఇదంతా పబ్లిక్ వలన కాదా?”

“తప్పకుండా. ప్రదర్శన లేకుండా ఏదీ లేదు. జనంలో నిలబడగల్గటం ఈశ్వరుని ఆశీర్వాదమే. అలా చేయలేక ఓడిపోయిన వారెందరో.”

“మరి పబ్లిక్‌నీ, పబ్లిక్ లోంచి వచ్చిన వారంటే అంత ఇబ్బంది పడతావెందుకు?”

“నా దగ్గర సమాధానం లేదు సారికా. ఏమో! నేను ఈ ప్రపంచానికి ఎన్నడూ అలవాటు కాను అనిపిస్తుంది.”

“….”

“ఎవరైనా గుర్తుకొచ్చారా?”

“అవును.”

ఎందుకో తన చెయ్యి నా మీద వేసింది. తన వ్రేళ్ళను నా చెంప మీద కదిలించింది. చెవికి దగ్గరగా వచ్చి అడిగింది, “ఎవరు?”

“ఆ దూరంగా తళుక్కు తళుక్కుమంటూ మాయమైపోతున్న ఆ షిప్పులను చూస్తున్నప్పుడల్లా ఏ షిప్ లోనో మా నాన్న ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది.

“ఓ. మరి అమ్మ?”

“అమ్మ..”, అంటూ కళ్ళు తుడుచుకున్నాను.

“ఊర్కో సమీర్.. అయామ్ సారీ.”

“అమ్మ.. వేళకి ఇంత తిని పడుకున్నంత సేపూ పడుకుని దిండు వెనక్కి వాల్చి అలా, కిటికీ లోంచి చూస్తూ ఉంటుంది.”

“నువ్వు వెళ్ళి కలుసుకోవచ్చు కదా?”

“చాలా సార్లు అనుకున్నాను. మిత్రుడు జోవాక్విమ్ కూడా వస్తానన్నాడు. కానీ నాన్నను తలచుకున్నంత సేపూ బుద్ధి పుట్టలేదు. ఒక సత్యాన్ని గట్టిగ నమ్ముకున్నప్పుడూ, తలపుల చాటున, తలుపుల చాటున బ్రతకలేనప్పుడు, అప్పుడప్పుడు ఈ మనసు చేసే చప్పుడును వినిపించుకోకుండా కాలం అంచున నిలబడి చడీ చప్పుడూ చేయకుండానే ఓ ముద్ర వేసి నన్ను ధిక్కరించిన కాలాన్నే సవాలు చేయాలి.”

“ఒంటరిగానేనా?”

“సవాలు చేసే ప్రతివాడూ ఒంటరివాడే.”

“నా లాగా ఏ సవాలూ చేయనివారు?”

ఈమెకు ఇదో తుంటరి అలవాటు. ఉన్న పళంగా తన దగ్గరకి తీసుకుని వస్తుంది. ఎందుకో సీరియస్‍గా ఉన్న మాటని మార్చాలనిపించింది.

“సవాలు చేస్తున్నావు సారికా!”

“ఎలాగ?”

“నీ వాలు కనులు నన్ను పలుమార్లు సవాలు చేస్తున్నాయి.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here