పూచే పూల లోన-79

0
14

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍తో మాట్లాడుకునేందుకు, జుహు బీచ్‌లో ఎవరికి దొరకని చోట రహస్యంగా బుక్ చేయిస్తుంది సారిక. ఆ పూట డబ్బు గురించి, బంధాలు అనుబంధాల గురించి మాట్లాడుతుంది. అవి సముద్రంలోని అలల్లా వస్తాయి, పోతాయని అంటుంది. మరి ఏది ముఖ్యమని సమీర్ అడిగితే, ఇవేవీ కావు, ముఖ్యమైనది కాలం అని చెబుతుంది. ఎందుకని అడిగితే, ఈ క్షణంలోనే జీవించెయ్యాలనీ, మన సమయం అయిపోయిన తరువాత కూడా మన పని లోకంలో మిగిలిపోవాలని అంటుంది. తమ గురించి పేపర్లలో వస్తున్న వార్తలని ప్రస్తావిస్తాడు సమీర్. అవి వార్తలు కాదు, మనం నిజంగానే దగ్గరగా ఉంటున్నాం అంటుంది సారిక. ఎంత దగ్గర అని సమీర్ అడిగితే, మాట మార్చి, ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నావని అడుగుతుంది. ఓపిక ఉన్నంత వరకూ అని చెప్తాడు. తాను అన్ని చేయలేనని, ఒక్క ఏడాది వయసు పెరిగినా, అమ్మాయిలను ఒప్పుకోరని అంటుంది. తాను కాకుండా వేరే హీరోయిన్‍లతో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని అడుగుతుంది. చాలా బావుంటుందని అంటాడు. పబ్లిక్ గురించి మాట్లాడుతుంది సారిక. తాను ఈ ప్రపంచానికి ఎన్నడూ అలవాటు కానని అనిపిస్తుందంటాడు సమీర్. దూరంగా వెళ్తున్న షిప్‌ని చూస్తూ – అందులో తన తండ్రి ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. మరి అమ్మ అని సారిక అడిగితే, అమ్మ ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుందంటాడు. వెళ్ళి చూడవచ్చు కదా అని సారిక అడిగితే, నాన్నని తలచుకుంటే వెళ్ళబుద్ధి కాదని చెప్తాడు సమీర్. తర్వాత మాట మారుస్తాడు. – ఇక చదవండి.]

చాలా రోజుల తరువాత జో ఫోన్ చేసాడు.

“అడక్కూడదు, అయినా ఆడుగుతున్నాను”, అన్నాడు.

వాస్తవానికి నాజూ జో కీ మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు, ఉండదు. కానీ ఎందుకైనా మంచిదనుకున్నాడో ఏమో, ఓ మాట అలా ఉంచాడు.

“అడుగు.”

“అడుగుల గురించే”

“అడుగు.”

“జాగ్రత్తగా పడుతున్నాయా?”

“పడటం లేదా?”

“రజనీశ్‌తో బాగానే ఉంటోందా?”

“ఎందుకని అలా అడిగావు? ఏదైనా విన్నావా?”

“సూటిగా చెబుతాను.”

“యస్?”

“సారిక మూలంగా మీ ఇద్దరూ దూరమైనారనీ, ఇక మీద సినిమాలు కలిసి చెయ్యరని విన్నాను. నిజమా?”

“కాదు.”

“మరి ఏది నిజం?”

“ఏదీ నిజం కాదు. రజనీశ్ పెద్దమనిషి. పూర్తి ప్రొఫెషనల్. సారికకు, నాకూ దోస్తీ మటుకే. రజనీశ్ ఏ రోజూ ఈ విషయం ప్రస్తావించలేదు.”

“నువ్వు ఈ రోజు సారికను వెంట వెట్టుకుని తిరిగినట్లు రజనీశ్ చాలా సార్లు తిరిగాడు. తెలుసు కదా?”

“తెలుసు.”

“మరి రేపు..”

“జో!”

“తప్ప్పుగా అనుకోకు పార్ట్‌నర్. అన్ని వేళలూ ఒకలాగ ఉండవు, అన్ని వ్రేళ్ళూ ఒకలాగా ఉండవు. ఇది వేళాకోళం కాదు.”

“నువ్వు కాబట్టి నన్ను ఎలర్ట్ చేసావు. అయినా చాలాసార్లు ఈ ఆలోచనలు నా బుర్ర పాడు చేసాయి. కానీ ఒక్క విషయం అడుగుతాను.”

“అడుగు.”

“నీ ఆరోగ్యం ఎలా ఉంది?”

వింతగా నవ్వాడు జో.

“నా ఆరోగ్యానికేం? దర్జాగా ఉన్నాను. నువ్వు సెలెబ్రిటీవి. నేను – నువ్వు నాకు తెలిసిన సెలెబ్రిటీని. అదేంటో ఏ బార్‍కెళ్ళినా, నన్ను ఎవరూ బిల్ కట్టనీరు. ఎన్నికలలో నిలబెట్టాలనుకుంటున్నారు.”

“నువ్వు అలాంటి పనులు చెయ్యవని నాకు తెలుసు. నాకు అక్కడికి వచ్చేయాలనుంది జో.”

“ఎందుకు?”

“చల్లగాలికి సాయంత్రం చక్కగా ఏదో గిటార్ వాయించుకుంటూ పాడుకుంటూ ఉంటే ఆ ఆనందం వేరు.”

“నిజమే. కానీ జీవితం అక్కడితో ఆగిపోకూడదు. ఇప్పుడు నువ్వు గోవా ప్రజలకు ఓ గొప్ప ప్రతినిధివి. అది మరచిపోకూడదు. నీ మీద చాలా బాధ్యతలున్నాయి మరి.”

“అది నిజమని నమ్మాలనే ఆశ ఉంది జో. ఒక జీవితంలో, ఒకే జీవితకాలంలో ఇద్దరు హీరోలను చూసిన వారమవుతాను.”

“అది నిజం.”

“ఇంతకీ సారిక, రజనీశ్, నా గురించి ఈ సందర్భం ఈ రోజే ఎందుకు ముందుకు వచ్చింది?”

“సారిక తండ్రి మలేసియాలో పెద్ద వ్యాపారస్థుడు. చెప్పిందా?”

“లేదు.”

“ఇండియా వదిలి చాలా కాలం అయింది.”

“ఇక్కడికి రాడా?”

“రాడు. ఇప్పుడు వస్తాడు.”

“ఎందుకు?”

“నీతో మాట్లాడాలి కదా?”

ఆశ్చర్యం వేసింది. జో కి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నాతో మాట్లాడడానికి సారిక తండ్రి రాబోతున్నాడా? అంటే సారిక ఏదో పెద్ద అడుగే ముందుకు వేసిందన్న మాట!

“ఏం మాట్లాడాలి?”

“సారిక సంగతి.”

“నో..”

“అదేంటి?”

“మేము అలాంటిదేమీ అనుకోలేదు.”

“పిచ్చివాడా! సారిక తన తండ్రితో పది సంవత్సరాల తరువాత మాట్లాడింది.”

“ఇవన్నీ నీకెలా తెలుసు?”

“పిచ్చివాడా! పంచుకున్న దానినే ప్రపంచం అన్నారు. తిన్నావా?”

“తిన్నాను.”

“పడుకో. గుడ్ నైట్.”

***

తలుపు తోసి ఆ అపార్ట్‌మెంట్ హాల్లోకి అడుగుపెట్టాను. నా వెనుకనున్న తలుపు మూసేసి గడియ పెట్టేసాను. సోఫాలో ఒంటరిగా కూర్చున్న సారిక విస్తుపోయి నిలబడిపోయింది. పెదాలు కొరుక్కుంది. నేను కదలలేదు, మాట్లాడలేదు. తనూ ఏమీ మాట్లాడలేదు. టీపాయ్ మీద ఏవో పుస్తకాలున్నాయి. రెండు మేగజైన్లున్నయి. వాటి మధ్యలో తన మొబైల్ అంది. దాన్ని తీసుకోబోయి ఎందుకో అక్కడే ఉంచేసింది. మరల దాని వైపు ఎందుకో భయంగా చూసింది.

జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి ఒక సిగరెట్ ఇవతలకి తీసాను. డోర్‌కి ప్రక్కగా ఉన్న ఒక స్టూల్ మీదనున్న ఆష్ ట్రేను జాగ్రత్తగా చూసాను. దాని ప్రక్కన ఓ అగ్గిపెట్టె ఉంది. దానిని తీసుకోబోయి ఆగాను. సారిక నన్ను పరీక్షగా చూస్తోంది.

ఎందుకైనా మంచిదని జేబు లోంచి లైటర్ తీసాను. నా కుడికాలు కొద్దిగా మడిచి వెనుకనున్న తలుపు మీద పాదం ఆన్చాను. సిగరెట్ ముట్టించాను. ఏం చేస్తావన్నట్టు సారికను చూసాను. ఏమీ చేయకన్నట్లు చూసింది.

మా ఇద్దరికి అవతల ఉన్న గోడకి ఓ పెద్ద కిటికీ ఉంది. దానికి అవతల బాల్కనీ ఉంది. గాలికి ఆ కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. ఆ చప్పుడికి అటు వెళ్లబోయి ఎందుకో ఆగి మరల ఇటు తిరిగింది. మేగజైన్ కాగితాలు గాలికి ఎగురుతున్నాయి.

ఏదో అనబోయి ఆగిపోయింది సారిక. పరీక్షగా చూసి మూతి బిగించాను. సిగరెట్ తన పని అది చేసుకుంటుంది – లోలోన కాలిపోతోంది!

ఆ పొగ పోతున్న దారిని భయంగా చూస్తోంది.

గబుక్కున మొబైల్ తీసుకోబోయి రిమోట్ తీసుకుని నంబర్లు నొక్కింది. నేను కళ్ళు పెద్దవి చేసి వ్యంగ్యపు ధోరణిలో చిరునవ్వు నవ్వి ఊర్కున్నాను.

ఆ రిమోట్ అక్కడ పరేసి రెండు చేతులూ చెవుల మీద పెట్టుకుంది. ఏదో పెద్ద మోత తట్టుకోలేకుండా ఉన్నట్లు కళ్ళు మూసుకుని గింజుకుంది.

కళ్ళు తెరచింది. గుటకలు మింగింది. దీర్ఘమైన శ్వాస తీసుకుంది.

“న..”

ఏంటి అన్నట్లు చూసాను.

“నన్ను..”

“….”

“నన్ను వదిలేయ్ ప్లీజ్!”

గోడ మీద చెయ్యి పెట్టాను. ఏమి మాట్లాడలేదు. సిగరెట్ పీలుస్తూనే ఉన్నాను.

“నేను ఏమేమో అనుకున్నాను.”

సిగరెట్ పీక నలిపి ఆష్ ట్రే లో వెయ్యబోయి ఆగాను. దానిని నా దగ్గరే ఉంచుకున్నాను. నిజమా అన్నట్లు తల ఊపాను.

“నాకు ఊహలే తప్ప నిజ జీవితం గురించి తెలియిదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నన్ను ఏమీ చెయ్యకు.. ప్లీజ్!”

నేను ఏమీ మాట్లారలేదు. రెండు చేతులూ నా వెనుక పెట్టి క్రిందకి చూస్తూ నిలబడ్డాను.

“మగవాళ్ల మీద దురుసుగా మాట్లాడాను..” అంటోంది, “..నిన్ను ఎన్నో సార్లు పరీక్షించి చూసాను. నువ్వు బాధ పడతావని తెలుసు. వింత వింతగా మాట్లాడాను. నన్ను వదిలెయ్.. ప్లీజ్”

వెనక్కు తిరిగాను. ఏదో గుర్తుకొచ్చి మరల తన వైపు తిరిగాను. చాలా భయపడుతోంది. రెండడుగులు ముందుకు వేసి ఆగాను. కిటికీ రెక్క ఈసారి గాలికి మూసుకొని బిగుసుకుంది. కదలటం లేదు. కర్టెన్ ఒకటే ఊగిపోతుంది. ఆ కిటికీ వైపు రెండడుగులు వేసి ఆగిపోయింది సారిక. పైట పూర్తిగా కప్పుకుంది. నా వైపు తిరిగి బేలగా మొహం పెట్టుంది.

టీపాయ్ మీద ఉన్న మాగజైన్లలోని పేజీలు అటూ ఇటూ తిరిగి ఒక చోట ఎందుకు నా కోసమే.. కాదు మా ఇద్దరి కోసమే ఆగిపోయినట్లు ఆగాయి. ఎడమ ప్రక్కనున్న పేజీ మీద తన ఫోటో, కుడి ప్రక్కన పేజీ మీద నా ఫొటో కనిపిస్తున్నాయి.

ఆ మేగజైన్‍ను మూసేసింది. అడ్డదిడ్దంగా పెట్టింది.

“నన్ను క్షమించు.” అంది.

దీర్ఘమైన శ్వాస తీసుకుని, వదిలి అలాగే అన్నట్లు తల ఊపి వెనక్కు తిరిగాను. తలుపు గడియ తీసి బయటకు వచ్చి తిరిగి గబుక్కున లోపలికి వెళ్ళి గడియ వేసుకోమని సైగ చేసి, చిలిపిగా, చిరునవ్వు నవ్వి వచ్చేసాను..

“కట్”, గట్టిగా అరిచాడు డైరక్టర్ రజనీశ్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here