నేటికీ అలరించే నాటి ప్రయోగాత్మక చిత్రం ‘పూజాఫలము’

1
9

[dropcap]‘ప్రే[/dropcap]మ’ ఇతివృత్తంతో మన దేశంలో కుప్పలు కుప్పలుగా సినిమాలు వచ్చాయి. చాలా వరకు అదో అందమైన భావన అని, జీవితంలో పొందవలసిన అనుభవం అనే ఆలోచన కలిగించే సినిమాలు అవి. అయితే ‘ప్రేమ’ కలిగించే అయోమయం గురించి స్పష్టంగా చర్చించిన సినిమాలు తక్కువే. ఒక మనిషిపై ఇష్టం కలిగినప్పుడు అది స్త్రీ పై పురుషుడికో, పురుషుడిపై స్త్రీకో అయినా, ఆ తీవ్రత ఒకేలా ఉంటుంది. ఆ ఇష్టానికి ఆ వ్యక్తులు ఇచ్చే రూపం వేరయినా అందులోని బాధ, విరహం ఒకే స్థాయిలో ఉంటాయి. ఆ ఇష్టాన్ని బంధం రూపంలో మార్చుకునే సమయంలో కొన్ని లెక్కలు, ఆలోచనలు వారిని డామినేట్ చేస్తాయి. ఆ సమయంలోనే ప్రేమ మనిషిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ మనసు గాయానికి కారణమవుతుంది. ఆ గాయాల ప్రభావం జీవితాంతం వెంటాడుతుంది. ఈ విషయం అర్థం అయ్యే కావచ్చు పాత తరం వారు అమ్మాయి యుక్తవయసుకు వచ్చాక, ఆమెను పురుషుల సాంగత్యం నుంచి వేరు చేస్తారు. వయసు చేసే మాయ, ఆ వయసులో కలిగే తీవ్రమైన ఇష్టాలు, మోహాలు ఎంత అందంగా ఉంటాయో అవి వికటిస్తే అంత ప్రమాదానికీ గురి చేస్తాయి. 1964లో వచ్చిన ‘పూజాఫలము’ సినిమా చర్చించిన విషయాలు ఇవే.

ఈ సబ్జెక్ట్‌తో సినిమా తీయడమే ఒక పెద్ద సాహసం. అదీ ఆ రోజుల్లో. బి.ఎన్. రెడ్డి గారే చేయగల పని అది. ఈ సినిమాకు మూలం మునిపల్లె రాజు రాసిన ‘పూజారి’ నవల. సినిమాలో చర్చించిన విషయాలు తప్పకుండా ప్రతి ఒక్కరికీ చేరవలసిన నిజాలు. అయితే సినిమాగా ఈ కథను మార్చడం చాలా కష్టం. అదీ తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం అయితే మరీ కష్టం. అందుకే రెండవ సగంలో కొంత తడబాటు కనిపిస్తుంది. బి.ఎన్ రెడ్డి గారి లాంటి దిగ్గజ దర్శకులే ఈ సబ్జెక్టుకి పూర్తిగా న్యాయం చేయలేకపోయారని చెప్పవలసి వస్తుంది. అంత క్లిష్టమైన సబ్జెక్ట్ ఇది. సినిమాగా మలుస్తున్నప్పుడు ప్రేమలోని ఈ అయోమయపు స్థితి గురించి స్పష్టమైన అవగాహన కథా రూపంలో కల్పిస్తూ మళ్ళీ ఆడియన్స్‌ని రంజింప చేయాలి. దానికి బి.ఎన్. గారు కొంత మెలోడ్రామాని జోడించడం జరిగింది. అందుకే చివర్లో సినిమాలో నడిచే సంఘటనలు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అలాగే అనవసరంగా కామెడీని చొప్పించారని అనిపిస్తుంది కూడా.

ఒక పెద్ద జమిందారు కొడుకు మధుబాబు. తల్లి మరణం అతని జననం ఒకే రోజు కావడంతో పుట్టిన రోజు సంబరాలకు కూడా నోచుకోకుండా అతని బాల్యం గడుస్తుంది. చదువు, సాహిత్యం, సంగీతం అతని స్నేహితులు. ప్రపంచంలోని ఏ పోకడలు అంటని పసి మనసు అతనిది. ఆ వయసుకే రామాయణ భాగవతాలు చదివే వ్యక్తి. అలాంటి మధుబాబు జీవితంలో తుఫానులా వస్తుంది వాసంతి. ఒక బ్యాంకు మేనేజరు కూతురు ఈమె. జమిందారు ఇంట్లో క్రింది పోర్షనులో అద్దెకు వస్తుంది. ఆమె మందకోడిగా సాగుతున్న మధుబాబు జీవితంలోకి ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఆమె గానం, అల్లరి, చలాకితనం మధుబాబుని మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి. స్త్రీ సాంగత్యంతో వచ్చే ఆనందాన్ని అతను జీవితంలో మొదటిసారి ఆస్వాదిస్తాడు. అతనితో వాసంతి చనువుగా ఉంటుంది. అది తప్పని ఆమె తల్లి ప్రశ్నిస్తే తన చనిపోయిన అన్నను మధుబాబులో చూసుకుంటున్నానని బదులిస్తుంది ఆమె.

అయితే ఇక్కడ చాలా సందర్భాలలో స్త్రీ చేసే పొరపాటు ఆ పురుషుని మనసులో తన పట్ల ఉన్న అభిప్రాయం గురించి ఆలోచించలేకపోవడం. అప్పటి దాకా స్త్రీ ప్రేమ తెలియని మధు వాసంతిని ఆరాధిస్తాడు. ఆమె తన సర్వస్వం అనుకుంటూ ఉంటాడు. ఆ అత్మీయత శాశ్వత బంధం అవాలని కలలు కంటాడు. స్త్రీ సాంగత్యం పురుషునిలో రేపే కల్లోలం గురించి పురుషునితో స్నేహం చేస్తున్న స్త్రీలు చాలా సార్లు ఆలోచించరు. ప్రశ్నించినప్పుడు చనువుగా స్త్రీ ఉంటే అది బంధంగా మారవలసిందేనా అని కొన్ని సార్లు అలా ఆలోచించడం పురుషుని ఆలోచనలో తప్పుగా కొట్టిపడేస్తారు కూడా. శారీరిక ఆకర్షణ కన్నా మానసిక ఆకర్షణ చాలా ప్రమాదకారి. మానసికమైన ఆరాధన పురుషుడ్ని వివశుడిని చేస్తుంది. ఆది దెబ్బ తిన్నప్పుడు అతను శాశ్వతంగా గాయపడతాడు. ఈ విషయాన్ని పురుషుని కోణంలో చూపించిన గొప్ప సినిమా ‘పూజాఫలము’.

చదువు కోసం పట్నం వెళతాడు మధుబాబు. అక్కడ అతనికి వాసంతి ఆలోచనలే. స్నేహితుడిగా పరిచయం అయిన శ్రీరాంకి తన ప్రేమ విషయం చెబుతాడు. వాసంతికి కానుకగా ఒక హారం తీసుకుని ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాలని తపన పడతాడు. తండ్రి మరణించడంతో ఊరు చేరిన మధుకి, వాసంతి కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్ళిపోయారని, వారెక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదని చెబుతారు పనివారు. వాసంతి అతనికోసం అతను కొనిచ్చిన పుస్తకాలను వదిలి వెలుతుంది. అందులో తనకు రాసిన ఉత్తరంలో తండ్రి బ్యాంకు దివాళా తీయడంతో తాము రాత్రికి రాత్రే వెళ్ళిపోతున్నామని చెబుతూ అతని ప్రేమని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని రాస్తూ చివర్లో మీ సోదరి అని సంతకం చేస్తుంది. ఆ సంబోధనతో మధుబాబు గుండే పగిలిపోతుంది. తాను ఆమె చనువును తప్పుగా అర్థం చేసుకున్నానని తెలిసి ఒక గిల్ట్‌కి గురి అవుతాడు అతను. తనతో చనువుగా ఉంటూ తనలో ఇన్ని అనుభూతులను రగిల్చిన వాసంతి, తనకు ప్రేయసిగా కనిపించడం తనలోని లోపం అన్న భావం అతనిలో చేరిపోతుంది.

ఇలాంటి సందర్భంలో స్త్రీలు ఆలోచించని విషయం ప్రేమ అనుకున్న బంధం సోదర బంధంగా లేదా స్నేహబంధంగా మారడాన్ని తట్టుకోలేని పురుష హృదయాలకు మానవ బంధాలపైనే ఒక అపనమ్మకం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఇదే స్త్రీ పట్ల ద్వేషంగా, తేలిక భావంలా కూడా మారిపోతుంది. ఆ భావం నుంచి బైటపడి మళ్ళీ స్త్రీని ప్రేమించడానికి ఆ పురుషుని మనసు చాలా కష్టపడుతుంది. అటువంటి కష్టం నుండి బైటపడడం ప్రతి పురుషునికి సాధ్యం కాదు. సహజంగా స్త్రీని తనదిగా, తన హక్కుగా భావించే గుణం పురుషునిలో ఎక్కువగా ఉంటుంది. స్త్రీ పట్ల అనుబంధంలో మార్పు వచ్చినప్పుడు అందుకే వారి అహం దెబ్బతింటుంది. ఆ అహన్ని అధిగమించే మంచితనం వారిలో తెచ్చుకోవడానికి వాళ్లు పడే ఇబ్బంది వారిని చాలా సార్లు ప్రమాద స్థాయికి తీసుకువెళుతుంది. ఆ స్థితిని నిజాయితీగా చర్చించిన మొదటి తెలుగు సినిమా ‘పూజాఫలము’.

వాసంతి వెళ్ళిపోతూ తన సోదర భావాన్ని ప్రకటించడం వలన మధుబాబులో అపరాధ భావం పెరుగుతుంది. ఇదే ఆవేశపరుడైన పురూషుడైతే అది కోపంగా కసిగా బైటపడుతుంది. కాని మధుబాబు అతి మంచివాడు. వాసంతి సోదర భావాన్ని అర్థం చేసుకోలేక ఆమెలో ప్రేయసిని చూసానన్న అపరాధ బావం అతని దహించి వేస్తుంది. జబ్బు పడతాడు. అప్పుడు అతనికి సేవలు చేస్తుంది అతని మేనేజర్ రామకృష్ణయ్య గారి కూతురు సీత. సీత మధుబాబు బాగోగులు చూసుకుంటూ అతనికి దగ్గర అవుతుంది. ఆమెలో తల్లి మనసు, ప్రేమ, భక్తి భావం, తనలాగే సంగీత సాహిత్యాల పట్ల గౌరవం ఇవన్నీ మధుబాబును ఆకర్షిస్తాయి. ఇక్కడే సమస్య మొదలవుతుంది. తనలో సీత పట్ల కలిగిన ఆరాధన రూపం మధుబాబుకి అర్థం కాదు. ఆమె లేనిదే జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఆమె సాంగత్యంలో ఓదార్పు అతనికి జీవితాన్నిస్తుంది. కాని వాసంతి విషయంలో చేసిన తప్పిదం మరోసారి జరిగితే మనసు తట్టుకోలేనని మొరాయిస్తుంది. అందుకే రామకృష్ణయ్య కూతురికి సంబంధాలు చూడాలని ధన సహాయం కోసం మధుబాబుని అర్థిస్తే అతను తనకు ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తీకరించలేక పోతాడు, అమె వివాహ భాద్యతను తాను తీసుకుని ఆమె వివాహం కోసం ఎంత డబ్బునైనా వెచ్చించడానికి సిద్దపడతాడు.

సీత మాత్రం మధుబాబుని ప్రేమిస్తుంది. తన పెళ్ళి కోసం అతనే పూనుకున్నాడని తెలిసి బాధపడుతుంది. తమ మధ్య ఉన్న ఆర్థిక దూరం వలన అతను తాను చూపించే ప్రేమను గుర్తించలేకపోతున్నాడని బాధపడుతుంది. తన మనసు తెలుసుకోక తనకి పెళ్ళి చేయాలని చూస్తున్న అతనిపై విరుచుకుపడుతుంది. ఆమె కోపం మధుబాబుకి అర్థం కాదు. వాసంతి సాంగత్యంలో జరిగిన గాయం అతన్ని ఆలోచించనివ్వదు, ధైర్యంగా తన ప్రేమ విషయం ప్రస్తావించనీయదు. సీత అకారణ కోపం అతను తట్టుకోలేకపోతాడు. కోపంతో తన దగ్గర ఉన్న డబ్బు రామకృష్ణయ్యకు ఇచ్చి సీత పెళ్లి విషయంలో తాను ఇక జోక్యం చేసుకోనని చెప్పి పట్నం వెళ్ళిపోతాడు.

ఇలాంటి మంచితనం, డబ్బు, ఉన్న వ్యక్తుల మానసిక బలహీనతలను వాడుకునే వారు ప్రపంచంలో చాలా మంది కాచుకుని ఉంటారు. అలా దొరికిన ఒక మిత్రుడు మధుబాబు సంగీత సాహిత్య పిచ్చి తెలిసి అతన్ని ఒక నాట్యగత్తెకు పరిచయం చేస్తాడు. మధుబాబు మంచితనం, గాయపడిన హృదయం చూచాయిగా గ్రహించిన ఆ నాట్యగత్తె పరివారం మొత్తం మధుబాబు ఇంటికి వచ్చి అక్కడ చేరిపోతారు. తనలోని అసంతృప్తిని ప్రేమరాహిత్యాన్ని నిద్రపుచ్చడానికి మధు బాబు ఆ నాట్యగత్తెకు దగ్గర అవుతాడు. ఆమె కోసం విపరీతంగా డబ్బు ఖర్చుపెడతాడు. అతని స్థితిని అసహాయంగా చూస్తూ ఉంటారు సీత రామకృష్ణయ్యలు. ఇక్కడ దాకా మధుబాబు పాత్రను పర్ఫెక్ట్‌గా తీసారు బి.ఎన్. రెడ్డి గారు. ఇక ఇక్కడ కొంత నాటకీయత జోడీంచడం కనిపిస్తుంది.

కొన్ని కారణాలతో సీత ప్రోద్బలంతో ఆ నాట్యకత్తె పరివారాన్ని బైటికి పంపిస్తాడు మధు. అతనిపై దాయాదులు ఆస్తి గురించి కేసు వేసి ఆస్తి జప్తు చేసుకోవడంతో నిలువ నీడ లేని మధుబాబుని తన ఇంటికి తీసుకుని వెళతాడు రామకృష్ణయ్య. అక్కడ నాటకీయంగా కేసు గెలవాడిని కావల్సిన పత్రాలు భూమిలో దొరకడం, కేసు మధుబాబు గెలుస్తాడు అని అర్థం చేసుకుని దాయాదులు అతనిపై హత్యా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బైట పడిన మధు తన జ్ఞాపక శక్తిని పోగొట్టుకుంటాడు. అతని డబ్బుతో చదువుకున్న శ్రీరాం డాక్టరుగా ఇక్కడ మళ్ళీ కనిపిస్తాడు. మధుబాబుని మామూలు మనిషిని చేయడానికి, గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తాడు. తన ఇంటికి మళ్లీ వచ్చిన మధుకు ఆ ఇంట్లో వాసంతి నవ్వు, వాసంతి పెంచుకున్న కుక్క అరుపు వినిపిస్తుంది. కుక్క అరుపు అన్న క్లూ పట్టుకుని వాసంతి గురించి తెలుసుకుంటాడు శ్రీరాం. అయితే ఆ వాసంతి తన భార్య అని అతనికి తరువాత తెలుస్తుంది. మధుబాబుని మామూలు మనిషిగా చేయడానికి సీత అతని చేతికి వయోలిన్ ఇస్తుంది. దాన్ని సాధన చేస్తున్న మధు కొద్ది కొద్దిగా గతంలోకి వెళతాడు. వాసంతి తాను మధుతో పరిచయం అయిన కొత్తలో పాడిన పాటను మళ్ళీ వచ్చి పాడడం దానితో మధు గతం గుర్తుకు రావడం జరుగుతుంది.

ఇక్కడ దాకా వచ్చాక వాసంతిని చూడగానే చెల్లీ అని మధుబాబు సంబోధించి ఆమెను ఆహ్వానించడం పూర్తి నాటకీయతతో నడిచే సన్నివేశం. సినిమా మొత్తంలోని సీరియస్‌నెస్ ఈ సీన్‌తో పాడయి అప్పటి దాకా మధు పాత్ర లోని సంఘర్షణ హస్యాస్పదంగా కనిపిస్తుంది ఆడియన్స్‌కి. క్లైమాక్స్‌లో వాసంతి మధుబాబుల సంభాషణ మరోలా ఉంటే బావుండేదనిపిస్తుంది. సినిమా సీత మధుబాబుల వివాహంతో ముగుస్తుంది. వాసంతి మధుబాబుల దగ్గరితనం కారణంగా మధుబాబులో చెలరేగిన తుఫానుకి ఒక సరయిన ముగింపు ఇవ్వలేకపోయారనిపిస్తుంది దర్శకులు. అదే ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ఫెయిల్ చేయడానికి కారణమయింది.

వాసంతి కావాలని మధుబాబు మనసుతో ఆడుకోదు. కాని స్త్రీతో అనుబంధాన్ని ఆస్వాదిస్తున్న క్రమంలో పురుషుని మనసులో భావాల విషయంలో ఒక స్పష్టత ఉండకపోతే అది ఆ వ్యక్తిని జీవితాంతం ఎలాంటి కష్టాలపాలు చేస్తుందో, వాసంతి మధుబాబుల అనుబంధం స్పష్టం చేస్తుంది. తాను మధుబాబుని సోదరునిగా భావిస్తున్నానని వాసంతి అనుకుంటుంది. కాని మధుబాబు తన గురించి ఏం అనుకుంటున్నాడో ఆమె ఆలోచించవలసిన బాధ్యత కూడా ఉంది. తల్లి ప్రేమే తెలియని మధుబాబు, స్త్రీలతో స్నేహమే ఎరుగని మధుబాబుకి మరో స్త్రీలో సోదరిని చూడాలనే ఆలోచన వచ్చే అవకాశమే తక్కువ. అతనికి జీవితంలో దొరికిన మొదటి స్త్రీ లాలిత్యం వాసంతి దగ్గరే. అప్పుడు ఆమెను సోదరిగా భావించాలనే ఆలోచన అతనిలో సహజంగానే కలగదు. అందుకే ఆ సంగతి తెలిసి అతని గుండే గాయపడుతుంది. సీత ప్రేమను ఆస్వదిస్తూనే తన మనసులో ఆమె పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచలేకపోతాడు. కాని తరువాత పరిచయం అయిన ఆ నాట్యగత్తెలో ఎటువంటి అస్పష్టతా ఉండదు. మొదటి నుండి ఆమె మధుబాబు పట్ల ఆకర్షణను వ్యక్తీకరిస్తూనే ఉంటుంది. అయితే అది నాటకం అని మధుబాబుకి తెలియదు. ఆమెతో ఉన్న స్నేహంలోని ఆ స్పష్టత కారణంగా ఆమె పట్ల ప్రేమ లేకపోయినా ఆమెతో దగ్గరగా ఉండగలుగుతాడు. కాని మర్యాద సంప్రదాయం మాటున ఉండే సీత దగ్గర ఆ చనువు తీసుకోలేకపోతాడు. ఆమె పట్ల ప్రేమను ప్రకటించి తాను మళ్ళీ ఒక మూర్ఖుడిగా నిలబడిపోవడానికి అతను సాహసించలేకపోతాడు.

స్త్రీ పురుషుల మధ్య బంధాలలో ఈ అయోమయాన్ని ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత ఆరోగ్యకరంగా ఉంటాయి సంబంధాలు. కాని ఆకర్షణ, అయోమయం, వయసు, అపరిపక్వత, అవగాహనలేమి ఇవన్నీ ఉండే వయసులో సహజంగా స్త్రీ పురుషుల మధ్య బంధంలో స్పష్టత ఉండదు. కొన్ని సార్లు ప్రేమకు ఆకర్షణకు తేడా తెలీదు, కొన్ని సార్లు అది స్నేహమా, వయసు ఆకర్షణా, అవకాశం వయసు వాతావరణంతో వచ్చిన స్వేచ్ఛ అన్నది కూడా వారికి అర్థం కాదు. ఇలాంటి కారణాలతో గాయపడిన హృదయాల అనుభవాలు వారి ఇతర బాంధ్యవ్యాలపై కూడ ప్రభావం చూపిస్తాయన్నది మాత్రం నిజం. ఈ విషయాన్ని చర్చించిన మొదటి తెలుగు సినిమాగా ‘పూజాఫలము’ను తెలుగు సినిమా ప్రేక్షకులు గుర్తించాలి.

ఈ సినిమాకు అదనపు ఆకర్షణ పాటలు. తొమ్మిది పాటలున్న ఈ సినిమాలో ‘పగలే వెన్నెల’ గీతం ఆల్ టైం హిట్. ఈ పాటతో మనసులో చిగురించిన కొత్త అనుభవం మధుబాబు చేత ‘నిన్న లేని అందమేదో’ అనే మరో పాటను పాడిస్తుంది. ఒకేసారి వరుసగా రెండు పాటలు స్క్రీన్‌పై వచ్చిన మొదటి సినిమా ‘పూజాఫలము’. వాసంతి గీతంతో మనసులో మొలకెత్తిన ప్రేమ బీజం మధు బాబుకి ఎటువంటి అనుభవానిచ్చిందో చెప్పడం ఇక్కడ పాటతోనే సాధ్యం కాబట్టి ఇలా వెంట వెంటనే రెండు పాటలు వచ్చే ప్రయోగం చేసారు దర్శకులు. ఇక మిగతా పాటలన్నీ కూడా మ్యూజికల్ హిట్సే. చాలా జాగ్రత్తగా ఈ పాటలకు సాహిత్యాన్ని ఎన్నుకున్నారు దర్శకులు. డా. సీ నారాయణ రెడ్డి గారు ఈ సినిమాకి ఐదు పాటలు రాసారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారివి రెండు గీతాలుంటాయి. కొసరాజు గారి జానపద బాణీలో ఒక పాట, గానం శీనయ్య అనే మరో గేయరచయితది మరో పాట ప్రేక్షకులను అలరిస్తాయి.

వాసంతిగా జమున, సీత పాత్రలో సావిత్రి, మధుబాబుగా ఎ.ఎన్.ఆర్.లతో పాటు ప్రశంసలు అందుకునే నటన రామకృష్ణయ్యగా చేసిన గుమ్మడి గారిది. చాలా గొప్పగా నటించారీ సినిమాలో అయన. వయసు మళ్లిన వ్యక్తిగా, నిజాయితీ పరుడైన దివానుగా, ప్రేమను పంచే తండ్రిగా, సంరక్షుకుడిగా, తన పరిధి తెలిసిన ఉద్యోగిగా పరిపక్వత కూడిన వీరి నటన ఈ సినిమాకు పెద్ద ఎసెట్. ముగింపు పరంగా లోపాలున్నా తెలుగులో ఆ కాలంలో వచ్చిన ప్రయోగాత్మక సినిమాగా ‘పూజాఫలము’ నేటికీ ప్రేక్షకులను అలరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here