‘పూర్ణమూ… నిరంతరమూ…’ – పుస్తక పరిచయం

0
13

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత శ్రీ కె. ఎ. మునిసురేష్ పిళ్ళె రచించిన 19 కథల సంపుటి ఈ పుస్తకం.

ఇందులో – 2.0, అనాది అనంతం, ఆ రోజు, ఆ 5 నిమిషాలు, ఇక్కడే ఉన్నాడేమిటీ?, ఈగ, కొత్త చెల్లెలు, గడ్డి బొగ్గులు, గార్డు వినాయకం భజే, తోట కాడ బావి, తపసుమాను, నా నూకలు మిగిలే ఉన్నాయ్, పశువుల కొట్టం, పులినెక్కిన గొర్రె, పూర్ణమూ… నిరంతరమూ…, పేరు తెలియని ఆమె, మా ఆయన అపరిచితుడు, రుచుల జాడ వేరు, వరాలత్త గాజులు – అనే కథలున్నాయి.

~

“అనుక్షణమూ మారుతున్న ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించే నిశితమైన చూపూ, చూసిన సత్యాల్ని సక్రమంగా అర్థం చేసుకునే నేర్పూ, అర్థమైన విషయాల్ని సాహిత్యీకరించే సృజనాత్మకతా సురేష్‍లో సహజమైన గుణాలుగా పెంపొందాయి. ఈ కథలు చదువుతున్నప్పుడు మనం ఈ ప్రపంచాన్ని పునర్మూల్యాంకనం చేసుకోగలుగుతాం. మనల్ని మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాం. యీ లోకంలో బాగుండని వాటికి చింతిస్తాం. దీన్ని మరింత సుందరంగా తయారు చేసుకునే దారిని వెతుక్కుంటాం. ఉత్తమ సాహిత్యాని కింతకంటే మరో పరమావధేమీ వుండదని తెలుసుకున్నాకా, మునిసురేష్ పిళ్ళె అనే మంచి మానవుడితో కలిసి జీవనయానం చేయడానికి వుత్సాహపడతాం.” అని తన ముందుమాట ‘సాహిత్య పాత్రికేయం’లో వ్యాఖ్యానించారు మధురాంతకం నరేంద్ర.

~

“కథల్లో రచయిత ఒక ‘విషయం’ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. విషయం చెప్పడం కోసం దానిచుట్టూ చక్కెరపూతలాగా జీవితం అల్లుతాడు. ఆ జీవితంలోకి పాఠకుడిని తీసికెళ్తాడు. ఆ జీవితాల్లో పాఠకుడు తాను ఎరిగిన మనుషుల్ని, కొత్తవారిని కూడా గమనిస్తాడు. వారి భావోద్వేగాలతో మమేకం అయితేనే… రచయిత చెప్పదలచుకున్న విషయం పాఠకుడి బుర్రలో స్థిరపడుతుంది. కానీ ప్రతి కథకు రచయితే తొలి పాఠకుడు. ఆ కథలోని విలువలను సార్వజనీనత ఉంటేగనుక మొట్టమొదటగా ఇంకేది రచయిత లోనికే. కథలు రాయడం వెనుక కారణం, స్వార్థం అదే. గమనించిన, విన్న, చదివిన వాటికి అదనంగా… యిష్టపడిన, విలక్షణమైన విలువలను నాలోకి ఇంకింపజేసుకోవడానికి నేనెంచుకున్న తోవ రాయడం” అన్నారు రచయిత ‘నా వినుతి… నా వినతి’లో.

~

“కథకు ఎంచుకున్న శైలి వల్ల ‘పాజ్’ (విరామం) లేకుండా, కథకుడు ఒక ‘పైలెట్’లా తాను ముందుండి మనల్ని తనవెంట పరుగులు పెట్టిస్తూ లాక్కుపోతాడు. మళ్లీ మనల్ని వెనక్కి తిరిగి చూడనీకుండా తనతో లాక్కుపోవడం వరకు సరే! కథ చివర్న అర్థంతరంగా మనల్ని వదిలివేయడం కూడా అంతే నిర్లక్ష్యంగా, అంతే బాధ్యతారాహిత్యంగా వదిలేస్తాడు. శిల్పరీత్యా ఇది కథనంలో రచయిత చూపించదలచుకున్న పొగరు (ప్రైడ్) అనడానికి వెరవనక్కర్లేదు.” అన్నారు చోరగుడి జాన్సన్.

~

“డబ్బుచుట్టూ తిరిగే దారుణ క్రీడా మాయా వినోదాన్ని ఇంచక్కా చదవండి. కొంచెం కూడా అబద్దం కాదని నిజమేనని నమ్మండి. ఎవడెవడి కథో ఆరా తీయండి. వాస్తవాలు తెలుసుకోండి.” అని వ్యాఖ్యానించారు దాట్ల దేవదానం రాజు.

~

“హృదయాన్నీ, మెదడునీ ఉద్రేకపరచే కథన శిల్పి సురేష్ పిల్లె. నోస్టాల్జియా గుంటలో చేపలు పట్టడం మానేసి సమకాలీన వస్తు సాగరంలో తిమింగలాలను వేటాడటం ఆయన ప్రత్యేకత. తన మేధోతనాన్ని ఇతరులపై రుద్దకుండా అక్షర తూలికతో పాఠకుడిలో ఆలోచనల తుట్టెను రేపగల సమర్థుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునికతే అతడి ఆయుధం. ఎన్ని విన్యాసాలు చేసినా మానవతావాదమే ఆయన పునాది.” అన్నారు గొరుసు.

~

ఈ సంపుటి కోసం ప్రత్యేకంగా ఒక ఫాంట్ రూపొందించి, ఉపయోగించడం విశేషం!

***

పూర్ణమూ… నిరంతరమూ… (కథా సంపుటి)

రచయిత: కె.ఎ.ముని సురేష్ పిళ్లె

పేజీలు: xiv+200

వెల: ₹ 200

ప్రచురణ: ఆదర్శిని మీడియా, హైదరాబాదు

ప్రతులకు: నవోదయ, నవచేతన, విశాలాంధ్ర,

www.amazon.in, www.sureshpillai.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here