గొప్ప స్మృతి సంచిక ‘పూర్ణత్వపు పొలిమేరలో..’

0
12

[శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మృతి సంచిక ‘పూర్ణత్వపు పొలిమేరలో..’ని సమీక్షిస్తున్నారు మంత్రిపగడ శ్రీనివాస్.]

[dropcap]ప[/dropcap]రిపూర్ణత్వం కూడా తక్కువే అనిపించే వారిని వర్ణించడానికి ఏ స్థితీ సరిపోదు (Nothing is enough for the man to whom enough is too little) అంటాడు ప్రాచీన గ్రీకు తాత్వికుడు ఎపిక్యూరస్.

సీతారామశాస్త్రి గారిది అటువంటి వ్యక్తిత్వం.. ఆ అద్భుత వ్యక్తిత్వం ధగధగలాడే సూర్యుడి వెలుగు లాంటిది.. దాన్నుంచి ఆయనతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పరిచయమున్న ఎవరైనా వారి వారి పరిపక్వతననుసరించి ఫలితాలు పొందుతారు..

కానీ అందరికీ ఒక పరిపూర్ణత్వపు పొలిమేర చేరిన విషయం లీలగానైనా తెలుస్తూంటుంది..

శాస్త్రి గారిని కలిసి నప్పుడల్లా అయన అద్భుత ఆప్యాయతలో తడిసి ముద్దైపోతున్న సమయంలో కూడా నాకు

Yesterday, upon the stair,
I met a man who wasn’t there
He wasn’t there again today
అనే Hughes Mearns మహాశయుడు మాటలు గుర్తుకు వచ్చేవి.

అయన మనం చూసే భౌతిక రూపం కాదనీ మన ఆత్మను తట్టిలేపే ఒక మహానుభావుడని అనిపించేది.. జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటే అదేనేమో..

ఎన్నో మనసులని తట్టిలేపే మాటలు అనగలిగిన వ్యక్తి ఒక మామూలు మనిషైతే కాదు అందుకే ఆయన సాంగత్యం షిరిడిలో సాయినాథుడి సన్నిధి మనకెలా అనుభవమౌతుందో ఆలా అనిపించేది.. ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది.. అయన ఖంగుమని మోగే కంఠం ఇప్పడికీ నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది.. భళ్ళున అయన నవ్వే పసిపాప నవ్వులు ఇప్పడికీ నా గదిలో వెలుగులు నింపుతూనే ఉన్నాయి..

మహత్తరమైన భావాలని మామూలు భాషలో వ్యక్తీకరించడం అనితర సాధ్యమైన విషయం.. చాగంటి శరత్ బాబుగారన్నట్టు అణువణువునా శివతత్వం నింపుకున్నవారికే అది సాధ్యం..

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారన్నట్టు ఆయనకు మనుషులంటే పిచ్చి. వాళ్లతో సంభాషించడం, విభేదించడం, లాలించడం, ప్రేమించడం, మందలించడం, మంచిమాటలు చెప్పడం – వ్యక్తిగా మాటలతోనూ, వృత్తిగా పాటలతోనూ జీవితాంతం ఇదే చేసారు..

సాధారణ మానవులు తాము నిర్మించుకున్న చట్రాలలో పడి అదే ప్రపంచం అని భ్రమించి దిగాలు పడి నిరాశకు లోనయ్యే క్షణంలో శాస్త్రిగారి మాటలు దివినుంచి ఉరికే గంగా ప్రవాహంలా మనల్ని తడిపి ముద్దచేసి చల్లబరుస్తాయి.. కాస్త ఒడ్డుకి రాగానే గుండెల్లో మంటలు రేగించి కార్యోన్ముఖులని చేస్తాయి..

దడదడ దడదడలాడే ఎద సడి ఢమరుకమై
వడి వడి వడి వడి దూకే పదగతి తాండవమై
పంచ ప్రాణముల పంచాక్షరితో
శివుని పిలుచు సంకల్పమై
దూసుకు వచ్చే మృత్యువుకందని
మార్కండేయుడవై
పరుగులు తీయ్.. ఉరకలు వేయ్..

పై మాటలు విని రక్తం మరగని మనిషి ఎవరైనా ఉంటారా?

అయన మాటలూ పాటలూ విన్న ప్రతీసారీ కొత్త అర్థాలు చెప్తాయి.. మన పరిణతి మారుతూన్న కొద్దీ మరిన్ని భావాలు అర్ధమౌతాయి.. అదొక అనంత సాగరం..

ఈ పూర్ణత్వపు పొలిమేరలో చదివినప్పుడు మనం ఈ జీవితంలో ఎంతో పుణ్యం చేసుకున్నామనిపించింది.. ఒక పరిపూర్ణ వ్యక్తిని మనం చూడగలిగాం, అయన మాటలు వినగలిగాం.. పూర్ణత్వపు పొలిమేర చేరగలిగాం.. కానీ ఆ అదృష్టం నిలబడాలంటే ఆ పొలిమేరలో ఉండగలగడం కంటే మనం చెయ్యగలియేదేమీ లేదు.. మన జీవన చట్రాలు మనల్ని వెనక్కు లాగకుండా చూసుకుంటే చాలు అనిపించింది..

శాస్త్రి గారిని కలిసినప్పుడు ఒక పూర్ణత్వపు శిఖరం మనకళ్లముందు ఆవిషరించి “అదిగో భద్రాద్రి” అనిపిస్తుంది.. భద్రుడికి భద్రాద్రి ఎంత దూరమో శాస్త్రిగారి వ్యక్తిత్వం మనకంటే దూరంగా ఉంటూ ఇంకా ముందుకు రా, ఇంకా అర్థాలు వెతుకు అని సవాలు చేస్తుంది.. మనల్ని పరుగులు తీయిస్తుంది..

శాస్త్రి గారు సశేషంగా ఆగిపోయిన కథ అన్నారు త్రివిక్రమ్.. శాస్త్రిగారు పరిపూర్ణంగా జరిగిన కథే అనిపిస్తుంది నాకు.. ఆ కథను అర్థం చేసుకోవడం దాన్నుంచి స్ఫూర్తి పొందడం నిస్సందేహంగా సశేషమే.. ఇలాంటి మరో నూట పదహారు పుస్తకాలు కూడా అయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించలేవు.. ఆయనే తరువాతి మజిలీలో మనకు చెప్పాలేమో..

అయితే, జీవితానికి అర్థాలు వెతుకుదామనుకునే జిజ్ఞాసువుకి ఈ పుస్తకం ఒక మంచి మజిలీ.. మనకు బాగా తెలిసిన శాస్త్రి గారిని మరింత బాగా పరిచయం చేస్తుంది.. మనకు అసలు తెలియని అయన జీవన సంవిధానం, జీవితంలో సాధారణ మానవులకి అందని ఎత్తులకు చేరుకోవడం.. అయినా ఈ సాధారణ మానవ బంధాలేవీ అంటకుండా ఉండడం మనకు తెలియజేస్తుంది..

అయన మాటలు గురువు సత్యారావు మాస్టారిని ఎంతగా కదిలించాయో అంతగా అయన మనవడైన చిరంజీవి శివానందుని కూడా కదిలించిన వైనం అర్ధమౌతుంది..

ఈ పుస్తకం ఈ తరానికే కాకుండా భావి తరాలకు కూడా మార్గదర్శనం చేస్తుంది, స్ఫూర్తిదాయకమౌతుంది..

శాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో శ్రీరామ్ గారు చాలా వరకూ సఫలీకృతమయ్యారు.. చిన్న చిన్న వాక్యాల్లో అద్భుతమైన అర్థాలను మనకు పరిచయం చేయగలిగారు.. మచ్చుకి కొన్ని –

“తాత్వికులంతా మేధావులై ఉండవచ్చునేమోగాని మేధావులందరూ తాత్వికులు కారు”

“తాత్వికులు సమాజానికి దిశా నిర్దేశం చేస్త్తే, కళాకారులు అత్యున్నతమైన అలౌకికమైన ఆనందాన్ని సమాజానికి అందిస్తారు. ఈ రెండు శక్తులూ ఒకే వ్యక్తిలో అత్యున్నత స్థాయిలో ఉండడం ఒక భగవల్లీలాగా తోస్తుంది నాకు”

“ఏకాకిగా” అనే మాటను ఒంటరి అనే నిరాశావాదంలో కాకుండా తన చుట్టూ జరుగుతోన్న అద్భుతాలకు సాక్షీభూతంగా ఉండడం అనే తాత్వికవాదంలో వివరించి చైతన్య పరిచారు శ్రీరామ్ గారు..

శాస్త్రిగారి జీవితాన్ని చూస్తే మనం తరచుగా వినే తామరాకు మీద నీటి బొట్టు అనే పదానికి అర్థం తెలుస్తుంది.. సమస్త ప్రపంచాన్నీ తనదనే భావనతో ప్రేమించిన ఆయన మళ్ళీ దాన్నుంచి దూరంగా వెళ్లి తాత్విక దృష్టితో ఆలోచించగలిగే వారు.. దాన్నే శ్రీరామ్ గారు “ఏకాకిగా (సాక్షీభూతంగా) ఉంటూనే, జగత్తునంతటినీ స్వంతం చేసుకోవటం, ఆ ప్రపంచంతో మమేకమవటం, అలా అవుతూనే స్వతంత్ర ప్రతిపత్తిని, అనావృత అస్తిత్వాన్నీ గుర్తెరిగి ఉండటం కన్నా గొప్ప వేదాంతమేముంటుంది?” అన్నారు.

ఆయన విలక్షణ దృక్కోణాన్ని ఆవిష్కరిస్తూ అయన చెప్పిన ఉదంతాలు అద్భుతంగా ఉన్నాయి.. డాక్టర్లకూ లాయర్లకూ మన సనాతన ధర్మంలో వైద్యం వ్యాజ్యం ఎప్పుడూ వృత్తులుగా లేవు అని చెప్పినా, బ్రాహ్మణులకు మనం మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామా? ఆ బాధ్యత వహించినప్పుడు మనం కోరినా కోరకపోయినా ఈ సమాజం మనల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది అని చెప్పినా, నక్సలైట్ వ్యవస్థలో లోపాలుండవచ్చు గానీ నక్సలైట్లు చెడ్డవారు కాదని చెప్పినా ఆయనకే చెల్లింది..

అంత సరళంగా అనంతమైన భావనల్ని ఆవిష్కరించడం చూస్తే వెన్నులో జలదరింపు కలుగదా?

“ఇప్పుడు పాట హిట్ అయినా ప్లాప్ అయినా అందరూ వింటారు కదా! ఆయనకి రకరకాల కోణాల్లో రాసే అవకాశం వచ్చింది. అదే నా ఆనందం, అది దేవుడు మాకిచ్చిన బ్రహ్మాస్త్రం లాంటి వరం” అన్నారు శ్రీమతి పద్మావతి గారు.. అయన జీవితపు పూర్ణత్వంలో ఆవిడకీ భాగం ఉంది..

ఆయనకు ఒక సమయంలో మార్గదర్శనం చేసిన సాందీపుని లాంటి సత్యారావు మాస్టారు “సీతారాం ది ఒక విరాట్ స్వరూపం! అరవై ఏళ్లలో నూట ఇరవై సంవత్సరాల మథనం, సాధన, నిత్య సాహిత్య వ్యవసాయం, నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా జీవితాన్ని అనుభవించగల యోగం! అన్నీ ఒకదాని నుంచి మరొకదానిని విడదీయలేని సంయోగం.. యోగం” అన్నారు.. గురువుకే గురువైన శిష్యుడి గురించి ఆలా అనగలిగిన సంస్కారం ఆయనది..

అయన మనవడు చిరంజీవి శివానంద్ “ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలి పాఠం – ఆ పదాలు నాకు అలాగే గుర్తుండి పోయాయి” అని రాసాడు.. అంత చిన్నవయసులో అంతటి సంస్కారం, అటువంటి భావ వ్యక్తీకరణ అతనికి తాతగారి నుంచి వచ్చిన సంపద అనిపిస్తుంది..

ఈ పుస్తకం అందరికీ – శాస్త్రి గారితో పరిచయం ఉన్నా లేకపోయినా ఆయనను అభిమానించే వారికి గొప్ప స్మృతి సంచిక.. ఈ తరంలో అయన గురించి తెలియని వాళ్ళు ఉండకపోవొచ్చు ఆయనలోని తెలియని కోణాలైతే ఉంటాయి.. ఆ విషయాలు తెలుసుకోవడానికి గొప్ప మార్గ దర్శనమౌతుంది.. తరువాతి తరాల కోసం ఈ తరం చేస్తూన్న గొప్ప పెట్టుబడి లాంటిదీ పుస్తకం..

 To be free is not merely to cast off one’s chains, but to live in a way that respects and enhances the freedom of others అంటాడు Romain Rolland అది అక్షరాలా శాస్త్రిగారికి సరిపోతుంది..

చాగంటి శరత్ బాబు గారన్నట్టు “నిజానికి పూల పరిమళాలకీ, తేనె తియ్యదనానికీ, సీతారామశాస్త్రి కవిత్వానికి పరిచయం అవసరం లేదు. జీవితాన్ని వ్యాఖ్యానించి, విశదీకరించిన ఆ కవిత్వానికి మళ్ళీ వ్యాఖ్యానం ఉండదు.. ప్రతిస్పందనే ఉంటుంది”

“ఏ వెలుగులకీ ప్రస్థానం?” అని ఎన్నో ఏళ్ల క్రితం శ్రీశ్రీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం లాంటివారు శ్రీ శాస్త్రి గారు..

పువ్వై విరిసే ప్రాణం
పండై మురిసే ప్రాయం
రెండు ఒకటే నాణానికి
బొమ్మ బొరుసంతే
తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే
నడకైనా రాని పసి పదాలే అయినా
బతుకంతా నడిచి
అలిసిన అడుగులే అయినా
చెబుతాయా చేరే మజిలీ ఏదో

అంటూనే మనకు సీతారామశాస్త్రిగా అవతరించిన ఈ మజిలీలో తరతరాలకు సరిపడే సంపద ఇచ్చారాయన.. అది వాడుకుని అయన కలలు గన్న దారిలో వెళ్లడం కన్నా పూర్ణత్వపు పొలిమేర ఏముంటుంది?

***

పూర్ణత్వపు పొలిమేరలో.. (సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యక్తిత్వ విశ్లేషణ)
సంకలనం: శ్రీ చెంబోలు శ్రీరామశాస్త్రి
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 336
వెల: ₹200.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/dp/B0C5MW6YKF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here