‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -11

1
11

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

మళ్ళీ కాలేజీకి

ఉద్యమం ముగిసిన మరుసటిరోజు నేను, శ్రీనివాసన్ ప్రిన్సిపాల్‌గారిని కలిశాము. వారికి కూడా అంతా బాగా వెంటనే ముగిసిందని సంతోషంగా ఉంది. సత్యాగ్రహం మొదలైన రోజు నుండి అది ముగిసే వరకూ మా కాలేజీ విద్యార్థి ఎవరూ కాలేజీకి పోలేదు. ప్రిన్సిపాల్ మమ్మల్ని సంతోషంగా ఆహ్వానించారు. అన్నట్లు మా రాజీనామా పత్రాల గురించి పాలక కమిటీ చర్చించనేలేదు. పోగొట్టుకుని పోయిందని చెప్పారు. ఇది నిజమని అనిపించడంలేదు. మమ్మల్ని వదులుకోవడం వారికి ఇష్టం లేదు అంతే.

ఏమైనా నేను మాత్రం ప్రిన్సిపాల్ గారికి, పాలక వర్గానికి చాలా కృతజ్ఞుడినై ఉన్నాను. ఈ ఉద్యమదశలో ఏ కారణం వల్ల నైనా నేను అధ్యాపకుడిని కాకపోతే నాకు వ్యక్తిగతంగా చాలా నష్టమయ్యేది. నేషనల్ కాలేజీకి నా బదులుగా ఇంకా మంచి అధ్యాపకుడు లభించి ఉండవచ్చు. నా విద్యార్హతల వల్ల నాకు ఇంకొక కాలేజీలో ఉద్యోగం దొరకవచ్చు. నాకు ఇలాంటి పని కన్నా ఎక్కువ నేను ఏ హైస్కూలులో చదువుకున్నానో, ఏ విద్యార్థి నిలయం నాకు ఉచితంగా అన్నం పెట్టి ఆశ్రయమిచ్చిందో అలాంటి ఉత్తమ సంస్థలకు సేవ చేసి నా ఋణాన్ని తీర్చుకునే అవకాశాన్ని పోగొట్టుకునేవాణ్ణి. ఇలాంటి నష్టానికి విలువ కట్టడం సాధ్యంకాదు.

కష్టేఫలి

1948 మార్చి – ఏప్రిల్ నెలలలో పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజి పరీక్షా కేంద్రం. మా కాలేజీ నుండి సైకిల్ మీద అక్కడికి పరీక్ష మొదలవడానికి సుమారు అర్ధగంట ముందు వెళ్ళేవాడిని. విద్యార్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని పోగొట్టి బాగా వ్రాయండి అని చెప్పి వారిని ప్రోత్సహించి పరీక్షకు పంపేవాడిని. అక్కడి నుండి కాలేజీకి వచ్చి హాస్టల్‌లో భోజనం చేసుకుని మళ్ళీ పరీక్షా కేంద్రానికి పరీక్ష ముగిసే సమయానికి చేరుకునేవాణ్ణి. ప్రశ్నా పత్రం చూసిన తరువాత మా విద్యార్థులు భౌతికశాస్త్రం, గణితశాస్త్రాలలో ఎలా వ్రాసివుండవచ్చని ఊహించేవాడిని. పరీక్ష వ్రాసి బయటకు వచ్చిన విద్యార్థులను వారు ఎలా వ్రాశారని అడిగి తెలుసుకునేవాణ్ణి. పరీక్షలు ముగిసే వరకు నాకు అదొక దినచర్య అయ్యింది.

మే నెలలో పరీక్షా ఫలితాలు ప్రకటించారు. మా కాలేజీకి సుమారు 45 శాతం ఉత్తీర్ణత లభించింది. గత సంవత్సరం 20 శాతమున్న ఫలితాలు 45 శాతానికి పెరిగింది. ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఆ యేడు విజయా కాలేజీకీ మాకన్నా 7-8 శాతం ఎక్కువ ఫలితాలు వచ్చాయి. వారికీ మాకూ ఉన్న అంతరం తక్కువ అయ్యింది. మా కాలేజీపైన మాపైన విద్యార్థులకు, యాజమాన్యానికీ నమ్మకం ఎక్కువ అయ్యింది. రెండు సంవత్సరాల తరువాత ఇంకా ఎక్కువ ఫలితాలు సాధించి విజయా కాలేజీని వెనుకకు వేశాము. ప్రతి యేటా మొదట బెంగళూరులో, ఆపైన మైసూరు రాజ్యమంతటా అత్యుత్తమ ఫలితాలను సాధించే కాలేజీలలో మా కాలేజీ ఒకటయ్యింది. కష్టానికి తగిన ఫలం దక్కింది.

అపూర్వ ఘటన

ఆ యేడు నడిచిన ఒక అపూర్వ ఘటన గురించి చెప్పాలి. 1946లో నేను ముందే చెప్పినట్లు జూనియర్ ఇంటర్ ‘బి’ సెక్షన్‌కు క్లాస్ టీచర్‌గా ఉన్నాను. 1947లో అదే సెక్షన్ సీనియర్ ఇంటర్‌కు వచ్చినప్పుడు నేను క్లాస్ టీచర్‌గా కొనసాగాను. అంటే ఆ విద్యార్థులకు రెండు సంవత్సరాలు నేను రెండవ పోషకుడిని లేదా హితైషిని. కాలేజీలోని మిగిలిన విద్యార్థులపై కూడా నాకు అంతే విశ్వాసము, ఆసక్తి ఉంది. ప్రతి విద్యార్థి కష్టసుఖాలను తెలుసుకునేవాణ్ణి. ప్రోత్సహించేవాడిని. చదువులో తగినంత మెలకువలు చెప్పేవాడిని. మా కాలేజీలో ఏడాది చివర ప్రతి క్లాసులో ఒక ‘స్నేహ మిలన్’ క్లాస్ సోషియల్స్‌ను ఆచరించే పద్ధతి ఉంది. అలాగే మా సెక్షన్ విద్యార్థులూ ఆచరించారు. అది జరిగిన 3-4 రోజులకు మా తరగతి పంచాయత్ సదస్యులు వచ్చి అలాంటి మరొక మీటింగును పెట్టుకున్నాము. మీరు రావాలి అన్నారు. “ఇంకే మీటింగప్పా. మీ క్లాస్ సోషియల్స్ అయిపోయింది కదా” అన్నాను. “లేదు సార్. ఇదొక స్పెషల్ మీటింగ్. మీరు వచ్చే తీరాలి” అన్నారు. “ఏమప్పా విశేషం” అన్నాను. “అక్కడికి రండి. మీకే తెలుస్తుంది” అన్నారు. “ప్రిన్సిపాల్‌కు తెలుసా మీ మీటింగు గురించి” అని అడిగాను. “వారే అధ్యక్షత వహిస్తారు. అందరు ఉపాధ్యాయులను ఆహ్వానిస్తున్నాము” అన్నారు. “సరే” అని ఒప్పుకొని వెళ్ళాను. అది పూర్తిగా నాకు సంబంధించిన కార్యక్రమం. నేను రెండు సంవత్సరాలు ఆ తరగతికి చేసిన సేవలకు కృతజ్ఞతను తెలియజేసే కార్యక్రమం. ఆ కార్యక్రమం విశిష్టత ఏమంటే నన్ను వాచామగోచరంగా పొగిడి, నా సేవలను కృతజ్ఞతతో స్మరించి, అచ్చు వేయించిన అభినందన పత్రాన్ని నాకు ఇచ్చి దాని ప్రతులను అక్కడున్న వారికి పంచారు. క్లాస్ టీచరుకు అభినందన పత్రం!

నాకైతే చాలా ఇబ్బంది కలిగింది. ప్రిన్సిపాల్ గారు, ఇంకా చాలామంది ఉపాధ్యాయులు సంతోషించారు. ఒకరిద్దరు ఉపాధ్యాయులకు కడుపు మండింది. ఆ మంట కొన్ని దశాబ్దాల పాటు శమించనే లేదు. ఇప్పుడు వారు నా మాదిరిగానే ఉద్యోగ విరమణ చేసి ఉన్నారు. నన్ను చూసిన తక్షణం వారికి 46 యేళ్ళ క్రిందటి చేదు జ్ఞాపకం గుర్తుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. అనేక కారణాల వల్ల తరువాత నేను ఏ తరగతికీ ‘క్లాస్ టీచర్’గా ఉండటానికి ఒప్పుకోలేదు.

నేషనల్ కాలేజీ పూర్వవిద్యార్థుల సంఘం

కాలేజీని వదిలిన తరువాత కూడా సీనియర్ విద్యార్థులు తాము చదివిన కాలేజీతో, అక్కడి విద్యార్థులతో సంపర్కం కలిగివుండడం మంచి లక్షణం. ఆ ఉద్దేశంలో కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్థాపించాలని ఆలోచించాము. మొదటి బ్యాచు 1947లో కాలేజీనుండి బయటకు వచ్చింది. ఆ ఏడాది పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్థాపించడం ఒకటి రెండు కారణాల వల్ల కుదరలేదు. రెండవ బ్యాచ్ 1948లో కాలేజీని వదిలింది. ఈ బ్యాచుతో ముఖ్యంగా నాకు ఎక్కువ సంబంధము ఉంది. వారికి కాలేజీమీద ఎక్కువ అభిమానమూ ఉంది. 1948వ సంవత్సరం జూన్ నెలలో పూర్వ విద్యార్థుల సంఘాన్ని స్థాపించాము. కాలేజీకి అవసరమైన ధనాన్ని సేకరించడం, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో సహకరించడం, స్వంతంగా వీలైనన్ని కార్యక్రమాలను నిర్వహించడం ఈ సంఘపు కొన్ని ముఖ్య ధ్యేయాలు.

పూర్వ విదార్థి సంఘం అత్యంత ఉత్సాహంతో తన పనులను వ్యవస్థీకృతంగా అనేక సంవత్సరాలు నిర్వహిస్తూ వచ్చింది. అనేక మంది పూర్వ విద్యార్థులు కాలేజీ ఆవరణకు తమకు వీలు చిక్కినప్పుడల్లా వచ్చేవారు. వారింకా కాలేజీ ప్రస్తుత విద్యార్థులనే భావన మాకు కలిగేది. సంఘపు ఉద్దేశాలను కార్యరూపం చేయడానికి ఎక్కువ శ్రద్ధతో పనిచేసేవారు. నాకూ పూర్వ విద్యార్థి సంఘానికీ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. పూర్వ విద్యార్థి సంఘం కోసం ప్రత్యేకమైన కార్యలయం లేదు. సాధారణంగా సంఘపు కార్యక్రమాల రూపురేఖలన్నీ హాస్టల్‌లో ఉన్న నా గదిలోనే జరిగేవి. ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమాన్ని సంఘం ఏర్పాటు చేసేది. దేశ నాయకులైన జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత పట్వర్ధన్, మధు లిమాయే మొదలైనవారి బహిరంగ సభలను పూర్వ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసింది. నాటకాలలో, క్రీడాకార్యక్రమాలలో పూర్వ విద్యార్థి సంఘం పాత్ర గణనీయం. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు నాటకాలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలలో కలిసి పనిచేయాలనే ఉద్దేశ్యంతో నేషనల్ కాలేజ్ హిస్ట్రియానిక్ క్లబ్ అనే సంస్థను స్థాపించాము. క్రీడల కోసం స్పోర్ట్స్ క్లబ్ మొదలయ్యింది. ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇవన్నీ చురుకుగా పనిచేసుకుంటూ వచ్చాయి. పూర్వ విద్యార్థుల సంఘం 1975లో రజతోత్సవాలను జరుపుకుంది.

పూర్వ విద్యార్థి సంఘం తన శక్తికి మించి అన్ని సంవత్సరాలు పనిచేసిన తరువాత దానికి సహజంగానే అలసట కలిగి తీరుతుంది. అందువల్ల అలసిపోయిన విద్యార్థి సంఘం ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి విశ్రాంతిని తీసుకుంటూ వుంది. విశ్రాంతి వ్యవధి కొంచెం ఎక్కువ అయ్యింది. విశ్రాంతి నుండి త్వరగా లేచి కార్యోన్ముఖమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

బి.ఎస్.సి. ప్రారంభం

1952లో బి.ఎస్.సి. తరగతులు మొదలయ్యాయి. మొదలు పెట్టే సమయంలో ఒక రోజు కాలేజీకి సమీపంలో ఉన్న గాంధీబజారులో నాకు ఎం.ఎస్.సి.లో ప్రొఫెసర్ అయిన డా. టి.ఎస్.సుబ్బారావు గారు కనిపించి “ఏమప్పా ఏదో విషయం విన్నాను. నేషనల్ కాలేజీలో బి.ఎస్.సి. మొదలు పెడుతున్నారంట. మొదలు పెట్టే ముందు ఒక సారి ఆలోచించండి. పేరున్న సెంట్రల్ కాలేజీలో బి.ఎస్.సి. క్లాసులు కొన్ని దశాబ్దాలుగా పేరుమోసిన ప్రొఫెసర్లతో నడుస్తున్నాయి. దానితో పోలిస్తే మీకు కష్టం కావచ్చు.” అంటూ హెచ్చరించారు. నేను “అయ్యో సెంట్రల్ కాలేజీ ఏమీ ఫరవాలేదు సార్. ఆత్మవిశ్వాసంతో దానితోనూ పోటీ పడతాం” అన్నాను. వారు అవాక్కయ్యి “ఏమప్పా. అలా అంటున్నావు” అని ఊరుకుండి పోయారు. మేము బి.ఎస్.సి. క్లాసులను నడపడమూ అయ్యింది. సెంట్రల్ కాలేజీతో పోటీ పడటమూ అయ్యింది. గెలిచిందీ అయ్యింది.

అప్పుడు ప్రొ.సంపద్‌గిరి రావు గారు విద్యారంగం నుండి ఎన్నికై విధాన పరిషత్తులో సభ్యులు (M.L.C) అయ్యారు. అక్కడ ఎక్కువ పని ఉన్నందువల్ల, ఇంకా కొన్ని కారణాలవల్ల కాలేజీ కార్యక్రమాలలో పూర్తి ధ్యాస పెట్టలేక పోవచ్చునని పాలకమండలి ఆలోచించింది. పైగా ఆ సంవత్సరం బి.ఎస్.సి. క్లాసులు మొదలయ్యాయి. అత్యుత్సాహంతో కాలేజీని నడపాలని మా యువ అధ్యాపకులు ఉరకలు వేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పాలకవర్గం పరిగణనలో తీసుకుని ప్రొ. వి.గోపాలస్వామి అయ్యంగార్ గారిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. వారు మైసూరు విశ్వవిద్యాలయం మాజీ గణితశాస్త్ర ప్రొఫెసర్. రిజిస్ట్రారుగా కూడా పనిచేశారు. మా సంస్థతో మొదటి నుండీ సంబంధం కలిగివున్నారు. గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నారు. కొన్నాళ్ళు కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రొద్దున 10.30 గంటలకు ఆఫీసుకు వస్తే సాయంత్రం వరకూ పనిచేసేవారు. వారు సంప్రదాయపరులు. మడి ఆచారాలు ఎక్కువ. ఆ ఆవరణలోని నీటిని కూడా త్రాగేవారు కాదు. అయితే మిగిలిన విషయాలలో విశాలమైన మనస్సు కలిగినవారు. వారు రెండేళ్ళు మాత్రం ప్రిన్సిపాలుగా ఉన్నారు. అప్పుడు ప్రొ. సంపద్‌గిరిరావు గారు వైస్‌ప్రిన్సిపాల్.

డిక్టేటర్

గోపాలస్వామి అయ్యంగార్ గారు ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఒక సెక్షన్ విద్యార్థులు ఎక్కువ మంది గాంధీ టోపీ పెట్టుకుని రాలేదు. నాకు చాలా కోపం వచ్చింది. వారికంతా ఒక రూపాయి జరిమానా వేయాలని ప్రిన్సిపాలుగారిపై ఒత్తిడి తెచ్చాను. చివరికి ప్రిన్సిపాల్‌గారు వారందరికీ ఫైన్ వేశారు. ఆ సెక్షన్ విద్యార్థులు స్ట్రైక్ చేశారు. గోపాలస్వామి అయ్యంగార్ ప్రిన్సిపాల్ కాక ముందు నుండి నేను అధ్యాపకుల సంఘానికి కార్యదర్శిగా ఉన్నాను. కాలేజీ కార్యక్రమాలను నిర్వహించడంలో అదొక ముఖ్యస్థానం. “గోపాలస్వామి అయ్యంగార్ గారికి వయసు ఎక్కువ. మెత్తనివారు. అలాంటి వారు ఫైన్ వేయడం అసాధ్యం. హెచ్.ఎన్. వత్తిడి వల్లే వారు ఫైన్ వేశారు” అని ఎక్కువ విద్యార్థులు నాపై గుర్రుగా ఉన్నారు. అయితే విద్యార్థులందరూ నాకు సన్నిహితులే. సమ్మె రోజు ఆ సెక్షన్ పిల్లలు ఒక్కరూ నాతో మాట్లాడలేదు. సమ్మె మరుసటి రోజు ప్రిన్సిపాల్ గారితో సంప్రదింపులు జరిగాయి. క్లాస్ టీచర్, పంచాయత్ సభ్యులతో మీటింగు. వద్దన్నా వినకుండా ప్రిన్సిపాల్ ఆ మీటింగుకు నన్ను హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. మీటింగు జరిగినప్పుడు తీర్పు కోసం బయట విద్యార్థులు కాచుకుని ఉన్నారు. అప్పుడు ఒక విద్యార్థి నుండి ఒక చీటీ ప్రిన్సిపాలుకు వచ్చింది. దానిని వారు చదివారు. “ఇలా అంటే ఏమి” అని ఆ చీటీ నాకు అందించారు. ఆ చీటీలో ఇలా వుంది. “This is a meeting of the Principal, Class Teachers and Panchayat members only”. అంటే ఆ మీటింగు ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, పంచాయత్ సభ్యులకు మాత్రమే పరిమితమైంది. నేను నవ్వుతూ “ఈ మీటింగులో నేను ఉండరాదు అని అర్థం” అన్నాను. “నేను వద్దు సార్. వెళ్ళిపోతాను” అన్నాను. “ఫరవాలేదు. ఉండు” అన్నారు. విద్యార్థులను నేను మీటింగులో ఉంటే వారికి వ్యతిరేకంగా తీర్పు రావచ్చు అని వారి శంక. మీటింగు ముగిసింది. ఏదో ‘ఖాజీన్యాయం’ చేశాము. ఇది జరిగాక విద్యార్థులకు నాకు మధ్య ఉన్న మధుర బాంధవ్యాలకు ఎటువంటి నష్టమూ వాటిల్ల లేదు. అయితే ఈ ఘటనను వారు గుర్తుపెట్టుకుని ఏడాది చివరలో వారి తరగతి ‘స్నేహమిలన్’లో దాన్ని వాడుకున్నారు. ఆరోజు తమకు పాఠాలు చెప్పిన అధ్యాపకులందరికీ సరదాగా వారికి సంబంధించిన గుణాలు లేదా న్యూనతలను ఎత్తి చూపే విధంగా ఒక బహుమతిని ఇచ్చే పద్ధతి ఉంది. నాకు ఒక హుండీ దాని మీద ‘Fine’ మరియు ‘Dictator’ అని చీటీ అంటించి ఉంది. దానితో పాటు ఒక బెత్తం ఇచ్చారు. వాటిని నేను చాలా sportive గా తీసుకున్నాను. “మీరు ఈ రెండింటినీ నాకు ఇచ్చారు. సంతోషం. ఒకదానిని ఇప్పుడే ఉపయోగిస్తాను” అని చెబుతూ ఆ హుండీ పట్టుకుని ఒక్కొక్క విద్యార్థి ముందూ వెళ్ళాను. వారు సంతోషంగా యథాశక్తి నాణాలను అందులో వేశారు. సుమారు 5 నిమిషాలు సంతోష వాతావరణం. వారికి కావలసిందీ అదే. కొంచెం బాగానే డబ్బులు వసూలయ్యాయి. వాటిని క్లాసు ఉపయోగానికి అక్కడే అచ్చి “బెత్తాన్ని ఇప్పుడు ఉపయోగించను. ముందు సమయం వచ్చినప్పుడు వాడతాను” అని చెప్పాను. “మీరు నన్ను డిక్టేటర్ అని హాస్యం చేశారు, ఆరోపించారు. నేను డిక్టేటర్ అనడంలో సందేహమే లేదు. తరగతిలో నేను నోట్స్ డిక్టేట్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. క్లాసులో నోట్స్ కావాలి అని అల్లరి చేస్తారు. ఇక్కడేమో డిక్టేటర్ అని గేలి చేస్తారు. రేపటి నుండి క్లాసులో నోట్స్ డిక్టేట్ చేయను” అన్నాను. నేను చెప్పింది తమాషాగా అని తెలుసుకున్నవారు హృదయపూర్వకంగా నవ్వారు. నేను చెప్పింది సీరియస్‌గా తీసుకున్నవారు “అయ్యో, మీరలా చేయకండి సార్. మీరు మంచివారు. మంచి డిక్టేటర్. దయయుంచి నోట్స్ ఇవ్వండి” అని అన్నారు. అంతా సంతోషంగా గడిచింది.

లెక్కంటే లేక్కే

గోపాలస్వామి అయ్యంగార్‌గారు ఖచ్చితమైన లెక్కాచారపు మనిషి. అన్నీ తూ.చ.తప్పకుండా నియమాల ప్రకారం జరగాల్సిందే. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే సహించేవారు కాదు. వారు Amature Dramatic Associationకు ట్రెజరరో, మరో పదవిలోనో ఉన్నారు. ఆ సంస్థలో ఒకరోజు దొంగతనం అయ్యింది. ఆ రంగస్థల మందిరానికి ఒక వాకిలికి IN (లోపలికి) అని మరోవాకిలికి OUT (బయటకు) అనే బోర్డులు ఉన్నాయి. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. IN అనే వాకిలి తలుపు అలాగే మూసి ఉంది. OUT అనే వాకిలి తలుపు తెరిచి వుంది. వారికి ఆశ్చర్యం అయ్యింది. పక్కనున్నవారితో “దొంగ ఆడిటోరియంలోనికి OUT ద్వారం ద్వారా ఎలా ప్రవేశించాడు? IN అనేది కదా ప్రవేశద్వారం” అని అడిగారు. దానికి వారు నవ్వుకుని “కాదు సార్. వాడు దొంగతనం చేయడమే నియమాల ఉల్లంఘన. అలాంటప్పుడు ఏ వాకిలి గుండా లోపలికి పోయి దొంగతనం చేయాలని ఆలోచిస్తారెందుకు?” అని అడిగారు. అది నిజమనిపించినా అయ్యంగార్ గారి అభిప్రాయంలో ఆ దొంగ రెండు నియమాలను ఉల్లంఘించాడు. మొదటిది OUT ద్వారం గుండా లోపలికి పోవడం, రెండవది దొంగతనం చేయడం. వాడు IN ద్వారం గుండా వెళ్ళివుంటే ఒకటే తప్పు జరిగేది అని అయ్యంగార్ గారి లెక్క అనిపిస్తుంది. ఎంతైనా వారు గణితపు ప్రొఫెసర్ కదా! లెక్కల్లో వారిని తప్పుపట్టలేము. మొత్తం మీద సామాన్లు దొంగతమనమయ్యాయి. IN ద్వారం గుండా ప్రవేశించినా ఆ నాటక సంస్థకు జరిగిన నష్టంలో ఏమీ తేడా ఉండేది కాదు.

అడ్డు

ఒకరోజు మా విద్యార్థి సంఘం కార్యదర్శివచ్చి “అంతర్ కళాశాల కన్నడ చర్చా స్పర్ధకు ఒక విషయాన్ని ఇవ్వండి సార్” అన్నాడు. “రేపు రా అప్పా. ఇస్తాను.” వచ్చాడు. విషయాన్ని ఇచ్చి “ప్రిన్సిపాలుకు చూపించి విషయాన్ని ప్రకటించు” అన్నాను. “అలాగే సార్” అని వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి ఆ విషయాన్ని చూపించాడట. వారు దానిని చదివి “ఈ విషయాన్ని ఎవరు ఇచ్చారు” అని అడిగారట. “హెచ్.ఎన్” అని చెప్పాడు. “ప్రకటించు” అని ప్రిన్సిపాల్ చెప్పారు. అది జరిగిన కొంత సేపటికి ఆఫీస్కు వెళ్ళాను. “కూర్చో” అన్నారు. “ఆ విషయాన్ని నీవేనా ఇచ్చింది” అని అడిగారు. “ఔను సార్” అన్నాను. “ఈ విషయాన్ని నన్ను చూసే ఇచ్చావా” అన్నారు. “అయ్యో లేదు లేదు సార్” అని ఒక విధమైన అపరాధ భావనతో చెప్పాను. “నీవు ఇచ్చిన విషయంలోనూ కొంత నిజముంది” అని నవ్వారు. ధైర్యం చేసి నేనూ నవ్వాను. చర్చా పోటీకి నేను ఇచ్చిన అంశం “దేశ ప్రగతికి వృద్ధులు అడ్డంకి”. ప్రిన్సిపాల్ గారికి అప్పటికి ఎక్కువ వయసయ్యింది. నేనూ ముందు ముసలివాడి నవుతానన్న ఆలోచన లేకుండా ఆ విషయాన్ని ఇచ్చాను.

నాలుగణాల జరిమానా

అధ్యాపకుడైన మొదటి నుండీ నేను నేషనల్ కాలేజి హాస్టల్ నిలయపాలకుడిని. విద్యార్థి నిలయంలో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు, ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ఉండేది. తెల్లవారు జాము ప్రార్థనకు పిల్లలను లేపడం అతి కష్టమైన పని. బెల్లు కొడితే చాలమంది విద్యార్థులకు ఏ విధమైన మార్పూ కలిగేది కాదు. ఒక్కొక్కరు ఆ శబ్దం విని లైట్ వేసేవాళ్ళు. నేను ప్రతి ఒక్క రూము ముందు నిలిచి, వాకిలి తట్టి మొత్తుకుంటే వాకిలి గొళ్ళెం తీస్తాడు. లైటు వేయడు. గొళ్ళెం తీసినవాడు అలాగే వెళ్ళి తన పరుపుమీద ఏ భయమూ లేకుండా మళ్ళీ పడుకుంటాడు. నేను లైట్ వేయాలి. దుప్పటి తీసివేయాలి. వాళ్ళను నిద్ర నుండి లేపాలి. చాలా గదుల ముందు, లోపల ఇదే నా నిత్యకర్మ. ప్రతిరోజూ నేనే స్విచ్చు వేసి వేసి ఏయే స్విచ్ ఎక్కడున్నదీ నాకు తెలిసిపోయింది.

ఎక్కువ మంది విద్యార్థులు మగత నిద్రలో తూగుతూ వచ్చి ప్రార్థనాలయంలో కూర్చునేవారు. వారి నుండి గట్టిగా ప్రార్థన చేయించే సమయానికి నా ప్రాణంపోయేది. కొందరు విద్యార్థులకు ప్రార్థన ముగిసింది తెలియదు. అక్కడే కూర్చునే నిద్రపోయేవారు. అలాంటి వారినందరినీ లేపి పంపాలి.

విద్యార్థులను లేపే ఈ కష్టపు ప్రాతఃకర్మ వల్ల నాకు విపరీతమైన విసుగుపుట్టేది. నేనే వెళ్ళి పడుకున్నవారిని లేపడం వద్దు. బెల్ శబ్దం విని వాళ్ళే రానీ అనే నిర్ణయానికి వచ్చాను. ఎక్కువ మంది ప్రార్థనకు గైర్హాజరయ్యేవారు. వారిలో అనేకులకు అసలు బెల్లు శబ్దమే వినిపించేది కాదు. నాకు వాస్తవానికి విద్యార్థులను దండించే విషయంలో నమ్మకం లేదు. మంచి మాటలతో వారి మనసును మార్చాలి అనేదే నా అభిమతం. ఐతే నా ఈ మంచితనానికి వారు లొంగలేదు. చివరకు విసుగెత్తి విద్యార్థి నాయకుణ్ణి పిల్చి “రేపటి నుండి ప్రార్థనకు హాజరు కాని వారికి నాలుగణాలు ఫైన్ అని హెచ్.ఎన్. చెప్పారు అని భోజనం చేస్తున్న అందరు విద్యార్థులకూ చెప్పు.” అన్నాను. అతడు అలాగే నని చెప్పి భోజనశాలలో నా నిర్ణయాన్ని ప్రకటించి వచ్చాడు. “అందరికీ చెప్పావేమప్పా” అన్నాను. “చెప్పాను సార్. అయితే ఒకడు ఒక రూపాయి అడ్వాన్స్ ఇచ్చాడు. నాలుగురోజుల గైర్హాజరుకు దానిని అడ్జస్ట్ చేసుకోవాలట. ముందు కావాలంటే ఇస్తాడట” అన్నాడు. నాకు నవ్వాలో, కోపగించుకోవాలో అర్థం కాలేదు. వాడిని పిలిపించి “పాపి. ఇలాంటి పనా నీవు చేసేది” అని కోపం నటించి వాడిని తిట్టాను. అతడు నవ్వుతూ మాట్లాడకుండా నిలుచున్నాడు.

మీరెవరు?

మా ఆవరణలో పబ్లిక్ టాయ్‌లెట్ ఉంది. ఒక రోజు ఒక అపరిచితుడు శౌచాలయం నుండి బయటకు వస్తున్నాడు. “ఎవరప్పా నీవు? బయటివాళ్ళు వచ్చి దీన్ని ఉపయోగించరాదు” అని కొంచెం గొంతుపెంచి నా అభ్యంతరం చెప్పాను. “ఏమి స్వామి, నేను 10-15 యేండ్లనుండి ఇక్కడికి వస్తూ పోతున్నాను. ఎవరూ గలాటా చేయలేదు. మీరు మొన్నమొన్న వచ్చినట్టున్నారు. మీరెవరు ఇట్లా తకరారు చేయడానికి” అని నన్నే ఆక్షేపించాడు.

మా విద్యార్థి నిలయం స్నానపుగది శౌచాలయపు ఒక ప్రత్యేక మూలలో ఉండేది. ఒక రోజు నేను ఆలస్యంగా స్నానానికి వెళ్ళాను. వాకిలి మూసివుంది. లోపల నీటి శబ్దం అవుతూవుంది. ఎవరో విద్యార్థి స్నానం చేస్తూ వుండవచ్చని భావించి అవతలివైపు టవలు, సోపు, ఇంకా బట్టలను పట్టుకుని నిలుచునివున్నాను. కొన్ని నిముషాల తరువాత ఒక అపరిచితుడు స్నానం చేసుకుని బయటకు వచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసింది. కొంచెం కోపం కూడా వచ్చింది. “మీరెవరు స్వామీ?” అన్నాను. “మీరు ఎవరు?” అన్నాడు. “నేను ఎవరు అని తరువాత చెబుతాను. ఎలాగూ మీ స్నానం అయ్యింది. చూడండి. ఎదురుగా వంటయిల్లు ఉంది. వంట అయ్యింది. అలాగే భోజనం చేసుకుని వెళ్ళండి” అని వ్యంగ్యంగా అన్నాను. ఇకమీదట రానని చెప్పి అతడు వెళ్ళిపోయాడు.

నేను వేణుగోపాల్

నేను నేషనల్ కాలేజీ హాస్టల్‌లో మొదటి నుండీ ఉన్నానని ఇంతకు ముందే చెప్పాను. నా రూముకు తాళం లేదు. ఒక పరుపు, రెండు మూడు చాపలు, ఒక పెట్టె ఇదే నా ఆస్తి. ఎవరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా రూముకు వెళ్ళవచ్చు. పడుకోనూవచ్చు. ఈ సౌకర్యాన్ని అధ్యాపకులూ, విద్యార్థులూ అప్పుడప్పుడు ఉపయోగించుకునేవారు. మా ప్రిన్సిపాల్ గారైన ప్రొ.కె.సంపద్‌గిరిరావు గారు అలసిపోయినప్పుడు నా రూముకు వెళ్ళి నా పరుపును తలగడగా చేసుకుని పడుకునేవారు.

ఒక రోజు విరామ సమయంలో ఒక పుస్తకం తీసుకోవాలని నా రూముకు వెళ్ళాను. ఒక విద్యార్థి పడుకుని ఉన్నాడు. నాకేమీ ఆశ్చర్యం కాలేదు. పుస్తకం తీసుకుని వెనుదిరిగినప్పుడు అతను ఎవరో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. అతని ముఖం కనబడటం లేదు. నేను తెప్పిస్తున్న ‘హిందూ’ పేపరుతో అతడు ముఖం కప్పుకుని ఉన్నాడు. కుతూహలంతో ముఖాన్ని చూడటానికి పేపర్ తీశాను. అతను కళ్ళు మూసుకునే “నేను, నేను వేణుగోపాల్” అన్నాడు. అప్పుడు అతని క్లాసే నేను తీసుకోవాలి. “వేణుగోపాల్. ఇప్పుడు మీ క్లాసే ఉంది” అన్నాను. “తెలుసు. మీరు వెళ్ళండి. నేను వస్తాను” అన్నాడు.

నేను వెళుతూ ఆలోచనలో పడ్డాను. “ఎలా, ఎలా! నేను వచ్చినప్పుడు అతడేమీ నిద్ర పోవడం లేదు. నేను లోపలికి వచ్చింది అతనికి తెలిసింది. అప్పుడు లేవలేదు. అతని ముఖం మీద ఉన్న పేపరు తొలగించినప్పుడు లేచేది అటుండనీ కనీసం కళ్ళు కూడా తెరవలేదు. పైగా ‘మీరు వెళ్ళండి. నేను తరువాత వస్తాను ‘ అని చెబుతాడు కదా” అని కొంచెం బేజారయ్యింది. నా పాఠం విని ఫేలయ్యేకన్నా వినకుండా పాస్ కానీ అని సమాధానపరచుకుని ఆఫీసుకు పోయి అక్కడి నుండి క్లాసుకు వెళ్ళేసరికి కొంచెం లేటయ్యింది. చివరి బెంచులన్నీ నిండి ఉన్నాయి. విధి లేక అతడు మొదటి వరుసలోనే కూర్చోవాల్సివచ్చింది. అతను వచ్చాడో రాలేదో అనే కుతూహలంతో నేను చివరి బెంచీలవైపు చూశాను. అప్పుడు కుశాగ్రబుద్ధి ఐన వేణుగోపాల్ “నేను ఇక్కడున్నాను. ఇక్కడున్నాను సార్” అని అన్నాడు. అతను ఉన్నట్టుండి అలా ఇక్కడున్నాను ఇక్కడున్నాను అనడం అందరికీ అసహజంగా కనిపించింది. నేను ఆ కథను వివరించే వరకూ విద్యార్థులు నన్ను పాఠం చెప్పడానికి వదలలేదు.

రెండేళ్ళ క్రితం కాలేజీకి సమీపంలో ఉన్న ఫోర్ట్ హైస్కూలు ఆవరణలో ఒక నెలరోజుల పర్యంతం నడిచిన సంగీతోత్సవానికి రోజూ వెళ్ళేవాడిని. ఒకరోజు కార్యక్రమం ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో నడుచుకుంటూ వస్తున్నాను. మధ్యవయసు దాటిన ఒకరు “నమస్కారం సార్. నేను జ్ఞాపకం ఉన్నానా?” అన్నారు. వెంటనే నేను “ఏమప్పా నీవు వేణుగోపాల్ కదా” అన్నాను. “అవును సార్. ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారు కదా” అని సంతోషపడ్డారు. “హాస్టల్లో నీవు పడుకున్నది జ్ఞాపకం ఉందేమప్పా” అన్నాను. “జ్ఞాపకం ఉంది సార్” అన్నారు. పక్కనే ఉన్న భార్యను పరిచయం చేశారు. “మీ ఆయన మా కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం నా రూములో పడుకున్నది చెప్పారా అమ్మా” అని అడిగాను. “చెప్పారు సార్. అంతే కాదు మిమ్మల్ని అప్పుడప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు” అని చెప్పారు. ఆ ఆకస్మిక కలయిక అందరికీ సంతోషాన్నిచ్చింది.

టెన్నిస్‌బాల్ క్రికెట్

ప్రిన్సిపాల్ ఆఫీసు ముందు విశాలమైన వరండా ఉంది. సాయంత్రం పూట విద్యార్థులతో నేను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. ఇ.ఎ.ఎస్.ప్రసన్న, చంద్రశేఖర్ మా కాలేజీలోనే చదివింది. వారూ మాతోపాటే ఆడేవారు. ప్రసన్న, చంద్రశేఖర్ క్లాస్‌మేట్లు కాదు. ప్రసన్న చంద్రశేఖర్ కన్నా పెద్దవారు. ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఖ్యాతిగాంచిన ఉత్తమ బౌలర్లు. ఒకరోజు ప్రసన్నతో ఇలా అన్నాను. “చూడప్పా ప్రసన్నా. నాకు ఒక రాయితీ ఇచ్చి నన్ను ఔట్ చేయి” అన్నాను. “ఏమి రాయితీ సార్” అన్నాడు. “నన్ను ఎల్.బి.డబ్ల్యూ నుండి మినహాయించు. నీవు ఎలా నన్ను ఔట్ చేస్తావో చూస్తాను” అన్నాను. “ఆ మినహాయింపూ ఇస్తాను. ఔటూ చేస్తాను” అని అన్నాడు.

ప్రసన్న నన్ను ఔట్ చేయాలంటే రెండే మార్గాలున్నాయి. ఒకటి క్యాచ్ పట్టడం. రెండవది రన్ ఔట్ చేయడం. ఇంకో అవకాశమూ ఉంది. అది స్టంప్ ఔట్ చేయడం. అయితే దానికి సంభావ్యత చాలా తక్కువ. కారణం నా మామూలు దట్టి పంచ! వికెట్ల ముందు నిలుచున్నాను. “ఏమి సార్. వికెట్ కనిపించడం లేదు కదా” అని ప్రసన్న అన్నాడు. “దానికి నేనేమి చేయాలి? పంచ కట్టుకోకూడదని చెప్పలేదు కదా” అన్నాను. ఆ మూడు వికెట్లను బాగా కప్పివేస్తూ ధైర్యంగా నిలుచున్నాను. ఎలాగైనా టెన్నిస్ బాలు రబ్బరు బాలు. కాలికి తగిలినా అంత దెబ్బ తగలదు. అందువల్ల బాలు వికెట్ వెనుకకు పోయే అవకాశం లేదు. వికెట్ కీపర్‌కు బాలు కనిపిస్తే కదా! అతనికి పనేమీ లేదు. ఊరికే నిలుచుని ఉన్నాడు. పరిగెత్తితే కదా రన్ ఔట్ కావడానికి. క్యాచ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నాను. కొడితే బౌండరీయో, సిక్సరో లేకుంటే బాలును బ్యాట్ నుండి, కాలినుండి ఆపేవాడిని. ప్రసన్న కొంచెం సేపు బౌల్ చేశాడు. నేనేమీ తగ్గలేదు. “పొండి సార్. ఇదెలాంటి ఆట. అంతా తొండి ఆడుతున్నారు. నాకు వికెట్టు కనిపించడం లేదు. మీరు పరిగెత్తడం లేదు. మిమ్మల్ని ఎలా ఔట్ చేయాలి?” అని బంతిని ఇంకొకనికి ఇచ్చాడు. అతనికేమీ ఈ రాయితీ లేదు. రెండు మూడు బంతులు బౌల్ చేసి నా బ్యాట్‌ను ఇంకొకరికి ఇచ్చేలా చేశాడు. సాయంత్రం పూట ఆ ఆట మాకంతా సంతోషాన్నిచ్చేది.

ఖాళీ మంచం

మా విద్యార్థులు, అధ్యాపకులు ఏడాదికొకసారి విహారయాత్రకు వెళ్ళడం పద్ధతిగా ఉంది. నంది బెట్టకు చాలా సార్లు వెళ్ళాము. పోయినప్పుడంతా నేను ఆ కొండను ఆయాస పడకుండా ఎక్కడా కూర్చోకుండా ఎక్కేవాడిని. ఒకసారి నలుగురైదుగురు అధ్యాపకులు ఒక రోజు ముందే నందిబెట్టకు వెళ్ళాము. రాత్రి పడుకోవడానికి మాకు సాధారణమైన గది ఇచ్చారు. అందులో ఒకటే మంచం ఉంది. నాకు మంచంతో పనిలేదు. కాబట్టి నేను పడుకోవడానికి గదిలో ఒక మూలలో బెడ్ షీట్ పరిచాను. మా జతలో ప్రొ.జి.కె.తిమ్మణ్ణాచార్ ఉన్నారు. వారు మాజీ సంస్కృత ప్రొఫెసర్. ఇంకొకరు కన్నడ అధ్యాపకులైన శ్రీ ఎం.ఎస్.వెంకటరావు గారు. వయస్సయినా తిమ్మణ్ణాచారిగారిది చిన్నపిల్లవాడి స్వభావం. తిమ్మణ్ణాచార్యులవారికీ, వెంకటరావు గారికీ మంచం మీద ఎవరు పడుకోవాలనే విషయంపై సరదాగా వివాదం మొదలయ్యింది. కొంత సేపటికి ఆ వివాదం ప్రతిష్ఠకు దారితీసింది. కొంచెం వేడిగానే సంవాదం నడిచింది. ఇలాంటి అతార్కికమైన వాదన జరుగుతున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.

వెనుకకు ఒకసారి ఒక వైష్ణవ దేవాలయంలో అక్కడున్న ఏనుగు నుదుటి మీద ఏ ఆకారపు నామం పెట్టాలనే వివాదం మొదలయ్యింది. ఒక వర్గం వారు తమ వర్గపు వై (Y) ఆకారపు నామం పెట్టాలని వాదించారు. ఇంకొక వర్గం వారు వారి వర్గపు యు (U) ఆకారపు నామం పెట్టాలని ప్రతిపాదించారు. ఇది ఒక పెద్ద రాద్ధాంతమే అయ్యింది. చివరకు ఈ వివాదం కోర్టుకు వెళ్ళింది. అప్పుడు అక్కడి న్యాయాధిపతి ఇంగ్లీషువాడు. వాదప్రతివాదాలను జాగ్రత్తగా విన్నాడు. వాటి తలా తోకా తెలియలేదు. ఇలాంటి లేక దీనిని పోలిన విషయం ఇండియన్ పీనల్ కోడ్‌లోనూ దొరికే సంభావ్యత లేదు. సాహసించి అతడు ఈ రీతిగా తీర్పును చెప్పాడు. “ఆరు నెలలు Y కారపు నామాన్ని ఏనుగు నుదిటి మీద, U ఆకారపు నామాన్ని ఏనుగు తోకమీద పెట్టండి. తరువాత ఆరునెలలు నామాల స్థానాన్ని బదలాయించండి. ఇలా ప్రతి సంవత్సరమూ కొనసాగించండి. నుదుటి మీద మొదలు ఏ ఆకారపు నామాన్ని పెట్టాలి అన్న దానికి నాణాన్ని పైకెగరవేసి (TOSS) నిర్ణయించండి” రెండు నామాలవారు సంతృప్తులై వెనుదిరిగారు.

నేను దీనిని జ్ఞాపకం పెట్టుకుని “ఎనిమిది గంటలు నిద్రపోవచ్చు అని అనుకుంటే నాలుగు గంటలు ఒక అధ్యాపకుడు మంచం మీద పడుకోండి. అప్పుడు ఇంకొక అధ్యాపకుడు నేల పైన పడుకుంటారు. మిగిలిన నాలుగు గంటలు వారు వారి స్థానాలను మార్చుకోండి. ఎవరు మొదలు మంచంపై పడుకోవాలి అనేదానిని టాస్ వేయడం ద్వారా నిర్ణయిద్దాము. సాధ్యమైతే సుమారు నాలుగు గంటల తరువాత నేనే లేపడానికి ప్రయత్నిస్తాను” అన్నాను. దానికి వెంకటరావు “సార్, మీ గాంధీ ఖాజీ న్యాయం మాకు అక్కరలేదు. ఆరు నూరైనా నేనే మంచం మీద పడుకోవాలి” అని పంతం పట్టారు. నేను చేసేది ఏమీ లేక ఒక మూలలో పడుకున్నాను. ఆ కొట్లాట కొంచెం సేపు కొనసాగింది. వారి చర్చ తీవ్రరూపం దాల్చి చివరకు ఇద్దరూ నేలమీదే పడుకున్నారు. మంచం ఏ భారమూ మోయకుండా దానికి రాత్రి హాయిగా గడిచింది.

పాపణ్ణ బై పాపణ్ణ

ఇంకొక సరసమైన సంఘటన జరిగింది. విద్యార్థి సంఘం నాయకులు సాధారణంగా క్లాసులకు సరిగ్గా హాజరు కారు. కాలేజీకి వచ్చిన విద్యార్థి సంఘం పనులనో, లేదా వేరే పని నెపంతోనో వారు క్లాసు లోపలి కన్నా క్లాసు బయటే ఎక్కువ కనిపిస్తారు. నిజానికి విద్యార్థి సంఘం పనులు విద్యార్థి సంఘం ఆఫీస్ బేరర్లు తరగతులకు హాజరు కావడానికి అడ్డంకి అయ్యేటంతటి ఎక్కువ ఏమీ ఉండవు. తరగతులు హాజరు కాకుండా ఉండడానికి అదొక నెపం అంతే. ఒక సంవత్సరం పి.వి.పాపణ్ణ అనే విద్యార్థి విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. పాపణ్ణ తరగతులకు సరిగా హాజరు కాడనన్నది పెక్కు అధ్యాపకుల ఆక్షేపణ. అయితే నా క్లాసులకు తప్పనిసరిగా వచ్చేవాడు. నేను విద్యార్థి సంఘంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాను. రోజుకు రెండు సార్లయినా వారితో భేటీ అయ్యేవాడిని. అందువల్ల నా క్లాసుకు రాకపోతే వారిని దండిస్తానని తెలుసు. ఒక రోజు పాపణ్ణ ఉన్న క్లాసులో పాఠం చెబుతున్నాను. అతడు క్లాసులోనే కూర్చున్నాడు. పాఠం మొదలైన ఐదు నిముషాలకు మూడలయ్య అనే మా ఆఫీస్ జవాను ఒక నోటీసుకు తెచ్చాడు. దానిలో Wanted Papanna (పాపణ్ణ కావాలి) అని వ్రాసి క్రింద అస్పష్టమైన సంతకమేదో ఉంది. నోటీసును చూశాను. నేను పాపణ్ణ వైపు చూశాను. ఇంకా నోటీసును పైకి చదవనే లేదు. అయినా అతడు పైకి లేచే సూచనలు కనిపించాయి. Wanted Papanna అని చదివాను. సంతోషంతో లేసి బయటకు వెళ్ళే ఆతురతను వ్యక్తం చేశాడు. ఇది చూసి నాకు అనుమానం కలిగింది. అప్పుడు నేను మూడలయ్యను “ఈ చీటీ ఇచ్చింది ఎవరప్పా?” అని అడిగాను. పాపణ్ణ వైపు చేయి చూపించి “వారే స్వామీ” అన్నాడు. పాపణ్ణ తన సీటులో కూలబడ్డాడు. తరగతి మొత్తం ఘొల్లున నవ్వింది. పాపణ్ణ డెస్క్ పైన తలపెట్టుకుని ముఖం దించుకున్నాడు. ఒక రెండు సెకెన్ల తరువాత అతడి నవ్వూ తరగతి నవ్వులో కలిసిపోయింది. అప్పుడొక విద్యార్థి లేచి “సార్ అప్పుడప్పుడూ ఇలాంటి Wanted Noticeలు వస్తూవుంటాయి. అధ్యాపకుడు చదివిన తక్షణం పాపణ్ణ తరగతి నుండి నియమబద్ధంగా వెళ్ళేవాడు. మళ్ళీ వాపసు వచ్చేవాడు కాదు. అలాంటి Wanted నోటీసులు నిజం అని నమ్మాము. మీరే ఈ గుట్టును రట్టు చేసింది” అన్నాడు. పాపణ్ణ నవ్వుతూ కూర్చున్నాడు. నిజానికి పాపణ్ణ చాలా మంచి విధేయుడైన విద్యార్థి. అ రోజు నుండి క్లాసుకు ఏ Wanted Notice వచ్చినా విద్యార్థులందరూ ముక్త కంఠంతో Papanna Wanted by Papanna అని అరిచేవారు. పాపణ్ణ అప్పటి నుండి Wanted అనే నోటీస్ పంపే పద్ధతికి మంగళం పాడాడు.

శ్రీ పాపణ్ణకు ఇప్పుడు 60 సంవత్సరాలు. విద్యార్థిగా ఉన్నప్పుడు నవ్వు ముఖమే. ఇప్పుడూ నవ్వు ముఖమే. ఎప్పుడైనా సాయంత్రం లాల్‌బాగ్‌కు వాకింగుకు వెళ్ళినప్పుడు వారు కలుస్తారు. వారు సామాన్యంగా సాయంత్రం వాకింగుకు వెళతారు. మొదటిసారి కలిసినప్పుడు “Wanted Papanna by Papanna జ్ఞాపకముందేమప్పా?” అన్నాను. “దానిని మర్చిపోవడానికి సాధ్యమా సార్” అన్నారు.

పాపచ్చి

అందరితో కలిసిపోయి ఆత్మీయంగా ఉండడమే నా స్వభావం. విద్యార్థులతో కూడా అంతే. నా క్లాసులో నరసింహమూర్తి అనే ఒక విద్యార్థి ఉన్నాడు. అతడు చాలా చిన్నపిల్లాడిలా ప్రవర్తించేవాడు. అందరూ అతడికి పాపచ్చి అనే ముద్దుపేరుతో పిలిచేవారు.

సీనియర్ ఇంటర్మీడియట్ (ప్రస్తుతం రెండవ ప్రీయూనివర్సిటి) పరీక్షలకు రెండు నెలల సమయం ఉంది. మధ్యాహ్నం స్పెషల్ క్లాసులు. క్లాసుకు వెళ్ళేముందు నాతో కొందరు విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. వారిలో పాపచ్చి కూడా ఒకడు. అలాగే మాట్లాడుతున్నప్పుడు నా జేబులో ఎత్తి కనిపిస్తున్న ఒక కాగితాన్ని పాపచ్చి నన్ను అడగకుండానే తీసుకున్నాడు. నేను దానిని గమనించినా సంభాషణలో బిజీగా ఉన్నాను. ఆ కాగితంలో క్లాసులో ఏఏ లెక్కలు చెప్పాలని అనుకున్నానో వాటి జాబితా ఉంది. క్లాసు టైమయ్యింది. “పాపచ్చి ఆ కాగితం ఇవ్వు” అన్నాను. “ఇవ్వను ఏం చేస్తారు?” అని నవ్వుతూ అన్నాడు. ఒకటిరెండు సార్లు అలాగే చేశాడు. “ఇలా పిల్లచేష్టలు చేయవద్దు. మర్యాదగా ఇచ్చేయి. దానిలో మీ క్లాసులో చేయాల్సిన లెక్కలున్నాయి” అంటూ అతడివైపు ఒక అడుగు ముందుకు వేస్తే అతను నాలుగడుగులు వెనుకకు వెడుతున్నాడు. దీన్నంతా చుట్టూవున్న విద్యార్థులు నవ్వుతూ చూస్తూ ఉన్నారు. అతడి వీపుమీద కొట్టి ఆ కాగితాన్ని లాక్కోవచ్చు. కానీ అది సభ్యత కాదని భావించి అసంతృప్తితో ఆ లెక్కలున్న పుస్తకాన్నే తీసుకుని క్లాసుకు వెళ్ళాను. విద్యార్థులందరూ కూర్చుని ఉన్నారు. నేను ప్రవేశించిన తక్షణమే ముందు బెంచీలో కూర్చున్న పాపచ్చి ఆ కాగితాన్ని నాకు ఇచ్చాడు. నాకైతే విపరీతంగా కోపం వచ్చింది. అతడి చెంపమీద గట్టిగా ఒక దెబ్బ వేసి ‘గెట్ ఔట్’ అని క్లాసు బయటకు పంపాను. క్లాసు మొత్తం అవాక్కయ్యింది. ‘హెచ్.ఎన్.గారు పాపచ్చిని కొట్టారు’ ఇది వారికి నమ్మశక్యం కాలేదు. అతి గంభీరంతో ఒకటిన్నర గంట క్లాసు నడిచింది. నాతోపాటుగా క్లాసులో ఎవరి ముఖంలోనూ చిరునవ్వు కనిపించలేదు. పాఠం ముగిసింది. బయటకు వచ్చాము. పాపచ్చి అక్కడే కూర్చుని వున్నాడు. నాకు చాలా బేజారయ్యింది. అయితే బింకంగా అతడిని మాట్లాడించలేదు.

విద్యార్థులతో సాయంత్రం పూట టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. పాపచ్చి కూడా వచ్చేవాడు. ఆ రోజు ఆటకు అతడూ వచ్చాడు. అయినా అతడితో మాట్లాడలేదు. ఆట ముగిసిన తరువాత “పాపచ్చి నాతోరా. హోటల్‌కు పోదాము. మసాలా దోశె తిందాము” అన్నాను. సంతోషంగా వచ్చాడు. ఈ విషయం అతడి స్నేహితులకు మరుసటి రోజు తెలిసింది. “నన్నూ కొట్టండి సార్. నన్నూ కొట్టండి సార్” అంటూ పోటీపడి అందరూ నాముందు నిలుచున్నారు!

కాలేజీ వదిలిన తరువాత పాపచ్చి ఎక్కడికి వెళ్ళడో నాకు తెలియలేదు. ‘సుధా’పత్రికలో వచ్చిన నా ఈ వృత్తాంతాన్ని చదువుకుని పాపచ్చి భార్య ఒక ఉత్తరంలో “సుమారు 45 యేళ్ళ క్రితం నడిచిన ఒక చిన్న సంఘటనను జ్ఞాపకం పెట్టుకుని వ్రాసినదాన్ని చదివి మాకు సంతోషం కలిగింది. ‘పాపచ్చి’, నేను మిమ్మల్ని చూడటానికి వస్తాము. మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో తెలియజేయండి” అని వ్రాశారు. ఆ ఉత్తరం చదివి నాకూ సంతోషమయ్యింది. సుమారు 45 యేళ్ళ క్రితం తప్పిపోయిన పాపచ్చి నాకు దొరికాడు. ఈ ఉత్తరానికి బదులు ఇవ్వకుండా నేనే ఒకరోజు అకస్మాత్తుగా బెంగళూరు లోని విజయనగర ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న వారి ఇంటికి వెళ్ళాను. వారికీ, నాకూ సంతోషం వేసింది. కొంచెం సేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here