[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]
కొలంబస్ కాపురం ప్రారంభం – ఉప్మా ఉప్మా
[dropcap]సె[/dropcap]ప్టెంబర్ 18వ తేదీ ఉదయం 8.30 గంటలకు కొలంబస్ చేరాను. స్టేషన్‌కు బెంగళూరు వారే అయిన శ్రీ ఎ.కె.శ్రీధర్ వచ్చారు. వారు బెంగళూరు సెంట్రల్ కాలేజీలో భౌతికశాస్త్రంలో ఎం.ఎస్.సి. చదివి కొలంబస్‌లో డాక్టరేట్ కోసం చదువుతున్నారని నేను బెంగళూరులో ఉన్నప్పుడే తెలుసుకున్నాను. వారు మా కాలేజీ ఉన్న బసవనగుడి ప్రాంతానికి చెందినవారు. వారు బెంగళూరులో ఉన్నప్పుడు నేను వారిని చూడలేదు. వారి సమీప బంధువులు మా కాలేజీ శ్రేయోభిలాషులు. నేను బెంగళూరులో ఉన్నప్పుడే వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి అవసరమైన సమాచారాన్ని రాబట్టాను. నేను అక్కడికి వచ్చేలోగా యూనివర్సిటీ సమీపంలోనే ఒక గదిని అద్దెకు చూసిపెట్టమని వారిని వేడుకున్నాను. కొలంబస్‌కు వచ్చే తేదీ, సమయం తెలిపి ఉన్నాను. దాని ప్రకారం వారు స్టేషన్‌కు వచ్చి స్వాగతించారు. అప్పటి వరకూ నా తలపై గాంధీ టోపీ ఉండేది. ఆ తరువాత స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డేలలో మాత్రం కనిపించేది. అక్కడి నుండి యూనివర్సిటీ క్యాంటీన్ (Cafeteria) లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని సమీపంలో ఉన్న 13వ తూర్పు వీధి (13th East Avenue)లో ఉన్న 175 నెంబరున్న ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటిలో ముగ్గురు అమెరికన్లు ఉన్నారు – భార్య, భర్త ఇంకా ఒక అవ్వ. హెన్రీ మేటర్స్ (Henry Matters) దంపతులు నన్ను హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
శ్రీ ఎ.కె.శ్రీధర్ నన్ను వారికి పరిచయం చేసి, రేపు కలుసుకుందాము అని చెప్పి వెళ్ళిపోయారు. నాకెలాంటి గది కావాలో వారికి తెలిపివుంటిని. అదే విధంగా ఆ గదిలో ముఖ్యంగా వంట చేసుకునే సౌలభ్యము, స్నానం మొదలైన మామూలు సౌకర్యాలు ఉన్నాయి.
నేను సంపూర్ణ శాఖాహారి అయినందువల్ల నాకు వంట చేసుకునే సౌకర్యం అత్యావశ్యకంగా కావాల్సివుంది. ఐతే నాకు వంట చేయడం తెలియదు. నేర్చుకోవడానికీ పోలేదు. అన్నం వండుకోవడం మాత్రం తెలుసుకున్నాను. దాన్ని నేర్చుకోవడం సులభం. నీరు ఎక్కువ అయితే ముద్ద అవుతుంది. తక్కువ అయినప్పుడు ఉడకక గట్టి గట్టిగా ఉంటుంది. నీళ్ళు సరైన ప్రమాణంలో ఉన్నప్పుడు అన్నం ఒక రూపానికి వస్తుంది. ఇలా అనుభవపూర్వకంగా అన్నం వండేది నేర్చుకున్నాను. అలాగే ఉప్పిట్టు (ఉప్మా) చేయడాన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి బెంగళూరులో ఉన్నప్పుడే నేర్చుకున్నాను. ఉప్మాయే నా ప్రధాన ఆహారం. దానిని చేయడం సులభం. ఉప్మాకు పులుసు, చారు, కూర వంటి సాధకాలు అవసరం లేదు. కూరగాయలను ఉప్మా జతలో వేసి ఉడికించేవాడిని. ఉప్మా పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం. ప్రొద్దున క్లాసుకు వెళ్ళేదానికన్నా ముందు మధ్యాహ్నం మరియు రాత్రికి సరిపడా ఉప్మా చేసేవాడిని. మధ్యాహ్నం భోజనానికి సగం, మిగిలిన సగాన్ని చద్దిపెట్టె (Refrigerator) లో పెట్టి రాత్రి భోజనానికి ఉపయోగించుకునే వాడిని. దానితో పాటు కొంచెం అన్నం కూడా చేసుకునేవాడిని. ఆ అన్నాన్ని మజ్జిగతో కలిపి భుజించేవాడిని. ఉదయం టిఫెన్‌కు బ్రెడ్ లేదా కార్న్ ఫ్లేక్స్ తీసుకునేవాడిని. పాలు త్రాగేవాడిని. అప్పుడప్పుడూ అరటి పండు లేదా వేరే ఏదైనా పండు తినేవాడిని. ప్రతిరోజూ ఇదే నా ఆహారం. ఒకరోజు కూడా పులుసు లేదా సాంబారు చేసుకునే ప్రయత్నం చేయలేదు. లేదా ఇంకే రకమైన తిండి తయారు చేసుకునే శ్రమపడలేదు. నాకు మొదటి నుండీ ఆహారము, తిండి మొదలైన విషయాలలో రుచికి ప్రాధాన్యం ఇవ్వలేదు. చిన్నప్పుడూ లేదు. యువకుడైనప్పుడూ లేదు. సాధారణంగా ముసలి వారయ్యాక ఇది తినాలి, అది తినాలి అనే చపలత్వం ఉంటుందట. ఇప్పుడు నేను చాలా ముసలివాడినయ్యాను. ఇలాంటిదానినే తినాలి అనే పట్టింపులేదు. నేను మసాలా దోశ, బోండా, వడ అలాంటి వాటిని తిని సుమారు 40 సంవత్సరాలు అయ్యింది అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. కాఫీ, టీ త్రాగి అన్నే సంవత్సరాలయ్యింది. ఆరోగ్యం అందరికీ ముఖ్యం. అయితే నేను ఒంటరివాణ్ణి. అందువల్ల ఆరోగ్యం నాకు అందరికన్నా ఎక్కువ ముఖ్యం. నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొదటి నుండి అన్ని ప్రయత్నాలు చేస్తూవస్తున్నాను. పి.హెచ్.డి. కోసం మూడు సంవత్సరాలు, ఆ తర్వాత ఏడు సంవత్సరాల పిమ్మట ప్రొఫెసర్‌గా ఒక సంవత్సరం అమెరికాలో ఉన్నాను. ఈ నాలుగేండ్లు ఉప్మాయే నన్ను కాపాడింది. నాలుగు సంవత్సరాలు ప్రతి నిత్యం ఉదయం, మధ్యాహ్నం ఉప్మా తిని ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించానని ధారళంగా చెప్పవచ్చు!
నా ప్రొఫెసర్
కొలంబస్‌కు వెళ్ళిన మరుసటిరోజు అణువిజ్ఞాన విభాగంలో పి.హెచ్.డి. విద్యార్థి అయిన శ్రీ భట్, ఉత్తర భారతీయుడైన శ్రీ శర్మ గార్లను కలిశాను. అదే విశ్వవిద్యాలయపు స్పెక్ట్రోస్కోపి (Spectroscopy) విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆంధ్రులైన డా.రావుగారిని కలిసి కొన్ని ఉపయోగమైన సలహాలను పొందాను. శ్రీ. ఎ.కె. శ్రీధర్ గారి సహాయం ఎలాగూ ఉంది.
పి.హెచ్.డి.కి చదువుకునే విద్యార్థులు ఏ విషయంలో తమకు ఆసక్తి ఉందో నిశ్చయించుకుని దానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్‌ను తమ గైడుగా వుండాలని విజ్ఞప్తి చేసుకోవాలి. వారు ఒప్పుకుంటే పూర్తి విద్యాభ్యాసం వారి నేతృత్వంలోనే నడుస్తుంది. నేను పలువురితో సంప్రదించి న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపి (Nuclear Spectroscopy) లో నా పరిశోధనను కొనసాగించాలని నిర్ణయించుకుని దానికి సంబంధించిన ప్రొఫెసర్ ఎం.ఎల్.పూల్ (M. L. Pool) గారిని నా గైడుగా ఉండమని ప్రార్థించడానికి సెప్టెంబరు 22వ తేదీన వారిని కలిశాను. వారు నా విద్యాభ్యాసపు నేపథ్యాన్ని నిశితంగా పరిశీలించి, పదకొండు సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అంశాన్ని పరిగణించి సంతోషంగా నాకు గైడ్‌గా ఉండటానికి అంగీకరించారు. వారిని కలిసినప్పుడు నా పేరు అడిగారు. చెప్పాను. సహజంగానే వారికి అర్థం కాలేదు. కాగితం మీద వ్రాసి చూపించమన్నారు. నేను పెద్ద అక్షరాలలో స్పష్టంగా రాశాను. దానిని అలానే రెప్పవాల్చకుండా చూసి మీరు పి.హెచ్.డి.తీసుకునే సమయానికి మీ పేరును ఉచ్చరించడం నేర్చుకొనవచ్చు అన్నారు. వారిది మంచి హాస్యధోరణి.
పి.హెచ్.డి. చదివే విదేశీ విద్యార్థులంతా ఇంగ్లీషులో లిఖిత మరియు మౌఖిక పరీక్షలు తీసుకోవాలి. ఈ రెండు పరీక్షలలో దేనిలోనైనా పాస్ కాకపోతే ఆ విద్యార్థి వారానికి 5 గంటలు ఇంగ్లీషు క్లాసులకు తప్పనిసరిగా హాజరు కావాలి. నేను ఈ రెండు పరీక్షలు సులభంగానే పాస్ అయ్యాను. ఆంగ్లభాషతో పరిచయం లేనివారు ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం. చైనా, జపాన్ దేశస్థులు, మరికొన్ని దేశాలవాళ్ళు ఎక్కువగా ఉత్తీర్ణులు కారు. భారతీయులు కూడా ఫెయిల్ కావడం అపురూపమేమీ కాదు.
అమెరికా విద్యా విధానం
మనది బ్రిటీష్ విద్యావిధానం. అన్నీ కేంద్రీకృతం. ఏడాదికి ఒక పబ్లిక్ పరీక్ష. అదే అత్యంత ముఖ్యమైనది. మధ్యలో ఏవైనా క్లాస్ పరీక్షలు నడిస్తే వాటికి అంత ప్రాముఖ్యత ఏమీ లేదు. మన వద్ద విద్యార్థులకు చదువు సంబంధించిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ అవకాశం లేదు. కొన్ని క్రమబద్ధమైన సబ్జెక్టుల కాంబినేషన్లో మాత్రం చదవాలి. ఒక రాష్ట్రంలో ఒక తరగతి విద్యార్థులకంతా ఒకే పాఠ్యాంశం. సిలబస్‌ను ఒక కమిటీ రూపొందిస్తుంది. దాన్ని అందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు అనుసరించాలి. పరీక్షలన్నీ కేంద్రీకృతం. ఉదాహరణకు మొన్న నడించిన ఎస్.ఎస్.ఎల్.సి.పరీక్షలో సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు కూర్చున్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత పెద్ద పరిమాణంలో పరీక్షలు నిర్వహించరు. ప్రశ్నా పత్రాలను ఒక కమిటీ నిర్ధారిస్తుంది. మూల్యాంకనమూ కేంద్రీకృతమే. మన పద్ధతి ప్రకారం ఒక ఉపాధ్యాయుడు పాఠం చెబుతాడు. మరొక ఉపాధ్యాయుడు పరీక్షాపత్రం ఇస్తాడు. మరొకరు సమాధానపత్రాలను దిద్దుతారు. ఇది ఇప్పటికీ నడుస్తూవున్న బ్రిటీష్ పద్ధతి.
అమెరికా విద్యావిధానం దీనికి విరుద్ధం. అధ్యాపకుడు తాను తన విద్యార్థులకు బోధంచే పాఠ్యాంశాలను తానే నిర్ణయిస్తాడు. తన విద్యార్థులను పరీక్షించడానికి తానే ప్రశ్నా పత్రాలను తయారు చేస్తాడు. తానే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేస్తాడు. ఇలా అక్కడి విద్యావిధానంలో ఉపాధ్యాయుడే సార్వభౌముడు. అతడు చేసే నాలుగు పనులలో అంటే సిలబస్‌ను రూపొందించడం, బోధించడం, ప్రశ్నాపత్రాలను తయారు చేయడం, వాటిని దిద్దడం – ఈ పనులలో బయటివారు ఎవరూ తలదూర్చరు. దీనిని విన్నవెంటనే మనకు ఈ విద్యావిధానంపై అనేక అనుమానాలు కలుగుతాయి. ఒక ఉపాధ్యాయుడు ఈ పద్ధతి ప్రకారం తన ఇష్టాయిష్టాల ద్వారా, స్వజన పక్షపాతంతో విద్యార్థుల భవిష్యత్తుపై గాఢమైన పరిణామం కలగవచ్చన్న శంక కలుగుతుంది. కావలసిన వారిని పాస్ చేయవచ్చు. వద్దనుకొన్నవారిని ఫెయిల్ చేయవచ్చు అనే నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా విద్యావిధానం విజయవంతమైనది అధ్యాపకుల ప్రామాణికతపైన. ఈ విధానం వలన విద్యార్థికి అన్యాయం జరగడం తక్కువ.
బ్రిటీషు పద్ధతి ప్రకారం మనవద్ద స్కూళ్ళు, కాలేజీలు జూన్, జూలై నెలలో మొదలై మార్చి వరకూ కొనసాగుతాయి. వేసవి సెలవులు ఏప్రిల్ నుండి జూన్ వరకు అంటే విద్యావ్యవధి సుమారు 8-9 నెలలు. చివరలో పరీక్ష. అమెరికాలో క్వార్టర్ (Quarter) పద్ధతి ఉంది. ఏడాదిని నాలుగు భాగాలు చేస్తారు. ఒక్కొక్కటీ మూడు నెలల వ్యవధి. దానిలో ఒక క్వార్టర్ వేసవి సెలవులు. అప్పుడు కూడా విద్యార్థులు తమకు కావలసిన విషయాలను ఎన్నుకుని చదువుకోవచ్చు. ఒక క్వార్టర్ చివరలో అంతిమ పరీక్ష. అది కాకుండా ఒక క్వార్టర్లో రెండు మూడు లఘు పరీక్షలు ఉంటాయి. ఈ అన్ని పరీక్షలూ ముఖ్యమైనవే. కొన్ని విశ్వవిద్యాలయాలలో ‘సెమిస్టర్’ (Semester) పద్ధతి ఉంది. దీనిలో వేసవి వదిలివేసి సంవత్సరాన్ని రెండు భాగాలు చేస్తారు. అమెరికాలో సామాన్యంగా క్వార్టర్ పద్ధతే ఎక్కువ వాడుకలో ఉంది.
గ్రేడ్లు
సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసినప్పుడు మనలాగా మార్కులను ఇవ్వరు. మనవద్ద వందకు 60 కన్నా ఎక్కువ మార్కులు వస్తే మొదటి తరగతి, 50-60 మధ్య వస్తే రెండవ తరగతి, 35 నుండి 50 వరకు మూడవ తరగతి. ఒక సబ్జెక్టులో పాస్ కావడానికి కనీసం 35 మార్కులు పొందాలి. విద్యార్థులకు ర్యాంకులు ఇచ్చేది మార్కుల ఆధారంపైనే. ఉదాహరణకు 600కు 550 అతి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు దానికి మొదటి ర్యాంకు. 549 మార్కులు వచ్చినప్పుడు రెండవ ర్యాంకు. అంటే 600కు ఒకే ఒక మార్కు తక్కువ అయినా ఒక ర్యాంక్ కిందకు వెళ్ళినట్టు అయ్యింది. ప్రజలు మొదటి ర్యాంకుకు ఇచ్చిన విలువ రెండవ ర్యాంకుకు ఇవ్వరు, ఎంతైనా రెండవవాడు. అలాగే 548 వచ్చిన విద్యార్థి మూడవ వాడవుతాడు. వాడు ప్రజల దృష్టిలో ఇంకా క్రిందకు పోతాడు. ఎన్నోసార్లు మొదటి ర్యాంకుకూ 10వ ర్యాంకుకూ 10-15 మార్కుల కన్నా ఎక్కువ వ్యత్యాసం ఉండదు. ఈ వ్యత్యాసం 600 మార్కులకు. అంటే మొదటి ర్యాంకు విద్యార్థికీ, 10వ ర్యాంకు విద్యార్థికీ మధ్య కేవలం 2 శాతం మార్కుల తేడా ఉంటుంది. ఈ పద్ధతి అశాస్త్రీయమైనది. అంతే కాకుండా ర్యాంకు విద్యార్థుల, ప్రజల మనసులో తప్పుడు అభిప్రాయాన్ని కలగజేస్తుంది. అధ్యాపకులు వీలైనంత నిర్లిప్తతతో (Objective) మూల్యాంకనం చేయాలని నియమం ఉన్నా ఎన్నోసార్లు అది మూల్యాంకనం చేసేవారి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి మూల్యాంకనం చేసిన మార్కులను గోప్యంగా ఉంచి ఒక రోజు తరువాత అదే సమాధాన పత్రాన్ని అదే ఉపాధ్యాయుడు మళ్ళీ దిద్దితే సైన్సు పేపర్లయితే 5-6 మార్కులు, అదే భాష లేక ఆర్ట్ సబ్జెక్టులయితే 10-12 మార్కులు తేడా రావడం విశేషమేమీ కాదు. అంటే పునఃమూల్యాంకనం చేసినప్పుడు ర్యాంకులు తారుమారు అయ్యే అవకాశాలు హెచ్చు. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌లలో కూడా తేడాలుంటాయి.
అమెరికన్ పద్ధతిలో మార్కులను పరిగణనలో తీసుకుని వాటి ఆధారంతో చివరలో గ్రేడ్లు ఇస్తారు. 90శాతం కన్నా ఎక్కువ మార్కులు వస్తే ‘ఎ’ గ్రేడ్, 80-90 మధ్య వస్తే ‘బి’ గ్రేడ్, 70 నుండి 80 మధ్య వస్తే ‘సి’ గ్రేడ్, 60-70 శాతం మధ్యలో మార్కులు వస్తే ‘డి’ గ్రేడ్. వందకు 60 మార్కుల కన్నా తక్కువ వస్తే ఆ సబ్జెక్టులో ఆ విద్యార్థి ఉత్తీర్ణుడు కాడు. ఇక్కడ ర్యాంకులు లేవు. వెనుక చెప్పిన ఉదాహరణలోని ర్యాంకు విద్యార్థులకు ఈ పద్ధతిని అన్వయిస్తే ఆ మొదటి పది ర్యాంకు విద్యార్థులకు అంతా ఒకటే గ్రేడ్. ఎ గ్రేడ్; అంటే బుద్ధిశక్తిలో వారంతా సుమారుగా ఒక స్థాయి వారు అని అర్థం. ఈ పద్ధతిలో మూల్యాంకనం చేసినపుడు అధ్యాపకులకు సహజంగా ఉన్న మానసిక స్థితివల్ల ఏర్పడే దోషాలు పరిహరింప బడతాయి. అందువల్ల విద్యార్థికి నష్టం వాటిల్లదు. ఈ పద్ధతి ద్వారా విద్యార్థి బుద్ధిస్థాయిని ఎక్కువ ఖచ్చితంగా కొలవవచ్చు.
డిగ్రీ విద్యార్థులు అంటే బి.ఎ., బి.ఎస్.సి., అలాంటి విద్యార్థులు సి గ్రేడ్ కన్నా తక్కువ తెచ్చుకోరాదు. అంటే 70 శాతం కన్నా తక్కువ మార్కులను పొందరాదు. మనవద్ద దానిలో సగం అంటే 35 శాతం మార్కులు వస్తే పాస్ కావచ్చు. ఒకదానికీ ఇంకొకదానికీ అజగజాంతరం తేడా. అలాగే ఎం.ఎ., ఎం.ఎస్.సి మరియు పి.హెచ్.డి విద్యార్థులు సరాసరి బి గ్రేడ్ పొందాలి. అంటే సరాసరి 80 మార్కులు ఉండాలి. సరాసరి అనేదానికి కొంచెం విశ్లేషణ అవసరం. అన్ని సబ్జెక్టులలోనూ బి గ్రేడ్ వస్తే సమస్య లేదు. అయితే ఏదైనా ఒక సబ్జెక్టులో సి గ్రేడ్ వస్తే దానిని సరితూగడానికి ఇంకొక సబ్జెక్టులో ఎ గ్రేడ్ వచ్చితీరాలి. ఇంకొక ఉదాహరణ ద్వారా దీనిని స్పష్టం చేయవచ్చు. ఒక విద్యార్థి మూడు సబ్జెక్టులను చదివి వాటిలో వరుసగా సి, బి మరియు బి గ్రేడ్ తెచ్చుకుంటే అతడు పరీక్ష తప్పుతాడు. పాస్ కావడానికి సి, బి, ఎ గ్రేడ్ రావాలి.
ఆందోళన
ఇదంతా తెలుసుకున్న తరువాత సామాన్యంగా భారతీయ విద్యార్థులకు మానసిక ఆందోళన కలుగవచ్చు. నాకైతే ఇంకా ఎక్కువ ఆందోళన కలిగింది. ముందే చెప్పినట్లు నా ఎం.ఎస్.సి. జ్ఞానం 11 సంవత్సరాల క్రిందటిది. నేను అమెరికాకు వచ్చినప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. ఎక్కువ పరీక్షలతో కూడిన విద్యాభ్యాసానికి ఎక్కువ వయసు కూడా ఒక సమస్య కావచ్చు. అప్పుడు నేను వైస్ ప్రిన్సిపాల్ అయి ఉన్నాను. నేను ఇంతవరకూ అన్ని పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయినా ఈ చదువులో పొరపాటున సి గ్రేడ్ వస్తే మనసుకు ఆందోళన కలుగుతుంది. ఉపప్రధానోపాధ్యుడై ఉండి సి గ్రేడ్ తెచ్చుకోవడం ఒక కళంకమవుతుంది. ఈ అంశాల నేపథ్యంలో నా డాక్టరేట్ విద్యను చాలా గంభీరంగా తీసుకుని ధృఢ మనసుతో చదవడం ప్రారంభించాను.
డాక్టరేట్ డిగ్రీ పొందడానికి కొన్ని నియమాలను పాటించాలి. నిర్దేశించిన విషయాలను నిర్దేశించిన గంటలు చదవాలి. రెండు పెద్ద పరీక్షలు పాస్ కావాలి. పరిశోధనను తృప్తికరంగా ముగించాలి. ఒక సబ్జెక్టును వారానికి మూడు గంటల కాలం మూడు నెలలు చదివి ఉత్తీర్ణత సాధిస్తే అతనికి మూడు క్రెడిట్లు దొరుకుతాయి. పి.హెచ్.డి. ముగించడానికి 60 క్రెడిట్లు అవసరమైతే దానికి తగిన విధంగా సబ్జెక్టులను ఎన్నుకుని వాటిని విజయవంతంగా ముగించడానికి ఎంత కాలం కావాలో అంత తీసుకోవలసి ఉంటుంది. భౌతికశాస్త్రంలో పి.హెచ్.డి. చేయాలంటే దానితో పాటు గణితశాస్త్రం తీసుకోవలసి ఉంటుంది. వాటిలోనూ విభాగాలు ఉంటాయి. వాటిని గైడ్ మార్గదర్శకత్వంలో ఎన్నుకోవాలి. ఇక్కడ ఉన్నట్లు ఉదాహరణకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమాటిక్స్‌ను మొత్తంగా చదివే పని లేదు. ఒక్కొక్క విషయాన్ని విడి విడిగా చదువవచ్చు. విడివిడిగానే గ్రేడ్‌ను ఇస్తారు. ఒక క్వార్టర్‌కు ఇన్నే సబ్జెక్టులను చదవాలనే నియమం ఏమీ లేదు. ఒకడు తన పూర్తి కాలాన్ని చదువుకే వినియోగించి త్వరగా ముగించవచ్చు. ఇంకొకడు ఉన్న చోటు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తక్కువ విషయాలను తీసుకుంటే అతనికి ఎక్కువ వ్యవధి కావాల్సి ఉంటుంది. అమెరికన్ విద్యావిధానంలో ఇవన్నీ ఉత్తమ అంశాలు.
మొదలే తెలిపినట్లు ఈ విధానం విజయానికి అధ్యాపకుల ప్రామాణికత అతిముఖ్యం. మన దగ్గర ఈ పద్ధతి విజయవంతం కావడం కష్టం. మన సమాజంలో వేలాది జాతులు, మతాలు, పెక్కు ధర్మాలు, ఇంకా పెక్కు భాషలతో కూడి పూర్తిగా కలుషితమయ్యింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో, అసమంజసమైన ఒత్తిళ్ళలో ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని వంచన లేకుండా నడపడం అంత సులభం కాదు. సర్వస్వాతంత్ర్యం ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు అమెరికన్ విద్యావిధానంలోని అనేక ముఖ్య అంశాలను స్వీకరించాయి.
ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయంలో నాకు నెలకు 200 డాలర్లు ఇచ్చేవారు. దీన్ని టీచింగ్ అసిస్టెంట్షిప్ అని పిలిచేవారు. ఇది పాఠం చెప్పినందుకు ఇచ్చే సహాయధనం. వారానికి 10-12 గంటలు ఫిజిక్స్ లాబొరేటరీ క్లాసులను తీసుకునే వాడిని. ఆ తరగతుల స్థాయి ప్రియూనివర్సిటీ స్థాయి కన్నా కొంచెం ఎక్కువ. ఆ తరగతులను తీసుకోవడానికి నాకేమీ కష్టం కాలేదు. గతంలో నా అధ్యాపక వృత్తి అనుభవం సరిపోయింది. దీనికోసం నేను రోజుకు రెండు గంటల అమూల్యమైన కాలాన్ని వినియోగించాల్సి వచ్చేది. అంగడికి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి, వంట చేయాలి, తరగతులకు వెళ్ళాలి, అన్నిటికన్నా ముఖ్యం పరీక్షలలో ఉత్తమ గ్రేడ్‌ను పొందాలి. వీటితోపాటు రోజుకు రెండు గంటలు పాఠం చెప్పాలి. నా సమయమంతా ఈ కర్తవ్యాలకై వినియోగించాను. వీటి వల్ల ఎక్కువ శ్రమ అయ్యేది.
చదువు ప్రారంభం
నా చదువుకు సంబంధించిన క్లాసులు అక్టోబర్‌లో ప్రారంభమయ్యాయి. మా ప్రొఫెసర్ సహాయంతో చదువుకు రెండు భౌతికశాస్త్ర, ఒక గణితశాస్త్ర విషయాలను ఎన్నుకున్నాను. విషయాలను, అధ్యాపకుల ఉచ్చారణను అర్థం చేసుకోవడం అంత కష్టం కాలేదు. అయితే నా అన్ని పనులకు సమయం దొరకడమే ఒక సమస్య. సాధారణంగా రాత్రి ఒంటి గంట, రెండు గంటల వరకూ చదివేవాడిని. ఉదయం ఆరు గంటలకు లేచే తీరాలి. ఎందుకంటే ఏదో ఒక క్లాసు సామాన్యంగా ఉదయం 7.30కు మొదలయ్యేది. డాక్టరేట్ పొందడంలో నా జవాబుదారీ నాకు బాగా తెలుసు. దానిలో ఏదైనా అడ్డంకి వస్తే అయ్యే విపత్తు సంబంధించిన అవగాహన కూడా స్పష్టంగా తెలుసు. ముందే చెప్పినట్లు నేనున్న గది విశ్వవిద్యాలయానికి సమీపం. నేను, నా విశ్వవిద్యాలయం, చుట్టుపక్కల ఉన్న దుకాణాలు రెండేళ్ళ పాటు ఇవే నా సర్వస్వం. ఈ రెండేళ్ళలో కొలంబస్ నగరపు దర్శనీయ స్థలాలను చూసే కోరికా, ఉత్సాహమూ లేవు. నా దృష్టి అంతా చదువుపైనే.
నరసి!
అమెరికన్లు నా పేరును ఉచ్చారణ చేయడానికి చాలా కష్టపడేవారు. నా పేరును పలుసార్లు నిదానంగా చెప్పినా దానిని పేపర్ మీద వ్రాయండి అని అడిగేవారు. వ్రాసిన తరువాత దానిని సరిగ్గా పూర్తిగా చదవడానికి వారికి కష్టమయ్యేది. మీ పేరు పొడువుగా ఉంది. దాని హ్రస్వరూపం (Short form) ఏదీ లేదా అని అడిగేవారు. వారిలో కొన్ని పేర్లను చిన్నగా చేసి ‘జో’, ‘బిల్’, ‘సామ్’ (Joe, Bill, Sam) అని పిలిచేవారు (మనలో కూడా కృష్ణమూర్తిని కిట్టు అని, శ్యామ్ సుందర్‌ను శ్యామ్ అని, సుబ్రహ్మణ్యంను సుబ్బు అని పిలిచే పద్ధతి ఉంది.). నా పేరును చిన్నగా చేయడానికి ఎక్కడ కావలన్నా నిలపండి అని చెప్పేవాడిని. కొందరు మిస్టర్ ‘ఎన్’ అని, కొందరు ‘నర’ అని, మరికొందరు ‘నరసి’ అని పిలిచేవారు. దానికన్నా ముందుకు వెళ్ళేవారు కాదు.
ఒక ఆదివారం ఉదయం నాకు టెలీఫోన్ పిలుపు వచ్చింది. నా గది మేడపైన ఉంది. మా ఇంటి యజమాని టెలీఫోన్ ఎత్తి ‘నరసి టెలీఫోన్’ అన్నారు. క్రిందకు వచ్చి టెలీఫోన్ తీసుకున్నాను. అవతలి నుండి కన్నడలో మాట్లాడారు. పేరు చెప్పలేదు. నన్నే గొంతు విని వారి పేరు కనుక్కోమని అడిగారు. ప్రయత్నించాను. కుదరలేదు. చివరకు తాను కె.ఎస్.అనంతరామ్ అని చెప్పారు. వారు నేషనల్ హైస్కూలులో నాకు సన్నిహితుడైన సహపాఠి. రమ్మని ఆహ్వానించి అడ్రస్ ఇచ్చాను. వారు నన్ను చూసిన తక్షణం “ఏయ్ నరసింహా, నీవు ఇక్కడా నేషనల్ కాలేజీ పి.బి.హెచ్.లో (Poor Boys’ Home) ఉన్నట్లే ఉన్నావు కదరా” అని కొంత ఆశ్చర్యపోయారు. నేను నేషనల్ హైస్కూలులో చదివినప్పుడు దాని ఆశ్రయంలోని పేద పిల్లల విద్యార్థినిలయం (Poor Boys’ Home) లోనే నాకు ఉచిత భోజన వసతి సదుపాయాలు లభించాయి అని పాఠకులకు ఇంతకు ముందే తెలుసు. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు నా దుస్తులు షర్టు, ప్యాంటు, కోటు ఇంకా బూట్లు. దుస్తులన్నీ ఖద్దరువే. ఎప్పుడూ టై (Tie) కట్టలేదు. నా జన్మలోనే టై కట్టలేదు. ముందుముందు కట్టుకునే అవకాశమూ లేదు. అయితే ఇంటిలో నా వేషం షర్టు, దట్టి పంచ. దీన్ని చూసే అతడు ఆశ్చర్యపడింది.
సుమారు రెండు నెలల తరువాత మా ఇంటి యజమాని “మీరు ఎలా పడుకుంటారు” అని అడిగారు. నాకు ఆశ్చర్యం వేసింది. “అందరూ పడుకున్నట్టే నేనూ పడుకుంటాను” అన్నాను. “లేదు. తేడా ఉంది. రండి. మీరు పడుకుని చూపించండి” అన్నారు. ఇదేమిటి ఇలా అడుగుతున్నారు అనుకుంటూ మంచం మీద పడుకుని పై దుప్పటిని పైకి లాగుకున్నాను. “అలా కాదు” అని చెప్పి దుప్పటి క్రింద ఉన్న పరుపులాగా మందంగా ఉన్న మరొక దుప్పటిని చూపి దీనికీ పరుపుకూ మధ్య పడుకోవాలి అన్నారు. నాకు అలాంటిదొకటి నా పరుపుమీద ఉందని తెలియనే లేదు. అమెరికన్ పద్ధతి ప్రకారం వారి ఇంట్లో అద్దెకు ఉన్నవారి పరుపు మీద పరచిన బట్టలు, దుప్పట్లు మొదలైనవాటిని వారానికి రెండుసార్లు వారే బదలాయించి పరుపును నీటుగా ఉంచి వెళతారట. వారు అలా చేసినప్పుడు ఆ రెండు ‘పరుపుల’ మధ్యనున్న బెడ్షీట్ ఏమాత్రం నలిగిపోలేదు. ముందు పరిచినప్పుడు ఎలా వుందో అలాగే ఉంది. అందుకోసమే వారికి అనుమానం వచ్చి నన్ను అడిగారు. అంతవరకూ నేను పడుకున్నప్పుడు చలి అయ్యేది. దుప్పటి సరిపోయేది కాదు. ఇంకొక దుప్పటి అడగడానికి సంకోచం. దుప్పటితోపాటు నా పంచలను జోడించి కాలం గడిపేవాడిని. నిజంగా చలికాలం ఇంకా మొదలు కాలేదు. అందువల్ల చలి అయినా తట్టుకోగలిగాను. అతడు చెప్పిన రోజు నుండి ఆ రెండు పరుపుల మధ్య వెచ్చగా పడుకునేవాడిని.
అదే యజమాని నేను పంచ కట్టుకోవడం కొన్ని వారాలు చూచి “నరసి, నాదొక ప్రశ్న ఉంది” అన్నారు. “ఏమి. అడగండి” అన్నాను. “భారతీయులందరూ బెడ్‌షీటును తమ దుస్తుల్లో భాగంగా ఉపయోగిస్తారా?” అని అడిగారు.
కోడిగుడ్డు
ఏడెనిమిది నెలల తరువాత పని ఎక్కువ కావడం వల్ల, మానసిక ఒత్తిడి కారణంగా అమెరికా రావడానికి ఒక నెలక్రితం బయట పడిన కడుపులోని కురుపు (ulcer) బాధించడం మొదలుపెట్టింది. దేహంపై మానసిక ఒత్తిడివల్ల ఈ వ్రణం (Psychosomatic) వస్తుంది. అది ఉధృతం కావడం, తగ్గిపోవడం ఇలా నన్ను పీడిస్తూ ఉంది. అమెరికన్ విద్యావిధానంలో రోజూ ప్రొద్దునైతే లఘు పరీక్ష, లేదా అంతిమ పరీక్ష, గ్రేడ్ల జంజాటం అల్సర్ లేనివానికీ ఈ విధానం అల్సర్ తెప్పిస్తుంది. నాకు ముందే ఉంది. అందువల్ల అది ఇక్కడ తీవ్రం కావడం సహజమే. దీనికోసం అప్పుడప్పుడూ ఆస్పత్రికి వెళ్ళి మందులు తీసుకునేవాడిని.
ఒక రోజు జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళ్ళాను. ఇంజెక్షన్ ఇవ్వమని డాక్టర్ నర్సుకు చెప్పివెళ్ళారు. గుడ్డు తింటే మీకు ఏమీ కాదు కదా (allergic to eggs?) అని నర్స్ అడిగారు. “నాకు తెలియదు. నేను గుడ్డు తిననేలేదు” అన్నాను. “హా. ఇంతవరకూ గుడ్డు తినలేదా? పదండి. డాక్టర్ దగ్గరకు పోదాం” అని తప్పు చేసిన ఖైదీలా నన్ను చూస్తూ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. “చూడండి డాక్టర్. ఈ పిల్లవాడు ఇంత వరకూ గుడ్డు తిననే లేదట” అని చెప్పారు. “మీరు శాఖాహారులా?” అని డాక్టర్ అడిగారు. “ఔను” అన్నాను. “పాలు త్రాగుతారా” అని అడిగారు. “త్రాగుతాను” అని చెప్పాను. “అయితే మీరు శాఖాహారి కావడానికి సాధ్యం కాదు” అన్నారు. వారి తర్కం నాకు అర్థమయ్యింది. పాలు ప్రాణిజన్యమైనది. అందువల్ల పాలు తాగితే పరోక్షంగా ప్రాణిని తిన్నట్లేనని వారి భావన. నా సమయస్ఫూర్తికి నన్ను నేనే మెచ్చుకుంటూ “అయితే ప్రతి ఒక్కరూ నరభక్షకులా?” అని ఎదురు ప్రశ్నించాను. “మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అలా అంటే ఏమిటి?” అన్నారు. వారు కొంచెం ట్యూబ్ లైట్ (Tube Light). స్విచ్ వేసిన తక్షణం వెలగలేదు. “మీ లెక్క ప్రకారం తల్లి పాలు త్రాగితే తల్లిని తిన్నట్లు కాబోలు” అన్నాను. వారు గట్టిగా నవ్వి “తర్కాన్ని పొడిగించడం వద్దు” (Let us not carry logic too far) అన్నారు. వారికి అనుకూలమైతే తర్కం కావాలి; అయితే అయిష్టాన్ని కలిగించేటట్టయితే మాత్రం తర్కం వద్దు!
నన్ను బాయ్ (పిల్లవాడు) అని పిలవవద్దమ్మా అని ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ఆ నర్సుకు చెప్పివున్నాను. నేను పిల్లవాడిని కాను. నాకు 37 యేళ్ళు నిండాయి. భారతీయుల సరాసరి వయసు 35 సంవత్సరాలు. రెండు సంవత్సరాలు బోనస్ (Bonus) నుండి బ్రతుకుతున్నాను అని చెప్పేవాడిని. ఆమె నవ్వి ఊరుకునేవారు.
నల్లటి ముక్కలు
ఒక రోజు ఉదయం పని ఎక్కువ ఉన్నందువల్ల ఉప్మా చేసుకోవడం కుదరలేదు. అందువల్ల ఆ మధ్యాహ్నం ఏదో ఒక కేఫెటేరియాలో భోజనం చేయాలని వెళ్ళాను. అక్కడ ప్లేట్, స్పూన్ తీసుకుని కూరగాయల కోసం వెదికాను. మే ఐ హెల్ప్ యూ అని అక్కడున్న పనివాడు అడిగాడు. నేను శాకాహారిని. అందువల్ల కూరగాయలు కావాలి అన్నాను. “అక్కడుంది తీసుకోండి” అన్నాడు. కొంచెం గమనించి వాటిని చూశాను. బీన్స్, క్యారెట్తో పాటుగా నల్లని ముక్కలు కనిపించాయి. “ఆ నల్లగా కనిపించే ముక్కలు ఏమి?” అని అడిగాను. “మాంసం ముక్కలు” అన్నాడు. “నేను శాకాహారిని అని చెప్పాను కదా” అని గుర్తుచేశాను. “మాంసం ముక్కలు తీసివేసి మిగిలిన కూరగాయలను తినండి” అన్నాడు. “అయ్యో అదంతా కుదరదు” అన్నాను. “మీకు కుదరక పోతే నేను వాటిని వేరుచేసి ఇస్తాను” అన్నాడు. అది విని తలగోక్కొన్నాను. బ్రెడ్ జతకు జామో (Jam) గీమో వేసుకుని తిన్నాను. అమెరికాలో ఉన్న నాలుగు సంవత్సరాలలో ఫోర్క్ (Fork)ను ఒకసారి కూడా ఉపయోగించలేదు. ఆ ‘త్రిశూలం’, ‘చతుశ్శూలం’ నా నాలుకను ఎక్కడ చీలుస్తుందోనని భయం.
సుమారు ఒక సంవత్సరం తరువాత కడుపులో అల్సర్ నాకు ఎక్కువ బాధ పెట్టడం మొదలయ్యింది. గత్యంతరం లేక విశ్వవిద్యాలయం ఆస్పత్రిలో చేరాను. ఒక వారం ఉన్న తరువాత నొప్పి తగ్గింది.
వి.కె.కృష్ణమేనన్
ఒక రోజు మా విశ్వవిద్యాలయంలో మన దేశపు రక్షణ మంత్రి ఐన వి.కె.కృష్ణమేనన్ గారి ప్రసంగం ఉందనే వార్త విని నాకు సంతోషమయ్యింది. అదే సమయంలో నాకు ఒక క్లాసు ఉంది. అధ్యాపకుల అనుమతి తీసుకుని వారి ఉపన్యాసం వినడానికి వెళ్ళాను. సభాప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. చాలా మంది నిలబడి ఉన్నారు. వారు ఒక విషయంపై మాట్లాడతారని ముందు ప్రకటించారు. ఏ విషయమో మరిచిపోయాను. కృష్ణమేనన్ సభలోకి అడుగుపెట్టారు. వారిని మొట్టమొదటిసారి నేను చూశాను. సన్నగా, పొడుగుగా, కొంచెం నలుపు రంగులో ఉన్నారు. తెల్ల చొక్కా, దట్టి పంచ, రెండు భుజాల మీదుగా వేలాడుతున్న అంచులున్న ఉత్తరీయం ఇదీ వారి ఆహార్యం. చేతిలో వాకింగ్ స్టిక్. ప్రకటించిన విషయం గురించి నేను మాట్లాడను అని కృష్ణమేనన్ గారు చెప్పారు. దానికి బదులుగా సభికులు ఏ విషయంపైన అయినా ప్రశ్నలు అడగవచ్చని చెప్పారు. అందువల్ల చాలామందికి సంతోషం అయ్యింది. అమెరికన్లకు ప్రశ్నించడం చాలా ఇష్టం. సుమారు రెండు గంటల సేపు ప్రశ్నల వర్షం కురిసింది. సమాధానాలైతే ఏ దయాదాక్షిణ్యాలు లేకుండా ఖరాఖండీగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు అమెరికాను కటువుగా విమర్శించారు. ఒక్కొక్క ప్రశ్నకూ ఒద్దికగా ఏమాత్రం తడుముకోకుండా బదులు ఇచ్చారు. వారు ఉత్తమ వక్తలు. విషయాలను బాగా, వివరంగా తెలుసుకున్నవారు. వారికి ఆంగ్లభాషపై మంచి పట్టుంది. వారి సమాధానాలను, వాక్ఝరిని చూచి అమెరికన్లు ఆశ్చర్యపోయారు. వారి నిరాటంకమైన రెండు గంటల ప్రశ్నోత్తర కార్యక్రమంలో సమయం ఎలా గడిచిపోయిందో తెలియనేలేదు. నా అభిప్రాయంలో భారతదేశం ప్రతిష్ఠ ఆ కార్యక్రమం నుండి పెరిగింది.
కృష్ణమేనన్ గారు వామపక్ష భావజాలం కలిగినవారు. సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశాలపై నిప్పులు చెరిగేవారు. అమెరికా వారికి మొదటి శత్రువు. అమెరికన్లు కృష్ణమేనన్ గారిని కమ్యూనిష్టు అనే భావించారు.
భారత ప్రతినిధిగా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ఒక సారి 12 గంటల పాటు నిలకడగా మాట్లాడి ఒక రికార్డును సృష్టించారు. వారికి టీ అతిప్రియమైన పానీయం.
ప్రిలిమినరీ పరీక్ష
అన్ని క్వార్టర్లలోనూ భౌతిక శాస్త్రంలో ‘ఎ’ గ్రేడ్ పొందాను. గణిత శాస్త్రంలో ‘బి’ గ్రేడ్ వచ్చింది. గణితంలో నాకు మొదటి నుండీ ఆసక్తి. కష్టమైన ఇంటర్మీడియట్ పరీక్షలలో గణిత శాస్త్రంలో 300 మార్కులకు 286 మార్కులు తెచ్చుకుని రాష్ట్రంలోనే రెండవ ర్యాంకు తెచ్చుకున్నానని ఇంతకు ముందే చెప్పివున్నాను. ఇక్కడ గణితశాస్త్రం కొంచెం తొందరపెట్టినా ‘సి’ గ్రేడ్ తెచ్చుకోలేదు. నా మంచి గ్రేడ్లు నాకు ఎక్కువ తృప్తిని ఇచ్చింది.
వేసవి క్వార్టర్లో సామాన్యంగా విద్యార్థులు ఏ సబ్జెక్టునూ చదవడానికి ఎంచుకోరు. ఆ మూడు నెలలు వారు చదువుతున్న విభాగంలోనే ఏదైనా పని చేసి డబ్బు సంపాదిస్తారు. దానికి ఆ విద్యార్థుల గైడ్లు సహకరిస్తారు. నేను ఏ వేసవి సెలవులను ధనం సంపాదించుకోవడానికి ఉపయోగించుకోలేదు. అన్నట్లు వేసవిలోనూ విద్యార్థులు కొన్ని సబ్జెక్టులను ఎంచుకుని చదివే అవకాశం ఉంది. మన విద్యావిధానంలో వేసవిలో ఏ పాఠశాలా, ఏ కళాశాలా పనిచేయవు. వీలైనంత త్వరగా డాక్టరేట్ పొందడమే నా ఏకైక లక్ష్యం. అందువల్ల వేసవిలో ధన సంపాదనపై నా దృష్టి పోలేదు.
డాక్టరేట్ పొందడానికి కొన్ని నియమాలు పాటించాలి. ముందే తెలిపినట్లు నిర్దిష్టమైన విషయాలలో నిర్దిష్టమైన గంటలు చదివి విజయవంతంగా ముగించి క్రెడిట్లను సంపాదించాలి. దానితోపాటు కొన్ని సబ్జెక్టులలో ఒక ప్రాథమిక పరీక్ష(Preliminary Examination)లో పాస్ కావాలి. ఆ పరీక్ష మన పరీక్షల మాదిరే ఉంటుంది. ఒక్కొక్క పరీక్ష వ్యవధి మూడు గంటలు. దానిలో పాస్ అయిన తరువాత ముఖ్యమైన, కష్టమైన అంతిమ పరీక్ష (Final Examination) లో ఉత్తీర్ణత సాధించాలి. సామాన్యంగా ఈ అంతిమ పరీక్ష ముగిసేవరకూ చదువు పైనే దృష్టి పెడతారు. పరిశోధన(Research)కు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వరు. అంతిమ పరీక్షలో రెండు భాగాలు ఉన్నాయి. లిఖితం మరియు మౌఖికం. అది ముగిసిన తరువాత సమయమంతా పరిశోధనకే వెచ్చించాలి.
నేను సుమారు ఒకటిన్నర సంవత్సరాలైన తరువాత ప్రిలిమినరీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాను. తరువాత ఆరునెలలు గట్టిగా చదివి ఫైనల్ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఈ పరీక్ష వ్రాయడానికి ఎవరూ తొందరపడరు. ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకొక్క అవకాశం మాత్రం ఇస్తారు.
అంతిమ పరీక్ష
నేనైతే చాలా జాగ్రత్తగా అన్ని సాధకబాధకాలను పరిగణించి ప్రిలిమినరీ పరీక్షలు అయిన ఆరునెలలకు అంతిమ పరీక్షలను తీసుకోవాలని నిర్ణయించాను. మొత్తం ఐదు సబ్జెక్టులు. ప్రతి పరీక్ష వ్యవధి ఐదు గంటలు. రోజు విడిచి రోజు పరీక్ష. ఈ పరీక్షలు ముగిసేసరికి ఒకరకంగా నేను పునర్జన్మనెత్తాను. నా అభిప్రాయం ప్రకారం తృప్తికరంగానే వ్రాశాననే విశ్వాసముంది. లిఖిత పరీక్షలు ముగిసిన పదిహేను రోజులకు మౌఖిక పరీక్ష. ఆ ఐదు ప్రశ్నాపత్రికలను ఇచ్చిన ప్రొఫెసర్లే ఇక్కడా పరీక్షకులు. వారితో పాటు మరొక ప్రొఫెసర్ వీక్షకులు (Observer)గా ఉంటారు. విద్యార్థి సమాధానాలను బట్టి అతని స్థాయిని స్థూలంగా నిర్ణయిస్తారు.
ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మౌఖిక పరీక్ష మొదలయ్యింది. ఒక్కొక్కరు సుమారు అర్ధగంట సమయం ప్రశ్నలను అడిగారు. ఆ రెండున్నర గంటల మౌఖిక పరీక్ష ముగిసే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. అంతా అయిన తరువాత నేను వెళ్ళవచ్చని చెప్పారు. తరువాత అంతిమ పరీక్షల ఫలితాన్ని సుమారు 15-20 నిమిషాల తరువాత తెలుపుతారు. నేను బయటకు వచ్చి వరండాలో ఫలితం కోసం తచ్చాడుతూ ఉన్నాను. మొదట బయటకు వచ్చిన వారు మా గణితశాస్త్రం ప్రొఫెసర్ డా. జీబర్. బాగా సమాధానం చెప్పానని మెప్పు మాటలు కొన్ని చెప్పి, అంతిమ పరీక్షలో పాస్ అయ్యానని తీపి కబురును చెప్పి వెళ్ళారు. తరువాత రెండు నిమిషాలకు మిగిలిన ప్రొఫెసర్లు బయటకు వచ్చి అభినందించారు. చివర వచ్చిన వారు నా మార్గదర్శి డా.ఎం.ఎల్.పూల్. పరీక్షకులు అందరూ నా సమాధానాల వల్ల తృప్తి చెందారని చెప్పి హృదయపూర్వకంగా అభినందించారు.
మరుసటి రోజు ఎటువంటి ఆందోళన, ఉద్రిక్తత లేకుండా మా డిపార్ట్‌మెంటుకు వెళ్ళాను. రెండు సంవత్సరాల అగ్నిపరీక్ష అయిన తరువాత నాకు లభించిన మనశ్శాంతి ఇప్పటికీ గుర్తుంది. మా ప్రొఫెసర్‌తో మాట్లాడుతూ ఉన్నాను. పక్కనే మా డిపార్ట్‌మెంటుకు చెందిన ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. “రెండు సంవత్సరాల నుండి మీరు నిరంతరం కష్టపడి చదివింది నేను చూస్తూ వస్తున్నాను. మీరు చాలా శ్రమపడ్డారు. కొన్నిరోజులైనా విరామం తీసుకుని అమెరికాలోని దర్శనీయ స్థలాలకు వెళ్ళి రండి” అని చెప్పారు. ఇది విన్న ఆ విద్యార్థులు మధ్యాహ్నం మాట్లాడుతున్నప్పుడు “నీవు చాలా అదృష్టవంతుడివి. నీ ప్రొఫెసర్ నిన్ను ఎంత మెచ్చుకున్నారు. ఇలాంటి పొగడ్తలు వారి నోట రావడం అపురూపం” అని నా గురించి మంచిమాటలు మాట్లాడారు.
నెమ్మది
మా ప్రొఫెసర్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. డా.ఎం.ఎల్.పూల్ ఆజానుబాహువు, స్ఫురద్రూపి. నేను వారి వద్దకు విద్యార్థిగా వెళ్ళినప్పుడు వారికి సుమారు 58 యేండ్లు. నేనున్నపుడే వారికి 60 సంవత్సరాలు వచ్చాయి. మా డిపార్ట్‌మెంటులో అనధికారికంగా నడిచిన ఒక చిన్న సమావేశంలో వారిని విద్యార్థులు అభినందించారు. మన షష్టిపూర్తికి, వారి 60 యేళ్ళ ఆ సంతోష సమావేశానికీ ఏ సంబంధమూ లేదు. వారు అత్యంత క్రమశిక్షణ కలిగిన అపూర్వ వ్యక్తులు. వారి సమయమంతా విజ్ఞానానికే, పరిశోధనకే వెచ్చించారు. ప్రతిరోజు ఉదయం 6.30 నుండి 7 గంటలలోపు వానా, చలి అనకుండా తమ ఆఫీసుకు వచ్చేవారు. సాయంత్రం సుమారు 6.30కు ఇంటికి వెళ్ళేవారు. ప్రతినిత్యం 12 గంటలు ఎడతెగని పని. ఆదివారం ఉదయమూ మిగిలిన రోజులలాగే వచ్చేవారు. ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్ళేవారు. క్రిస్టియన్ అయినా చర్చికి వెళ్ళేవారు కారు. వేసవిలోనూ వారి టైమ్‌టేబుల్‌లో మార్పేమీ లేదు.
నా అంతిమ పరీక్ష ముగిసే వరకు నేను ఎక్కడా కదలలేదు. నేను, నా గది ఇంకా నా విశ్వవిద్యాలయం అంతే. కొలంబస్ వదిలి బయటకు పోలేదు. నాకు బాస్కెట్‌బాల్, ఇంకా కొన్ని ఆటలలో ఆసక్తి ఉన్నా ఏ పందాలను చూడటానికి వెళ్ళలేదు. అంతిమ పరీక్ష విజయవంతంగా ముసినందువల్ల డాక్టరేట్ పొందే మార్గం సుగమమయ్యింది. మిగిలినది పరిశోధన ఒకటే. ఏ పరీక్షలూ లేవు. మనసు నెమ్మదించింది. అప్పుడప్పుడూ బాధపెడుతున్న కడుపులోని కురుపు తగ్గింది.
క్రీడలు
అమెరికాలో బేస్‌బాల్ ఆట అత్యంత జనప్రియమైనది. దాని తరువాత ఫుట్‌బాల్. ఎంతైనా బుద్ధికలిగిన దేశం! తెలివితక్కువ, వెనుకబడిన దేశాలే క్రికెట్ ఆడుతాయి. అక్కడ కాలానికి ఎక్కువ విలువ. నీరసమైన ఆటలు వారికి అంత ఇష్టం ఉండదు. చూడటానికి ఉల్లాసం ఉండాలి, ఉద్రేకం ఉండాలి. అక్కడి ‘ఫుట్‌బాల్’ మిగిలిన దేశాల ఫుట్‌బాల్ కన్నా భిన్నమైనది. ఆ పేరు తప్పు అర్థాన్ని ఇస్తుంది. అక్కడ బంతిని తన్నడానికి కాలు ఉపయోగించడం తక్కువ. ఆ బంతి మన బంతుల్లా గోళాకారంలో ఉండదు. ఒకటిన్నర అడుగు పొడవుండి మధ్యలో ఉబ్బిన దోసకాయలా ఉంటుంది. లోపల గాలి ఉండదు. బాస్కెట్‌బాల్ వలె చేతులే ఎక్కువ ఉపయోగించేది. మన ఫుట్‌బాల్ మైదానమంతే మైదానం ఉంటుంది. మొరటైన ఆట. బంతిని లాక్కోవడానికి ఒకరిపై ఒకరు జోరుగా పడిపోవడం సర్వసాధారణం. దానివల్ల అపాయాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒక్కొక్క ఆటగాడు మెత్తని, దళసరైన పరుపులాంటి దుస్తులను, తలకు హెల్మెట్నూ ఉపయోగిస్తాడు.
మా కొలంబస్ నగరపు స్టేడియంలో సుమారు 60వేల మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశముంది. ఆట మొదలయ్యేదానికంటే 15-20 నిమిషాల ముందు బ్యాండ్‌సెట్ యొక్క ఆకర్షణీయమైన ప్రదర్శన ఉంటుంది. మా విశ్వవిద్యాలయపు బ్యాండ్‌సెట్‌లో సుమారు 200 మంది ఉన్నారు. ఆ 200 మంది విద్యార్థులు వివిధ వాద్యాలను వాయించుకుంటూ ఆ మైదానంలోనికి ప్రవేశించినప్పుడు అత్యుత్సాహంతో ప్రేక్షకులందరూ నిలబడి హర్షాతిరేకాలతో దానిని స్వాగతిస్తారు. నాకైతే ఆ దృశ్యాన్ని మరిచిపోవడం సాధ్యమే కాదు. అవి ఎక్కువ సంతోష, చైతన్యపూరితమైన క్షణాలు. బ్యాండ్ ప్రదర్శన తరువాత పోటీలో పాల్గొనే జట్లు ప్రవేశిస్తాయి. మా విశ్వవిద్యాలయం జట్టు ప్రవేశించగానే ఆ వేలాది మంది ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనుల ద్వారా స్వాగతిస్తారు.
బాస్కెట్‌బాల్ ఆటకూడా జనాదరణ పొందిన క్రీడలలో ఒకటి. ప్రపంచంలో బాస్కెట్‌బాల్ ఆటకు ఎక్కడయినా ఒకే నియమాలు. స్వతహాగా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిని అయినందువల్ల ఆ నియమాలు నాకు తెలుసు. నా చివరి సంవత్సరం గడువులో తప్పకుండా ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ పోటీలు చూడటానికి వెళ్ళేవాణ్ణి. ఆ పోటీలలో ఎత్తికనిపించే విశేషం ఏమిటంటే ప్రేక్షకుల మితిమీరిన ఉత్సాహం. ఆట రసవత్తరంగా ఉన్నప్పుడు దానిని చూస్తున్న ముసలి ప్రేక్షకులకూ ఆవేశం వచ్చి యువకుల వలె నిలుచుని కేకలు వేస్తారు. ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక్కొక్క సారి రెండు జట్ల మధ్య స్కోరు సమానంగా ఉండి చివరి ఘట్టానికి చేరినప్పుడు ప్రేక్షకులంతా ఒంటికాలిపై నిలబడి తమ ప్రియమైన జట్టుకు ప్రోత్సాహం ఇస్తారు. మొత్తానికి వారు ఉల్లాసమైన జీవితాన్ని ప్రేమించే జనులు.
ఈ పోటీలను చూడటంతోపాటు టెన్నిస్ నేర్చుకోవాలని కోరిక పుట్టింది. విశ్వవిద్యాలయంలో ఎక్కువ టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. నేను మొదలే చెప్పినట్లు మా నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా ఉన్నప్పుడు బాస్కెట్‌బాల్, హాకీ ఆటలను ఆడేవాణ్ణి. ఈ రెండు క్రీడలలోనూ కొంత నైపుణ్యం ఉంది. రాష్ట్రంలోని పేరెన్నిక కలిగిన జట్లతో ఆడినాము. బాల్‌బాడ్మింటనూ కొంచెం బాగానే ఆడేవాడిని. టేబిల్ టెన్నిస్, వాలీబాల్లను అప్పుడప్పుడూ ఆడేవాడిని. ఈ నేపథ్యంలో నేను టెన్నిస్ కోర్టును సిద్ధం చేసి కొన్ని నెలలు ఆడాను. ఇప్పుడూ విద్యార్థులు ఆ కోర్టులో ఆటలాడుతున్నారు.
యాత్ర – చికాగో
మొదటి రెండు సంవత్సరాల కష్టం తరువాత కొందరు నేను విశ్రాంతి తీసుకోవాలనే సలహా ఇచ్చారు. నాకు కూడా అమెరికాలోని కొన్ని ముఖ్య స్థలాలను చూడాలని ఆశ ఉంది. దానితో యాత్ర చేయాలని నిర్ణయించాను. ఒక్కొక్కరి ఇళ్ళల్లో ఒకటి లేదా ఒకటికన్నా ఎక్కువ కార్లు ఉండటం వల్ల అమెరికన్లు టూరుకు వెళ్ళాలంటే సాధారణంగా తమ స్వంత వాహనాలలోనే వెళతారు. ఒక్కొక్కరే వెళ్ళేటట్టయితే బస్ ద్వారా వెళతారు. అమెరికాలో ఉన్న ప్రసిద్ధ గ్రేహౌండ్ బస్ (Grey Hound Bus) సంస్థ ప్రయాణీకులకు ఉత్తమ సౌకర్యాలను అందిస్తుంది. రైలు ద్వారా యాత్ర చేసేవారి సంఖ్య తక్కువ. రైలు డబ్బాలు (Compartments) జనం లేక బిక్కుబిక్కుమంటూ ఉంటాయి. నేను రైలు ప్రయాణం చేయాలని నిశ్చయించాను. పశ్చిమ అమెరికాలోని కొన్ని ప్రాంతాలను చూడటానికి టికెట్టు డిస్కౌంట్ ధర 175 డాలర్లు.
నేను చూడాలకున్న కొన్ని పట్టణాలలో రామకృష్ణాశ్రమాలు ఉన్నాయి. బెంగళూరు రామకృష్ణాశ్రమం నుండి అక్కడి స్వామీజీలకు నా పరిచయ పత్రాలను తీసుకుని వెళ్ళాను. అక్కడ నా భోజన, వసతులకు ఆ పరిచయ పత్రాలు సహాయం చేశాయి. మిగిలిన ఒకటి రెండు చోట్ల పూర్వ విద్యార్థుల లేదా స్నేహితుల ఇళ్ళల్లో ఉన్నాను. ఈ యాత్రలో హోటల్లో బస చేయలేదు.
నేను సందర్శించిన పట్టణాల వివరాలన్నీ వ్రాయాల్సిన ఆవశ్యకత లేదు. పైగా మరచిపోయాను. జ్ఞాపకం ఉన్న కొన్ని ముఖ్యమైన వివరాలను మాత్రం వ్రాస్తున్నాను.
మొదట చికాగో పట్టణానికి వెళ్ళాను. అక్కడ శ్రీరామకృష్ణాశ్రమం ఉంది. అన్ని పెద్ద పెద్ద పట్టణాలలో దర్శనీయ స్థలాలను చూసేందుకు ప్రత్యేకమైన బస్సు సదుపాయాలు ఉన్నాయి. ఆ స్థలాల చరిత్ర వివరాలు తెలిసిన గైడ్లు ఉంటారు. పర్యాటకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. అక్కడ ముఖ్యంగా చూడవలసింది ప్లానెటేరియం, ఆక్వేరియం, 300 మైళ్ళపొడవు, 100 మైళ్ళ వెడల్పు ఉన్న అతిపెద్ద సరోవరం, చికాగో అంచులో ఉన్న ఇవాన్‌స్టన్ (Evanston) ప్రాంతంలో ఉన్న బహాయ్ దేవస్థానం, విశ్వవిద్యాలయం మరియు మ్యూజియంలు. సైన్స్ మ్యూజియంలు నాకు బాగా నచ్చాయి. విజ్ఞానశాస్త్రాన్ని ప్రజాదరణ పొందేలా చేయడానికి అవి ఉత్తమమైన సాధనాలు. చికాగోలో ఉన్న ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ లోనే 100 యేళ్ళ కన్నా ముందు స్వామీ వివేకానంద గారు సుప్రసిద్ధమైన అంతర్జాతీయ ధార్మిక సమ్మేళనం (Parliament of Religion)లో అమోఘమైన ప్రసంగం చేసి ప్రఖ్యాతి గడించారు. దానిని, వివేకానంద నివసించిన ఇంటిని ఆశ్రమపు బ్రహ్మచారుల సహాయంతో చూశాను. ఒకరోజు చికాగో పట్టణంలో నడుచుకుని వెళుతున్నాను. అక్కడ దొరికిన ఒక అమెరికన్‌ను “చికాగో పట్టణానికి ఎంత వయస్సు ఉంటుంది” అని అడిగాను. అతడు నా ముఖాన్ని చూచి “మీ దేశపు పట్టణాలకన్నా చిన్నది” అని చెప్పి “మీరు భారతీయులు కదా” అని అడిగాడు. రంగు ఏదైనా కానీ ముఖ కవళికలను బట్టి, తల వెంట్రుకలను బట్టి భారతీయులు అని సులభంగా గుర్తిస్తారు.
నేషనల్ పార్క్
చికాగో నుండి పశ్చిమానికి సుమారు 1500 మైళ్ళ దూరంలో ఉన్న ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (Yellow Stone National Park) చూడటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే మార్గంలో పార్కుకు సమీపంలో ఉన్న ఆగ్డెన్ (Ogden) అనే ఊరులో రైల్వేస్టేషన్ ఉంది. అక్కడి నుండి ఆ పార్కుకు బస్సులో వెళ్ళాల్సివుంది. ఆగ్డెన్ లోని ఒక హోటల్లో తిండి తినడానికి కూర్చున్నాను. ఎంత సేపు కూర్చున్నా ఆ హోటల్ సర్వర్లు నన్ను చూసి కూడా నావైపు రాలేదు. ఆశ్చర్యంతో ఒక పనివాడిని అడిగాను నాకు టిఫెన్ కావాలని. అతడు వినయంతో మేము కలర్డ్ పీపుల్(Coloured People) కు ఇక్కడ ఆహారం ఇవ్వము అన్నాడు. కలర్డ్ పీపుల్ అంటే నీగ్రోలు అని వారి అర్థం. “నేను భారతీయుడిని. అమెరికా కలర్డ్ పీపుల్ కాదు” అన్నాను. అతడు వెంటనే క్షమాపణ చెప్పి నాకు తిండి పెట్టాడు. ఆగ్డెన్ అమెరికాలో ఒక మారుమూలలో ఉన్న గ్రామం. ఇతర పట్టణాలతో ఉన్నట్టు ఇక్కడ భారతీయులతో సంపర్కం లేదు. అదీకాక అక్కడి పనివారికి పెద్ద చదువుగాని, ప్రపంచ జ్ఞానం గానీ లేదు. వారి లెక్క ప్రకారం నల్లనివారందరూ నీగ్రోలే. విద్యార్థిగా 3 సంవత్సరాలు, ప్రొఫెసర్‌గా మరో సంవత్సరం మొత్తం నాలుగేళ్ళ నా అమెరికా జీవితంలో వర్ణవివక్షతకు గురైనది ఈ ఒక్క సంఘటనలోనే.
ఆ పార్కులో వేడి నీటిబుగ్గలు సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఓల్డ్ ఫెయిత్‌ఫుల్ (Old Faithful). అది సుమారు 80 నిమిషాలకు ఒకసారి తప్పకుండా వేడి నీటిని చిమ్ముతుంది. పార్కును సందర్శించినవారు ఆ దృశ్యాన్ని చూడకుండా వెళ్ళరు. అక్కడున్న వృక్షసంపదను, ప్రాణికోటినీ, అగాధమైన లోయలనూ, చిన్నచిన్న జలపాతాలనూ చూసి సంతోషమయ్యింది.
ఆ పార్కులో ఉన్నప్పుడే 1959 ఆగస్టు 28వ తేదీ సాల్ట్ లేక్ హెరాల్డ్ (Salt Lake Herald) పత్రికలో “చైనావారు భారతదేశాన్ని ముట్టడించారు(Chinese Invade India)” అన్న వార్త చదివి గాభరా పడ్డాను. చైనా సైన్యం హద్దులు దాటి మన దేశంలోనికి ప్రవేశించింది. చైనీయులు, భారతీయులు వందల ఏళ్ళుగా స్నేహితులు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు, చైనీయులపై ముఖ్యంగా వారి ప్రధాని చౌ ఎన్ లై పై గాఢమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. హద్దులు దాటి చైనీయులు భారత భూభాగంలో ప్రవేశించడం విశ్వాసఘాతుకం. దీనివల్ల నెహ్రూగారు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడు రక్షణమంత్రిగా కృష్ణమేనన్ ఉన్నారు. వారు వామపక్ష భావజాలం కలిగినవారు. ఇప్పటి బి.జె.పి. పార్టీకన్నా ఎక్కువ మతవాదాన్ని (Fundamentalism) ప్రతిపాదించే జనసంఘం వారికి ఒక మంచి అవకాశం దొరికింది. దీనిని ఉపయోగించుకుని కృష్ణమేనన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అది పరోక్షంగా నెహ్రూమీద చేసిన దాడి. నెహ్రూ, కృష్ణమేనన్ ఇద్దరూ ఒకే మనస్తత్వం కలిగినవారని అందరికీ తెలుసు. జనసంఘానికి చెందిన శ్యాం ప్రసాద్ ముఖర్జీగారు అప్పుడు పార్లమెంటులో ఆ పార్టీకి నాయకులు. ప్రతిపక్షాల ఒత్తిడి ఎక్కువయ్యింది. విధిలేక విచారంతో నెహ్రూగారు మేనన్‌ను తొలగించాల్సి వచ్చింది. ఈ దెబ్బనుండి నెహ్రూగారు కోలుకోవడానికి కుదరనే లేదు. ఇది నెహ్రూ మరణానికి దారితీసింది అన్నా తప్పుకాదు.
(సశేషం)