‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -16

2
12

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

వాట్ సిస్టర్

[dropcap]బి.[/dropcap]ఎస్.సి. ఫెయిలయిన విద్యార్థులకు సాయంత్రం పూట ట్యుటోరియల్ క్లాసులను తీసుకునేవాళ్ళం. ఒక రోజు ఒక అమ్మాయి వచ్చి ఏడుపు గొంతుతో “సార్, నన్ను ఒకబ్బాయి రేగిస్తూ ఉన్నాడు. నా వెనుకే పడుతున్నాడు” అని చెప్పింది. “ఎవడమ్మా వాడు?” అన్నాను. “నాకు తెలియదు సార్, వాడు పిలుస్తున్నప్పుడు వెనుకకు తిరిగి చూడడానికి భయం వేస్తుంది” అన్నది. “ఏమమ్మా ఇంత పెద్దదానివయ్యావు. వాడివైపు చూడడానికి భయమౌతుందని అని చెబుతున్నావు. వాడేమీ నిన్ను తినేస్తాడా. ఎవరో కనిపెట్టి నాకు చెప్పు” అన్నాను. రెండు రోజుల తరువాత బయట నిలబడి ఉన్నాను. ఒక పిరియడ్ అయిన తర్వాత మరొక గదిలోనికి విద్యార్థులు వెళుతూ ఉన్నారు. ఆ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి “అదిగో చూడండి సార్. వాడే” అని ఆ వైపు వెళుతున్నవాడిని చూపించింది. పేరు తెలియదు. ఇంకొక విద్యార్థి ద్వారా అటు వెళుతున్న ఆ విద్యార్థిని పిలిపించాను. వాడు అతని స్నేహితునితో కలిసి వచ్చాడు. ఆ అమ్మాయి తన స్నేహితులందరూ నా ఆఫీసుకు వచ్చారు. “ఎవరమ్మా నిన్ను రేగించింది” అన్నాను. “వాడే సార్” అని చేయి చూపించింది. “నీవు కాలేజీకి ఎందుకు వచ్చేది? దీనికేనా?” అంటూ దండించడం మొదలుపెట్టాను. అతడు “వాట్ సిస్టర్” అంటూ అమ్మాయి వైపు చూస్తూ అడిగాడు. “సిస్టరూ లేదూ గిస్టరూ లేదు సార్. వీడే నేను కనిపించిన చోటల్లా రేగిస్తూ ఉన్నాడు” అంటూ భయంభయంగా చెప్పింది. నేను కోపంతో వాడిని తిడుతూ “నీ పేరేమి?” అన్నాను. “వివేకానంద” అన్నాడు. నేను నీరసించి పోయాను. “అయ్యో పాపీ, వివేకానంద అనే పేరు పెట్టుకుని ఇలాంటి పనా నీవు చేసేది? మీ తండ్రి పేరేమి?” అని అడిగాను. పేరు చెప్పాడు. అది విని ఆశ్చర్యమయ్యింది. అతని తండ్రి నా స్నేహితులు. వారి పేరు ఇక్కడ పేర్కొనడం వద్దు. ప్రఖ్యాతుడైన వాణిజ్యవేత్త. నేను కోపంతో వాడిని “మీ తండ్రి ఫోన్ నెంబరు ఇవ్వు” అన్నాను. అతడు ఇచ్చాడు. ఫోన్ చేశాను. అనుకోకుండా దొరికారు. వారి అబ్బాయి ప్రవర అంతా చెప్పాను. “ఆ అయోగ్యుడిని బాగా తిట్టండి. చదువుకో అని పంపిస్తే ఇదా వాడు చేసేది” అంటూ కోపగించుకున్నారు. ఆ సంభాషణ ముగిసిన తరువాత రెండవ వాటా తిట్టాను. అతడు పలకకుండా కూర్చొనివున్నాడు. ఆ తరువాత “సార్ మీ ఫోన్ వాడుకోవచ్చా” అని అడిగాడు. “ఉపయోగించుకో” అని ఫోన్ ఇచ్చాను. నేను పక్కనే నిలబడ్డాను. ఫోన్ చేసి “నాన్నా ఈ ప్రిన్సిపాల్ ఇంతవరకూ నా మీద చెప్పిన దూర్లన్నీ అబద్ధాలు నాన్నా” అంటూ చెప్పాడు. నేను అవాక్కయ్యాను. ‘ఎట్లా ఎట్లా నా ఫోన్ తీసుకుని నా పక్కనే నిలుచుని నేను చెప్పిందంతా అబద్ధం అని చెబుతున్నాడు కదా. వీడికి ఎంత ధైర్యం ఉండాలి’ అని నాలో నేనే అనుకున్నాను. తండ్రి అతడిని తిట్టేది వినిపిస్తూ వుంది. నేను అతడిలో మెచ్చిన గుణం ఏమంటే అతని శాంతస్వభావం. ఆ పది పన్నెండు నిమిషాల సమావేశంలో అతడు ప్రశాంతంగా ఉన్నాడు. అతని ముఖంలో కొంచెం కూడా మార్పు రాలేదు. ఒక్క కఠినమైన పదం ఉపయోగించలేదు. స్వామీ వివేకానంద నిత్యం ధ్యానం చేస్తూ తన మీద తనకి అదుపును సాధించడానికి ప్రయత్నించేవారు. అయితే ఈ వివేకానంద అవేమీ చేయకుండానే ఆ స్థితిని సాధించాడు!

పిక్కబలం తగ్గించిన ఘటన

మా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమానికి మహారాణి కాలేజీ ప్రిన్సిపాల్ గారైన ప్రొ. పార్వతమ్మ గారిని ఒక శుక్రవారం ఆహ్వానించాము. నిర్ణీత సమయానికన్నా చాలా ముందే వచ్చారు. మేము మాట్లాడుతున్నాము. మాటల మధ్యలో ఉన్నట్టుండి “వేరే కాలేజీలో పనిచేస్తున్న ఒక అధ్యాపకిని మీ కాలేజీలో ఈమధ్య నియమించుకున్నారు కదా?” అని అడిగారు. “ఔను” అన్నాను. “ఆవిడ ఏ కాలేజీలోనూ పని చేయడానికి పనికిరాదు. అలాంటిది మీ కాలేజీలో ఎలా తీసుకున్నారు? ఆమె విషయం మీకు తెలియక తీసుకున్నారు. తీసుకునే ముందు ఇలాంటి విషయాలలో కొంచెం ముందూవెనుకా తెలుసుకొంటే బాగుండేది.” అని చెబుతూ ఆమె కార్యకలాపాల గురించి ఒకటి రెండు ఉదాహరణలిచ్చారు. నాకైతే ఎక్కువగానే భయమయ్యింది. ఆ రోజు కార్యక్రమంలో అంతా అదే ఆలోచన. కార్యక్రమంలో ఏదో మాట్లాడాననిపించాను. మరుసటి రోజు శనివారం. మా ఆవరణలోనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు అప్పుడు ఉదయం తరగతులు. అప్పుడు కె.నంజుండశాస్త్రి గారు హెడ్ మాస్టర్. నేనున్న హాస్టల్ రూముకు వచ్చి “డాక్టర్ మీకు ముఖ్యమైన, సీరియస్ అయిన విషయం చెప్పాలని వచ్చాను. మీరు కొత్తగా చేర్చుకున్న అధ్యాపకి మా స్కూలుకు చెందిన ఒక ఉపాధ్యాయురాలి వద్దకు వచ్చి – మీరు నాతో రండి. ఒక ఐశ్వర్యవంతుడు ఉండే హోటల్‌కు తీసుకువెళతాను. మీకు చాలా డబ్బులు ఇస్తాడు అని చెప్పారట. ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చి నాకు చెప్పారు” అని శాస్త్రిగారు ఆతురతతో చెప్పారు. దీన్ని విని నాకు షాక్ కొట్టినట్లయింది. దిక్కుతోచలేదు. ముందురోజు సాయంత్రం ప్రొ. పార్వతమ్మగారు చెప్పింది మరుసటి రోజు ఉదయమే నిరూపితమయ్యింది. నాకు ఆందోళన పెరగసాగింది. మా కాలేజీలో వందలాదిమంది ఆడపిల్లలున్నారు. అధ్యాపకవర్గంలో మేడంలున్నారు. ఏమప్పా, ఈ సందిగ్ధ స్థితి నుండి ఎట్లా బయటపడేది అని తీవ్రంగా ఆలోచించాను. ఏ తాత్కాలిక నియామకాన్నైనా రద్దు చేయాలంటే ఒక నెల ముందు నోటీస్ ఇవ్వాలి లేదా ఒక నెల జీతం ఇవ్వాలి అనే నియమం ఉంది. దాన్ని జారీచేయాలంటే పాలకమండలి నిర్ణయం కావాలి. దానికోసం పాలకవర్గం మీటింగును నాలుగైదు రోజుల తరువాత మా కాలేజీ ఆఫీసులో జరపడానికి నిశ్చయించాము.

నేను నేషనల్ కాలేజీ హాస్టల్లోనే నివసిస్తున్నాను. మా ఆఫీసుకు నేనున్న రూముకూ ఒకటే గోడ అడ్డం. అవసరం ఉన్నప్పుడు సాయంత్రం, రాత్రి ఆఫీసుకు పోయి పనిచేసేవాడిని. ఆవిడ లోపలికి వచ్చింది. “ఏం సార్, నన్ను పనినుండి తీసివేయాలనే ఆలోచన చేస్తున్నారంట. ఎందుకు అలా చేస్తున్నారు సార్?” అని కొంచెం గడుసుగానే అడిగారు. “మిమ్మల్ని తాత్కాలికంగా నియమించాము. ఇప్పుడు అంత పని లేదని తెలిసింది. అదీకాక మీ పని పరీక్షలకు సంబంధించినది కాదు కాబట్టి ఆ ఉద్యోగాన్నే రద్దు చేయాలని ఆలోచిస్తున్నాము” అన్నాను. “ఏం సార్ నేను వచ్చి ఇంకా 10-15 రోజులు కాలేదు. అప్పుడే నన్ను తీసివేయాలనుకుంటున్నారు. నా గురించి మీకు ఎవరో ఏమో చెప్పివుండాలి. నా విషయం తెలుసుకోవాలంటే మీరు వీళ్ళను అడగండి, వాళ్ళను అడగండి” అంటూ ఇద్దరి పేర్లను కోపంగా చెప్పారు. ఆ పేర్లు వినగానే నా సంశయం రూఢి అయ్యింది. “లేదమ్మా, మీ విషయం నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. నిజంగానే మాకు ఈ పోస్టు ఇప్పుడు అవసరం లేదు” అన్నాను. “ఇదంతా నేను నమ్మను సార్. అలా ఏమైనా నన్ను పని నుండి తీసివేస్తే మీ పని ముగిసినట్లే. జాగ్రత్తగా ఉండండి” అని అరుస్తూ బెదిరించి వెళ్ళిపోయారు. ‘అయ్యో భగవంతుడా, మంచి కష్టం వచ్చింది కదప్ప’ అనుకున్నాను. అనుకోని సంఘటన జరిగినప్పుడు ‘భగవంతా’ అని అప్రయత్నం (unintentional)గా అనడం నా అలవాటు. ఇప్పుడూ అడపా దడపా ‘భగవంతుడి’ని గుర్తుచేసుకుంటాను. మరుసటి రోజు ఉదయమే ఒక నెల జీతమిచ్చి ఆమెను పనినుండి తీసివేయాలని నిర్ణయం అయ్యింది.

పాలకమండలి అధ్యక్షులు ఐ.ఎ.ఎస్. అధికారియైన శ్రీ సి. నరసింహమూర్తి గారు; ఇప్పుడు బెంగళూరు ఎన్.ఎం.కె.ఆర్.వి. కాలేజీ ప్రిన్సిపాల్ గారైన శ్రీమతి సి.ఎన్.మంగళ గారి తండ్రిగారు. రెండు రోజుల ముందు నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఆమె వచ్చి చేసిన అల్లరిని మీటింగులో చెప్పాను. “ఆమె ఏ సమయంలో వచ్చి అల్లరి చేశారు?” అని అధ్యక్షులు అడిగారు. “సాయంత్రం సుమారు 7.30 గంటలకు” అన్నాను. “ఆ సమయంలో మీరొక్కరే ఉన్నారా?” ఆన్నారు. “ఔను” అన్నాను. “మీరు అదృష్టవంతులు. వారు గట్టిగా అరుస్తూ అసభ్యంగా ప్రవర్తించి ఉంటే మీ గతి ఏమయ్యేది?” అన్నారు. నాకు మిన్ను విరిగి క్రిందపడినట్టు అయ్యింది. జంఘాబలమే ఉడిగిపోయింది. నేను దిగ్భ్రాంతి చెందాను. “మీకు ప్రపంచజ్ఞానం ఎక్కువ ఉన్నట్టు లేదు. ఆమె ఏమైనా అరిచివుంటే అపాయమే జరిగివుండేది. ప్రపంచంలో ఎలాంటి ఎలాంటివారో ఉంటారు. మీరు ఎంత నిర్దోషి అని చెప్పి సమర్థించుకున్నా మీరు చెప్పినదాన్ని నమ్మనివారూ ఉంటారు. ఇది చాలా సున్నితమైన విషయం. అదీ బ్రహ్మచారుల మీద ఇలాంటి ఆరోపణలను సులభంగా చేయవచ్చు. పెళ్ళైనవారు కుడా ఇలాంటి ఆరోపణలకు మినహాయింపు ఏమీ కాదు. మీలాంటి వారు ఇలాంటి ఆరోపణలకు ఎక్కువ దుర్బలులు సులభంగా ఆరోపణ చేయడానికి అవకాశం ఉంటుంది. బురదను విసురుతూ పోతే అది అంటుకోక పోయినా మరక మాత్రం అవుతుంది. (If you go on slinging mud it may not stick, but the stain will be there.) మీరేమీ అజాతశత్రువులు కారు. అనేక కారణాలతో మీ పరువు తీయవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు చెడ్డ పేరు రావచ్చు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఒక్కరే ఉండకండి” – ఈ విధంగా ఒక అన్న తమ్మునికి చెప్పిన రీతిలో నాకు బుద్ధి చెప్పారు. వారు చెప్పినదాన్ని చాలా గంభీరంగా విని “అదంతా సరేసార్. అయితే స్త్రీలు ఒక్కరే వచ్చి మాట్లాడేటప్పుడు నేను ఇంకొకరిని పిలవడానికి సాధ్యమే కాదు. అలాగే వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరిని ఎలా పిలవాలి? విద్యార్థినులు, మేడంలు, ఇతరులు నాతో మాట్లాడటానికి వస్తారు. నేరుగా సహజంగా మాట్లాడతారు. అప్పుడు నేను మరొకరిని ఎలా పిలవాలి? దీని మీద ఏమౌతుందో దాన్ని నేను అనుభవించాల్సి ఉంటుంది. మీరు నా శ్రేయోభిలాషులై నాకు ఇలాంటి విషయాలలో మార్గదర్శనం చేసినందుకు మీకు ధన్యవాదాలు” అన్నాను. శ్రీ నరసింహమూర్తి గారు దక్షులైన అధికారి. నాకు మాత్రమే కాదు వారిని సమీపంనుండి చూసిన వారికి ఎవరికైనా వారంటే ఎక్కువ గౌరవం కలుగుతుంది. “నేను చెప్పిన సాధ్యతను మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. రేపు ఆమెను పనినుండి తీసివేసే సమయంలో మీరు ఆఫీసులో ఉండకండి. మీ వద్దకు వచ్చి అసహ్యంగా ప్రవర్తించవచ్చు. ఒక నెల జీతం, ఇంకా ఆమెను పని నుండి రిలీవ్ చేసే కాగితాన్ని మీ ఆఫీసులోని అధికారులకిచ్చి మీరు ఈ ఆవరణ నుండి వెళ్ళిపోండి.” అని చెప్పారు. నేను అలాగే చేసి అఫీసులోని అధికారియైన శ్రీ ఎం.ఎస్.మాధవమూర్తి గారికి రిలీవ్ ఆర్డర్, ఒక నెల జీతం ఇచ్చి “సంతకం తీసుకోండి” అని చెప్పి “నేను మన సంస్థ కార్యదర్శియైన శ్రీ టి.ఎస్.రాఘవన్ గారి ఇంటికి వెళుతున్నాను. అవసరమైతే మీరు ఫోన్ చేయండి. నేనూ మీకు ఫోన్ చేస్తాను” అని చెప్పి కాలేజీనుండి సుమారు అర్ధకిలోమీటర్ దూరంలో ఉన్న రాఘవన్ గారి ఇంటికి పోయాను.

రాఘవన్, వారి తమ్ములు, వారి ఇంటిలోని వారంతా నాకు 1940 నుండి బాగా తెలుసు. (ఇప్పుడూ దానికన్నా ఎక్కువగానే తెలుసు.) ఒక విధంగా నన్ను వారి ఇంటిలోని మనిషిగానే వారంతా చూస్తారు. రాఘవన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయం సుమారు 11 గంటలయ్యింది. ఇంటిలో వారి భార్య ఉన్నారు. ఆ సమయంలో నేను వారి ఇంటికి వెళ్ళడం వారికి ఆశ్చర్యం కలిగించింది. రాఘవన్ గారు పేరు మోసిన ధారివాల్ ఉన్ని దుస్తుల పెద్ద వ్యాపారి. వారు షాపుకు వెళ్ళారు. వారు ఆ సమయంలో ఇంటిలో ఉండరని నాకు తెలుసు. “ఏమిటి ఈ సమయంలో వచ్చారు? భోజనం చేసుకుని వెళ్ళండి” అని వారి భార్య చెప్పారు. “నేను ఎందుకు వచ్చాను అనేది రాఘవన్ వచ్చాక చెబుతాను. తరువాత భోజనం చేద్దాము. రాఘవన్ ఎప్పుడు వస్తారు” అని అడిగాను. సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకు వస్తారు అని చెప్పారు. “నేను మీ ఇంటి నుండి ఫోన్ చేస్తున్నాను. త్వరగా 12 గంటలకన్నా ముందే ఇంటికి రండి. నరసింహమూర్తిగారు మీటింగులో చెప్పినట్లు ఆమెను రిలీవ్ చేసేసమయంలో కాలేజీ నుండి తప్పించుకుని వచ్చి మీ ఇంటిలో ఆశ్రయం తీసుకున్నాను” అని దుకాణంలో ఉన్న రాఘవన్ గారికి ఫోన్ చేశాను. “వీలైనంత త్వరగా వస్తాను” అని చెప్పి సుమారు 12 గంటలకు వచ్చారు. రాఘవన్ మా సంస్థ కార్యదర్శి అయినందువల్ల వారికి ఈ విషయమంతా తెలుసు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాం. అప్పుడు రాఘవన్ వారి భార్యకు ఈ కథంతా చెప్పారు. దానికి వారు నరసింహమూర్తి గారు చెప్పింది సరైనదే అని అలాంటి రెండు మూడు సంఘటనలను చెప్పారు. సంతోషంగా భోజనం చేయడానికి కుదరలేదు. ఈ మధ్యలో ‘ఆవిడ వచ్చారా?, రిలీవ్ అయ్యారా?’ అని పదినిమిషాల కొకసారి మాధవమూర్తిగారికి ఫోన్ చేస్తున్నాను. రాఘవన్ గారు షాపు నుండి వచ్చే సమయానికి రిలీవ్ అయిన విషయం తెలిసింది. నన్ను నోటికి వచ్చినట్లు తిట్టి జీతం తీసుకుని వెళ్ళారని మాధవమూర్తి చెప్పారు. నేను నా అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సుమారు ఒంటిగంట సమయానికి కాలేజీకి వచ్చాను. దాని తరువాత ఆవిడ నన్ను కలవడానికి రాలేదు. కొన్నిరోజులైతే ఆవిడదే నాకు సింహస్వప్నమయ్యింది..

ఆ అధ్యాయం ముగిసింది. అయితే శ్రీ నరసింహమూర్తిగారు నా మనసులో నాటిన భయం నుండి చాలా సంవత్సరాల వరకూ నాకు విముక్తి లభించలేదు. ఒకరే మేడం లేదా విద్యార్థిని నాతో మాట్లాడటానికి వచ్చినప్పుడంతా (ఇది చాలా సాధారణం) వారు చెప్పింది జ్ఞాపకం వచ్చేది. అయితే భయం వేసేది కాదు. వారంతా నాకు బాగా పరిచయస్థులు. మా ఆవరణలో ఉన్నవారికి కూడా అలాంటి అలోచన ఖచ్చితంగా లేదు. పరిచయస్థులను చాలా ఆత్మీయతతో మాట్లాడేవాడిని. ఆబాలవృద్ధులందరితోనూ చనువుగా మాట్లాడటమే నా స్వభావం. ఒక్కొక్కసారి బయటివారు అపోహపడే అంతటి చనువు. అయితే అపరిచితులైన స్త్రీలు ఒక్కరే వచ్చినప్పుడు కొంచెం భయమయ్యేది. నేను గిట్టనివారు కావాలని నన్ను ఇరికించే ఉద్దేశంతో పంపించారేమో అనేంతవరకూ నా ఆలోచనలు వెళ్ళేవి. నేను లాల్‌బాగ్‌కు ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలసమయానికి వాకింగ్‌కు వెళ్ళేవాణ్ణి. కొన్ని గజాల ముందు ఎవరైనా ఒంటరి స్త్రీ వెళుతూ చుట్టుపక్కల ఎవరూ లేకుంటే నా గుండెదడ పెరిగేది. ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచడానికి నేను నా వేగాన్ని తగ్గించుకునేవాణ్ణి లేదా వేరే దారిలో వెళ్ళేవాణ్ణి. బాబాలను, యోగులను ఒక్కణ్ణే నిర్భయంగా ఎదురుకున్నాను. కానీ కొన్ని విషయాలలో నేను చాలా పిరికివాణ్ణి. ఈ సంఘటనతో మొదలైన భయం చాలా సంవత్సరాలు నన్ను పీడించింది. వయసు పెరిగే కొద్దీ భయం తగ్గి ఇప్పుడు ఆ సమస్య లేదు. అయితే ఆ సంఘటనను మాత్రం మరిచిపోలేను.

నాటకాల కాలేజీ

మా కాలేజీ ఎప్పుడూ చదువుకు మాత్రమే ప్రోత్సాహాన్నిచ్చే సంకుచిత వైఖరి ఉన్న కాలేజీ కాదు. పాఠ్యేతర కార్యక్రమాలకు మేము వీలైనంత ప్రోత్సాహాన్ని ఇస్తూ వచ్చాము. వీటిలో మొదటినుండీ నాటకాలకు ఎక్కువ ప్రాముఖ్యత. నేను ప్రిన్సిపాల్ అయిన సంవత్సరం అంటే 1961 నుండి ఇంటర్ సెక్షన్ నాటక పోటీలు నిర్వహించాలని మా అధ్యాపకుల సభలో సూచించాను. నాటకాలకు ప్రోత్సాహమివ్వడంలో కానీ, నాటకాల పోటీలను నిర్వహించడంలో కానీ అధ్యాపకులకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ చాలామందికి ఒక సందేహముంది. ఎన్నో కాలేజీలలో ఏడాదికి ఒక నాటకం వేయడమే కష్టమైనప్పుడు ఇంటర్ సెక్షన్ నాటక పోటీలు నిర్వహించడం అసాధ్యం. అందు వల్ల సెక్షన్‌కు బదులు క్లాస్‌కు ఒక నాటకం ఆడించడానికి ప్రయత్నిద్దాం అని చాలమంది అభిప్రాయం. “విద్యార్థులలో తగినంత ప్రతిభ నిద్రాణమై ఉంటుంది. అది వెలుగులోకి రావాలంటే మనం వారికి అవకాశమివ్వాలి. అందువల్ల మనం నాటకం వేయడానికి ఒక్కొక్క సెక్షన్‌కూ అవకాశమిద్దాము. మన ప్రయత్నం సఫలం కాకపోతే వచ్చే ఏడు దానికి అనుగుణంగా మార్పులు చేద్దాం” అని వారిని ఒప్పించాను. అప్పుడు మా కాలేజీలో మొదటి ప్రియూనివర్సిటి క్లాసులో నాలుగు సెక్షన్లున్నాయి. రెండవ ప్రియూనివర్సిటిలో కూడా నాలుగు సెక్షన్లు అంటే ప్రియూనివర్సిటీ మొత్తం 8 సెక్షన్లు ఉన్నాయి. అలాగే బి.ఎస్.సి. విభాగంలో మొత్తం నాలుగు సెక్షన్లున్నాయి. ఈ ఇంటర్ సెక్షన్ పోటీలలో మొత్తం 12 సెక్షన్లు సంతోషంతో పాల్గొని మా ప్రయత్నం విజయవంతమయ్యింది. తరువాత సెక్షన్లు పెరిగాయి. దానితో పోటీలో పాల్గొనే సెక్షన్లూ పెరిగి ఇప్పుడు ఏడాదికి 18 నుండి 20 నాటకాలను విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకాలే కాకుండా కాలేజీలో జరిగే వివిధ కార్యక్రమాలలో, వార్షికోత్సవాలలో నాటక ప్రదర్శన తప్పనిసరి అయ్యింది. ఏడాదికి 20-25 నాటకాలను ప్రదర్శించేవారు. ఒకసారి ఒక విద్యార్థి దృష్టి నాటకాలపై ఎక్కువ పెట్టినందువల్ల వారి తండ్రి వచ్చి”ఏం సార్, మా అబ్బాయిని చదవమని మీ కాలేజీకి పంపిస్తే ఇది నేషనల్ కాలేజీ పోయి నాటకాల కాలేజీ అయ్యింది. మా పిల్లల చదువులు ఈ నాటకాల వల్ల తగ్గిపోతూ ఉంది” అని ఆక్షేపణ చేశారు. “నాటకాల వల్ల చదువుకు లోటు రాదు. అదీ ఒక కళ. అది కూడా ఒక రకంగా చదువే. నాటకం వంటి క్రియాత్మకమైన కార్యక్రమాలలో పాల్గొనడం ఆరోగ్యకరమైన లక్షణం. నాటకం లేకపోతే ఆ సమయాన్ని అనారోగ్యకరమైన కార్యక్రమాలలో వృథా చేయవచ్చు. మీ అబ్బాయి చదువులోనూ ఏమీ లోటు లేదు” అని సమాధానపరిచి పంపాను.

ఇంతకు ముందు కో-ఎడ్యుకేషన్ గురించి చర్చ జరిగినప్పుడు కో-ఎడ్యుకేషన్ వల్ల ఏయే ఇబ్బందులు కలగవచ్చనే వాదన నాకు సదా జ్ఞాపకం ఉంది. ఒక విధంగా నన్ను పీడిస్తూవుంది. దీని నేపథ్యంలో మా నాటక పోటీలలో విద్యార్థినీ విద్యార్థులు కలిసి పాల్గొనకూడదని నియమం పెట్టాము. అప్పుడు పెట్టిన నియమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఈ నియమాన్ని మార్చాలని ఒత్తిడి వస్తూవుంది.

31 సంవత్సరాల నుండి విజయవంతంగా నడుచుకుంటూ వచ్చిన ఈ నాటకాలు పాఠశాల, కాలేజీల నాటక రంగంలో ఒక రికార్డును సృష్టించింది. ఈ మా కాలేజీ నాటక క్షేత్రంలో తయారయిన నాని, సీతారాం, విష్ణువర్ధన్ (అసలు పేరు సంపత్‌కుమార్), సి.ఆర్.సింహ, శ్రీనాథ్, నాగాభరణ, ఎం.పి.వెంకటరావు, బి.ఆర్.జయరాం, జి.శ్రీనివాస్ ఇంకా చాలమంది మంచి కళాకారులున్నారు. వీరిలో అనేకులు సినిమా రంగంలో సుప్రసిద్ధులు.

ఇలాంటి ఇంటర్ సెక్షన్ నాటక పోటీలు నేషనల్ కాలేజీ జయనగర్‌లో, బసవనగుడి నేషనల్ హైస్కూలులో, బసవనగుడి నేషనల్ హైయ్యర్ ప్రైమరీ స్కూలులో కూడా ప్రతియేటా సంతృప్తికరంగా నడుస్తూవున్నాయి.

ఈ అంతర్వర్గీయ నాటక స్పర్థలతో పాటు అదే ఏడు అంతర్వర్గీయ సంగీత పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. అవికూడా ఆటంకం లేకుండా నడుస్తున్నాయి. ఇవికాక సాహిత్య, విజ్ఞాన, భాషా కార్యక్రమాలకు, పోటీలకు కాలేజీ ప్రోత్సాహం ఇస్తూనే ఉంది.

క్రీడలు

క్రీడలు ఒక రకంగా విద్య అనే నా భావన. క్రీడలు కొన్ని ముఖ్యమైన గుణాలను, మంచి వైఖరిని ప్రోత్సహిస్తాయి. నలుగురు తోటి ఆటగాళ్ళతో కలిసి ఆడే గుణం, సర్దుకుపోయే లక్షణం, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించగలిగే అలవాటు మొదలైనవి జీవితంలో అవసరమైన లక్షణాలు. చాలా క్రీడలలో మా కాలేజీ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేసింది. ముఖ్యంగా టెన్నిస్, క్రికెట్ క్రీడలలో మా కాలేజీ ముందుంది. విఖ్యాతిగాంచిన వారందరి పేర్లూ ఇక్కడా పేర్కొనడం సాధ్యం కాదు. అయితే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారులైన ఇ.ఎ.ఎస్.ప్రసన్న, బి.ఎస్.చంద్రశేఖర్‌లు మా కాలేజీ విద్యార్థులే.

మాజీ విద్యార్థి, భారతీయ టెస్ట్ క్రీడాకారుడు బి.ఎస్.చంద్రశేఖర్‌ను సత్కరిస్తున్న హెచ్.నరసింహయ్య

ఇప్పుడు వారి స్థాయికెదిగి అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న అనిల్ కుంబ్లె గారి తాత శ్రీ కె.నంజుండయ్య గారు నాకు నేషనల్ హైస్కూలులో ఉపాధ్యాయులుగా ఉన్నారు. అనిల్ కుంబ్లె తండ్రి శ్రీ కె.ఎన్. కృష్ణస్వామిగారికి నేను నేషనల్ కాలేజీలో అధ్యాపకునిగా ఉన్నాను.

జీవితమంతా సమస్యలే. ధైర్యం కోల్పోకుండా వాటితో పోరాడే విధానాన్ని క్రీడలు నేర్పిస్తాయి. క్రీడలు ఆడని వానికంటే ఒక క్రీడాకారుడు జీవితంలోని హెచ్చుతగ్గులను నిభాయించడంలో ఎక్కువ విజయవంతమయ్యే అవకాశం ఉంది.

శివరాత్రి సమ్మె

నాకు సెలవులు అంటే పడదు. అధ్యాపకులు, ప్రభుత్వోద్యోగులు సంవత్సరానికి ఇన్ని రోజులు క్యాజువల్ లీవు (Casual Leave) అని కొన్ని సెలవులను ఉపయోగించుకొనే సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే అనివార్యంగా ఆరోగ్యరీత్యా లేక ఇంకే పెద్ద కారణంవల్లనో అక్కడొకటి, ఇక్కడొకటి వదిలితే నా మొత్తం సర్వీసులో ఇలాంటి సెలవు దినాలను ఉపయోగించుకునేలేదు. ప్రభుత్వ సెలవు రోజులు, పండుగ రోజులు నేను ఆఫీసుకు పోయి పని చేసేవాడిని. ఇప్పుడూ పని చేస్తాను.

మన దేశంలో ప్రొద్దునలేస్తే ఆ పండుగ, ఈ పండుగ అని సెలవులిస్తారు. పైగా మంత్రులు మొదలైనవారు మరణిస్తే సెలవు ప్రకటిస్తారు. ఇలా మన దేశం సెలవులు ప్రకటించడంలో విశాలమైన, ఉదారమైన స్వభావాన్ని కలిగివుంది. గుడ్ ఫ్రైడేకు సెలవు. అమెరికాలో గుడ్ ఫ్రైడేకు సెలవు లేదు. అమెరికా అధ్యక్షుడు కెన్నెడి చనిపోయినప్పుడు సెలవు ప్రకటించలేదు. రష్యా దేశపు అధ్యక్షుడు మరణించినప్పుడు వారి పార్థివ శరీరాన్ని సమాధి చేసే గోతిలో దింపుతున్నప్పుడు దేశ ప్రజలందరూ ఒక నిముషం పాటు తమ తమ స్థానాలలోనే నిలుచుని మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పండుగలను ఆచరించేవాళ్ళు సెలవు తీసుకోనీ, ఐతే అన్ని పండుగలను సార్వజనిక సెలవు ప్రకటించాల్సిన అవసరం లేదు.

శివరాత్రి పబ్లిక్ హాలిడే. అయితే దానిని ఆచరించేది రాత్రి పూట. అదీకాక ఆ రోజు భక్ష్యభోజనాలు తినే రోజూ కాదు. న్యాయంగా ఆ రోజు ఉపవాసం చేయాలి. నేను తార్కికంగా ఆలోచించి ఆ రోజు కాలేజీకి సెలవును ప్రకటించలేదు. ఎవరి నుండి ఆక్షేపణ కానీ, ప్రతిఘటన కానీ శివరాత్రి ముందురోజు రాలేదు. అయితే నా వ్యవహారశైలిపై సమాజంలో అక్కడక్కడా వ్యతిరేకత మొదటి నుండీ ఉంది. మా కాలేజీకి చెందిన కొందరు అధ్యాపకులు దానికి మినహాయింపేమీ కాదు.

శివరాత్రి రోజు ఎప్పటిలాగే ఉదయం నేను ఆఫీసుకు వెళ్ళి పనిచేసుకుంటున్నాను. ఉదయం సుమారు 10.30 గంటలకు రసాయనశాస్త్ర విభాగాధిపతి ప్రొ. ఎస్. టి. సీతారామయ్యగారు ఫోన్ చేసి “హెచ్. ఎన్. త్వరగా ఇక్కడికి రండి” అని ఆందోళనతో పిలిచారు. ఏమి ఆపద వచ్చిందోనని వారి ఆఫీసుకు వెళ్ళాను. వారి టేబుల్‌పై ఆ డిపార్ట్‌మెంట్ అధ్యాపకులందరూ (శ్రీ సీతారామయ్యగారిని మినహాయించి) ఆ రోజు సెలవు చీటీలను పెట్టారు. వారి ఉద్దేశం అర్థమయ్యింది. దాని ప్రభావం ఆరోజు కాలేజీ నడిపేదానిపై ఎలా ఉండబోతుందనే ఆలోచన నాకు సహజంగానే వచ్చింది. వెంటనే నేను ఇతర విభాగాల అధిపతులను కలిసి, విషయం తెలిపి, ఆ ‘శివభక్త’ రసాయన శాస్త్రపు అధ్యాపకుల క్లాసులను దేనినీ వదలకుండా దయచేసి చూడండి అని మనవి చేసుకున్నాను. రసాయనశాస్త్రపు ప్రయోగ తరగతులను (Practical classes) నడపడానికి సహజంగా మిగిలిన అధ్యాపకులకు వీలు కాదు. అందువల్ల దానిని మాత్రం విధిలేక వదిలివేయవలసి వచ్చింది. రసాయనికశాస్త్ర అధ్యాపకుల సామూహిక సెలవుమీద విద్యార్థుల ప్రతిక్రియ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. వారి సామూహిక సెలవునుండి విద్యార్థులు ప్రేరణ పొంది క్లాసులకు గణనీయమైన సంఖ్యలో కాకపోయినా ఒక్కోతరగతికీ కొంతమందైనా పోకుండా, పోయేవారిని అడ్డగిస్తే ఆ రోజు కాలేజీ నడపడం సాధ్యమయ్యేది కాదు. హేతువో కాదో కానీ విద్యార్థులకు సెలవులంటే ఇష్టమే. ఈ ఆలోచనలు నన్ను పీడిస్తూ ఉంది. ఉదయం 10.40 నిమిషాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మామూలుగా ప్రార్థనకు వచ్చారు. ఐదు నిమిషాల తరువాత క్లాసులకు వెళ్ళారు. విద్యార్థులకు ఈ రసాయనశాస్త్ర అధ్యాపకుల సామూహిక సెలవు గురించి తెలిసింది. అయినా ఎవరూ గుంపుగుంపులుగా గుమిగూడి గుసగుసలాడటం నేను చూడలేదు. రసాయనశాస్త్రం క్లాసులను మిగిలిన అధ్యాపకులు పంచుకుని అన్ని తరగతులనూ నడిపారు. సాయంత్రం వరకూ ఒక క్లాసూ వదలలేదు. నాకైతే చాలా సంతోషం వేసింది. అలాంటి సందిగ్ధ స్థితిలో, ‘కష్టకాలం’లో అందుబాటులో ఉన్న అందరు అధ్యాపకులు, అందరు విద్యార్థులు నాకు సంపూర్ణంగా సహకరించారు. ఆ సహకారానికి నేను ఎంత కృతజ్ఞుడినైనా సరిపోదు. బహుశాః తామంతా సెలవు తీసుకుంటే విద్యార్థులు, మిగిలిన అధ్యాపకులూ తమకు పరోక్షంగా మద్దతునిచ్చి కాలేజీ పనిచేయకుండా చేస్తారని ఆ రసాయనికశాస్త్ర అధ్యాపకుల ఊహ అనుకుంటాను. అదంతా తలక్రిందలయింది. వారికి తీవ్రమైన నిరాశ కలిగింది. మరుసటిరోజు తరగతులు ఎప్పటిలాగే మొదలయ్యాయి. శ్రీ ఎస్.టి.సీతారామయ్యగారు ఆ ‘శివభక్త’ ఉపాధ్యాయులను కలిసి ఇలా సామూహికంగా సెలవు పెట్టింది సరియైనది కాదు అని తెలిపారట. అధ్యాపకులకూ దాని అవగాహన వచ్చింది. శ్రీ సీతారామయ్యగారు నాకు ఫోన్ చేసి “హెచ్.ఎన్., ఆ ఉపాధ్యాయులందరూ మీతో అలా చేయకుండా ఉండాల్సింది అని చెబుతారట. వారు మిమ్మల్ని ఎప్పుడు కలవాలి” అన్నారు. “వారందరూ సామూహికంగా నా ఆఫీసుకు వస్తే అనేకమంది విద్యార్థులకు ఈ విషయం తెలిసిపోయి ప్రిన్సిపాల్ వారిని దండించడానికి పిలిచారు అనో, లేదా ఇంకేదో అటువంటి కారణానికి ప్రిన్సిపాల్‌ను కలిసారనే అప్రియమైన భావన విద్యార్థులలో కలగవచ్చు. ఇది కాలేజీలో ఇప్పుడున్న అధ్యాపకుల మరియు విద్యార్థుల ఐక్యతకు, బాంధవ్యానికి నష్టం కలిగించవచ్చు. కాబట్టి వారు ఇక్కడికి రావద్దు. నేనే విరామ సమయంలో మీ ఆఫీసుకు వస్తాను. అక్కడే వారిని కలుస్తాను. ఇది సహజంగా ఉంటుంది. ఎవరికీ అనుమానం కలగదు” అన్నాను. “అలాగే కానీ” అన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. చాలామంది అధ్యాపకులు ఉల్లాసంగా లేరు. వారిలో ఒకరిద్దరు తాము అలా చేయకూడదు అని ధ్వనించే విధంగా మాట్లాడటం మొదలు పెట్టారు. వారి మాటలను కొనసాగించే అవకాశాన్ని ఇవ్వలేదు. “ఏమి సార్, మనమంతా ఇంత స్నేహితులం. కాలేజీ ప్రగతికోసం సదా మనమంతా కలిసి పనిచేస్తున్నాము. నేను ఈ శివరాత్రి రోజు సెలవు ఇవ్వడం లేదని అన్నప్పుడే వచ్చి చెప్పాల్సింది. నన్ను మీరు బాగా ఎరిగున్నారు. అందరితో చనువుగా ఉంటాను. నా అధికారాన్ని ఎప్పుడూ చలాయించలేదు. మీరు ఈ విషయాన్ని చెప్పకుండా సామూహికంగా సెలవు పెట్టడం నా మనసు నొప్పించింది. అయ్యిందేదో అయ్యింది. ఎప్పటిలాగే మనమందరమూ ఉందాము” అన్నాను. వారికంతా ఆశ్చర్యమయ్యింది. సామూహికంగా సెలవు పెట్టడం ఆక్షేపణీయం. అందువల్ల నేను కటువుగా మాట్లాడవచ్చు. తమ పరువు తీయవచ్చు అని సహజంగానే నిరీక్షించారు. ఆ మీటింగ్ సుమారు 10 నిమిషాలు జరిగి ఉండవచ్చు. మీటింగ్ అయిన క్షణం నుండే మా ఆత్మీయతకు స్వల్పకాలం పట్టిన ‘గ్రహణం’ విడిచింది. మేమంతా ముందులాగే స్నేహితులుగా, ఆత్మీయులుగా ఉన్నాము.

అసోసియేషన్ ఎన్నికలు

విజ్ఞాన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు కాలేజీలలో ప్రోత్సాహమివ్వడం అత్యంత అవసరమైన చర్య. ఇవి కూడా విద్యనే. వీటిని నిర్వహించడానికి ప్రతి కాలేజీలోను ఒక విద్యార్థి సంఘం ఉంటుంది. అయితే అనేక విద్యార్థి సంఘాలు రాజకీయ సంఘాలుగా పనిచేస్తున్నాయి. ఎన్నికలలో డబ్బు ఇంకా మిగిలిన చెడు విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. పోటీదారుని సామర్థ్యం అప్రధానం అయ్యే అవకాశాలున్నాయి. దీన్నంతా గమనించి విద్యార్థి ఎన్నికలలో ఎలాంటి కరపత్రాలు, పోస్టర్లు ముద్రించరాదని ఒక సూచనను విద్యార్థుల ముందు ఉంచి కరపత్రాలకు బదులు పోటీదారులు తమ తమ ఎన్నికల క్షేత్రాలైన తరగతులకు వెళ్ళి ప్రసంగాలు చేయవచ్చు. తమ వైఖరిని విద్యార్థుల ముందు పెట్టవచ్చు. ఆపై మేమే అన్ని విద్యార్థుల సభలో పోటీదారుల, వారి మద్దతుదారుల ప్రచార ప్రసంగాలను చేసే అవకాశం, సౌకర్యం కల్పిస్తామన్న భరోసా ఇచ్చాము. నేను తరగతి తరగతికీ వెళ్ళి విద్యార్థులకు ఇలాంటి ముఖ్యమైన ఎన్నికల సంస్కరణల ప్రాముఖ్యతను వివరించాను. విద్యార్థులు సంతోషంగా ఒప్పుకున్నారు.

1967వ సంవత్సరం జూలై నెలలో నడిచిన ఒక ఎన్నికల ప్రచారసభలో అజ్ఞాత ప్రేక్షకులైన శ్రీ ఎన్.ఎన్.రావు అనేవారు నాకు వ్రాసిన లేఖలోని కొన్ని వాక్యాలను ఇక్కడ ఉల్లేఖిస్తున్నాను.

“..you may be surprised to receive this letter, I am an employee with Sandal Wood Factory, Mysore. I had heard so much about your College and the reputation in the academic fields. Fortunately, I had the opportunity of visiting your College without any body’s notice on 26th of this month, i.e. yesterday. I was surprised at the typical democracy which was at work. I was offered a seat by some boy, whose gesture I appreciated. Sir, I was compelled to postpone my travel from 4.30 to 10.10 in the night. I could not leave the auditorium till the function came to an end..” చాలా సంవత్సరాలు ఈ పద్ధతి విజయవంతంగా నడిచింది.

సమ్మెలు

నేను విద్యార్థిగా ఉన్నప్పుడు సమ్మెలు అరుదైనవేమీ కావు. అవన్నీ స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించినవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఆ విద్యార్థుల సమ్మెల జాడ కనిపిస్తూ వచ్చింది. అయితే వీటి ఉద్దేశం వేరే. విద్యార్థులకు కావలసిన సౌకర్యాల కోసమో, పరీక్షలను వాయిదా వేయడానికో లేదా ఇంకే కారణాల వల్లనో సమ్మెలను నడిపే ప్రయత్నాలను విద్యార్థి నాయకులు చేసేవారు. అయితే మా కాలేజీలో ఇలాంటి సమ్మెలను నడపడానికి మా కాలేజీ విద్యార్థులు ముందుకు వచ్చేవారు కాదు. చాలామందికి చదువుపైనే ఎక్కువ దృష్టి. అందువల్ల ఎప్పుడూ సమ్మెలు కానీ, దానికి సంబంధించిన ఊరేగింపులు కానీ మా కాలేజీ నుండి మొదలయ్యేవి కావు. ఐతే వేరే కాలేజీ విద్యార్థులు మా కాలేజీకి వచ్చి ముట్టడి చేసినప్పుడు విధిలేక విద్యార్థులు తరగతుల నుండి బయటకువచ్చేవారు.

నేను అధ్యాపకునిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నాకు జ్ఞాపకమున్నంత వరకూ అది 1956వ సంవత్సరం. ఈజిప్టుకూ, ఇంగ్లాండ్ ఇంకా కొన్ని దేశాలకూ సూయజ్ ద్వారా నౌకా ప్రయాణం గురించి తీవ్రమైన భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. యుద్ధం జరిగే చిహ్నాలు కనిపించాయి. ఆ సందర్భంలో విద్యార్థుల సమ్మె బెంగళూరులో అక్కడక్కడ నడిచింది. సమ్మె విస్తృతమేమీ కాలేదు. మా కాలేజీ మామూలుగానే నడుస్తూ ఉంది. పక్కనున్న ఫోర్ట్ హైస్కూలు నుండి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మా కాలేజీకి వచ్చి తరగతులను వదిలేలా చేయడానికి ప్రయత్నించారు. ఆ అల్లరిలో మా క్లాసులను నడపడానికి వీలు కాలేదు. మా విద్యార్థులు క్లాసుల నుండి బయటకు వచ్చి ఊరికే నిలబడ్డారు. సమ్మెకు మా విద్యార్థులనుండి సహకారం లభించని కారణంగా ఆ విద్యార్థులలో కొందరు మావైపు రాళ్ళను విసరడం ప్రారంభించారు. నా నుదుటికి ఒక రాయి వచ్చి పడింది. రక్తం ధారాపాతంగా కారసాగింది. దీన్ని చూసి కోపగించుకున్న మా విద్యార్థులు వారిని తరుముకుంటూ వెళ్ళారు. అక్కడున్న పోలీసులు కార్యోన్ముఖులయ్యారు. అందరూ చెదిరిపోయారు. అంతలో మా విద్యార్థులు ఫోర్ట్ హైస్కూలుకు చెందిన ఒక విద్యార్థిని పట్టుకుని “వీడే మన మేష్టరుకు రాయి విసిరి గాయం చేసింది” అంటూ కంప్లయింట్ చేయసాగారు. అంతలో నన్ను పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. డాక్టరు ప్రథమ చికిత్స చేసి తలకు ఒక బ్యాండేజీ కట్టారు. మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ అన్నట్లు గాయానికన్నా బ్యాండేజీనే ఎత్తి కనిపించసాగింది.

పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి కంగారు పడ్డాడు. మరుసటి రోజు వచ్చి “నేను పేదవాణ్ణి సార్. మిమ్మల్ని రాయితో కొట్టింది నేను కాదు సార్. దయచేసి నన్ను కాపాడండి సార్” అంటూ కాళ్ళావేళ్ళా పడ్డాడు. “నీవేమీ ఆలోచించకుండా వెళ్ళప్పా. ఆ కేసు రానీ. నేను ఏమి చెబుతానో అక్కడ నీవు విను” అని సమాధానపరిచాను. ఒకటి రెండు నెలల తరువాత న్యాయాధికారి ముందుకు కేస్ వచ్చింది. విద్యార్థి భయకంపితుడై నిలబడ్డాడు. పోలీసులు ఆ రోజు నడిచిన సమ్మె వివరాలను వారి వకీలు ద్వారా న్యాయాధీశుని ముందు పెట్టారు. న్యాయాధీశులు నన్ను ప్రశ్నలు అడిగి జవాబులు పొందారు. అన్నిటికన్నా ముఖ్యమైనది చివరి ప్రశ్న. “ఈ పిల్లవాడేనా మిమ్మల్ని రాయితో కొట్టింది” అన్నారు. “నాకు తెలియదు” అని చెప్పాను. వెంటనే కేసు డిస్మిస్ చేశారు. ఆ పిల్లవాడికి సంతోషమయ్యింది. తాము కేసులో ఓడినందుకు పోలీస్ ఇన్‌స్పెక్టర్ గుర్రుగా నావైపు చూశారు. పిల్లవాడు, అతని తల్లిదండ్రులు నన్ను హృదయపూర్వకంగా నమస్కరించారు.

ఆ విద్యార్థే నన్ను నిజంగా రాయితో కొట్టినా నేను కోర్టులో అతడికి వ్యతిరేకంగా చెప్పేవాడిని కాదు. నేనూ విద్యార్థిగా ఉన్నప్పుడు సమ్మెలలో పాల్గొన్నాను. అయితే ఎప్పుడూ రాళ్ళు విసరలేదు. అవాచ్యమైన పదాలను ఉపయోగించలేదు. ఒక్కొక్క విద్యార్థి స్వభావం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఆరోజు విద్యార్థుల ఆక్రోశంలో మానసికంగా నేనూ పాలుపంచుకున్నాను. కోర్టులో నేను చెప్పింది కొందరు సహోద్యోగులకు, విద్యార్థులకు నిరాశ కలిగించింది. తమాషాగా వారితో “అయ్యో వదిలేయండప్పా. ఆ విద్యార్థికి లేదా ఏ విద్యార్థికైనా ఎందుకు ఇబ్బంది కలిగించాలి. ఎవరో ఒక పిల్లవాడు రాయి విసిరాడు. దానికి అడ్డంగా నా నుదురు వచ్చింది. అతనిదేమి తప్పు?” అన్నాను. అందరూ నవ్వారు.

ఇంకొక సమ్మె

సమ్మె ముందస్తు సూచన అంతగా లేదు. నేను మేడపై ఒక రూములో పాఠం చెబుతున్నాను. బయట ఏం జరుగుతుందనే జాడ కూడా అక్కడ తెలియదు. ఉన్నట్టుండి నలుగురైదుగురు విద్యార్థులు వచ్చి వాకిలి తీసారు. క్లాస్ జరుగుతుండడం చూసి “ఏయ్, ఇక్కడ క్లాస్ జరుగుతోంది రండి రండి” అని అరిచారు. కొంతమంది విద్యార్థులు గుమిగూడారు. క్లాసులోనికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేను “కొంచెం ఆగండప్పా. మీరంతా విద్యార్థులా?” అని అడిగాను. “ఔను సార్” అన్నారు. “ నేను మేష్టారినప్పా. పాఠం చెబుతున్నాను. పాఠం జరిగేటప్పుడు ఎవరైనా తరగతిలో ప్రవేశించాలంటే అధ్యాపకుల అనుమతి తీసుకోవాలా లేదా” అన్నాను. పాపం ఆ విద్యార్థులు “తీసుకోవాలి సార్” అన్నారు. అయితే అడగండి అన్నాను. “May we get in Sir (లోపలికి రావచ్చా సార్)” అన్నారు. “No (వద్దు)” అన్నాను. వారు లోపలికి ప్రవేశించలేదు. బయటినుండే మా విద్యార్థులను సమ్మెకు మద్దతు కోరుతున్నారు. అన్ని అడ్డంకులనూ, నియమాలనూ ఉల్లంఘించడమే సాధారణంగా సమ్మెలలో ఒకభాగం. అలాంటిది ఆ విద్యార్థులు నా మాటకు విలువనివ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది నా గొప్పతనాన్ని సూచించడంలేదు. వారి సభ్యతను సూచిస్తుంది.

సమ్మె ప్రారంభమయ్యే విషయం వార్తాపత్రికలలో ముందుగానే ప్రకటితమౌతుంది. మా కాలేజీ విద్యార్థులు సాధారణంగా అర్థం పర్థం లేని, చిల్లరమల్లర సమ్మెలలో పాల్గొనరు. అందువల్ల చుట్టుపక్కలున్న కాలేజీ విద్యార్థులకు మా కాలేజీపైనే కన్ను. సమ్మెరోజు అశోకుడు బౌద్ధ భిక్షువులను నలుదిక్కులా పంపినట్లు నేను మా నౌకర్లను వేరే వేరే దిక్కులకు సమ్మె పరిస్థితిని తెలుసుకోవడానికి పంపేవాణ్ణి. ఒక దిక్కులో విజయా కాలేజీ ఉంది. ఇంకొక దిక్కులో వి.వి.పురం కాలేజ్ ఉంది. వేరొక దిక్కులో ఆచార్య పాఠశాల, కాలేజీలు ఉన్నాయి. మా నౌకర్లు వెళ్ళివచ్చి నాకు సమాచారం ఇచ్చేవారు. “ఒక కాలేజీ నుండి ఊరేగింపు మన కాలేజీ వైపు బయలుదేరింది. ఇంకొక కాలేజీ సిద్ధం చేసుకుంటోంది” ఇలా వారు వచ్చి చెప్పేవారు. ఒకసారి ఒక కాలేజీ విద్యార్థుల దండు సుమారు ఉదయం 9 గంటలకు వచ్చింది. గేట్ దగ్గరికి వెళ్ళి వారిని స్వాగతించాను. “ఈ రోజు స్ట్రయిక్ సార్. మీ విద్యార్థులు దానిలో పాల్గొనాలి” అన్నారు. “అయ్యో ఏమప్పా తొమ్మిది గంటలకు వచ్చారు. మా కాలేజీ మొదలయ్యేది 10.30 గంటలకు. అప్పుడు రండి” అన్నాను. అలాగే కానీ సార్ అని వెళ్ళిపోయారు. ఇంకోసారి సమ్మె చేస్తున్న విద్యార్థులకూ, నాకూ గేటుముందర వాగ్వాదం నడుస్తూవుంది. అప్పుడు ఒకడు “ఏయ్, నరసింహయ్య గారితో చర్చ చేయవద్దురా. వారు మంచిమాటలతో మనల్ని ఒప్పిస్తారు” అని తన సహవిద్యార్థిని హెచ్చరించాడు.

మరోసారి సుమారు 2000కన్నా ఎక్కువ మంది ఉన్నంతలో క్రమశిక్షణతో ఊరేగింపుగా మా కాలేజీ ముందుకు వచ్చారు. మా కాలేజీ పూర్వ విద్యార్థి శ్రీ జి.కె.జయరాం, మా కాలేజీ అభిమానియైన మరో విద్యార్థి శ్రీ ఎం.జి.నరసింహమూర్తి ఆ సమ్మెకు నాయకత్వం వహించారు. వారిద్దరినీ ఆహ్వానించాను. వారిద్దరూ నాకు బాగా తెలుసు. సమ్మె విషయంపై చర్చిస్తున్నాము. రెండు, మూడు వ్యాన్ల నిండా పోలీసులు వచ్చారు. పోలీస్ కమీషనర్ శ్రీ చాండిగారే స్వయంగా పోలీసులకు నాయకత్వం వహించారు. మా చర్చ కొనసాగే కొద్దీ ఆలస్యానికి విద్యార్థులలో అసహనం తాలూకు స్పష్టమైన సంకేతాలు కానవచ్చాయి. ఆ విద్యార్థులు ఓరిమిని కోల్పోయే స్థితికి వచ్చారు. “పరిస్థితి పట్టుతప్పేలా ఉంది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. పరిస్థితి చేతులు దాటితే ఎక్కువ ప్రమాదం కావచ్చు. అందువల్ల క్లాసులను వదిలివేయడం మంచిది అని నేను సూచిస్తున్నాను” అని పోలీస్ కమీషనర్ శ్రీ చాండిగారు అన్నారు. వారు చెప్పిన తరువాత వారి మాటలను ఉల్లంఘించే ప్రశ్నే లేదు. శాంతిభద్రతల నిర్వహణ వారి చేతుల్లో ఉంది. పైగా నాకూ పరిస్థితి చేతులు దాటిపోయే చిహ్నాలు కనిపించాయి; తరగతులను విడిచిపెట్టాము. అంతకు కొన్ని క్షణాలముందు నన్ను గుఱ్ఱుగా చూస్తున్న విద్యార్థులు “హెచ్.ఎన్. కీ జై” అని జయధ్వానాలతో ముందుకుసాగారు.

ఇంకోసారి ఫీజు పెంచడాన్ని ప్రతిఘటిస్తూ సుమారు 25 రోజులు సమ్మె జరిగింది. అప్పుడు విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ ఎం.కె.దత్తరాజ్ వచ్చి, “సార్, మీరు తప్పుగా అనుకోకండి. మేమూ సమ్మెలో పాల్గొంటాము. మన కాలేజీకీ, సమ్మెకూ సంబంధం లేదు. అయితే ప్రతిరోజూ సామూహిక ప్రార్థనలో పాల్గొని తరగతులను బహిష్కరిస్తాము” అని అడిగారు. “అలాగే కానివ్వండి” అన్నాను. ఇలా నాకూ విద్యార్థులకూ ఎప్పుడూ ఆత్మీయానుబంధం ఉంది.

బెంగళూరు సైన్స్ ఫోరం

ప్రతి కాలేజీలోను సాధారణంగా కన్నడ సంఘం, ఇంగ్లీష్ సంఘం, సైన్స్ సంఘం మొదలైన సంఘాలు ఉంటాయి. విద్యార్థులకు ఆయా విషయాలలో ఎక్కువ సమాచారం, విజ్ఞానం అందించడమే ఇలాంటి సంఘాల ఉద్దేశం. ఇదొక ముఖ్యమైన పాఠ్యేతర కార్యక్రమం(Extracurricular activity), చదువులో ఒక భాగం కూడా. ఈ సంఘాలు కాలేజీ విద్యార్థి సంఘానికి అనుబంధ శాఖలు. కాలేజీ విద్యార్థి సంఘం వార్షిక ఎన్నికల ద్వారా ఆగష్టు నెలలోనో, సెప్టెంబరు నెలలోనే అస్తిత్వానికి వచ్చి సుమారు ఫిబ్రవరి నెలలో ఆ సంవత్సరం కార్యక్రమాల ముగింపు సమావేశం జరుగుతుంది. అంటే ఇలాంటి సంఘాల వయసు ఏడాదికి సుమారు 5-6 నెలలు మాత్రమే. ఈ ఐదారు నెలల్లో ఐదారు కార్యక్రమాలు చేస్తే ఎక్కువ. అందువల్ల ఈ సంఘాలు క్రియాశీలంగా పనిచేయడానికి అవకాశం లేదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇది విజ్ఞాన యుగం. తాంత్రిక యుగం. సైన్సు జెట్ స్పీడుతో దూసుకువెళుతోంది. విజ్ఞాన రంగంలో సంవత్సరం పొడువునా ఏ ఆటంకం లేకుండా పనిచేసే ఒక విజ్ఞాన సంఘాన్ని స్థాపించాలని అమెరికాలో ఉన్నప్పుడే ఆలోచించేవాడిని. ఇలాంటి విజ్ఞాన సంఘం సహజంగానే కాలేజీలో ఒక భాగం అవడానికి కుదరదు. అందువల్ల సార్వజనిక విజ్ఞాన సంఘన్ని 1962 నవంబర్ నెలలో స్థాపించాము. దీనికి బెంగళూరు సైన్స్ ఫోరం అని నామకరణం చేశాము. దీనికీ నేషనల్ కాలేజీకి నేరుగా సంబంధం లేకపోయినా ఈ సంఘం కార్యాలయం నేషనల్ కాలేజీ ఆవరణలోనే పెట్టుకోవడానికి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ పాలకవర్గం అధికారికంగా అనుమతిని ఇచ్చింది. అందువల్ల ఈ విజ్ఞాన సంఘం కార్యక్రమాలన్నీ కాలేజీ ఆవరణలోనే నడుస్తున్నాయి. దీని పాలకవర్గంలో కాలేజీకి చెందిన కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఇద్దరు ముగ్గురు మాత్రం బయటివారు ఉన్నారు. విజ్ఞానాన్ని జనబాహుళ్యంలోనికి తీసుకురావడం, ప్రజలలో వైజ్ఞానిక మనోభావాన్ని పెంచడం ఈ వేదిక ముఖ్యోద్దేశాలు.

ఫోరం సంకేతం (Emblem) ప్రశ్నార్థక చిహ్నం

వైజ్ఞానిక మనోభావానికి మూలభూతమైన లక్షణం ప్రశ్నించడం. ప్రశ్నించకుండా ఉంటే ముందుకు వెళ్ళలేము. అది నిలిచివున్న నీటిమడుగులాంటిది. ప్రశ్నించడం ప్రవహించే నదిలాంటిది. ధర్మానికీ, విజ్ఞానానికీ ఇదే ముఖ్యమైన వ్యత్యాసం. ధర్మం సాధారణంగా నమ్మకానికి ప్రాధాన్యతనిస్తుంది. విజ్ఞానానికి ప్రశ్న వేయడమే దాని ఆయువు. దీనిని సమర్థించడానికి ఒక ఉదాహరణనిస్తాను. ప్రపంచ ప్రఖ్యాత న్యూటన్ ఒకరోజు ఒక తోటలో యాపిల్ చెట్టు క్రింద పడుకున్నాడు. అతని తలపై ఒక యాపిల్ పడింది. అతడు అలాగే ఆలోచించడం మొదలు పెట్టాడు. యాపిల్ క్రిందకు ఎందుకు పడింది? పైకి ఎందుకు పోలేదు? అడ్డదిడ్డంగా ఎందుకు చలించలేదు? – ఇలా గాఢంగా ఆలోచించిన తరువాత భూమి ఆకర్షణవల్ల యాపిల్ క్రిందకు పడిందని నిర్ధారణకు వచ్చాడు. ఈ తర్కాన్ని పొడిగించిన తరువాత అతడు గురుత్వాకర్షణ అనే నియమాన్ని (Law of Gravitation) కనిపెట్టాడు. ఈ అత్యంత ముఖ్యమైన నియమం విస్తారంగా పెరుగుతున్న అంతరిక్షశాస్త్రానికి బలమైన పునాది అయ్యింది. ఈ సంఘటనకు ముందూ యాపిల్ క్రిందకే పడేది. చేతినుండి జారిన రాయి కూడా క్రిందకే పడేది. అంతవరకూ రోజూ జరిగే ఈ ఘటనలను ఎవరూ ప్రశ్నించలేదు. ఇదంతా సహజమే అని ఊరికే ఒప్పుకునేవారు. అందుకే అది సహజంగానే మిగిలిపోయింది. ప్రశ్నించినప్పుడు దాని గర్భంలో దాగున్న ఒక ముఖ్య నియమం వెలుగు చూసింది.

నేను మొదటి నుండీ ప్రశ్నించే వైఖరికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవాణ్ణి. ఈ పద్ధతి నేను మిడిల్ స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలయ్యింది. ప్రశ్నార్థక చిహ్నం వైజ్ఞానిక మనోభావానికి ప్రతీక. ఈ చిహ్నం నాకు అత్యంత ప్రియమైన, అర్థవంతమైన చిహ్నం. ఈ చిహ్నం మహత్యాన్ని శాసనమండలిలో నేను సభ్యుడినైనప్పుడు ప్రతిపాదించాను. ఈ మహత్యమైన చిహ్నాన్ని దాని సామర్థ్యం తెలిసి నేను ఆఫీసులో కూర్చునే చోటు వెనకాల గోడపై ఎరుపు రంగులో పెద్దగా వ్రాయించాను. ఇదే నా మనోదృక్పథానికి మార్గసూచి. ఆ చిహ్నాన్ని గమనించినవారు సహజంగానే దాని అర్థాన్ని అడుగుతారు. “దేనినీ ప్రశ్నించకుండా నమ్మకండి అనేదే దాని సరళమైన అర్థం” అని చెబుతాను. ఎలాంటి లోకాతీత వ్యక్తులే చెప్పినా, దైవాంశసంభూతులే చెప్పినా, మహాత్ములే చెప్పినా, విశ్వవిఖ్యాత శాస్త్రజ్ఞులే చెప్పినా, సుప్రసిద్ధ విద్వాంసులు చెప్పినా, మొత్తం మీద ఎవరు చెప్పినా సరే వారు చెప్పిన దానిని యాంత్రికంగా ఎవరూ ఒప్పుకోరాదు. ఇదే పద్ధతిని అత్యంత ముఖ్యంగా అన్ని ధార్మిక గ్రంథాలకూ అన్వయించాలి. ఆ గ్రంథాలు ఎంత పురాతనమైనవైనా కానీ, దానిలో ఉన్నవి పురాణపురుషుల లేదా దేవదూతల వాక్కులైనా కానీ వాటిని అన్నింటినీ ప్రశ్నించడమనే గీటురాయిపై గీచి సత్యాన్ని తెలుసుకోవాలి.

చాలా సంవత్సరాల నుండి నేను వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్న ఈ ప్రశ్నార్థక చిహ్నాన్ని బెంగళూరు సైన్స్ ఫోరంకు అధికారిక చిహ్నంగా కొన్ని సంవత్సరాల క్రితం అనువర్తించుకున్నాము. ఈ సంకేతానికి సరిపోయే ఒక దీక్షావాక్యం (Motto) ‘తద్విద్ధి పరిప్రశ్నేన’ అనే భగవద్గీతలోని ఒక శ్లోకం లోని మాకు పనికివచ్చే వాక్యాన్ని స్వీకరించాము. దేన్నయినా ప్రశ్నించకుండా అంగీకరించరాదు అనే భావార్థంలో ఆ వాక్యాన్ని మేము ఉపయోగిస్తున్నాము.

ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయాన్ని అందరి దృష్టికి తీసుకునిరావాలని అనుకుంటున్నాను. మన భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక విధులు అనే ఒక చిన్న అధ్యాయం ఉంది. ఆ పది కర్తవ్యాలలో ఒకటైన “It shall be the duty of every citizen of India to develop the scientific temper, humanism, and the spirit of inquiry and reform” – అంటే శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. అందువల్ల వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచుకోవడం మన రాజ్యాంగపు ఒక భాగం అయ్యింది. అది ఎవరి ఇష్టాయిష్టాలపై ఆచరించేది కాదు.

సైన్స్ ఫోరం కార్యకలాపాలు

ప్రతి బుధవారం పాపులర్ సైన్స్ గురించి ఒక ఉపన్యాసం ఉంటుంది. ఈ ఉపన్యాసాలలో తాంత్రిక జ్ఞానం, వైద్యం, మానసిక విజ్ఞానం మొదలైన విషయాలూ ఉన్నాయి. నెలలో ఒక బుధవారం విజ్ఞాన చలనచిత్రం ప్రదర్శిస్తారు; వేసవి సెలవులలో విజ్ఞాన విషయాలపై ఒక నెల శిబిరాలు, అక్టోబర్, నవంబర్ నెలలలో విద్యార్థులకు విజ్ఞాన విషయాలపై వక్తృత్వపోటీలు ఏర్పాటు చేస్తారు. ఈ విద్యార్థుల వేసవి శిబిరాలలో ప్రతి ఏటా 200 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు పాల్గొంటూవుంటారు. వీటితో పాటు సైన్స్ ఫోరం 17 సంవత్సరాలకు పూర్వం ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతియేటా జూలై నెల అన్ని రోజులూ విజ్ఞాన విషయాలపై ప్రసంగాలు; ప్రతి ఆదివారం సైన్స్ చలనచిత్రాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇలాంటి అపురూపమైన కార్యక్రమానికి నాకు స్ఫూర్తిని ఇచ్చింది మా కాలేజీ సమీపంలోనే చాలా సంవత్సరాలుగా ఒక నెలరోజులపాటు జరిగే సంగీతోత్సవాలు. ఇలాంటి ఒక సంగీతోత్సవం ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తే, ఒక నెలరోజుల విజ్ఞానోత్సవాలు ఎందుకు సంతోషం కలిగించకూడదు అని ఒకరోజు ఆలోచించాను. విజ్ఞానం సంగీతమంత జనప్రియం కాకపోవచ్చు. అయితే ఇలాంటి విద్యావంతులున్న ప్రదేశంలో కొంతమందికైనా ఆసక్తి కలగవచ్చను అనే ఆశాభావంతో ఈ ఒక నెల విజ్ఞానోత్సవాన్ని మొదలుపెట్టాము. గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తూవుందని తెలియజేయడానికి నాకెంతో సంతోషంగా ఉంది.

బెంగళూరు సైన్స్ ఫోరం ఇక్కడి విజ్ఞాన విద్యారంగాలలో తలలో నాలుక అయ్యింది. ప్రసిద్ధ, సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, వైద్యులు, ప్రొఫెసర్లు అందరూ ఇక్కడ ప్రసంగించారు. ఈ 33 సంవత్సరాలలో 1340కన్నా ఎక్కువ ప్రసంగాలను ఏర్పాటు చేసి ఒక రికార్డును సృష్టించాము. వీటితోపాటు 430 కన్నా ఎక్కువ విజ్ఞాన చలనచిత్ర ప్రదర్శనలు. ఈ 1340 ప్రసంగాలలో అక్కడొకటి, ఇక్కడొకటి వదిలివేస్తే మిగిలిన స్వాగతోపన్యాసాలు అన్నీ నావే. ఇది ఒక రికార్డు. మొత్తంమీద 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన సైన్స్ ఫోరం యొక్క విజయవంతమైన కార్యక్రమాలు మాకంతా సంతృప్తిని కలిగించింది. బెంగళూరు సైన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడినై ఇంకా కొనసాగుతూ ఉన్నాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here