‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -24

2
12

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

నేషనల్ కాలేజీ విద్యార్థి నిలయం

దీని గురించి అక్కడక్కడా వెనుక వ్రాశాను. హైస్కూలు విద్యార్థి దశ నుండి అంటే 1935 నుండి ఏదో ఒక హాస్టల్లోనే నివసించాను. నేషనల్ కాలేజీ హాస్టల్లోనే విద్యార్థిగా, వార్డెన్‌గా, అధ్యక్షుడిగా ఇప్పుడు కేవలం నిలయపు సహవాసి (Inmate)గా మొత్తం 50 సంవత్సరాల నుండి నివసిస్తున్నాను. దానిని కట్టడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. హాస్టల్ కథ చాలా పెద్దది. ఇక్కడ అదంతా వ్రాయడానికి సాధ్యమూ కాదు, అవసరమూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హాస్టల్‌ను నడపడం చాలా కష్టం. హాస్టల్ కష్టాలు లెక్కలేనన్ని. నిశ్చింతగా ఉండడానికి సాధ్యమే కాదు. ప్రతి నిత్యమూ ఒకటి కాకపోతే మరొక సమస్య నన్ను వేధిస్తూనే ఉంది. హాస్టల్ గురించి వివరంగా వ్రాస్తే అది ఒక చిన్న గ్రంథమే అవుతుంది. విద్యార్థుల సమస్య, వంటవారి సమస్య, నీటి సమస్య, వెలుతురు సమస్య – ఒకటా? రెండా? ఒక్క ఇంటిని నడపడమే కష్టం. అలాంటిది వేరే వేరే ఇళ్ళనుండి వేరే వేరే ప్రవృత్తులు, అలవాట్ల నుండి వచ్చిన విద్యార్థులను ఒకే కప్పు క్రింద కూర్చోబెట్టడం చాలా కష్టం. పైగా ప్రతి సంవత్సరము కొత్త కొత్త విద్యార్థులు వస్తూ ఉంటారు. ముందు విద్యార్థులే వీలైనన్ని పనులు చేసేవారు. అంగడి నుండి సామాన్లను కొనడం, తీసుకురావడం, కూరగాయలను ముక్కలుగా కోయడం, భోజనం వడ్డించడం మొదలైన పనులన్నీ విద్యార్థులే చేసేవారు. ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. ఏమైనా నాకు జవాబుదారీ తప్పలేదు. మనశ్శాంతి పూర్తిగా లభించడం సాధ్యమా?

నేషనల్ హైయర్ ప్రైమరీ స్కూల్

ఈ స్కూలు గురించి ఇంతకుముందే ప్రస్తావించాను. బసవనగుడి నేషనల్ హైస్కూలు 1917లో ప్రారంభించబడింది. దానికి అదనంగా 1934లో అదే పాఠశాల ఆవరణలో ఒక హైయర్ ప్రైమరీ స్కూలును సంస్థ ప్రారంభించింది. అది కన్నడ మీడియం స్కూలు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అంటే 61 సంవత్సరాలుగా కన్నడ మాధ్యమపు పాఠశాలగానే నడుపుకుంటూ వస్తున్నాము. 1934వ సంవత్సరం వరకూ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు కన్నడ మాధ్యమంలో నడిచేవే. అయితే 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ జాడ్యం మొదలయ్యింది. బెంగళూరులో ఐతే ఇంగ్లీష్ మీడియంపై విపరీతమైన వ్యామోహం. కొన్ని కాలనీలలో దాదాపు అన్ని పాఠశాలలు ఇంగ్లీషు మీడియంలోనివే. అలాంటి కాలనీలలో బసవనగుడి ఒకటి. ఈ కాలనీలో కన్నడ మీడియం స్కూలును విజయవంతంగా నడపడమూ ఒకటే లండన్‌లో కన్నడ మీడియం స్కూలును నడపడమూ ఒకటే. ఇక్కడ నడపడం అంత కష్టం. అయితే మా సంస్థ విద్యాసూత్రాల ప్రకారం కన్నడ మాధ్యమ పాఠశాలగానే నడుపుంటూ వస్తున్నాము. ఒక రకంగా ఇదొక సాహసం.

శిశువిహార్ నుండి 7వ తరగతి వరకు మొత్తం చదువుతున్న విద్యార్థుల సంఖ్య 850.

ఈ పాఠశాలలో విజ్ఞాన ప్రయోగశాల ఉంది. విద్యార్థులే ప్రయోగాలు చేయవచ్చు. కంప్యూటర్ సౌకర్యము ఉంది. మంచి పుస్తక భండారము ఉంది. విశాలమైన ఆటస్థలం, ఈదులాడే సౌకర్యము ఉంది. పేద విద్యార్థులకు ఉచిత యూనిఫాం, పుస్తకాలు మరియు మధ్యాహ్న ఉపాహార వ్యవస్థ ఉంది. అంతే కాకుండా ఎన్నో విద్యా సాంస్కృతిక కార్యక్రమాలను నడుపుతూ ఉంది. అంతర్ పాఠశాల వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, అంతర్వగీయ నాటక పోటీలు, దేశభక్తి గీతాల పోటీ, గీతాపఠనం, గణేశోత్సవం, గీతాజయంతి, కృష్ణజయంతులను ప్రతి సంవత్సరమూ పాఠశాల నడుపుతుంది. ఈ పాఠశాల మాకు గర్వ కారణం. ఇది రాష్ట్రంలోని అత్యుత్తమ పాఠశాలలలో ఒకటి.

2. నా దుస్తుల గోల

సూమారు 65 సంవత్సరాల నుండి నా దుస్తులు షర్టు, దట్టిపంచ మరియు గాంధీటోపి. తెల్లని ఖద్దరు దుస్తులు. అన్నీ శుభ్రమైనవే. విద్యార్థిగా, అధ్యాపకునిగా, ప్రాధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడూ ఇవే దుస్తులు. ఉపకులపతి అయ్యాక కుడా నా వేషాన్ని మార్చుకోమని సలహాలు వచ్చాయి. వాటిని నేను పట్టించుకోలేదు.

ఈ వేషం వల్ల అధ్యాపకుడిగా ఉన్నప్పుడు అధ్యాపకుడు అని గానీ, ప్రిన్సిపాల్ అయినప్పుడు ప్రిన్సిపాల్ అని గానీ చాలామంది గుర్తించేవారు కాదు. ఉపకులపతి అయినప్పుడూ అదే గతి. ప్రిన్సిపాల్ ఎవరు అని నన్నే చాలామంది అడిగేవారు. అందువల్ల నాకూ ఇబ్బంది కలిగేది. ముందే చెప్పినట్లు వారికీ ఇబ్బంది కలిగేది. ఒకసారి ఒకరు నరసింహయ్యగారిని కలవాలి అని నన్నే అడిగారు. అప్పుడు మావద్ద నలుగురు నరసింహయ్యలు ఉన్నారు. అటెండర్ నరసింహయ్య, వాచ్‌మాన్ నరసింహయ్య, ప్రిన్సిపాల్ నరసింహయ్య మరియు పాలక మండలి అధ్యక్షులైన ఎం.నరసింహయ్య. వీరిలో మీకు ఏ నరసింహయ్యను కావాలి అని అడిగాను. ప్రిన్సిపాల్ నరసింహయ్యగారు అన్నారు. నేనే అని సంకోచంతో చెప్పాను. అప్పుడు అతని ముఖం చూడాలి!

ఎన్నికల సమయం. నా మామూలు వాహనమైన ఆటోరిక్షాలో వెళుతున్నాను. ఆటోను నడిపేవాడు “ఈసారి మీ పార్టీకి ఛాన్స్ ఎట్లావుంది సార్” అడిగాడు. “ఏదప్పా నా పార్టీ” అన్నాను. “మీ డ్రెస్ చూస్తే తెలియదా సార్?” అన్నాడు. “లేదప్పా, నేను కాంగ్రెస్ వాడిని కాను. ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాను. నేను ఒక మేష్టారును” అని చెప్పాను.

ఒకసారి మైసూరులో బి.ఎస్.సి. డిగ్రీ పరీక్షల మూల్యాంకనం నడుస్తున్న రూములోనికి ఆ ద్వారపాలకుడు నన్ను వదలనే లేదు. నన్ను ఏ రాజకీయ రౌడీ అని అనుకున్నాడు. నేను నా గురించి సమాచారం ఇచ్చాక, ఇంకొకరి సహాయంతో నా ప్రవేశానికి అనుమతి దొరికింది.

నేను ప్రిన్సిపాల్ అయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రులైన శ్రీ ఎన్.నిజలింగప్పగార్ని మా విద్యార్థి సంఘం ప్రారంభసభకు ఆహ్వానించడానికి విధానసౌధకు వెళ్ళాను. నాతో పాటు సంఘం ఉపాధ్యక్షులైన శ్రీ ఎం.కె.దత్తరాజ్ కూడా వచ్చారు. “వీరు మా నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు” అని నన్ను పరిచయం చేశారు. వారు అనుమానంతో నావైపు ఆపాదమస్తకం చూసి “కూర్చోండి” అన్నారు. మా ప్రార్థనను వారు మన్నించారు. కాలేజీకి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టి “నేను మీ ప్రిన్సిపాల్ గారిని మొట్టమొదటిసారి చూశాను. వారిని చూసినప్పుడు వారు ప్రిన్సిపాల్ అని తెలియలేదు. వారిని చాలాసార్లు ఫెయిల్ అయిన ఒక విద్యార్థి అని అనుకున్నాను. కాలేజీ సంఘాల నాయకులు సాధారణంగా అలాంటివారే” అని చెప్పి నవ్వారు. విద్యార్థులూ ఆ నవ్వులో వెనుకబడలేదు.

ఇలాంటిదే మరొకటి. మేము ప్రతి సంవత్సరం ఒక సమాజసేవా శిబిరాన్ని వేసవి సెలవులలో నడిపేవాళ్ళం. వాటి వ్యవధి ఒక నెల. బెంగళూరు సమీపంలో సుమారు 20 కి.మీ. దూరంలో మాగడి రహదారిలో ఉన్న బాపా గ్రామంలో మేము నడుపుతున్న శిబిరం ముగింపు సభకు అప్పటి ముఖ్యమంత్రి గారైన శ్రీ వీరేంద్ర పాటిల్‌ను కలిసి ఆహ్వానించాను. అదే మొదటిసారి మా యిద్దరి కలయిక. వస్తామని ఒప్పుకున్నారు. వారు మాట్లాడటం ప్రారంభించి “మీ ప్రిన్సిపాల్ గారిని మొదటిసారి కలిశాను. వారి దుస్తులను చూసి నాకు మొదట అనిపించింది వీరు ఎవరో గ్రామపంచాయితీ సభ్యులు” అని సభికులతో అన్నారు. ఇలాంటి అభిప్రాయాలు నాకేమీ కొత్తకాదు. నన్ను గ్రామపంచాయితీ సభ్యుడు అని శ్రీ వీరేంద్ర పాటిల్ గారు చెప్పారు కదా అన్నదే నాకు అసంతృప్తి!

సుమారు 45 సంవత్సారల క్రితం నేను అధ్యాపకుడిని మరియు హాస్టల్ వార్డన్ అయినప్పుడు హాస్టల్లో చేరడానికి ఒక విద్యార్థి వచ్చి నన్ను చూసి “ఏమండీ ఇక్కడ వార్డన్ ఎక్కడున్నారు” అని అడిగాడు. “నీవు ఎవరు, వార్డన్ ఎందుకు కావాలి” అని అడిగాను. “మీకు అదంతా ఎందుకండీ. నేను ఎవరైతే మీకెందుకు. వారెక్కడున్నారో చెప్పండి” అన్నాడు. “వారు ఎక్కడికో పోయినారు. సుమారు అర్ధగంటలోపల వస్తారు. వారిని ఆ రూములో కలుసుకోవచ్చు” అని చెప్పి వెళ్ళిపోయాను. సుమారు అర్ధగంట తరువాత నా రూముకు వెళ్ళాను. అదే పిల్లవాడు ఎలకలా మెల్లగా నా రూముకు వచ్చి “క్షమించండి సార్, తెలియలేదు. ఎవరో పనిచేసేవాడు కావచ్చు అని అనుకున్నాను. నేను ఇదే మొదటిసారి ఇక్కడికి వచ్చింది. మీరు నాకు చెప్పి వెళ్ళిన తరువాత దీన్నంతా దూరం నుండి చూస్తున్న పిల్లవాడు నన్ను కలిసి మీరే వార్డన్ అని చెప్పారు. అప్పుడు నాకు చాలా భయమయ్యింది. దయచేసి నాకు సీటు ఇవ్వండి” అని బ్రతిమిలాడుకున్నాడు. “అయ్యో ఏమీ ఫరవాలేదు వదిలేయప్పా. నాకు ఇలా అయ్యింది ఇదేమీ మొదటిసారి కాదు. చాలామంది నన్ను కాలేజీ గుమాస్తా అని కూడా అనుకుంటారు” అని సమాధానం చెప్పి సీటు ఇచ్చాను.

అమెరికాకు ఒకసారి విద్యాభ్యాసానికి మరొకసారి ప్రొఫెసర్‌గా వెళ్ళాను. అక్కడ కూడా ఖాదీయే. అక్కడ నా నివాసం ఉన్న అమెరికన్ ఇంటిలో వంట సౌకర్యం ఉన్న గది. దానిని బాడుగకు తీసుకునే ముందు నేను ఇంటిలో ఉన్నప్పుడు భారతీయ దుస్తులు ధరించడానికి అనుమతిని తీసుకున్నాను. నేను తరగతికి వెళ్ళేటప్పుడు ప్యాంటు, షర్టు, బూట్స్, చలికాలంలో వీటితో పాటు క్లోజ్ కాలర్ కోటు. అయితే ఇంటికి వచ్చిన తక్షణం ఆ బంధాలను వదిలివేసి హాయిగా పంచ, షర్టు వేసుకునే వాడిని. అంచులు లేని దట్టి పంచను ధరించడం సుమారు మూడు నెలలపాటు జాగ్రత్తగా చూసి, భారతీయులంతా బెడ్‌షీటును దుస్తులలో భాగంగా ఉపయోగిస్తారా అని ఆ ఇంటి యజమాని అడిగారు. ఇంకొక సారి నేషనల్ హైస్కూలులో నా సహపాఠి అయిన శ్రీ కె.ఎస్.అనంతరాం ఇండియానుండి నేనున్న కొలబస్ నగరానికి వచ్చినప్పుడు నన్ను చూడటానికి నా గదికి వచ్చారు. నన్ను చూసిన వెంటనే “ఏయ్ నరసింహా, నీవు ఇక్కడా నేషనల్ కాలేజీ పి.బి.హెచ్.(పూర్ బాయ్స్ హోమ్)లో ఉన్నట్లే ఉన్నావు” అని ఆశ్చర్యంగా అడిగారు.

నేను ప్రయోగశాలలో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు మా ప్రొఫెసర్ నా ముదురు షర్టును పట్టుకుని “ఇది ఏ రకం బట్ట” అని అడిగారు. అక్కడి లేదా ఏ మిల్లు బట్టకూ దానికీ తేడా ఎత్తి కనిపిస్తున్నది. అందుకే వారు కుతూహలంతో ఆ ప్రశ్నను అడిగారు. “ఇది చేతులతో దారం వడికి చేతితో నేసిన బట్ట” అన్నారు. దానికి వారు “అయితే మీరు అమెరికన్ దుస్తులు ఉపయోగించరా?” అని అడిగారు. గాంధీజీ యొక్క ఖద్దరు మరియు గృహపరిశ్రమల సిద్ధాంతాన్ని స్థూలంగా వివరించడానికి ప్రయత్నించాను. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెంది ధనిక దేశమైన అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌కు ఈ గాంధీ సిద్ధాంతం తలకెక్కలేదు. వారికి మొదటి నుండీ నా మీద ఒక రకమైన అనుమానం. నా దుస్తులు, అభ్యాసాలు, ఆహారం మొదలైనవి ఇతర భారతీయ విద్యార్థుల జీవన విధానానికి భిన్నంగా ఉండేది. నాకు ఒక అమెరికన్ స్నేహితుడూ లేరు. అంతా దూరం నుండి హలో అంటే హలో లేదా వారి భాషలో హాయ్ హాయ్; ఇలా అయ్యి మిగిలిన భారతీయ విద్యార్థులకు, నాకు తేడా ఎత్తి కనిపించేది. పైగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అప్పుడు మన ప్రధానమంత్రి. వారికి ప్రజాస్వామ్యంపై, విదేశాంగ తటస్థ నీతిపై నమ్మకం ఎక్కువ. సామ్రాజ్యవాద దేశాలను చూస్తే వారికి అంతే కోపం. అదే సమయంలో మన దేశపు రక్షణామంత్రి శ్రీ వి.కె.కృష్ణమేనన్ గారికీ అమెరికా మరియు మిగిలిన సంపన్న దేశాలను చూస్తే ద్వేషం. అలాగే అమెరికన్లకు కృష్ణమేనన్ అంటే సరిపోదు. అతడిని కమ్యూనిస్ట్ అని కూడా పిలిచేవారు. ఈ గందరగోళంలో నా వంటి జాతీయ మనోభావాలు కలిగిన వారంతా అమెరికాకు మిత్రులు కాదనే అభిప్రాయం వారికి ఉండేది.

నా గాంధీ టోపీకి సంబంధించి మరొక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. సుమారు 35-40 సంవత్సరాల క్రితం నేను నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా ఉన్నప్పుడు విద్యార్థులు, ఉపధ్యాయులు దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళి తిరువనంతపురంలో ఒక రోజు ఉన్నాము. అక్కడి ప్రసిద్ధ పద్మనాభస్వామి దేవస్థానం చూడటానికి మేమంతా వెళ్ళాము. దేవస్థానం నియమాల ప్రకారం పంచ కట్టుకుని, షర్టు బనీను తీసివేసి ఒక టవల్‌ను భుజం మీద వేసుకుని బయలుదేరాము. నేను మాత్రం వీటితో పాటుగా నా గాంధీటోపీని పెట్టుకున్నాను. “సార్, మీరు గాంధీ టోపీని పెట్టుకుని వస్తే దేవస్థానంలోనికి మిమ్మల్ని వదలరు. టోపీ తీసివేయండి సార్” అని నా విద్యార్థులు అన్నారు. “నా గాంధీ టోపీని దేవస్థానంలోనికి వదలరు అంటే అర్థం ఏమిటి. మన దేశాన్నే గాంధీ టోపీ పాలిస్తోంది (అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని). నేను టోపీ పెట్టుకునే వస్తాను” అని చెప్పాను. “రండి రండి దేవస్థానం దగ్గరికి పోయాక మీ గాంధీ టోపీకి ఏమౌతుందో తెలుస్తుంది” అని హాస్యంతో కూడిన సవాల్‌ను విసిరారు. మేమంతా దేవస్థానం చేరుకున్నాము. నేను ద్వారం దగ్గరికి చేరిన వెంటనే అక్కడి ద్వారపాలకుడు “ఇదేమన్నా గాంధీ మైదానంలో మీటింగా? గాంధీ టోపీ తీసివేయండి” అని మలయాళ భాషలో చెప్పాడు. ఇది విన్న మా విద్యార్థులకు ఖుషే ఖుషీ. “మీకు అలాగే కావాలి. మా మాటలు మీరు వినలేదు” అని మెల్లగా మందలించారు. నా అహం కొంచెం దెబ్బతిన్నా దానిని కృతకమైన నవ్వుతో కప్పివేసి నా టోపీని ఆ ద్వారపాలకునికి ఇచ్చి వాపసు వచ్చేటప్పుడు అతని నుండి తీసుకుని వచ్చాను.

ఇంతకు ముందు వ్యాయామ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా గాంధీటోపీ వేసుకుని రావాల్సి ఉండేది. లేకపోతే వారికి అటెండెన్స్ లేదు. నాదగ్గర సుమారు 7-8 గాంధీ టోపీలు ఉండేవి. నా టోపీలు చాలాసార్లు విద్యార్థులకు హాజరును ఇప్పించింది. అంతే కాకుండా కొన్ని నాటకాలలో వేదికపైన కూడా కనిపించాయి. ఇప్పుడూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది.

నేను వేసుకునే దుస్తులు ఏ రాజకీయ పక్షానికి సంకేతం కాదు. ఇది జాతీయతకు సంకేతం. పూర్వం ఖాదీ, అంత కంటే ఎక్కువగా గాంధీ టోపీకి ఎక్కువ విలువ ఉండేది. ఈ టోపీ పెట్టుకున్నవారు చేయరాని పనులు చేయడం మూలాన దాని విలువను పాడుచేశారు. ఇప్పుడు గాంధీ టోపీని పెట్టుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పాత మైసూరులో అయితే గాంధీ టోపీ పెట్టుకునేవారు అపురూపం.

3. పిల్లలు – నేను

అందరితోనూ కలిసిపోయి మాట్లాడటమే నా స్వభావం. ఇది మొదటి నుండి వచ్చిన అభ్యాసం. నేను అంతర్ముఖుడిని కాను. కొంచెం పరిచయమైనా నేనే పలకరించేవాడిని. కొన్నిసారు విసుగు కలిగేటట్లు (నాకు కాదు వారికి) మాట్లాడతాను. చాలా చనువుగా ఉంటాను. విద్యార్థులతో, చిన్నవాళ్ళతో మాట్లాడటం మొదటి నుండీ నాకు ఇష్టం. మా ఆవరణలో కాలేజీ, హైస్కూలు, హైయర్ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. అంటే 5-6 సంవత్సరాల పిల్లలను మొదలుకొని 20-22 సంవత్సరాల యువకులను ఈ ఆవరణలో చూడవచ్చు. నాకు ఉన్నత ప్రాథమిక పాఠశాల పిల్లలు మరియు హైస్కూలు విద్యార్థులు చాలా సమీపం.

ప్రాథమిక పాఠశాల వైపు అదీ విరామ సమయంలో వెళితే పిల్లలు నన్ను చుట్టుముట్టుతారు. వారి నమస్కారాలు, షేక్‌హ్యాండ్ల సాగరంలో మునిగిపోతాను. వారి నుండి విడిపించుకుని రావడం ప్రయాసతో కూడిన పని. ఒక్కొక్కరికీ నమస్కారం బాబూ, నమస్కారమప్పా, నమస్కారమమ్మా అని చెప్పాలి. ఇలాంటి ఒక సందర్భంలో వెనుక ఉన్న ఒక పిల్లవాడు నా షర్టును గుంజి, నా దృష్టిని ఆకర్షించి “నమస్కారం సార్” అని గడుసుగా చెప్పాడు. అతనివైపు నేను ధ్యాస పెట్టలేదని అతనికి కోపం. “నమస్కారం బాబూ, నమస్కారం బాబూ. అయ్యో నీవు నా వెనుక ఉన్నావు. అందువల్ల చూడలేకపోయాను” అని సమాధాన పరిచాను.

నేను ఎప్పటిలా నా ఆఫీసులో కూర్చుని పని చేసుకుంటున్నాను. నా ఆఫీసులో అన్ని వేళలా అందరికీ ఉచిత ప్రవేశం. రెండు తలుపులూ తీసే ఉంటాయి. వాకిలి దగ్గర కాపలా జవాను ఉండడు.

ఒక రోజు ఒక ప్రాథమిక పాఠశాల పిల్లవాడు నా ఆఫీసు గుమ్మం దగ్గర నిలబడి “ఈ రూములో దాక్కోవచ్చా సార్” అన్నాడు. “ఎందుకప్పా దాక్కొంటావు” అడిగాను. ‘గుల్టోరియా (దాగుడుమూతలు)’ ఆడుతున్నాము అన్నాడు. సరే దాపెట్టుకో అన్నాను. లోపలికి వచ్చాడు. అంతా ఓపెన్‌గా ఉంది. ఆఫీసుకు ఆనుకుని విశ్రాంతి గదికానీ, డైనింగ్ హాలుకానీ, శౌచాలయం కానీ లేవు. అందువల్ల ఆ పిల్లవాడు “మీ కుర్చీ వెనుక దాక్కోవచ్చా సార్” అన్నాడు. సరే అన్నాను. ఆ విద్యార్థి నా కుర్చీ క్రింద కూర్చున్నాడు. నేను నా పని చేసుకుంటూ ఉన్నాను. ఒకటి రెండు నిమిషాల తరువాత ఇంకొక కుర్రాడు వచ్చి గుమ్మం ముందు నిలుచున్నాడు. “ఏం కావాలప్పా” అన్నాను. “మేము గుల్టోరియా ఆడుతూ ఉన్నాము. ఒక పిల్లవాడు ఈ వైపు వచ్చి ఇక్కడ ఎక్కడో దాక్కొన్నాడు” అని నాకు వినిపించేలా స్వగతంగా అనుకున్నాడు. “కావలసి ఉంటే చూసుకోప్పా” అన్నాను. నా రూములో ఎవరూ అతనికి కనిపించలేదు. అతని దృష్టి నా కుర్చీ వెనుకకు పోలేదు. “ఇక్కడ లేడు. ఇంకెక్కడికో పాయాడు” అని గొణుగుకుంటూ తన వెదుకులాటను కొనసాగించాడు. అతను వెళ్ళిపోయాక దాక్కొని ఉన్న పిల్లవాడు విజయం సాధించిన సంతోషంతో వెళ్ళి పోయాడు.

ఉదయం నా ఆఫీసు తలుపులు తీసిన తరువాత నేను అదే ఆవరణలో ఉంటే ఆ తలుపులు తీసే ఉంటాయి. ఒక రోజు నేను బయటకు వెళ్ళి వచ్చి నా కుర్చీ మీద కూర్చున్నాను. ఎప్పటిలాగే కాలు కొంచెం ముందుకు చాపినప్పుడు మెత్తగా ఉండే వస్తువు తాకింది. చూస్తే ఒక పిల్లవాడు నా కుర్చీ ముందున్న మేజాబల్ల క్రింద దాక్కొని ఉన్నాడు. “ఏమప్పా ఇది..?” అని మాట్లాతుండగానే ఆ పిల్లవాడు “సార్ మాట్లాడకండి, మాట్లాడకండి, మేము ఆటాడుకుంటున్నాము” అని గుసగుసగా చెప్పాడు. సరే అని ఊరికే అయ్యాను. అంతలోనే నా మరొక స్నేహితుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకటి రెండు నిమిషాల తర్వాత బయటకు వచ్చిన ఆ పిల్లవాణ్ణి చూసి నా స్నేహితునికి ఆశ్చర్యం వేసింది. వాడు ఆట ఆడుకోవడానికి దాచిపెట్టుకుని ఉన్నాడని అర్థమయ్యింది. “ఏయ్ బాబూ, వీరు ఎవరో తెలుసా?” అని నావైపు చేయిచూపి అడిగారు. ‘తెలుసు హెచ్.ఎన్. ప్రెసిడెంట్’ అని లోకాభిరామంగా చెబుతూ అతని మాటలను ఎక్కువ పట్టించుకోకుండా తనను ఎవరూ కనిపెట్టలేదని సంతోషంతో గది నుండి బయటకు వెళ్ళాడు. ఇక్కడ జరిగే బాల లీలలను నా స్నేహితునికి చెప్పినప్పుడు వారికి పరమాశ్చర్యం వేసింది.

నేను కాలేజీ ప్రిన్సిపాల్ అయినప్పుడు, 25-30 సంవత్సరాల క్రితం ఒక శనివారం ఉదయం మా కాలేజీ ఆవరణలో నడుస్తూ ఉన్నాను. ప్రైమరీ మరియు హైస్కూలుకు ఉదయం పూట తరగతులు. ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ కె.నంజుండ శాస్త్రిగారు కనిపించారు. “నాకు మీ పాఠశాల పిల్లలకు క్లాస్ తీసుకోవాలని ఆశ కలుగుతోంది, ఇస్తారా” అన్నాను. “అయ్యో, తప్పకుండా తీసుకోండి, రండి సార్” అని పిలుచుకుని పోయి ఒక క్లాస్ చూపించారు. నేను కాలేజీ ప్రిన్సిపాల్, చాలా పెద్ద మనిషిని. వీరంతా పిల్లకాయలు అని మనసులో అనుకుని నా కాలర్, టోపీలను సరిచేసుకుని క్లాసు లోనికి వెళ్ళాను. పిల్లలు తలోదిక్కుకు తిరిగి కూర్చున్నారు. చేష్టలు, గలాటా చాలినంత ఉంది. ఏ పిల్లవాడూ నావైపు చూడనే లేదు. నేను అనాథనయ్యాను. నా పరువు పోయింది. అల్లరి చేయకండి, అల్లరి చేయకండి, సైలెన్స్, సైలెన్స్ అని గట్టిగా చాలా సార్లు అరచిన తరువాత పరిస్థితి కొంత అదుపులోనికి వచ్చింది. వారినందరినీ నావైపు చూసేలా చేయడానికి 8-10 నిమిషాలు పట్టింది. చాలా ప్రయాస అయ్యింది. కానీ అది తాత్కాలికం. మళ్ళీ వాళ్ళ లోకంలో వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళకు ఏమి చెప్పానో, ఏ కథ చెప్పానో నేను ఇప్పుడు మరచిపోయాను. తరగతిలో ఆ అల్లకల్లోలమైన వాతావరణాన్ని చూచి నేను ఏమి చెప్పదలచుకున్నానో అది మరిచిపోయి ఉన్నా ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఏదో మాట్లాడాను. నేను మాట్లాడింది ఆ పిల్లలకు చేరలేదు. ఒక్కొక్క నిముషం గడవడమే కష్టమయ్యింది. ప్రతి ఐదు నిముషాలకు గడియారం చూసుకుంటున్నాను. పిరియడ్ ముగిసిపోతే చాలప్పా అని వేచివున్నాను. మధ్యలో తరగతి నుండి బయటకు వస్తే పిల్లలకు దాసోహమని ఓటమిని ఒప్పుకున్నట్టు అవుతుందని నా ‘అహం’ నన్ను హెచ్చరిస్తూ ఉంది. ఈ ప్రిన్సిపాల్ ఒక ప్రాథమిక తరగతిని నిభాయించలేక పోయాడనే కూత ఆ ఆవరణలో ప్రతిధ్వనిస్తూ చాలాకాలం నన్ను పీడుస్తుంది అని ఎలాగైనా గంట కొట్టే వరకూ తరగతిలోనే కాలం గడపాలని మొండిగా నిశ్చయించాను. చివరకు గంట కొట్టారు. నా సంతోషానికి అవధులు లేవు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళి అక్కడి నుండి విడుదల అయినప్పుడూ ఇంత సంతోషం కలగలేదు. బతికాన్రా బాబూ అనుకుంటూ బయటకు వురికి “శాస్త్రి గారూ నా జన్మలో ఇంకొకసారి నేను ఇలాంటి తప్పును చేయను. చాలప్పా మీ పిల్లల తరగతి “ అని నమస్కారం చేసి వచ్చాను.

సుమారు 25 సంవత్సరాల క్రితం మా కాలేజీలోనే చదివి ఇప్పుడు ప్రతిభా బాలమందిరం అనే పాఠశాలను నడుపుతున్న శ్రీమతి ఉమా నవరత్న గారు 7-8 సంవత్సరాల క్రితం వచ్చి “మీరు మా స్కూలు పిల్లలకు ఏమైనా చెప్పండి సార్” అన్నారు. “అయ్యో పోమ్మా, నాకు చేత కానే కాదు. చాలా ఏళ్ళ క్రింద ఒక పిల్లల తరగతి వెళ్ళిన చేదు అనుభవం ఇంకా మనసులో పచ్చిగానే ఉంది. ఆ పిల్లలను కంట్రోల్ చేయడం సాధ్యమే కాదు” అన్నాను. “లేదు సార్. మా పిల్లలు 5,6,7వ తరగతి పిల్లలు. అందరినీ ఒకే చోట చేరుస్తాము. మేమంతా అక్కడే ఉంటాము. మీకు తమాషాగా మాట్లాడే అలవాటు ఉంది. ఖచ్చితంగా రండి” అని బలవంతం చేశారు. ఒప్పుకుని వెళ్ళాను. సభాంగణంలో పిల్లలు. చుట్టూ మేడమ్‌లు. ఏ దిక్కుకు పిల్లలు చూచినా ‘మిస్’లు దండించే దృష్టితో చూస్తున్నారు. పిల్లలకు ఇలాంటి స్థితిలో అల్లరి చేసే శక్తి గానీ, ధైర్యం గానీ లేదు. దానితో నాకు ధైర్యం వచ్చింది. నా మాటలు ఎక్కువభాగం ప్రశ్నోత్తరాలకు కేటాయింపబడి ఉంటుంది. మంచి అభ్యాసాలను చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. పెద్దవారయ్యాక నేర్చుకోవడం కష్టం అని చెబుతూ దీనికి సంబంధించి కన్నడలో ఒక సామెత ఉంది. మీకు తెలుసా పిల్లలూ అని అడిగాను. 7-8 మంది పిల్లలు “మొక్కై వంగనిది మానై వంగునా” అని ఒకే గొంతుతో చెప్పారు. నాకు చాలా సంతోషం అయ్యింది. అక్కడికి నిలపకుండా “మీరంతా ఏమప్పా” అన్నాను. “మొక్కలు సార్” అని సామూహికంగా అన్నారు. “నేను” అన్నాను. “మాను సార్”. అక్కడున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పడీ పడీ నవ్వారు. పిల్లలు ఎవరికీ బెదరరు. నిర్భయంగా మాట్లాడుతారు.

సుమారు రెండు సంవత్సరాల క్రితం ఒక రోజు సాయంత్రం మా కాలేజీ ఎదురు రోడ్డు గుండా లాల్‌బాగ్‌కు వాకింగుకు వెళుతున్నాను. పక్కన ఒక ఇంటి నుండి “హెచ్చెన్” అంటూ ఒక పాప శబ్దం వినబడింది. ఆ వైపు చూశాను. ఇంటి గుమ్మం ముందు నిలబడ్డ మూడు సంవత్సరాల పాపయే నన్ను హెచ్చెన్ అని పిలిచింది. ఆ పాప తల్లి హెచ్చ్ ఎన్ అని పిలవకూడదే. సార్ అని పిలవాలి అని మెల్లగా దండించింది. ఆ పాప దగ్గరకు వెళ్ళి నీ పేరేమి పాపా అన్నాను. ‘అంబికా’ అన్నది. “నీవు ఏ క్లాస్” అని అడిగాను. “ఎల్.కె.జి.” అని బదులిచ్చింది. ఆ పాప తండ్రి మా కాలేజీలోనే చదివాడు. పాప అన్నలు మా పాఠశాల, కాలేజీలలో చదువుతున్నారు. అందరు విద్యార్థులకు నేను “హెచ్చెన్” అనే పరిచయం. ఇంటిలో సహజంగానే అప్పుడప్పుడూ మా కళాశాల, పాఠశాల మరియు నా ప్రస్తావన వచ్చినప్పుడు ‘హెచ్చెన్ ‘ అని మాట్లాడుకొంటారు. అదే చనువుతో ఆ పాప నన్ను అలాగే పిలిచింది.

ఆ రోజు నుండి ఆ పాప నా స్నేహితురాలయ్యింది. ప్రొద్దున నేను లాల్‍బాగ్ వాకింగ్ ముగించుకుని వాపసు వారి ఇంటి ముందే వచ్చే సమయం అందాజుగా ఆ పాపకు తెలుసు. రెండు మూడు రోజులకు ఒకసారి నన్ను మాట్లాడించడానికి వాకిలి దగ్గరే వేచి ఉంటుంది. పుట్టినరోజుకు ఆహ్వానిస్తుంది. పరీక్షలైన తరువాత ‘మార్క్స్ కార్డ్’ చూపించి అన్నీ ‘ఎ’ వచ్చిందని గర్వంతో చెప్పుకుంటుంది. ఒక్కొక్క సారి తల్లిమీద కోపగించుకుని మాట్లాడించినా మాట్లాడకుండా వాకిలి ముందు గుం అని నిలబడి, చప్పుడు చేయకుండా ‘టాటా’ చెప్పి లోపలికి వెళుతుంది.

మా కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో శ్రీ ఎన్.రమేశ్ మరియు శ్రీ ఎం.నాగరాజ్ అనే అధ్యాపకులు పనిచేస్తారు. వారు రోజూ ఉదయం మా కాలేజీ ఇండోర్ స్టేడియంలో షటిల్ కాక్ ఆడుతుంటారు. శ్రీ ఎన్.రమేశ్ గారి ఏడు సంవత్సరాల కుమారుడు చిరంజీవి వరుణ్ అదే ఆవరణలో ఆటలాడుతుంటాడు. అతడు నాకు బాగా తెలుసు. నేను అతడి బెస్ట్ ఫ్రెండ్ అని ఇంటిలో తల్లిదండ్రులతో అప్పుడప్పుడూ చెబుతాడట. ఒక రోజు నా లాల్‍బాగ్ వాకింగ్ ముగించుకుని ఆ ఇండోర్ స్టేడియం గుండా విద్యార్థి నిలయానికి వెళుతున్నాను. అక్కడున్న వరుణ్ “హెచ్.ఎన్., హెచ్.ఎన్” అని పరిగెత్తుకు వచ్చాడు. “ఏమప్పా” అన్నాను. “ఈ నాగరాజు మేష్టారిని కాలేజీ నుండి పంపివేయండి” అన్నాడు. “ఎందుకప్పా” అడిగాను. “నాతో వారు ఆటలో మోసం చేస్తారు. నేను ఇక్కడ నిలుచున్నప్పుడు బాలును అక్కడికి వేస్తారు. అక్కడికి పోయినప్పుడు ఇక్కడికి వేస్తారు” అని అతడి తండ్రి మరియు నాగరాజ్ ఎదురుగానే నిర్భయంగా చెప్పాడు. “రేపటి నుండి మీరు ఈ పిల్లవాడికి అలా మోసం చేయవద్దండి” అని నాగరాజ్ గారికి తెలిపాను. దానికి వారు నవ్వుతూ తలవూపారు. నాలుగైదు రోజుల తరువాత ఆ పిల్లవాడు అక్కడే దొరికాడు. “ఇప్పుడు ఎలా వుంది నాగరాజ్ మోసం” అని అడిగాను. “ఫరవాలేదు” అన్నాడు. మనం దేనిని ఆటలో కౌశల్యము, చాకచక్యము, ప్రావీణ్యము అని ప్రశంసిస్తామో దానిని ఆ పిల్లవాడు మోసం అని గుర్తించాడు. అతని అమాయకపు మాటలలో ఎంత సత్యం ఉంది. ఆలోచిస్తే ఈ ఆటలన్నీ ఒకరకంగా మోసపు పోటీలే!

హైస్కూలు విద్యార్థులకు నాకు ఇంతే పరిచయం ఉన్నా వారు ఎక్కువ గంభీరంగా ఉంటారు. పిల్లవాళ్ళ లాగా ప్రవర్తించరు. కొందరు విద్యార్థులకు నా ఆఫీసు ఒక విధమైన స్టోర్ రూం. క్రికెట్ బ్యాట్, స్కూల్ బ్యాగ్, టిఫిన్ డబ్బాలను పెట్టి “వీటిని జాగ్రత్తగా చూసుకోండి” అని చెప్పి వెళతారు. నా ఆఫీస్ ముందు ఉండే వరండాలో టెన్నిస్ ఆడుతుంటారు. వారికి చెయ్యి లేదా నోట్ బుక్కే బ్యాట్. నలుగురైదుగురు విద్యార్థులు “ఆకలి అవుతోంది. తిండి ఇప్పించండి” అని అప్పుడప్పుడు అడుగుతారు.

నాలుగైదు నెలల క్రితం నేను సుమారు సాయంత్రం 6.15కు బసవనగుడి నేషనల్ కాలేజీ నుండి జయనగర్ నేషనల్ కాలేజీకి బయలుదేరాను. ఆ సమయానికి సరిగ్గా ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఆత్రంగా ప్రవేశించి “ఇక్కడ డాన్స్ ఎక్కడ జరుగుతోంది” అని హడావిడిగా అడిగారు. “ఇక్కడ కాదమ్మ అది జయనగర్ నేషనల్ కాలేజీలో ఉండే కళాక్షేత్రలో” అన్నాను. “అయ్యో అది ఎక్కడుందో మాకు తెలియదే” అని దిగులుతో అన్నారు. వారు గుజరాతీల మాదిరిగా కనిపించారు. చెంగును కుడిభుజంపైన వేసుకున్నారు. “రండమ్మా. నేను అక్కడికే వెళుతున్నాను. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు” అని అడిగాను. రెండు ఆటోలలో అని బదులిచ్చారు. “ఆటోలోనే వెళదాము రండి” అని కాలేజీ ముందుభాగంలో ఉన్న రెండు ఆటోలలో కూర్చున్నాము. నేను ఎవరో వారికి తెలిసే అవకాశం లేదు. అయినా ధైర్యంతో ఒక అపరిచిత వ్యక్తి జతలో తమ 7-8 ఏళ్ళ వయసున్న ఇద్దరు పిల్లలను పంపారు. ఆ పిల్లలూ భయపడకుండా నాతో వచ్చారు. ఒక రెండు నిమిషాలలో నేను వారి స్నేహితుడినైనాను. వారి పేరు, క్లాస్ అన్నీ తెలుసుకున్నాను. వారిని బెదిరించాలనే ఆలోచన వచ్చింది. ఇలాంటి ఆలోచన ఆ సమయంలో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. “పిల్లలారా మనం ఎక్కడికి పోతున్నామో తెలుసా. మిమ్మల్ని నేను ఇప్పుడు కానకానహళ్ళికి పిలుచుకు పోతున్నాను. డాన్స్ లేదు ఏమీ లేదు. మీ తల్లులు మీకు దొరకరు” అని కొంచెం బెదిరించాను. ఆ ఇద్దరు పిల్లలు ఏమీ చలించలేదు. “లేదు లేదు మీరు అలా చేయరు. మమ్మల్ని మీరు కాలేజీకే తీసుకు వెళతారు” అని నవ్వుతూ నవ్వుతూ చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. వారు ఏడ్చవచ్చు. భయపడవచ్చు. అప్పుడు వారిని బుజ్జగిద్దాము అని మనసులో గుణాకారము, భాగాహారము వేసుకున్నాను. అంతా తలక్రిందలయ్యింది. “లేదు ఖచ్చితంగా మిమ్మల్ని కానకానహళ్ళికే తీసుకుని పోతున్నాను” అని కొంచెం ముఖం గంటు పెట్టుకుని చెప్పాను. “లేదు. మీరు అలా చేయరు. మీరు చాచా నెహ్రూ లాగా కనిపిస్తున్నారు. మీరు మంచివారు” అని చెప్పారు. ఆ మాటలు విని నాకు ఆశ్చర్యమయ్యింది. నా టోపీని చూచి మరియు నెహ్రూ పుట్టినరోజును బాల దినోత్సవంగా ఆచరంచడం ఈ నేపథ్యంలో వారికి చాచా నెహ్రూ జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు. ఇంతలో కాలేజీ చేరుకున్నాము. ఆ పిల్లలు నా ఎడమచేయి, కుడిచేయి పట్టుకుని కాలేజీ ప్రవేశించినప్పుడు ప్రిన్సిపాల్‌కు, కార్యదర్శికీ ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లల తల్లులూ ఇది చూసి నవ్వారు.

ఒక రోజు ఒక ఆప్తమిత్రుని తమ్ముని పెళ్ళికి వెళ్ళాను. ఆ స్నేహితుని ఇంటి వారంతా నాకు బాగా పరిచయం. వారికి ఇద్దరు పిల్లలు. అందరూ నన్ను హెచ్చెన్ అనే పిలిచేవారు. సాయంత్రం రిసెప్షన్‌కు వెళ్ళాను. అప్పుడు ఆ పాప “హెచ్చెన్ రాండి రాండి, మీరు మా అమ్మా నాన్నల పెళ్ళి రిసెప్షన్కు వచ్చింది నేను చూశాను” అని అన్నది. ఆ అమాయకపు పాప దగ్గరే ఉన్న తల్లి తండ్రి మరియు ఇతరులు నవ్వారు.

1-1-1995 నాడు మా ఉన్నత ప్రాథమిక పాఠశాల వజ్రోత్సవ కార్యక్రమం ముగిసింది. అందరు విద్యార్థులు భోజనానికి వెళ్ళారు. నలుగురైదుగురు విద్యార్థులు ఇంకా వెళ్ళాల్సి ఉంది. వారి పక్కనే నేను వెళుతూ ఉన్నాను. ఒక చిన్న పిల్లవాడు నావైపు తదేకంగా చూస్తూ “ఏ గాంధీ తాత” అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతవరకూ నన్ను ఎవరూ గాంధీ తాత అనలేదు. “నీవు ఏ క్లాస్ బాబూ” అన్నాను. “శిశువిహార్” అన్నాడు. “నీ పేరేమిటి” అడిగాను. “సురేశ్” అని చెప్పాడు. సుమారు 3-4 సంవత్సరాలు ఉండవచ్చు. అతడి ధైర్యానికి, అమాయకత్వానికి మెచ్చాను.

ఒకరోజు మా కార్యదర్శిగారైన శ్రీ బి.వి.దక్షిణామూర్తిగారు నేను మా ఆఫీసులో మాట్లాడుతూ కూర్చున్నాము. మా ఇద్దరి మధ్య ఒక ఖాళీ కుర్చీ ఉంది. ఇంకా చాలా ఖాళీ కుర్చీలు ఉన్నాయి. నా గదిలో మాములుగా వచ్చే 5-6 హైస్కూలు విద్యార్థినులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారికి ఇష్టం వచ్చిన కుర్చీలలో కూర్చున్నారు. కార్యదర్శిగారికీ నాకూ మధ్య ఉన్న ఖాళీ కుర్చీలో ఒక పాప వచ్చి హాయిగా ఏ మొహమాటమూ లేకుండా కూర్చొన్నది. “ఏమమ్మా నీకు కొంచెంకూడా భయం లేదు. ఆ పక్క కార్యదర్శి కూర్చున్నారు. ఈ పక్కలో నేను ప్రెసిడెంట్ కూర్చున్నాను” అన్నాను. దానికి ఆ పాప అనర్గళమైన సమాధానం “మీరు ప్రెసిడెంట్ అయితే నాకేమి. మీరు మా తాత”. అయిపోయింది. కొంచెం సేపు ఉండి అందరూ వెళ్ళిపోయారు. “ఏమి ఆత్మీయత సార్. ఆ అమాయకపు పిల్ల ఎంత విశ్వాసంతో మీ పక్కన కూర్చుంటారు. మిమ్మల్ని తాత అని భావించిన తరువాత మీరు ప్రెసిడెంట్ కావడం వారి దృష్టిలో సహజంగానే అప్రస్తుతం. ఒక సంస్థ అధ్యక్షులు మరియు పిల్లల మధ్య ఇలాంటి ఆత్మీయత ఉండడం అపురూపం. ఇంకెక్కడా ఉండడానికి సాధ్యం కాదు. దానిలో ఏమీ ఉత్ప్రేక్ష లేదు అని అనిపిస్తుంది” అని శ్రీ బి.వి.దక్షిణామూర్తి గారు సంతోషంతో చెప్పారు. నేను ఎక్కడున్నా పిల్లలు నాకు దగ్గర అవుతారు.

ఒక రోజు పెళ్ళి ఆహ్వాన పత్రిక వచ్చింది. ఆ ఆహ్వాన పత్రిక విష్ణువర్ధన్ గారి పేరుమీద ఉంది. వరుడు-వధువు ముస్లీములు. సాధారణమైన కార్డుపై అచ్చయిన పెళ్ళి పత్రిక. విష్ణువర్ధన్ అని మాత్రం ఉంది. ఇంకేమీ లేదు. ప్రసిద్ధ నటుడు విష్ణువర్ధన్ మా కాలేజీ పూర్వ విద్యార్థి. అదే విష్ణువర్ధనో లేక వేరే విష్ణువర్ధనో అనే అనుమానం వచ్చింది. ఏమైనా సరే వెళదాము అనుకుని వెళ్ళాను. అదే విష్ణువర్ధన్. మంచి ప్యాంట్, టోపీ ధరించి నన్ను ఆహ్వానించారు.

ఒక ముస్లిం తండ్రి సుమారు ఒక సంవత్సరం వయసున్న తన పాపను ఎత్తుకుని ఉన్నారు. నేను ఆ పాప ముందుకు వెళ్ళి రెండు చేతులూ చాచాను. హాయిగా ఆ పాప నా దగ్గరికి వచ్చింది. తండ్రి ఆ పాపను నాకు ఇచ్చి ఎవరినో మాట్లాడించడానికి వెళ్ళారు. అమాయకపు పిల్ల. దానికి జాతి, ధర్మం, భాష ఏమీ తెలియదు. ఇలాంటి పిల్లలను వారు పెద్దయ్యాక వారి నుదిటిపై హిందూ, ముస్లిం, ఈ జాతి, ఆ జాతి అని ముద్ర వేస్తాము. పరస్పర భిన్నాభిప్రాయాలు, అసహనం, ద్వేషం మొదలవుతుంది. పెద్దవారు ఈ పిల్లల్లాగా ఉంటే సమాజం ఎంత క్షేమంగా ఉంటుంది, ఎంత శాంతంగా ఉంటుంది అని ఆలోచించాను.

పిల్లలది అద్భుతమైన లోకం. వారి అమాయకత్వం, సరళత్వం, కూతూహలాలకు సాటే లేదు. ఎవరికీ వారిని అనుకరించడం సాధ్యం కాదు. పిల్లలను దేవుళ్ళతో పోలుస్తారు. మనకు ఎన్ని డిగ్రీలున్నా, ఎంతెంత ఉన్నత స్థానాలలో ఉన్నా మనం దేవునికి చాలా దూరంలో ఉండే అవకాశం ఉంది.

4. దేవాలయం ఈ పూలతోట

నేషనల్ కాలేజీ, నేషనల్ కాలేజీ హాస్టల్‌కూ లాల్‌బాగ్‌కూ కేవలం ఒక కి.మీ. దూరం. నా లాల్‍బాగ్ వాకింగ్ 1961లో ప్రారంభమయ్యింది. ఇంతవరకూ అంటే 34 సంవత్సరాల నుండి నా మార్నింగ్ వాక్ నిరాటంకంగా నడుస్తూ ఉంది. ఇంతకు ముందు నేను ఉదయం 10 కి.మీ నడిచేవాణ్ణి. “మీకు వయసయింది. నడిచే దూరాన్ని తగ్గించుకోండి” అని మా డాక్టరు చెప్పారు. “పోనీ పాపం” అని నడిచే దూరాన్ని 7-8 కి.మీ.కి తగ్గించాను. ఇంతకు ముందు నా అంత వేగంగా నడిచేవారు లాల్‌బాగ్‌లో వేరే ఎవరూ లేరని చెబితే తప్పుగా భావించకండి.

లాల్‍బాగ్ వాకింగ్ అనుభవాలను కొన్ని తెలపడానికి ఇష్టపడుతున్నాను.

నేను నడిచే దారి చివరలో ఒక జమ్మి చెట్టు ఉంది. అది జమ్మిచెట్టు అని ఎవరికీ తెలియలేదు. ఒక రోజు హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వారు “ఇది జమ్మిచెట్టు. 12 సంవత్సరాలు వనవాసాన్ని పూర్తి చేసుకున్న తరువాత పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేసే ముందు తమ అన్ని అస్త్రశస్త్రాలను జమ్మిచెట్టు మీద దాచి పెట్టారు” అనే ఒక ఫలకాన్ని ఆ చెట్టుముందు పెట్టారు. అన్ని సంవత్సరాలుగా అనాథగా ఉన్న ఆ చెట్టు అదృష్టం మారిపోయింది. అప్పటి నుండి జనాలు ఆ చెట్టును చుట్టిందీ చుట్టిందే. పుణ్యాన్ని సంపాదించిందీ సంపాదించిందే.

ఇంకొక పుణ్యమిచ్చే చెట్టు అశ్వత్థ వృక్షం. దానికి చాలామంది మొదటి నుండీ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి జీన్స్ ప్యాంట్ మరియూ షూస్ వేసుకుని ఒక కుక్కను లాగుకుంటూ ఆ చెట్టును తిరగడానికి ప్రయత్నించింది. కుక్క సహకరించలేదు. ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ఏమీ ప్రయోజనం లేదని ఆ కుక్కకు తెలుసు అనిపిస్తుంది. ఆ జంజాటంలో ఆ అమ్మాయిలో ఉన్న భక్తి పారిపోయింది.

వాకింగ్ ముగించుకుని వెనుకకు తిరిగేముందు ఒక రాతి బెంచీపై పడుకుని శవాసనాన్ని 15 నిముషాలు వేస్తాను. శవాసనం వేయడం సైంటిఫిక్. ఆ సమయంలో ఏ ఆలోచనలు ఉండరాదు. మనసు ప్రశాంతంగా, హాయిగా ఉండాలి. దీనిని చేయడం కష్టం. శవాసనం ఎందుకు వేయాలి అని ఒకరు అడిగారు. “ఇప్పటి నుండే ‘అభ్యాసం’ చేస్తున్నాను” అన్నాను. మళ్ళీ “దానికి అభ్యాసం అక్కరలేదని నాకూ తెలుసు. అయితే శవాసనాన్ని లోపం లేకుండా perfectగా చేయడానికి ప్రయత్నించము. Perfectగా చేస్తే మళ్ళీ దానిని చేయడానికి కుదరదు. జీవితంలో ఒకేసారి అలాంటి పరిపూర్ణ శవాసనాన్ని ఇతరులు చూడటానికి వీలవుతుంది. ఆ రోజును వాయిదా వేయడానికే ఈ వాకింగ్, శవాసనం” అని చెప్పాను. వారు నవ్వారు.

ఒక రోజు వాకింగ్ ముగించుకుని లాల్‍బాగ్ చెరువు కట్టపైన నడుచుకుంటూ వాపసు వస్తున్నాను. ఆ రోజు ఆదివారం అనుకుంటాను. 10-12 మంది కట్టమీద నడుచుకుంటూ వస్తున్నారు. కొంచెం ఎర్రని కచ్చాపంచెలు కట్టుకుని, గుల్బర్గా వైపు కన్నడభాషను మాట్లాడుతున్నారు. వారంతా అటువైపు నుండి వచ్చినవారు. భవనాలలో కాంక్రీటు పనిచేస్తే వారు. కష్టజీవులు, పేదవారు. “ఏమప్పా, లాల్‌బాగ్ ఎంత బాగా ఉందో చూడండి” అని గర్వంతో చెప్పాను. వెంటనే వారిలో ఒకరు “సాహెబ్ గారూ, మా వంటి గరీబులకు ఎందుకీ లాల్‍బాగ్” అన్నారు. నాకు చెంపమీద ఫట్ అని కొట్టినట్లయ్యింది. నేను ఎంత అవివేకిని, మూర్ఖుణ్ణి అని నాకు నేనే శాపం పెట్టుకున్నాను. అతడు చెప్పింది ఎంత నిజం. లాల్‌బాగ్ ఉండేది శ్రీమంతులకు, మధ్యతరగతి వారికి. వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు వారి కోసం బ్రేక్‌ఫాస్ట్ ఎదురుచూస్తుంటుంది. అందువల్ల అలాంటివారు నిశ్చింతగా ప్రకృతి సొగసులను చూసి సంతోషపడతారు. దినసరి వేతనాలతో కాలక్షేపం చేసే పేదలకు, తినడానికి లేనివారికి ప్రకృతి సౌందర్యం వైపు దృష్టి పోవడం అసాధ్యం. ఇదంతా కడుపు నిండిన వారికి. ప్రకృతి ఇస్తున్న సంతోషంలోనూ పేదవారు వంచితులవుతున్నారు. ఎంతటి క్రూరమైన సమాజం!

ఒక డాక్టరు అతని భార్య రోజూ నాలాగా ఉదయం లాల్‌బాగ్‌కు వాకింగుకు వస్తారు. “మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా” అని డాక్టర్ అడిగారు. “అడగండి” అన్నాను. “అదొక వ్యక్తిగతమైన ప్రశ్న” అన్నారు. “ఏం కావాలన్నా అడగండి” అన్నాను. “మీరు ఈ వయసులోనూ (అప్పుడు నా వయస్సు 70 దాటింది) ఇంత సేపు లాల్‌బాగ్‌లో నడుస్తుంటారు కదా. మీకు ఇంకా ఎన్నేళ్ళు బ్రతకాలని ఆశ వుంది” అని అడిగారు. “మనసు విప్పి చెప్పమంటారా” అని అడిగాను. “చెప్పండి” అన్నారు. “నాకైతే చావాలి అనే ఆలోచనే లేదు. పుట్టింది బ్రతకడానికి. చావడానికి కాదు. చివరకు చావడం ఎలానూ ఉండే ఉంటుంది” అని చెప్పాను. “నాకు బ్రతుకు బేజారయ్యింది” అని ఒక విధమైన నిస్పృహతో అన్నారు. “పక్కన భార్యను పెట్టుకుని ఇలాంటి విషయాలను మాట్లాడకండి” అన్నాను. ఇద్దరూ నవ్వారు. తరువాత ఎవరి దారిలో వారు వెళ్ళిపోయాము.

లాల్‌బాగ్‌లో ఆత్మహత్య చేసుకోవడం కొత్తదేమీ కాదు. కొన్నిసార్లు ఎక్కడో చంపిన శవాన్ని తెచ్చి లాల్‌బాగ్‌లో పడేస్తారు. ఒకరోజు తెల్లవారుజాము బట్టబయలులో ఒక మధ్యవయస్కుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శవం పడివుంది. దూరం నుండి చూసేవాళ్ళకు అతడు పడుకుని ఉన్నట్లే ఆ శవం కనిపిస్తూ ఉంది. మరుసటి రోజు నేను వాకింగ్ ముగించుకుని శవాసనం కోసం బెంచీని వెదికి అది దొరకక ఒక బయలులో పడుకుని ఉన్నాను. నేను పడుకున్న బయలు మరియు వెనుకటిరోజు ఆత్మహత్య చేసుకున్న శవం ఉన్న బయలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ రెండు బయళ్ళ మధ్య నడవడానికి ఒక దారి ఉంది. ఆ రోజు వకీలు సంఘం అధ్యక్షులైన శ్రీ కె.ఎన్.సుబ్బారెడ్డి గారు వారి స్నేహితులూ ఆ మధ్యదారిలో వెళుతున్నారట. వారి స్నేహితులు పడుకుని ఉన్న నన్ను చూసి “నిన్న ఒకడు ఈ వైపు బయలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఈ బయలులో ఇంకొకడు ఆత్మహత్య చేసుకున్నాడు” అంటూ లోకాభిరామంగా సుబ్బారెడ్డిగారితో అన్నారట. అప్పుడు రెడ్డిగారు “ఛీ ఛీ అలా అనకండి. ఇది ఆత్మహత్య కాదు. నరసింహయ్య గారు శవాసనం చేస్తున్నారు” అన్నారట. “సారీ, సారీ (Sorry Sorry) వారు చాలా ఏళ్ళు బ్రతకనీ” అని అన్నారట. మరుసటి రోజు లాల్‌బాగ్‌లో సుబ్బారెడ్డిగారు కనిపించి ఈ విషయం చెప్పారు. ఇద్దరమూ బాగా నవ్వుకున్నాము.

ఒక రోజు ఇలాగే నేలమీద పడుకుని శవాసనం వేస్తున్నాను. ఉన్నట్టుండి నా పొట్ట మీద ధడేల్ అని ఏదో పడ్డట్టు అయ్యింది. గాభరాతో తటాలున లేశాను. ఒక చిన్న కుక్కపిల్ల. ఒళ్ళంతా వెంట్రుకలు. ముఖమే కనబడటం లేదు. కన్ను, ముక్కూ కూడా సరిగ్గా కనిపించడలేదు. అది పరిగెత్తుకుని వచ్చి నా మీదకు గెంతింది. నేను లేచిన గాభరాకు అది భయపడి పరిగెత్తుకు పోయింది.

ఇంకోరోజు ఇలాగే నేలమీద శవాసనం వేస్తున్నాను. దీనిని చూసిన ఒకరికి అనుమానం వచ్చింది. అనుమానం నివృత్తి చేసుకోవడానికి నిదానంగా నా వద్దకు వచ్చారు. ఎంత మెల్లగా వచ్చినా శబ్దం వినిపిస్తోంది. అలాంటి శబ్దం వినబడనంత స్థాయికి నా శవాసనం ఇంకా చేరుకోలేదు. వెంటనే కళ్ళు తెరిచాను. వారి అనుమానం నివృత్తి అయ్యింది. వారు వేగంగా అక్కడినుండి వెళ్ళిపోయారు.

ఇప్పుడు నా శవాసనానికి కష్టకాలం వచ్చింది. సరైన రాతి బెంచీ దొరకడం లేదు. నేలపై పడుకొంటే కొందరికి అనుమానం. పైగా కుక్కల బెడద.

లాల్‌బాగ్‌లో ప్రాణులను ప్రేమించే వారిని అక్కడక్కడా చూస్తుంటాను. చీమలకు చక్కెర, బియ్యపు నూకలు వేస్తారు. మరికొందరు కుక్కలకు, కాకులకు బ్రెడ్ వేస్తారు. వీరికి చీమలపై, ఉడుతలపై, కుక్కలపై ఉన్న ప్రేమ మనుష్యులపై ఉంటే చాలు. ఇలాంటి వారిలో కొందరైనా దైనందిన జీవితపు ఆహారంలో కల్తీ చేసినా ఆశ్చర్యం ఏమీ లేదు. చీమలకు చక్కెర, మనుష్యులకు విషం. ఇది పుణ్యం సంపాదించుకోవడానికి మరొక మార్గం.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని లాల్‌బాగ్‌కు వచ్చేవారే ఎక్కువ. అయితే చాలామందికి దగ్గరలోనే ఉన్న పేరు మోసిన ఎం.టి.ఆర్.హోటల్‌కు వెళ్ళి రుచి అయిన టిఫెన్ తినడానికి ఈ వాకింగ్ ఒక నెపం. ఒక రోజు పరిచయం ఉన్న ఒక భారీకాయునితో మాట్లాడుతూ ఉన్నాను. వారు ప్రసంగవశాత్తు “చూడండి సార్, లాల్‌బాగ్‌లో ఎంత నడిచినా నా బరువు తగ్గనే లేదు” అన్నారు. దానికి నేను “సరే, ఇప్పుడు ఎం.టి.ఆర్.కు వెళాతారు కదా, అక్కడేం తింటారు?” అని అడిగాను. “అయ్యో అది వదిలేయండి సార్” అన్నారు. “అది వదిలేస్తేనే మీ బరువు తగ్గే సంభవం ఉంది” అన్నాను. వారు నవ్వారు. మీరు అక్కడ ఏమి తింటారు అని అడిగింది కేవలం కుతూహలంతోనే అన్నాను. “చూడండి సార్, నాకు తినే చపలమైతే ఉంది. వడ, ఇడ్లి వాటితోపాటు నెయ్యి ఉండనే ఉంటుంది” అన్నారు. దీనితో ఉదయం తిండి ముగిసినట్టేనా అని అడిగాను. “అయ్యో, ముగియదు సార్. ఇంటికి వెళ్ళాక పెళ్ళామూ చాలినంత ఫలహారం పెడుతుంది. వద్దు అని చెప్పడానికి కుదరదు. చాలా ప్రీతితో ఇస్తుంది. ఇది మీకు అర్థం కాదు. దాన్నీ తినాలి” అన్నారు. “సరే, చపలం కోసం ఎం.టి.ఆర్.లో తినాలి, ప్రేమకోసం మీ భార్య పెట్టింది తినాలి. ఇక మీ బరువు తగ్గే అవకాశమే లేదు” అన్నాను. “సరిగ్గా చెప్పారు సార్” అని నవ్వారు.

లాల్‌బాగ్‌లో కుక్కల బెడద. ఒంటరిగా, మందలు మందలుగా అవీ వాకింగ్ చేస్తాయి. కుక్కలను చూస్తే నాకు విపరీతమైన భయం. అందువల్ల నేను వాకింగ్ వెళ్ళే సమయంలో ఒక మూర పొడవు ఉన్న ఒక కట్టెను పట్టుకుని వెళతాను. ఇది నా అధైర్యానికి సంకేతం. ఇంతవరకూ ఆ కట్టెను ఉపయోగించే అవసరం రాలేదు.

శ్రీమంతులు కుక్కలను పట్టుకుని వస్తారు. ఒక కుక్కను సాకే ఖర్చుతో ఇద్దరు మనుషులను హాయిగా సాకవచ్చు. కొందరు మనుష్యులను ప్రేమించే దానికన్నా ఎక్కువగా కుక్కలను ప్రేమిస్తారు. కుక్కలకు మనిషికన్నా ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది. ఒకడు చెప్పాడు “If you feed a hungry dog, it does not bite. That is the difference between a man and a dog – ఆకలిగొన్న కుక్కకు ఆహారం పెడితే అది చేతిని కొరకదు. మనిషికీ, కుక్కకూ అంతే వ్యత్యాసం.” ఎలాంటి కఠోరమైన సత్యాన్ని సరళ వాక్యాలలో మనిషి చెంపమీద కొట్టినట్లు చెప్పాడు. కృతజ్ఞతాలోపాన్ని విద్యావంతులలోనూ, ధనానికి ప్రాముఖ్యత ఇచ్చేవారిలోనూ చూస్తున్నాను. కుక్క గురించి ఇంకొకడు ఇలా చెప్పాడు. “The more I see man, the more I love dogs – మనిషిని చూసిన కొద్దీ నాకు కుక్కలమీద ప్రేమ ఎక్కువ అవుతుంది” అయ్యో మనిషీ నీకు ఈ గతి పట్టిందే!

బెంగళూరులో ఇంగ్లీషుకు మితిమీరిన వ్యాపమోహం. ఇది ఎల్.కె.జి.నుండే ప్రారంభమవుతుంది. పైగా లాల్‌బాగ్‌లో కుక్కలతో కుడా ఇంగ్లీష్ మీడియం. లాల్‌బాగ్‌కు వచ్చే కుక్కలన్నీ ఇంగ్లీష్ మీడియం కుక్కలే. అయితే ఒక తెలుగు మీడియం కుక్క కూడా ఉంది. అయితే ఈ మధ్య ఒక కన్నడ మీడియం కుక్క వస్తూ ఉంది. దానిని చూసి నాకు చాలా సంతోషమయ్యింది. అయితే దాని దగ్గరకు వెళ్ళడానికి భయం.

మూడు నాలుగు సంవత్సరాల క్రితం లాల్‌బాగ్‌కు ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ వాకింగుకు వచ్చేవారు. వారు కలిసినప్పుడు ఇలాగే పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. వారు గౌరవప్రదమైన పోలీస్ ఆఫీసర్ అయినా వారి భాష చాలామంది పోలీస్ కానిస్టేబుళ్ళు ఉపయోగించే ‘ఆత్మీయ’మైన మనసుకు హత్తుకునే భాష. ఒక రోజు వారి మాటలు ఇలా కొనసాగాయి. “నరసింహయ్య గారూ, నేను అధికారంలో ఉన్నప్పుడు నా పుట్టిన రోజుకు చాలా మంది వచ్చి Happy Birthday to you, Many Happy returns of the day ఇలా అనేక రకాలుగా శుభాకాంక్షలు చెప్పేవారు. మంచి బహుమతులు తెచ్చి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఒక్క.. కొడుకూ శుభాకాంక్షలు చెప్పడానికి రావడం లేదు” అని మూలిగారు. వారు పదే పదే ఉపయోగించే కొడుకు అనే పదం ముందు వేరే వేరే సూక్తమైన గుణవాచాకాలను (వారి గుణవాచకాలను) ఉపయోగించి మనోహరంగా మాట్లాడేవారు. నేను అంతా ఓపికగా విని “ఏం సార్, మీకు ఇంత వయసు వచ్చింది. ఇంత అనుభవం ఉంది. ఆ మీ స్నేహితులు మీకు శుభాకాంక్షలు చెప్పేది ఎక్కువగా మీ పదవికి అని తెలుసుకోలేక పోయారా?” అన్నాను. “అయ్యో నరసింహయ్య గారూ, నాకు ఆ మాత్రం తెలియదా? అదంతా నాకు తెలుసప్పా. అయితే ఈ నా కొడుకులు ఇంత hopeless అనుకోలేదు” అంటూ మరిగిపోయారు. అధికారంలో లేనప్పుడు లభించే గౌరవమే నిజమైన గౌరవం.

లాల్‌బాగ్‌లోనికి పశ్చిమ ద్వారం గుండా ప్రవేశిస్తాను. కు.వెం.పు.గారు లాల్‍బాగ్ గురించి ఇలా చెప్పారు.

దేవాలయవీ హూవిన తోటం,

కై ముగిదు ఒళగె బా,

ఇదు సస్యకాశి

(దేవాలయం ఈ పూల తోట

చేతులు జోడించి లోపలికి రా

ఇది సస్య కాశి)

ఎంత మంచి ముత్యాల వంటి మాటలు. ఈ వాక్యాల ఫలకాలు ప్రవేశ ద్వారాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. అక్షరాలా చేతులు జోడించి లోపలికి ప్రవేశించక పోయినా మనసులో అదే పవిత్ర భావనను పెట్టుకుని ప్రతి నిత్యమూ లాల్‌బాగ్‌లోనికి ప్రవేశిస్తాను. నా అభిప్రాయంలో ఇదొక నిజమైన దేవాలయం. పుణ్యక్షేత్రాలలోని దేవస్థానాలలో లభించే మనఃశాంతి కన్నా లాల్‌బాగ్‌లో తెల్లవారుజామున లభించే మనఃశాంతి ఎక్కువ. ఇప్పటికీ నాకు యక్షప్రశ్నల్లా మిగిలిపోయిన దేవుడు, ఆత్మ, పునర్జన్మ వంటి విషయాలపై ఇక్కడి ప్రశాంత వాతావరణంలో ఆలోచిస్తూ ఉంటాను. ఎంత ఆలోచించినా వీటిని తార్కికంగా వదిలించుకోవడం కష్టం.

లాల్‍బాగ్ యొక్క తెల్లవారుజాము సమయపు ప్రశాంతతను, వృక్ష సంపదల సొబగును, చల్లని గాలిని వర్ణించడం నాకు చేతగాదు. ఎందుకంటే నేను కవిని కాను. దానిని నేను అనుభవించి అపారమైన సంతోషాన్ని పొందుతున్నాను. ఒక్కొక్కసారి ప్రకృతి యొక్క అద్భుతాన్ని చూస్తూ అలాగే స్తంభీభూతుడినై కొన్ని సెకెన్లు ఒక భారీవృక్షం క్రింద చింతాక్రాంతుడిన నిలుచుండి పోతాను. తెల్లవారుజాము లాల్‍బాగ్ వాకింగ్ ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేదానితో పాటుగా ఆ రోజు కార్యకలాపాలలో అవసరమైన ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అదొక ‘బ్యాటరీ ఛార్జర్ (Battery Charger)’ గా పని చేస్తుంది.

ఇన్ని సంవత్సరాలుగా లాల్‌బాగ్‌లో నడిచి ఒక్కొక్క చెట్టూ నాకు పరిచయమయ్యాయి. అవి కూడా నన్ను తమదైన పద్ధతిలో గమనించి ఉండవచ్చు. కొన్ని రోజులు నేను వెళ్ళకపోతే నేను ఏమయ్యానో అనే దిగులు, బెంగ అవి వాటి మనసులోనే వ్యక్తం చేయవచ్చు. నాకు ఎక్కువ వయసు అయినందువల్ల అతడు చనిపోయాడేమో అనే అభిప్రాయానికి వచ్చినా రావచ్చు. మా ఇద్దరి మధ్య ఎన్నో దశాబ్దాల ఆత్మీయ స్నేహం ఉంది. చెట్టుచేమలు మాట్లాడే అవకాశం లేదు. అయితే వాటికి భావనలు ఉండవచ్చు. ఏమైనా నా దైహిక, మానసిక ఆరోగ్యానికి ఉదయపు లాల్‍బాగ్ వాకింగ్ ఎక్కువ సహాయం చేసింది.

లాల్‍బాగ్ నా పంచప్రాణం. దానికి జీవితాంతం కృతజ్ఞుడినై ఉంటాను.

5. ఆరోగ్యం

నా ఆరోగ్యం బాగానే ఉంది. చిన్నప్పుడు దీర్ఘమైన ఏ రోగం నుండి బాధపడలేదు. జ్వరం వచ్చిందీ జ్ఞాపకం లేదు. ‘దిష్టి’ అవుతూ ఉంటుందని ముందే వ్రాశాను. ఒకటి రెండు సార్లు అర తలనొప్పి అంటే ఒకే పక్క తలనొప్పి వచ్చింది. దిష్టికి, అర తలనొప్పికీ మా తల్లిగారు వైద్యులు. అర తలనొప్పి ఎక్కువగా పొద్దున వచ్చేది. అప్పుడు మా తల్లిగారు ఇంటి సమీపంలో ఉన్న ఏదో చెట్టు ఆకులను అరచేతిలో నలుపుకుంటూ వచ్చేవారు. దానినుండి రసం వచ్చేది. ఎడమవైపు నొప్పి ఉన్నప్పుడు కుడి చెవిలో ఆ ఆకురసాన్ని పోసేవారు. కొంచెం సేపు పడుకుని ఆ తరువాత లేచి ఆ చెవిలో మిగిలిన రసాన్ని దూదితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకు పేరు చెప్పేవారు కాదు. దాని పేరు చెబితే ఆ రసం ప్రభావం తక్కువ అవుతుందని వారి నమ్మకం. ఇలాంటి నమ్మకాల వల్లే ఆయుర్వేదం అభివృద్ధి కాలేదు. ఆ ఆకు తుమ్మ ఆకు అని తరువాత కనిపెట్టాను. నాలుగైదు రోజులలోపల నొప్పి తగ్గిపోయేది. అయితే ఆకు రసం ప్రభావం వల్ల తగ్గిపోయింది అని ఖచ్చితంగా చెప్పడానికి వీలులేదు. నొప్పి తనంత తానే తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు. కొన్ని వ్యాధులు ఎటువంటి ఔషధాల సహాయం లేకుండా మేలు అవుతాయి అనే వాదానికి ఇప్పుడు పుష్టి దొరుకుతూ ఉంది. “జలుబు చేస్తే మందులు తీసుకుంటే వారం రోజుల్లో నయమౌతుంది. లేకుంటే ఏడు రోజులలో మేలు అవుతుంది!” దీనిని అన్ని వ్యాధులకు అన్వయించడం కుదరదు అని చెప్పవలసిన పనిలేదు.

ఆరోగ్యం గురించి నేను ఒక సమీకరణం (Equation) తయారు చేశాను.

ఆరోగ్యం = పిత్రార్జితం + స్వార్జితం

పిత్రార్జితం అంటే మనం వంశపారంపర్యంగా పొందిన ఆరోగ్యం. స్వార్జితం అంటే పుట్టిన తరువాత మనం సంపాదించుకున్న ఆరోగ్యం. ఇది మన అలవాట్లు, ఆరోగ్య నియమాలను పాటించడంపై ఆధారపడి ఉంటుంది.

ప్రతి పిల్లవాడు పుట్టినప్పుడే వారి తల్లి-తండ్రి లేదా వారి వంశపారంపర్యంగా వచ్చే ఆరోగ్య, అనారోగ్యాలకు వారసుదారుడు. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యవంతులు, దీర్ఘాయులై, వారి పిల్లలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార, వ్యాయామ, జీవితపు క్రమశిక్షణ మొదలైన వాటిపై ధ్యానం పెడితే ఆ పిల్లలు కూడా దీర్ఘాయులయ్యే సంభవముంది. మొదటి భాగం అంటే మనం పుట్టినప్పుడు ఉన్న ఆరోగ్యంపై మన నియంత్రణ లేదు. మన తల్లిదండ్రులను మనం ఎన్నుకోవడానికి కుదరదు! అయితే పుట్టిన తరువాత మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనవల్ల సాధ్యమౌతుంది. మంచి ఆరోగ్యవంతుల వంశంలో పుట్టి తినరానిది తిని, తాగరానిది తాగి ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మాతాపితలనుండి సంపాదించుకున్న దీర్ఘాయుస్సును నిలబెట్టుకోలేము. అలాగే పిత్రార్జితమైన అనారోగ్యంతో పుట్టిన పిల్లవాడు స్వేచ్ఛగా జీవిస్తే ఆ పిల్లవాడి ఆయుస్సు చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని నడిపితే మన ప్రారంభపు అనారోగ్యాలను కొంతవరకు తగ్గించవచ్చు. వైద్యపరంగా కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తాయి. తండ్రికో లేదా తల్లికో మధుమేహం (Diabetes) ఉంటే పుట్టే పిల్లలు జాగ్రత్తగా లేకపొతే మధుమేహానికి గురికావచ్చు. ఇద్దరికీ మధుమేహం ఉంటే పిల్లలకూ మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా కొన్ని అనువంశిక (Hereditary) ఖాయిలాలకూ ఇది అన్వయిస్తుంది. ఇన్ని ఉదాహరణాలతో సైతం వ్రాసిన ఉద్దేశం ఏమంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవలంటే మన నియంత్రణలో ఉండేది పై సమీకరణలో స్వార్జితం మాత్రమే.

ఆరోగ్యాన్ని పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు మొదలైనవాటితో పొందడం సాధ్యం కాదు. షష్ట్యబ్ధిపూర్తి, సహస్ర చంద్రదర్శనం మొదలైన వాటిని ఆచరించడం వల్ల ఆయస్సును వృద్ధి చేసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో “శతమానం భవతి శతాయుః” అని పురోహితులు ఆశీర్వాదం చేస్తారు. పరిసరాలు పాడయ్యి వాయు కాలుష్యంతో నిండివుండే బెంగళూరు వంటి నగరాలలో 100 సంవత్సరాలు బ్రతుకు అని ఆశీర్వాదం చేసేవారు మరియు ఆశీర్వాదం చేయించుకునేవారు ఇద్దరూ శతాయుష్కులు అయ్యే సంభవం తక్కువ. మన ప్రతి నిమిషం ఊపిరి విషంతో కూడి ఉన్నప్పుడు ఏ దేవుడూ మనకు ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదించే అవకాశంలేదు.

రష్యా దేశంలో పర్వత ప్రదేశాలలో నివసించేవారిలో ఎక్కువ మంది దీర్ఘాయుష్కులు, శతాయుష్కులు ఉన్నారు. మంచి గాలి, నీరు ప్రాథమిక అవసరాలు. మనదేశంలోనూ మిగతా విషయాలలో ఎన్ని అసౌకర్యాలున్నా దీర్ఘాయుష్కులైన పల్లె ప్రజలు చాలామంది కనిపిస్తారు. 80 యేళ్ళు వయసున్న పల్లెటూరివారు అద్దాలు లేకుండా సునాయాసంగా సూది బెజ్జంలో దారాన్ని ఎక్కించడాన్ని మనం చూడవచ్చు. పట్టణపు ‘ఫైవ్‌స్టార్’ సంస్కృతికి బలి అయిన చాలామందికి సూదిలో దారం ఎక్కించడం అలా ఉండనీ వారికి సూదీ కనిపించదు, దారమూ కనిపించదు. నాకు ఇంతవరకూ ఏ శాంతియూ జరగలేదు. ఆయుస్సును పెంచే 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 75 ఏళ్ళ ‘శాంతు’లను చేయించుకోవాలని నా శ్రేయోభిలాషులు నన్ను ఒత్తిడి చేశారు. “నా జీవితంలో నాకున్నది ఒకటే శాంతి – అది ఆఖరి శాంతి” అని వారికి సమాధానమిచ్చాను.

పేదరికంలో పుట్టి పెరిగి, విద్యార్థి నిలయాలలో నివసించి ఆహారం విషయంలో అదుపు తప్పడం సాధ్యమే కాదు. కావలసినంత ఆహారమే లేనప్పుడు అనారోగ్యకరమైన ఆహారం తినే అవకాశమే లేదు. నేను కాలేజీ ఉపాధ్యాయుడిని అయ్యే సమయానికి నాకు ఆరోగ్యం ప్రాముఖ్యత బాగా తెలిసింది. దానికి ముందూ దాని గురించిన ప్రజ్ఞ ఉండేది. నేను ముందే చెప్పినట్లు నేను అన్ని విధాలుగా ఖచ్చితమైన జీవితాన్ని గడపడం నా జీవన విధానమయ్యింది. అందువల్ల నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధతో, నిష్ఠతో అన్ని ప్రయత్నాలను చేస్తూ వస్తున్నాను.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాది మొదటి నుండి ఒక విధమైన హడవిడి జీవితం, మొండి జీవితం. చేపట్టిన పనిని నియమిత కాలంలో విజయవంతంగా పూర్తి చేయాలనే హఠం; అవి పరీక్షలు కావచ్చు, ధన సేకరణ కావచ్చు, భవన నిర్మాణ పనులు కావచ్చు, మా సంస్థను మిగిలిన సంస్థలకన్నా ముందుకు తీసుకుపోవాలన్న పనికావచ్చు. నా జీవితం పొడుగునా పైన చెప్పిన పనులు నా వీపు ఎక్కి వస్తూనే ఉన్నాయి. లేదా నేనే ఆ పనులను వెదుకుకొని పొతున్నానేమో! ఏమైనా అవి నా జీవితంలో ఒక భాగమయ్యాయి. ఇవి శారీరికంగా, మానసికంగా ఎక్కువ వత్తిడిని కలిగిస్తాయి. ఫలితంగా ఒకటి కాకపోతే మరొక బాధ. ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది. “Work does not kill a person. It is the worry that kills a person – అంటే శ్రమ మనిషిని చంపదు. అయితే కలవరం, చింత చావు వైపు లాక్కొని పోతుంది.” శారీరికపు ఒత్తిడి లేకపోయినా మానసిక ఒత్తిడికూడా మనిషి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణాలవల్ల వచ్చే రోగాలను Pyschosomatic diseases అని చెబుతారు. సైకో అంటే మనస్సు, సోమా అంటే దేహం. అది కడుపు పుండు (Ulcer) కావచ్చు, రక్తపు ఒత్తిడి (Blood Pressure) కావచ్చు, ఆస్తమా కావచ్చు లేదా ఇలాంటిదే వేరే వ్యాధి కావచ్చు. నాకు అల్సర్ చిహ్నాలు 1955-56లో కనిపించింది. అమెరికాలోనూ దాని బాధ అనుభవించానని ముందే తెలిపాను.

నా రక్తపు ఒత్తిడి (Blood Pressure) మొన్న మొన్న వరకూ 60-100 ఉంది. మధ్య వయసు వారికి 80-120 ఉండాలి. ఆ నా 60-100 సుమారు 30 యేళ్ళకు ఉంది. ఒక్కొక్కసారి దాని వల్ల తల తిరిగేది. నా వయసుకు అది తక్కువ ఒత్తిడి. దానిని ఎలా సాధారణ ఒత్తిడి (Normal Blood Pressure)కి తీసుకురావాలి అని మా డాక్టరును అడిగాను. “మీరు కాఫీనే తాగరు. ఇంకేమైనా తాగమని ఎలా చెప్పాలి” అన్నారు. కాఫీ ఉద్రేకం (Stimulant) కలిగించే పానీయం. అలాగే ఆల్కహాల్(Alcohol) ఇంకా ఎక్కువ ఉద్రేకాన్ని కలిగిస్తుందట.

ఇంకొక సారి అదే ప్రశ్నకు మా డాక్టరు నవ్వుతూ ఇలా జవాబు ఇచ్చారు.”బెంగళూరు విశ్వవిద్యాలయం సమస్యలు మీ బ్లడ్ ప్రెషర్‌ను నార్మల్‌కు తీసుకు రాలేకపోతే నా దగ్గర ఏ మందూ లేదు”.

Dr. H Narasimhaiah

కడుపులోని వ్రణానికి (ulcer) 1983లో నాకు శస్త్ర చికిత్స జరిగింది. దానికంటే ముందు “మీకు ఏదైనా మంచిరోజు, కాలం ఉంటే చెప్పండి” అని శస్త్రవైద్యులు (surgeon) అడిగారు. “అలాంటి ఏ నమ్మకమూ నాకు లేదు. మీకు అనుకూలమైనప్పుడు చేయండి” అన్నాను. శస్త్ర చికిత్స విజయవంతమయ్యింది. ఆపరేషన్‌కు ముందు నాకు భయమేమీ కలగలేదు. అప్పుడు నేను విధానపరిషత్ సభ్యుడిగా ఉన్నాను. నా శస్త్రచికిత్సలకు కానీ, వైద్య పరీక్షలకు కానీ నేను ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా పుచ్చుకోలేదు.

ఐదారు సంవత్సరాల క్రితం మళ్ళీ కడుపునొప్పి వచ్చింది. ఐతే ఇది అల్సర్ కాదు. పిత్తాశయంలో రాళ్ళు, స్ఫటికాలు (Gallstones) ఈ కడుపునొప్పికి కారణాలు అని తెలిసింది. ఆ నొప్పినుండి ఉపశమనం లభించనప్పుడు 1990లో “ఈ పిత్తాశయంలో రాళ్ళు ఎందుకు వస్తాయి?” అని మా డాక్టర్‌ను అడిగాను. “అవి ఎందుకు వస్తాయో ఖచ్చితంగా చెప్పడానికి కాదు. నాలుగు ఎఫ్ (F) లు F1 అంటే Female (స్త్రీ), F2 అంటే Fat (లావు), F3 అంటే Forty (నలభై ఏళ్ళ వయసు) , F4 అంటే Fair (అందం) ఈ నాలుగు ఉన్నవారికి అవి వచ్చే అవకాశం ఉంది” అని చెప్పారు. నేను స్త్రీని కాను. నలభై యేళ్ళ వాణ్ణీ కాను. ఇంకా లావుగా కూడా లేను. అందువల్ల చివరి ఎఫ్ అంటే నేను అందగాణ్ణి అయితే కావచ్చు అని సమాధన పరచుకున్నాను. చివరికి అద్దానికీ దొరకని నా సౌందర్యం, పిత్తకోశపు రాళ్ళ వల్ల నాకు దొరికింది!

ఈ శస్త్రచికిత్స కూడా అదే శస్త్ర వైద్యుని ద్వారా జరిగింది. ఈ శస్త్రచికిత్స కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆందోళనను కలిగించింది. ఆ పిత్తాశయంలో తొమ్మిది రాళ్ళు ఉన్నాయి. అది తెలుసుకున్న ఒక సాంప్రదాయస్థులు ఇలా అన్నారట. “నరసింహయ్య గారికి జ్యోతిషం మీద నమ్మకం లేదు. అందుకే నవగ్రహాలు పిత్తాశయంలో తొమ్మిది రాళ్ళయి పుట్టి వారిని బాధపెట్టాయి.” కాకతాళీయంగా వచ్చిన ఈ తొమ్మిదికి ఎలాంటి విశ్లేషణ!

ఈ రెండు శస్త్రచికిత్సలు జరిగిన సందర్భంలో నా పాత విద్యార్థులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు నన్ను పగలూ రాత్రి బాగా చూసుకున్నారు. ఆసుపత్రిలోనే రాత్రింబవళ్ళు నా జతలో ఉండి శుశ్రూష చేశారు. తండ్రిలా, అన్నలా, స్నేహితునిలా చూసుకున్నారు. నా జీవితంలో ఇదొక అపూర్వమైన సౌభాగ్యం. వారికి నేను జీవితాంతం కృతజ్ఞుడినై ఉన్నా సరిపోదు. వారి పేర్లను ఉద్దేశపూర్వకంగా వ్రాయడం లేదు. వీరి జాబితా పెద్దగా ఉంది. అందువల్లే ఏ పేరునూ పేర్కొనడం లేదు. వాళ్ళు ఎవరూ పేరుకోసం ఈ పని చేయలేదు అని చెప్పాల్సిన అగత్యం లేదు.

కడుపునొప్పి కానీ లేదా పిత్తకోశపు రాళ్ళు కానీ నా దైనందిన పనులకు అడ్డు రాలేదు. వాటివల్ల నేను మంచం పట్టలేదు. నొప్పి ఉండేది అంతే.

నొప్పితో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాను.

6. పురస్కారాలు

నేను కలలో కూడా చూడలేని వాటిని నిజ జీవితంలో చాలా చూశాను. వాటిలో పురస్కారాలు ఒకటి. రాజ్యోత్సవ ప్రశస్తి (రాష్ట్రావతరణ పురస్కారం) నాకు మొదట లభించిన పురస్కారం. ఒక రోజు సాయంత్రం కాలేజీ ఆవరణలో బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. ఒకతను వచ్చి కాగితం ఇచ్చి వెళ్ళాడు. చదివాను. ఆ సంవత్సరపు రాష్ట్ర పురస్కారం నాకు ప్రభుత్వం ఇచ్చిందని తెలిసింది. ఆశ్చర్యం కలిగింది. నాకు తెలిసినట్లు నా గురించి ప్రభుత్వం ఎటువంటి సమాచారమూ కోరలేదు. పురస్కారం కావాలని ఎప్పుడూ నేను ఎవరినీ అడగలేదు. ఆ పురస్కారం వచ్చింది 1969లో. అప్పుడు నేను ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను.

1984వ సంవత్సరం జనవరి నెల మొదటి వారం అనుకుంటాను. ఒక ఆదివారం మధ్యాహ్నం గదిలో చదువుకుంటూ కూర్చున్నాను. కర్ణాటక ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శ్రీ టి.ఆర్.సతీశ్చంద్రన్ గారు ఫోన్ చేసి “మీకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. మీ అనుమతి కావాలి” నేను తబ్బిబ్బు అయ్యి “థ్యాంక్స్” అన్నాను. అంతే మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. “ఇదేమిది. నాకు పద్మభూషణ్, కేంద్ర ప్రభుత్వం నుండి, ఇది సాధ్యమా? ముఖ్య కార్యదర్శి పేరుమీద తమాషా చేయడానికి ఎవరైనా నాకు ఫోన్ చేసి ఉండవచ్చు” ఇలా చాలా నిమిషాలు ఆలోచించాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. రెండు మూడు రోజులకొకసారి దీని ఆలోచన వస్తూ ఉండేది. ఈ వార్త అబద్ధమైనా నాకు నిరాశ కలగకుండా ఉండేలా నా మనసును దిద్దుకున్నాను. 1985 జనవరి 25 రాత్ర్రి సుమారు 11 గంటలకు ‘ప్రజావాణి’ పత్రిక ఆఫీసు నుండి టెలిఫోన్ వచ్చింది. ‘పద్మభూషణ్’ నాకు వచ్చిన వార్తను తెలిపి అభినందించారు. అధికారికంగా అప్పుడే నాకు మొదటిసారి తెలిసింది. అంతకు ముందు భారత ప్రభుత్వం వ్రాసిన ఉత్తరమూ నాకు చేరలేదు. ఉదయం మామూలుగా లాల్‍బాగ్ వాకింగుకు ఇంకేం బయలుదేరాలి అనుకుంటుండగా అభిందనలు తెలిపే ఫోన్లు ఒకటి తరువాత ఒకటి రావడం మొదలయ్యాయి. ఒక పూర్వ విద్యార్థి ఫోన్ చేసి “చాలా సంతోషం సార్, మీకు పద్మభూషణ్ వచ్చినందుకు” అని మనసారా అభినందిస్తూ “ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను సార్, ఏమీ అనుకోకండి” అన్నారు. “ఏమి కావాలన్నా చెప్పప్పా. నేను ఖండితంగా ఏమీ అనుకోను” అన్నాను. “సార్, పొద్దున నిద్రమబ్బులో డెక్కన్ హెరాల్డ్ మొదటి పేజీలో మీ ఫోటో చూసి మొదట గాభరా అయ్యింది” అన్నారు. నేను నవ్వుకుంటూ “అర్థమయ్యింది లేప్పా” అన్నాను. అతనికి గాభరా కావడం సహజమే. ఈ వయసులో నా ఫోటో డెక్కన్ హెరాల్డ్‌లో ముందు పేజీలో రావాలంటే ఒకటే కారణం అయి ఉండాలి అని అతడు నిర్ధారణకు రావడం సమంజసమే.

అదే మార్చ్ నెలలో పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించడానికి నా ఆప్తమిత్రుడైన శ్రీ ఎ.హెచ్.రామారావు గారితో కలిసి ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ ఒక దూరపు స్నేహితుడు దొరికారు. వారు కేంద్ర ప్రభుత్వం హోమ్ డిపార్ట్‌మెంటులో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. వారు నాకు వచ్చిన ‘పద్మభూషణ్ పురస్కార’పు కథను ఇలా చెప్పారు. “మీ రాష్ట్ర ప్రభుత్వం మీతో సహా నలుగురైదుగురికి ‘పద్మశ్రీ’ పురస్కారం కోసం భారత ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ పురస్కారాల చివరి ఎంపికను ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారే చేసేది. మీ బయోడేటాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పంపింది. శ్రీమతి ఇందిరాగాంధీగారు దానిని చదివి ‘పద్మభూషణ్’ అని వ్రాసి చిన్న సంతకం చేశారు. మీ రాష్ట్రం నుండి ఇంకెవరికీ ఏ పురస్కారాన్ని ఈ సంవత్సరం ఇవ్వలేదు. మీ పురస్కారానికి ఇందిరా గాంధీ గారే కారణం” అని చెప్పారు.

నాకైతే ఇది విని పరమాశ్చర్యమయ్యింది. నాకు జాతీయ పురస్కారం ఇప్పించండి అని ఎవరితోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఒక్క మాట కూడా ఆడలేదు. జాతీయ, కొంతమేరకు అంతర్జాతీయ కుతూహలాన్ని రేకెత్తించిన సత్యసాయిబాబా రాద్ధాంతంలో ఇందిరాగాంధీ గారు నా పేరు విని వుండవచ్చు. నా వైఖరిని మెచ్చి ఉన్నా మెచ్చి ఉండవచ్చు. ఇదంతా ఒకరకంగా ఊహాపోహలు మాత్రమే. అదీ నివృత్తి పొంది అజ్ఞాతవాసంలో ఉన్న నాకు ఏక్‌దమ్ ‘పద్మభూషణ్’ ఇచ్చింది నాకు జీవితంలో జరిగిన అత్యాశ్చర్యకరమైన సంఘటనలలో ప్రముఖమైనది.

1962లో స్థాపించిన బెంగళూరు సైన్స్ ఫోరమ్ రజతోత్సవాలను 1987లో జరుపుకున్నాము. దాని జ్ఞాపకార్థమై Science, Non-Science and the Paranormal అనే పుస్తకాన్ని ప్రకటించాము. ఇది వ్యాసాల సంకలనం. అమెరికా దేశంలో Committee for the Investigations of the Claims of the Paranormal (ప్రకృతి అతీతమైన సంఘటనలను శాస్త్రీయంగా పరిశోధించే సమితి) అనే ప్రఖ్యాత సంస్థ ఉంది. దాని ఉద్దేశం ఆ సంస్థ పేరులోనే ఉంది. ఆ కమిటీలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు, దార్శనికులు, సామాజికశాస్త్రవేత్తలు, మెజీషియన్లు, మానసిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ ప్రధాన కమిటీ కొన్ని ఉప కమిటీలను నియమించుకుంది. సంఘటనకు తగిన ఉపకమిటీ సభ్యులను పరీక్షకోసం పంపుతుంది. ఆ ఉపకమిటీ కూడా నిష్ఠతో ఏవిధమైన ముందు సమాచారం ఇవ్వకుండా వార్తలలో వచ్చిన ఆ సంఘటనను పరిశీలించి ప్రజల అవగాహన కోసం తాము చేసిన పరిశోధన వివరాలను ప్రకటిస్తుంది. ఇలాంటి సమాచారాన్ని మరియు మరిన్ని హేతుబద్ధమైన రచనలను ఆ సంస్థ స్కెప్టికల్ ఇంక్వైరర్ అనే త్రైమాస పత్రికలో ప్రచురిస్తుంది. ఈ సంస్థ సుమారు 20 సంవత్సరాల క్రిత్రం స్థాపించబడింది. ఈ సంస్థ భూత పిశాచాలు, జ్యోతిషం, బర్ముడా ట్రైయాంగిల్, యు.ఎఫ్.ఓ.లు, నిప్పుమీద నడవడం, బూటకపు వైద్యులు, హస్త సాముద్రికం, అతీంద్రియ ధ్యానం మొదలైన అనేక విషయాలపై పరీక్షలు చేసి ప్రజలకు ఉపకారం చేసింది.

‘సైన్స్, నాన్సైన్స్ అండి ది ప్యారా నార్మల్’ అనే ఈ పుస్తకం స్కెప్టికల్ ఇంక్వైరర్ పత్రికనుండి ఎంపిక చేసిన వ్యాసాలను, మరియు సత్యసాయిబాబా గారికీ నాకూ జరిగిన ఘర్షణ, శివబాలయోగి గారి ఓటమి, జ్యోతిషము మొదలైన ఐదారు వ్యాసాల సంకలనం. స్కెప్టికల్ ఇంక్వైరర్ నుండి వ్యాసాలను తీసుకున్నందువల్ల మేము 20 ప్రతులను ప్రధాన కమిటీ అధ్యక్షులకు, ఆ పత్రిక సంపాదకులకు, ఇంకా నలుగురైదుగురు ముఖ్యులకు పంపాము. ఇది జరిగిన సుమారు నెల రోజులకు నన్ను ఆ ముఖ్య కమిటీకి ఫెలో (Fellow)గా ఎన్నుకున్నట్లు దాని అధ్యక్షుల నుండి ఉత్తరం వచ్చింది. అది ఒక విశిష్టమైన, అపూర్వమైన గౌరవం. నేను భారతదేశపు ఏకైక ఫెలో- ప్రతినిధిని. ఆ పుస్తకంలో నా వ్యాసాలను చదివిన తరువాత మరియు మా కమిటీ నడిపిన మాయమంత్రాలపై జరిపిన పరీక్షలు, నా శాస్త్రీయ దృక్పథం ఇవన్నీ తెలుసుకుని ఇలాంటి గౌరవానికి నేను పాత్రుడినని నిర్ధారించి ఉండవచ్చు.

నేను మొదటి నుండీ, అధ్యాపకుడిగా ఉన్నప్పటి నుండీ నాటకాలకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తూ వచ్చాను. మా నేషనల్ కాలేజీ నాటకాల కాలేజీ అని పిలువబడే విధంగా మా కాలేజీ నాటకాలను ఆడటంలో ప్రసిద్ధి చెందింది. ఉపకులపతి అయినప్పుడు విశ్వవిద్యాలయంలో నృత్య, నాటక, సంగీత విభాగాలను ప్రారంభించాము. నేను మా సంస్థ అధ్యక్షుడిని అయిన తరువాత మా పాఠశాల, కళాశాలలలో నాటకం ఆడటానికి అన్నివిధాల సౌకర్యాలను, ప్రోత్సాహాన్ని ఇస్తూ వచ్చాము. నాటకమూ ఒక విధమైన విద్య అని నా ఖచ్చితమైన అభిప్రాయం. వీటన్నింటినీ గమనించి కర్ణాటక నాటక అకాడమీవారు నాకు ఫెలోషిప్‌ను 1990లో ఇచ్చారు.

విద్యారంగంలో అనేక సంవత్సరాలుగా చేస్తున్న పనికి గుల్బర్గా విశ్వవిద్యాలయం నాకు డాక్టరేట్, డి.లిట్‌ను ఇచ్చింది.

నేను 1942వ సంవత్సరంలో గాంధీజీ మొదలు పెట్టిన ‘క్విట్ ఇండియా’ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం వహించిన వివరాలు ముందే తెలిపాను. సుమారు 9 నెలలు బెంగళూరు, మైసూరు, యరవాడ జైళ్ళలో కారాగార వాసాన్ని అనుభవించాను. దానికోసం తామ్రపత్రం అనే అమూల్యమైన పురస్కారాన్ని కేంద్రప్రభుత్వం నాకు ఇచ్చింది.

డి.దేవరాజ్ అరసుగారు మన రాష్ట్రపు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి వెనుకబడిన వర్గాల అభివృద్ధి పట్ల ఎక్కువ కలవరం ఉండేది. వారి జ్ఞాపకార్థం పేదలకు, వెనుకబడిన వారికి, గ్రామీణ ప్రజలకు వివిధ రంగాలలో సేవ చేసినవారికి ‘దేవరాజ్ అరస్ ప్రశస్తి’ అనే వార్షిక పురస్కారాన్ని ఇస్తారు. పురస్కారంతో పాటు ఒక లక్ష రుపాయల ధనము ఇస్తారు. నేను ముఖ్యంగా కోలార్ జిల్లాలోని ఊళ్ళలో, మా సంస్థ ద్వారా పాఠశాల, కళాశాలలను స్థాపించి, కొంత పనిచేయడాన్ని గమనించి 1994వ సంవత్సరం ‘దేవరాజ్ అరస్ ప్రశస్తి’ని నాకు ఇచ్చారు. ఆ ఒక లక్షరూపాయలు నేను పుట్టినవూరు హోసూరు గ్రామంలోని నేను ఎనిమిది సంవత్సరాలు చదివిన ప్రభుత్వ మోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాలకు ఇచ్చాను. మా ఏ నేషనల్ హైస్కూల్, నేషనల్ కాలేజీలకు ఈ ధనాన్ని ఇవ్వకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. నేను చదివిన ఒక బీదపాఠశాలకు ఈ ధనాన్ని ఇవ్వడం కొందరికి సంతోషాన్ని కలిగించింది. దేవరాజ్ అరస్ పురస్కారం లభించినప్పుడు నా స్నేహితులూ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మాధికారి అయిన శ్రీ వి.ఆర్.నాయుడు గారు తమ నలుగురైదుగురు స్నేహితులతో కలిసి వచ్చి నన్ను అభినందించారు. అలాగే మాట్లాడుతున్నప్పుడు ‘నిన్న ప్రజావాణి మొదటి పేజీలో మీ ఫోటో చూసి కొంచెం గాభరా అయ్యింది’ అని చెప్పారు. నాకు ‘పద్మభూషణ్’ వచ్చినప్పుడు నా విద్యార్థికి 10 సంవత్సరాల క్రింద డెక్కన్ హెరాల్డ్ పత్రిక మొదటి పేజీపై నా ఫోటో చూసి కలిగిన గాభరా కన్నా నాయుడుగారికి ఎక్కువ కంగారు పడి ఉండవచ్చు.

ఇన్ని పురస్కారాలు అనాయసంగా, అయాచితంగా వస్తాయని నేను కలలో కూడా అనుకోలేదు. ఏదైనా కానీ అనాయాసంగా వస్తే దానికి విలువ తక్కువ. పురస్కారాల కోసం, ఇంకా ఉన్నత పదవులు పొందడానికి ఎంత ప్రయత్నాలు చేస్తారు అనే విషయం నాకు చూచాయగా తెలుసు. అయితే నేను ఉపకులపతులను నియమించే నాలుగైదు కమిటీలలో సభ్యుడిని ఐనప్పుడు దీని తీవ్రత తెలిసివచ్చింది. ఎన్ని సిఫారసు లేఖలు, టెలిగ్రామ్‌లు, ఒత్తిడులు! ఒక ఉపకులపతి నియామక కమిటీ సభ్యునిగా ఉన్నప్పుడు 50 కన్నా ఎక్కువ టెలిగ్రాములు వచ్చాయి. అన్నీ ఒకే విధమైనవి. వీటన్నిటికీ మూలం అభ్యర్థి అని చెప్పనవసరం లేదు. ఉన్నతాధికారులనుండి, మంత్రివర్యులనుండి విపరీతమైన ఒత్తిడి.

నేను కర్ణాటక రాష్ట్ర పురస్కారాల కమిటీలో ఉన్నప్పుడూ నాకు ఇదే అనుభవం. ముందు అనుభవం కన్నా ఈ అనుభవం కొంచెం ఎక్కువ తీవ్రంగా ఉంది. న్యాయంగా కమిటీకి ఎటువంటి సిఫారసు పత్రాలను ఎవరూ పంపకూడదు. కమిటీయే స్వప్రయత్నంతో వెదికి యోగ్యులను ఎన్నుకోవాలి. అయితే ఇది వాస్తవంగా కుదరని పని. రాష్ట్రంలోని ఏ మూలలో ఎంతెంత ప్రతిభావంతులున్నారో అని ఎంత సమర్థవంతమైన కమిటీకి అయినా కనిపెట్టడం సాధ్యం కాదు. అందువల్ల అభ్యర్థులే తమ విజయాలను కమిటీకి పంపి వారి దృష్టిని ఆకర్షించడంలో తప్పు లేదు. అయితే నలుదిక్కుల నుండి అసహ్యకరమైన రీతిలో ఒత్తిడి తీసుకురావడం సభ్యతాలక్షణం కాదు. ఈ నేపథ్యంలో నాకు వచ్చిన పురస్కారాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అసలు పురస్కారాలనే ఇవ్వకూడదు, అదొక చెడ్డ సాంప్రదాయం అని ఒందరు అభిప్రాయపడతారు. నేను ఒప్పుకోను. ప్రతిభను, విజయాలను గుర్తించి మంచి పని చేస్తున్నారు అని చెప్పడమే పురస్కార ప్రదానాల ముఖ్య ఉద్దేశం. అలాంటి పురస్కారాలను వినయంతో స్వీకరించి తమ కార్యరంగంలో ఇంకా ఉత్సాహంతో పనిచేస్తే ఆ పురస్కారం ఇచ్చినందుకు సార్థకత చేకూరుతుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here