‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -25

0
9

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

7. పితూరి

1974వ సంవత్సరం. అప్పుడు నేను ఉపకులపతిగా ఉన్నాను. మా కాలేజీకి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి “ఒక సంస్థ, మన విద్యాసంస్థలను తమ వశంలోనికి తీసుకునే ఉద్దేశంతో సుమారు 170 మందిని జీవిత సభ్యులుగా చేర్చారు” అని చెప్పారు. నాకు ఎడద కొట్టుకుంది. గాంధీమార్గంలో స్ఫూర్తిని పొందిన మా నేషనల్ హైస్కూలు, నేషనల్ కాలేజీలు అనేకమంది అనేక దశాబ్దాలు త్యాగం చేసి కట్టిన సంస్థలు. అప్పుడు జీవితసభ్యుడు కావడానికి 100 రూపాయలు కడితే చాలు. సభ్యత్వ రుసుము ఎక్కువేమీ కాదు. అయినా సామాన్యంగా ఎవరూ స్వేచ్ఛగా జీవితసభ్యుడు కావడానికి ముందుకు వచ్చేవారు కాదు. మేమే కొంత బలవంతం చేసి సభ్యులను చేర్చుకునేవాళ్ళం. అలాంటిది 170 మంది ‘అభిమానుల ఆకస్మిక సృష్టి’ ఉద్దేశం సుస్పష్టంగా ఉంది. ఈ సభ్యులంతా కొంచెం అటూఇటూ ఒకే మనోభావం ఉన్నవారే, ఒకే సంస్థలోని వారే. ఈ సభ్యులను చేర్చడంలో మా ఒకరిద్దరు అధ్యాపకులు మరియు అధికారులు ప్రముఖ పాత్రవహించి పన్నాగం పన్నారు. సాంకేతికంగా దీనిని ఎవరూ విరోధించడానికి కాలేదు. ఎవరు కావాలన్నా 100 రూపాయలు చెల్లించి జీవిత సభ్యులు కావచ్చు. అయితే ఇది దురుద్దేశంతో చేసిన కుట్ర. కానీ నేషనల్ హైస్కూల్, నేషనల్ కాలేజీలపైన నాకున్న అభిమానం, ప్రేమ, విశ్వాసాలను అంచనావేయడంలో వాళ్ళు తప్పు చేశారు.

నేను ఉపకులపతి అయ్యాక ఇక నేను సంస్థకు తిరిగిరాను అని ఆ కుట్ర పన్నిన వారి లెక్కాచారం. అయితే బెంగళూరు వదిలి ఇంకే విశ్వవిద్యాలయానికి ఉపకులపతి కావడానికి ఆహ్వానం వస్తే నేను దానిని ఒప్పుకునే సంభావ్యత చాలా తక్కువగా ఉండేది. నేను ఉపకులపతి అయిన 2-3 సంవత్సరాల తరువాత గవర్నర్ పదవి నియామకానికి పరోక్షంగా నన్ను ప్రస్తావించారు. అది నాకు ఇష్టం లేదని మా సంస్థలలోనే చివరిదాక పని చేసుకుంటూ ఉంటానని చెప్పాను. 1983వ సంవత్సరం నడచిన మా నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశాని (General Body Meeting) కి నేను హాజరు కాలేదు.

నేను సొసైటీ ‘ఎ’ క్లాస్ సభ్యుడిని అయినందువల్ల ఆ సమావేశానికి హాజరు కావచ్చు. నా సంస్థ నియమావళి ప్రకారం ‘ఎ’ మరియు ‘బి’ క్లాస్ సభ్యులు తమకు ఇష్టం ఉంటే పాలక వర్గం (Governing Council) సభ్యులూ కావచ్చు. అయితే ఆ సంవత్సరం మీటింగుకు వెళ్ళలేదు మరియు పాలకవర్గం సభ్యుడు అయ్యే కోరికనూ వ్యక్తం చేయలేదు. 1984వ సంవత్సరపు సర్వసభ్య సమావేశం నుండి 10 మంది సభ్యులను పాలకవర్గానికి ఎన్నుకోవాలి. ఆ సమావేశానికి హాజరు కావాలని కాలేజీ ఆవరణకు వచ్చాను. అన్నీ కొత్తముఖాలు. మధ్య వయస్కులు. ఆ అందరు కొత్త సభ్యులు సభకు వచ్చినట్లు ఉన్నారు. ఆ 170 మందికి నాయకులు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు. నేను లోపలికి వచ్చిన వెంటనే “చూడండి సార్. మేము 10 మంది పాలక వర్గం సభ్యులుగా పోటీ చేస్తున్నాము” అని చెప్పి ఆ పది మంది పేర్లున్న చీటీని నాకు ఇచ్చారు. నేను విని మౌనంగా ఉన్నాను. ఆ సర్వసభ్య సమావేశానికి ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారు. నేను 1946 నుండి ఇటువంటి సమావేశాలకు హాజరవుతున్నాను. అయితే ఇంతవరకూ అంతటి బృహత్ సభను నేను చూడలేదు. కార్యకలాపాలపై ప్రతిక్రియ వ్యక్తం చేయవలసిన సందర్భంలో సామూహిక ప్రతిక్రియ కనిపించింది. అంటే సమావేశానికి వచ్చే ముందే ఆ 170 మంది స్థూలంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుని వచ్చారు అనిపిస్తుంది. ఆ ఆవరణలో 1935లో విద్యార్థిగా, 1946లో అధ్యాపకుడిగా ప్రవేశించిన నాకే ఆ రోజు బయటివాడిని, అపరిచితుడిని అనే భావన కలిగింది. సభ కార్యకలాపాలను జాగ్రత్తగా పరిశీలించాను. పదిమంది సభ్యుల ఎంపిక కోసం మామూలుగానే పూర్వం ఉన్న 10 మంది కూడా పోటీ పడ్డారు. వారిలో ఎక్కువభాగం చాలా దశాబ్దాల నుండీ సభ్యులుగా ఉన్నవారు, నిష్ణావంతులైన అధ్యాపకులుగా సేవ సల్పిన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. జనరల్ బాడీ మీటింగ్ ముగిసిన వెంటనే ఓటింగ్ మొదలయ్యింది. నేను నా ఓట్లను వేసి అక్కడి నుండి నా ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రం సుమారు నాలుగు గంటలకు ఇద్దరు అధ్యాపకులు వచ్చి “ఆ వైపు 10 మందీ గెలిచారు, మనవాళ్ళంతా ఓడిపోయారు” అని విచారంగా చెప్పారు. తలమీద చెయ్యి పెట్టుకుని చింతాక్రాంతులయి కూర్చున్నారు. “ఎందుకు ఆలోచిస్తున్నారు. The fight has begun – పోరాటం మొదలయ్యింది” అన్నాను.

గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిని కావాలని నియమాల ప్రకారం నా అపేక్షను వ్యక్తం చేశాను. కొత్తగా ఏర్పడిన గవర్నింగ్ కౌన్సిల్ నిండి ఉంది. ఎ మరియు బి క్లాస్ సభ్యులలో ఎక్కువమంది గవర్నింగ్ కౌన్సిల్‌కు ఈ పరిస్థితులలో సభ్యులయ్యే కోరికను వ్యక్తం చేయమని మేము కొందరు సభ్యులకు విన్నపం చేశాము. అప్పటి నియమాల ప్రకారం అప్పుడున్న ఐదు సంస్థల ముఖ్యులు మరియు ఒక సంస్థ నుండి ఒక ఉపాధ్యాయుడు పాలకమండలి సభ్యులు. ఆ పాలక వర్గంలో వెనుక ఉన్నవారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఉప కమిటీలు చేసినప్పుడు వారు ఎవరూ వాటిలో రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. హాస్టల్ కమిటీలో మాత్రం ఒక సభ్యుడు ఉన్నట్టు ఉంది. ఒక సంవత్సరం గడిచింది. ఆ పది మంది ఉత్సాహం తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారి పప్పులు ఇక్కడ ఉడకలేదు. 1985 జనరల్ బాడీ మీటింగులో వారెవరూ పోటీ చేయలేదు. కొత్తగా ఏర్పడిన గవర్నింగ్ కౌన్సిల్ నుండి ఆ సంవత్సరపు ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవాలి. ఈ సందర్భంలో నేను అధ్యక్ష స్థానానికి నిలుచోవాలని, అప్పుడు గత సంవత్సరం జరిగినటువంటి ప్రతికూల సంఘటనలను ప్రభావవంతంగా ఎదుర్కోవచ్చని చాలామంది ఉపాధ్యాయులు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఒత్తిడి పెట్టారు. నేను అంగీకరించాను. నూతనంగా ఏర్పడిన మొదటి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అధ్యక్ష స్థానానికి నా పేరును ఒక సభ్యుడు సూచించారు. వెంటనే సీనియర్ సభ్యులలో ఒకరూ, నేషనల్ హైస్కూలు పూర్వ విద్యార్థి, ప్రజాక్షేత్రంలో ప్రముఖ స్థానం పొందిన ఒక సభ్యులు న్యాయపరమైన ఒక అడ్డంకిని సభ ముందు ఉంచారు. వారి వాదన ఇలా ఉంది – “నరసింహయ్య గారు ఇప్పుడు విశ్వవిద్యాలయపు ఉపకులపతులు. మన కాలేజీ విశ్వవిద్యాలయంలో ఒక భాగం. అలాంటి వారు మన సంస్థకు అధ్యక్షులు కావడం న్యాయబద్ధమైనదేనా?” దీనిని నేను ఊహించలేదు. అదీ ఆ సభ్యుడు ఇలాంటి ఒక అడ్డంకిని సభ ముందు పెడతారని అనుకోలేదు. వారు చెప్పింది సదుద్దేశంతోనో, లేదా దురుద్దేశంతోనో అనేది నాకు తెలియలేదు. వారి ప్రశ్న నుండి తలెత్తిన ఆ సందిగ్ధ స్థితిలో “ఇది గవర్నింగ్ కౌన్సిల్ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ సమస్య కాదు. ఇది నా సమస్య. నేను ఉపకులపతి మరియు ఈ సంస్థ అధ్యక్షుడు ఏకకాలంలో కాకూడదు అని ప్రభుత్వం నుండి లేదా విశ్వవిద్యాలయం నుండి న్యాయబద్ధమైన ఆక్షేపణ వస్తే నేను ఈ రెండింటిలో ఒకదానిని ఎన్నుకుంటాను, మరొకదానిని వదులుకుంటాను” అని బదులు చెప్పాను. ఇది తర్కబద్ధంగా ఉంది. దీనిని ఎవరూ ఆక్షేపించేలా లేదు. ఏకగ్రీవంగా అధ్యక్షుడినిగా ఎన్నుకోబడ్డాను. ఒక నేషనల్ హైస్కూలు పూర్వవిద్యార్థి మొదటిసారి సంస్థ పాలక మండలి అధ్యక్షుడు అయిన గౌరవం నాకు దక్కింది. అప్పటి నుండీ ఏ ఆటంకం లేకుండా చక్కగా సంస్థల పాలన నడుస్తూ వస్తున్నది.

8. నా వాహనాలు

నా మొదటి వాహనం సైకిల్. కాలేజీ ఉపాధ్యాయుడైన ఒకటి రెండు సంవత్సరాలకు ఒక సైకిల్‌ను కొనుక్కొని ఉపయోగించడం మొదలు పెట్టాను. నేను అమెరికాకు విద్యాభ్యాసానికి వెళ్ళేవరకూ ఆ వాహనం ఉండేది. వాపసు వచ్చే సమయానికి ఆ సైకిల్ మాయమయ్యింది. ఎవరు మటుకు ఆ సైకిల్‌ను మూడు సంవత్సరాలు కాపాడతారు? నేను సైకిల్‌ను ఉపయోగించిన 7-8 సంవత్సరాలలో ఒక్క ప్రమాదమూ జరగలేదు.

తరువాత బస్ నాకు వాహనమయ్యింది. బెంగళూరులో ఒక చోటి నుండి మరొక చోటకు వెళ్ళాలన్నా అదే. ఇక్కడినుండి మిగిలిన ఊర్లకు వెళ్ళాలన్నా సహజంగా అదే వాహనం. ఆటోరిక్షా వచ్చిన తరువాత బెంగళూరులో సామాన్యంగా ఆటోరిక్షానే నా వాహనం. దీనిని నేను చాలా అవసరమైతేనే ఉపయోగిస్తాను. దగ్గరున్న స్థలాలకు నడుచుకుని వెళతాను. ఒక సారి మా కాలేజీకి రెండు కి.మీ.దూరంలో ఉన్న ఒక విద్యాసంస్థ వారు వచ్చి వారి కార్యక్రమానికి ఆహ్వానించారు. “మీరు రావడానికి ఏ వాహనం పంపమంటారు” అని అడిగారు. నేను అలాగే కొన్ని సెకెన్లు గాఢంగా ఆలోచిస్తున్నట్లు నటించి “దయచేసి ఒక హెలికాప్టర్ పంపండి” అన్నాను. వారు నవ్వారు. “ఏ వాహనమూ వద్దు. నా వాహనంలోనే వస్తాను” అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాను. స్వాగతోపన్యాసంలో దీనిని ప్రస్తావించారు.

బెంగళూరు నుండి గ్రామాంతర ప్రదేశాలకు వెళ్ళాలంటే బస్సు లేదా రైలు. అన్నిచోట్లకూ రైలు ఉండదు. ఉన్నా కొన్ని రకాలుగా అసౌకర్యం ఉండవచ్చు. అందువల్ల సామాన్యంగా బస్సే నా వాహనం.

అనేకసార్లు మా ఊరైన హోసూరుకు పోయి, మరుసటి రోజు ఉదయం బెంగళూరుకు వాపసు వచ్చేవాణ్ణి. హోసూరు నుండి గౌరీబిదనూరు 10 కి.మీ. ఎన్నో సార్లు ఉదయం హోసూరు వదిలి గౌరీబిదనూరు నుండి బెంగళూరుకు ఉదయం 7.30 గంటలకో లేదా 8 గంటలకో వదిలి బస్సులో వాపసు వచ్చాను.

సుమారు ఐదు సంవత్సరాల క్రితం గౌరీబిదనూరు నుండి బస్సు దొరకని కారణంవల్ల ఒక లారీలో రావలసి వచ్చింది. ఆ అనుభవాన్ని మరచిపోలేను. డ్రైవర్ పక్కన ఒకడు. అతని పక్కన నేను. నా ఎడమవైపు ఇంకొకడు. కుడివైపు అతను నిరంతరంగా బీడీ తాగుతున్నాడు. ఎడమవైపు వాడు సిగరెట్టు. ఆ రెండు జ్యోతులు ఆరనే లేదు. వారికి ఎంతచెప్పినా వారు వినిపించుకోలేదు. ఆ లారీ ఆంధ్రా నుండి వచ్చింది. నా పేరును కూడా వారు అడగలేదు. నన్ను వారు లారీలో కూర్చోబెట్టుకుని వచ్చిందే ఒక మెహర్బానీ అని వారి ఉద్దేశం కావచ్చు. మరోసారి బాగేపల్లి నుండి బెంగళూరుకు ఒకరోజు సాయంత్రం రావలసి వచ్చింది. ఆంధ్రాలోని కదిరి నుండి బస్సు బయలుదేరి బాగేపల్లి గుండా బెంగళూరును చేరుతుంది. కదిరి నుండి వచ్చిన బస్సులో జనం నిండిపోయారు. చాలామంది నిలబడి ఉన్నారు. నిలుచోవడానికి కూడా జాగా లేదు. ఎలాగో ప్రయాసతో లోపలికి తోసుకుని పోయి ఊపిరాడని ఆ గుంపులో నిలబడ్డాను. ఆ రోజు బాగేపల్లి నుండి బెంగళూరు వరకూ నిలబడే వెళ్ళాను. నన్ను గుర్తించేవారు ఎవరూ లేరు. ఎవరైన ఉండివుంటే కూర్చోవడానికి సీటును సాధారణంగా ఇచ్చేవారు.

గ్రామీణ బస్సులు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. 100 మందికి తక్కువ జనం ఉండేవారు కాదు. 150 మంది ప్రయాణీకులు ఉన్నా ఎక్కువేమీ కాదు. వారిలో చాలామంది బస్సు పైకి కూడా ఎక్కి కూర్చుంటారు. ఇది ప్రయాణీకులకు చాలా అపాయం. ఎన్నోసార్లు గౌరీబిదనూరు హోసూరు బస్సులలో బస్సుపైన చాలా మంది కూర్చుని ఉంటారు. అలాంటి సందర్భంలో నేను హోసూరుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కండక్టర్‌తో “మీరు నన్ను వి.ఐ.పి. అని భావించి ఎగువ సభకు (బస్సు పైకి) పంపకండి” అని తమాషాగా అన్నాను. దానికి అతడు “ఎక్కడైనా ఉందా సార్. మీరు ఎగువ సభ (విధాన పరిషత్) సభ్యులు కావచ్చు. అయితే బస్సులో మిమ్మల్ని ఎగువ సభకు పంపేది లేదు” అని తమాషాగా బదులిచ్చాడు.

మొదటిది బస్సుల టైమింగ్స్ అనిశ్చితం. చాలా సేపు వేచివుండాలి. రెండవది బస్సు వచ్చినప్పుడు దానిలోనికి ప్రవేశించడం చాలా సాహసకృత్యం. తోపులాట. క్యూ గ్యూ ఏమీ ఉండదు. శతాబ్దాలుగా వస్తున్న మన సాంప్రదాయానికి క్రమశిక్షణతో కూడిన క్యూ పద్ధతి విరుద్ధమైనది. ఏదో బలవంతంగానో, భయంతోనో క్యూలో నిలబడి ఉన్నా అది బస్సు వచ్చేవరకు మాత్రమే. బస్ వచ్చిన తక్షణం అంతా అల్లకల్లోలం. కుడివైపు, ఎడమవైపు ఉన్నవారిని పక్కకి తోసి యథాశక్తి కాళ్ళను తొక్కి ప్రవేశద్వారంలో ముగ్గురు నలుగురి మధ్యలో క్షణకాలం చిక్కుకుపోయి చివరకు బస్సులో నిలుచున్న జనసముద్రంలో చేరినప్పుడు ఒక విధమైన నిట్టూర్పు! ఏదో పోటీలో గెలిచినంత సంతోషం. ప్రపంచంలోని మిగిలిన దేశాలలో ఇలాంటి పోటీల ఊసే లేదు.

ఒకసారి ఇలాంటి పోటీలో నేను గెలిచాను. అంతగా చెప్పుకునే విజయం ఏమీకాదు. కన్సొలేషన్ ప్రైజ్ (కంటితుడుపు బహుమానం) లాంటిది. బస్సులో నిలబడే ప్రయాణం చేశాను. ముందు ఉన్న ఒక ప్రయాణీకుడు వెనుకకు తిరిగినప్పుడు నన్ను చూసి “ఎందుకు సార్, ఈ వయసులో కష్టపడతారు? ఈ బస్ ప్రయాణం మీలాంటి వారికి కాదు” అని బుద్ధి చెప్పారు. లోపలికి తోసుకుని వచ్చిన ఆయాసం తగ్గాక వారి హితవచనంపై దీర్ఘంగా ఆలోచించి బెంగళూరులో బస్సు ప్రయాణానికి ఇక స్వస్తి పలికాను.

నాకు బతుకుపై ఎక్కువ ఆశ. ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలన్న కోరిక. ఆటోరిక్షా ప్రయాణం వల్ల రెండు రకాలైన ప్రమాదాలు సంభవించవచ్చు. మొదటిది చేతులు కాళ్ళు విరగవచ్చు. రెండవది అక్కడే కొనఊపిరి వదిలివేయవచ్చు. చాలా సంవత్సరాలు బ్రతకాలన్న గట్టి కోరిక ఉన్నా, చేతులు కాళ్ళు విరుచుకుని ఎముకల వైద్యుని చేతికి చిక్కి దేహంలో నట్లు బోల్టులు వేయించుకుని బ్రతికేకన్నా అక్కడే ‘భగవంతుని పాదారవిందాన్ని’ చేరడమే మేలు అని నా అభిప్రాయం. వీటన్నింటినీ గమనంలో పెట్టుకుని ప్రమాదాలనుండి గట్టెక్కడానికి నాకు తోచిన అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటాను. ఆటోరిక్షా ప్రయాణం నాకు పలువిధాలైన అనుభవాలను తెచ్చిపెట్టింది. వెనుకకు తిరిగి నావైపు చూసుకుంటే ద్వాపరయుగంలో కృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తే కలియుగంలో అర్జునుడు కృష్ణునికే ఉపదేశించాడు.

ఆటోరిక్షా ఎక్కేకన్నా ముందే “కొంచెం నిదానంగా నడుపప్పా. ఇంకా 50 పైసలు ఎక్కువ ఇస్తాను. నాకు వయస్సయ్యింది. ఎత్తివేసేదాన్ని తట్టుకోలేను” అని ఒకసారి చెప్పాను. “స్వామీ ఊరికే కూర్చోండి. మీలాంటివారివల్లే ఆక్సిడెంట్ అయ్యేది. ఎక్కకముందే అపశకునం” అని కోపపడి బండిని స్టార్ట్ చేశాడు. మరొకసారి ఇంకో డ్రైవర్ “స్వామీ నిశ్చింతగా కూర్చోండి. ఏమీ భయపడకండి. జరిగేదాన్ని తప్పించడం సాధ్యపడదు. అంతా తలరాత. పోవాలని ఉంటే ఎంత నిదానంగా నడిపినా జరిగే ప్రమాదం జరుగుతుంది. ఇంటిలో పడుకున్నా ఆయుష్షు ముగిస్తే అలాగే పోతుంది” అని అనర్గళంగా ఈ ధర్మభూమిలో పుట్టిన వారి రక్తంలో ఇంకిపోయిన కర్మసిద్ధాంతాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ప్రమాదానికి మనం కానీ, వేగం కానీ కారణం కాదు. ఇదంతా విధిలిఖితం అనే అపాయకరమైన సిద్ధాంతం విని నాకు ఇంకా భయమయ్యింది. ఆ వేదాంతి బారి నుండి క్షేమంగా బయటపడితే పునర్జన్మ ఎత్తినట్లే అనుకుని ఇక ఎక్కువ మాట్లాడకుండా నా గుండెను గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాను.

మరో ఆటోరిక్షా చాలకుడు “అయ్యో! కూర్చోండి స్వామీ. మీకు ఒక్కరికే జీవితం మీద ఆశ ఉంది అని అనుకోకండి. మాకూ ఉంది. మాకూ పెళ్ళాం పిల్లలు ఉన్నారు” అని సమాధాన పరిచాడు. “నాకు ఏ పెళ్ళాం పిల్లలు లేరప్పా. మీకు ఉన్నారనే వారి యోగక్షేమానికై నేను మీకు హెచ్చరిక చేశాను” అని చెప్పాను.

ఒకసారి విధానసౌధ బయట ఆటో కోసం వెదుకుతున్నాను. దూరంగా వెళుతున్న ఒక ఆటో డ్రైవర్ నా దగ్గరకు వచ్చాడు. “ఏం సార్, మీరు నరసింహయ్య గారు కదా? ఆటో కావాలా? ఎక్కడకు వెళ్ళాలి?” అని వినయంగా అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెనుకటి చేదు అనుభవాల కన్నా ఇది మరీ విభిన్నమైన అనుభవం. “బసవనగుడి నేషనల్ కాలేజీకి వెళ్ళాలప్పా” అన్నాను. “కూర్చోండి” అన్నాడు. “ఏం సార్, మీరు వైస్ ఛాన్స్‌లర్ అయ్యారు, ఎం.ఎల్.సి.గా ఉన్నారు. ఒక కారు పెట్టుకోవడానికి కాదా? ఈ వయస్సులో ఈ ఎండలో ఆటో కోసం వెదుకుతున్నారు. ఎలాంటెలాంటి.. కొడుకులో కారు పెట్టుకున్నారు” అని తన ఆగ్రహాన్ని, జాలినీ వ్యక్తం చేశాడు. “నాకు అవసరమూ లేదు. నా దగ్గర డబ్బూ లేదప్పా” అన్నాను. “ఇది అయోగ్యులకే కాలం సార్. మీలాంటి వారికి కాదు” అని చెప్పి అదే ధాటిలో ముందుకు కొనసాగించి ప్రజాక్షేత్రపు గద్దెపై కూర్చున్న అందరు ‘సేవకులను’ నోటికి వచ్చినట్లు తిట్టుకుంటూ వచ్చాడు.

మహాలక్ష్మీ లేఔట్‌లో నా స్నేహితులొకరి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి రమ్మని చాలా రోజుల నుండి ఒత్తిడి తెస్తున్నారు. వారు తమ ఇంటి గుర్తు కోసం ఆ కాలనీలో ఉన్న ప్రసిద్ధమైన ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉంది అని చెప్పారు.

ఆటోరిక్షాలో వెళ్ళాను. ఆ కాలనీలోని ప్రవేశించాక ఆటో నిలిపి, అక్కడ నిలుచున్న ఒక యువకుని అడిగి స్నేహితుని ఇంటికి దారి తెలుసుకుందామని “ఏమప్పా, ఇక్కడి నుండి ఆంజనేయస్వామి దేవస్థానానికి ఎలా వెళ్ళాలి” అని అడిగాను. అతడు నన్ను కొంచెం సేపు అలాగే చూసి “మీరు నరసింహయ్యగారు కదా సార్” అన్నాడు. “ఔనప్పా” అన్నాను. “మీకూ ఆంజనేయస్వామి దేవస్థానానికి ఏమి సంబంధం?” అన్నాడు. నేను నవ్వుతూ “ఏమీ సంబంధం లేదప్పా. దాని దగ్గర మా స్నేహితుని ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళాలి” అన్నాను. “అలా చెప్పండి” అంటూ ఆ యువకుడు నాకు సరైన మార్గదర్శనం చేశాడు.

ఇక్కడ తెలిపిన ఘటనలలో కొంచెం విశేషముంది. మిగిలిన వందలాది (వేలాది అన్నా తప్పులేదు) ఆటోరిక్షా ప్రయాణాలు అన్నీ మామూలువే; కొంచెం ఎక్కువ తక్కువ వీటిలో అందరి అనుభవమూ ఒకటే. అదే మానవీయత, అదే మొరటుతనం, అవే బేరాలు. ఎంత చేదు అనుభవాలున్నా ఆటోలో ప్రయాణం చేయాల్సిందే కదా. అయితే అక్కడక్కడ మంచివారు, మానవత్వం ఉన్నవారు ఉన్నారని చెప్పడాన్ని నేను మరిచిపోను.

ఆటోరిక్షా ఎక్కి దిగేవరకూ నాకు ఎప్పుడూ ఆందోళనే. ఇంతవరకూ నా ‘తలరాత’ గట్టిగా ఉంది.

ఒకరోజు కాలేజీ ముందు నిలుచున్న ఆటో వైపు వెళ్ళాను. “రండి, రండి, కూర్చోండి” అని అపురూపమైన స్వాగతాన్ని ఆటో డ్రైవర్ పలికాడు. నేను ఆటోలో కూర్చున్నాను. “ఎక్కడికి వెళ్ళాలి మొరార్జీ దేశాయి గారూ” అంటూ లోకాభిరామంగా అడిగాడు. అంతకు ముందురోజే మొరార్జీదేశాయి మరణించారు. “నిన్ననే కదా మొరార్జీ దేశాయి దైవాధీనమయ్యింది. వారు వెళ్ళిన చోటికి ఇంత త్వరగా వెళ్ళడానికి నాకిష్టం లేదు” అని నేను వెళ్ళవలసిన చోటును చెప్పాను. “మీరూ మొరార్జీ దేశాయిలాగా టోపీ పెట్టుకున్నారు. అందుకే నేను అట్లా అన్నాను. మొరార్జీ దేశాయి నిన్ననే శివైక్యమయ్యారు” అన్నాడు. తరువాత అతడు “మీకు బసవణ్ణ వచనాలు తెలుసా సార్” అని అడిగాడు. “కొన్ని తెలుసప్పా” అన్నాను. అప్పుడతడు “నేను హుబ్లీ – ధార్వాడ వైపు వాణ్ణి. నా పేరు బసవరాజ్” అని చెప్పి హాయిగా బసవణ్ణ వచనాలను నావైపు చూస్తూ పాడసాగాడు. “దయచేసి ముందు చూసుకుని పాడప్పా. నీవు వెనుకకు తిరిగి నన్ను చూస్తూ పాడితే ఇద్దరమూ శివైక్యం అయ్యే సంభవముంది” అని చెప్పాను. “ఫరవాలేదు సార్. శివుడు కాపాడుతాడు” అని ముందు చూసుకుంటూ తన గానాన్ని కొనసాగించాడు.

బెంగళూరులో ప్రమాదాలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. నాకైతే ఈ వాహనాలను, అందులోనూ కొన్ని ప్రభుత్వ బస్సులు, లారీలను చూస్తే భయం. ఆటోలో వెళుతున్నప్పుడు ఎదురుగా బస్సు వస్తే “దయచేసి జాగ్రత్తగా వెళ్ళప్పా. ఎదురుగా యముడు వస్తున్నాడు” అని డ్రైవర్‌ను హెచ్చరిస్తాను. ఈ బస్సులకు రోడ్డు మీద వెళ్ళి వెళ్ళి బేజారయ్యి ఒక్కొక్కసారి ఫుట్‌పాత్ ఎక్కుతాయి. ఇక నా వంటి కాలిబాట పాదచారుల గతి అయినట్లే. నేను చాలా ఎక్కువగా నడుస్తాను. రోడ్లను దాటడమే కష్టం. “మీ జీవితంలో ఎత్తికనిపించే కొన్ని విజయాలను చెప్పండి” అని ఒక అభిమాని కొన్ని నెలల క్రితం అడిగారు. “ఇంతవరకూ బస్సుకు కానీ, ఆటో రిక్షాకు కానీ దొరకకుండా బ్రతికి ఉండడమే నా విజయాలలో ప్రముఖమైనది” అన్నప్పుడు వారు ఈ ఊహించని సమాధానాన్ని విని ఆశ్చర్యంతో నవ్వారు.

ఒకరోజు నేను విధానసౌధ వెళ్ళి అక్కడి నుండి కార్పొరేటర్ అయిన శ్రీ డి.వి.సత్యనారాయణ గారితో కాలేజీకి వెనుదిరిగాను. “సార్, మీరు బెంగళూరులో చాలా సంవత్సరాల నుండీ ఉన్నారు. బెంగళూరులో తప్పనిసరిగా చేయాల్సిన పనులను తెలపండి” అని అడిగారు. “నాకు అన్ని సమస్యలూ తెలియవు. అయితే నాకు సమీపంగా ఉండే రెండు సమస్యలను మాత్రం చెబుతాను. బెంగళూరులోని రోడ్లు పాడయిపోయాయి. నాకు సామాన్యంగా ఆటోరిక్షానే వాహనం. దానిలో వెళుతున్నప్పుడు అది ఎత్తివేసే రభసకు నా వెన్నెముక విరిగిపోయి అందులోని బిళ్ళలు ఊడిపోతున్నాయి” అన్నాను. “రోడ్డులను రిపేరీ చేయించడానికి ప్రయత్నిస్తాను” అన్నారు. “ఇంకొకటి ఏది సార్” అని అడిగారు. “ఇంకొకటి అంత కష్టమైన పని ఏమీ కాదప్పా. మీ కార్పొరేషన్ శవవాహనం ఎలా ఉంది? దానికన్నా ఊడిపోయే జట్కాబండి మేలు. దానికి పెయింట్ వేసి ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలియదు. దానిలో పడుకున్నవాడికి దానికన్నా ఎక్కువ కళ ఉంటుంది. పైగా దాని తలుపులకు గొళ్ళెం ఉండదు. దానిలో ఉన్నవారు ఎలాగూ తప్పించుకోలేరన్న ధైర్యం మీకు. అందుకే సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని అనుకుంటున్నాను. నేను ఇలాంటి వాహనాలలో చాలాసార్లు వెళ్ళాను. అయితే కూర్చుని మాత్రం. పడుకుని పోలేదు. మీ వాహనం ఇదే స్థితిలో ఉంటే నేను దీనిలో పడుకుని వెళ్ళడానికి చాలా బేజారవుతుంది. అందువల్ల మీరు మీ కార్పొరేషన్ శవవాహనాలను ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా చేయాలి. దానిని చూసిన తక్షణం చాలా సంతోషం కలగాలి. ఇలాంటి వాహనంలో ఎప్పుడెప్పుడు వెళతాను, ఆ రోజు త్వరగా రానీ అని నిరీక్షించేలా ఉండాలి. మీరు మీ వాహనాలను సరిచేసే వరకు నేను నా అంతిమ యాత్రను పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటాను” అని చెప్పాను. ఆ వాహనంలో ఉన్నవారంతా పడీపడీ నవ్వారు.

అదే నా జీవితం మొత్తంలో నిర్భయంగా ప్రయాణం చేసే చివరి వాహనం.

9. అంత్యక్రియలు

ముందే చెప్పినట్లు ఎస్.వెంకటాచలయ్యగారు మాధ్యమిక పాఠశాలలో నా గురువుగారు. వారి నుండి నేను ఎక్కువ నేర్చుకున్నాను. పైగా నా అభివృద్ధిపై వారికి ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు సుమారు 20 సంవత్సరాల క్రితం మా ఊరిలో మరణించారు. అప్పుడు నేను ఉపకులపతిగా ఉన్నాను. టెలిఫోన్ ద్వారా విషయం తెలిసింది. “నేను వచ్చేవరకూ వేచి ఉండండి” అని చెప్పి వెంటనే బయలుదేరి ఊరు చేరాను.

శవాన్ని ఇంటి నుండి నలుగురు శ్మశానానికి మోసుకు వెళ్ళారు. శవం వెనుక నాతో కలిపి ముగ్గురు నలుగురు ఉన్నాము. ఏమప్పా ఈ ప్రజలంతా ఏమైనారు అనుకున్నాను. మా ఊరు, మరియు చుట్టు పక్కల పల్లెలలోని విద్యావంతులలో అనేకులు వెంకటాచలయ్యగారి శిష్యులు. పైగా వారికి అనేకమంది అభిమానులున్నారు. వారంతా పత్తా లేరు. మనలో ఏమేమో అర్థంలేని నమ్మకాలు. శ్మశానానికి స్త్రీలు వెళ్ళడం నిషిద్ధం. తల్లి – తండ్రి ఉన్నవారు వెళ్ళరాదు. ఇంకెవరు వెళ్ళాలి? అనాథులైన మగవారికి మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉన్నట్టయ్యింది.

క్రైస్తవమతంలో శ్మశానానికి ఆబాలవృద్ధులూ వెళతారు. ప్రసిద్ధ దార్శనికుడు జీన్ పాల్ సార్త్రే గారి శవయాత్రలో పాల్గొన్న జనసమూహాన్ని చూసి ఒక పాత్రికేయుడు మొత్తం ప్యారిస్ నగరమే శవం వెనుక నడిచింది అని వార్త వ్రాశాడు.

ముస్లింలలో ఇంకొక మంచి పద్ధతి ఉంది. ముస్లింల శవం వెళుతున్నప్పుడు ఎవరైనా ముస్లిం ఎదురైతే వెంటనే వచ్చి శవానికి తన భుజం అందించి కొంత దూరం నడుస్తారు. ఒకసారి బెంగళూరు సిటీ మార్కెట్ సమీపంలో ముస్లిం శవం వెళుతున్నప్పుడు సర్ మిర్జా ఇస్మాయిల్ ఎదురయ్యారు. అప్పుడు వారు మైసూరు రాజ్యం దివాన్‌గా ఉన్నారు. తక్షణమే తమ కారు నుండి దిగి భుజం అందించి కొంత దూరం నడిచారు. ఆ శవం ఎవరిది అనేది ముఖ్యం కాదు. అది శ్రీమంతునిది కావచ్చు, అధికారిది కావచ్చు లేదా ఒక బికారిది కావచ్చు. ఏమైనా అది ముస్లిం శవం అనేది ముఖ్యం. అందువల్లనే ముస్లింలలో అంత ఐకమత్యం. సామాన్యంగా హిందూ సంప్రదాయాలే హిందూ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.

కొన్ని సంవత్సరాల క్రితం అద్వైతాన్ని తీవ్రంగా ప్రతిపాదిస్తున్న స్వామిగారు ఒకరు నిర్యాణం చెందారు. వారి శవాన్ని కూర్చోబెట్టి నుదుటికి విభూతి రాసి, తలకు కిరీటం పెట్టి ఊరిలో ఊరేగించారు. తరువాత వారిని సమాధి చేసే గొయ్యిలో పెట్టి టెంకాయలతో వారి కపాలం పగిలే వరకూ కొట్టారు. దీన్ని చదివి గుండె కొట్టుకుంది. ఎంత అనాగరికమైన చర్య? స్వాములు బ్రతికి ఉన్నప్పుడు మరియు మరణించాక వారికోసం చేసే అనేక సంప్రదాయాలను, విపరీతమైన ఉత్సవాలను, అడ్డ పల్లకి, నిలువు పల్లకి కార్యక్రమాలను, అర్థరహితమైన అంత్యక్రియకు సంబంధించిన కార్యాలను వారి శిష్యులు ఆచరిస్తారు. “ఇలాంటి అహేతుకమైన ఆచారాలను ఎందుకు పాటించాలి?” అని అడిగినప్పుడు శిష్యుల ఒత్తిడికి తాము తల ఒగ్గాల్సి ఉంటుందనే తేలిక సమాధానాన్ని స్వాములు చెబుతారు. అంటే నిజంగా మార్గదర్శనం చేయవలసిన స్వాములవారికి వాస్తవంగా మార్గదర్శనం చేసేది వారి శిష్యులు. ఎంతటి వైపరీత్యం! ఇలాగైతే మన సమాజపు వ్యవస్థలో మార్పు జరగడం అసంభవం.

ఇంకొక ఘటన. ఆచార్య వినోబా భావే గారు గాంధీజీ ప్రియ శిష్యులు. గాంధీజీ మొదలుపెట్టిన అనేక ఉద్యమాలలో ఇండివిజుయల్ సివిల్ డిస్ఒబిడియన్స్ (Individual Civil Dis-Obedience) అనేది ఒకటి. అంటే ఈ వ్యక్తిగత సత్యాగ్రహంలో ఒకరి తరువాత ఒకరు సత్యాగ్రహంలో పాల్గొనాలి. ఇది సామూహిక సత్యాగ్రహానికి భిన్నమైనది. ఇలాంటి సత్యాగ్రహానికి గాంధీజీగారు వినోబా భావే గారిని మొదటి సత్యాగ్రాహిగా ఎన్నుకున్నారు. రెండవ వారు జవహర్లాల్ నెహ్రూ గారు. వినోబాజీ గారు భగవద్గీతపై చాలా ఉపన్యాసాలను ఇచ్చి, వాటిని సంగ్రహించి ‘గీతా ప్రవచనమ’నే పుస్తకాన్ని ప్రకటించారు. వారు చనిపోయాక వారి బూడిదను ఒక మూటలో కట్టి వారు పడుకునే మంచం క్రిందో, సమీపంలోనో పెట్టాలని చెప్పారట. ఇది చదివి నా మనసుకు ఎక్కువ నొప్పి కలిగింది. పత్రికకు లేఖ వ్రాశాను. ప్రకటించబడింది. సమాధానం లభించలేదు. జీవితాంతం వినోబాజీ గారు దేహం అశాశ్వతం, ఆత్మయే శాశ్వతం అని పదే పదే ప్రతిపాదించి చివరకు తమ అస్థికలకు ప్రాముఖ్యత నిచ్చారు కదా అని నాకు నిరాశ కలిగింది. బ్రతికి ఉన్నప్పుడు ఏ ఆస్తిపాస్తి లేని వినోబాజీ గారికి చచ్చాక వారి అస్థికలే వారి ఆస్తి అయ్యింది కదా అని బాధ కలిగింది. సామాన్య ప్రజలే వాస్తవంగా ఎంతో మేలు. కాల్చిన తరువాత వారి అస్థికలను ఏ నదిలోనో విలీనం చేస్తారు. శాశ్వతంగా, జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేయరు.

మరొక దృష్టాంతం. ఒక గొప్ప సాహితీవేత్త, కవి మరణించారు. వారు చాలా మర్యాదస్థులు. అంత్యగౌరవాన్ని సూచించడానికి వారి ఇంటికి వెళ్ళాను. శవాన్ని కూర్చోబెట్టారు. తలకు పాగా చుట్టారు. స్వామిగారికి కిరీటం. వీరికి మాత్రం తలపాగా! “అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి” అని ప్రసంగవశాన వారి సమీప బంధువును అడిగాను. “మా కులానికి చెందిన రుద్రభూమిలో సమాధి చేస్తాం” అని బదులు ఇచ్చారు. అక్కడినుండీ ఆలోచిస్తూ కాలేజీకి వచ్చాను. వీరు జీవితపర్యంతం మానవతావాదాన్ని ప్రతిపాదిస్తూ వచ్చారు. మొదట మనిషివికా అనేది వారి జీవిత సందేశం. అలాంటివారి అంతం కులంతో ముగిసింది కదా అని నన్ను పీడిస్తుండేది. ఇలాంటి విషయాలను నా స్నేహితులతో ప్రస్తావించి నప్పుడు తమాషాగా “కవులు చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటి – మొదట మనిషివికా అని చెప్పేది. చివరకు చెప్పేది లింగాయతుడివికా, బ్రాహ్మణుడివికా, ఒక్కలిగుడివికా అని. ఎంత విపర్యాసం” అన్నాను. దానికి వారు “ఇదంతా కవిగారి తప్పుకాదు. వారి అంత్యక్రియలకు వారు బాధ్యులు కారు. ఇంటివారు బాధ్యులు” అంటూ వాదించారు. వారు ఒక వీలునామా వ్రాసి ఉంటే ఇలాంటి వాదవివాదాలకు తావు ఉండేది కాదు.

అన్ని ధర్మాలలోనూ ఇలాంటి హేతుబద్ధం కాని సంప్రదాయాలున్నా హిందూ మతంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అర్థరహితమైన, అమానవీయమైన సంప్రదాయాలను మన ‘పండితోత్తములు’ తమదైన కపట వ్యాఖ్యానాలతో, ఉపాఖ్యానాలతో, విశ్లేషణలతో సమర్థించుకుంటారు. మనలో ఒక్కొక్క దురాచారానికి ఒక్కొక్క సమర్థన. ఇలాంటి సమర్థనలన్నింటికీ మూలం అహేతుకం మరియు సంకుచితత్వం.

10. మతము – కులము – దోపిడీ

ప్రపంచంలో ఉండే అనేక ధర్మాలలో హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనది. దానికి పుట్టిన రోజు – Date of Birth లేదు. అది అనాది. దాని తరువాత బౌద్ధ మతం, క్రైస్తవమతం మరియు ఇస్లాం మతాలు పుట్టాయి. సాంప్రదాయక మతాలకు దేవుడు కేంద్ర బిందువు. మతాలకు సాధరణంగా విశ్వాసమే ప్రధానం. ప్రశ్నించే స్వభావం తక్కువ. అయితే విజ్ఞానానికి ప్రశ్నించేదే ప్రధాన గుణం. విజ్ఞానానికి ఎప్పుడూ ముందు చూపు. మతానిది వెనుచూపు. విజ్ఞానం అత్యంత నూతన పుస్తకాల ఆధారంగా ముందుకు సాగుతుంది. మతం పురాతన పుస్తకాలపై నిలిచింది. అవే వాటి ఆధార గ్రంథాలు. మతం నిలిచి ఉన్న మడుగు. విజ్ఞానం ప్రవహిస్తున్న నది. సామాన్యంగా ఒక మతానికీ మరో మతానికి విరుద్ధం ఉండే ఉంటుంది. “మా మతం మీ మతానికన్నా ఉత్తమమైనది. మా దేవుడు మీ దేవునికన్నా గొప్పవాడు” అనేది పరంపరగా వస్తున్న వాదం.

కులవ్యవస్థ హిందూ ధర్మంలో ఒక అవిభాజ్యమైన అంగం. కేవలం పుట్టుక ఆధారంగా ఒకని గుణగణాలను జీవితాంతం నిర్ధారించండం అన్యాయం. కులవ్యవస్థ చాలా క్రూరమైనది, అమానవీయమైనది, చెడ్డది. కులాల గురించి ప్రస్తావిస్తే కొందరికి కోపం రావచ్చు. కులవ్యవస్థ ఎప్పుడు, ఎలా, ఏ ఉద్దేశంతో ప్రారంభమయ్యిందో ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఇప్పుడున్నవారు కూడా కులవ్యవస్థకు జవాబుదారులు కాదు. ఈ కులవ్యవస్థ వల్ల అనేక ఆపదలు ఉన్నాయి. మనదేశంలో ఉన్న ఎక్కువమంది ముస్లిముల పూర్వీకులు హిందువులు. సామాజిక అన్యాయంతో కూడిన కులవ్యవస్థ వల్ల చాలా మంది నిమ్నవర్గాల వాళ్ళు ముస్లిం మరియు క్రైస్తవులుగా మతాంతరం చెందారు. కుల వ్యవస్థ మన దేశాన్ని మతం ఆధారంగా చీల్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కులవ్యవస్థ యొక్క ఫలితం. మన దేశపు ఈశాన్య మూలలో, మరికొన్ని ప్రదేశాలలో క్రైస్తవ మతపు, మరియు రాజకీయ సమస్యలు ఈ కులవ్యవస్థ వల్లే ఉద్భవించాయి. పాకిస్తాన్ ఏర్పడ్డాక కూడా మన దేశంలో హిందు – ముస్లిం సమస్య ఇంకా కొనసాగుతోంది.

ఇలాంటి చెడిపోయిన కులవ్యవస్థను నిర్మూలించడానికి బుద్ధుడు 1500 ఏళ్ళకు పూర్వమే ప్రయత్నించాడు. బౌద్ధమతంలో కులం లేదు. దేవుడు, ఆత్మల విషయంలో బౌద్ధ మతం తటస్థం. బౌద్ధ ధర్మం మనిషిని కేంద్రబిందువుగా చేసుకుని ఏర్పడిన అత్యంత హేతుబద్ధమైన మతం. దేవుడు ప్రధానమైన మతాలలో దళారుల సమస్య ఉంది. అయితే బౌద్ధమతంలో దళారుల సమస్య లేదు. తన భవిష్యత్తుకు తానే బాధ్యుడు. ఇంకెవరూ అతడిని కాపాడలేరు.

బుద్ధుడి తరువాత బసవణ్ణ కులవ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అయితే విచారకరమైన విషయం ఏమంటే వారు చనిపోయాక వీరశైవకులం నిర్మాణమయ్యింది. ఇది మిగిలిన కులాలవలనే అర్థరహితమైన సంప్రదాయాలతో కర్ణాటకలో ఒక పెద్ద కులంగా మారింది.

కులవ్యవస్థను మనం అంతమొందించక పోతే కులాలే మన దేశాన్ని నాశనం చేస్తాయి. ఇప్పుడప్పుడే ఈ నాశనం మొదలయ్యింది. కులం లేకపోతే ఇక్కడ అంబేడ్కర్ అప్రస్తుతమయ్యేవారు. రిజర్వేషన్లు ఉండేవి కావు. వెనుకబడిన వర్గాల హావనూరు, వెంకటస్వామి, చిన్నపరెడ్డి కమిటీల అవసరం ఉండేది కాదు. ఈ కులవ్యవస్థ హిందూ సమాజాన్ని అశాస్త్రీయపు పునాదులపై తునాతునకులుగా విడగొట్టింది. కులాల నుండి జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని ఇక్కడ వివరించనవసరం లేదు. అయితే ఒక ఉదాహరణ మాత్రం ఇస్తాను. షెడ్యూలు కులానికి చెందిన విద్యావంతుడైన నాగరికునికి ఇప్పటికీ ఊళ్ళలో ఇల్లు దొరకదు. వారు మిగిలిన హిందువుల (వెనుకబడిన కులాల వారితో కలుపుకుని) మధ్యలో జీవించడం సాధ్యం కాదు. ముస్లిములకు, క్రైస్తవులకు ఉన్న అవకాశం హిందూ మతస్థుడైన షెడ్యూలు కులపు వ్యక్తికి లేదు. సున్నితమైన మనసున్న షెడ్యూలు కులాలవారికి దీనివల్ల మానలేని గాయం అవుతుంది. హిందూ మతాన్ని శపిస్తారు. ఇలాంటి అన్యాయంతో విసుగెత్తి వారు మిగిలిన మతాలను స్వీకరించారు. అంబేడ్కర్ ఇలాగే బౌద్ధ మతావలంబి అయ్యారు.

కులవ్యవస్థను నిర్మూలించడానికి విద్యాధికులు ముందుకురావాలి. కులాంతర లేదా కులరహిత వివాహాల వల్లే ఈ కులాల నాశనం సాధ్యం. కులాంతర వివాహం అంటే దొరికిన వారిని పెళ్ళి చేసుకోమని అర్థం కాదు. అభిప్రాయాలు, సంస్కృతి మొదలైన వివాహానికి అవసరమైన గుణాలను కలిగి ఉన్నప్పుడు పెళ్ళికి కులం అడ్డు కారాదు.

కులవ్యవస్థ క్రింది వర్గాలవారిని సామాజికంగా, సాంస్కృతికంగా మరియు విద్యాపరంగా శతాబ్దాలుగా అణచివేస్తూ విపరీతంగా, అర్థం చేసుకోలేనంతగా దోపిడీ చేసింది. క్రింది వర్గాల వారు ఇప్పుడిప్పుడే మేల్కొని ఆ అణచివేత యొక్క అఘాతం నుండి తేరుకుని పైకి లేచే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారు తమ కాళ్ళపై నిలబడటానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేము.

మన సమాజంలో జాతి, ధర్మాల భేదం లేకుండా నిరంతరంగా కొనసాగుతున్నది ఆర్థిక దోపిడీ. ఒకవైపు కుళ్ళి పోయేటంత ఐశ్వర్యం, మరోవైపు ఊపిరాడని అస్థిపంజరాలు. నేను రెండు వర్గాలవారినీ చూశాను. బీదవారిని, కడుపుకు తిండి లేని వారిని, అనాథ పిల్లలను చూసినప్పుడు నాకు కడుపులో నిప్పులు వేసినట్లు అవుతుంది. నెలకు వేలాది రూపాయలు జీతం తీసుకుంటారు. వారిలో చాలామంది ఆత్మసాక్షిగా పని చేయరు. వారంతా పని దొంగలు. ఇలాంటి వారికే అన్ని సౌకర్యాలు, సెలవు దినాలు; ఇంకొకవైపు శ్రమజీవులు. ఉదయం నుండి సాయంత్రం దాకా చెమటోడ్చి పనిచేసేవారికి భవిష్యత్తే లేదు. ఆ రోజు సంపాదన ఆ రోజుకే. నిరుద్యోగుల పాట్లయితే ఊహించడానికే సాధ్యం కాదు. పేదల దోపిడీ నిరంతరంగా సాగుతూ ఉంది. పేదవాడికి రోగం వస్తే ఇక వాడికి యముడే దిక్కు. సోవియట్ రష్యా యొక్క సోషలిజం కూలిపోయి ఇప్పుడు కాపిటలిజం సర్వాంతర్యామి అయ్యింది. పేదల ధనికుల మధ్య అంతరం పెరిగిపోయి అసహాయులు, దుర్బలులపై ఆర్థిక దోపిడీ మరింత ఎక్కువ అవుతోంది. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ధర్మం ఉండదు. మన దేశంలో ఉన్నంత ఆర్థిక, సామాజిక దోపిడీ మరే దేశంలోనూ లేదు. బయటివారికి ఇది భాగ్యభూమి, ధర్మభూమి ఇక్కడి వారికి ఇది రుద్రభూమి.

11. దళారులు

కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు లాల్బాగ్ వాకింగ్ ముగించి అక్కడే సమీపంలో ఉన్న ఒక అంగడిలో కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. అన్ని కొబ్బరిబోండాల దుకాణాలు సాధారణంగా ఫుట్‌పాత్ పైన ఉంటాయి. నేను కొబ్బరిబోండాం తాగుతున్నప్పుడు ఒక పరిచయస్థుడు అక్కడికి వచ్చి “ఏం సార్, మీరు ఒక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నారు. అలాంటి వారు ఫుట్‌పాత్‌పై నిలబడిని కొబ్బరినీళ్ళు తాగుతున్నారు” అని ఆశ్చర్యంతో అడిగారు. నేను శాంతంగా “ఏమి చేయాలప్పా. ఇప్పుడే 10 కి.మీ. వాకింగ్ ముగించుకుని వచ్చాను. మాజీ ఉపకులపతులకూ ఇంత దూరం నడిచాక నీరసం వస్తుంది, దాహం వేస్తుంది. అందువల్ల కొబ్బరినీళ్ళు తాగుతున్నాను” అన్నాను. “సరే సార్. ఐతే పల్లెటూరిబైతు త్రాగినట్లు స్ట్రా (Straw) లేకుండానే త్రాగుతున్నారు కదా?” అని అడిగారు. “ఔనప్పా నేను పల్లెటూరి బైతునే. స్ట్రా ఎందుకు వేసుకోలేదంటే నాకు దళారుల(Middlemen) పై నమ్మకం లేదు” అని చెప్పాను. “ఎంత అర్థవంతమైన మాట చెప్పారు సార్. పైకి చూడటానికి మీ మాటలు నవ్వు తెప్పించవచ్చు. అయితే ఆ మాటల వెనుక ఎంత లోతైన అర్థం ఉంది” అని తమ మెప్పుదల ప్రదర్శించారు.

అన్ని రంగాలలోనూ దళారుల – మధ్యవర్తుల పీడ ఉంది. అయితే ధార్మిక రంగంలో దళారుల వల్ల అనుకూలం కంటే ఎక్కువ నష్టము, దోపిడీ జరుగుతోంది. ఇలాంటి మధ్యవర్తులు అన్ని మతాలలోనూ ఉంటారు. ధార్మిక దళారులు ధర్మం పేరుతో సామాన్యంగా ప్రజలను దోచుకుంటారు. వారిని తప్పుడు మార్గంలో తీసుకువెళతారు. దేవుడు, మతం మరియు సంప్రదాయం పేరుతో ప్రజలను భయపెడతారు. మతాంధకారానికి ప్రోత్సాహం ఇస్తారు. ఇక్కడ ఒక మాట నొక్కి చెప్పాలి. ధార్మిక దళారులు అనే పదం ప్రామాణికంగా సమాజాన్ని తీర్చిదిద్దిన, దిద్దుతున్న ధార్మిక గురువులకు వర్తించదు. బుద్ధుడు, బసవ, రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన గొప్ప వ్యక్తులకు ఇది అన్వయించదు. ధనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏవిధమైన మతాన్ని ఆచరించకుండా, మానవ ధర్మాన్ని, మానవీయ విలువలను ప్రచారం చేస్తున్న ధార్మిక వ్యక్తులకు ఇది వర్తించదు. నిజమైన ధర్మం ఇలాంటి వారి వల్ల పెరిగే అవకాశం ఉంది. ధర్మాన్ని మరియు దేవుడిని దురుపయోగం చేస్తూ ఉండే వంచకులంతా ధార్మిక దళారులు. వీళ్ళంతా ధర్మానికి తామే ఏజెంట్లని భావిస్తారు. ధార్మిక దళారులకు అన్వయించే ఒకటి రెండు దృష్టాంతాలను ఇస్తాను.

ఒక ధార్మిక ప్రచారకులు ధర్మప్రచారానికై ఒక ఊరికి వెళ్ళారు. వారి జేబులో ఉన్న ఒక ఉత్తరాన్ని పోస్ట్ చేయడం మరచిపోయారు. ఊరిలో వెళుతున్నప్పుడు దారిలో ఒక యువకుడు కలిశాడు. ఈ ఊరిలో ఉన్న పోస్ట్ ఆఫీసుకు దారి ఏది అని ఆ యువకుని అడిగారు. ఆ యువకుడు సరియైన మార్గం చూపించాడు. దానికి ఆ ధర్మప్రచారకులు థ్యాంక్స్ చెప్పి ఇదే ఊరిలో ఈ రోజు సాయంత్రం నా ఉపన్యాసం ఉంది రమ్మని ఆహ్వానించారు. దానికి ఆ యువకుడు ఉపన్యాసం దేని గురించి అని అడిగాడు. “స్వర్గానికి దారి ఏది?” అనే విషయం పై మాట్లాడతాను అని చెప్పారు. “పొండి పొండి. మీకు మా ఊరి పోస్ట్ ఆఫీసుకే దారి తెలియదు. నేనే దానిని చూపించాలి. ఇక స్వర్గానికి దారి చూపుతారట” అని వారిని ఆటపట్టిస్తూ వెళ్ళిపోయాడు. పాపం ఆ ధర్మ ప్రచారకుడు నిరాశతో పోస్ట్ ఆఫీసును వెదుకుంటూ వెళ్ళారు.

దాదాపు అందరు ధర్మప్రచారకులు స్వర్గానికి, మోక్షానికి దారి చూపేవారే. స్వర్గపు దారి గురించి ఎవరు ఏమి కావాలన్నా చెప్పవచ్చు. ఇంతవరకూ స్వర్గానికి పోయి వాపసు వచ్చిన వారు లేరు. అక్కడ ఏమవుతుందో ఎవరూ చెప్పలేదు. ఒక్కొక్కరూ నోటికి వచ్చినట్లు చెబుతారు. వీరికి మనుషుల గురించి తెలియదు. అయితే దేవుని గురించి మాట్లాడతారు. దేవుని గురించి మాట్లాడటం సులభం.

ధార్మిక నమ్మకాలున్న ఒక భక్తుడికి ఒక స్వామిగారి పాదపూజ చేయాలని కోరిక పుట్టింది. ఆ స్వామిగారిని చూడటానికి అతడు వెళ్ళాడు. ఆ స్వామిగారిని నేరుగా కలిసే ముందు స్వామివారి దళారులను చూడాలి. ఆ భక్తుడు దళారులను కలిసి తన కోరికను వ్యక్తం చేశాడు. దానికి ఆ దళారి “మా వద్ద మూడు రకాలైన పాదపూజలు ఉన్నాయి. మొదటి రకం పాద పూజ చేయాలంటే 1500 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు మీరు స్వామివారి పాదాలను ముట్టి పూజ చేయవచ్చు. పాదాలను తాకకుండా వారి పాదుకలకు పూజ చేయడం రెండవ రకం పాదపూజ. దీనికి 1000 రూపాయలు చెల్లించాలి. మూడవ రకం పాదపూజకు 500 రూపాయలు ఇవ్వాలి. పాదాలను తాకడానికి లేదు. పాదుకలనూ తాకడానికి లేదు. దగ్గర నుండి స్వామి వారి పాదాలను చూసి నమస్కారం చేసుకోవచ్చు” పాదపూజల వర్గీకరణను తెలిపారు.

“స్వామీ నేను పేదవాడిని. కష్టపడితే దీని కోసం 500 రూపాయలు వినియోగించవచ్చు. అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. అయితే నేను స్వామివారి పాదాలను తాకి పూజ చేసుకోవాలన్నదే నా కోరిక” అని చెప్పుకున్నాడు. “సాధ్యం కాదు. మీ ధనానికి మూడవ రకం పాదపూజ ఉంది. దానినే చేయండి” అన్నారు దళారీ. “ఏమైనా కానీ. నేను వారి పాదాలను ముట్టే పూజ చేయాలి. 500 రూపాయలకు ఆ అవకాశాన్ని ఇప్పించండి. నా జీవితపు చివరి కోరికను నెరవేర్చండి” అని కాళ్ళావేళ్ళా పడి వేడుకున్నాడు. దళారి మనసు కొంచెం కరిగింది. “నీవు ఇంతగా చెబుతున్నావు కనుక ఇంతవరకూ ఎవరికీ ఇవ్వని డిస్కౌంటు నేను నీకు ఇస్తాను. 1000 రూపాయలు ఇచ్చి స్వామిగారి పాదాలను ముట్టి నమస్కారం చేసుకో” అని ఉదారంగా అన్నారు. “నాకు ఎప్పటికీ 1000 రూపాయలు ఇవ్వడానికి సాధ్యం కాదు. అయితే నేను స్వామిగారి కాళ్ళు పట్టుకునే పూజ చేయాల్సి ఉంది. దయచేసి ఒప్పుకోండి” అంటూ అర్థించాడు. అయితే దళారి తగ్గలేదు. ఇదొక విప్పలేని జటిల సమస్య అయ్యింది. ఇద్దరూ తమ తమ పట్టు విడువలేదు. అయితే ఖిన్నుడైన భక్తునికి ఒక ఉపాయం తోచింది. ప్రసన్నమైన వదనంతో “1000 రూపాయలు ఇస్తే స్వామివారి రెండు పాదాలను తాకి పూజ చేసుకోవచ్చు అన్నారు. నేను ఇచ్చే 500 రూపాయలకు ఒక పాదాన్ని ముట్టుకునే అవకాశం ఇవ్వండి” అని అడిగాడు. దీనిని విన్న దళారి డీలా పడిపోయాడు. అంత వరకూ ఏ భక్తుడూ పాదపూజను గణితపు “త్రైరాశి” స్థాయికి దించలేదు. ఆ దళారి 500 రూపాయలు తీసుకుని ఒక పాదాన్ని తాకనిచ్చాడో లేదో తెలియదు. అయితే ఈ ఘటన నుండి తెలుసుకోదగిన నీతి సుస్పష్టం. ధర్మం ఒక వడ్డీ వ్యాపారం.

ఇంకొక్క ఉదాహరణతో ఈ దళారుల కథను ముగిస్తాను. ఒక దేవస్థానం ముందు రాఘవేంద్రస్వామి కూర్చున్నారు. అక్కడ అనేకమంది భక్తులూ కూర్చున్నారు. బయటి నుండి దేవస్థానం లోపలికి పూజారి వెళ్ళాడు. రాఘవేంద్రస్వామి లేచి నిలబడి నమస్కారం చేశారు. అక్కడున్న భక్తులకు దిక్కు తోచలేదు. రాఘవేంద్ర స్వామి ఎలాంటి అపచారం చేశారు. దేవస్థానం లోపలికి పోతున్న ఒక విలువలేని పూజారికి రాఘవేంద్రస్వామి అంతటి వారు లేచి నిలబడి నమస్కారం చేసి గౌరవం ఇచ్చారు అని తమలోనే గొణుగుకున్నారు. కొంచెం సేపు అయిన తరువాత ఆ పూజారి దేవస్థానం లోపలి నుండి బయటకు వచ్చినప్పుడు రాఘవేంద్ర స్వామి లేచి నిలబడి గౌరవాన్ని ప్రదర్శించారు. దీనిని చూసిన భక్తులు ఇక తట్టుకోలేక పోయారు. వారి తరఫున ఒకడు ధైర్యం చేసి “ఏమి స్వామి, మీరే కొంచెం అటూ ఇటూ దేవునితో సమానం. అలాంటివారు ఈ పూజారి లోపలికి పోయినప్పుడు నమస్కారం చేశారు. అలాగే బయటికి వచ్చినప్పుడు అదే గౌరవం సూచించారు. మేమంతా దిగ్భ్రాంతులమయ్యాము. మీనుండి ఎలాంటి అపచారం జరిగింది” అని దైన్యంగా అన్నాడు. రాఘవేంద్ర స్వామిగారు శాంతచిత్తులై “నా నుండి ఏమీ అపచారం జరగలేదు. మీరంతా దృష్టిదోషంతో ఇలా చెబుతున్నారు. పూజారి లోపలికి వెళుతున్నప్పుడు గుడిలో ఉన్న దేవుడు బయటకు వచ్చారు – walk out చేశారు. మీరు లోపలికి వెళుతున్న పూజారిని మాత్రం చూశారు. నేను వాక్ఔట్ చేస్తున్న దేవుడిని చూశాను. అలాగే లోపలున్న పూజారి బయటకు వచ్చినప్పుడు వాక్ఔట్ చేసిన దేవుడు లోపలికి వెళ్ళారు. అప్పుడూ ఆ దేవుడిని చూశాను. అంటే రెండు సార్లు మీరు చూసింది పూజారిని అయితే నాకు మాత్రం దేవుడు కనిపించారు” అని చెప్పాడు. ఆ తరువాత ఏమయ్యిందో తెలియదు. అయితే దీని సందేశం దేవుడు, పూజారి కలిసి ఉండడం, సహజీవనం చేయడం సాధ్యమే కాదు. పూజారి ఉన్నచోట దేవుడు ఉండరు.

పూజారి దేవుడిని ఎంత నిర్లక్ష్యంగా పూజ చేస్తాడు అనేది జాగ్రత్తగా గమనిస్తే భక్తులందరికీ తెలుస్తుంది. నీళ్ళను విగ్రహంపైకి ఎగ చిమ్ముతాడు. తాత్సార వైఖరి ఎత్తి కనిపిస్తుంది. పూజారికి తన దేవుని సంపద బాగా తెలుసు. అందుకే దేవస్థానాలలో జరిగే దొంగతనాలలో పూజారుల హస్తం ఉన్నా ఆశ్చర్యం లేదు. దేవుడు ఎక్కడైనా ఉండవచ్చు. వ్యాపార దృష్టి ఉన్న, గజిబిజిగా, అల్లరిగా ఉన్న దేవస్థానాలలో మాత్రం దేవుడు ఉండడం అపురూపం.

ధార్మిక దళారులనుండి ధర్మం పాడయిపోయింది. వారికి ముఖ్యంగా కావలసింది డబ్బు. దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధం. డబ్బులు ఇస్తే రాహుకాలం కాస్తా అమృత ఘడియలు అవుతాయి. చెడ్డ జాతకం మంచిది అవుతుంది. ఎడమకాలు కుడికాలవుతుంది. అన్ని మతాల ధార్మిక దళారులకూ వారి భక్తుల మూఢత్వం మరియు భయమే పెట్టుబడి.

నేను విధాన పరిషత్ సభ్యుడిని అయినప్పుడు నా పక్కనే కూర్చున్న మరొక సభ్యులు శ్రీ హెచ్.శ్రీకంఠయ్య గారితో హేతువాదంపై పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాను. దానికి వారు నా వాదానికి పుష్టి చేకూరేలా ఈ క్రింది శ్లోకాన్ని చెప్పారు:

“సువర్ణనిర్మితః కాకః

కాళంభట్టాయ దీయతే

న దీయతే సకాకః

జ్యేష్ఠపుత్రీ వినశ్యతి”

అంటే, బంగారంతో చేసిన కాకిని కాళంభట్టుకు దానం చేయకపోతే మీ జ్యేష్ఠపుత్రి చనిపోతుంది. మన ధార్మిక దళారులు కష్టకాలంలో వారినుండి పరిహారం పొందడానికి వచ్చినతనికి ఈ అమూల్యమైన (అంటే ఎక్కువ వెలతో కూడిన) పరిహారాన్ని చెప్పి శాంతింపజేయడానికి ప్రయత్నించారు! నేను ఇదంతా వ్రాస్తున్నది ధర్మాన్నిగానీ, దేవుడిని గానీ, ధార్మిక దళారులను కానీ హేళన చేయడానికి కాదు. నాకూ నిజమైన ధర్మం పట్ల నమ్మకం ఉంది. అయితే మన ధర్మం నిత్యజీవితంలో ఇలాంటి అధోగతికి దిగిందికదా అనేదే నా ఆవేదన. అన్నట్లు నేను ఇచ్చిన దృష్టాంతాలు మరియు అభిప్రాయాలు హిందూ ధర్మానికి సంబంధించినవి. మిగిలిన మతాలలో ధార్మిక దళారుల ఉపద్రవం ఉండే ఉంటుంది. అయితే నాకు ఆ దళారుల నిత్య వ్యాపారం తెలియక పోవడంవల్ల నేను చూస్తున్న హిందూ ధర్మపు ఉదాహరణలు మాత్రం ఇచ్చాను. నా హేతువాద వైఖరి అన్ని మతాలలో ఉండే అహేతుక ఆచార వ్యవహారాలకూ వర్తిస్తుంది అని మాత్రం హామీ ఇస్తున్నాను.

12. బాధ

ప్రతి ఒక్కరికీ తమ తమ జీవితాలలో బాధ కలిగించే సందర్భాలు ఉంటాయి. దానికి నేనేమీ మినహాయింపు కాదు. వీటిలో కొన్నింటిని ప్రస్తావించకపోతే నా కథ అసంపూర్ణమవుతుంది. నేను అందరితో స్నేహభావంతో ఉంటాను. అందరినీ మొదట నమ్ముతాను.

ముందే పేర్కొన్నట్టు 1972వ సంవత్సరం డిసెంబర్ నెలలో బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించబడ్డాను. దాని వ్యవధి మూడు సంవత్సరాలు. అది ప్రభుత్వ ఉద్యోగం కాదు. అది నిర్ణీత సమయానికి నియమించే గౌరవ హోదా. నేను ఆ పదవిలో ఉన్న మూడు సంవత్సరాలు శెలవు మంజూరు చేయాలని, తరువాత మళ్ళీ అధ్యాపకుడిగా వాపసు వస్తానని ఒక అర్జీని మా సంస్థకు ఇచ్చాను. విద్యాపరమైన పనులకు ఒక నిర్దిష్ట కాలం సెలవు ఇవ్వడం కొత్తదేమీ కాదు. ఇదొక మామూలు చర్య. మా సంస్థ పాలకమండలి కూడా నా అర్జీని పరిశీలించి మూడు సంవత్సరాలు సెలవును మంజూరు చేసింది. అయితే దీనిని మా కాలేజీలోని ఒకరిద్దరు అధ్యాపకులు సహించలేక పోయారు. నాకు సెలవు ఇవ్వకూడదని, రాజీనామా చేసి వెళ్ళాలని అర్థం వచ్చేలా ఒక ఉత్తరాన్ని కార్యదర్శిగారికి వ్రాసి దానిని రాబోయే సర్వసభ్య సమావేశంలో చర్చించాలని కోరారు. ఈ విషయం నాకు నిజంగానే షాక్ ఇచ్చింది. ఆ షాక్‌కు కారణమైన నా ఆలోచనాక్రమం ఇలా ఉంది. నేను ఏ హోదాకూ చేయి చాచకుండా నాకు అన్నం, చదువు ఇచ్చిన సంస్థలోనే పని చేయడానికి స్వచ్ఛందంగా, సంతోషంగా వచ్చాను. సెంట్రల్ కాలేజీలో అధ్యాపకుడు కావాలని ప్రభుత్వం నుండి అయాచితంగా వచ్చిన ఆహ్వానాన్ని ఒప్పుకోలేదు. నేను నా కాలాన్ని, ధనాన్ని అంతా మా సంస్థకు ఇచ్చాను అని అనుకున్నాను. మా సంస్థల అభివృద్ధికి లక్షలాది రూపాయలను సేకరించాను అని అనుకున్నాను. ముఖ్యంగా నేషనల్ కాలేజీకి 12 సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా ఆ కాలేజీ సర్వతోముఖ అభివృద్ధికి మరియు అది విద్యారంగంలో మంచి స్థానం పొందడానికి యథాశక్తి పనిచేశాను అని భావించాను. మొత్తం మీద సంస్థ మరియు కాలేజీయే నా సర్వస్వం అని అనుకున్నాను. దీనికంతా నాకు లభించిన ప్రతిఫలం అందరికీ సులభంగా లభించే సెలవు నాకు ఇవ్వడానికి అడ్డం అయ్యింది. నేను ఇలాంటి విశ్వాసఘాతుకాన్ని నా కలలో కూడా ఎవరినుండీ ఆశించలేదు. ఈ సెలవును ప్రశ్నించేది ఇద్దరు ముగ్గురు కావచ్చు. అయితే అది జనరల్ బాడీ మీటింగులో చర్చించేటంతటి నీతి నియమాలకు విరుద్ధమైన విషయమేమీ కాదు. ఈ సంగతి తెలిసిన వెంటనే చాలా బాధాతప్త హృదయంతో నా ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా పత్రంతో పాటు నియమం ప్రకారం మూడు నెలల జీతం చెక్కును సంస్థ కార్యదర్శికి పంపాను. అప్పుడు శ్రీ వై.ఎన్.గంగాధర శెట్టిగారు మా సంస్థ అధ్యక్షులు. శ్రీ టి.ఎస్.రాఘవన్ గారు కార్యదర్శి. నా రాజీనామాను పాలక మండలి అంగీకరించలేదు. జనరల్ బాడీ మీటింగులో నాకు సెలవు ఇవ్వవచ్చా లేదా అనే విషయం చర్చించడానికి సరైన వాతావరణం, సహకారం ఆ నా శ్రేయోభిలాషులైన సహోద్యోగులకు లభించలేదు. నా సెలవు గురించి జనరల్ బాడీ మీటింగులో చర్చకు పంపిన విషయం తెలిసిన కొన్ని ప్రముఖ విద్యాసంస్థల పాలక మండలి సభ్యులు ఈ విషయమై ఆశ్చర్యాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు.

ఆ ప్రకరణమేమో అంతటితో ముగిసింది. అయితే ఆ షాక్ నా మనసుపై తీవ్రమైన పరిణామాన్ని కలగజేసింది.

దానికి రెండు సంవత్సరాల క్రితం మా కాలేజీ రజతోత్సవాలు చాలా విజయవంతంగా నడిచాయి. రాష్ట్రపతిగారే ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇంతబాగా జరిగింది కదా అని అంతటా సంతోషకరమైన వాతావరణం. అయితే నా సహోద్యోగులలో ఒకటి రెండు గంటు ముఖాలను గుర్తించాను. అప్పుడే మొదటిసారి నాకు ఒకరకమైన అనుమానం కలిగింది. ఆ తరువాత విశ్వవిద్యాలయం ఉపకులపతి అయ్యాక, పద్మభూషణ్ వచ్చాక కొందరిలో ఇబ్బందికరమైన అలజడి ఎత్తి కనిపించింది. చాలామంది ముఖాలు వికసించి ఉంటే కొందరి ముఖాలు మాత్రం వాడిపోయి ఉన్నాయి. పద్మభూషణ పురస్కారం వచ్చినప్పుడు దాని గౌరవార్థం విందు ఏర్పాటు చేయాలని అధ్యాపకుల సలహా అనేది ఒకరిద్దరు అధ్యాపకుల చర్చకు ముడిసరుకు అయ్యిందట. పద్మభూషణ్ పురస్కారం వచ్చినవారికి విందు ఏర్పాటు చేస్తే ఇదొక చెడ్డ ఆనవాయితీ కావచ్చు. ఇకపై పద్మభూషణ్ వచ్చిన వారికందరికీ ఇలాంటి గౌరవం ఇవ్వాలి అనేది వారి వాదన. ప్రతి సంవత్సరమూ ఇలాంటి పద్మభూషణ్ పురస్కారం మా సంస్థలోని వారికి రావచ్చు అని వారి భయం!

నేను ఉపకులపతి అయినప్పుడూ కొందరు నేషనల్ కాలేజీ మరియు హాస్టల్ సీటుకోసం వచ్చేవారు. సిఫారసు చేయండి అని అడిగేవారు. “నేను దీనిలో ఇన్వాల్వ్ కాను” అని చెప్పేవాణ్ణి. అక్షరాలా ఒక సీటుకూ ఎవరినీ అడగలేదు. అయితే ఎవరో ఒకరు హాస్టల్ సీటు కోసం వచ్చారు. ఏదో బలమైన మొహమాటానికి కట్టుబడి హాస్టల్ సీటు కోసం సిఫారసు చేయడానికి నిశ్చయించాను. మా కాలేజీలోనే చదివి నా విద్యార్థి అయిన, భౌతికశాస్త్ర అధ్యాపకులు మరియు విద్యార్థి నిలయం వార్డన్ అయిన శ్రీ ఆర్.కె.వాయికర్ గారికి ఫోన్ చేసి విషయం తెలిపాను. వారు చాలా సంతోషంతో “మీరు కట్టించిన హాస్టల్, అందువల్ల వారిని పంపండి. తప్పకుండా చేర్చుకుంటాను” అని చెప్పారు. వారిని పంపాను. ఈ సీటు ఇచ్చే విషయాన్ని వాయికర్ గారు తమ ఉన్నత అధికారులకు చెప్పారు. అది విన్న వెంటనే వారు బుసలు కొడుతూ “సీటు ఇవ్వడానికి కుదరదు” అని అన్నారట. ఖాళీలు ఉన్నాయి. అయితే నా నుండి సిఫారసు వచ్చింది! కాబట్టే ఇవ్వలేదు. అంతే కాదు ఏదో పరాకులో ఆ పిల్లవాడికి సీటు ఇవ్వచ్చు అనే శంకతో ఆ పిల్లవాని అప్లికేషన్‌ను భద్రంగా ఇనుప పెట్టెలో పెట్టి వెలుగు చూడకుండా అన్ని ముందుజాగ్రత్తలూ తీసుకున్నారట. శ్రీ ఆర్.కె.వాయికర్ గారు నాకు ఫోన్ చేసి సీటు ఇవ్వలేకపోతున్నందుకు క్షమాపణ కోరారు. ఇదొక అల్పమైన విషయంగా చాలామందికి అనిపించవచ్చు. అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశం ముఖ్యం.

హాస్టల్ నా యిల్లు అని భావించి దాని అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో భాగం వహించి, ప్రతి నిత్యమూ హాస్టల్ విద్యార్థులను నిభాయిస్తూ వస్తున్నవాడికి ఆ హాస్టల్లో ఒక సీటు ఇవ్వము అని చెబితే ఎంత స్థితప్రజ్ఞుడికైనా హుందాగా వ్యవహరించడం సాధ్యపడదు. ఎన్నో విషయాలలో నేను అసమర్థుణ్ణి. సమయం దొరికితే నా విరుద్ధంగా ఏమైనా చేసే కుటిల మనస్తత్వం, శక్తి కొందరిలో ఉన్నాయని ఈ కొన్ని నిదర్శనాల నుండి వ్యక్తమవుతుంది. నా జీవితంలో అంతా పోరాటమే అయ్యింది.

ఇవన్నీ ఎత్తి కనిపించే ద్వేషం, విషం, అసహనం. అదే మనస్తత్వం ఇంకా కొందరిలో గుప్తగామినిగా ప్రవహించినా అసహజం ఏమీ కాదు. ఈ అసహనానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. నా శాస్త్రీయ దృక్పథం అర్థరహితమైన సంప్రదాయాలకు, మూఢనమ్మకాలకు, కులవ్యవస్థకు వ్యతిరేకత, ఒక పల్లె నుండి వచ్చిన ఒక అనాథ బాలుడు తన జీవితంలో ‘ఇవన్నీ’ సాధించాడు కదా అని అధమస్థాయి సామాన్య ప్రజలకు సహజంగా కలిగే అసూయ. నాకు కావలసిన వారు నా మీద ఆరోపణ చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన పనిలేదు. ఇలాంటి అధమస్థాయి సామాన్య మనుషులేమీ అపురూపం కాదు.

బాధ కలిగించే సందర్భాలను ఇన్ని చెప్పినా, మా సంస్థలో, పాఠశాల మరియు కళాశాలలో నా శ్రేయోభిలాషుల, సహృదయుల సంఖ్య అపారం. అదే నా బలం. జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకం. తమకు సరిపడని వారి ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి సర్వ ప్రయత్నాలు చేయడం కొత్త విషయమేమీ కాదు. నేను మందమైన చర్మం (thick skinned) ఉన్నవాడిని కాను. మనస్సు చాలా సున్నితం(sensitive). ఇది ఒక రకంగా మంచిది అయినా దీనివల్ల నేను చాలా ఇబ్బందులను ఎదుర్కున్నాను. మనఃశాంతి కరువౌతుంది. దీనవల్ల శారీరిక ఆరోగ్యానికీ నష్టం కలుగుతుంది. దీనిని అనుభవంతో చెబుతున్నాను. నేనేమీ అజాతశత్రువును కాను. ఇక్కడ శత్రువు అనే దానిని అదే అర్థంతో తీసుకోరాదు. శత్రువు అంటే వ్యక్తిగతంగా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసే మనిషి. అలా చూస్తే ఎవరూ అజాతశత్రువులు కావడం సాధ్యపడదు. ఒక వేళ అలాంటివాడు అకస్మాత్తుగా ఉంటే అటువంటి అప్రయోజకుడు, ఆలోచనారహితుడు మరొకడు ఉండడు. అటువంటి వాడు బ్రతికి ఉండి శవంతో సమానం.

ఈ అప్రియమైన విషయాలను వ్రాద్దామా వద్దా అని చాలా రోజులు ఆలోచించాను. వ్రాయాలని తరువాత నిర్ణయించుకున్నాను. వ్రాయకపోతే నా జీవితమంతా మానసికంగా సుగమం అనే అభిప్రాయం ప్రజలకు కలగవచ్చు. దీనిని ఎక్కువగా పొడిగించక నేను నా జీవితంలో శారీరికంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాను అని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఇదంతా నా హాస్య స్వభావంలో మూసుకుని పోతుంది. బాధను దిగమ్రింగుతాను, నవ్వును పంచుకుంటాను. దుఃఖాన్ని మరిచిపోవడానికి నవ్వు ఒక మంచి సాధనం.

13. మా ఊరు

ముందే చెప్పినట్లు నేను అప్పటి లోయర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణుడిని అయినప్పుడు గౌరీబిదనూరు తాలూకా మొత్తానికి ఒక హైస్కూలు కూడా లేదు. అందువల్లే నేను బెంగళూరుకు వచ్చి నేషనల్ హైస్కూలులో చదివాను. 1946లో నేషనల్ కాలేజీ అధ్యాపకుడిని అయ్యాను. ఊరికి వెళ్ళినప్పుడంతా మా ఊరిలో ఒక హైస్కూలు లేదు కదా అనే ఆలోచన వచ్చేది. అమెరికాకు చదవడానికి వెళ్ళినప్పుడు చివరి సంవత్సరం ఆందోళన తక్కువై మనసు నిశ్చింత అయ్యింది. అక్కడా ఊరి గురించి ఆలోచన. ఏమైనా చేసి ఒక హైస్కూలు తెరవాలని ఆలోచన అప్పుడప్పుడూ పీడిస్తూ ఉంది. అమెరికా నుండి 1960లో తిరిగివచ్చి 1961లో కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాక ఈ ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ప్రయత్నించాను. మా పాలక మండలిలోని కొందరు సభ్యులతో హోసూరులో ఒక నేషనల్ హైస్కూలును తెరిచే విషయం ప్రస్తావించాను. “చదువుకొనాలని ఆశ ఉన్న చాలా మందికి అక్కడ హైస్కూలు లేక నిరాశ కలుగుతోంది. నేను పుట్టిన ఊరి ఋణం తీర్చుకోవడం నా కర్తవ్యం. నాపై దయయుంచి మా ఊరిలో ఒక నేషనల్ హైస్కూలు ప్రారంభించండి; పాలక మండలిపై ఎక్కువ ఆర్థికభారం పడకుండా నేను చూసుకుంటాను” అని వారికి విన్నవించుకున్నాను. ప్రతిక్రియ ఆశాజనకంగా ఉంది. హోసూరులో నేషనల్ హైస్కూలు తెరవడానికి గవర్నింగ్ కౌన్సిల్ నిర్ధారించింది. దానిని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది. 1962వ సంవత్సరం జూన్ నెలలో పాఠశాల మొదలయ్యింది. ఇప్పుడు ఈ హైస్కూలుకు సుమారు 10 ఎకరాల స్థలం ఉంది. స్కూలు ముందుభాగంలో ఉన్న స్థలం క్రీడామైదానం అయ్యింది. పాఠశాల వెనక ఉన్న స్థలం తోటకు, వ్యవసాయానికీ ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఈ పాఠశాలకు 10 లక్షల రూపాయల విలువైన మంచి భవనం ఉంది. దీనిలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రపు అన్ని పరికరాలతో కూడిన ప్రయోగశాలలు ఉన్నాయి.

ఒక గ్రామీణ హైస్కూలులో విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలలు ఉండటం గొప్ప విషయం. వేళ్ళతో లెక్క పెట్టగలిగే అన్ని పాఠశాలలో కూడా ప్రయోగశాలలు లేవు. అంతే కాకుండా సుమారు 800 మంది విద్యార్థులు కూర్చొనగలిగే అవకాశం ఉన్న ఒక సమావేశ మందిరం ఉంది. దీనిలో నాటకాలను ఆడటానికి కావలసిన సౌకర్యాలున్నాయి. అలాగే ఒక బహిరంగ నాటక మందిరం ఉంది. ఇది చాలా విశాలంగా ఉండి ఎంత పెద్ద నాటకాలైనా ఆడటానికి అనువుగా ఉంది. బెంగళూరునుండి ప్రసిద్ధమైన నాటక కంపెనీలు స్పందన, ప్రభాత్ కళాకారులు మరియు హెగ్గోడుకు చెందిన నీ.నా.సం (నీలకంఠేశ్వర నాట్యసేవా సంఘం) హోసూరుకు వచ్చి అనేక నాటకాలను ప్రదర్శించి నాటకశాలను మరియు ఏర్పాట్లను చాలా మెచ్చుకున్నారు. పాఠశాల పాఠ్యేతర కార్యక్రమాలకు ముఖ్యంగా నాటకం వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు, సైన్సు పోటీలు, దేశభక్తి గీతాల పోటీలు మొదలైన వాటికి ప్రాధాన్యతనిస్తూ విద్యకు ఒక పరిపూర్ణతను ఇచ్చింది. అన్నిరకాలుగా ఇది రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలలలో ఒకటి అనే పేరు గడిచింది.

ఊరిలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ప్రసూతి ఆస్పత్రి కొరత ఉండేది. సుమారు పది సంవత్సరాల క్రితం జనతాదళ్ అధికారంలో వచ్చి శ్రీ పి.జి.ఆర్.సింధియా గారు ఆరోగ్యమంత్రి అయ్యారు. వారు మా కాలేజీలోనే చదివారు. మా హాస్టల్లోనే ఉన్నారు. ఈ చనువును ఉపయోగించుకుని వారిని ఈ రెండు సౌకర్యాలను కల్పించవలసిందిగా విన్నవించుకున్నాను. సరైన సౌకర్యాలు లేకుండా, ఆసుపత్రి లేక ఎంతో మంది పిల్లలు అకాలమరణం పాలవుతున్నారు. నేనేమో ఇలాంటి ప్రసూతి ఆసుపత్రి మరియు తర్ఫీదు పొందిన మంత్రసాని సహాయం లేకుండా ఒక గదిలో పుట్టి, కొడవలి సహాయంతో నా బొడ్డుతాడును తెంచుకుని బ్రతికి బట్టకట్టాను. ఆ కాలంలో ఇలా బ్రతికిన కొందరు పిల్లలలో నేనూ ఒకడిని. ఇవన్నీ వివరంగా సింధియాగారికి తెలిపాను. “రెండింటిలో ఏదైనా ఒకటి మంజూరు చేస్తాను. ఏదో ఒకటి అడగండి” అన్నారు. “లేదప్పా దయచేసి రెండూ ఇవ్వండి” అన్నాను. అలా రెండూ ఇవ్వడానికి నియమాల ప్రకారం సాధ్యపడదు అన్నారు. ఆ రోజు సంభాషణ అక్కడికి ముగిసింది. ఒక రోజు వారు తమ విధానసౌధ ఆఫీసు నుండి ఫోన్ చేసి “రాష్ట్రంలో ఆసుపత్రులను మంజూరు చేసే విషయమై ఈ రోజు అంతిమ నిర్ణయం తీసుకుంటున్నాము. మీకు ఆ రెండింటిలో ఏది కావాలో చెప్పండి” అన్నారు. నేను నా ఆశను పునరుచ్చరించి “ఫోన్లో మాట్లాడేకన్నా ఇక 15- 20 నిముషాలలో మీదగ్గరకు వస్తాను. అక్కడే అంతిమ నిర్ణయం తీసుకుందాము” అని చెప్పి వారి ఆఫీసుకు చేరుకుని “సింధియా గారూ మీరు మా కాలేజీలోనే చదివింది. మన కాలేజీలో చదివినవారు మళ్ళీ ఎప్పుడు ఆరోగ్య మంత్రి అవుతారో చెప్పలేము. దయచేసి నాకోసం నేను పుట్టిన ఊరు కోసం ఈ రెండు సౌకర్యాలను అందించండి” అని దీనంగా వేడుకున్నాను. సింధియాగారి మనసు కరిగింది. తమ కార్యదర్శిని పిలిచి “వీరు మా మేష్టారు. స్పెషల్ కేస్ అని ప్రాథమిక ఆసుపత్రి, పది పడకల ప్రసూతి ఆసుపత్రి ఇస్తున్నాను. దీనిని దాఖలు చేసుకోండి” అని వారికి చెప్పి, నా వైపుకు తిరిగి “సార్, అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం ఆ ప్రసూతి ఆసుపత్రి ఖర్చులో సగం మీరు ఇవ్వవలసి ఉంటుంది” అన్నారు. “మేము ఇస్తాము” అని ఒప్పుకున్నాను. ఆ కాన్పుల ఆసుపత్రి భవన నిర్మాణానికి రెండు లక్షలకన్నా ఎక్కువ ఖర్చు అయ్యింది. ఊరులోని ఔత్సాహిక యువకుల, ఉపాధ్యాయుల జతలో లాటిన్, బ్యాటరీలు పట్టుకుని రాత్రి 7 గంటలయ్యాక పల్లె పల్లెకూ వెళ్ళి ధనాన్ని సేకరించాము. అలాగే తెల్లవారు జాము వెళ్ళి ఉదయం 7-8 గంటలలోపు ఒకటి రెండు పల్లెలకు వెళ్ళేవాళ్ళం. దీనికోసం నేను హోసూరుకు శని, ఆదివారాలు వెళ్ళేవాడిని. ఇలా ఇంటింటికీ తిరిగే కార్యక్రమానికి సుమారు మూడు నెలలు పట్టింది. మా ఊరి నుండి, చుట్టుపక్కల పల్లెలలో ఉండే అభిమానుల నుండి ఒక లక్ష కన్నా ఎక్కువ మొత్తాన్ని సంగ్రహించి, మిగిలిన సగం ధనాన్ని ప్రభుత్వం నుండి పొంది మేమే మంచి సౌకర్యవంతమైన ప్రసూతి ఆసుపత్రిని కట్టించాము. ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రియే కాకుండా పశువుల ఆసుపత్రి కూడా ఉంది.

పేద విద్యార్థుల అనుకూలం కోసం వెనుకబడిన వర్గాల మరియు సార్వజనిక విద్యార్థి నిలయాలూ ఉన్నాయి. వీటి అస్తిత్వానికి నేను కించిత్ సేవ సలిపే అవకాశం లభించింది.

నేను చదివిన ప్రభుత్వ ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల పుట్టింది 1920వ సంవత్సరంలో. నేనూ అదే సంవత్సరంలో పుట్టాను. ఇదొక కాకతాళీయం. ఆ పాఠశాల కట్టడం నాకన్నా ఎక్కువ జీర్ణమయ్యింది. ముప్పుతో కూడి వానప్రస్థాశ్రమానికి ప్రవేశించింది. కొన్ని కిటికీలు, తలుపులు ఉపయోగానికి పనికి రావు. దీనిని అంతా మేము మొదటి నుండీ గమనిస్తూ ఉన్నాము. 1995 పాఠశాల అమృతోత్సవ సంవత్సరం. ఆ అమృత మహోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించాలని ఆలోచించి, అమృతోత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఒక కొత్త భవనాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాము. పాఠశాల అభిమానుల నుండి సుమారు ఏడు లక్షల రూపాయలను సేకరించాము. జిల్లా పరిషత్తు ఆరేడు గదుల నిర్మాణానికి అయ్యే ఖర్చు సహాయం చేసింది. ప్రభుత్వం సైన్సు ప్రయోగశాల కోసం ఒక లక్ష రూపాయలను ఇచ్చింది. 9 గదులు మరియు ఒక లేబొరేటరీతో కూడిన ఆ అమృతోత్సవ భవనానికి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. నాకు దేవరాజ్ అరసు ప్రశస్తి నుండి లభించిన ఒక లక్ష రూపాయలు ఈ పాఠశాలకు ఇచ్చాను. ఈ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుతున్నారు.

నా స్వగ్రామంలో నాకు బంధువులు ఎవరూ లేరు. అయితే అక్కడ నా ఆత్మీయ స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. ఆ ఊరి పట్ల నాకు అభిమానముంది. ప్రేమ, విశ్వాసాలు ఉన్నాయి. రక్తసంబంధీకులు లేకపోయినా ఆ ఊరిలోని వారంతా ఒక రకంగా నా బంధువులే అని భావించాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడంతా ఉత్సాహంతో వెళతాను. మా తల్లి గారి ఇంటికి వెళ్ళినట్లే వెళతాను. ఇక్కడున్న నా సన్నిహితులకు నేను నా ‘పుట్టింటి’కి వెళుతున్నానే చెబ్తాను. నేను పుట్టిన ఇల్లు అక్కడే ఉంది. అది చాలా సంవత్సరాల క్రిందనే ఇంకొకరి ఇల్లు అయ్యింది. ఆ ఇంటి గురించిన వివరాలను ఇంతకు ముందే చెప్పాను.

దానిని చూడాలనే కోరిక అప్పుడప్పుడూ కలుగుతుంది. నాలుగైదు సార్లు ఆ ఇంటిని సందర్శించాను. 1995 నవంబర్ నెలలో అక్కడికి వెళ్ళి ఆ ఇంటిలో అంతా తిరిగాను. ఒకటి రెండు చోట్ల స్తంభీభూతుడినై కొన్ని సెకెన్లు నిలుచున్నాను. అక్కడ నివసిస్తున్నప్పుడు కలిగిన అనుభవాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ నా ఇంటిని మనసులోనే నమస్కరించుకున్నాను. సంస్కృతంలో ఒక శ్లోకముంది. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటే తల్లి మరియు పుట్టిన దేశం, ఊరు స్వర్గం కన్నా గొప్పవి. దీనిని నేను అక్షరాలా అంగీకరిస్తాను. ఎక్కువ చీకటితో కమ్ముకున్న, అనారోగ్య పరిసరాలతో కూడిన నేను పుట్టిన చిన్న ఇంటిని నేను ఇప్పటికీ ప్రేమిస్తాను. కూలీ పని చేస్తున్న, ఎనిమిది రోజులకొకసారి స్నానం చేస్తున్న, మురికి బట్టలను ధరిస్తున్న, నా రంగున్న నా తల్లికి అత్యంత ఎక్కువగా ప్రేమిస్తాను.

ఊరికి నా ఋణాన్ని తీర్చడానికి వీలైనంత ప్రయత్నం చేశాను మరియు చేస్తున్నాను. మా ఊరి పనులు నాకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయి.

(ముగింపు వచ్చేవారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here