‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -4

0
11

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

నా ఉపాధ్యాయులు

[dropcap]ఇం[/dropcap]గ్లీషు బోధనలో శ్రీ కె.సంపత్ గిరిరావు గారు చేయి తిరిగినవారు. వారు మంచి వక్తలు. గాంధేయవాది. 1921లో ఈ పాఠశాలకు వచ్చారు. అంతకు ముందు ఒక సంవత్సరం సెంట్రల్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేశారు. పాఠశాలకు చాలా సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. పాఠశాల బోధనేతర కార్యక్రమాలలో విశేషమైన మార్గదర్శనం చేసేవారు. కష్టమైన ఇంగ్లీషు పదాలను వివరించే సమయంలో కన్నడలో విశ్లేషించేవారు. గణితం, విజ్ఞానశాస్త్ర విషయాలలో శ్రీ కారకూన్ రామరావుగారు గట్టివారు. మనసుకు హత్తుకునేట్లు పాఠం చెప్పేవారు. శ్రీ కె.నంజుండయ్యగారు స్వయంసేవాదళం, దైహికశిక్షణ, వేసవి శిబిరాలలో ఎంత ఉత్తమ నిర్దేశకులో అంతే ఉత్తమ జీవశాస్త్ర అధ్యాపకులు కూడా. వారి పాఠాలను మరచిపోవడం అసాధ్యం. శ్రీ హెచ్.రామారావుగారు భూగోళశాస్త్రాన్ని ఎంతో సారస్యంగా పాఠంగా చెప్పేవారు.

నేను ఫోర్త్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు శ్రీ బి.నారాయణరావుగారు ఇంగ్లీష్ పాఠం చెప్పేవారు. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడేవారు. పల్లెటూరి నుండి వచ్చినవాణ్ణి. వారివైపే ఆశ్చర్యంతో చూస్తూ వారి మాటలు వినేవాణ్ణి. “నా తలలో రెండు స్విచ్లు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ స్విచ్. మరొకటి కన్నడ స్విచ్. చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ స్విచ్‌ను ఆన్ చేస్తాను” అని చెప్పి సంపూర్ణంగా ఇంగ్లీషులో వేగంగా మాట్లాడేవారు. మేమంతా అవాక్కై నోరు తెరుచుకుని వినేవాళ్ళం. కొంత సేపయ్యాక ఇంగ్లీష్ స్విచ్ ఆఫ్ చేసినట్లు నటించి కన్నడ స్విచ్ ఆన్ చేసి అంతే ధారాళంగా కన్నడలో మాట్లాడేవారు. పాఠంతో పాటుగా “ఒకసారి పులి గొంతు పట్టుకున్నాను. ఇంకోసారి ఎవరినో రక్షించడానికి ముందూవెనుకా చూడకుండా బావిలోకి దూకాను” అంటూ తమ సాహసకృత్యాలను వర్ణించేవారు. ప్రతి పిరియడ్ చివర ఇలాంటి ఒకటి రెండు రోమాంచిత ఘటనలను నాటకీయంగా చెప్పేవారు. మేము మొదట్లో భయంభయంగా వినేవాళ్ళం. తరువాత ఇదంతా అలవాటై పోయింది. వారు చెప్పేదంతా అతిశయోక్తులని పై తరగతి విద్యార్థులవల్ల తెలిసింది.

గణితం మొదటి క్లాసు. శ్రీ హెచ్.ఎస్.శివరాం గారు ఉపాధ్యాయులు. తరగతిలోనికి రాగానే మొదటి విద్యార్థివైపు చూసి నిలబడమన్నారు. అతడు నిలబడ్డాడు. “ఒకటి అని చెప్పు” అన్నారు. “ఒకటి” అన్నాడు. “కూర్చో” అన్నారు. కూర్చొన్నాడు. రెండవ వాడివైపు చూసి “ఇప్పుడు నీవు నిలుచో” అన్నారు. అతడు నిలబడ్డాడు. “నాలుగు అను” అన్నారు. ఆ విద్యార్థి చెప్పాడు. కూర్చోమన్నారు. కూర్చొన్నాడు. తరువాతి వంతు మూడవ విద్యార్థిది. అతనికి వచ్చిన సంఖ్య తొమ్మిది. తరువాత నాలుగవ విద్యార్థి అధ్యాపకుని ఆజ్ఞమేరకు నిలబడ్డాడు. అప్పుడు ఆ ఉపాధ్యాయులు “తరువాత చెప్పు” అన్నారు. అతడు తడబడ్డాడు. ఎవరైనా చెప్పండి అన్నారు. మాకేమీ అర్థం కాలేదు. “ఒకటి, నాలుగు, తొమ్మిది.. ఏమిటిదంతా” అని మనసులో ఆలోచిస్తున్నాము. తరువాతి సంఖ్య పదహారు. ఆ తరువాతి సంఖ్య ఇరవై ఐదు అని చెబుతూ ఇవన్నీ 12, 22, 32, 42.. వరుసకు చెందినవి అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ గుట్టు తెలిసిన తరువాత మేము తరువాతి సంఖ్యలను క్రమానుగణంగా చాలా సులభంగా చెప్పాము.

మేము ఫిఫ్త్ ఫారంలో (తొమ్మిదవ స్టాండర్డ్‌లో) ఉన్నప్పుడు వీరు భౌతికశాస్త్రం చెప్పేవారు. ఆ పిరియడ్‌ను ఏడాదిలో సుమారు సగానికన్నా ఎక్కువభాగం భగవద్గీత చెప్పడానికే ఉపయోగించారు. మాకు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం కంఠోపాఠం చేయించారు. అర్థతాత్పర్యాలను చెప్పారు. ఇదంతా ఫిజిక్స్ క్లాసులోనే! మేమంతా శ్లోకాలను సామూహికంగా వల్లెవేయాల్సి వచ్చేది. అప్పుడు బయటి వారికి వినబడకూడదని తరగతి కిటికీ తలుపులను గట్టిగా మూసేవారు. నేను తరువాత సెంట్రల్ కాలేజీలో నా చదువును కొనసాగించినప్పుడు భౌతికశాస్త్రాన్నే నా ప్రత్యేక విషయంగా ఎన్నుకున్నాను. ఈ నా భౌతికశాస్త్రానికి పునాది భగవద్గీత. మంచి గట్టి ఫౌండేషన్!

శ్రీ హెచ్.ఎస్.శివరాంగారు అంకితస్వభావం కలిగిన ఉపాధ్యాయులు. విద్యార్థుల పట్ల ఎక్కువ వాత్సల్యం చూపేవారు. అన్ని విషయాలలోనూ వారిదైన ఒక ప్రత్యేకత ఉండేది. అనేక విషయాలలో ప్రధానోపాధ్యాయులకు తలనొప్పిగా తయారయ్యారు. ఒకసారి ఉపాధ్యాయులందరూ కాఫీ తాగడానికి సమీపంలోని హోటలుకు మా పాఠశాల మైదానం గుండా వెడుతున్నప్పుడు మాటలమధ్యలో ప్రధానోపాధ్యాయులైన శ్రీ కె. సంపత్ గిరిరావు గారు తమ తలపైని గాంధీటోపీని తలపై నుండి తీసి చేతిలో పట్టుకున్నారు. పక్కనే ఉన్న శ్రీ కె.నంజుండయ్యగారు తలవైపు చూసి “ఏమి సార్! జుట్టంతా అప్పుడే తెల్లగా అయిపోయింది” అంటూ ఆశ్చర్యంతో అడిగారు. “దానికి సగం కారణం శివరామే” అని సంపత్ గిరిరావు గారు జవాబు చెప్పగానే అందరూ ఫక్కున నవ్వేశారు.

శ్రీ కె.ఎస్.కృష్ణయ్యర్ గారు పాఠశాల భీష్మ పితామహులు. పాఠశాల ప్రారంభమైనప్పటి నుండీ దానితో వారికి అనుబంధముంది. వారు మంచి ఇంగ్లీష్ ఉపాధ్యాయులు. విద్యార్థులకు ప్రియమైన గురువు. వారి జతలో ఆదివారం ఉదయం మూడు నాలుగు మైళ్ళు వేగంగా నడవడం, ఈదులాడడం వంటి కార్యక్రమాలలో పాలుపంచుకునేవారు. దాతలనుండి పాఠశాలకు విరాళాలు సేకరించడంలో దిట్ట. పాఠశాల భవనం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వీరే ఎక్కువభాగం ధనాన్ని సేకరించారు. అద్భుతమైన భవనం ముందుభాగం శ్రీ కృష్ణయ్యర్ గారి పూనిక వల్లే సాధ్యపడింది. వారు దేనినీ అది ప్రియమైనదైనా, అప్రియమైనదైనా దాచుకోకుండా మాట్లాడేవారు. అలాగే హాస్టల్ భవన నిర్మాణానికి కూడా ధనం సేకరించారు.

శ్రీ ఎ.కె.పుట్టరాము గారు కన్నడ ఉపాధ్యాయులు. నేను సంస్కృత విద్యార్థిని కావడం చేత నాకు వారు పాఠాలు చెప్పడం సాధ్యపడలేదు. ఐతే ఒక సంవత్సరం వారు మాకు ‘నీతి బోధన ‘ క్లాసు తీసుకున్నారు. వారు మంచి సాహితీవేత్తలు. కవులు. మృదుస్వభావులు. ఎక్కువమంది విద్యార్థులు వారి సాత్వికగుణాన్ని దురుపయోగం చేసుకునేవారు. వారి తరగతిలో సామాన్యంగా అల్లరి చేసేవారు. ఒక్కోసారి పాఠం ముందుకు సాగడానికి కూడా వీలుపడనంతటి గోల. వారికి చాలా సహనం ఉండేది. గలాటా చేయవద్దని వారు చేసే విన్నపాన్ని సాధారణంగా ఎవరూ పట్టించుకునేవారు కారు. ఒకసారి విద్యార్థుల అల్లరి భరించలేక సహనం చచ్చిపోయి “మీకు పాఠం చెప్పడం కన్నా జట్కా తోలడం నయం” అంటూ కోపంగా తరగతి నుండి వెళ్ళిపోయారు. మరుసటిరోజు మామూలుగా తరగతికి వచ్చారు. పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. విద్యార్థులకూ, ఉపాధ్యాయులకు అలా ఒక రకంగా అలవాటయిపోయింది. సర్దుకుపోయేవారు. అయితే విద్యార్థులందరికీ వారిపట్ల ఎక్కువ గౌరవముండేది.

శ్రీ కె.ఎల్.సుబ్బారావుగారు చరిత్ర ఉపాధ్యాయులు. వారు పాఠం చెప్పే విధానం విద్యార్థులకు అంతగా నచ్చేది కాదు. వారికి కోపం వస్తే పరిస్థితి మరింత గందరగోళంగా ఉండేది. ప్రతియొక్క రాజు విషయం చెప్పినప్పుడు జననం, బాల్యం, విద్యాభ్యాసం, పరిపాలన, మరణం అనే శీర్షికలు తప్పనిసరిగా ఉండేవి. మార్కులు ఇవ్వడంలో మహా పిసినారి. వారానొకసారి మాకు ఒక్కొక్క విషయంపై 10 మార్కుల లఘు పరీక్షలు ఉండేవి. వాటిలో మార్కులు 1/4, 1/8, 1 1/4, 1 3/4 ఇలా ఇచ్చేవారు. ఒకసారి ఒక విద్యార్థి సమాధానానికి సున్న మార్కులు వేశారు. ఆ విద్యార్థి అసంతృప్తితో ఆ సమాధానానికి సున్న కన్న ఎక్కువ మార్కులు ఇవ్వాలని వాదించాడు. వారు “నీ తలకాయ్, నేనిచ్చింది సరిగ్గానే ఉంది. పోనీలే పాపం” అంటూ సున్నను కొట్టివేసి 1/8 మార్కులు వేశారు. ఆ విద్యార్థి ముఖంలో ఎటువంటి మార్పూ కనబడలేదు. సమాధాన పత్రం చివరి పేజీలో వారు ఇచ్చిన మార్కులను కూడి మొత్తం వేసేవారు. ఆ కూడిక నోటితో చేయడానికి అయ్యేది కాదు. అది ఒక భిన్నరాశుల మొత్తము లెక్క మాదిరి ఉండేది!

శ్రీ హెచ్.రామారావుగారు భూగోళాన్ని బాగా చెప్పేవారు. వారు బీదపిల్లల విద్యార్థి నిలయాన్ని నడిపే విషయంలో మూలస్తంభంగా ఉండేవారు. కందాడ కృష్ణ అయ్యంగార్ గారు పౌరనీతిని అత్యంత తృప్తికరంగా చెప్పేవారు. అందరు ఉపాధ్యాయుల విషయం ప్రత్యేకంగా వ్రాయడానికి వీలుకాదు. ముందే చెప్పినట్లు అందరూ అంకితభావం కలిగిన ఉపాధ్యాయులే. ఎత్తి కనిపించే లక్షణాలున్న ఉపాధ్యాయుల విషయాన్ని మాత్రం చూచాయగా ఇక్కడ ప్రస్తావించాను.

నేను ఫిఫ్త్ ఫారంలో ఉన్నప్పుడు ఒకసారి నీతి బోధన కోసం శ్రీ రామకృష్ణాశ్రమం నుండి స్వామి రంగనాథానందగారు తరగతికి వచ్చారు. ముందే చెప్పినట్లు నీతిబోధన పాఠశాల టైమ్ టేబుల్లో ఒక భాగం. శ్రీరామకృష్ణాశ్రమం మా పాఠశాలకు సమీపంలోనే వుంది. ఆశ్రమానికీ, మా పాఠశాలకూ భౌగోళికంగానే కాక, మానసికంగా కూడా దగ్గర సంబంధం ఉంది. మా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వయంసేవకులు ఆశ్రమానికి చెందిన అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. కొందరు సాయంత్రం పూట అక్కడ జరిగే ప్రార్థనలు, ప్రవచనాలలో పాలుపంచుకునేవారు.

స్వామీ రంగనాథానందజీగారు కేరళకు చెందినవారు. మైసూరు ఆశ్రమంలో మూడు సంవత్సరాలు ఉండి బెంగళూరు ఆశ్రమానికి 1935లో వచ్చారు. వారు మా క్లాసుకు రాగానే అటెండెన్స్ తీసుకున్నారు. పేర్లను పిలుస్తూ బి.ఆర్.చిన్మయానంద అనే పేరును పిలిచారు. అతడు బదులు పలికాడు. హాజరుపట్టీ మూసివేసి చిన్మయానంద అనే పేరు గురించి ఆ పీరియడ్ మొత్తం సరళంగా వారు ఇచ్చిన వ్యాఖ్యానం, విశ్లేషణ ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అది భావగర్భితమైన పేరనీ, దానిని విడదీసినప్పుడు చిత్, మయ, ఆనంద అవుతుందనీ, ఒక్కొక్క పదానికీ మిక్కిలి లోతైన అర్థం ఉందనీ తెలిపారు. వారి ప్రభావానికి ఆకర్షితులై కొందరు విద్యార్థులు తరువాత ఆశ్రమానికి బ్రహ్మచారులుగా చేరి ఆపై సన్యాసం స్వీకరించారు.

స్వామి రంగనాథానందజీ గారికీ నాకూ తరువాతి కాలంలో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడింది. స్వామీజీగారు మంచి విద్వాంసులు. వక్తలు. అందరినీ ఆత్మీయంగా చూసే స్వభావం కలిగినవారు. వారిప్పుడు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినిపొందారు. వారికి వేలాదిమంది శిష్యులున్నారు. నేను బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నప్పుడు విశ్వవిద్యాలయ పట్టప్రదానోత్సవసభకు ముఖ్య అథితిగా హాజరై స్నాతకోపన్యాసం ఇచ్చారు.

ఇంటి నుండి విద్యార్థి నిలయానికి

శ్రీ ఎం.ఎస్.నారాయణరావు గారి ఇంటిలో ఒక ఏడాది ఉన్నాను. మొదటి మూడు నెలలు గడిచిన తర్వాత పేద బాలుర విద్యార్థి నిలయంలో వారానికి మూడురోజులు ఉచితంగా భోజనంచేసే సౌకర్యం కలిగింది. మిగిలిన నాలుగు రోజులు నారాయణరావు గారి ఇంటిలో భోజనం చేసేవాడిని. ఫోర్త్ ఫారంలో నెలకు మూడు రూపాయలు ఫీజు. మొదటి సంవత్సరం ఏ విద్యార్థికీ విద్యార్థి నిలయంలో ఉచితభోజన వసతి సౌకర్యం లేదు. అలాగే ఎంత ప్రతిభావంతుడైన విద్యార్థికైనా పూర్తి వీజు మాఫీ చేసేవారు కాదు. ఆ ఏడాది మొదటి భాగంలో నాకు సగం ఫీజు మాఫీ చేశారు. మిగిలిన ఫీజు, మిగిలిన ఖర్చులకోసం కొందరు శ్రేయోభిలాషులు నెలకు నాలుగణాలు, ఎనిమిదణాలు ఇచ్చేవారు. సంవత్సరపు పూర్వార్థ పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫీజు మాఫీ చేయడాన్ని పునఃపరిశీలించేవారు. దానివల్ల నాకు రెండవ టర్మ్ నుండి ఎస్.ఎస్.ఎల్.సి. ముగిసేదాకా ఫీజు పూర్తిగా మాఫీ చేశారు. ముందే చెప్పినట్లు నాకు తరగతిలోని విషయాలను గ్రహించడంలో ఎలాంటి కష్టమూ కలగలేదు. పాఠ్యపుస్తకాల కొరత మాత్రం ఉండేది. స్నేహితుల నుండి అప్పుడప్పుడు అరువు తెచ్చుకుని చదివి వాపసు ఇచ్చేవాణ్ణి. నా సహాధ్యాయులు ఎక్కువమంది బెంగళూరు వారే. వారంతా మంచి విద్యాధికులైన ఇళ్ళ నుండి వచ్చినవారు. నాది సంస్కృతం ద్వితీయభాష. అందువల్ల నేను సంస్కృతం సెక్షన్లో ఉన్నాను. ఆ సెక్షన్లో అందరి ద్వితీయ భాష సంస్కృతమే. పల్లె నుండి వచ్చి సంస్కృతం తీసుకున్న విద్యార్థిని నేను ఒక్కడినే కావచ్చు. పాఠశాల మొత్తం మీద సంస్కృతం తీసుకున్న విద్యార్థులే సామాన్యంగా ఎక్కువ ప్రతిభావంతులు. వారితో పోటీ పడాల్సి వచ్చింది. మొదటి పరీక్షలో తరగతిలో తొమ్మిదో స్థానమో, పదవస్థానమో పొందాను. తరువాత తరగతి మొత్తం మీద రెండవ, మూడవ లేదా నాలుగవ స్థానంలో వచ్చేవాడిని. ప్రథమ స్థానం మాత్రం గెలుచుకోవడానికి సాధ్యపడలేదు. నా జీవితమంతా ప్రతిభావంతులతో ఆరోగ్యకరమైన పోటీ పడటమే అయ్యింది. ఇది నాకు ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది. నాకు ఎప్పుడూ ఆత్మన్యూనతా భావన కలుగలేదు. పెద్దపెద్ద సమస్యలను ధైర్యంతో ఎదుర్కొనే స్వభావాన్ని మొదటి నుండీ అభ్యాసం చేసుకున్నాను.

అపూర్వ సంఘటన

“నీ పేరేమి?”

“నరసింహయ్య”

“ఏ తరగతిలో చదువుతున్నావు?”

“ఫిఫ్త్ ఫారం”

“నీకు హిందీ బాగా వస్తుందా?”

“కొంచెం కొంచెం వస్తుంది” (తోడా తోడా ఆతా హై)

మహాత్మాగాంధీజీగారికీ నాకు పైన చెప్పిన చిన్న సంభాషణ 1936 జూన్ 11వ తేదీ గురువారం సాయంత్రం సుమారు ఐదుగంటల సమయంలో జరిగింది. గాంధీజీ గారు అప్పుడు బెంగళూరుకు వచ్చినారు. వారిని చూడడానికి నేషనల్ హైస్కూలులోని అందరు విద్యార్థులు, ఉపాధ్యాయులూ వారు విడిది చేసిన కుమారకృప అతిథి గృహం దగ్గరికి వెళ్ళాము. ఆ భవనం ముందున్న బయలులో చెట్ల క్రింద పచ్చిక మీద కూర్చొని గాంధీజీగారి ఆగమనానికై ఆతురతతో నిరీక్షిస్తున్నాము. సుమారు ఐదు గంటల సమయంలో వారి ఆప్త కార్యదర్శి మహాదేవభాయి దేశాయి, సర్దార్ వల్లభ భాయి పటేల్, మైసూరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులైన కర్నాడ్ సదాశివరావు గారితో పాటు గాంధీజీగారు మావైపు వచ్చారు. క్రమశిక్షణతో గాంధీ టోపీలను ధరించి మేమంతా లేచి నిలబడి గౌరవంగా స్వాగతం పలికాము. కూర్చొమ్మని ఆదేశం లభించింది. గాంధీజీ గారు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ కె.సంపత్ గిరిరావు గారిని ఏమో అడిగారు. తరువాత ప్రధానోపాధ్యాయులు నన్ను పిలిచారు. నేను వెళ్ళి గాంధీజీ ప్రక్కన నిలుచున్నాను.

ప్రేమతో నా భుజం మీద చేయి వేసి పైన పేర్కొన్న కొన్ని ప్రశ్నలను హిందీలో అడిగారు. నేను “హిందీ తోడా తోడా ఆతా హై” అన్నప్పుడు వారు నవ్వి నన్ను వాపసు పంపారు. నన్ను పిలిచిన ఉద్దేశం తరువాత అర్థమయ్యింది. గాంధీజీ గారు ఎక్కడ వెళ్ళినా జాతీయ భాష ఐన హిందీని నేర్చుకోవాలని చెప్పేవారు. విద్యార్థులందరూ హిందీని నేర్చుకోవాలని వారు ప్రతిపాదించేవారు. మా పాఠశాల పేరు, ఉపాధ్యాయుల ఖద్దరు దుస్తులు ఇంకా గాంధీ టోపీలు ధరించిన మమ్మల్నందరినీ చూసి మాకు హిందీ రావచ్చునని ఊహించి, తమ హిందీ ప్రసంగాన్ని కన్నడలోనికి తర్జుమా చేయడానికి ఒక విద్యార్థి కావాలని ప్రధానోపాధ్యాయునికి తెలిపారట. అందుకోసం ప్రధానోపాధ్యాయులు నన్ను పిలిచారు. గాంధీజీ గారితో ఆరోజు రెండు నిమిషాల ఆకస్మికమైన, ఆశ్చర్యకరమైన, అపూర్వమైన కలయిక ఇప్పటికీ నా మనసులో అచ్చుగుద్దినట్టు ఉంది.

నా జీవితంలో జరిగిన ఈ మహత్తర ఘటనను నేను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశ్యమో ఏమో ‘హిందూ పత్రిక’ దానిని ఫోటో తీసి మరుసటి రోజు సంచికలో ప్రచురించింది. నా సహాధ్యాయి ఒకరు పత్రిక నుండి దానిని కత్తిరించి తీసుకువచ్చి తరగతిలో నాకు అందజేశాడు. అతడు దానిని ఇవ్వకపోతే ఆ అపూర్వ సంఘటనను మరిచిపోయే వాడినేమో. ఆ కత్తిరించిన పేపరు ముక్కను చాలా రోజులు దాచి పెట్టుకున్నాను. ఆ తరువాత అది పోగొట్టుకుని పోయింది. తరువాత నేను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగారవాసాన్ని అనుభవించి వచ్చిన తరువాత ఆ ఫోటో ప్రాముఖ్యం బాగా తెలిసివచ్చింది. ఎలాగైనా హిందూ పత్రిక వారినుండి ఆ ఫోటో ఒక ప్రతిని సంపాదించాలని ఆలోచించాను. నేషనల్ హైస్కూలు ప్రకటిస్తున్న జాతీయ విద్యాశాల పత్రిక (1936లో ప్రకటింపబడిన) సహాయంతో మేము గాంధీగారిని కలిసిన తారీఖును తెలుసుకున్నాను. మద్రాసులో ఉన్న ‘హిందూ’ పత్రిక సంపాదకులకు తేదీ మరియు అన్ని వివరాలు తెలిపి ఆ ఫోటో ఒక ప్రతిని వీలైతే పంపవలసిందని ఒక లేఖ వ్రాశాను. ఇది జరిగిన సుమారు 8-10 రోజులలో నాకు అక్కడి నుండి ఆ ఫోటో కాపీ వచ్చినప్పుడు నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ఇది జరిగింది 1943లో. అప్పటి నుండి ఆ అమూల్యమైన ఫోటోను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను.

తండ్రి మరణం

ఎనిమిదవ తరగతి (ఫోర్త్ ఫారం)లో చదువుతున్నప్పుడు దసరా సెలవులకు ఊరికి వెళ్ళాను. ఉదయం యథాప్రకారం ముందే లేచి బావికి వెళ్ళి బట్టలు ఉతుకుకొని, ఈది రావడం, స్నేహితులతో గడపడం, పాఠ్యాంశాలను ఎంతోకొంత చదవడం, హిందీ పుస్తకాలను చదవడం, మిడిల్ స్కూలు ఆవరణలో ఉపాధ్యాయులతో, స్నేహితులతో ఆడుకోవడం, అప్పుడప్పుడు ఐదారు మంది స్నేహితులతో కొన్ని విషయాలను చర్చించడం మొదలైనవి నా దినచర్యగా ఉండేది.

ఒకరోజు సాయంత్రం అధ్యాపకుల ఇంటినుండి మా ఇంటికి వచ్చాను. నీళ్ళు త్రాగి ఆడుకోవడానికి బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మా తండ్రిగారికి కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేదు. తీవ్రమైన జబ్బు అని ఎవరికీ అనిపించలేదు. నన్ను చూడగానే నీళ్ళు కావాలని అడిగారు. నీళ్ళు తీసుకుని వచ్చి వారికి త్రాగించాను. తరువాత ఒకటి రెండు నిముషాలకే మా తండ్రి తుదిశ్వాస విడిచారు. నేను ఏ కర్మకాండలనూ చేయలేదు. నా వెంట్రుకలను తీయించుకోమని మరుసటిరోజు మా తల్లిగారు చెప్పారు. “నా తల వెంట్రుకలకూ, నా తండ్రి చచ్చిపోవడానికి ఏమి సంబంధం?” అని మా తల్లిగారిని అడిగాను. ఇంతవరకూ ఎవరూ ఈ ప్రశ్నకు అథవా ఇలాంటి ప్రశ్నలకు సమంజసమైన సమాధానం ఇవ్వలేనప్పుడు, పాపం! మా తల్లిగారి నుండి సమాధానం ఆశించడం సరైనది కాదు. నీ ఇష్టం వచ్చినట్లు చేయమన్నారు. వెంట్రుకలు తీయించుకోలేదు.

మా తల్లిగారి ఒక మంచి గుణం ఏమిటంటే నా అభిప్రాయాలకు అడ్డం వచ్చేవారు కాదు. ముందునుండి వచ్చిన నమ్మకాలను నామీద రుద్దేవారు కాదు. ఇంటిలో ఎప్పుడూ చిన్నచితక పూజలు నడిచేవి. నాకు వాటిమీద ఎక్కువ శ్రద్ధ ఉండేది కాదు. వాటిని వ్యతిరేకించనూ లేదు. మా తండ్రి మరణించిన పదవరోజు కొంతమంది దూరపు చుట్టాలకు, స్నేహితులకు భోజనం పెట్టిన జ్ఞాపకముంది.

మా తండ్రిగారు కాలంచేసిన తరువాత సంసారాన్ని నడిపే పూర్తి జవాబుదారీ మా తల్లిగారి మీద పడింది. అంతకుముందూ కొంచెం అటూఇటుగా మా తల్లిగారే సంసారాన్ని నడిపేవారు. మాయిద్దరు పిల్లలను కాపాడటానికి మా తల్లి ఎక్కువ కాలం బ్రతికి ఉండాలని మా తండ్రిగారు అప్పుడప్పుడూ అనేవారు. మా తండ్రి మరణం తర్వాత నలుగురున్న సంసారం మూడుకు దిగింది. నా చెల్లెలు స్కూలుకు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు వెళ్ళింది. చదువుసంధ్యలు ఆమెకు అబ్బక పోవడానికన్నా ఎక్కువ ఆమె సహాయం మా ఇంటికి అవసరం ఉన్నందున ఆమె చదువు అటకకెక్కింది. ఇదే కారణంతో నా విద్యాభ్యాసమూ మూలన పడివుంటే ఈ జ్ఞాపకాలను వ్రాసే అవకాశమే లేకపోయేది. హొసూరే నా ప్రపంచమై ఉండేది.

విద్యార్థి నిలయంలో దినచర్య

బీదపిల్లల విద్యార్థి నిలయంలో పెంకులుకప్పిన ఐదు గదులుండేవి. 10-12 మంది విద్యార్థులకే అందులో చేరే అవకాశం. విద్యార్థి నిలయం వరండాలోనే భోజనం పెట్టేవారు. వాన, ఈదురుగాలులు వీస్తే భోజనం చేయడానికే అయ్యేది కాదు. విద్యార్థి నిలయానికి ఎదురుగావున్న వ్యాయమశాలలో చన్నీళ్ళ స్నానం చేయాలి. ఆ పది పన్నెండు మంది విద్యార్థులలో ముగ్గురు నలుగురు విద్యార్థులకే ఉచిత భోజనం ఉచిత వసతి సౌకర్యం ఉండేది. మిగిలినవారు డబ్బులు కట్టాలి. వారికి నెలకు భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 6 రూపాయలు. ఈ కాలంవారు ఎప్పటికీ దీనిని నమ్మరు. ఇప్పుడు 6 రూపాయలకు రెండు ఇడ్లీలు, కాఫీ కూడా రాదుకదా. నలుగురైదుగురికి వారాన్న సౌకర్యం. వారు వారానికి ఒకటి నుండి మూడు రోజులు ఉచితంగా భోజనం చేసుకుని వెళ్ళవచ్చు. “వారానికి ఒక పిడికెడు బియ్యం, నాలుగణాలు దానం చేయండి” అని పురజనులకు విద్యార్థి నిలయం అభ్యర్థించేది. చాలా మంది క్రమం తప్పకుండా వారానికి ఒక పావు బియ్యమో, అరపావు బియ్యమో ఇంకా నాలుగణాలో, ఎనిమిదణాలో ఇవ్వడానికి అంగీకరించారు. ఉచిత భోజన వసతి సౌకర్యం పొందినవారు, వారాన్నభోజనం వారు ప్రతి ఆదివారం ఉదయం భుజానికి సంచి తగిలించుకుని చందా కార్డును పట్టుకుని దాతలనుండి బియ్యాన్ని, ధనాన్ని సేకరించేవాళ్ళం.

ముందే చెప్పినట్లు విద్యార్థి నిలయంలో క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలి. ఉచిత సౌకర్యం పొంది నిలయంలో ఉన్న విద్యార్థులకు విరామం లేని పని. నిలయంలో ఉన్న రెండేళ్ళూ నేనే పర్యవేక్షకుడిని. స్నేహితుల సహాయంతో అంగడికి వెళ్ళి సామాన్లు తెచ్చేవాడిని. తెచ్చినదానికి, మరియు వంటవారికి ఇచ్చినదానికి వివరమైన లెక్కలు వ్రాసేవాడిని. నెలాఖరుకు మొత్తం తెచ్చిందీ, ఉపయోగించిందీ, మిగిలిందీ అంతా సరిపోవాలి. ఆదివారం ఉదయం శ్రేయోభిలాషుల ఇళ్ళకు వెళ్ళి బియ్యము, ధనమూ సేకరించేవాణ్ణి. ఒక శ్రేయోభిలాషి ఇల్లు – ఇప్పుడు బి.వి.కె.అయ్యంగార్ వీధి ఉంది కదా – అక్కడుంది. విద్యార్థి నిలయం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరం. వారు రెండు వారాలకోసారి సేరు బియ్యం ఇచ్చేవారు. ఒక గోనెసంచిని భుజానికి తగిలించుకుని అలో లక్ష్మణా అనుకుంటూ అంత దూరం వెళ్ళి (నడుచుకుని అని పదే పదే చెప్పనక్కరలేదు) బియ్యం తీసుకుని వాపసు వచ్చేవాణ్ణి. మిగిలిన మొత్తం సేకరణ రెండు మూడు సేర్ల బియ్యం అయ్యేది. పంక్తిలో కూర్చున్నవారికి భోజనం వడ్డించడం, భోజనశాలను శుభ్రం చేయడం చేసేవాడిని. ఆవరణలోనే వెంకటయ్య అనే స్కూలు ప్యూన్ ఇల్లుండేది. అతడు వాచ్‌మ్యాన్‌గా కూడా పనిచేసేవాడు. అతని ఇంటివారు పాత్రలను తోమేవారు.

ఉదయం ఐదు గంటలకు గాంధీజీ గారి సబర్మతీ ఆశ్రమపు ప్రార్థన ముగించి, వ్యాయామశాలలో వ్యాయామం చేసి, అక్కడి నల్లా క్రింద కూర్చుని స్నానం ముగించి వచ్చేసమయానికి ఆరుగంటలయ్యేది. ఒకటిరెండు గంటలు చదువు. తరువాత నిలయపు పని.

మధ్యాహ్నం విద్యార్థి నిలయంలో పాఠశాలకు చెందిన 80-100 మంది బీదవిద్యార్థులకు ఉచితంగా ఉపాహారం ఇచ్చేవారు. ఒక్కొక్కరోజు పులుసన్నం, పెరుగన్నం, ఉప్మా, చిత్రాన్నం, అటుకులు ఇలా ఒక్కొక్కరకమైన తిండిని పెట్టేవారు. దీని వ్యవస్థ అంతా విద్యార్థి నిలయానిదే. సాయంత్రం కూడా నిలయపు పని ఎక్కువగా ఉండేది. సమయం చిక్కినప్పుడు చదువుకునేవాడిని. రాత్రి నిలయం పని ముగించి 8.30 లేదా 9 గంటలకు చదువుకోవడానికి కూర్చునేవాడిని. సుమారు 11 గంటలవరకూ చదువు కొనసాగేది. ఉదయంపూట ఒక గంటకన్నా ఎక్కువ సమయం చిక్కేదికాదు. సమయాభావం వల్ల సమయాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకున్నాను.

పడుకోవడానికి పరుపులు లేవు. ఉన్న చాప చిరిగిపోయిన తరువాత గోనె సంచులే పట్టు పరుపులు. చదువుకోవడానికి పూర్వకాలంలో కరణాలు ఉపయోగించేటువంటి డెస్క్. అదీ విద్యార్థి నిలయానిదే. నేను రెండేళ్ళు నివసించింది మొదటి గదిలో. దానిలోనే నిలయపు పాలకులైన శ్రీ కె.శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. వారు 1934లో ప్రారంభమైన ఎలిమెంటరీ స్కూలు టీచరు. వారు చాలా కఠినంగా ఉండేవారు. అన్నిపనులు చక్కగా, నచ్చేలా చేయాలి. సగం సగం పనులను వారు సహించేవారు కాదు. కసువు వూడ్చడం మొదలుకొని అన్ని పనులను అతి శ్రద్ధతో చేసేలా మార్గనిర్దేశనం చేసేవారు. తప్పు చేస్తే దండించేవారు కూడా.

కాలణా

తిండి తినడానికి హోటల్‌కు పోయే అలవాటు లేదు. డబ్బులు లేకపోవడం మొట్టమొదటి కారణం. అంత అవసరం లేకపోవడం మరో కారణం. విద్యార్థి నిలయంలోనే రెండుపూటలా భోజనం, మధ్యాహ్నం పూట ఫలహారం లభించేది. శనివారమో లేక ఇంకే సెలవు రోజునో ఆకలైతే అపురూపంగా హోటల్‌కు వెళ్ళేవాడిని. కాఫీ, టీలు తాగేవాడిని కాను. సాదా దోసె చాలా ఇష్టం. ఆకలిని చల్లార్చుకోవడానికి అది అగ్గువ తిండి. నిలయానికి సమీపంలోని నాగసంద్ర రోడ్డు (ప్రస్తుతం డా.డి.వి.జి.రోడ్డు)లో ఉన్న ఒక హోటలుకు ఒకరోజు వెళ్ళాను. ఒక సాదా దోసె చెప్పాను. ఎప్పటిలాగా మూడుసార్లు చట్నీ వేయించుకున్నాను. ఆకాలంలో చట్నీ చాలా రుచిగా ఉండేది. కొబ్బరి చట్నీ. రెండవసారి గొణగకుండా చట్నీ వేసేవాడు. మూడవసారి అడిగినప్పుడు ముఖం గంటు పెట్టుకుని కొంత చట్నీని ప్లేటులో విదిలించి పోయేవాడు. చట్నీ తినడాని కోసమే దోసె ఆర్డరు చేయడం ఒక నెపమేమో అనే సంశయం కలిగేది. బహుశా అది నిజం కూడా. తిన్న తరువాత డబ్బులు ఇవ్వడానికి గల్లాపెట్టె దగ్గరికి వచ్చాను. అక్కడ స్థూలకాయుడైన హోటల్ యజమాని కూర్చున్నాడు. అతని రంగు దాదాపు నా శరీరపు రంగే. నోటి నిండా కిళ్ళీ వేసుకున్నాడు. స్పష్టంగా మాట్లాడటానికి కష్టంగా ఉంది అతనికి. ఎదురుగా ఉన్న వంటిల్లువైపు చూస్తూ చేతిలో ఉన్న ఒక లోహపు కడ్డీని బల్లపై కొడుతూ “లెక్క” అని అరిచాడు. నాకు దోసె ఇచ్చిన సర్వరు కాఫీ చేస్తూ ఒక లోటానుండి ఇంకో లోటాకు చాలా చమత్కారంగా తన రెండు చేతులు ఎంత దూరం చాపవచ్చో అంత దూరం తీసుకుపోయి ఉన్న కాఫీని ఆ లోటాల మధ్య ఒక సరళరేఖ వచ్చేలా చేస్తూ ఉన్నాడు. క్రింది లోటా పైకి, పై లోటా క్రిందికి చేస్తూ కాఫీని కలుపుతూ ఉన్నాడు. యజమాని “లెక్క” అన్న తక్షణం ఆ వెయిటర్ నావైపు చూసి కాలణా అంటూ హోటల్ అంతా వినబడేటట్టుగా అరిచాడు. హోటల్లో తింటున్నవారందరూ ఆసక్తిగా నావైపు చూశారు. ఇప్పటిలాగానే ఆ కాలంలో కూడా కాఫీ తాగడం సాధారణమైన అలవాటు. ఒకరకంగా చెప్పాలంటే కాఫీ త్రాగడం స్టేటస్ సింబల్. తిండి తిన్నతరువాత కాఫీ త్రాగకుండా వచ్చేవారు చాలా అరుదు. కాఫీ మాత్రమే చాలా మంది త్రాగేవారు. ఒక లోటా కాఫీ ధర అర్ధణా. కాలణాకు ఒక సాదా దోశ లేదా ఒకే ఒక ఇడ్లీ వచ్చేది. ఎవరో ఒకే ఒక సాదా దోసె లేదా ఒకే ఒక ఇడ్లీ తిని కాఫీ త్రాగకుండా వెళుతున్నారన్న అనుమానం కలిగి ఆ వ్యక్తిని చూడాలన్న కుతూహలంతో అందరూ నావైపు చూశారు. “ఎంతమందైనా నన్ను చూడనీ. నాకు కావాల్సింది కావలసినంత చట్నీ ఒక సాదా దోసె అంతే” అని నాకు నేనే సమాధానం చెప్పుకుని నిరాటంకంగా బయటకు వచ్చాను.

భవిష్యత్తు గురించి యోచన

మొదటి నుండీ నాకు చదువుపై చాలా ఆసక్తి. పాఠాలు వినడంలో ఎప్పుడూ విసుగు కలుగలేదు. చదవడం, విషయాన్ని అర్థం చేసుకోవడం మొదలైనవాటికి ఎప్పుడూ వాయిదా వేయలేదు. తరగతిలో వీలైనంత దృష్టిపెట్టి ఏకాగ్రతతో పాఠాలను తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఏరోజు పాఠాలను ఆరోజే చదివేవాడిని. సమయం దొరికినప్పుడల్లా చదివేవాడిని. కొన్ని రోజులు సాయంత్రం సమయం దొరికినప్పుడు గదిలో ఒక్కడినే కూర్చొని చదివేవాడిని. నిలయంలోని సహవిద్యార్థులు, “ఒరేయ్ పుస్తకాల పురుగా! సాయంకాలమంతా చదువుతున్నావా, లేక పుస్తకాలను నములుతున్నావా” అని గేలి చేసేవారు. ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలో ప్రథమశ్రేణిలో పాస్ కాకపోతే నా చదువు అక్కడే ముగిసిపోతుందన్న స్పృహ నాకు బాగావుంది. అది నా భవిష్యత్తు బాగోగులను నిర్ధారించే పరీక్ష. నేనెప్పుడూ దేనిని అదృష్టానికి వదిలిపెట్టలేదు. మొదటినుండి పద్ధతి ప్రకారం నడుచుకోవడంలో ఎక్కువ నమ్మకముండేది. అందువల్ల దృఢమనస్సుతో మొదటినుండీ కష్టపడి చదవడమే నా పని. ఏ పరీక్షలోకూడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించి వాటినే ఎక్కువగా చదవడం కానీ, పోయిన సంవత్సరం ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలను చదవకుండా వదిలిపెట్టడంగానీ ఎప్పుడూ చేయలేదు. పాఠంలో ఉన్నదంతా పొల్లుపోకుండా చదివేవాణ్ణి. కొన్నిసార్లు ఆమూలాగ్రంగా చదివేవాణ్ణి. అందుకే నాకు చదవడానికి ఎక్కువ సమయం కావలసి వచ్చేది. ఆ కాలంలో కులం ఆధారంగా ఎక్కువ సౌకర్యాలు లేవు. వెనుకబడిన వర్గాలవారికి స్కాలర్‌షిప్ ఇచ్చేవారు. రెండు స్కాలర్‌షిప్పులు ఇవ్వదగిన పేదరికం, మార్కులూ ఉన్నా నాకు ఏ సంవత్సరమూ స్కాలర్‌షిప్ రాలేదు. రావడానికి తప్పనిసరిగా కావలసిన సిఫారసు నాకు లేదు.

ముందు చదవాలంటే ఉచిత భోజనవసతి, పూర్తి ఫీజు మాఫీ నేను పొందే తీరాలి. ఇవి నాకు కనీస అవసరాలు. అప్పుడు నాకు తెలిసినట్లు శ్రీరామకృష్ణ స్టూడెంట్స్ హోమ్, చామరాజుపేట లోని బి.కె.మరియప్ప హాస్టల్ మతాతీతంగా ఉచిత బోజన వసతి సౌకర్యాలను అందించే విద్యార్థి నిలయాలు. అది ఎక్కువ పోటీ ఉన్న కాలం. అత్యధికమైన మార్కులను పొందకపోతే ఆ విద్యార్థి నిలయాలలో ప్రవేశం దొరకే అవకాశం చాలా తక్కువ. అందువల్ల ఆరునూరైనా సరే ప్రవేశం పొందాలనే ఏకైక దృష్టితో కాలాన్ని వృధా చేయకుండా ఎక్కువగా చదివేవాడిని. అటువంటి ఒక జవాబుదారీ స్పృహ, చదువులో తీవ్రమైన ఆసక్తి, దృఢనిశ్చయం, స్వయంకృషి విలువ, ప్రజ్ఞ లేకపోతే నేను చదువును కొనసాగించడం సాధ్యమయ్యేది కాదు. పైగా ఏ రంగంలోనూ కీర్తిని పొందగలిగేవాడిని కాను.

ఫోర్త్ ఫారం, ఫిఫ్త్ ఫారం (ఇప్పటి ఎనిమిదో తరగతి, తొమ్మిదో తరగతి) తరగతి పరీక్షలలో సునాయాసంగా ఉత్తీర్ణుడై ఎస్.ఎస్.ఎల్.సి తరగతిలో ఇంకా ఎక్కువ శ్రద్ధతో చదివాను. ముందే చెప్పినట్లు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష నా భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైన పరీక్ష. పరీక్షా కేంద్రం ప్రక్కనే ఉన్న ప్రభుత్వ ఫోర్ట్ హైస్కూలు. రోజూ రెండు పరీక్షలను వ్రాయాలి. ఏ ఒక్క సబ్జెక్టులో ఫెయిలయినా మళ్ళీ అన్ని సబ్జెక్టులనూ చదివి మొత్తం అన్ని పరీక్షలూ వ్రాయాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here