‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -5

0
13

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

చిత్రాన్నం

[dropcap]ఎస్[/dropcap]. ఎస్. ఎల్. సి పరీక్షలు నడుస్తున్న సందర్భంలో జరిగిన ఒక సంఘటన ఇంకా గుర్తుంది. చివరి రోజు చరిత్ర, భూగోళం పరీక్షలు. చరిత్ర, భూగోళాలలో అంత ఎక్కువ ఆసక్తి నాకు లేదు. పాఠాలు గుర్తు పెట్టుకోవడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉండాలి. కంఠోపాఠం చేసే శక్తి ఉన్నవారికి ఈ విషయాలు సులభం. పరీక్ష మునుపటి రాత్రి భోజనం చేసి నిలయంలో పరీక్ష వ్రాస్తున్న ముగ్గురు నలుగురు విద్యార్థులు రాత్రంతా చరిత్ర, భూగోళాలను చదవాలని నిశ్చయించుకున్నాము. ఎలాగైనా చివరిరోజు నిద్ర చెడిపోయినా మరుసటిరోజు పరీక్షలైన తరువాత హాయిగా నిద్రపోవచ్చనే ధైర్యం. మేము ఒకే గదిలో కూర్చుని చదవడం మొదలుపెట్టాము. సుమారు రాత్రి ఒంటిగంటకు ఒక విద్యార్థి తనకు ఆకలవుతుందని అన్నాడు. అతడలా అన్న తరువాత మాకూ అలాగే అనిపించింది. పుస్తకాలను పక్కకు పెట్టి ఆ వేళలో ఆకలి పోగొట్టుకోవడానికి ఏమి చేయాలని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాము. చిత్రాన్నం చేసుకుని తినడం సరైనపని అని నిర్ధారణకు రాగానే దానికి కావలసిన ఏర్పాట్లను చేసుకోవడం మొదలెట్టాము. దానికి కావలసిన బియ్యము, నూనె, టెంకాయ మొదలైన సామాగ్రిని తీసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకొని చిత్రాన్నం తయారు చేయడంలో నిమగ్నమైనాము. తెల్లవారు ఝాము రెండు గంటల సమయానికి చిత్రాన్నం రెడీ అయ్యింది. 15-20 నిముషాలలో బాగా తిని మరుసటిరోజు పరీక్షను గుర్తు చేసుకుని మా చదువును కొనసాగించాము. 10-15 నిముషాల తరువాత అందరికీ బలమైన నిద్రమత్తు ఆవరించింది. అక్షరాలు మసకగా కనిపించసాగాయి. తల బ్యాలెన్స్ తప్పింది. ముందుకు వెనుకకు తూగసాగాము. నిద్రను పోగొట్టుకోవడానికి 10-15 నిముషాలు గాలికి తిరిగిరావడం ఉత్తమమని భావించి పుస్తకాలను అక్కడే వదిలిపెట్టి అందరూ సుమారు రెండున్నర గంటలకు వాకింగ్‌కు వెళ్ళాము. గాంధీబజార్ చుట్టుకొని ఇప్పటి టాగూర్ సర్కిల్ గుండా నిలయానికి వాపసు వచ్చి మా చదువును ముందుకు కొనసాగించడానికి ప్రయత్నించాము. బలమైన చిత్రాన్న భోజనం, మా వాకింగూ రెండూ చేరి తట్టుకోలేని నిద్ర వచ్చింది. మాకు స్పృహ లేకుండా మా ముందున్న డెస్కుపై తల పెట్టి గాఢంగా నిద్రపోయాము. ఒకడికి సుమారు ఐదు గంటలకు మెలకువ వచ్చింది. మమ్మల్నందరినీ నిద్ర లేపాడు. నాకేమో చాలా గాభరా అయ్యింది. ఒంటిగంట నుండి ఐదు గంటలవరకు చిత్రాన్నం తయారుచేయడం, తినడం, నిద్ర, వాకింగు, మళ్ళీ నిద్ర. అమూల్యమైన నాలుగు గంటల కాలం వృథా అయ్యింది కదా అని బాధ. మిగిలిన కాలంలో అయినంత చదివి ప్రొద్దున 10 గంటల పరీక్షకు పోయాము. మామూలుగానే తృప్తిగా సమాధానాలు వ్రాశాను.

ఫలితాంశం

ఆ ఏడాది వేసవి శిక్షణా శిబిరాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. భోజన ఫలహారాల వ్యవస్థ మా విద్యార్థి నిలయానిదే. ఇది మొదటి శిబిరం కాదు. ఇలాంటి వాటిని మా పాఠశాల సాధారణంగా ప్రతియేటా నిర్వహించేది. వీటి నిర్వహణలో నేను చురుకుగా పాల్గొనేవాడిని. ఇదొక అమూల్యమైన అనుభవం. నా పాఠశాల స్వయంసేవక దళంలో మూడు సంవత్సరాలు ఉన్నాను. క్రమశిక్షణను, అందరికీ ఆమోదయోగ్యంగా పనిచేయడాన్ని నేర్చుకున్నాను. పాఠశాల అన్ని కార్యక్రమాలలోనూ స్వయంసేవకునిగా పనిచేశాను. గీతాజయంతికి ఎక్కువమంది ఆహ్వానితులు వచ్చేవారు. వారి చెప్పులను కాపలా కాయడమే మా ముఖ్యమైన పనిగా ఉండేది. నేను శిబిరం ముగించుకుని ఊరికి వెళ్ళి, పరీక్షా ఫలితాలు వెలువడేనాటికి కొన్ని రోజులముందే నిలయానికి వాపసు వచ్చాను. పరీక్షా ఫలితాలను ఒక సాయంత్రం న్యూ పబ్లిక్ ఆఫీస్ ఆవరణలో ప్రకటిస్తారనే వార్తను పత్రికలలో చదివాము. సహజమైన ఉత్సుకతతో మేమంతా అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫలితాలను రెండు భాగాలుగా ప్రకటించారు. ఒకటి ఇసిపి & ఎస్ లిస్ట్. అంటే ఎలిజిబిలిటీ ఫర్ కాలేజ్ అండ్ పబ్లిక్ సర్వీస్. ఇపిఎస్ లిస్టులో పాసైన వారికి కాలేజీలో ప్రవేశం లేదు. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉంది. ఇసిపి & ఎస్ పాసైన వారికి రెండింటికీ అర్హత ఉంది. సహజంగా నేను మొదట ఇసిపిఎస్ పట్టికను చూశాను. నా నెంబరు లేదు. నా గుండె పగిలింది. ఒకటి రెండు నిముషాలు దిక్కు తోచలేదు. ఇంకో పట్టిక చూడడానికి మనసు రాలేదు. అంతలో నా మిత్రుడు ఒక్కడు నేను ప్రథమశ్రేణిలో ప్యాస్ ఆయ్యానని చెప్పి అభినందించాడు. మొదలు నేను నమ్మలేదు. మనసుకు కొంచెం గందరగోళమయ్యింది. నేను ఫస్ట్ క్లాసులో పాసయ్యానని ఎక్కడ ఉంది అని అడిగాను. ఇపిఎస్ లిస్టులో ఉంది అని చెప్పాడు. ఆ పట్టికలోని నంబర్ తలపైన ఒకటి గుర్తు ఉంటే ప్రథమ శ్రేణి అని ప్రకటించినట్టు అని తెలిపాడు. సంతోషాన్ని కొంత సేపు బిగపట్టుకుని ఆ పట్టికను చూసి నేను ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనట్టు నిర్ధారించుకున్నాను. ఇప్పుడు ఎనలేని సంతోషమయ్యింది. మా పాఠశాల నుండి నాకు జ్ఞాపకం ఉన్నట్లు ఐదుమంది ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. నేను మూడవవాడిని. నా ప్రయత్నం సార్థకమయ్యిందని సమాధానపరచుకొన్నాను. ఒక అధ్యాయం ముగిసింది. తరువాత అధ్యాయం గురించిన ఆలోచన మొదలయ్యింది.

కాలేజీ చదువు

ఇంటర్మీడియట్ కాలేజి

నేషనల్ హైస్కూలులో నేనున్న బీద విద్యార్థినిలయం ఆ పాఠశాల విద్యార్థులకే పరిమితం. అందువల్ల కాలేజీ విద్యాభ్యాసానికి మరొక ఉచిత విద్యార్థి నిలయాన్ని వెదకడం అవసరమయింది. మా పాఠశాల సమీపంలోనే విశ్వేశ్వరపురంలో ఉన్న శ్రీ రామకృష్ణ స్టూడెంట్స్ హోమ్, చామరాజపేటలోని బి. కె. మరియప్ప హాస్టళ్ళ గురించి నేను నేషనల్ హైస్కూలులో చదివే సమయంలోనే తెలుసుకున్నాను. రెండూ కూడా ఉచిత విద్యార్థి నిలయాలు. అన్ని మతాలవారికీ వాటిలో ప్రవేశముంది. రెండు చోట్లా ప్రవేశ పత్రాలను తీసుకునివచ్చి నింపి ఇచ్చాను. బి. కె. మరియప్ప హాస్టల్లో మొదట ఇంటర్వ్యూ అయ్యి నాకు ప్రవేశం చాలా సునాయాసంగా దొరికింది. ఆ కాలంలో ప్రథమశ్రేణిలో పాస్ ఐనవారు చాలా తక్కువ. ప్రథమ శ్రేణితో పాటు తగినంత బీదరికమూ నాకున్నది. వీటి ఆధారంగా ఆ నిలయంలో ఉచిత బోజన వసతుల సౌకర్యం లభించింది.

బి. కె. మరియప్పగారు ప్రసిద్ధులైన వ్యాపారస్థులు. వారికి సంతానం లేదు. వారు 1921వ సంవత్సరంలో ఒక ఉచిత విద్యార్థి నిలయాన్ని చామరాజపేటలో స్థాపించారు. దానిలో 15 మంది బ్రాహ్మణ విద్యార్థులు, 15 మంది నగర్త (లింగాయతులకు సమీప జాతి) విద్యార్థులు, తక్కిన 15 మంది బ్రాహ్మణేతర విద్యార్థులు మొత్తం విద్యార్థుల సంఖ్య 45. బి. కె. మరియప్పగారు ఆ కాలంలోనే తమ విశాల హృదయాన్ని, ఉదార మనోభావాన్ని వ్యక్తీకరించి శుద్ధ, కర్కశ మతవాదులకు ఒక మార్గదర్శిగా నిలిచారు. రెండు వంటశాలలు. నగర్త విద్యార్థులకు ఒకటి, బ్రాహ్మణ, బ్రాహ్మణేతర విద్యార్థులకు మరొకటి. భోజనం మూడు గుంపులకు వేర్వేరుగా మూడు భోజనశాలలో ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం మాత్రం ప్రార్థన ఉండేది. ఇప్పుడవన్నీ పోయి వంట, భోజనం అందరికీ ఒకేచోట చేస్తున్నారు. సెంట్రల్ కాలేజ్ ముందున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1938లో నేను ఇంటర్మీడియట్ విద్యార్థిగా చేరాను. దాని వ్యవధి ఇప్పటి ప్రీయూనివర్సిటీలాగా రెండు సంవత్సరాలు. భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, గణితశాస్త్రము నా ఐచ్ఛికాంశాలు. అప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ శేష అయ్యంగార్ గారు.

పొద్దున తొమ్మిది గంటలకు భోజనం చేసుకుని సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి చెప్పులు లేకుండా నడుచుకుని వెళ్ళేవాడిని. సాయంత్రం తరగతులు ముగించుకుని వాపసు నడుచుకుని వచ్చేవాడిని. రాత్రి 7.30 గంటలకు భోజనం. ఈ రెండు భోజనాలు తప్పితే ఇంకే తిండీ లేదు. కొన్ని రోజులు కాలేజీలో మధ్యాహ్న ఉచిత ఉపాహార సౌకర్యం ఉండేది. నా ద్వితీయ భాష సంస్కృతం. సంస్కృత తరగతిలో అందరూ హేమాహేమీలైన విద్యార్థులే. మొదటి నుండీ అటువంటి వారిని ఎదుర్కోవడమే నా పనిగా ఉండేది. నాది అదే వేషధారణ. తెల్ల చొక్కా, దట్టీపంచ, గాంధీ టోపి. ఉప్పారహళ్ళిలో మా తండ్రిగారి శిష్యులైన శ్రీ అజ్జప్ప మరియు శ్రీ చిక్కనరసప్ప గారలు నా హితైషులుగా వున్నారు. శ్రీ అజ్జప్పగారు ఒక రెండు సంవత్సరాలు నెలకు ఐదు రూపాయల చొప్పున అప్పు ఇచ్చారు. దానిని నేను అధ్యాపకుడైన తరువాత తిరిగి చెల్లించాను.

మా తరగతులు ప్రార్థనతో ప్రతినిత్యం ప్రారంభమయ్యేది. నేషనల్ హైస్కూలులోని ప్రార్థనే ఇక్కడ కూడా. ప్రతియేటా కొంతమంది నేషనల్ హైస్కూలు విద్యార్థులు ఈ కాలేజీలో చేరేవారు.

ఉద్యమాలు

అప్పుడు ఎక్కడ చూసినా ఉజ్వలమైన దేశాభిమానం కనిపించేది. ప్రతి నిత్యం మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్ర బోసుల ప్రసంగాలను చదివి యువకులంతా స్ఫూర్తిని పొంది వున్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట అసహాయ ఉద్యమాలు, నిషేధ ఉత్తర్వులు. వీటిని ఉల్లంఘించి వందలాది ప్రజలు జైళ్ళకు వెళ్ళేవారు. స్వాతంత్ర్యం పొందడానికి ఈ విషయాలన్నీ పరిచయం చేస్తూ ప్రజలకు శిక్షణ ఇచ్చేవాళ్ళం. ఎన్నోసార్లు నాయకుల ఉపన్యాసాలను బ్రిటిష్ ప్రభుత్వం దేశద్రోహంగా పరిగణించి వారికి శిక్ష విధించేది. సుభాష్ చంద్ర బోస్ అన్నగారైన శరత్చంద్ర బోస్ కాలేజీ సభాప్రాంగణంలో వీరావేశంగా ప్రసంగించారు. అంతటా స్వదేశీ దృక్పథం, దేశాభిమానం పొంగిపొర్లేది. యువకులైతే నాయకులను కాపాడటంలోనూ, ప్రతిఘటనలోను, పోలీసు దౌర్జన్యాలను ఖండించడంలోను, అన్నింటిలోను ముందంజలో ఉండేవారు. అప్పుడున్నది ఒకే ఒక రాజకీయపార్టీ – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దాని ఏకైక లక్ష్యం బ్రిటిష్ పాలన నుండి బంధవిముక్తులై స్వాంతంత్ర్యాన్ని సాధించడం. అందువల్ల ఆ ఉద్దేశమున్న వారందరూ ఒకరకంగా కాంగ్రెసువారే. ఇప్పుడున్న కమ్యూనిస్టు నాయకులు కొందరు అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. పేరెన్నిక గన్న కమ్యూనిస్టు నాయకుడు ఇ.ఎం.ఎస్.నంబూదిరిపాద్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఉన్నట్లు నేను ఎక్కడో చదివిన జ్ఞాపకం. నాలో జాతీయభావాలు ఎక్కువగానే ఉన్నా నేనెప్పుడూ కాంగ్రెస్ పార్టీ లేదా ఇంకే రాజకీయ పార్టీ సదస్యుడిని కాలేదు. బొంబాయి మేయర్ అయిన కె. ఎఫ్. నారిమన్ గారు ఒకసారి బెంగళూరుకు వచ్చారు. వారు కాంగ్రెస్‌వాది. కబ్బన్ పేట సమీపంలో ఉన్న బసప్ప పార్కులో బహిరంగ సభ. 144 సెక్షన్ జారీ చేయబడింది అంటే బహిరంగ ప్రదేశాలలో ఐదుగురికన్నా ఎక్కువ మంది గుమికూడరాదు. ఎక్కువగా రాజకీయ బహిరంగ సభలన్నీ అదే పార్కులో జరిగేవి. కొన్ని తులసీకోట రైల్వే స్టేషన్ సమీపంలోని బస్టాండ్ పక్కన ఉన్న పార్కులో నడిచేవి.

144 సెక్షన్ జారీచేయడమూ, దాన్ని కాంగ్రెస్ వారు ఉల్లంఘించడము మామూలుగా జరిగేదే. ఇది జారీ చేసిన ప్రభుత్వానికీ తెలుసు, ఉల్లంఘించే ప్రజలకూ తెలుసు. భారీ బహిరంగసభ. నారిమన్ గారిని ముందే బంధించడానికి కుదరలేదు. వారు ఎట్లో తప్పించుకుని సాయంత్రం 6 గంటలకు బసప్ప పార్కు బహిరంగ వేదికపై ప్రత్యక్షమయ్యారు. వారు తమ ప్రసంగాన్ని ప్రారంభించ ముందే బసప్ప అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ అతని నేతృత్వంలోని సిబ్బంది సహాయంతో వారిని అరెస్టు చేశారు. ప్రజలు ఒక రకంగా ‘దాడి’ చేశారు. బలమైన లాఠీచార్జ్ జరిగింది. ఎవరూ వెనుకకు తగ్గలేదు. ప్రజలు పోలీసులను వెంబడించారు. వారు చావుదప్పి కన్ను లొట్టపోయి పక్క కాంపౌండులో నిలిపిన వాహనాలను ఎక్కారు. వారి మీద రాళ్ళు, చెప్పుల వాన కురిసింది. బసప్పగారు బహిరంగ సభలో నారిమన్ గారిని అరెస్టు చేయడం అత్యంత పిచ్చిపని అన్న విషయాన్ని అందరూ ఒప్పుకున్నారు. మరుసటిరోజు బెంగళూరు మొత్తం విద్యార్థుల సమ్మె.

ఇంత రాజకీయ గందరగోళమున్నా నా చదువుకు విడుపు లేదు. నాకు భాషా పాఠ్యపుస్తకాలు మినహా విద్యార్థి దశలో ఏ పుస్తకాలను కొనే పరిస్థితి లేదు. మరియప్పగారి విద్యార్థి నిలయంలోని నా సహవిద్యార్థులు మరియు నాకన్నా ఒకటి రెండేళ్ళ పైతరగతిలో చదివే విద్యార్థులున్నారు. వారినుండి పుస్తకాలను తీసుకుని చదివేవాడిని.

చదువు

నాకు ఏ పాఠమూ కష్టంగా కనబడలేదు. ఒక రోజు భౌతికశాస్త్రం క్లాసుపరీక్షల సమాధాన పత్రాలను మా ఉపాధ్యాయులైన శ్రీ కె.శ్రీనివాసరాఘవన్ గారు విద్యార్థులకు పంచుతూవున్నారు. నా పేరు పిలిచారు. లేచి నిలుచున్నాను. ఏ స్కూలు నుండి వచ్చావు అని అడిగారు. నేషనల్ హైస్కూల్ అని సమాధానం ఇచ్చాను. ఇంకెవరినీ ఇలా అడగలేదు. నాకు ఎందుకు అడుగుతున్నారని అర్థం కాలేదు. నా సమాధాన పత్రాన్ని చేతిలో పట్టుకుని నీకు అందరికంటే ఎక్కువ మార్కులు (90కన్నా ఎక్కువ అని మాత్రం జ్ఞాపకముంది) వచ్చాయి, అభినందనలు అని చెప్పి ఆ పత్రాన్ని నా చేతిలో పెట్టారు. ఆ రోజు నాకు చాలా సంతోషమయ్యింది. మా క్లాసులో ఎస్. ఎస్. ఎల్. సి.లో మొదటి రాంకుతో పాటు ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులున్నారు. క్లాసు పరీక్షలోనైనా వారిని ఓడించానన్న గర్వం నా ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంచింది.

జూనియర్ ఇంటర్మీడియట్ క్లాసు పరీక్షలు ముగించి మా హాస్టలుకు చెందిన ఒక స్నేహితుడి నుండి పేరుమోసిన హాల్ అండ్ నైట్ అధ్యాపకులు తయారు చేసిన ట్రిగొనామెట్రీ (త్రికోణమితి) పుస్తకాన్ని తీసుకుని ఊరికి వెళ్ళాను. అప్పుడు ట్రిగొనామెట్రీ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు బోధించేవారు. వేసవి సెలవుల్లో మొదటి 50 పేజీలవరకూ చదివి వాటిని జీర్ణం చేసుకుని నాలుగైదు లెక్కలు మినహా తక్కిన అన్ని లెక్కలను కేవలం స్వప్రయత్నంతో చేశాను. నాకు భౌతికశాస్త్రం కన్నా గణితశాస్త్రం అంటే ఎక్కువ ఇష్టం. ఎన్నో లెక్కలను నేనే స్వంతంగా చేసేవాణ్ణి. ఇదే నా స్వభావం. ఒక్కొక్కసారి లెక్క కష్టంగా ఉంటే దాని సమాధానం దొరకడానికి అర్ధగంట కన్నా ఎక్కువ సమయం పట్టేది. సమాధానం వెంటనే దొరకక పోతే నిరాశతో నా ప్రయత్నాన్ని వదిలిపెట్టేవాణ్ణి కాను. పట్టుదల పెరిగేది. ఏమైనా సరే సమాధానాన్ని పొంది తీరాలనే ధృఢ నిశ్చయంతో ప్రయత్నించేవాడిని. చాలా సమయం తరువాత సమాధానం దొరికితే కొలంబస్ అమెరికా కనిపెట్టినప్పుడు, ఆర్కిమెడిస్ స్నానపు తొట్టి నుండి యురేకా యురేకా అని అరుస్తూ వీధిలోనికి పరిగెత్తుకుని వచ్చినప్పుడు కలిగినంత సంతోషాన్ని పొందేవాణ్ణి. నేను ఉపాధ్యాయుడిని అయ్యాక విద్యార్థులకు ఇదంతా చెప్పి ఎంత సమయమైనా కానీ మీరు సమాధానం లభించేవరకూ మీ ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పాను. అప్పుడు ఒక విద్యార్థి లేచి నిలుచుని “నాకు అంత పంతం లేదు సార్. నాలుగైదు నిముషాలు ప్రయత్నిస్తాను. సమాధానం వచ్చిందా సరే. లేకపోతే ఆ లెక్కకు ప్రాప్తం లేదు” అని చెప్పి విద్యార్థుల నవ్వుల మధ్యలో నేను బోధించిన జ్ఞానాన్నంతా అరక్షణంలో బూడిదపాలు చేశాడు.

పరీక్షలు

మరియప్ప హాస్టల్లో కొంత మంది హైస్కూలు విద్యార్థులనూ చేర్చుకునేవారు. వారిలో కొంతమంది ఇంజనీరింగ్ చివరి పరీక్ష ముగిసేవరకూ హాస్టల్లోనే ఉచిత భోజన వసతుల సౌకర్యాన్ని అనుభవించేవారు. అంటే 8-9 సంవత్సరాలు హాస్టల్లోనే ఉండేవారు. జూనియర్ ఇంటర్లో హాస్టల్లో చేరి ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యే విద్యార్థులు ఆరేళ్ళు ఈ సౌకర్యాన్ని పొందేవారు. దీనివల్ల అర్హులైన ఇతర విద్యార్థులకు అవకాశం తగ్గిపోతుందని భావించిన హాస్టల్ మేనేజిమెంట్ కమిటీవారు ఒక పబ్లిక్ పరీక్ష ముగిసే వరకు మాత్రమే హాస్టల్లో ఉండే అవకాశమివ్వాలనే కొత్త నిబంధనను నేను జూనియర్ ఇంటర్మీడియట్‌లో చేరినప్పుడు ప్రకటించారు. సరే నా కష్టాలకు అంతులేదనుకున్నాను. హాస్టల్లో చేరినప్పుడు పట్టభద్రుణ్ణయ్యేంత వరకూ నేను కూడా నీడ గురించి నిశ్చింతగా ఉండవచ్చని భావించాను. ఇప్పుడు మనసు మళ్ళీ చింతించడం ప్రారంభమయ్యింది. సీనియర్ ఇంటర్ అయిన తర్వాత అన్ని మతాలవారికీ అవకాశముండే మరొక ఉచిత విద్యార్థి నిలయాన్ని వెదుక్కోవాలి. విశ్వేశ్వరపురంలో ఉన్న రామకృష్ణా స్టూడెంట్స్ హోమ్ ఒక్కటే నాకు తెలిసినంతవరకూ అటువంటి హాస్టల్. అక్కడ ప్రవేశం లభించడం అతికష్టమైన పని. బీదరికం మరియు ఎక్కువ ప్రతిభావంతులకే దానిలో చేరడానికి అవకాశం దొరికేది. నేను పట్టభద్రుణ్ణి కావాలంటే ఆ విద్యార్థి నిలయంలో ప్రవేశం పొందాలి. అంటే ప్రాణంపెట్టి చదవాలి. సీనియర్ ఇంటర్ పరీక్షలలో జూనియర్ ఇంటర్ విషయాలూ ఉండేవి. వేసవి సెలవులలో జూనియర్ ఇంటర్ సబ్జెక్టులను బాగా చదువుకొని వున్నాను. సీనియర్ ఇంటర్ నాకు అగ్నిపరీక్ష. ప్రతి విషయంలోనూ రెండు పేపర్లు. మొత్తం 200 మార్కులు. రోజుకు రెండు పేపర్లు. పొద్దున పది గంటల నుండి ఒంటి గంటవరకు ఒక పేపర్. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటలవరకూ ఇంకొక పేపర్. అంటే రోజుకు ఆరుగంటలు వ్రాయాలి. గణితపు మూడవ పేపర్ – మెకానిక్స్ అండ్ మెన్సురేషన్. ఎక్కువగా త్రీ డైమెన్షనల్ సాలిడ్ జ్యామెట్రికి చెందినది. సమాధానాలన్నీ సులభం. పరీక్ష ముగించుకుని బయటకు వచ్చాక స్నేహితుల సమాధానాలతో సరిపోలుచుకుంటే ఒక్కటి కూడా సరిపోయేది కాదు. ఎవరికి వారు తాము వ్రాసిందే కరెక్ట్ అని తృప్తి పడేవారు. పరీక్షకు నేను హాస్టల్నుండి వెళ్ళేటప్పుడు తీసుకుని పోయేది హాల్‌టికెట్, ఇంకా ఒక పెన్ను మాత్రమే. ఇప్పడు పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు ఒక బస్తాడు పుస్తకాలను మోసుకెళ్ళి చివరి నిమిషం దాకా, ఇంకా చెప్పాలంటే పరీక్ష మొదలైన కొన్ని నిమిషాల దాకా చదువుతారు. నేను ఎప్పుడూ అలా చేయలేదు. అంతే కాదు పరీక్షకు ముందురోజు కొంచెం నిమ్మళంగా ఉంటాను. నాకు ఇంతవరకూ ఏ పరీక్షలోనూ గాభరా, గందరగోళం కాలేదు. ఇప్పటి విద్యార్థులు ఆ ప్రశ్న కన్ఫ్యూజ్ అయ్యింది, ఈ ప్రశ్న కన్ఫ్యూజ్ అయ్యింది అని చెపుతారు. పరీక్షలో ఇలాంటి ప్రశ్నలే రావచ్చని నేను ఎప్పుడూ ఊహించేవాణ్ణి కాదు. ఇలా ఊహిస్తే అది లాటరీ అయ్యే సంభవముంది. పరీక్షలో లాటరీ అయితే నా జీవితం కూడా లాటరీ అయినట్టే. ఇంటర్మీడియట్ అత్యంత కష్టమైన పరీక్ష. ప్రతియేటా పాసయ్యేవారు 10 శాతం ఉంటారు. దానికన్న తక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. పరీక్షల ఫలితాంశం వచ్చింది. ఉన్నత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణున్నయ్యాను. రాష్ట్రం మొత్తం మీద 11వ స్థానమో, 12వ స్థానమో పొందాను. గణిత శాస్త్రంలో 200 మార్కులకు 186 మార్కులు వచ్చి రాష్ట్రంపైకి రెండవ స్థానంలో నిలిచాను. మొదటి స్థానం పొందిన అభ్యర్థికి లెక్కలలో 190 మార్కులు వచ్చాయి. 200 కు 200 మార్కులు ఏ విద్యార్థికీ రాలేదు. ఇప్పుడైతే 100 కి 100 మార్కులు వందలాది విద్యార్థులు గడిస్తున్నారు. మేము ఇప్పటి వారంత బుద్ధిమంతులం కాము. భౌతికశాస్త్రంలో అత్యంత ఎక్కువ మార్కులు 80 శాతమే. నాకు ఇంకో 15 మార్కులు రసాయనశాస్త్రంలో వచ్చివుంటే రాష్ట్రంలో మొదటి ఐదు స్థానాలలో ఒక స్థానాన్ని పొందగలిగేవాణ్ణి. ఈ తలంపు అప్పుడప్పుడూ మనసుకు బేజారును కలిగిస్తుంది.

సెంట్రల్ కాలేజి

విశ్వేశ్వరపురంలోని శ్రీ రామకృష్ణా స్టూడెంట్స్ హోమ్‌కు వెళ్ళివచ్చి ప్రవేశపత్రాన్ని తీసుకుని దానిని భర్తీ చేసి మళ్ళీ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాను. హాస్టల్ లోని ఒక విద్యార్థి నా అప్లికేషన్‌ని చూసి “ఏమండీ బి.ఎస్.సి.కి వెళతానని వ్రాశారు. ఇన్ని మార్కులు వచ్చాయి. మెడికల్‌కో, ఇంజనీరింగుకో వెళ్ళండి. సీటు ఖచ్చితంగా వస్తుంది. బి.ఎస్.సి. విద్యార్థులకు సాధారణంగా ఇక్కడ సీటు ఇవ్వరు.” అన్నాడు. “మెడికల్ లేదా ఇంజనీరింగుకు వెళ్ళడం సాధ్యం కాదు. వాటి వ్యవధి నాలుగేళ్ళు. పైగా ఫీజు పూర్తిగా మాఫీ అయినా అనేక ఖర్చులుంటాయి. నావద్ద అంత ధనం లేనే లేదు. వీలైనంత తక్కువ ఖర్చుతో రెండు సంవత్సరాల వ్యవధి ఉన్న బి.ఎస్.సి పట్టభద్రుడను కావాలని అనుకుంటున్నాను.” అని చెప్పాను. “మీరు పేదవాళ్ళంటున్నారు. మీకు ఇక్కడ సీటే దొరకకపోతే చదువును ఎలా కొనసాగిస్తారు? పోనీ మాథమాటిక్స్ లేదా ఫిజిక్స్ ఆనర్స్ కైనా చేరండి. ఇక్కడ సీటు దొరుకుతుంది” అన్నాడు. నేను అక్కడే బి.ఎస్.సి అనేదాన్ని బి.ఎస్.సి. ఆనర్స్ ఫిజిక్స్ అని తిద్ది సెంట్రల్ కాలేజీకి వెళ్ళి ఫిజిక్స్ ఆనర్స్‌కు అర్జీ పెట్టుకున్నాను. గణితశాస్త్రం ఆనర్సుకు వెళ్ళివుంటే సులభంగా సబ్జెక్ట్ స్కాలర్‌షిప్ లభించేది. అయినా భౌతికశాస్త్రమంటే కొంచెం ఎక్కువ అభిమానం ఉన్నందువల్ల భౌతికశాస్త్రపు ఆనర్స్‌లో ప్రవేశానికి అప్లికేషన్ వేశాను.

సెంట్రల్ కాలేజ్ విజ్ఞాన శాస్త్ర విషయాలకు ప్రసిద్ధి. అలాగే మైసూరులోని మహారాజా కాలేజ్ ఆర్ట్స్ అండ్ సోషియల్ సైన్స్ విషయాలకు పేరుపొందింది. ఆనర్స్ విషయాలకు విద్యార్థులను ఎంపిక చేసేముందు ఆ విభాగం అధిపతులు ఇంటర్వ్యూ చేస్తారు. భౌతికశాస్త్రం విభాగ అధిపతులు ప్రొఫెసర్ ఎ. వెంకటరావ్ టెలాంగ్. వారు సంపూర్ణ ఖద్దరుధారి. ఛాతీని కప్పుతూ ఒక కోటు, తలపాగా, ప్యాంటు లేదా అడ్డపంచె వారి ఆహార్యం. ఇంటర్వ్యూకు వెళ్ళాను. నా మార్కుల జాబితా చూసి ‘మీరు మెడికల్ లేదా ఇంజనీరింగ్‌కు ఎందుకు వెళ్ళడం లేద’ని అడిగారు. ‘వాటి వ్యవధి ఎక్కువ. అంతేకాక అవి కాస్ట్లీ’ అని చెప్పాను. వారు నా షర్టును ముట్టి చూస్తూ ‘ఇది కాస్ట్లీ కాదా’ అని అడిగారు. ఖాదీ ఆ కాలంలో మిల్లు బట్టలకన్నా ఖరీదైనవి. ‘భౌతికశాస్త్రం ఆనర్స్ తరగతిలో మిమ్మల్ని చేర్చుకోవడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు. మీకు మంచి మార్కులు వచ్చాయి. వచ్చి చేరండి’ అని చెప్పారు. తరగతిలో చేరాను. అప్పుడు ఆ ఆనర్స్ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 12 లేదా 13.

రామకృష్ణా స్టూడెంట్స్ హోంకు ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఎక్కువ సమయం పట్టలేదు. నాకు మిగిలిన అభ్యర్థులకన్నా కొంచెం ఎక్కువ మార్కులు వచ్చాయి. పైగా ఆనర్స్ క్లాసులో చేరానని చెప్పాను. సులభంగా సీటు ఇచ్చారు.

స్టూడెంట్స్ హోమ్

రామకృష్ణా స్టూడెంట్స్ హోమ్‌ను 1919లో స్థాపించారు. బసవనగుడిలో ఉన్న శ్రీ రామకృష్ణాశ్రమానికి అప్పుడు స్వామీ నిర్మలానందగారు అధ్యక్షులుగా ఉన్నారు. వారే ఈ విద్యార్థి నిలయానికీ అధ్యక్షులు. అందువల్ల విద్యార్థి నిలయానికీ, ఆశ్రమానికీ ఒకరకంగా సంబంధముండేది. వారి తరువాత ఆశ్రమం అధ్యక్షులు విద్యార్థి నిలయానికి అధ్యక్షులు అయ్యే నియమం తప్పిపోయింది. ఐనా విద్యార్థులు ఏకాదశిరోజు సాయంత్రం ఆశ్రమానికి భజన చేయడానికి వెళ్ళేవారు. రామకృష్ణా స్టూడెంట్స్ హోమ్‌లో అప్పుడు సుమారు 40-45 మంది విద్యార్థులున్నారు. అక్కడ చేరిన రోజే ఒక నమ్మశక్యం కాని పద్ధతిని అనుభవించి బాధపడ్డాను. అక్కడి విద్యార్థులలో ముగ్గురు విద్యార్థులు బ్రాహ్మణేతరులు. ఎస్.సి., ఎస్.టి. విద్యార్థులు ఎవరూ లేరు. వారిని బహుశా చేర్చుకునేవారో లేదో తెలియదు. భోజనశాలలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేసే అవకాశం లేదు. అంతా వేరే వేరే. బ్రాహ్మణేతరులకు అదే భోజనశాలలో ఒకవైపు చెక్కతో చేసిన తెర అడ్డంగా పెట్టి భాగం చేశారు. నాకు ఇది ఊహించలేనిది. పేరు రామకృష్ణా స్టూడెంట్స్ హోమ్. మేనేజ్మెంట్ కమిటీలో ఎక్కువమంది అధికారులు, విద్యావంతులు. అయితే పాతకాలపు సంప్రదాయవాదులు. వారి ఇళ్ళల్లో ఇలాంటి భేదభావాలు చూపిస్తే (న్యాయంగా ఎక్కడా చేయకూడదు) అది వ్యక్తిగతం అనుకొని వదిలిపెట్టవచ్చు. కానీ సార్వజనిక విద్యార్థి నిలయంలో, అదీ రామకృష్ణ పరమహంస పేరుపెట్టిన విద్యార్థి నిలయంలో ఇలా తారతమ్యాలను పాటించడం శుద్ధ తప్పు అని చెప్పనవసరం లేదు. సున్నితమనస్కులైన విద్యార్థులకు ఇలాంటి భేదభావాల వల్ల మనస్సు నొప్పిస్తుంది. నేషనల్ స్కూల్ ఉపాధ్యాయులైన శ్రీ కె. ఎస్. కృష్ణయ్యర్ గారు ఈ విద్యార్థి నిలయపు పాలకమండలి సభ్యులుగా ఉన్నారు. ఈ తారతమ్య పద్ధతి గురించి వారికి చెప్పాను. వారు తమ అశక్తతను వ్యక్తం చేశారు. అయితే అక్కడి విద్యార్థులలో ఎలాంటి భేదభావాలు లేవు. మేమంతా స్నేహితులుగా ఉన్నాము.

విద్యార్థి నిలయంలో తెల్లవారు ఝామున ప్రార్థన, తరువాత కొంచెంసేపు సూర్యనమస్కారాలు మళ్ళీ సాయంత్రం ప్రార్థనలు ఉండేవి. ఉదయం 9 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు భోజనం పెట్టేవారు. యథాప్రకారం ఉదయం భోజనం చేసుకుని నడుచుకుంటూ సెంట్రల్ కాలేజీకి వెళ్ళి, సాయంత్రం తరగతులన్నీ ముగిసాక వాపసు వచ్చేవాణ్ణి. మా ఉపాధ్యాయులైన డా. ఎల్. సీబయ్య, డా. టి. ఎస్. సుబ్బరావు, ప్రొ. ఆర్. ఎల్. నరసింహయ్య మొదలైనవారు చాలా మంచివారు.

అప్పుడు టీ త్రాగడాన్ని ప్రజలకు అలవాటు చేయడానికి ఒక టీ కంపెనీ మా విద్యార్థి నిలయపు విద్యార్థులకు వేడివేడిగా టీ తయారుచేసుకుని వచ్చి ఉదయం భోజనం తరువాత పంచేవారు. నావద్ద లోటా లేనందువల్ల కంచంలోనే టీ పోయించుకుని తాగేవాణ్ణి. ఈ ఉచిత టీ పంపిణీ సుమారు ఒక నెల కొనసాగింది. ఒక శనివారం మాకు టీ ఇచ్చిన తర్వాత రేపు ఆదివారం మేము రాము అని చెప్పి అందువల్ల మేమే టీ చేసుకోవడానికి టీ పొట్లాలు ఇచ్చారు. అంతే కాదు ముందు ప్రతి ఆదివారం రామని తెలియజేశారు. ఆదివారం మేమే టీ తయారు చేసుకుని తాగడం కోసం టీ పొట్లాలను కొనుక్కోమని చెప్పారు. మాలో అనేకమంది విద్యార్థులు మాకేమీ టీ పొట్లాలు వద్దు. ఆదివారం టీ వద్దు. సోమవారం రమ్మని చెప్పాము. వారు సోమవారం నుండి రానే లేదు. బహుశా వాళ్ళు ఏ మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకమో చదివి నెలరోజులు టీ ఇస్తే అదొక వ్యసనంగా మారి ఆపై రోజూ టీ తాగే తీరుతారనే అభిప్రాయానికి వచ్చారనుకుంటాను. వారి అంచనాలు తారుమారయ్యాయి. మాకు ఒక నెల త్రాగించిన టీ వ్యర్థమయ్యింది.

నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకముంది. కొంతమంది స్నేహితులతో కలిసి నేను ఒకరోజు సర్కస్ చూడటానికి వెళ్ళాను. సర్కస్ వాళ్ళు చేస్తున్న అపాయకరమైన సాహసకృత్యాలను చూసి నాకు మనశ్శాంతి లేకపోయింది. జీవనోపాధి కోసం తమ ప్రాణాలనే ఒడ్డి ప్రేక్షకుల సంతోషం కోసం ఒళ్ళు జలదరించే, రోమాంచితమైన కృత్యాలను చేస్తున్న కళాకారులను చూసి నాకు అయ్యో అనిపించింది. అలాంటి వారి కష్టం నుండి సంతోషం పొందడం సాధ్యపడలేదు. పైన ఉన్నవారు క్రిందకు పడితే ఏమి గతి. సైకిల్ తొక్కేవాడు ప్రమాదానికి లోనైతే ప్రాణాపాయం కదా. పులి (లేక సింహమో నేను మరిచిపోయాను) నోట్లో తలనో చేతులో పెట్టినప్పుడు వాడి పరిస్థితి ఏమిటి. సర్కస్ పూర్తయ్యేవరకూ ఇలాంటి ఆలోచనలే. ఒక్క నిముషం కూడా మనసు సంతోషపడ లేదు. ఎట్లో ఏ అపాయమూ జరగకుండా సర్కస్ ముగిస్తే చాలని చాతకపక్షిలా ఎదురు చూస్తున్నాను. (ఏ సర్కస్‌కూ వెళ్ళకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు పోలేదు.) అలాగే బాక్సింగ్‌పై నాకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. బాక్సింగులో దెబ్బల వల్ల పళ్ళు రాలినప్పుడూ, రక్తమోడుతున్నప్పుడూ, ఇంకా అలాంటి క్రూరదృశ్యాలను చూసి ఎగిరి గంతులేస్తూ ఆనందించే జనుల సంస్కృతి ఎలాంటిదో ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. బాక్సింగును నిషేధించాలని ఒకటి రెండు సార్లు వార్తాపత్రికలకు జాబులు వ్రాశాను.

నేను స్టూడెంట్ హోమ్‌లో ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రముఖ శాస్త్రవేత్తగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన డా. ఎ. ఆర్. వాసుదేవమూర్తి, ప్రముఖ ఆర్థికవేత్త, సాహిత్యకారుడైన డా. హెచ్. ఎస్. కృష్ణమూర్తి అయ్యంగార్ (హెచ్. ఎస్. కె. గా సుప్రసిద్ధులు) నాతో పాటు కలిసి ఉన్నారు.

నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధారణంగా రాత్రి ఒంటిగంట, రెండుగంటల వరకూ చదవడం నా అలవాటు. ఒకరోజు సుమారు ఆ సమయానికి పక్కనే ఉన్న ప్రఖ్యాత హరికథాకళాకారుడు శ్రీ కరిగిరి ఆచార్యగారు హరికథ ముగించుకుని ఇంటికి వెళుతున్నారు. వారింటికి వెళ్ళాలంటే మా హాస్టలు మీదుగానే వెళ్ళాలి. అప్పుడు హాస్టల్ గది కిటికీ ద్వారా వస్తున్న వెలుతురును చూసి “ఎవరయ్యా నువ్వు. ఇంత సేపు చదువుతున్నావు? తొందరగా పడుకో” అని అరిచారు. అప్పుడు నేను బయటికి వచ్చి నా పరిచయం చేసుకున్నాను. “ఎక్కువసేపు రాత్రిపూట చదివి నిద్ర పాడు చేసుకోవద్దు” అంటూ హితవచనాలు పలికారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here