‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -8

0
13

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

నారాయణ సేవ

[dropcap]ఆ[/dropcap]శ్రమంలో జరిగిన ఒకటి రెండు ఘటనలను తెలుపడానికి ఇష్టపడుతున్నాను. ఒకరోజు యథాప్రకారం ఉదయం గంట కొట్టగానే భోజనం చేయడానికి పళ్ళెం తీసుకుని భోజనశాలకు వెళ్ళాము. మాకోసం అక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం వేచివుంది. స్వామీజీగారు వడ్డించడం మొదలుపెట్టారు. వంట చేసేవాళ్ళు రాలేదని తరువాత తెలిసింది. స్వామీజీగారే బ్రహ్మచారుల సహాయంతో వంట వండారు. ఇదొక మనసును తాకే ఘటన. ఇలాంటివే ఇంకా కొన్ని సంఘటనలున్నాయి.

ఒకసారి కె.నంజుండయ్య అనే విద్యార్థి స్వామిగారికి చెప్పకుండా సాయంత్రం సినిమాకు వెళ్ళాడు. రాత్రి భోజనానికి అతడు రాలేదు. స్వామీజీకి అతడు సినిమాకు వెళ్ళిన సంగతి తెలిసింది. నంజుండయ్య, నేను, ఇంకా ఇద్దరు గోశాల పక్కన నివసిస్తూ ఉన్నాము. భోజనం అయ్యాక స్వామీజీ నన్ను పిలిచి నంజుండయ్య వచ్చిన తక్షణం నన్ను కలవమన్నానని చెప్పు అని అన్నారు. సినిమా ముగించుకుని నంజుండయ్య వచ్చాడు. “నీవు స్వామీజీని కలవాలి అని వారే చెప్పారు” అన్నాను. నంజుండయ్యకు భయం వేసింది. అపరాధభావంతో భయపడుతూ వెళ్ళాడు. నంజుండయ్యను చూడగానే “వంట ఇంటిలో అన్నం తీసిపెట్టాను. భోజనం చేసి వెళ్ళు” అన్నారు స్వామీజీ. వారి ఔదార్యం చూసి నంజుండయ్యకు దిక్కు తోచలేదు!

ఇంకో విద్యార్థి హెచ్.ఎన్.రాజణ్ణ భద్రావతినుండి బెంగళూరుకు వచ్చినప్పుడు రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. అతడు రాత్రి 10 గంటలకు ఆశ్రమం చేరాడు. స్వామీజీగారు రాజణ్ణకు భోజనం తీసిపెట్టారు. అలాగే ఇంకొక విద్యార్థి జి.వి.అనంత అయ్యర్. ఇతడి ఊరికి బస్సు చేరడం సాయంత్ర మవుతుందని స్వామీజీ ఆశ్రమం నుండే తిండి పొట్లం ఇచ్చి పంపారు. అంతే కాకుండా ప్రయాణానికి ధన సహాయం కూడా చేశారు.

ప్రతియేటా ఆశ్రమంలో శ్రీ రామకృష్ణ, శారదాదేవి, వివేకానందుల జయంత్యుత్సవాలను ప్రార్థన, భజన, ఉపన్యాసాలు మొదలైన కార్యక్రమాలతో ఘనంగా జరుపుతారు. వందలాది భక్తులు ఆ కార్యక్రమంలో వచ్చి పాల్గొంటారు. మేమంతా అప్పుడు స్వయంసేవకులము. ఆ వార్షిక జయంతులలో నాకు అత్యంత ప్రియమైన భాగం పేదసాదలకు, భిక్షకులకు అన్నదాన కార్యక్రమం. భోజనంలో అన్నం, పులుసు, పాయసం ఉండేవి. దానిని ‘నారాయణసేవ’ అని పిలిచేవారు. పేరు కూడా భావగర్భితంగా ఉంది. వందలాది మంది పేదలకు, బిచ్చగాళ్ళకి భోజనం పెట్టేవారు. నమ్మశక్యం కాదు కానీ వాస్తవానికి బిక్షగాళ్ళ పంక్తిలో మొదట స్వామీజీ కూర్చుని వారితో పాటుగా భోజనం చేసేవారు. స్వామీజీగారు మొదటి భిక్షకులు. వారి పక్కన కూర్చున్నతను రెండవ భిక్షకుడు. ఒకరు స్వయంప్రేరణతో తాత్కాలికంగా భిక్షకుడైతే, మిగిలిన వారు వృత్తిపరంగా భిక్షకులు. దీనిని నేను ఎన్నటికీ మరచిపోలేను. “మనది విశ్వధర్మం, ఆత్మలన్నీ ఒకటే, స్వామిగారి ఆత్మకి, ఛండాలుని ఆత్మకి తేడా లేదు” అంటూ ఉపన్యాసాలు దంచే అనేక మఠాలలోని స్వాములు భిక్షకుల జతలో కూర్చుని భోజనం చేయడం కలలో మాట. ఎన్ని మంచి గుణాలు, సంస్కృతి, విద్యాభ్యాసం ఉన్నా విభిన్న మతాలవారిని దగ్గరకు కూడా తీసుకోరు. అయితే అదే మతానికి చెందినవాడు ఎంత భ్రష్టుడయినా వాడిని అక్కున చేర్చుకుంటారు. ఇది హిందూ ధర్మం!

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మామూలు ప్రార్థనతో పాటు ప్రతి ఏకాదశి విశేష ప్రార్థన చేసేవాళ్ళం. సుమారు 45 నిమిషాల పాటు ఆ ప్రార్థన నిరాటంకంగా సాగిపోయేది. నాకైతే ముగిసే సమయానికి ఎక్కువ ఆకలి అయ్యేది. త్వరగా ప్రార్థన ముగిసి భోజనం చేస్తే చాలనిపించేది. ప్రార్థన అయిన తర్వాత స్వామీజీగారు బయటకు వచ్చి చేతులు జోడించి నిలుచుకునేవారు. భక్తులు వారికి సాష్టాంగ నమస్కారం చేసి లేదా పాదాలను తాకి నమస్కారం చేసి వెళ్ళేవారు. మా విద్యార్థి మందిరపు విద్యార్థులూ అలాగే చేసేవారు. ఐతే నేను స్వామీజీగారికి చేతులు జోడించి నమస్కారం చేసేవాణ్ణి. దీన్ని చూసి సహ విద్యార్థులు నన్ను ఆక్షేపించారు.. “మేమంతా సాష్టాంగ నమస్కారమో లేదా యథాశక్తి వంగి నమస్కారం చేస్తున్నప్పుడు నీకేమిటి బడాయి? ఎందుకు మాలాగా నమస్కారం చెయ్యవు?” అని గద్దించారు. “నేను ముగ్గురికి మాత్రమే పాదాలు ముట్టి నమస్కారం చేస్తాను. అంతే” అన్నాను. వారికి ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవాలని వారికి కుతూహలం కలిగింది. ఎవరా ముగ్గురు అని అడిగారు. “ఒకరు దేవుడు. వారు నాకింకా దక్కలేదు. మిగిలిన ఇద్దరూ నా తల్లిదండ్రులు. తండ్రి లేడు. తల్లికి మాత్రం పాదాలు పట్టుకుని నమస్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాను. వారంతా మౌనంగా ఉండిపోయారు. స్వామీజీ నా చర్యను ఎన్నడూ తప్పుగా తీసుకోలేదు. అంతేకాదు వారికి నాపైననే ఎక్కువ వాత్సల్యం ఉండింది.

ప్రార్థన

మా గదిలో న్యాయపరీక్షకు చదువుతున్న కె.నంజుండయ్య, ఇంజనీరింగ్ విద్యార్థి ఎం.సుబ్బరామయ్య, బి.ఎస్.సి.విద్యార్థి వై.కె.నారాయణస్వామి, నేను ఉన్నాము. కె.నంజుండయ్య బెంగళూరు జాతీయ విద్యాసంస్థల స్థాపకులైన కీ.శే. ఎం.సి.శివానంద శర్మగారి స్వంత తమ్ముడు. అతనికి ప్రార్థనల పట్ల నమ్మకం లేదు. స్వామీ త్యాగీశానందగారు అతడిని ప్రార్థనకు ఎందుకు రాలేదని అడినప్పుడు “మీ దేవుని ముందు నేను బిచ్చగాడిలా వేడుకోవడం నాకు నచ్చదు. నాకు ప్రార్థన పట్ల నమ్మకం లేదు” అని బదులిచ్చాడు. “అలాగైతే నీకు దేని మీద నమ్మకం ఉంది?” అని అడిగారు. “నాకు పని మీద నమ్మకం” అని బదులిచ్చాడు. “సరే నీవు ప్రార్థన సమయంలో తోటలో పని చేయ”మని చెప్పారు స్వామీజీ. ఆ రకంగా అతడు ప్రార్థన బదులుగా తోటపని చేసేవాడు. మేమంతా ప్రార్థన చేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు నాకు మేము చేస్తున్న ప్రార్థన కంటే అతడు చేస్తున్న పనే ఎక్కువ ఉపయోగమేమో అనిపించేది. ప్రార్థనను ఒక తాత్వికుడు ఈ విధంగా నిర్వచిస్తాడు. “Prayer is a long distance call having nobody at the other end (ప్రార్థన ఆ చివరన ఎవరూ లేని దూరపు పిలుపు)”. ఆశ్రమంలో ఉన్నప్పుడూ నేను “ఆ వైపు ఎవరో ఒకరు ఉంటారని” ప్రార్థన చేసేవాణ్ణి కాదు. ప్రార్థన నుండి మనఃశాంతి, ఏకాగ్రత లభించవచ్చన్న నమ్మకం అప్పుడూ ఉండేది ఇప్పుడూ ఉంది. ఏది ఏమైనా స్వామీజీ నంజుండయ్యకు ప్రార్థన నుండి మినహాయించి అతని నమ్మకం ప్రకారం చేయమని చెప్పడం వారి దొడ్డగుణానికి, ఉదార స్వభావానికి నిదర్శనం. అలాకాకుండా స్వామీజీ మొండివారో, గొడ్డు సాంప్రదాయవాదో అయివుంటే నంజుండయ్యకు ఆశ్రమంలో చోటు దొరికేదే కాదు.

నంజుండయ్య ఆజానుబాహువు. సాయంత్రం తోటలో బాగా పనిచేసేవాడు. దానికి తగ్గట్టు భోజనం చేసేవాడు. భోజనం ఐన గంటకు ప్రకృతి నియమం ప్రకారం నంజుండయ్య తల స్థిమితంగా ఉండేదికాదు. పుస్తకం కంటి ముందర ఉన్నా అక్షరాలు కనిపించేవి కావు. ఆ అర్ధసమాధిస్థితి నుండి తీవ్రంగా ప్రయత్నించి జాగృదావస్థకు వచ్చి “ఏయ్ నరసింహా (నాతో అంత చనువు), నేను గాంధీజీని 50 శాతం అనుసరిస్తాను” అని చెబుతూ పుస్తకాన్ని పక్కకు పెట్టి పడుకునేవాడు. గాంధీజీ గారు త్వరగా పడుకుని త్వరగా అంటే సుమారు తెల్లవారు జాము నాలుగు గంటలకు లేచేవారు. తెల్లవారుజాము లేచే భాగం నంజుండయ్యకు అక్కర లేదు. ఒకరోజు నంజుడయ్య “నరసింహా నాకు తల నొప్పిగా ఉంది” అన్నాడు. “నాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల నీవు మనిషి అని నిర్ధారణ అయ్యింది. తలనొప్పి మనుషులకే వస్తుంది కానీ బల్లలకూ, బండలకూ రావు కదా” అని బదులిచ్చాను. “థూ పాపి” అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పుడు ప్రార్థన అంటే నమ్మకం లేదని చెప్పిన ఈ నంజుండయ్య వయస్సు వచ్చిన తరువాత అతీంద్రియశక్తులున్న ఒక బాబాను శరణు జొచ్చాడన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాను. వయసు పెరిగే కొద్దీ దానితోపాటు భయమూ పెరిగే సంభవముంది. జీవితంలో చివరివరకూ సమతౌల్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు.

ఎక్కడికి స్వామీజీ?

మా విద్యార్థి మందిరపు పాలకులు స్వామీ ఋతాత్మానందగారు. వారు కొడగు (Coorg) ప్రాంతానికి చెందినవారు. హెచ్చు విద్యావంతులు కారు. చాలా మంచివారు. విద్యార్థుల పట్ల వీరికి చాలా మమకారం. అయితే నియమాలను ఉల్లంఘించిన వారిని తగినంత దండించేవారు. నేరుగా, కొంచెం కటువుగానే మాట్లాడేవారు.

స్వామీ ఋతాత్మానంద

నాకు స్వామీ త్యాగీశానంద గారి కంటే వీరి వద్దే ఎక్కువ చనువు. వీరితో ఎక్కువ వాదులాడే వాడిని. ఏ విషయమైనా కానీ వారు నా వాదనను అంతగా సహించేవారు కాదు. “ఏయ్ నరసింహా, నీవు అధిక ప్రసంగం చేయొద్దు. చెప్పినట్లు చెయ్యి. ఉన్న నియమాలను పాటించు. అతి తెలివి ఉపయోగించొద్దు” ఈ విధంగా వారు నాతో కొన్నిసార్లు మాట్లాడేవారు. స్వామీ ఋతాత్మానందగారు విద్యార్థులున్న ఇంకొక భవనంలో ఉండేవారు. వారు తెల్లవారు ఝామున పాలు పితకడానికి ఆశ్రమానికి వచ్చేవారు. ఏ కారణం చేతనో పశువులున్న గది స్విచ్చి పక్కనున్న మా గదిలో పెట్టారు. వారు స్విచ్ వేయడానికి మా గదికి వచ్చినప్పుడు నేను పడుకుని ఉండడాన్ని చూసి దండించేవారు. రాత్రి ఒంటి గంట, రెండు గంటల వరకు చదువుతున్న కారణంగా తెల్లవారు ఝాము ప్రార్థన చాలాసార్లు తప్పించుకునే వాడిని. “రాత్రి చాలాసేపు చదువుకున్నాను. అందువల్ల ప్రార్థనకు వెళ్ళడానికి కావడం లేదు” అని చెప్పాను. దానికి వారు “నాకు అవన్నీ తెలియదు. నీవు ఎన్నిగంటలకైనా పడుకో. ఆశ్రమం నియమమంటే నియమమే. తెల్లవారుఝాము ప్రార్థనకు అందరూ వెళ్ళాల్సిందే. పెద్ద స్వామి (త్యాగీశానంద గారు) నీకు ఎక్కువ అలుసిచ్చారు. దానివల్ల నీవు ఎక్కువ చేస్తున్నావు. నేనేమీ పెద్ద స్వామిగారిని ఆక్షేపించడంలేదు. రేపటి నుండి నేనే ఆశ్రమానికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటాను. నీవు వచ్చితీరాలి” అని హెచ్చరించారు. ఇక తప్పలేదు. నిద్రకళ్ళతో ఉదయపు ప్రార్థనకు కూర్చునే వాణ్ణి. ప్రతిరోజూ ప్రార్థనను ఒక్కొక్క విద్యార్థి ప్రారంభం (lead) చేయాలి. ఒకసారి నా వంతు వచ్చింది. గమ్మున కూర్చొని ఉన్నాను. “ఏయ్ నరసింహా. లీడ్ చేయ్యి” అన్నారు. నాకు ఆ మగత నిద్రలో సరిగా అర్థం కాక “ఎక్కడికి స్వామీజీ?” అన్నాను. వారికి కోపం ముంచుకొచ్చింది. ప్రార్థనామందిరంలో ఆరాధ్య దేవతల సమ్ముఖంలో కటువైన పదాలతో నన్ను దండించడానికి సంకోచించారు. తమ కోపాన్ని దిగమింగుకుని “ఇక్కడా నీ తలబిరుసు వదలడం లేదు. ప్రార్థనను లీడ్ చేయమంటే ఎక్కడికి అని అడుగుతావా. రేపటి నుండి నీవు పొద్దున ప్రార్థనకు రావద్దు” అని నాకిష్టమైన శిక్షను విధించారు. ‘రోగి కోరుకుంది, వైద్యుడు చెప్పింది ఒకటే’ అనే సామెత గుర్తుకొచ్చింది. స్వామీజీ గారిని మనసారా నమస్కరించి మరుసటి రోజునుండీ నేను చాలా రోజులు ప్రార్థనకు వెళ్ళలేదు.

ఒక రోజు జి.వి.అనంత అయ్యర్, నేను చరఖాతో నూలు వడికే పోటీలలో పాల్గొనడానికి వెళ్ళాము. అక్కడ బహుమానాలనూ పొందాము. ఆ రోజు సాయంత్రం ప్రార్థనలో పాల్గొనలేక పోయాము. మేము ముందే చెప్పి కూడా పోలేదు. స్వామీ ఋతాత్మానంద గారి కోపానికి దొరికిపోయాము. మమ్మల్ని బాగా తిట్టారు. “స్వామీజీ మేము సినిమాకు వెళ్ళలేదు. (నా జీవితంలో మూడవదీ, చివరిదైన ‘రామరాజ్య’ సినిమాను 1942 డిసెంబరు నెలలో చూశాను.) లేదా ఎక్కడా షికారుకు వెళ్ళలేదు. చరఖా పోటీలలో పాల్గొనడానికి పోయాము. అయితే ముందు మీ అనుమతి తీసుకోవడానికి కుదరలేదు” అన్నాను. “నాకు అవన్నీ చెప్పవద్దు. మీరు ప్రార్థనకు చెప్పాపెట్టకుండా గైర్హాజరయ్యారు. ఈ రాత్రి మీకిద్దరికీ భోజనం లేదు” అన్నారు. ఇద్దరికీ ఆకలిగా ఉంది. ముఖం వేలాడేసుకుని అక్కడి నుండి కదిలాము. కోపం తగ్గిన తరవాత మమ్మల్ని పిలిచి “భోజనం చేయండి. ఇక మీదట అలా చేయవద్దు” అన్నారు.

కొన్ని ఘటనలు

ఒకసారి నాకు జ్వరం వచ్చింది. రెండురోజులైనా తగ్గలేదు. డాక్టర్ వచ్చి పరిక్షించి “టైఫాయిడ్ జ్వరం కావచ్చు. విక్టోరియా ఆసుపత్రిలో చేర్చితే మంచిది” అని చెప్పారు. ఆ కాలంలో టైఫాయిడ్ జ్వరం పట్ల ఎక్కువ జాగ్రత్త వహించాల్సి వుంది. “నీవు విక్టోరియా ఆస్పత్రికి ఎందుకెళ్ళాలి? మేమే ఇక్కడ నిన్ను చూసుకుంటాము” అని స్వామీ ఋతాత్మానంద గారు చెప్పారు. స్వామీజీలకు, నా సహచరులకు ఇబ్బంది కలిగించడం నాకిష్టం లేదు. నేను వెళ్ళేతీరాలని పట్టుబట్టాను. ఒక జట్కాలో స్వామీజీ, నేను విక్టోరియా ఆసుపత్రికి పోయాము. ఆసుపత్రిలో నన్ను చేర్చారు.

“ఏమి ఖాయిలా అని ఇక్కడకు వచ్చారు” అని డాక్టరు అడిగారు. “టైఫాయిడ్” అన్నాను.

టెంపరేచర్ చూసుకుని వెళ్ళారు. నా పక్క మంచంపై ఇంకొక రోగి పడుకుని “అయ్యా, అమ్మా, అప్పా” అంటూ మూలుగుతున్నాడు. “నీకేమయిందప్పా?” అని నన్నడిగాడు. టైఫాయిడ్ అని బదులిచ్చాను. దానికి అతడు “అయ్యో టైఫాయిడ్ జ్వరమా. నిన్ననే నీవు పడుకున్న మంచంపైన ఒక రోగి టైఫాయిడ్ నుండి చనిపోయాడు” అన్నాడు. అది విని నాకు విపరీతమైన భయం వేసింది. ఏమేమో ఆలోచనలు. మొదటిది నిన్ననే చనిపోయిన వాడి మంచం పైనే పడుకున్నాను. రెండవది నాకూ అదే టైఫాయిడ్ జ్వరమే.. ఇలా నా ఆలోచనా తరంగాలు సాగాయి. రాత్రి అరకొర నిద్రపోయాను. పొద్దున డాక్టర్ వచ్చి టెంపరేచర్ చూసి “ఎవరండీ మీకు టైఫాయిడ్ జ్వరమని చెప్పింది? రెండు రోజుల నుండి జ్వరమూ లేదూ, టైఫాయిడ్డూ లేదు. ఇంటికి వెళ్ళండి” అన్నారు. ఆ భయమే ఔషధంగా పనిచేసి జ్వరం పారిపోయిందని అనిపిస్తుంది!

ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. నేను ఆశ్రమంలో ఉన్నప్పుడింకా దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొని జైలులో ఉన్న మహత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ మొదలైన నాయకులనే కాక అందరు రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. నేను ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కారణంగా నాకు అప్పటి రాజకీయాలపై సహజమైన ఆసక్తి ఉండేది. నా సహవాసి అయిన ఎం.సుబ్బరామయ్య జైలుకు వెళ్ళకున్నా ఖద్దరు ధరించేవాడు. అప్పటి రాజకీయాలపై అతనికి ఆసక్తి ఉండేది. అతడికి రాజాజీ (తరువాత స్వాతంత్ర్య భారతపు మొదటి గవర్నర్ జనరల్ అయిన శ్రీ సి.రాజగోపాలాచారి) గారంటే గొప్ప గౌరవం. నాకు రాజాజీ అంటే అంతంత మాత్రమే. నాకు టంగుటూరి ప్రకాశం గారి విషయంలో ఎక్కువ అభిమానం, గౌరవం. ఒక సందర్భంలో కాల్పులు జరిగాయి. ప్రకాశంగారు ఆవేశంతో తన ఛాతీని పోలీసులకు చూపిస్తూ “కాల్చండి నా గుండెను” అని పోలీసులను ఎదిరించారు. పోలీసులు అవాక్కయ్యారు. భూమికి సమాంతరంగా ఉన్న బందూకులు కిందకు వాలిపోయాయి. అప్పటి నుండి వారు ఆంధ్ర కేసరి అయ్యారు. ఆ ప్రకాశం నాకు అభిమాన నాయకుడు. నా అభిప్రాయంలో రాజాజీ తెలివైనవారే కాదు అతితెలివైన వారు కూడా. నేను వారిని ‘గుంటనక్క’ అని పిలిచేవాడిని. సుబ్బరామయ్య నేను కొన్ని రోజులు రాత్రివేళలలో చాలా సేపు రాజాజీ, ప్రకాశం మరియు ఆనాటి రాజకీయ పరిస్థితులపై తీవ్రంగా చర్చించేవాళ్ళం. ఒక్కొక్క సారి ఆశ్రమపు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేంత చర్చ జరిగేది. మాతో పాటు ఉన్న ఇద్దరు సహచరులు మా చర్చ మధ్యలో అప్పుడప్పుడూ కలగజేసుకుని మమ్మల్ని గట్టిగా అరవవద్దని హెచ్చరించేవారు. ఈ ఆవేశపూరితమైన చర్చను విని విసిగిపోయి ఒక రోజు మధ్యరాత్రి స్వామీజీగారు లేసి మెయిన్ స్విచ్‌ను ఆర్పివేశారు. మాకు స్వామీజీగారు చెంపమీద పీకినట్టయింది. మారుమాట్లాడకుండా ఆ చీకటిలో పడుకున్నాము. ఉదయం వరకు దీపం వెలుగలేదు. పొద్దున లేచిన తరువాత “చూడు సుబ్బరామయ్యా! మనమిద్దరం కలిసి ఉంటే ఎంత సంయమనంగా ఉందామన్నా చివరికి ఈ వాగ్యుద్ధం తప్పదు. కాబట్టి నేను ఆశ్రమం ప్రధాన భవనంలో స్వామీ త్యాగీశానంద గారి గది పక్కనున్న బి.ఎస్.సి. విద్యార్థి జగన్నాథం జతలో ఉండడానికి అడుగుతాను” అన్నాను. “అలాగే చెయ్యి” అన్నాడు. జగన్నాథానికి వెనుకటి రాత్రి జరిగిన సంఘటనను వివరంగా చెప్పాను. అతని జతలో ఇంటర్మీడియట్ తరగతి చదువుతున్న జి.వి.అనంతయ్యర్ ఉన్నాడు. “అనంత నా జాగాలో రానీ. నేను అతని స్థానంలో నేను నీతోపాటు వుంటాను” అని చెప్పాను. మొదట అతడు ఒప్పుకోలేదు. “నీవు నా ధ్యానా(Meditation)న్ని చులకన చేస్తావు. ఇబ్బంది పెడతావు. నీవు నాతోపాటు వద్దు” అన్నాడు. “దమ్మయ్యా (జగన్నాథంను అలా పిలిచేవాళ్ళం) ఒప్పుకో అప్పా. నీకు గానీ, నీ మెడిటేషన్‌కు గానీ ఆవగింజంత కూడా ఇబ్బంది కలిగించనని హామీ ఇస్తున్నాను” అన్నాను. చివరకు ఎలాగో ఒప్పుకున్నాడు. కొన్ని నిమిషాల తరువాత స్వామి త్యాగీశానందగారిని కలిశాను. వారు కొంచం కోపంగా కనిపించారు. “స్వామీజీ అనంత, నేను మా జాగాలను మార్చుకుంటాము” అన్నాను. దీని సారాంశం వారికి అర్థమయ్యింది. Yes అని ఒకే పదంతో వారి సమ్మతిని తెలియజేశారు. సంతోషంతో నేను జాగాను బదలాయించి జగన్నాథం గదికి వచ్చాను. అతనికి ఇచ్చిన హామీని కొంచెం కూడా తప్పకుండా పాటించాను. ఒకటి రెండు రోజుల తరువాత స్వామీజీ గారు నాతో మునుపటిలాగే మాట్లాడేవారు.

రాత్రి భోజనం తరువాత స్వామీజీ ఆశ్రమపు వరండాలో నడిచేవారు. ఆ సమయంలో నేనూ అక్కడికి వచ్చేవాణ్ణి. ఏదో ఒక విషయం గురించి మేము మాట్లాడుకునేవాళ్ళం. నేను కొంతమేరకు అసంప్రదాయమైన నమ్మకాలను పెట్టుకున్నానని వారికి తెలుసు. మూలభూతమైన ప్రశ్నలను అడిగేవాణ్ణి. వాటిలో ఒక ప్రశ్న ఇప్పటికీ జ్ఞాపకముంది. “ఆత్మ ఉంటే, పునర్జన్మ ఉంటే, మనుష్యుడు చనిపోయాక మళ్ళీ పుట్టేవరకు అతని ఆత్మ ఏదైనా చెట్టుపై తన వంతు వచ్చేవరకూ కాచుకుని ఉంటుందా లేక ఆకాశంలో తిరుగుతూ ఉంటుందా?” దానికి వారు నవ్వి ఊరుకున్నారు. నా ప్రశ్నలకు ప్రశాంతంగా విద్వత్తుతో కూడిన సమాధానాలను ఇచ్చేవారు. సింహభాగం వారి మాటలే నెగ్గేవి. నేను ఆశ్రమపు స్నేహితులతో లోతైన చర్చ చేసినప్పుడు గట్టిగా, ప్రభావవంతంగా కొన్నిసార్లు ఆవేశంతో నా అభిప్రాయాలను చెప్పేవాణ్ణి. ఇది స్వామీజీగారికి తెలిసింది. “నరసింహయ్యతో చర్చ చేయవద్దు. వాడు మిమ్మల్ని మింగి వేస్తాడు (Don’t argue with Narasmihaiah, he will swallow you)” అని నాతో చర్చించే ఆశ్రమవాసులను హాస్యపూర్వకంగా హెచ్చరించేవారు.

సమాజ సేవ

1945 మే నెలలో ఆనేకల్ సమీపంలో ఉన్న రామకృష్ణ పురంలో సమాజసేవా శిబిరాన్ని నడపాలని ఆ ఇద్దరు స్వామీజీలు నిర్ధారించారు. నాకు సంతోషమయ్యింది. ఆ సమయానికి ఎటువంటి విఘ్నాలూ లేకుండా నేను నా బి.ఎస్.సి (ఆనర్స్) డిగ్రీ పరీక్షలను ముగించాను. అంతకు ముందు చెప్పిన విఘ్నాలు, సమస్యల నేపథ్యంలో తృప్తికరంగానే పరీక్షలలో సమాధానాలను వ్రాశానని అనిపించింది. ఇంకా బాగా వ్రాసివుండవచ్చనే అభిప్రాయం నాకు సాధారణంగా ప్రతి పరీక్ష వ్రాసిన తరువాత ఉండేది. ఈ పరీక్షల విషయంలో అటువంటి అభిప్రాయం కొంచెం ఎక్కువగానే ఉందనిపించింది. ఏమైనా డిగ్రీని సంపాదించడంలో ఎటువంటి అనుమానమూ లేదు.

ఒక నెలరోజుల పాటు శిబిరం. స్వామీ ఋతాత్మానందగారు శిబిరపు పర్యవేక్షకులు. నేషనల్ హైయ్యర్ ప్రైమరీ స్కూల్ అధ్యాపకులూ, గాంధేయవాదీ, ఇలాంటి సేవాకార్యక్రమాలలో తగినంత అనుభవం ఉన్న శ్రీ కె.శ్రీనివాసరావుగారు శిబిరపు నాయకులు. మొత్తం విద్యార్థులు సుమారు 15 మంది. మేము సమాజసేవ చేయాలని వెళ్ళిన చోట కొన్ని ఎకరాలు ఆశ్రమానికి చెందిన భూమి, ఆశ్రమ భక్తులకు చెందిన భూమి ఉంది. అందువల్లే ఆ ప్రాంతానికి రామకృష్ణపురం అని పేరు పెట్టివుండవచ్చు. అక్కడ నివాసయోగ్యమైన ఇళ్ళు లేవు. ఎత్తైన ప్రదేశంలో పెంకులతో కట్టిన రెండు కట్టడాలు దానికి అనతి దూరంలోనే రాతికట్టడపు గుండ్రని పెద్దబావి. ఆ బావి ఒడ్డుకు రెండు మూడు అడుగుల క్రింద వరకూ నీళ్ళు. ఆ బావినీ, నిండుగా ఉన్న శుద్ధమైన నీటినీ చూసినప్పుడు మనసుకు సంతోషమయ్యింది. చుట్టూ అక్కడ తిరుగాడినప్పుడు చైతన్యమిచ్చే ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి. పెంకుల కట్టడంలోనే మా నివాసం, వంటిల్లు ఇంకా ఉగ్రాణం.

మా సేవా కార్యక్రమాలకు సుమారు రెండు కి.మీ.ల దూరంలో ఉన్న రెండు పల్లెలను ఎంచుకున్నాము. మేము రెండు గుంపులుగా ఏర్పడి ఒక్కొక్క పల్లెకు ఒక్కొక్క గుంపు వెళ్ళేవాళ్ళము. వంతుల ప్రకారం రోజుకు ఒకరు వంట చేసేవాళ్ళము. మా ముఖ్యమైన పని వయోజనులకు చదువు చెప్పడం. ఒక నెలరోజులలో ఇది కష్టమైన పని అయినా మేము మా ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాము.

అక్కడికి వెళ్ళినరోజే మా పని మొదలయ్యే విధంగా ముందే ఆ పల్లెల కరణం, రెడ్డి మొదలైన పెద్దలను కలిసి మా ఉద్దేశాన్ని వివరంగా తెలిపి వారి మరియు గ్రామ ప్రజల పూర్తి సహకారాన్ని కోరాము. శిబిరం మొదలు కాకముందే సుమారు 15 రోజుల క్రితమే స్వామీజీ గారు, శ్రీ శ్రీనివాసరావు గారు ఆ ప్రదేశాన్ని, ఆ రెండు పల్లెలను సందర్శించి అక్కడి గ్రామపెద్దలకు మా శిబిరపు ఉద్దేశాలను తెలిపి వారి సహకారాన్ని కోరివున్నారు. శిబిరపు మొదటిరోజు పల్లెలకు వెళ్ళి లాంతరు, దానికి కావలసిన కిరసనాయిలు, స్లేటు, బలపం, పుస్తకాలను మేమే ఉచితంగా అందిస్తామని చెప్పాము. వారి నుండి ఏ ప్రతిక్రియా లేదు. అన్నిటినీ మౌనంగా, గంభీరంగా విన్నారు. మాకోసం ఎదురుచూడని నిరాశ, ఊహించని సమస్య కాచుకుని వుంది. వీలైనంత ప్రచారం చేసినా అక్షరాభ్యాసానికి ఒక్కరూ రాలేదు. దూరం నుండి నలుగురైదుగురు మమ్మల్నే చూస్తూ అటూఇటూ తిరుగుతున్నారు. మాకు అర్థం కాలేదు. ఎవరూ ఏమీ అనలేదు. నోరువిప్పలేదు. అర్థగంట లాంతరు వెలిగించి కూర్చుని మా క్యాంపుకు వెనుదిరిగాము. మరుసటి రోజు వెళ్ళాము. అదే నిగూఢమైన వాతావరణం కనిపించింది. అయితే చుట్టుముట్టు కనిపించిన ఐదారుగురు వ్యక్తులను దగ్గరకు పిలిచి “ఎవరూ ఎందుకు రావడం లేదు. నిజం చెప్పండి” అని బలవంతంగానే అడిగాము. వారిని విశ్వాసంలోకి తీసుకున్నాము. అప్పుడు వారు నోరు విప్పారు. వారి తర్కం ఇలా ఉంది. “కాదు స్వామీ! మీరేమో లాంతరు తీసుకుని వస్తారు. దానికి కావలసిన నూనె మీదే. ఇంకా స్లేటు, బలపం, బుక్కు అన్నీ ఇచ్చి పాఠమూ ఉద్దరగా చెప్తున్నారు. ఈ కాలంలో ఎవరు చేస్తారు స్వామి. ఇంత మంచి పని. మేమంతా మాలో మేమే మాట్లాడుకున్నాము. ‘వీళ్ళు చేసే పనిలో ఏదో మతలబు ఉంది. మనకు ఇలాంటి ఆశచూపి మనలను సైన్యానికో లేదా ఇంకే పనికో బలవంతంగా తీసుకు పోతారు. మనం హుషారుగా ఉండాలి. వారి పనులకు పోరాదు’ అని నిశ్చయించుకున్నాము. అందుకోసమే తరగతులకు రాలేదు” అని చెప్పారు. ఇది విని మాకు ఆశ్చర్యం వేసింది. దీనిని మేమెప్పుడూ ఎదురుచూడలేదు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం, సేవ పల్లెటూరి ప్రజలకు కొత్తగా ఉంది. వారిని ఏదో ఒక విధంగా మోసం చేసే వారే ఎక్కువగా ఉన్నారు. ఆ సమయానికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినా దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. యుద్ధ సమయంలో ప్రజలకు ఆశ చూపి సైన్యంలో చేర్చే ప్రయత్నాలూ జరిగాయి. ఇది కూడా అలాంటి తంతు కావచ్చని పల్లె ప్రజల అనుమానం. ఆ రోజే రెండు పల్లెలలోని నాయకులను పిలిపించి మా నిజాయితీని వారి గుండెలకు హత్తుకునేలా వివరించాము. మరుసటి రోజు నుండి ఉత్సాహవంతులైన వయోజనులు మా తరగతులకు వచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలయ్యే తరగతులు సుమారు పదిన్నర గంటల వరకూ నడిచేవి. మేము సాయంత్రం భోజనం ముగించి పల్లెకు వెళ్ళేవాళ్ళం. ఆ వయోజనులూ ఆ సమయానికి భోజనం ముగించుకుని తరగతికి వచ్చేవారు.

పగలు ఎక్కువగా సహాయ కార్యక్రమాలు ఉండేవి కావు. పొద్దున, సాయంత్రం మామూలు ఆశ్రమపు ప్రార్థన, వంట పని, అధ్యయనం. కూరగాయలు, పాలు ఆనేకల్ నుండి తెచ్చేవాళ్ళం. వంట చేయడానికి గ్రూపులను చేసుకున్నాము. మా గ్రూపుకు అనంత అయ్యర్ ముఖ్య వంటవాడు. నేను అతని సహాయకుడిని. అనంతకు వంట చేయడం బాగా తెలుసు. కోలార్ జిల్లాలోని దేవరాయ సముద్రపు అష్టగ్రామాలలో ఒకటైన గుంజిగుంటకు చెందినవాడు. వయసులో నేను అనంత కన్నా 10 ఏళ్ళు పెద్దవాడిని. సుమారు 1940-42 నుండి మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అతని విషయం వివరంగా వ్రాయడం ఇక్కడ సమంజసం కాదు. ఐతే ఒకే ఒక చిన్న సంఘటన అతని నిజాయితీని సూచిస్తుంది. నేను పేదపిల్లల విద్యార్థి నిలయంలో ఉన్నప్పుడు నా పెట్టెమీద ఒక అరటి పండును పెట్టివుంటిని. కొంచెం సేపయ్యాక వచ్చి చూసాను. అరటి పండు స్థానంలో ఒక కాగితం ఉంది. దానిపై ఇలా వ్రాసి ఉంది. “అరటి పండును నేను తిన్నాను – అనంత”. ఇప్పుడు ఆ అనంత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మాజీ ప్రొఫెసర్ అయిన డా.జి.వి.అనంత అయ్యర్.

ఫలితం

ఒక రోజు రామకృష్ణాశ్రమం నుండి ఒక ఆశ్రమవాసి మధ్యాహ్నం బస్సు సమయం మించిపోయాక వేళ కాని వేళలో వచ్చారు. “ఎందుకోసం వచ్చారు. ఈ సమయంలో ఎలా వచ్చారు?” అని అడిగాను. “నీ కోసమే వచ్చాను. త్యాగీశానందగారు పంపారు” అన్నారు. నాకు ఆశ్చర్యంతో పాటు ఆందోళనా కలిగింది. ఏమి సంగతి అన్నాను. “నీకు బి.ఎస్.సి (ఆనర్స్) పరీక్షలో మొదటి ర్యాంకు వచ్చింది. ఈ రోజు ఉదయమే ఫలితాంశాలు ప్రకటించారు. ఈ వార్తను తెలపడానికి నన్ను పంపారు” అన్నారు. నాకు జ్ఞాపకమున్నంత వరకూ అప్పుడు బెంగళూరు నుండి ఆనేకల్‌కు రోజుకు ఒకటే బస్సు ఉంది. ఆ బస్సులో అతడు రాలేకపోయిన కారణంగా స్వామీజీగారు వాహనం ద్వారా (ఏ వాహనమో మరిచిపోయాను. బహుశా సైకిల్ మీద వచ్చివుండవచ్చు) నాకు ఈ సంతోషమైన విషయాన్ని వీలైనత త్వరగా తెలియజేయాలని అతడిని పంపారు. నాకన్నా వారికే ఎక్కువ సంతోషం కలిగింది. మరుసటి రోజు బస్సు ద్వారా ఈ సమాచారాన్ని చేర్చవచ్చనే ఓరిమిని వారీ విషయంలో కోల్పోయారు. వారికి నాపైనున్న వాత్సల్యం ఈ చర్య ద్వారా వ్యక్తమయ్యింది.

నేను ఆ ముఖ్యమైన డిగ్రీని ప్రథమ శ్రేణిలోనే సాధించాలని ఒక ఏడాది పడిన కష్టం సార్థకమయ్యింది. పంతాన్నీ నెగ్గుకున్నట్టయ్యింది. స్వామీజీగారు ప్రజలకు భగవద్గీతలోని స్థితప్రజ్ఞ లక్షణాలను బోధిస్తారు. ‘సమత్వం యోగ ఉచ్యతే’ – మనసు యొక్క సమతౌల్యమే యోగం అని వ్యాఖ్యానం చేస్తారు. ఐతే ఎక్కువ సంతోషం కలిగినప్పుడు ఇలాంటి సమతౌల్యాన్ని పోగొట్టుకునే సంభావ్యముంది అనడానికి ఈ ఘటనే సాక్షి. నేను స్వామీజీగారిని ఆక్షేపించడం లేదు. ప్రశంసిస్తున్నాను. ఇలాంటి మానవీయత కలిగిన సన్నివేశాలలో స్వామీజీగారు సమతౌల్యాన్ని పోగొట్టుకున్నది వారి దొడ్డగుణాన్ని సూచిస్తుంది. నా అభిప్రాయంలో మనకు కష్టం కలిగినప్పుడు సమతౌల్యాన్ని కాపాడుకోవాలి. ఐతే ఇతరులకు మంచిని చేయాల్సినప్పుడు లేదా ఇతరులకు ఆనందం కలిగించే పనులు చేసినప్పుడు ఉత్సాహాన్ని వ్యక్తం చేసి సమతౌల్యాన్ని పోగొట్టుకోవడం అపేక్షణీయమే. రామకృష్ణపురంలో నాతోపాటుగా ఉన్న స్నేహితులొకరు స్వామీజీగారు ఇంత ఆత్రంగా ఆ వర్తమానాన్ని పంపవలసిన అగత్యం లేదనే అర్థం వచ్చేలా మాట్లాడినందువల్ల ఈ ప్రస్తావన తెస్తున్నాను.

ఒక నెల సమాజసేవా శిబిరం దాని పరిమితుల మేరకు విజయవంతంగా నడిచింది. ఆ పల్లెల వయోజనులు ఎంతో శ్రద్ధాసక్తులతో వీలైనంత నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ముగింపు సమావేశానికి స్వామీ త్యాగీశానందగారే ముఖ్య అతిథిగా వచ్చారు. పల్లెప్రజల ఉత్సాహానికి అంతమే లేదు. పండగ వాతావరణం నెలకొనివుంది. సంశయ మనోభావంతో ఉన్నవారు చివరకు వచ్చేసరికి అవిచ్ఛిన్న భక్తులయ్యారు. సమావేశంలో కృతజ్ఞతను సూచించే ప్రసంగాల పరంపర. సమావేశం ముగియగానే మమ్మల్ని ఆ రాత్రి రామకృష్ణపురం వరకు వీడ్కోలు పలికారు.

ఎం.ఎస్.సి.

1945 జూలై నెలలో కాలేజీ మొదలయ్యింది. నా చదువును కొనసాగించి ఎం.ఎస్.సి.లో చేరాను. ఆ ఏడు విద్యార్థి మందిరానికి ఎక్కువమంది విద్యార్థులను తీసుకున్నాను. విద్యార్థుల సంఖ్య సుమారు 25 అయ్యింది. ప్రత్యేకంగా వంటవాడిని నియమించి బుల్ టెంపుల్ రోడ్డులో ఉన్న ఇంటిలోనే వంట, భోజనం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఉన్న నలుగురైదుగురు విద్యార్థులం ప్రొద్దున, సాయంత్రం భోజనానికి అక్కడికే వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్రమం నుండి మజ్జిగ తీసుకుని వెళ్ళేవాళ్ళం. భోజనానికి గంట కొట్టడం ఎందుకు ఆలస్యమౌతోందని ఎవరైనా అడిగితే “ఆ cow shed people ఇంకా మజ్జిగ తీసుకుని రాలేదు. వాళ్ళు తెచ్చిన తరువాత బెల్ కొడదాము” అని చెప్పేవారు. అందరికీ మేము cow shed people అయ్యాము.

నా ఎం.ఎస్.సి చదువు చాలా సులభంగా సాగింది. ముందు సంవత్సరాల ఏ సబ్జెక్టులను చదువ నక్కరలేదు. స్వామీ త్యాగీశానంద గారితో ఎక్కువగా చర్చిస్తూ కాలం గడిపేవాడిని. వారు చెప్పినది అంగీకరించినా, అంగీకరించక పోయినా, వారి నిజాయితీ, విశాలమైన అధ్యయనం, మానవీయ విలువలు ఎత్తి కనిపించేవి. ప్రతి ఆదివారం సాయంత్రం వారి ఉపన్యాస సమయం ఇంతని ఖచ్చితంగా చెప్పడానికి కష్టం. సాధారణంగా ఒక గంట. అయితే చాలాసార్లు గంటన్నర, రెండు గంటలు సాగేది. ఆనర్స్ తరగతిలో ఉన్నప్పుడు పూర్తి ఉపన్యాసాన్ని ఏకాగ్రతతో వినడానికి కుదిరేది కాదు. అక్కడ కూర్చునేవాణ్ణి కానీ మనసు చదువు వైపు ఉండేది. ఐతే ఎం.ఎస్.సి.లో ఉన్నప్పుడు ఎక్కువ ధ్యాసపెట్టి వినేవాణ్ణి. వారు చెప్పే ఎన్నో విషయాలు అర్థమయ్యేవి కావు. అంతే కాదు. కొన్నయితే వైజ్ఞానిక వైఖరికి విరుద్ధంగా ఉండేవి. అయినా ఆసక్తిగా వినేవాణ్ణి.

స్వామీజీగారు నాతో ఎక్కువగా వర్తమాన రాజకీయ విషయాలనే ప్రస్తావించేవారు. నేను ప్రకాశం అభిమాని అని వారికి తెలుసు, రాజాజీగారి తర్కబద్ధమైన మాటలకు వారు ఎక్కువ విలువనిచ్చేవారు. ఒకరోజు మేమిద్దరమూ మాట్లాడుతున్నప్పుడు వారి మలయాళ రాష్ట్ర(ఇప్పటి కేరళ)పు జనసంఖ్య స్వరూపాన్ని ఎక్కువ కుతూహలంతో వివరించారు. వారి అభిప్రాయం ప్రకారం ఆ రాష్ట్రంలోని మూడవ వంతు వంటవారు. ఇంకొక మూడవ వంతు కమ్యూనిష్టులు. తక్కిన మూడవ వంతు స్వామీజీలు! వారు చెప్పిన నిష్పత్తిలో కాకపోయినా కేరళలో ఇప్పటికీ ఈ మూడు వర్గాల ప్రాబల్యం చూడవచ్చు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here