పాట్ లక్

4
8

[dropcap]పొ[/dropcap]ద్దున్నే సమయం ఇంకా ఆరన్నా కాలేదు.

కాకులు మాత్రం ఏ ఇంటి పెరట్లోనన్నా, ఏ ఎంగిలి మెతుకులన్నా దొరకక పోతాయా అని, తొందరగా లేచేసి, హడావుడిగా అరుచుకుంటూ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి.

అప్పుడు, “కావు, కావు” మంది ఆ ఫోను.

అబ్బే, జోకు కాదు. నిజంగానే, “కావు, కావు” మని రింగయింది ఆ ఫోను.

వాళ్ళు ఆ ఫోను రింగు టోను అలా పెట్టుకొన్నారు, చుట్టాల వార్తని తెలిపేటట్లు.

ఆ వృద్ధ దంపతుల ఆనందం వారిదీ!

ఫోనెత్తి, “హలో” అంది దుర్గ.

కాలర్ ఐడీ చూడగానే ఫోను చేసిందెవరో తెలిసి పోయింది దుర్గకి.

“హలో దుర్గా, నేను – ఉమని మాట్లాడుతున్నా! ఎందుకు చేశానంటే, వచ్చే దసరా పండగకి, హైదరాబాదులో వున్న మా పిల్లల దగ్గిరకి వెల్దామని వుంది. నువ్వు కూడా మీ అమ్మాయిని చూడడానికి వెళ్తానన్నావు కదా, ఆ మధ్యన? నువ్వు కూడా వచ్చే మాటుంటే, అందరం కలిసి వెళదాం. నువ్వు, ‘సరే’ అంటే, మా వాడికి చెప్పి రిజర్వేషన్ చేయిస్తా” అంది ఉమ, గడ గడా మాట్లాడుతూ.

“సరే! నాకు కూడా కలిసి ప్రయాణం చెయ్యాలని వుంది. మా వాళ్ళతో మాట్లాడి నీకు మళ్ళీ ఫోను చేస్తా, ఒకటీ, రెండు రోజుల్లో. అలాగేనా?” అంటూ సంభాషణ ముగించింది దుర్గ.

* * *

ఉమ, దుర్గ మంచి స్నేహితులు చిన్నప్పట్నించీ. ఉమ భర్త, కృష్ణమోహన్. దుర్గ భర్త, నాగేశ్వరరావు. మగ వాళ్ళిద్దరూ ఒకేసారి ఒకే బ్యాంకులో చేరారు ఉద్యోగాలకి అనకాపల్లిలో. పెళ్ళిళ్ళయి కాపరాలకి వచ్చాక, ఉమా, దుర్గా, ఒకరింటికి ఒకరు వస్తూ, పోతూ, త్వరలోనే మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహం అలాగే చాలా కాలం సాగింది. కొన్నేళ్ళ తర్వాత ట్రాన్స్‌ఫర్ల మీద వేరే ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చినా, వారి స్నేహం మాత్రం బలంగానే సాగింది. రిటైర్ అయ్యాక, ఉమా వాళ్ళు కాకినాడలో, దుర్గా వాళ్ళు విశాఖపట్నంలో, సెటిల్ అయ్యారు.

“రాజు తలుచుకుంటే డబ్బులకి కొదవా?” అన్నట్టు, ఇరువేపుల స్నేహితులూ అంగీకారానికి రావడంతో, ప్రయాణ హడావిడి మొదలయింది వారికి.

“మీరు, మన నలుగురికీ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేయించండీ” అని భర్తకి పురమాయించింది ఉమ.

ఉమ కొడుకు, శ్రీనివాస్ హైదరాబాద్‌లో వుంటాడు. రైల్వేలో కంప్యూటర్ డివిజన్లో చీఫ్ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య, కాలేజీలో లెక్చరర్ పని చేస్తోంది. వాళ్ళ పిల్లలు, సురేష్, దీప. ఇంకా స్కూలుకి వెళ్ళే పిల్లలు. ఉమ భర్త, తన కొడుకు సాయంతో రిజర్వేషన్ పని పూర్తి చేశాడు.

అలా చూస్తూ వుండగానే, ప్రయాణం చేసే రోజు దగ్గిర పడింది.

ఉమ ఎంతో హడావిడి పడి, భర్తని హడావిడి పెట్టి, పనులన్నీ పూర్తి చేసింది. మనవలు తింటారని, జంతికలూ, సున్నుండ్లూ, తొక్కుడు లడ్డూలూ, చేసి డబ్బాల్లో సర్దింది. జంతికల్లో వాము వేయడం మర్చిపోలేదు ఉమ. తొక్కుడు లడ్డూలలో కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసింది. మినుముల ఆరోగ్యానికి ఎలాగూ మంచివని, మినప సున్నుండలే చేసింది. ఆహారం ఎప్పుడూ ఆరోగ్యకరంగా వుండాలని ఉమ ధ్యాస. కొడుక్కి ఇష్టమైన పచ్చళ్ళూ, కోడలికి ఇష్టమైన పొడులూ చేసి, కేరేజీల్లో సర్దింది.

దుర్గకి ఫోను చేసి, ఉమ అన్ని వివరాలూ చెప్పేసింది, కడుపులో ఏమీ దాచుకోకుండా.

“బావుంది ఉమా! పనులతో మంచి జోరుగా వున్నావు. మనిద్దరం కలుసుకుని చాలా రోజులయింది. ఎప్పుడూ ఫోనులో మాటలే నడుస్తున్నాయి. ఇన్నాళ్ళకి కలవడం జరుగుతోంది” అంది దుర్గ సంతోషంగా.

“అవును! నాకూ చాలా ఆనందంగా వుంది. రైల్లో హాయిగా గంటలు, గంటలు మాట్లాడుకుందాం. మనం అస్సలు నిద్రే పోవద్దు. అది సరే గానీ, రైల్లో తినడానికి ఉప్పిడి పిండి పులిహోర, దద్ధోజనం చేసి తీసుకు వస్తాను. దద్దోజనంలో మెంతులు బాగానే వేస్తాను. పోపులో జీలకర్ర కూడా. ఆ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి కదా? సామర్లకోటలో రైలెక్కుతాం మేము. అప్పుడు కలిసి భోజనాలు చేద్దాం. నువ్వేమీ పట్రావొద్దు. సరేనా?” అంటూ సంబరంగా కబుర్లు చెప్పింది ఉమ.

“అలాగే గానీ, కొంచెం బెల్లం పరమాన్నం కూడా చేసి తీసుకురా! తిని చాలా రోజులయింది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. మనకి షుగరు ఎలాగూ లేదు” అంటూ మాట్లాడింది దుర్గ.

రైలు సామర్లకోట దాటగానే, స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. వారి భర్తలిద్దరూ కూడా మాటలూ, పేకలూ కలిపారు.

అదే భోగీలో, వీరికి పక్కగా వుండే సైడు బెర్తులో, ఒకాయనా, దాదాపు ఎనిమిదేళ్ళ పిల్లాడూ కూర్చున్నారు. ఆ పిల్లాడు మహా హుషారుగా వున్నాడు. వాడు, తన తండ్రితో ఆగకుండా ఏదేదో మాట్లాడేస్తూనే వున్నాడు. ఆ తండ్రి కూడా, మధ్య మధ్యలో మాట కలుపుతూ, పిల్లాడి మాటలు శ్రద్ధగా వింటూ, వాడి సందేహాలకి ఏదో సమాధానం చెబుతున్నాడు.

“మీ పిల్లవాడు, మా మనవడిలాగా వున్నాడండి” అన్నాడు కృష్ణమోహన్, ఆ పక్క బెర్త్ ఆయనతో.

ఆయన నవ్వాడు.

“మీరు హైదరాబాద్ వెళుతున్నారా? ఏదైనా టోర్నమెంట్లో మీ పిల్లాడు పాల్గోడానికి తీసుకు వెళ్తున్నారా?” అని కృష్ణమోహన్ మళ్ళీ అడిగాడు.

“లేదండీ…” అని ఆయన ఏదో చెప్పబోతూ వుండగానే, ఆ పిల్లాడు అందుకని, “తాతగారూ” అంటూ వరస కలిపేశాడు.

“నేను చెబుతానండీ, తాతగారూ, మేం ఎందుకు హైదరాబాద్ వెళుతున్నామో! మరేమో మా నాన్న విశాఖపట్నం పోర్టులో పని చేస్తాడు. నేను మూడో క్లాసు తెలుగు మీడియంలో చదువుతున్నాను. బాగానే చదువుతాను. శ్రీలంక నుంచి వచ్చిన ఓడ వాళ్ళు, మా నాన్నకి ఒక సీసా ఇచ్చారు. సముద్రంలో ఆ సీసా తేలుతూ కనపడిందట ఆ ఓడ వాళ్ళకి. అంత పెద్ద ఓడలో వాళ్ళకి, అంత చిన్న సీసా మరెలా కనపడిందో! చిన్న పడవలో షికారు కెళ్ళినప్పుడు కనపడిందేమో!” అని చెప్పి కాస్త ఆగాడు ఆ పిల్లాడు.

ఆ పిల్లాడి వాగ్ధాటికి వీళ్ళంతా ముగ్ధులయ్యారు. ప్రోత్సాహంగా, “ఇంకా చెప్పూ” అన్నట్టు చూశారు.

“మరేమో ఓడ వాళ్ళు, సీసాలో ఏముందా అని చూశారు. ఒక ఉత్తరం కనబడింది. అది ఇంగ్లీషులో రాసిన ఉత్తరం. అది చదివాక వాళ్ళకి అసలు విషయం అర్ధం అయింది. వాతావరణం మీదా, ప్రకృతి మీదా పరిశోధనలు చేసే ఒక శాస్త్రజ్ఞుడు, మాల్దీవ్స్ దగ్గిరలో వున్న ఒక మానవ ఉనికి లేని ద్వీపం మీద ఏవో తాబేళ్ళ మీద పరిశోధన చేస్తున్నాడు. అక్కడ నుంచీ బయట ప్రపంచానికి ప్రచార సాధనాలు లేవు. ఆ శాస్త్రజ్ఞుడు తన భార్యకి ఒక ఉత్తరం రాసి, దాని మీద అడ్రసు రాసి, దాన్ని సీసాలో పెట్టి, సముద్రం లోకి గిరవాటేశాడు. ఆ సీసా ఎప్పటికయినా ఒక మానవ మాత్రుని చేతిలో పడుతుందనీ, ఆ మనిషి ఆ ఉత్తరాన్ని తన భార్యకి అంద జేస్తాడనీ ఆ శాస్త్రజ్ఞుడి ఆశ” అని గడ గడా ప్రవాహం లాగ చెప్పి, కొంచెం సేపు ఆగి, “అవునా నాన్నా, నేను కరెక్టు గానే చెబుతున్నానా?” అని తండ్రి మొహంలోకి చూశాడు.

తండ్రి అభిమానంగా తలాడించాడు, “ఇంకా చెప్పూ” అన్నట్టు.

పిల్లాడు మళ్ళీ మొదలెట్టాడు.

“మరేమో ఆ ఉత్తరం చదివిన ఓడ వాళ్ళకి, విషయం మొత్తం అర్ధం అయింది. వాళ్ళ ఓడ విశాఖపట్నం చేరగానే, ఆ సీసాని విశాఖ పోర్టు వారికి అందజేశారు. అప్పుడు ఆ పని మా నాన్నకి వచ్చింది. ఆ అడ్రసును పట్టుకుని, వాళ్ళ ఫోను నెంబరు సంపాదించి, మా నాన్న, ఆ శాస్త్రజ్ఞుడి భార్యతో మాట్లాడాడు. ఆవిడ చాలా సంతోషించింది. ఆ ఉత్తరం అందుకోవడానికి, ఆవిడ చెన్నై నుంచి హైదరాబాదు వస్తోంది. మా నాన్న, ఆవిడకి ఆ సీసా, ఉత్తరం ఇస్తాడు. నేను, ఆవిడతో మాట్లాడతాను. అందుకే మేము వెళుతున్నాం” అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు.

ఆ పిల్లాడి తండ్రి అందుకని, “అవునండీ! ఆ శాస్త్రజ్ఞుడు అరుదైన తాబేళ్ళ మీద పరిశోధనలు చేస్తున్నాడట. పిల్లలకి ప్రకృతిలో అంతరించి పోతున్న జీవాల పరిరక్షణ గురించిన అవగాహన ఏర్పడాలండీ. ఆ శాస్త్రజ్ఞుడి భార్య, మా వాడికి ఆ పరిశోధనల గురించి చెప్పడానికి చాలా ఉత్సాహం చూపించింది. పిల్లాడు కొంతైనా నేర్చుకుంటాడని, తీసుకు వెళ్తున్నాను” అని వివరించాడు.

ఉమకి చాలా ముచ్చటేసింది ఆ పిల్లాడిని చూసి.

“కొంచెం ఉప్పిడి పిండి పులిహోరా, దద్ధోజనం, బెల్లం పరమాన్నం పెడతాం. తింటావా నాయనా?” అని అభిమానంగా అడిగింది.

“వద్దు ఆంటీ. తినడానికి ఇంటి నుంచి పాస్తా తెచ్చుకున్నాము” అని జవాబిచ్చాడు ఆ పిల్లాడు.

తనని ‘ఆంటీ’ అని పిలిచి నందుకు ఉమ మురిసిపోయింది. ఆ పిల్లాడికి, బయటి వాళ్ళ విషయంలో ‘ఆంటీ, అంకుల్’ అన్న పిలుపులు తప్పితే, వేరేవి తెలియవు మరి.

“అబ్బో! ఆంటీవయ్యావా ఆ పిల్లాడికి? మీ మనవడి కన్నా చిన్న కాదూ ఈ పిల్లాడు?” అంటూ సాగదీస్తూ, నవ్వుతూ, ఆట పట్టిస్తూ అంది దుర్గ.

“పోనీలే! ఆ పిల్లాడిని ‘ఆంటీ’ అనే అనుకోనీ! నష్టమేం వచ్చిందీ?” అంది ఉమ నవ్వుతూ.

దుర్గ, ఆ పిల్లాడి వేపు తిరిగి, “నీ పాస్తాలు తర్వాత తిందువు గాని. దానిలో ఏముంది? అంతా పిండి పదార్థమేగా? మేము పెట్టే వాటిలో ఆరోగ్యానికి పనికి వచ్చే దినుసులు ఎన్నో వున్నాయి. కొంచెం రుచి చూడు. నచ్చకపోతే వదిలెయ్యి” అంది.

ఆ పిల్లాడు ఒప్పుకున్నాడు.

దుర్గా, ఉమా కలిసి, అందరికీ, ఆ పిల్లాడికీ, అతని తండ్రికీ కూడా పేపరు ప్లేట్లలో భోజనం వడ్డించారు.

“చాలా బావుంది ఆంటీ, చాలా బావుంది” అంటూ ఆ పిల్లాడు ఉత్సాహంగా తిన్నాడు.

అందరూ సంతోషించారు. చాలా సేపు కబుర్లు చెప్పుకుని, అందరూ నిద్రలకి పడ్డారు.

తెల్లవారి సికింద్రబాదు రాగానే, పిల్లాడూ, అతని తండ్రీ, వీళ్ళ దగ్గిర శలవు తీసుకుని వెళ్ళి పోయారు.

వీళ్ళు తమ సామానులు పట్టుకుని, ప్లాట్‌ఫారం మీద దిగేసరికి, వీళ్ళ పిల్లలు, వీళ్ళని ఇళ్ళకి తీసుకు వెళ్ళడానికి వచ్చారు, సకుటుంబ సమేతంగా.

అందరూ ఒకరి నొకరు పలకరించుకుని, “మళ్ళీ కలుద్దాం” అని చెప్పుకుని, ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోయారు.

* * *

దసరా శలవులు పిల్లలకి. ఇక వాళ్ళ గొడవలతో ఇల్లు కోలాహలంగా వుంది. మనవలతో పెద్దవారికి బాగానే కాలక్షేపం. వాళ్ళు చెప్పే కబుర్లు అపురూపం. వాళ్ళ ప్రేమ అనన్యం.

ఉమ నాయనమ్మ. దుర్గ అమ్మమ్మ.

నాయనమ్మ, అమ్మమ్మలు చేసి పెట్టే వంటలు, వాళ్ళ పిల్లలు బాగానే, ఇష్టంగానే తింటారు గానీ, వారి పిల్లల పిల్లలే ఏ మాత్రం ముట్టుకోరు. వాళ్ళ కెప్పుడూ ఫాస్టు ఫుడ్సే. అలాంటివే చేసి పెట్టమని, ఆ మనవలు తమ తల్లులని కాల్చుకు తింటారు.

“అప్పుడప్పుడు మన తిళ్ళు కూడా తినండర్రా. అవి ఆరోగ్యానికి మంచివి” అని వారి తల్లులెంత చెప్పినా వినరాయె.

పైపెచ్చు, అమ్మమ్మా, నాయనమ్మలని, “మీరు అన్ని కబుర్లు చెబుతారు. యూట్యూబ్లో చూసి ఇలాంటి మంచి వంటలు నేర్చుకోకూడదూ” అని విమర్శిస్తారు.

“మీ మనవలేనా? మా మనవలు కూడా అంతే! వాళ్ళమ్మ బాక్సులో వంకాయ కూరా, పప్పన్నం పెడితే, ఆ బాక్సు అలాగే తిరిగి వచ్చేస్తుంది. తెరవనన్నా తెరవరు. వాసనకే వాళ్ళకి తెలిసిపోయి, దాని జోలికి వెళ్ళరు. స్కూల్లో ఏదో బిస్కట్లో, బ్రెడ్డో కొనుక్కుని తిని, ఇంటికి అర్ధాకలితో వస్తారు. వాళ్ళు ఆకలితో అలమటించడం భరించలేక, వాళ్ళమ్మే వాళ్ళకి కావలిసినవి కొని తెస్తుంది” అంటూ వాపోయింది ఉమ, దుర్గతో ఫోనులో.

“అవును, అవును. ఎటొచ్చీ వాళ్ళ ఊహలు చాలా అద్భుతంగా వుంటాయి. కాలం మారే కొద్దీ పిల్లల ఊహలు కూడా మారుతూ వస్తున్నాయి. మన చిన్నతనంలో మన ఊహలలో చాలా పరిమితులు వుండేవి. వీళ్ళకి అలా కాదు. వీళ్ళ దగ్గిర్నించీ మనం కూడా నేర్చుకునేవి వున్నాయి సుమా!” అంది దుర్గ.

ఉమ కూడా ఒప్పేసుకుంది ఆ మాటలకి. ఇంకాస్సేపు మనవల ముచ్చట్లు చెప్పేసుకున్నారు పోటీ పడి.

ఉమ కోడలు, ఉమతో, “సినిమాల్లో లాగా ఏదన్నా మాయ జరిగి, వీళ్ళు మన తిళ్ళు కూడా తింటే, నాకు పనిలో కాస్త తెరిపిగా వుంటుంది” అని తన గోడును అత్తగారితో వెళ్ళబుచ్చుకుంది.

ఉమ సాలోచనగా తలూపింది.

* * *

ఆ రోజు శుక్ర వారం. రాత్రి భోజనాలు ముగించారు ఉమా వాళ్ళింట్లో.

పిల్లల సంగతి మామూలే. ఏదో బర్గరో, పిజ్జానో తిన్నారు. పెద్ద వాళ్ళు మాత్రం సాంప్రదాయ తెలుగు వంటలతో భోజనం చేశారు. అరటికాయ వేపుడూ, కంది పప్పు పచ్చడీ, చారూ – ఇవీ రాత్రి వంటలు. ఆరోగ్యానికీ మంచివి. సులభంగానూ అరుగుతాయి.

పిల్లలు, మొదట్లో టీవీ చూద్దామని అన్నారు.

“మేము ఇక్కడ వున్నంత కాలం, పిచ్చి టీవీ చూడ్డం మాని, మాతో మాట్లాడండర్రా! మేము వెళ్ళిపోయాక మీ ఇష్టం” అని తాత, మనవలతో సానునయంగా చెప్పాడు.

మనవలు ప్రేమతో ఒప్పేసుకున్నారు.

తిండి విషయంలో తప్ప, వారితో ఏ విషయం లోనూ పేచీయే లేదు. బంగారు కొండలు వాళ్ళు.

కొడుకు శ్రీనివాసు వచ్చి, తల్లిదండ్రులతో మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

“అమ్మా! నాన్నా! మీకు నా స్నేహితుడు రవీంద్ర తెలుసుగా? ఆ మధ్య మీరు వచ్చారని, వాడితో ఒకసారి చెప్పాను. అప్పట్నించీ మిమ్మల్ని కలవాలని తెగ కలవరిస్తున్నాడు. మనందరినీ వచ్చే ఆదివారం, వాళ్ళ ఇంటికి భోజనాలకి రమ్మన్నాడు. నేను, ‘అలాగే’ అని చెప్పాను. మనతో పాటు, దుర్గ పెద్దమ్మా వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకురమ్మని చెప్పాడు. పరిచయం చేసుకుంటారట వాళ్ళ కుటుంబం. ఇలా రాకపోకలు వుంటే, మనుషుల మధ్య సంబంధాలు చక్కగా సాగుతాయన్నాడు. ఇలాంటి కలయికలని గట్టిగా వుంచేది మంచి భోజనం. మన ఇంటి నుంచి మంచి తెలుగు వంటలు తెస్తామనీ, మన వైపు రుచులు చవి చూపిస్తామనీ చెప్పాను. ఇది ఒక ‘పాట్ లక్’ లాగా జరుపుకుందాం – అని చెప్పాను. చాలా సంతోషించాడు. పిల్లలకి ఏదో పిజ్జా తెప్పిద్దాము అక్కడ. వీళ్ళ సంగతి తెలుసుగా? మన వంటలంటేనే, వీళ్ళు పెడ మొహం పెట్టేస్తారు. సరేనా?” అని అడిగాడు.

“‘పాట్ లక్’ అంటే ఏమిటీ?” అడిగింది ఉమ ఆశ్చర్యంగా.

 “ఓ! అదా? కొన్ని కుటుంబాలు కలిసి భోజనాలు చెయ్యాలనీ, కబుర్లు చెప్పుకోవాలనీ అనుకుంటారు. అలా కలవడం ఎవరో ఒకరి ఇంట్లో జరుగుతుంది. అన్ని కుటుంబాల వాళ్ళకి, ఆ ఒక్క కుటుంబమూ మొత్తం వంట చెయ్యాలంటే చాలా కష్టం కదా? అందుకని, తలో కుటుంబం తలో కొన్ని వంటలు చేసి పట్టుకొస్తారు. అందరూ, అవన్నీ కలిసి భోంచేస్తారు. దాన్ని ‘పాట్ లక్’ అంటారు” అని వివరించాడు శ్రీనివాస్.

“తప్పకుండా” అని ఒప్పేసుకున్న ఉమ మనసులో, ఏవో ఆలోచనలు రేగాయి. వాటికి ఒక రూపం ఇవ్వాలనిపించింది ఉమకి.

ఆ మర్నాడే, దుర్గకి ఫోను చేసింది. అన్ని వివరాలూ చెప్పింది.

“దుర్గా! మీ కుటుంబం అంతా రావాలి. నువ్వు, ముక్కల పులుసు, టమాటో చారు చేసి పట్టుకుని రా. అప్పడాలూ, వడియాలూ మర్చిపోవద్దు. నేను, మామిడి కాయ పప్పూ, కందా, బచ్చలి ఆవ పెట్టిన కూరా, పనస పొట్టు ఆవ పెట్టిన కూరా, గారెలూ చేసి తీసుకు వస్తాను. అన్నట్టు, కాస్త అల్లం పచ్చడి కూడా తీసుకు వస్తావా? నేను బొబ్బట్లు తీసుకు వస్తాను. మా కోడలు సాయం చేస్తుంది బాగా అన్ని పనుల్లోనూ. నీకు మీ అమ్మాయి సాయం వుంది కదా? ఆ రోజుకని అడిగితే, మా ఆయనా, మా అబ్బాయీ కూడా పనులు చేసి పెడతారు. నీకు మీ వాళ్ళు ఎలాగూ పనులు చేస్తారు కదా? దీన్ని ‘పాట్ లక్’ అంటారట. సరేనా? సమ్మతమేనా?” అని అడిగింది.

దుర్గ సంతోషంగా నవ్వింది.

“అలాగే! అలాగే! ఇంకా సమయం చిక్కితే, ఇంకేదన్నా చెయ్యడానికి కూడా ప్రయత్నిస్తాను” అంది దుర్గ.

“అన్నట్టు, నాకో కొత్త ఆలోచన వచ్చింది, దుర్గా! నీకు మాత్రమే ఆ వివరాలు చెబుతాను. నువ్వెవరికీ చెప్పకూడదు” అంది ఉమ.

“సరే! సరే! నాకు రహస్యాలంటే తెగ మోజు. చెప్పు, చెప్పు” అంది దుర్గ ఉత్సాహంగా.

ఉమ, తన ఆలోచనని దుర్గకి చెప్పింది. దుర్గ వెంటనే ఆనందంగా ఒప్పేసుకుంది.

అంతే! ఆ రెండు కుటుంబాల ఇళ్ళ లోనూ పండగ కళ వచ్చేసింది.

బజారుకు వెళ్ళి అన్ని సరుకులూ తెచ్చుకోవడం, నిశ్చయించుకున్న వంటలు చేయడం – చాలా సంబరంగా జరిగాయి పనులు.

పెద్ద వాళ్ళ సంబరం చూసి, పిల్లలకి కూడా సంతోషం వేసింది.

తినడం ఇష్టం లేకపోయినా, ఆ వంటల పనులకి వాళ్ళు కూడా చిన్న చిన్న సాయాలు చేశారు.

ఆ ఆది వారం రానే వచ్చింది. రెండు కుటుంబాల వాళ్ళూ, తాము చేసిన వంటలతో రవీంద్రా వాళ్ళ ఇళ్ళు చేరుకున్నారు.

అవి చూసి ఆశ్చర్యపోయారు, రవీంద్ర కుటుంబం వాళ్ళు. చాలా సంతోషించారు కూడా.

వాళ్ళు కూడా రెండు, మూడు పిండి వంటలు చేశారు.

పరిచయాలూ, కబుర్లూ మహా జోరుగా సాగాయి. పిల్లలంతా కలిసి వాళ్ళ ఆటల్లో మునిగారు.

చూస్తుండగానే భోజనాల వేళ దగ్గిర పడసాగింది

రవీంద్రా వాళ్ళ ఇల్లు, ఊరికి దూరంగా వుంటుంది. వాళ్ళింటి నుండి బజారుకు వెళ్ళాలంటే, అరగంట పడుతుంది.

పిల్లలకి ఆకలి మొదలవుతోందని పెద్ద వాళ్ళకి అర్థం అయింది.

వాళ్ళ ఇంటి పని అబ్బాయిని పిలిచి, “పిల్లలందరికీ పిజ్జా తీసుకునిరా, బజారు వెళ్ళి. అలాగే, ఫ్రెంచి ఫ్రైస్, కూల్‌డ్రింకూ కూడా తీసుకురా” అని చెప్పి, డబ్బు ఇచ్చారు.

ఆ అబ్బాయి, ఒక సంచీతో సైకిలు మీద బజారుకి బయలు దేరాడు.

గంటా, గంటన్నారా! ఆ అబ్బాయి ఇంకా రాలేదు.

“ఆకలి బాబోయ్!” అంటూ పిల్లలు ఒకటే గోల. పెద్ద వాళ్ళలో ఒకటే అసహనం.

“ఎప్పుడూ ఇంతసేపు పట్టదు ఆ అబ్బాయికి, బజారు వెళ్ళి రావడానికి. ఇవాళ ఏమయిందో” అని వాళ్ళు అనుకుంటుండగానే, ఆ అబ్బాయి దూరం నుంచి వస్తూ కనపడ్డాడు.

పిల్లలు నవ్వు మొహాలు పెట్టారు.

పిల్లలు తింటే గానీ, పెద్దలు తినలేరాయె!

సైకిలు దిగి, ఇంటి లోపలకి ఖాళీ సంచీతో వచ్చాడు ఆ అబ్బాయి.

“ఏమయింది? ఏమీ తేలేదేం? ఇంత సేపు ఎందుకు పట్టింది?” అని ఆత్రంగా అడిగారు పెద్దవాళ్ళు.

“మరండీ, ఇవాళ్ళ ఏదో బందు అట. ఒక్క షాపూ తెరవలేదు. అనుకోకుండా మొదలెట్టారట బందు. అప్పటికీ నాలుగు బజార్లు తిరిగాను. అన్ని షాపులూ మూసేశారు” అంటూ చెప్పుకొచ్చాడు ఆ అబ్బాయి.

ఎండ లోంచి వడలి పోయి వచ్చాడా అబ్బాయి. పాపం!

పిల్లలు ఏడుపు మొహాలు పెట్టారు. ఆకలితో నక నక లాడుతున్నారు.

“పోనీ, ఈ ఒక్క రోజుకీ మా తిళ్ళు తినండర్రా! అవేమీ విషాలు కావుగా! పాపం, ఏండలో అలిసిపోయి వచ్చాడు ఆ అబ్బాయి. మీ అందరికీ మొదట భోజనాలు పెడతాము. ఆ అబ్బాయి కూడా మీతో కలిసి తింటాడు. ఏమంటారూ? బంగారు కొండలు కదూ! ఈ ఒక్క రోజుకీ చెప్పిన మాట వింటారా?” అని అడిగింది ఉమ, పిల్లలని సానునయంగా.

సొంత ఇంటిలో అయితే, ఈ పాటికి ఇల్లు పీకి పందిరి వేసేవారే! వేరే ఇంట్లో వున్నారు. అదీ బయట వారితో. పెద్దలు నేర్పిన సంస్కారం కాస్త ఉపయోగానికి వచ్చింది.

“అలాగే” అని నీరసంగానే ఒప్పేసుకున్నారు.

విచార వదనాలతోనే భోజనాలకి కూర్చున్నారు.

ఉమా, దుర్గా కబుర్లు చెబుతూ పిల్లలందరికీ వడ్డించ సాగారు.

అయిష్టం గానే తిండి నోట్లో పెట్టుకున్న పిల్లలు, కొంచెం సేపయేసరికి, వికసించిన వదనాలతో తినసాగారు.

“బావుంది, బావుంది. ఆ కూర మళ్ళీ వెయ్యవూ? ఆ రౌండు స్వీటు ఇంకోటి పెట్టు” అంటూ ఉత్సాహంగా తినసాగారు.

“బామ్మా, బామ్మా, మనింట్లో కూడా ఇలాంటివి మళ్ళీ చెయ్యి. బావున్నాయి” అన్నారు ఉమ మనవలు.

“అమ్మమ్మా, అమ్మమ్మా, నువ్వు కూడా చెయ్యమ్మమ్మా” అన్నారు పోటీగా దుర్గ మనవలు.

పెద్దల మొహాలు వికసించాయి.

“రుచులే కావు, ఆరోగ్యం కూడా ఈ తిళ్ళు. వీటిలో వాడిన దినుసులు ఆరోగ్యానికి చాలా మంచివి” అని చెప్పుకొచ్చారు, ఆ బామ్మా, అమ్మమ్మలు.

ఉమ ఆ పనబ్బాయితో వేయించిన నాటకం, దుర్గకి మాత్రమే తెలుసు.

ఆ ‘పాట్ లక్’ తమ మనవలలో కొంచెం మార్పు తెచ్చి, తమకు నిజంగా ‘లక్’ తీసుకు వచ్చిందని సంతోషించారు ఆ బామ్మా, అమ్మమ్మలు. ఆ మార్పు ఆరంభమే గానీ, అంతం కాదని వారిద్దరికీ తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here