పొట్టు పీచులతో బొమ్మలు

0
13

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘పొట్టు పీచులతో బొమ్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మొ[/dropcap]క్కల జీవితం, ఆహరం, పరిరక్షణ, వర్గీకరణ అన్నింటిని గురించి చదివే శాస్త్రాన్ని ‘ప్లాంట్ సైన్స్’, లేదా ‘బాటనీ’ అని అంటారు. బాటనీ అంటే వృక్ష శాస్త్రమన్నమాట. నేను చెట్టు లోని ప్రతి భాగం తోనూ బొమ్మలు, అలంకరణలు చేయడం మొదలు పెట్టి చాలా సంవత్సరాలయింది. అంటే ఇంటర్ చదివేటపుడు బైపీసీ గ్రూప్ తీసుకున్న దగ్గర నుంచీ అన్నమాట. మొధటగా నేను బయో గ్రీటింగ్స్ అని తయారు చేశాను. ఆ తరువాత పండ్లు, కూరగాయలతో వెజిటబుల్ కార్వింగ్ చేశాను. దీని తర్వాతి పరిణామం ఏంటంటే కొన్ని వృక్షాల విశేషాలను తెలియజేస్తూ సైన్స్ వ్యాసాలు రాయడం. ఇప్పుడు చెట్టు భాగాలతో అందమైన కళాకృతులు చేయడం. ప్రస్తుతం ఈ రోజు పండ్లలో ఉండే పీచులతో తయారైన బొమ్మల గురించి వివరిస్తాను. పీచు, తొక్క, తోలు పేరు ఏదైనా చెట్టులో భాగమే కదా! అందుకే వీటిని కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగంతో మీ ముందుకు వస్తాను.

మొక్కజొన్న కంకిని ఆవరించుకొని ఆకుల్లాంటి ఆకుపచ్చ నిర్మాణాలుంటాయి. ఈ ఆకుల మధ్యలో బంగారంలా మెరుస్తూ గింజలతో నిండి ఉన్న మొక్కజొన్న కంకి కనిపిస్తుంది. ఆ కంకిని చుట్టుకొని సన్నగా దారాల్లాంటి తెల్లటి పీచు కూడా ఉంటుంది. దాంతో కూడా నేను బొమ్మలు చేశాను. కానీ ఈ రోజు ఆకుపచ్చని ఆకుల్లాంటి పీచు తోనే బొమ్మను చూపిస్తాను. మొక్కజొన్న కంకిని రక్షణగా చుట్టుకొని ఉండే ఆకుపచ్చని పొరలు. మొక్కజొన్న నుంచి చౌకగా దొరికే ఆహరం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు,అమైనో యాసిడ్లు ఉంటాయి. కంకిని కాల్చుకున్నపుడు ఆకుపచ్చని ఆకుల్లోనే పెట్టి ఇస్తారు. ఇవి ఒక రకంగా విస్తార్ల వలె పని చేస్తున్నాయన్నమాట. ఆలాంటి ఆకుపచ్చని పీచును విడదీసి సాఫీగా చేసుకొని పెట్టుకున్నాను. రెండు చివర్లను సమానంగా కత్తిరించి వాటికి గాట్లు పెట్టాలి. అంటే చివర మాత్రం కలిసే ఉండేలా చూడాలి. దీనిని ఒక పుల్లకు గుండ్రంగా చుడితే పూల మధ్యలో ఉండే కేసరాల గుత్తిలా కనిపిస్తుంది. ఇప్పుడు పీచును పూల రెక్కల్లా కత్తిరించుకుని కేసరాల గుత్తి చుట్టూ పెట్టుకోవాలి. ఇవి ఊదిపోకుండా టేప్ తో చుట్టేయాలి. లేదా జిగురుతో అతికించేయాలి.

ఇప్పుడు తాటికాయలో ఉండే పీచులో ఎలా బొమ్మలు చేయాలో చూపిస్తాను. మా చిన్నప్పుడు తాటికాయ లోపల ఉండే విత్తనాన్ని తీసి దాన్ని ఆవరించి ఉండే పీచులో జుట్టును, గడ్డాన్ని పెట్టి రుషులని చెప్పేవాళ్ళం. పైగా పోటీలు కూడా! “నా రుషి బాగున్నాడా! నా రుషి బాగున్నాడా!” అంటూ గొప్పలు పోవాడాతానూ! తాటి చెట్లలో ఎన్ని ఉపయోగాలో. నా చిన్నతనమంతా సముద్ర తీర ప్రాంతంలో గడిచింది. కాబట్టి తాటి చెట్లు, కొబ్బరి చెట్లు చూస్తూ పెరిగిన వాళ్ళమే. తాటి కాయలోని తాటి ముంజల్ని తినేశాక కాయలో మధ్యన విత్తనం ఉంటుంది. కాయ అంతా నారతోటే నిండి ఉంటుంది. తాటికాయల తోనే తాటి బెల్లం తయారు చేస్తారట. తాటి ఆకులైతే ఇళ్ళ పై కప్పులకు చక్కగా వాడుకునేవారు. దీని మీద గడ్డిని కూడా కప్పేవారు. తాటి కాయను పగల గొట్టి తాటి విత్తనం తీయాలి. దాని చుట్టూ ఉన్న పీచును నీటితో కడిగేయాలి. విత్తనం మధ్య భాగంలో కొంత పీచును కత్తిరించేయాలి. అప్పుడు అక్కడ చదును అవుతుంది కాబట్టి ముఖానికి పనికి వస్తుంది. ఈ ముఖానికి కళ్ళు ముక్కు నోరు పెట్టుకోవాలి. విత్తనం పై భాగాన ఉన్న పీచును జుట్టుగా ముడేయాలి. కిందికి ఉన్న పీచును గడ్డంలాగా కట్ చేయాలి. బొమ్మ భలే అందగా ఉంటుందనుకో. తాటికాయలు వచ్చిన కాలమంతా మా చిన్నతనంలో ఇదే పని రోజూ చేస్తుండే వాళ్ళం.

ఇందాకే చెప్పాను గదా తీర ప్రాంతంలో పెరిగాను అని అక్కడ కొబ్బరి చెట్లు కూడా ఎక్కువే. ప్రతి ఇంట్లో కొబ్బరి చెట్లుంటాయి. కొబ్బరి మట్టల నుంచి బొమ్మలు, పడవలు చేయడం మా పిల్లల రోజువారీ పనులు. పెద్దలేమో చీపుర్లు తయారు చేసుకునేవారు. కొబ్బరి కాయలతో తయారయ్యే కూరలు, స్వీట్లు ఉండేవి. మా ఇంట్లో ప్రతి ప్రతి కూరలో కొబ్బరి, జీడిపప్పు వేసేవారు. ఎవరింటికి పోయినా కొబ్బరి లౌజు పెడుతుంటే బోరుగా ఉండేది. ఇప్పుడు తిందామంటే చేసి పెట్టేవాళ్ళే లేరు. కొబ్బరి పీచుతో గిన్నెలు తోముకుంటే శుభ్రంగా ఉండేవి. ఆ మెత్తటి కొబ్బరి పీచుతో ఎన్నో బొమ్మలు చేసేవాళ్ళం. మెత్తటి పోట్టులాంటి దాన్ని నెమలీకకు ఆహారంగా పెట్టేవాళ్ళం. ఈ రోజు మెత్తటి పీచును విడదీసి పోట్టంతా రాలిపోయాక పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దానిని గుత్తులుగా చేసి గుండ్రంగా ఒక తీగకు చుట్టుకుంటే పువ్వులా వస్తుంది. ఇలా పువ్వులు చేసి ఆకులు పెట్టి పూల గుత్తినే తయారు చేసుకోవచ్చు. దీనిని ఫ్లవర్ వేజ్ లో పెడితే ఎంతో బాగుంటుంది.

వరి గడ్డిలో కూడా ఎన్నో బొమ్మలు చేసుకోవచ్చు. మా చిన్నతనంలో ఎక్కువగా ఇల్లు బొమ్మలే చేసేవాళ్ళం. లేదంటే అమ్మాయి బొమ్మను వేసుకొని ఆ ఆకారానికి తగినట్లుగా గడ్డిని అతికించే వారు. ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఫోటోలు లేవు. బుట్టలు అల్లేవారు దిష్టి బొమ్మలన్ని గడ్డితోనే చేసి పక్షుల్ని చెదరగోట్టడానికి పొలాల్లో పెట్టేవారు. గడ్డి పోచల్ని గట్టి తాడుగా పేసి పశువులను కట్టడానికి ఉపయోగించేవారు. వ్యవసాయదారులు వరి కంకుల్ని వరసగా కట్టి తోరణాలుగా మారుస్తారు. ఇవి ప్రతి ఇంటి వాకిట్లో ఉండేవి. వాటికోసం పిచ్చుకలు వస్తుండేవి. ధాన్యం తెచ్చేవారు ఈ తోరణాలు కట్టి మా రైస్ మిల్లులో ఇచ్చేవారు. నేనిప్పుడు ఒక అమ్మాయి బొమ్మను పరిచయం చేస్తాను. ఒక డ్రాయింగ్ షీటు పై బొమ్మను గీసుకొని దాని పై గడ్డిని ముక్కలుగా చేసి అతికించుకోవాలి. చివరకు కళ్ళు ముక్కు పెట్టుకుంటే బాగుంటుంది.

మా నాన్నకు రైసుమిల్లులు ఉండడంతో మా ఆటలన్నీ అక్కడే ఉండేవి. మిల్లు వేనుక భాగాన పడే పొట్టును అప్పట్లో పొయ్యిలో ఉపయోగించుకునేవారు. హోటల్ వాళ్ళందరూ వచ్చి వరి పొట్టును కొనుక్కునేవారు. మేం మాత్రం పొట్టును తెచ్చి బొమ్మలు చేసేవారం. మా అమ్మ పెద్దమ్మలు కళాకారులు కాబట్టి ఏదో ఒకటి చేసేవారు. వాటిని చూస్తూ ఊరుకోక మేం కూడా ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు చాల చోట్ల దేవాలయాల వద్ద అమ్మవారి ఫోటోలు కనిపిస్తాయి. వాటిని వడ్లతో తయారు చేస్తారు. నేను వడ్ల గింజలతో పొట్టుతో కూడా బొమ్మలు చేశాను కానీ ప్రస్తుతం పొట్టు లేదా పీచుతో బొమ్మలు అనుకున్నాం కాబట్టి వరి పొట్టుతోనే ఇల్లు కడతాను సరేనా! ఈ బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here