పౌర్ణమి

0
7

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన ఎస్.వి. కృష్ణ. [/box]

[dropcap]”జా[/dropcap]తస్య ధృవోమృత్యుః ధృవో జన్మ మృతస్యచ

తస్మాద పరిహార్యేర్థే నత్వమ్ శోచి తుమర్హసి॥”

నేనేడ్వడం లేదు…

చుట్టూ వున్న వాళ్ళలో కొందరు లోలోపలే కుమిలిపోతున్నారు, మరికొందరు సన్నగా విలపిస్తున్నారు, ఇంకొందరైతే ముఖాల్లో బాధ నింపుకొని చూస్తున్నారు.

నాకు మాత్రం ఏడుపు రావడం లేదు… నా మనసు దుఃఖించడం లేదు…

కనీసం నా కళ్ళు కూడా చెమ్మగిల్లడం లేదు.

కొందరు నావంక చిత్రంగా చూస్తున్నారు….

వసారాలోని వాలుకుర్చీలో వెనక్కివాలి కూర్చున్న నేను మాత్రం – మానస వంకే… నా ‘మానస’ ఫోటోలోకే చూస్తూ వున్నాను.

హాల్లో బ్రాహ్మడు ఓ ఇత్తడి చెంబుతో చేతిలోకి నీళ్లు వంపుకొని చిలకరిస్తూ… ఏవేవో మంత్రాలు చదువుతూ నా ఇద్దరు కొడుకులతో ‘కార్యక్రమం’ నిర్వహిస్తున్నాడు.

అక్కడున్న వాళ్ళలో చాలామంది నావైపు వింతగా చూస్తూ, తమలో తామే ఏదో మాట్లాడుకుంటున్నారు. అదేమిటో విన్పించకపోయినా… నాకు తెలుస్తూనే వుంది – ఈ సమయంలో, ‘ఇలాంటి’ స్థితిలో- ముఖ్యంగా నాలో, నా ముఖంలో ‘విషాదం తాలూకు ఛాయ ఒక్కటైనా లేదేమిటా..?’ అని!

వాళ్ళకే కాదు… నాకూ వింతగానే వుంది –

నేనెందుకు ఏడ్వడం లేదు? నాకెందుకు దుఃఖం కలగడం లేదు??

– ముప్ఫయ్యయిదేళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చి, నాలో సగమై… ‘అర్ధాంగి’ అనే భావనకీ, బాధ్యతకీ తానే అర్థమై నిలచి ముద్దులొలికే ఇద్దరు కొడుకుల్ని నాకందించి నా జన్మకి సార్థకత చేకూర్చి… అర్థాంతరంగా మూడ్నెల్ల క్రితం నన్ను ‘ఒంటరి’ని చేసి వెళ్లిపోయిన నా మానస మూడవ మాసికం నిర్వహిస్తున్న ఈ క్షణంలో కూడా…

నేనెందుకు ఏడ్వలేకపోతున్నాను..?!

***

మానసని మొదటిసారి పెళ్ళిచూపుల్లో చూసినప్పుడే… తనతో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉందనిపించింది. ఏ జన్మలోనో నేను కోల్పోయిన ఆత్మీయనేస్తం మళ్లీ నన్ను వెతుక్కుంటూ వచ్చిందనిపించింది.

“ఒరేయ్ వంశీ… అమ్మాయి నీకు నచ్చినా, నచ్చకపోయినా ఆ విషయం నీ మనసులోనే ఉంచుకో! తిరిగొచ్చాక అన్ని విషయాలూ చర్చించుకుని మన నిర్ణయం తెలియజేద్దాం… అదీ పద్దతి!” అని బయల్దేరేముందు అమ్మానాన్న చెప్పిన మాటల్ని కూడా మర్చిపోయి తనని చూడగానే మనసులో కలిగిన భావాల ఉద్వేగంలో “అమ్మాయి నాకు నచ్చేసింది!” అనేశాను అసంకల్పితంగా,

నేను అలా ‘బయటపడటం’ అమ్మానాన్నకి నచ్చకపోయినా… నాతోపాటు వాళ్ళకి కూడా మానస ఎంతో నచ్చటమూ, తనపట్ల నాకు కలిగిన భావాలే నాపట్ల కూడా మానసకీ కలిగి నేనూ తనకి నచ్చటం, ఆ తరువాతి విషయాలు ఇరువర్గాలకీ కుదిరిపోవడం వల్ల మా పెళ్ళికి అందరూ అంగీకరించారు. నిశ్చితార్థం కూడా నిర్ణయించేశారు.

అయితే అసలు విషయానికి బీజం అక్కడే పడింది!

వివాహానికి బలమైన ముహూర్తం కోసం ఇరువైపులవారూ కొంచెం తీవ్రంగా ప్రయత్నించి, ఓ నిర్ణయానికొచ్చి నిశ్చితార్థంనాడు ప్రకటించిన పెళ్ళి తేది కాస్తా మరో నాలుగు నెలలు గడిస్తే కాని రాని రోజయ్యింది!

దాంతో- ‘పెళ్ళిచూపుల’ ద్వారా మొదటిచూపులోనే మొదలైన ‘పెద్దలు కుదర్చిన మా ప్రేమ’ కాస్తా- సంతకాలు పూర్తయినా మూడుసింహాల ముద్ర పడని అధికార పత్రమయ్యింది! ఇక – మా ఇద్దరి పరిస్థితి ‘సీటు’ రిజర్వ్ అయినా బెర్త్ కన్ఫర్మ్ కాని సందిగ్ధమయ్యింది!

ఇప్పట్లోలాగా వాట్సాపులూ- ఫేసుబుక్కులూ – వీడియో కాలింగులూ వంటి అధునాతన విధానాలూ, అతివేగ సమాచార వారధులూ ఆ రోజుల్లో లేవు కాబట్టి పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారి ఉత్తరాలే మాకు దిక్కయ్యాయి.

అనంతపురంలో ఉండే మానసకి హైదరాబాద్ నుండి నేను పోస్ట్ చేసిన ఉత్తరం ఎంత వేగంగా ప్రయాణించినా రెండ్రోజుల తర్వాతో, మూడ్రోజుల తర్వాతో ఆమెకి అందేది. తన వైపు నుంచీ అంతే! అంటే… ఉత్తరాల ద్వారా మేము సంభాషించుకునేది వారానికి ఒక్కసారేనన్నమాట! వారంలో తన నుంచి ఉత్తరం రాని మిగతా రోజులన్నీ నాకు నిస్సారంగా గడిచేని.

ఓ రెండు-మూడువారాలు గడిచాక ఆ ‘ఎడబాటు’ భరించటం ఇద్దరికీ కష్టమనిపించి ప్రతి రెండ్రోజుల కొకసారి ఉత్తరాలు రాసుకోవడం మొదలెట్టాం. అంటే… తన నుంచి నాకు ఉత్తరం అందినరోజు అంతకుముందు నేను రాసిన ఉత్తరం ఆమెకి అందేది. దానికి తను బదులిచ్చేసరికి తన ముందరి ఉత్తరానికి నేను రిప్లయ్ రాసి పోస్ట్ చేసేసేవాడిని.

ఓ నెలన్నరపాటు ఈ పద్ధతి బాగానే అనిపించినా… తర్వాత్తర్వాత ఆమె నుంచి ఉత్తరం లేని ఆ ఒక్కరోజు వ్యవధిని కూడా భరించడం కష్టమనిపించేది. అభిప్రాయాలు నచ్చి, అభిరుచులు మెచ్చి, భావాలు పంచుకుని, భావుకత పెంచుకొని ఉత్తరాల ద్వారా మానసకి మానసికంగా మరింత దగ్గరైన నేను- అందరి ఆమోదంతో తనని ‘నా దాన్ని’ చేసుకొనే సుదినం దగ్గరపడేకొద్దీ.. తనని వ్యక్తిగతంగా కలవాలన్న కోరిక నాలో పెరిగిపోసాగింది.

మనసుకి నచ్చిన మనిషితో, కాబోయే భాగస్వామితో పెళ్ళికి ముందు ప్రేమికులుగా చెప్పుకున్న ఊసులూ, చేసుకున్న బాసలూ మునిమనవలు పుట్టేదాకా గుర్తుంటాయంటారు. అది నిజమో, కాదో తెలీదు కానీ… తనని చూడాలనీ, ఏకాంతంగా కలసి కబుర్లాడాలనీ, ఆ ముచ్చటని మనసులో అందమైన అనుభూతిగా మిగుల్చుకోవాలనీ అనిపించడమే కాదు… పెద్దవాళ్ళకి తెలియకుండా మేమిద్దరం కలుసుకోవాలన్న ఆలోచనే ఎంతో అడ్వెంచరస్‌గా ఉండి, భలే థ్రిల్ కలిగించింది.

కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా… తనని కలుసుకోవడం? మా పెళ్ళిరోజు మరో నెల రోజులు ఉందనగా మార్గం కనిపించింది నాకు. వెంటనే మనసులోని తపనని అక్షరాల్లోకి వొంపి ఉత్తరం రాసేశాను…

***

నా మనోహరీ… ప్రియమానసా!

ఎలా వున్నావు? నీకేం… బాగానే వుంటావు.

నాకు తెలుసు… పెళ్ళి కానంతవరకూ అమ్మాయిలంతా ‘పెళ్ళీ, తాళీ, మొగుడూ’ కావాలంటూ కలవరిస్తారు. తీరా పెళ్ళయ్యాక… జరిగిన తంతుని తలుచుకుంటూ, మెళ్ళోని తాళిని తడుముకుంటూ, ఏవేవో ఊహలతో తీరిగ్గా కలలు కంటూ హాయిగా ఉంటారే తప్ప… ‘మొగుడి’ గురించి మాత్రం పట్టించుకోరు. నువ్వూ అంతే!

మగవాణ్ణి… మరి, నా సంగతేమిటీ? నీలా కలలు కందామని ఎంత ప్రయత్నించినా… ఉహుఁ- నిద్రే పట్టడం లేదు. కళ్ళు తెరిచినా, మూసినా నాకు నువ్వే కనిపిస్తున్నావు… ఏం చేయను?

అసలీ పెద్దలెందుకు పిల్లల మనసుల్ని అర్థం చేసుకోరు? అరిటాకులో అన్నీ వడ్డించి పెట్టి, నోటిని మాత్రం కుట్టేసినట్లుగా… మనకి నిశ్చితార్థం జరిపించేసి పెళ్ళి మాత్రం ఆలస్యం చేశారు.

పరుగుతీసే ప్రవాహాన్నీ, ఉరకలేసే కుర్రమనసునీ ఊరుకోమంటే ఊరుకుంటాయా?

మానసా… నీకెలా ఉందోగానీ, నాకు మాత్రం ప్రతీ రాత్రీ జాగారమే! పగలు ఆఫీసు పనిలో కూడా ధ్యాస నిలవటం లేదు. పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు. నీకు దూరంగా ఉండలేకపోతున్నాను.

నీకూ ఇలాగే ఉంది కదూ?

ఇంతకీ నేను చెప్పేదేమిటంటే… నాలోని ఈ ‘కలకలం’ తగ్గి, మనసులోని ‘కలవరం’ సద్దు మణగాలంటే ఒక్కసారి మనం కలుసుకోవాలి..

‘అమ్మో… పెద్దవాళ్ళకి తెలిస్తే..?’ అనంటావు ఇది చదవగానే… నాకు తెలుసు!

కాబట్టి- వాళ్ళకి తెలీకుండానే కలుసుకుందాం… రాబోయే పౌర్ణమినాడు! ‘స్నేహితుడి పెళ్ళికి వెళ్తున్నా’నని చెప్పి- ఆ ముందురోజు రాత్రి పన్నెండింటికి హైదరాబాద్ నుండి బెంగుళూరు రైల్లో నేను బయల్దేరి పౌర్ణమి రోజు ఉదయం ఏడుగంటలకల్లా ధర్మవరం చేరుకుని రైల్వే స్టేషన్‌లో నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ప్రతిరోజు లాగే అనంతపురం రైల్వేట్రాక్ అవతలున్న మీ కాలేజీకి వెళ్తున్నట్లుగా ఇంట్లోంచి బయల్దేరిన నువ్వు- ఆరోజు ట్రాక్ దాటకుండా స్టేషన్లోకి వచ్చి బెంగుళూరు వైపెళ్లే ఏ రైలెక్కినా ఇరవై నిమిషాల్లో ధర్మవరంలో ఉంటావు. నువ్వొచ్చాక స్టేషన్లోనే ఎకడైనా ఏకాంతంగా కూర్చొని సాయంత్రం మీ కాలేజీ వదిలే సమయం వరకూ కబుర్లు చెప్పుకుందాం. నిన్ను అనంతపురం రైలెక్కించాక- సాయంత్రం ఏడున్నరకి ధర్మవరం నుంచి బయల్దేరే హైదరాబాద్ రైలెక్కానంటే… ఉదయానికల్లా నేను ఇంట్లో ఉంటాను. ఏమంటావ్?

సో… రాబోయే పౌర్ణమిరోజు ఉదయం ఏడుగంటల నుంచి ధర్మవరం రైల్వే స్టేషన్లోని ‘హిగ్గిన్ బాదమ్స్ బుక్ షాప్’ (ఈ బుక్ షాప్ ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఉంటుందికదా!) వద్ద నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. రా… మానసా ! తప్పకుండా వస్తావు కదూ?!

‘కాదూ కూడదు, పెద్దల నిర్ణయం ప్రకారం పెళ్ళయ్యేదాకా కలవలేను!’ అంటావా? ఉహూఁ.. అలా అనకు మానసా! ఒక్కసారి నిన్ను కలిసి, తనివితీరా మాట్లాడితేగాని నా మనసు కుదుటపడేట్లు లేదు, నిన్ను చూడాలన్న నా ఆరాటం తీరేట్లు లేదు – అర్థంచేసుకుంటావు కదూ !

పౌర్ణమిరోజు ధర్మవరం రైల్వే స్టేషన్లో నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. మనం కలుసుకునే ఆ మధురక్షణాల కోసం తపించిపోతూ…

ప్రేమతో…

నేటి ప్రేమికుడు- రేపటి నీ వరుడు

‘వంశీకృష్ణ’

***

“దయచేసి వినండి… హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లవలసిన యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ మరికొద్ది సేపట్లో రెండవ నంబర్ ప్లాట్ ఫారం నుండి బయలుదేరుటకు సిద్దముగా నున్నది!”

చేతికున్న వాచీలోకి చూసుకున్నాను… తొమ్మిదిన్నర! అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా వెళ్లే రైళ్లలో ఇది రెండవది!

మొదటి రైలు ఎనిమిదిన్నరకి వచ్చింది. మానస అందులో రాదని ముందుగానే ఊహించాను నేను. ఎందుకంటే… తన కాలేజీ ఉదయం తొమ్మిది గంటలకి మొదలవుతుంది కాబట్టి ప్రతిరోజూ ఎనిమిదిన్నరకి ఇంట్లోంచి బయల్దేరుతుందని ఉత్తరాల్లో తెలిపింది. మొదటి రైలు ఎనిమిది గంటలకి అనంతపురం నుంచి బయల్దేరుతుంది కాబట్టి ఆ రైలు అందుకోలేదు తను. కానీ, తొమ్మిది గంటలకు బయల్దేరి తొమ్మిదిన్నరకి ధర్మవరం చేరుకునే ఈ రైలులో తప్పకుండా రావాలి!

‘హిగ్గిన్ బాదమ్స్’ బుక్ షాపు వద్ద నిల్చున్న నేను – జేబులోంచి దువ్వెన తీసి మరోసారి జుట్టు సరిచేసుకొని, కాస్త స్టయిలుగా నిల్చున్నాను తను ఎట్నుంచైనా వచ్చే అవకాశముంది మరి!

రెండో నంబర్ ప్లాట్‌ఫారం నుంచి రైలు వెళ్లిపోయింది. దిగిన ప్రయాణీకులు మొదటి ప్లాట్‌ఫారం మీదకి వచ్చి బయటికెళ్లిపోయేందుకు మరో పది నిమిషాలు పట్టింది.

కానీ, మానస కనిపించలేదు ! అంటే ఈ రైలులో తను రాలేదు… ఎందుకో?!

తను ఇంట్లోంచి బయల్దేరేసరికే ఆలస్యమైందా? స్టేషన్‌కి చేరుకునేసరికే రైలు వెళ్లిపోయిందా? అందుకే ఈ బండి అందుకోలేకపోయిందా? ఏమయ్యుంటుందీ??

మూడో రైలు పదిన్నరకి అనంతపురం నుంచి బయల్దేరి పదకొండు గంటలకు ధర్మవరం చేరుతుంది. అందులో తప్పకుండా రావాలి తను!

ఉస్సూరుమంటూ నిల్చున్నచోటు నుంచి కదిలి కాస్త దూరంలో ఉన్న సిమెంటు బెంచీ దగ్గరికి వెళ్లి కూర్చున్నాను. ఉదయం ఏడింటికి ధర్మవరంలో దిగిన నేను స్టేషన్లోనే ఫ్రెషప్ అయి, డ్రస్ మార్చుకొని, నీట్‌గా తయారై తనకోసం ఎదురుచూడసాగాను. మానస తొమ్మిదిన్నరకి వస్తుంది కదా, ఇద్దరం కలిసి బ్రేక్‌‍ఫాస్ట్ చేయొచ్చని ఎంతో ఆశ పెట్టుకొని ఎదురుచూశాను. నా ఆశ నెరవేరలేదు. ఇప్పుడు మళ్లీ పదకొండు గంటల దాకా నిస్సారంగా గడపాలి.

తనకోసం ఎదురుచూడటంలో క్షణమొక యుగంలా గడుస్తూంటే… మరో గంటన్నర సమయాన్ని ఎలా దాటించాలో అర్థంకాలేదు నాకు. ‘బ్రేక్‌ఫాస్ట్ చేసొస్తే కాస్త టైమ్ పాస్ అవుతుంది కదా!’ అనిపించినా… ఎందుకో ఆకలిగా లేదు. మనసులోని వెలితి వల్ల ఏమీ తినాలనిపించలేదు.

మానస వచ్చాక తనతో మాట్లాడాల్సిన విషయాలన్నింటినీ మనసులోనే ఓ క్రమపద్ధతిలో అమర్చుకోవడంలో నిమగ్నమయ్యాను. అలా గంటన్నరసేపు అతికష్టమ్మీద గడిపాను.

పదకొండుకి రావలసిన రైలు పదిహేను నిమిషాల ఆలస్యంగా వచ్చింది. నేను మళ్లీ కాస్త నన్ను నేను సరిచేసుకొని “హిగ్గిన్ బాదమ్స్ బుక్ షాప్’ వద్ద నిల్చున్నాను.

రైలు వచ్చింది… నాలుగు నిమిషాలు ఆగింది…. ప్రయాణీకులు దిగారు… స్టేషన్ విడిచి వెళ్లిపోయారు… మానస మాత్రం రాలేదు! నాలో అసహనం తన్నుకొనివచ్చింది… ఎందుకు రాలేదు తను? కారణం ఏమైవుంటుందీ? అనంతపురం నుంచి మరో రైలు వచ్చేది… మధ్యాహ్నం రెండున్నరకి!

అప్పటిదాకా ఎదురుచూడాల్సిందేనా?? ఎదురుచూపు ఎంత కష్టంగా ఉంటుందో మొదటిసారి తెలిసొస్తోంది నాకు.

ఎలా గడిపానో, ఒక్కొక్క క్షణాన్ని ఎంత భారంగా వెనక్కి నెట్టానో నాకే తెలియదుకానీ మధ్యాహ్నం రెండున్నరకి రావలసిన రైలు అరగంట ఆలస్యంగా మూడుగంటలకొచ్చింది!

రైలొచ్చింది… కానీ అందులోంచి మానస దిగలేదు! తను రాలేదు!!

నాలో దిగులూ, బాధ, కోపం, అసహనం, ఉక్రోషం, ఆక్రోశం, ఆవేదన, ఆవేశం… లాంటి భావాలెన్నెన్నో పెట్రేగిపోతున్నాయ్. వాటిని ఎలా ప్రదర్శించాలో, ఎవరిపై ప్రయోగించాలో కూడా అర్థంకాని సందిగ్ధ పరిస్థితిలో; అసలు నేను ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో… అలాగే ధర్మవరం రైల్వే స్టేషన్లో గంటల తరబడి కూర్చుండిపోయాను.

వేర్వేరు గమ్యాల వైపు వెళ్లే రైళ్లన్నీ రావడం, పోవడం కనబడుతున్నాయ్. సాయంత్రం నాలుగూ, ఐదూ, ఆరూ దాటి, ఏడు గంటలు కావస్తోంది. స్టేషన్లో లైట్లు వెలిగాయ్…

కానీ మానస జాడ మాత్రం లేదు! నా గుండెలో ఆవేదన, కళ్ళల్లో జలపాతాలు!

‘ఇక తను రాదు- అసలు తను బయల్దేరనే లేదు!’ అని నిర్ధారణ అయ్యాక- నేనెంత ‘ఫూల్’నయ్యానో అర్థమైంది… చాలా గిల్టీగా తోచింది. తనని కలవాలని ఎంత దూరం నుంచి, ఇంకెంత ఆశగా వచ్చానో తెలిసి కూడా తను రాలేదంటే… ఆ సంఘటన- ధర్మవరం రైల్వేస్టేషన్ సాక్షిగా నా ఆత్మాభిమానానికి జరిగిన అవమానంగా అనిపించింది.

ఆ ఆక్రోశంలోంచి సాయంత్రం ఎనిమిది గంటలకు హైదరాబాద్ రైలెక్కిన నేను- తీసుకున్న ఓ తీవ్రమైన ‘నిర్ణయం’ నా జీవనగతిని మార్చి, నా జీవితాన్నే హరిస్తుందని ఆ క్షణం నాకు తెలీదు.

ఆ తర్వాత నేను మానసకి ఉత్తరం రాయలేదు… తన నుంచి వచ్చిన ఉత్తరాలను సైతం నేను తెరిచి చూడలేదు!

మొదటి రాత్రి.. పాలగ్లాసుతో లోనికి అడుగుపెట్టిన మానసని సూటిగా నేనడిగిన మొట్టమొదటి ప్రశ్న – “ఆరోజు ఎందుకు రాలేదు?”

“ఏ రోజు?” అర్థం కాలేదామెకి.

“అబద్ధాలాడకు! ఆరోజు ధర్మవరం రైల్వే స్టేషన్‌కి రమ్మని సిగ్గువిడిచి మరీ నేను ఉత్తరం రాశాను. నిన్ను చూడాలనీ, కలవాలనీ మా అమ్మానాన్నకి కూడా అబద్ధం చెప్పి, ఎంతో ఆశగా నచ్చానే… ఆరోజు.. పౌర్ణమిరోజు!”

“ఉత్తరమా? ఒట్టేసి చెబుతున్నాను… మీనుంచి అలాంటి ఉత్తరమేదీ నాకు అందలేదు!”

“అబద్ధాలాడకు!” నిష్ఠూరంగా అన్నాను – “నా ప్రతీ ఉత్తరం అందింది కానీ, ఇదిమాత్రం అందలేదు కదూ?”

“నిజమండీ… మీ తోడు…” అంటూ ఇంకేదో చెప్పబోయింది.

కానీ ఆమె మాటల్ని విన్పించుకోలేదు నేను – “నేన్నమ్మను! నిన్ను నమ్మి సిగ్గువిడిచి వచ్చినందుకు నాకు తగిన శిక్ష విధించావు. సరే… నేనూ నీకో శిక్ష విధిస్తున్నాను. ఇకనుంచి ప్రతినెలా పౌర్ణమి రోజున నేను మౌనవ్రతం పాటిస్తాను. ఆరోజు నేను నీతో మాట్లాడను, నువ్వూ నాతో మాట్లాడొద్దు!”

“ఇదేం పిచ్చి వ్రతమండీ?”

“అదంతే… నా మాటంటే మాటే!” ఆ తర్వాత ఆరోజు మామధ్య మాటలకు అవకాశం లేకపోయింది… పైగా ఆరోజు… పౌర్ణమి!

***

నాకు గడ్డం నెరిసి, జుట్టు పలచబడి పాతికేళ్లు దాటాయి..

నా భార్య బ్రతికున్నంత కాలం ఎన్నోసార్లు చెప్పింది… ఆ ఉత్తరం తనకి అందలేదని! కానీ ఏనాడూ ఆమె చెప్పింది నమ్మిన పాపాన పోలేదు నేను. నా ‘పట్టు’ కూడా సడలించుకోలేదు. మూడు నెలల క్రితం నా భార్య మానస పోయేరోజు వరకూ కూడా… చిత్రమేమిటంటే… ఆరోజూ పౌర్ణమే! క్రితం నెల పౌర్ణమిరోజు కంటికి మింటికి ఏకధాటిగా ఏడ్చాన్నేను.

మళ్లీ ఈరోజు కూడా అదే… పౌర్ణమి !

లోపల కొడుకులిద్దరూ శ్రాద్ధం పెడుతున్నారు… వసారాలో వాలుకుర్చీలో పడుకొనివున్నాను నేను. మూసివున్న నా కనుల వెనుక ఎన్ని జ్ఞాపకాలో?!

“పోస్ట్!”

పోస్ట్‌మేన్ విసిరేసిన కవరు గాలివాలుకి నా వొడిలోకొచ్చి పడింది. బాగా నలిగిపోయి, నల్లగైపోయి – ఎన్ని స్టాంపులు వత్తారో ఆ పోస్టాఫీసు వాళ్ళు… చాలా మెత్తగైపోయింది కవరు.

కళ్ళజోడు సవరించుకుంటూ అడ్రస్ చూశాను… ‘రీ-డైరెక్ట్’ చేయబడిన కవర్ అది! వెంటనే ‘ఇదేమిటా…’ అనుకుంటూ కింద ‘ఫమ్ అడ్రస్’ చూశాను.

అంతే… ఒక్కసారిగా గుండె దడ హెచ్చింది! కారణం… ‘ఫ్రమ్ అడ్రస్’ అని వున్న చోట ఉన్నది నా పేరే!

అంటే… ఆరోజు మానస స్టేషన్‌కి రాకపోవడానికి కారణం… ఈ ఉత్తరం నిజంగా ఆమెకి అందకపోవడమేనన్నమాట!

కళ్ళు మూతలు పడుతున్నాయి నాకు.

మూసిన కనురెప్పల మాటునుండి జారే ఒక్కో కన్నీటి చుక్కా గడచిన కాలంలోని ఒక్కో పౌర్ణమిరోజు జ్ఞాపకాలను గుర్తుచేస్తూంటే… గుండెని చేత్తో పట్టుకొని వాలుకుర్చీలో అలాగే వెనక్కి వాలిపోయాను.

జారే ఆ కన్నీటి ధార నెమ్మదిగా సాగిపోతూ మెడవొంపులో ఇంకిపోయింది…

నా హృదయస్పందన కూడా క్రమక్రమంగా తగ్గిపోతూండగా… అస్పష్టంగా నా పెదవులు పలికిన చివరి మాటలే నాకు గుర్తున్నాయి…

“క్ష..మిం..చు మానసా..!”

ఎందుకో తెలియదు కానీ… లోపల శ్రాద్ధకర్మలో భోంచేస్తున్న బ్రాహ్మడు పొలమారి ఉక్కిరిబిక్కిరై కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here