[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]
క్షేత్రజ్ఞుడు – రెండవ భాగం:
లక్ష్య-లక్షణ సమన్వయం:
నాయికా భేధాలలో స్వీయ తరగతికి 100 పదాలు
పరకీయ తరగతికి 36 పదాలు
సామాన్య తరగతికి 63 పదాలు అని
శ్రీ విస్సా అప్పారావుగారి అభిప్రాయం.
శ్రీ గిడుగు సీతాపతిగారు – పిఠాపురం రాజారావు ప్రకటించిన గ్రంథంలో
స్వీయను గురించిన పదాలు 160
పరకీయ పదాలు 110
సామాన్య పదాలు 109
స్వీయ గురించి పదాలు ఎక్కువ వుండడంతో కేత్రయ్యకు స్వీయ నాయిక యందు అభిమానమెక్కువ అని చెప్పవచ్చు. స్వీయ నాయికలో 13 బేధాలున్నాయి. కన్య, ముగ్ధ, మధ్య, ఫౌడ, ధీర, అధీర, ధీరాధీర, జ్యేష్ఠ, కనిష్ఠ,
అవి గాక.
మానవతి, లఘుమాన, మధ్యమాన, ప్రేమ, విద్యా, యౌవన, కుల గల్పిత అనే నాయికా భేదాలు కూడా కొందరు చెప్పారు. నాయకుడు- పతి, ఉపపతి, వైశికుడు అని 3 విధాలు.
పతి – అనుకూలుడు
దక్షిణ నాయకుడు, దుష్టుడు, శఠడు
పచ్చి శృంగారం:
సాంబమూర్తిగారు 3 విధములుగా విభజించిరి
- అంతర్గతంగా భక్తి, బహిరంగంగా శృంగారం కన్పించేవి.
- గౌరవ శృంగారం ఇతివృత్తంగా కలవి.
- పచ్చి శృంగారం వుండేవి
పచ్చి శృంగారం గల పదాలలో కొన్ని భాగాలు అశ్లీల దాతకాలని ఉదహరించి, యీ పదాలు రచించిన క్షేత్రయ్య మొదలైన వాళ్లంతా దేవదాసీ, భోగం మేళాలతో ఫిడేలు గాళ్ళు, తార్పుడు గాళ్లు అని ఈనాటి విమర్శకులు కొందరు వ్రాయడం ఆ విమర్శకుల అజ్ఞతనే చాటుతుంది.
సంగీత రచన లేక సంకీర్తన రచనా పరిణామం:
క్షేత్రయ్య అవతరించు నాటికి సంకీర్తన రచన 3 నవ్య మార్గాలని తొక్కింది.
- నారాయణ తీర్థుల కృషిలో – సంకీర్తనము ప్రధానముగా ఆధ్యాత్మ భోధన ఆదర్శంగా పెట్తుకుని శృంగారాన్ని ఔపచారికంగా ఉంచుకొని, ఒక ప్రక్క నాట్యాభినయనం యైన యక్షగానాలకి ఉపాంగముగా పోతూ, ఇంకొక పక్క భజన పద్ధతి ప్రాచుర్యానికి దారి తీసింది. అది మొదటి మార్గము.
- రామదాసు కీర్తనలు భక్తి, రస పరమావధిని పొంది, పామర జనం కూడా భక్తి మార్గంతో సాధన చేయడానికి అనువయిన భజన గోష్ఠుల వ్యాప్తికి కారణమయ్యాయి. అది రెండవ మార్గం.
- సిద్ధేంద్ర క్షేత్రయ్యలకు ఆలంబమైన మార్గము మూడవది శృంగారం ప్రధానమై ఆధ్యాత్మ బోధ అంతర్గతమై సాగినది. సిద్ధేంద్రుని యక్షగానములు, క్షేత్రయ్య పదములు కూడా అందరి కంటే ముందంజలో వున్నాయి. మిగిలిన వారి కంటే క్షేత్రయ్య వేసిన ముందంజ ధాతు కల్పనలో ఇది తరువాత వారికి మార్గదర్శిగా చేసింది. నేటి కర్నాటక సంగీతపు రాగము లెన్నో స్పష్ట రూపం దాల్చినవి క్షేత్రయ్య పదాలతోనే.
సంగీత రచన:
- గేయములకు పల్లవితో పాటు అనుపల్లవి చేర్చు సంప్రదాయమునకు కేత్రయ్య మార్గదర్శకుడు అయ్యాడు.
- రస, అంగ, నిరూపణలో భేదాలను కల్పించి, వాటిని చిత్రించడానికి కావలసిన మాటల పొందికా, సంగీత రచనా క్షేత్రయ్య సొమ్ము అని చెప్పవచ్చు
- రాగ, విన్యాసము, రాగ స్వరూపాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్నవాడు ఇతడే.
- రాగ భావోద్రేకం కల్పింపగల స్వర సంగతులు తెలిసిన ప్రౌఢుడు.
- కరుణ రసంలో బాహ్య మాత్రమైన దుఃఖం.. ఉపశమించుకోగల దుఃఖమూ, దుర్భరమైన దుఃఖమూ, హృదయ విదారకమై బావురుమనే విలాపంతో కూడిన దుఃఖము – వివిధ దుఃఖ భావనలను వివరించాడు. వాటికి రాగాలను కూడా ఎంచుకున్నాడు. ముఖారి, ఘంటా, నాదనామక్రియ, పున్నాగవరాళి, కాంభోజి వంటి రాగాలు.అప్పారావుగారు 334 పదాలలో 39 రాగాలు ఉన్నాయి అని చెప్పారు.6 రాగాలలో రాగానికి ఒక్కొక్క పదమే ఉంది. అవి వసంత భైరవి, మౌళి, ఖండె, గౌళిపంతు, కేదార, గౌరి. వీటిలో ఖండె అనేది అపురూప నామం. మిగిలినవి ప్ర్రాచీన రాగాలే. అవి గాక మిగిలిన 32 రాగాలు క్షేత్రయ్య నాడు బహుళ ప్రచారంలో ఉండేవి అని చెప్పవచ్చు.రామదాసు – ఆనందబైరవి రాగాన్నిక్షేత్రయ్య – కాంభోజి రాగాన్ని
- స్వర సంచారము రెండు స్థాయిలకు తక్కువగా ఉండదు. సుబ్బురామ దీక్షితులు పదములు శబ్దార్థముల చక్కగా ఎరిగి రసానుభవముతో ఎవరు విళంబముగా పాడుచున్నాడో ఆ పదములు మాత్రము రుచించును. ధాతువులు వ్రాసి చూచితే వచ్చినదే వచ్చినట్లుండును. ఇట్లుండుటయే పద సాహిత్యముల శయ్య. ధాతువులు వచ్చినవి రాక యుండుట కీర్తనముల కృతుల శయ్య.
- అన్నమయ్య వలె ఇతను కూడా యుగళ గేయములు సంవాద పదములు కూడా వ్రాసెను.
క్షేత్రయ్య కవిత రహస్యం గాని మాటల అర్థాల మాటున గర్భితమై ఉన్నదా అనిపించే ఒక సమస్యా పదము ఉంది. ఇందులో మాటలన్నీ స్పష్టములే కాని అర్థం అయోమయం. పరిశోధకులకు తగిన శ్రమ ఇస్తుంది. ఉదాహరణ: ముఖారి, ఆది తాళం –
పదం:
లలనా మణిరో యీ భావము
తెలుపనే లలితముగా నిపుడు
~
ఆ కాలపు రాజుల పరిస్థితి వాతావరణం – బట్టి క్షేత్రయ్య గుణగణాలు తెలుసుకోవచ్చు.
- నాయక యుగము శృంగార యుగము. భోగమప్పటి ఆంధ్రులకు జీవన పరమావధి. స్త్రీ తాల్యము సామాన్యం, బహుకళత్ర గ్రహణము, వేశ్యాంగనా గమనము సిరిగల వారికి లక్ష్మణములు. ఆ కారణముగా నీతి బాహ్య కావ్యములు చాలా వచ్చాయి. అవి నేలటూరి వెంకట్రామయ్యగారు 1953 ఆగస్టు భారతి సంచికలో 158 వ పేజీలో వ్రాసిరి.
- నాయక రాజుల కాలము నాటి కవయిత్రియైన ముద్దుపళని గూర్చి కందుకూరి వీరేశలింగం గారు ఇలా వ్రాసారు: ‘ఆమె గ్రంథములోని భాగములు అనేకములు వినతగనివి, నోట నుండి రా తగనివియు, దూష్యములై యున్నాయి’.
- నాయక రాజుల నాటి కవియగు శేషము వెంకటపతి తన తారాశశాంక అను గ్రంథములో తాటాకులలోనే వ్రాసిరి. ‘పాపమంచనియు నెన్ని పువ్వుల వ్రాలదో తేటియట మగవాడగు వానికి దోసమున్నదే’ అని వ్రాసిరి. నాయక యుగమున స్త్రీ పాతివ్రత్యములు మాయమై ఎచటనో తల దాచుకున్నాయి. ఈ యుగములోనే క్షేత్రయ్య వెలిశాడు.
క్షేత్రయ్య గొప్ప కవి అనుటకు గల కారణము:
ఆయన గొప్ప కవి అనడంలో సందేహం లేదు. నాయక రాజుల కాలమున తంజావూరులోని స్థానిక కవులు క్షేత్రయ్యను నిరసించేవారు. ఇది తెలిసి క్షేత్రయ్య ఒక పదమున 2 చరణములు వ్రాసి, తుది చరణమును ఆ కవులనే పూరించమనిరి. వారికి చేతగాక చివరకు క్షేత్రయ్య అవలీలగా దానిని పూర్తిచేయ అతని సామర్థ్యమునకు కవులు తలవొగ్గారు.
ఆయన 4,000 పదములు వ్రాశారని ప్రతీతి. ఆయన పదరచనా పితామహుడు.
ఆయన పదములు 300, 400 మాత్రమే కనపడుతున్నాయి. ఈయన కవిత్వము రసవంతమై భావ ప్రభా భాసితమై జనస్తవనీయమై విలసిల్లుచున్నది.
క్షేత్రయ్య గొప్ప గాయకుడు కూడా అనటానికి ఒక చిన్న ఉదంతం:
అందనల్లూరు సుబ్బయ్య ఆయన పదములకు స్వరములు వ్రాసి సామాన్యులు సహితం పాడుటకు సులభమగు మార్గము చూపిరి. ఆయన వ్రాసిన పదములలో కూడా కొన్ని ఉత్కృష్ట రచనలు లేకపోలేదు.
అట్టి రచనలో ఆయన యదుకుల కాంభోజీ రాగంలో వ్రాసిన ‘ఎంత చక్కని వాడే నాసామి, వీడెంత చక్కని వాడే’ అనే పదము పద రాజములలో ఒకటి.
శైలి-భాష:
కవితాశైలి మృదుమధురమై లలిత పదముతో వుండును. భావముల అనుగుణంగా పదములు చేర్చుట; జాతీయములు, సామెతలు, బంధము, యతి, ప్రాస, తాళము, లయ, అలంకార, అనుప్రాస, శ్రుతి సౌకర్యము మొదలగు విశేషములతో కూడి వుండును.
తెలుగున నీ పదములకు గల స్థానము:
ఆంధ్రాలో బయలుదేరిన పదజాలం, ఆంధ్రా, అంతటా వ్యాపించిన, కేవలం నర్తకీమణులతో అన్వయించును. త్యాగరాయ కృతులకు వున్న గణన దేనికి లేదు. కచేరి ఆరంభంలో పాండిత్య ప్రకర్షను ప్రదర్శించి ఆద్యంతంలో వినువారికి మనసు ఉల్లాసం కొరకె ఈ పదములు పాడుతున్నారు.
పదముల లక్షణము:
- నాయికా, నాయక భావ భూయిష్టమై పల్లవి, అనుపల్లవి, చరణాలతో యుండు సాహిత్యము పదము అనబడును.
- చౌక, విళంబ కాలములో వుండును.
- అభినయార్థము గానే రచించారు.
- 3 చరణములు, 4, 5 చరణములుండవచ్చును. చరణము 8 లేక 6 ఖండములు గాని ఉండును.
- కడపటి చరణము నందే ముద్రాఖండనం వుండును.
- అనుపల్లవి యందు కూడా అపుడపుడు ముద్రాఖండం వుండచ్చు అనుటకు గల ఉదాహరణ – మేరగ దుర రమ్మనవ్ – శహన; ఏమందు నమ్మ – కేదారగౌళ; ఇంటికి రానిచ్చెనా – సురటి; ఇద్దరి సందున – కల్యాణి.
- భక్తుడు – నాయిక; భగవంతుడు – నాయకుడు
- పదశైలిని కనిపెట్టిన మొట్టమొదటి మహానీయుడు క్షేత్రయ్య.
- రసపూర్తికై అచటచ్చట గ్రామ్య పదములు అనింద్య గ్రామ్యములే గానీ నింద్య గ్రామ్యములు కన్పించవు.
~
క్షేత్రయ్య – త్యాగయ్య:
అష్టపదిని వ్రాసిన జయదేవకవి, కృష్ణలీలా తరంగిణి వ్రాసిన నారాయణ తీర్థులు, భక్తితో వ్రాసిన త్యాగయ్య కీర్తనలు పాడువారు, వినువారు, తన్మయులగుదురు. క్షేత్రయ్య ‘ఆంధ్ర జయదేవుడనిన’చో అతని పదము అష్టపదులతో సామ్యము వహించి రెంటియందు విప్రలంబ గీతములు అధికముగా వున్నాయి.
‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని ఆలంకారికుల శాసనము. అట్టి వాక్యరచనా ఫణితి, ప్రతిభ కలవాడు, ఎన్నదగిన వాడు, సాహిత్య కేదారమున పద కవితా సమతని పారించిన పదకవి శ్రీ క్షేత్రయ్య. కాని రసార్ద్ర హృదయుడగు భావునకు జనకములగు ఈ పదములకు ఆంధ్ర వాఙ్మయమున ఉచిత స్థానము ఏల ఈయరాదు.
(ఇంకా ఉంది)