ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-19

0
11

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

భక్త రామదాసు – మొదటి భాగం:

రామదాసు – బాల్యం – పరిణయం – మంత్రోపదేశం మొదలగు వివరాలతో జీవిత చరిత్ర:

రామదాసు క్రీ.శ. 1620 – 1680 కాలము నాటి వాడు. తెలుగు నియోగి బ్రాహ్మణుడు. ఇతని మొదటి వేరు కంచర్ల గోపన్న. తండ్రి లింగన మంత్రి. తల్లి కామాంబ. నివాసము హైదరాబాద్ రాష్ట్రంలోని ‘నేలకొండపల్లి’ గ్రామము. బాల్యమునందే బాలరామాయణాది గ్రంథములను ఫఠించి రామభక్తి అలవరచుకొని రామ సంకీర్తనములను రచించి పాడుచుండెడివాడు. శ్రీ రఘనాథ్ భట్టాచార్యులచే మంత్రోపదేశమై వైష్ణవ దీక్ష పొందుటయే గాక కబీరుదాసుచే రామ తారకమంత్రోపదేశము కూడా పొందెను. ఆ సమయంలోనే ఇతడు మహానందముతో ‘తారక మంత్రము కోరిన దొరికెను’ అను ధన్యాసి తాగంలో కీర్తన రచించి పాడెను.

వివాహమై పుత్రుడు జన్మించెను. తల్లిదండ్రులు గతించిరి. ఆస్తి దాన ధర్మములు చేసి బంధువుల కోరికపై హైదరాబాదు వెళ్లి అచ్చట మేనమామలును, అబ్బుల్లా తానాషా వద్ద మంత్రులైన అక్కన్న, మాదన్నల సహాయంతో భద్రాచలము తహశీలుదారు వుద్యోగము సంపాదించి, వసూలు అయిన పైకము అంతా రామ కైంకర్యమునకే వాడాడు. ఆ విషయం తెలిసి తానాషా 1665లో గోపన్నకు 12 సంవత్సరాల కఠిన శిక్ష విధించి బందిఖానాలో యుంచెను.

రామదాసుని చరిత్రను మొదట యాదవదాసు, తరువాత సింగరిదాసు, నరసింహదాసు, కృష్ణదాసు మొదలగువారు యక్షగానాలుగా రచించిరి. ఈతని మహిమలు నిరూపించుటకు చాలా ఉదాహరణలు కలవు. ‘కోదండరామ’ కృతి గానము చేసిన వెంటనే బాలుడు సజీవుడగుట ఇందుకు తార్కాణం.

ఆ కాలపు రాజు:

గోలుకొండ ప్రభువు గానప్రియుడు అబ్బుల్లా కుతుబ్షా (1026–1672) అను ప్రభువు. ఆయన సేనా నాయకుడు తుపాకుల కృష్ణప్పయు క్షేత్రయ్యను పోషించిరి. ఆ ఆస్థానంలో కేత్రయ్య 1100 పదములు వ్రాసెను. అబ్దుల్ తానీషా (1674-1699) ధర్మ స్వరూపుడు, మతోన్మాద దూరుడు, హిందూ మహమ్మదీయ తారతమ్య మెరుగని ధన్యమూర్తి. మహరాణి సితారా హిందూ మతద్వేషిణి.

హిందూ మత ద్వేషులు రామదాసును జంప యత్నింప రాముడు శార్దూల రూపమున కన్పడి, హంతకులను చంపి, మిగిలిన వారిని తరిమి వేసెనట. వైకుంఠమున సీతామహాదేవి భర్తతో “నాథా! పరమ భక్తాగ్రేసరుడైన రామదాసుకు దర్శనమీయక, భక్తుని హింసపెట్టిన మ్లేచ్ఛ ప్రభువునకు దర్శనమిచ్చుట, ఏంటి న్యాయము” అని, విమర్శించెను [సంగీత మహర్షులు (వాగ్గేయకారులు) మొదటి భాగం – శ్రీ నారుమంచి సుబ్బారావు, పుట 44].

అంత శ్రీరాముడు “దేవీ! గత జన్మమున తానీషా గొప్ప శివభక్తుడు. ప్రతి దినము గంగా జలముతో శివుని అభిషేకించెడివాడు. ఒక్క సంవత్సరమట్లు పూజింప నియమితుడై పొరపాటు బడి యొకరోజు ముందుగనే సంవత్సరం నిండినదని తలచి, శివుడు దర్శన మీయలేదని క్రోధము బూని, గంగా జలఘటమును, శివలింగముపై విసరెను. అంత శివుడు ప్రత్యక్షమయి ‘ఒక దినమాగలేక తొందరపడి దుష్కార్య మొనరించితివి. మ్లేచ్ఛ ప్రభువుగా బుట్టుము. నీ కపుడు రాముడు దర్శనము ఇచ్చును. అంత నీకు నా సామీప్య భాగ్యము గలుగున’ని చెప్పెను. శివుని శాప కారణమున తానీషాకు దర్శన మిచ్చితిని” అని చెప్పెను.

రామదాసు గత జన్మమున భక్తి, గలిగి జీవించు చుండెను గాని, ఒక చిలుకను పంజరమున 12 సంవత్సరములు బంధించి, దానికి ‘రామ’ అను మాట నేర్పి దానిచే పలికించు చుండెడివాడు. చిలుకను బంధించిన కారణమున రామదాసు కారాగృహవాసం అనుభవించవలసి వచ్చింది. ఇక శ్రీఘ్రముననే నా సాన్నిధ్యమొందునని రాముడు చెప్పెను.

రామదాసు సంతతి వాడగు ‘ఆది నారాయణదాసు’ మదరాసులో మాంబళములో యిటీవల వరకు నివసించుచు, శ్రీరామనవమి ఉత్సవములు మహావైభవోపేతముగా జేయుచు, వేల భక్తుల ఆకర్షించెడి వాడని శ్రీసాంబమూర్తి గారు వ్రాసిరి [సంగీత మహర్షులు (వాగ్గేయకారులు) మొదటి భాగం – శ్రీ నారుమంచి సుబ్బారావు].

కలియుగమున భద్రాచల రామదాసు పడరాని బాధలు పడి విసిగి వేసారి జీవితమున ఆశలుడిగి అసమానమగు నిందాస్తుతితో కొన్ని కీర్తనలు వ్రాసిరి. అవి బాహ్యముగా రాముని నిందించినట్లు తోచును గాని అంతరార్థమున అతి తీవ్రమై అనుపమానములైన అపూర్వ భక్తితో నిండియున్నవి. అవి:

  1. ఆదరణ లేని నీ నామ మంత్రపఠన..
  2. బిడియమేల నిక మోక్ష మిచ్చి..
  3. రక్షించు దీనుని రామ రామ..
  4. రామా నే చేత ఏమి గాదుగా..
  5. అడుగు దాటి కదలనివ్వను..
  6. నిన్ను పోనిచ్చెదనా..
  7. ఇక్ష్వాకు కుల తిలక..
  8. రావయ్య భద్రాచల రామ..

1769 నుండి హైదరాబాద్ ప్రభువులు బలహీనులగుట భద్రాద్రిలో అరాజకత్వం పెరుగుట రామదాసు చరిత్ర తూము నరసింహదాసు శిష్యుడైన నాగళ్ల వరద రామదాసుచే మొదట వ్రాయబడెను. నేడు వాడుకలో యున్న రామదాసు చరిత్ర సింగరిదాసుచే వ్రాయబడినది.

రామదాసు – సంగీత ప్రక్రియలు – కీర్తన:

వివిధ సంగీత ప్రక్రియలలో కీర్తనకు ఉన్న స్థానాన్ని, ఇతర సంగీత ప్రక్రియలతో పోల్చి చూసినప్పుడు కీర్తనకు గల ప్రత్యేకతను, విశిష్టతను అవగాహన చేసుకుంటే తప్ప రామవాసు కీర్తనల ప్రాశస్త్యం బోధపడదు. ‘కీర్తన’ అని ఈనాడు వ్యవహారంలో ఉన్న సంగీత ప్రక్రియకు, అన్నమాచార్యులే సృష్టికర్త. ఆయన కాలంలో కీర్తనను ‘పదం’ అని, ‘సంకీర్తనం’ అని వ్యవహరించేవారు. రాను రాను పదం అనే ప్రక్రియ శృంగార ప్రధానమైన రచనలకే పరిమితి కావటం, భక్తి, వేదాంత ప్రభోదనమైన సంకీర్తన, కీర్తనగా ప్రసిద్ధి చెందటం జరిగింది. కృతి అనే సంగీత ప్రక్రియ ఈనాడు సర్వజనామోదం పొంది ప్రపంచంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రయించింది.

  • శృంగార భావ ప్రధానం – పదం
  • భక్తిరస ప్రధానమైనది – కీర్తన
  • గాన రస ప్రధానమ్మెనది – కృతి

అన్నమయ్యకు రామదాసుకు పోలిక:

కీర్తన సాంప్రదాయానికి ఆద్యులు తాళ్లపాక అన్నమాచార్యుల వారే అయినా వారికి కొంచెం పూర్వులైన శ్రీ పాదరాయస్వామి, నిజగుణ శివ యోగి అనేవారు కర్ణాటక భాషలో భక్తి, వేదాంత ప్రబోధకాలైన కీర్తనలు రచించినట్లు వీరి రచనలు కొంతవరకు అన్నమాచార్యులకు మార్గదర్శకాలైనట్లు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారి అభిప్రాయం! (1)

అన్నమయ్య గారి సంకీర్తనలలో కొన్ని విశేషాలు:

పల్లవి రెండు ఖండాలుగా ఉండి, అనుపల్లవి అన్నది వేరే లేకుండా నాలుగేసి పాదాలు గల మూడు మూడు చదరంగాలుంటాయి అని రజనీకాంతరావు గారంటే (2); రజనీకాంతరావు గారి గ్రంథానికి వ్రాసిన పీఠికలో (3) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు అనుపల్లవి పురందర దాసుల కీర్తనలలో ఎన్నింటికో యున్నది కనుక దాని కృతులలో కలదు అని ఒక ఉదాహరణ చూపించి పల్లవిగా చెప్పబడుతున్న 3 చరణాలు నిజానికి పల్లవి, అనుపల్లవి అని తమ అభిప్రాయం వెల్లడించారు. కాని ప్రొఫెసర్ సాంబమూర్తి గారు “Tallapaka composers (1400—1500) were the first to write kirtanas with the divisions: pallavi, anupallavi and charana” (4) అని వ్రాసినప్పటికి “The anupallavi is a dispensable anga in a kirtana” (5) అనటం వలన, తాళ్లపాక వారి తరువాత వాడైన రామదాసు కూడ అనుపల్లవి లేని కీర్తనలు రచించటం వలన ప్రతి కీర్తనకు విడిగా పల్లవి, అనుపల్లవి, చరణం అనే 3 అంగాలు ఉండి తీరాలనే నియమం లేదని స్పష్టపడుతోంది. ఇక నారాయణ తీర్థుల తరంగాలలో కూడా ఒక్కొక్కసారి అనుపల్లవి లేకుండా పల్లవే కొన్నింటిలో ఒక పంక్తిగాను, కొన్నింటిలో 2 పంక్తులుగా ఉంటాయి (6).

ఆధార సూచిక:

  1. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము, బాలాంత్రపు రజనీకాంతరావు, పుట 76
  2. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము, బాలాంత్రపు రజనీకాంతరావు, పుట 76
  3. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము, బాలాంత్రపు రజనీకాంతరావు, పీఠిక పుట 14
  4. South Indian Music: Book III, Page 134
  5. South Indian Music: Book III, Page 135
  6. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము, బాలాంత్రపు రజనీకాంతరావు, పుట 77

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here