ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-23

0
8

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

భక్త రామదాసు – ఐదవ భాగం:

రామదాసు కీర్తనలు – రసానుశీలనం:

రామదాసు కీర్తనలను సాహిత్య దృష్టితో రెండు విధాలుగా పరిశీలించవచ్చు.

కీర్తనలలో వెల్లడి అవుతున్న రస స్వరూపం, ఆ రస పోషణకు ఉపయుక్తాలైన సంచారులు గూర్చి చర్చించటం మొదటిది.

రామదాసు కీర్తనలలోని భాషా స్వరూపం, దానికి సంబంధించిన విశేషాంశాలు, ఛందో వ్యాకరణాంశాలు గమనించటం రెండవది.

రామదాసు కీర్తనల సాహిత్య రస పోషణకు స్వరలయ విన్యాసానికి గల సంబంధం అవగాహన రావటానికి ఈ పరిశీలన అత్యావశ్యకం.

కీర్తన స్వరూపం:

రామదాసు కీర్తనలన్నింటిలోను పూసలలో దారంలాగా వ్యాపించిన రసం భక్తి. భక్తిని భావంగా పరిగణించారు గాని రసంగా అంగీకరించలేదు.

“రతిర్దేవాది విషయా వ్యభిచారీ తథాంజితః

భావః ప్రోక్తస్తదాభాసా హ్యనౌచిత్య ప్రవర్తితాః”

అని ప్రాచీనుల సిద్ధాంతంగా జగన్నాధ పండిత రాయలు పేర్కొన్నాడు [కావ్యాలంకార సంగ్రహము: సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి, పుట 307].

భక్తి, అయిదు విధాలు అని పూర్వులు చెప్పారు. అవి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భక్తులు. ఈ అయిదు ఒకదాని కంటే మరొకటి ఉత్కృష్టమైనవి. శాంత భక్తికి విదురుడు, వాత్సల్య భక్తికి యశోద, మధుర – సఖ్య భక్తికి అర్జునుడు, దాస్య భక్తికి ఆంజనేయుడు గోపికలు ఉదాహరణలు.

శాంత భక్తి:

ఇందులో ప్రేమ తీవ్రత ఉండదు. ఆవేదన, పరితాపాల ఛాయ కూడా కనిపించదు. శాంతంగా నెమ్మదిగా సాగిపోతుంది. శాంత భక్తి, అంటే జీవునకు జ్ఞానోదయమై ప్రపంచ సంబంధం విచ్ఛేదమై “జీవుని యందు సహజ సిద్ధముగనున్న ‘శుద్ధరతి’ (రసము) మొదట శాంత రూపమున ఉదయుంచుచున్నది” అన్నమాట. ఉదాహరణ : కేదార, ఆది.

పల్లవి:

భజరే శ్రీరామం హే మానస

భజరే రఘురామం రామం

చరణం 1, 2, 5..

శ్యామలగాత్రం సత్యచరిత్రం

రామదాస హృద్రాజీవ మిత్రం

ఈ కీర్తనలో కనిపించే సంస్కృత పదాలు రమ్యంగా మధురంగా ఉండటమే గాక రాముని మీద రామదాసుకు గల ప్రీతిని చక్కగా వెల్లడించాయి. మరొక కీర్తన – ముఖారి, ఆది.

పల్లవి:

పాలయమాం జయ రామ జయ భద్రాద్రీశ్వర రామ

చరణము:

కమలానాయక రామ జయ కమనీయానన రామ

నిజమైన భక్తునికి భగవద్గుణ గానం ఎంత చేసినా తనివి తీరదు [1. భక్తి యోగ: స్వామి వివేకానందులు, పుట 101. 2. ‘కృష్ణ భజనము’, పీఠిక: యల్లా పంతుల జగన్నాధము పుట 5]

చెరుకు ముక్కల వంటి తియ్యని మాటలతో ఈ కీర్తన సాహిత్య రచన సాగింది.

“చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో

మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా

మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్

దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ”

అని దాశరధీ శతకంలో రామదాసు భగవద్గుణ గానం తనివి దీరా చేస్తానని చెప్పాడు. తన కీర్తనలలో అతడు అంత పనీ చేశాడు.

దాస్య భక్తి:

భక్తుడు తాను పరమాత్మకు దాసుడని భావించే భగవంతునే ప్రభువుగా నెంచి కీర్తించటం దాస్యభక్తి. ‘నాకు కోరిక లేదు. నీ భక్తుడను. నీవు ఆశ్రిత వత్సలుడవు. ఇక నాకు కోరికతో పని ఏమున్నది? నేను నీ నేవకుడను’ అనే భావన దాస్య భక్తికి పునాది. రామదాసు కీర్తనలు ఎన్నో ఉన్నాయి

ఉదాహరణ : కాపి, ఆది

పల్లవి:

చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి

చరణములు:

1.

వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య (చ)

4.

పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య (చ)

6.

బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ దాసుడ దాసుడ నీ దివ్య (చ)

~

అహం త్వకామస్త్వద్భక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయః .

నాన్యథేహావయోరర్థో రాజసేవకయోరివ

(భాగవతం సప్తమ స్కంధం. 10వ అధ్యాయం, 6వ శ్లోకము).

‘నీదు బంటునై దంచెద కాల కింకరుల’ అని దాశరథి శతకంలో చెప్పుకున్న రామదాసు దాస్య భక్తి నిరుపమానము. ‘బంటు రీతి కొలువియ్యవయ్య రామ’ అని త్యాగరాజు వ్రాసిన కీర్తనకు రామదాసు కీర్తనలే స్పూర్తినిచ్చి ఉంటాయి.

మరొక్క ఉదాహరణ. యమునా కల్యాణి, ఆది.

పల్లవి:

గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా

చరణము 1, 2, 3

4.

ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాల

చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము.

‘అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అనే ప్రపత్తి భావం నిండిన ఈ కీర్తన దాస్య భక్తికి ఉదాహరణ.

‘గరుడ గమన రారా’ అని పిలవటంలో ‘గరుడ వాహనం ఉన్నది గదా, శ్రీఘ్రంగా రాగలిగిన వాడవే గదా. జాలము చేయవద్దు’ అనే భావం వ్యంజితం అవుతున్నది. తనకు రాముడే కలిమి బలము. పాల ముంచినా నీట ముంచినా ఆయనదే భారము అంటున్నాడు. రామదాసు తన దాసత్వాన్ని ఈ విధముగా వెల్లడించాడు.

సఖ్య భక్తి:

భగవానుని తనతో సమానంగా భావించి ఆయనతో సరాగాలాడుతూ ఆయనను చనువుగా మందలిస్తూ, సఖ్య భక్తిని ప్రకటిస్తున్న కీర్తనలు రామదాసు ఎక్కువ వ్రాయలేదు.

రెండు కీర్తనలలో మాత్రం శ్రీరాముని తనతో సమానుడుగా భావించి నేను చెప్పినట్లు చేయకపోతే నిన్ను అడుగుదాటి కదలనివ్వను సుమా, అని వాదులాడినాడు. స్నేహభావం, చనువు ప్రకటన కావటం చేత వాటిని సఖ్య భక్తి కీర్తనలుగా గ్రహించటం జరిగింది.

ఉదాహరణ: వరాళి, త్రిపుట

పల్లవి:

అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను

~

స్నేహభావంలో తిరస్కార వచనాలు రావడం సహజం అనటానికి ఈ క్రింది భగవద్గీతా శ్లోకం తార్కాణం:

యచ్చావహా సార్థమసత్కృతో‌உసి విహార శయ్యాసన భోజనేషు

ఏకో‌உథవా ప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహ మప్రమేయమ్

~

మరొక్క ఉదాహరణ: మధ్యమావతి, త్రిపుట

పల్లవి:

నేను బోనిచ్చెదనా సీతారామ నిను బోనిచ్చెదనా

వాత్సల్య భక్తి:

భక్తుడు భగవంతుని తన కన్నబిడ్డగా ఊహించుకొని భావిస్తాడు. ‘బూచివాని పిలువబోదునా’ అనే కీర్తన కృష్ణుని ఉద్దేశించి చెప్పినది. రామదాసు తనను యశోదగా భావించుకొని బాలకృషుని అల్లరి పనులను తలచుకొని ఆనందిస్తాడు [భగవద్గీత: విశ్వరూపం సందర్శన యోగము: 42వ శ్లోకము].

భగవంతుడి నుంచి ఏదీ ఆశించేది లేని స్థితి ‘వాత్సల్య భక్తి, అని వివేకానందులు అన్నది ఈ కారణం వలననే.

మధుర భక్తి:

వాతుల్యంలో కమనీయత చేరికయే మధుర భక్తి, ప్రేమ, ప్రణయ, స్నేహ, రాగ భావాలతో పరిపుష్టమైన మధుర భక్తి, అంతు లేని ఆనంద పారవశ్యాన్ని కల్పిస్తుంది.

భక్తుడు తాను స్త్రీగా భావించుకొని భగవంతుడే నాథుడనుకొని ఆయన మీద ప్రేమ కురిపిస్తాడు. భగవంతుడు పురుషుడు, జీవలోకమంతా స్త్రీలు. చైతన్య మహాప్రభువు మధుర భక్తానుభూతిని సంపూర్ణంగా పొందిన మహానీయుడు.

ప్రహ్లాదుడు వర్ణించిన నవవిధ భక్తి భేదాలు

  • శ్రవణం, కీర్తనం, స్మరణం (చింతనం)
  • పాదసేవనం, అర్చనం, వందనం (తనుహృద్భాషల సంఖ్యం)
  • దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం (ఆత్మలో ఎరుక)

అనేవి 9 భక్తి మార్గాలుగా ప్రహ్లాదుడు చెప్పాడు. భక్తి మార్గాలుగా భాగవతం పేర్కొన్నవి భక్తి, రసానికి అనుభవాలే అనటానికి అవకాశం లేకపోలేదు.

[1. Bhakti Yoga : స్వామి వివేకానందులు పుటః 105.  2. Introductory The Spiritual heritage of Tyagaraja: thesis by Dr. N. Raghavan.]

ఈ విధంగా రామదాసు కీర్తనలు భావోద్యేగం, ఆర్తి ప్రధాన లక్షణాలుగా గల రచనలు. ఆయన రచనలు పరిశీలించేటప్పుడు 3 అంశాలు దృషిలో ఉంచుకోవలసి ఉంటుంది. ఈ అంశాలు

  1. సంగతుల ప్రయోగానికి అవకాశం లేదు
  2. రసోచిత గమకాలకు ప్రాధాన్యత ఉండటం
  3. లయ భావలయను అనుసరించి వర్తించటం

సంచారి భావాలు:

ప్రధాన భక్తి సంచారి భావాలు
1. దాస్యభక్తి దైన్యము, ఆత్మ గర్హణ, నిర్వేదం, విత్కర్యం, భక్త శోధన, సమర్పణం
2. శాంత భక్తి ఔతుక్యం, ముదం, శ్రద్ధ, విశ్వాసం, మానస సంబోధన, మంగళా శాసనం
3. సఖ్య భక్తి నర్మ ప్రార్థన, నిర్మస్తుతి
4. వాత్సల్య భక్తి లీలా వర్తన

భాషా చందోలంకార విశేషాలు:

రామదాసుకు సంస్కృతాంధ్ర భాషలలో గణనీయమైన పాండిత్యం ఉన్నదని ఆయన కీర్తనలే చాటి చెప్పుతున్నాయి. సంస్కృత భాషలో, పౌఢ శైలిలో ఆయన వ్రాసిన కీర్తనలు 5, 6 పైగా కనిపిస్తున్నాయి అని రజనీకాంతరావు గారు ఉదహరించారు [ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం: బాలాంత్రపు రజనీకాంతరావు పుట 203].

మంచాల వారు ప్రచురించిన గ్రంథంలో సంస్కృత కీర్తనలు 13 వున్నాయి.

రజనీకాంతరావు గారిచ్చిన ఉదాహరణ – రూపక తాళంలో – ‘వందే విష్ణుం దేవమశేష స్థితి హేతుం’; చాపు తాళంలో ‘పతి రేవ గతి రధునా’ అనేవి.

‘వందే విష్ణుం’ – మునిపల్లె సుబ్రహ్మణ్య కవి రచించిన ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో రేగుప్తి రాగంలో ఉన్నది. రామదాసు చరిత్రలో 7 చరణాలున్నాయి. ఈ కీర్తన ఆధ్యాత్మ రామాయణంలో “శ్రద్ధాయుక్తో యః పఠతీమం స్తవమాద్యం” అని ఫలశ్రుతిని తెలిపే అదనపు చరణంతో ఉన్నది.

రామదాసు చరిత్రను రచించిన వారు ఆధ్యాత్మ రామాయణంలో నుంచి ఈ కీర్తనను గ్రహించి అందులో చేర్చి ఉండవచ్చు అని రజని గారి అభిప్రాయం.

సంస్కృత కీర్తనలు చక్కని శైలి, చందం, పద ప్రయోగం కల్గి కొన్నిచోట్ల తీర్థుల తరంగాలను గుర్తు చేస్తున్నాయి.

‘కలయ గోపాలం’ ప్రౌఢ రచనా సరి విధానాన్ని ప్రదర్శిస్తున్నది.

‘దీన దయాళో’ కీర్తనలో చరణాలు మాధుర్య గుణస్ఫోరకాలు. సంస్కృతంలో వ్రాసినా యతి ప్రాసలను అంత్య ప్రాసలను పాటిస్తునే సాగింది రచన [ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం: బాలాంత్రపు రజనీ కాంతరావు పుట 246].

ఉదా:

భజ రఘురామం భండనభీమం

రజనిచరాఘ విరామం రామం

శ్యామలగాత్రం సత్యచరిత్రం

రామదాస హృద్రాజీవ మిత్రం

శైలి, కైశికీ వృతి, వైదర్భీ రీతి, మాధుర్య ప్రసాద గుణాలు కలిగి ద్రాక్షపాకంలా ఉంటుంది. అప్రయత్నంగా, సులభంగా ఆర్ద్ర స్ఫూర్తి కలుగుతుంది. భామహుడు చెప్పిన మాలాకారుని లాగా, రామదాసు ప్రయత్న పూర్వకంగా ఆలోచించి అవధానంతో శబ్దాలను కూర్చినవాడు కాదు. సహజ భక్తి, భావావేశంతో, తన్మయత్వంలో అప్రయత్నంగా సంకీర్తన భావానుగుణంగా షైకి పొంగిన సరళ రచనలు.

‘రామ నా మనవిని చేకొనుమా దైవ లలామ పరాకు చేయకుమా’ అని తెలుగు మాటలతో ప్ర్రారంభమైన కీర్తనలో అనుపల్లవిలో – ‘స్వామి భద్రాచలధామ పావన దివ్య నామ గిరిజనుత భీమ పరాక్రమ’ అనే సంస్కృత పద భూయిష్ట రచన సాగింది.

తెలుగు: నీదండనాకు నీవెందుబోకు వాదేలనీకు వద్దుపరాకు..

సంస్కృతం: జయ రఘువీర జగదేకశూర భయనివార భక్తమందార.. మణిమయభూష మహలక్ష్మితోష రణవిజయఘోష రమణీయవేష

తెలుగు: ఏల రావయ్య ఏమంటి నయ్య

[1. ‘మాలాకారో రచయతి యథా సాదు విజ్ఞాయ మాలాం యోజ్యం కావ్యే స్వవహితధియా తద్వద్ ఏవాభిదానం’ కావ్యాలంకార సంగ్రహం: సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పుట 179లో ఉదాహృతం. 2. రామదాసు కీర్తనలు: మంచాల జగన్నాధరావు పీఠిక పుట 8]

అనుప్రాస – అంత్య ప్రాసలు:

ఉదాహరణలు

1.

రాముని వారము మాకేటి విచారము

2.

స్వామీ నీదే భారము దాశరధీ నీ వారము

రామ నామమె జీవనము అన్యమేమిరా కృపావనము

ఘోరభవసింధు తారకము హృదయారి వర్ణనివారకము

3.

సంతతము నన్ను రక్షింతువని నమ్మి మి

మ్మెంతురా జానకీ కాంత రామ ప్రభో

4.

అక్షయంబైన నీకుక్షిలో లోకముల

రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభో

5.

గోవింద సుందర మోహన దీనమందార

గరుడ వాహన

6.

జయ జానకీ రమణ జయ విభీషణ శరణ

జయ సరోరుహ చరణ జయ దనుజ హరణ

7.

జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య

జయ గణ్య లావణ్య జయ జగద్గణ్య

8.

మణిమయ భూషణ మంజుల భూషణ

రణ జయ భాషణ రఘుకుల పోషణ

ఇలా చాలా మనం ఉదహరిస్తూ పోవచ్చు.

రామదాసు చరిత్రలో ‘శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండభాండ తండోపతండ కరండ మండల’ అనే పదాలతో ప్ర్రారంభమైన ‘చూర్ణికా ప్రబంధం’ – ‘శ్రీమద్భద్రాచల రామభద్రం రామదాస సుప్రసన్నం భజేహమ్ భజేహమ్’ అని ముగుస్తుంది.

రామదాసు ‘పాహి రామప్రభ’ అని వ్రాసిన కీర్తనను రజని గారు దండకంగా పేర్కొంటూ ఇది మాములు దండక ఛందస్సుకు భిన్నంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.

పద ప్రయోగం – పలుకుబడులు:

రామదాసుకు పార్శీ, ఉర్దూ భాషలలో పాండిత్యం ఉండి ఉండవచ్చు అని విమర్శకులు ఊహించారు. యాది, సర్కారు, తహశీల్, అంగీలు, జవాన్లు అనే ఉర్దూ పదాలు మాత్రమే ఆయన కీర్తనలో కన్పిస్తాయి.

వ్యాకరణ దోషాలు:

వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలు

  1. దైవమని మీరలేక కీర్తనలో – మూలదూరుకు బదులు మూల దూరి ఉండాలి. తలచిచ్చి – తలచి యిచ్చి; దండను – దండను అని [1. రామదాసు చరిత్ర పుట 2. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం: బాలాంత్రపు రజనీకాంతరావు పుట 207 2. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం: బాలాంత్రపు రజనీకాంతరావు పుట 203]
  2. ఇక్ష్వాకు కుల తిలక అనే కీర్తనలో- చేయిస్ – చేసితి అని; కట్టిస్తి – కట్టితి
  3. నను బ్రోవమని చెప్పవే అనే కీర్తనలో ప్రక్కన చేరుక – చేరి అని
  4. శరణా గత రక్షణ చిరుదని అనే కీర్తనలో సాగరుడవని – సాగరుడని
  5. దీన దయాళో కీర్తనలో ఆగమ రక్షిత – ఆగమ రక్షక అని
  6. గోవింద సుందర మోహన లో అంత్య ప్రాస భంగం కలిగింది. గందును, ఉండును, అందును – వింటిని విందును అయి ఉండాలి
  7. పుండరీ కాకాయ పూర్ణ చంద్ర వదనాయ – ను పూర్ణచంద్రాననాయ అని. వేదాంత వేద్యాతాయలో వేద్యాయ సరి అయినది. రామదాసాయ – రామదాస మృదుల హృదయ అని మృదుల హృదయ కమల నివాసాయలో.
  8. ఎన్న గాను రామభజనలో మిక్కిలున్నదా అని ఇత్వ సంధి రూపం కన్పిస్తుంది.

ఆ వ్యాకరణ దోషాలన్ని కూడా జన సామాన్యం నోళ్లలో పడి కొన్ని శబ్దాల రూపాలు భ్రంశం అయి వుంటాయి. శుద్ధ పాఠాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పుటకే ఈ దోషాలను ప్రస్తావించటం జరిగింది.

ఈ విధంగా ఛందోరీతులు, యతి ప్రాసలు, విరుపులు కూడా ఆయన రచనలలో మనం ఉదహరించవచ్చు. రామదాసు జీవితం తెలుగుదేశంలోనే గడచింది. దాక్షిణాత్య, ఔత్తరాహిక ప్రభావం ఆయన మీద లేదు. రామదాసు కీర్తనలు తెలుగువారి గాన పద్ధతిని ప్రతిబింబించే దర్పణాలు. ఈ కీర్తనలకు సంప్రదాయ సిద్ధమైన స్వర రచనను సేకరించి, సంస్కరించి, భద్రంగా రక్షించి రాబోయే తరాల వారికి అందించవలసిన బాధ్యత అందరిమీదా ఉన్నది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here