ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-24

0
11

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

మునిపల్లె సుబ్రహ్మణ్య కవి (1730-1795):

[dropcap]వీ[/dropcap]రి స్వగ్రామము గుంటూరు అనీ, కృష్ణా జిల్లా లోని పెదముత్తేవి అని అభిప్రాయ భేదము కలదు. ములకనాటి బ్రాహ్మణుడు. ఇంటి పేరు శేషగిరివారు. తాత సుబ్బన్న. తల్లి కమలమ్మ. తండ్రి రామలింగయ్య వరపు వెంకన్న. కలికి వరదన్న, శేషన్న సోదరులు. రామలింగయ్య గట్టి సంగీత విద్వాంసుడు. తంజావూరులో 1730లో సుబ్రహ్మణ్య కవి జననం అయింది. తండ్రి వద్దనే తెలుగు, సంస్కృతము, సంగీతం అభ్యసించి సాటిలేని సామర్థ్యమును సాధించారు. కాళహస్తీశ్వరుని ఆలయమున ఆసీనులై సుబ్రహ్మణ్యకవి 104 కీర్తనలు వ్రాసి ‘ఆధ్యాత్మ రామాయణ’మనే పేరుతో రామకథను పూర్తి చేనెను. 1795 లో దివంగతులైరి. ఆయన కీర్తనలయందలి కవిత్వ సంపదను గాని, భక్తి మాధుర్యమును గాని వర్ణింప ఎవరి తరము? ఈయన కీర్తనలు శ్రీనిలయమై వెన్నవలె మృదువై యస, మానమై నుతిగనెను. కాళహస్తి ప్రభువుపై కొన్ని శృంగారమయములగు పదములు కూడా వ్రాసెను. ఈ కవి కుటంబం వారు నేటికి కొలదిగా వెంకటగిరిలోను, హిందూపూరులోనూ గలరు.

కవి శిష్య పరంపర:

  • సుబ్రహ్మణ్య కవి
  • నాళ్ల చెరువు శీనయ్య (గుంటూరు)
  • నాదేళ్ల వెంకటయ్య (గుంటూరు)
  • జోస్తులలక్ష్మి నారాయణ శాస్త్రి, (ఝఝవరం)
  • జొన్నలగడ్డ శివశంకర శాస్త్రి (కుప్పార వీర రాఘవ శాస్త్రి)

~

సుబ్రహ్మణ్య కవి కాళహస్తి సంస్థానంలో దామెర్ల వారి పోషణ క్రింద వున్నవాడు. దైవ భక్తుడగుటచే శ్రీ తిరుపతి వేంకటేశ్వరుని అంకితముగా శ్రీరామ కథను, శివుడు పార్వతికి వినిపించునట్లుగా ఆధ్యాత్మ రామాయణ గ్రంథాన్ని తెలుగులో రచించారు. దీనిలో 6 కాండలు వున్నాయి. 104 కీర్తనలు.

దీనిలో –

  • బాల కాండలో -17
  • అయోధ్య కాండలో – 9
  • అరణ్య కాండలో – 11
  • కిష్కింధ కాండలో – 10
  • సుందర కాండలో – 10
  • యుద్ధ కాండలో – 47 కలవు

వీటిలో కొన్ని కీర్తనలలో జతులు కూడా కలవు. ఇతడు సంస్కృతాంధ్రములలోను, సంగీత, నాట్య, అలంకార, వేదాంత శాస్త్రముల లోను అపారమైన పాండిత్యము గలవాడును, గేయ రచనా సమర్థుడు.

అధ్యాత్మ రామాయణ కాల చర్చ నిరర్ధకము:

ఆధ్యాత్మ రామాయణమందలి తత్వ జ్ఞానము యొక్క మూలములు కాల రహితమగు పరమాత్మ యందు పాదుకొని యుండుట వలన (rooted in the eternity) తద్విషయకమైన కాల నిర్ణయ చర్చ నిరర్ధకము.

‘శ్రీ శంకరేణ భేహితం భవాన్వై’

‘ఆధ్యాత్మ రామచరిరం రామేణోత్తం పురామమ’

కలియుగ దోషముల నుండి విముక్తి పొందుటకు అనుత్త పథమని బ్రహ్మాండ పురాణం చెపుతోంది.

‘తస్సాధ్యయన మాత్రేణ జనా యాస్యంతి సద్గతిమ్’

కేవలము భగవద్భక్తి యొక్కటే మోక్ష శాస్త్రాధ్యయనమునకు కావలసిన అర్హత. ‘భక్తి మాత్రేణ కేవతన శాస్త్ర సంప్రదానే పాత్రం – భవభీతి గమ్యతే’ అని ఆది శంకరుల గీతా భాష్య సూక్తిని (VIII – 68) అనుసంధించవలెను.

ఆధ్యాత్మ శబ్ద వివరణం:

రామాయణ శర్మ భక్తి జ్ఞానములకు నిధి భగవంతుడు. గీత యందు (VIII-3) ఆధ్యాత్మ శబ్దాన్ని ఇలా వివరించాడు.

‘అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే’

శ్రీధర స్వామి ఇలా చెప్పెను:

‘ఆత్మాను కార్య కరణ సంఘాత మధి కృత్య వర్తమానం ఆధ్యాత్మం ఆత్మ తత్త్వమే.’

ఎర్రన:

కార్య వర్గంబను కారణ సంఘబు అధికరించి చరించు నాత్మ తత్త్వ మధ్యాత్మ మనబడు అని కావున ఆత్మతత్త్వమును ప్రకాశింప చేయు రామాయణం (రామస్య ఆయనం) అని దీని అర్థం.

“ఆత్మానం దేహమధి కృత్య ప్రత్యగాత్మ తయా

ప్రవృత్తం పరమార్థ, బ్రహ్మ వసానం వస్తుస్వభావోద్యాత్మ ఉచ్యతే”

పరబ్రహ్మము ప్రతి వ్యక్తి దేహము నందున ప్రత్యగాత్మ (ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్) రూపమున ఉన్నది. ప్రత్యగాత్మ స్థితియే ఆధ్యాత్మము. దేహమందలి ప్రత్యగాత్మయే కడపట పరమ సత్యమగు బ్రహ్మముతో ఏకత్వమందుతుంది.

ఆధాత్మ రామాయణము ఈ సత్యాన్ని సంపూర్ణముగా స్థాపించుచున్నది.

ద్వైతాద్వైతా విశిష్టాద్వైతములకును, సాంఖ్య సామరస్యములకును, యోగములకును ప్రసాదించుచున్నది. కాని ఇది శుష్క వేదాంతులు చెప్పునట్లు, కేవలము అలర్జీ (రూపకము) కాదు – ఇది చారిత్మక సత్యము కూడా.

శ్రీరాముడు జగద్గురువు. మహేశ్వరుడు ఉమ (పార్వతి) కి ఉపదేశించుట:-

“రామః పరాత్మా ప్రకృతే….

మాయా గుణాననుగతో హి తథా విభాతి” (బాల్యం)

పరమాత్మ ఆకాశమువలె అచలము, నిత్యము దాని ఆభాసములు (రిఫ్లెక్షన్స్) అనిత్యములు. దృశ్య మాన భూత కోటులన్నియు పరబ్రహ్మము యొక్క ఆభాసములని శ్రీరామ హృదయము చెప్పుచున్నది. ‘మాయ’ను ఆధ్యాత్మ రామాయణం ఈ విధంగా నిర్వచించింది.

‘అనాత్మని శరీరాదావాత్మబుద్ధిస్తు యా భవేత్’ (అరణ్య)

‘మాయా యా త్రిగుణాత్మికా’ (అయోధ్య-11)

‘అవాచ్యానాద్యవిద్యైవ కారణోపాధిరుచ్యతే’ (అయోధ్య-21)

‘త్వదాశ్రయా త్వద్విషయా మాయా తే శక్తిరుచ్యతే’ (అరణ్య)

‘యదన్యదన్యత్ర విభావ్యతే భ్రమ-

దధ్యాసమిత్యాహురముం విపశ్చితః’ (ఉత్తర – 5)

ఇంద్రుడు మాయ వలన బహురూపములు ధరించెను. శ్వేతాశ్వతర ఉపనిషత్తు నందు మాయ – ప్రకృతి అనియు, మాయి, మహేశ్వరుడనియు వర్ణింపబడింది.

‘మాయాంతు ప్రకృతిమ్‌ విద్యాత్‌ మాయినంతు మహేశ్వరమ్‌’.

~

ఆనాటి దేశకాల పరిస్థితులు:

తెలుగు దేశము సంగీతమునకు జన్మభూమి. విజయనగర సామ్రాజ్య కాలమున సంగీతం ఉన్నతస్థితి పొందింది. ఆ రాజ్యమంతరించగా, మహమ్మదీయ ప్రభువులు ప్రజలను బాధించగా, ఆ బాధను తట్టుకోలేక తంజావూరు చేరారని, అరవ వారిచే నడపబడు మ్యూజిక్ అకాడమీ జర్నల్ 1వ వాల్యూములో 2వ పేజిలో వ్రాయబడింది. తెలుగు రాజ్యమగు దౌలతాబాద్ (దేవగిరి)ని పాలించు తెలుగు రాజు సింహళ భూపాలుని ప్రేరణ సాయముల వలన కాశ్మీర పండితుడు యాదవ కులజుడగు శార్ఙ్గదేవుడు ‘సంగీత రత్నాకరం’ (1240) గ్రంథం వ్రాసెనని కల్కినాథుడు వ్యాఖ్యానించెను.

రామామాత్యులు – స్వరమేళ కళానిధి గ్రంథం వానెను

అహోబలుడు – సంగీత పారిజాతము వ్రాసెను.

సోమనాధుడు – రాగలిబోద (1609) వ్రాసెను.

తళ్ళికోట యుద్ధము అంతరించెను (1564).

చెవ్వప్ప నాయకుడు (1530-72) సంగీత మహల్ కట్టించెను.

రఘునాధ నాయకుడు (1614–1635) సంగీత సుధ గ్రంథం వ్రాసెను.

4వ నాయక ప్రభువు విజయరాఘవుడు మంత్రి వెంకటమఖిచే ‘చతుర్దండి ప్రకాశిక’ వ్రాయించెను.

నాయక రాజుల కాలంలోనే సంగీతం పుట్టినదని యన్. రాజగోపాలన్ స్వతంత్రయను ఆంగ్ల వారపత్రికలో (23.4 53) వ్రాసిరి. తెలుగు జాతి సంగీతమునకు గొప్ప సేవ చేసి పోషించెను. తరువాత తమిళియన్స్ సంగీతమును కాపాడి, పెంచి పోషించిరి.

మోక్షమునకు సంగీతం భయ ప్రమాదములు లేని బాట. వ్యయ ప్రయాసలు లేని మార్గము. మడి యాచారములు కోరని వీధి. ఆనంధమయము, సుందరము, సులభమగు దగ్గర దారి. ఈనాడు మనం వినేది అంతా సంగీతం కాదు. పరమేశ్వరునికై, పాప క్షయమునకై పాడునది సంగీతం. హరి లేని యెడ అది సంగీతం కాదు. అట్టిది పాడుట వినుట పాపము. హరిని పాడు గాయకుడు పుణ్య పురుషుడు. హరిని హరించిన సంగీతమును హరి వినడు, భరించడు.

‘కేళనో…. హరితాళనో ప్రేమ విల్లాద గాన’ (పురందర దాసు)

నా భక్తుడు నన్ను పాడు చోట నేనుందునని హరి అనెను.

“మద్భక్త యాత్ర గాయంతి తత్ర తిష్ఠామి.”

“పదము త్యాగరాజనుతునిపై గానిది పాడియేమి పాడకుంటె నేమి” త్యాగయ్య.

భక్తి లేని సంగీతము ప్రమాదకరము, పాప భూయిష్టము, వర్జనీయము.

“గాయస్తగ్గ స్త్రీయరి కామయంతే,

తస్మాద్గాయతచ్యత్తస్యవనప్రతి గృహ్యమ్

యత్ప్రతి గృహ్ణీయాత్ శమలం ప్రతి గృహ్ణీయాత్ “

తా.

అట్టి గాయకుల దగ్గర దానము తీసికొన్న పాపమని (యజుర్వేదం)

గాయకుని అన్నము ముట్టరాదు (శాంతి పర్వం 1.322)

గాయకునికి దాన మివ్వరాదు (శాంతి పర్వం 1.329)

గాయకుని బహిష్కరించ వలె (అనుశాసనిక పర్వం 2-56)

గాయకుని పంక్తిన కూర్చొనరాదు (3 – 175)

శాస్త్రములు సంగీతము మోక్ష ప్రదమని చాటుచున్నవి.

‘సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా’ అని త్యాగయ్య వ్రాసెను. ఈ విరుద్ధ భావములకు సమన్వయం – హరిని పాడు గాయకులు పవిత్రులు, ఉత్తములు, మహాపవిత్రులు. ‘శ్రీప ప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనసా’ అని త్యాగయ్య వ్రాసిరి.

వాల్మీకి రామాయణానికి ఆధ్యాత్మిక రామాయణానికి ఇతివృత్తంలో తేడా:

ఆధ్యాత్మిక రామాయణం వాల్మీకి రామాయణం

రామాయణ కథలో తనకు కలిగిన కొన్ని సంశయాలు నివారించమని పార్వతి, శివున్ని వేడుట. సీతారామాంజనేయ సంవాదంలో సీతారాములు ఆంజనేయునికి బోధించిన రామావతారతత్వం ఈశ్వరుడు పార్వతి దేవికి కీర్తనలలో వివరిస్తాడు.

రాముడు సుఖ దుఃఖాలకు అతీతుడు. పరబ్రహ్మ స్వరూపుడు. సీతాదేవి ఆదిశక్తి, మాయ, ప్రకృతి స్వరూపిణి. ఇందలి రామ చరిత్ర అంతా లీలలు. ఇందులో రావణుడు ఎక్కుకొని పోయిన సీత మాయా సీత. లంకలో అగ్ని ప్రవేశం చేసినది మాయాసీత. ఆ తరువాత శ్రీరాముని చేరుకొనే సీత ఆది సీత.

సంగీత సాహిత్య, ఛందస్ గూర్చిన అంశములు చర్చ:

ఆధ్యాత్మ రామాయణం ముఖ్యంగా భక్తి వేదాంత తత్త్వ ప్రధానమైన రచనే అయినా సుబ్రహ్మణ్య కవి తన కథనాత్మక కీర్తనలో శృంగార రసాత్మకమైన లలిత పదజాలాన్ని అవకాశం చిక్కినప్పుడెల్లా అనుసంధిస్తూనే వచ్చాడు. ఈ విషయంలో ఈయన రచన భక్తి, తత్త్వ ప్రబోధకులైన పోతనాది మహాకవులు రచనలకు జ్ఞప్తికి తెస్తుంది.

వీటిలోని చరణములు నిర్మాణము ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలోని చిట్ట స్వర సాహిత్యము లాగే చౌక మధ్యమ కాలగతులతో సాగి సాహిత్యముతోనే చివర ముక్తాయింపులు వేసుకుని తిరిగి పల్లవిని అందుకుంటుంది. వేదాంత బోధనపు బరువుతో కథా కథనపు బాధ్యతతో పొడుగెన చరణాలు ఒక్కొక్క పాటలో 7, 8 దాటి కూడా ఉంటాయి. చరణము అను ప్ర్రాసలతోను, అంత్య ప్రాసలతోను ఖండాలుగా తెగి, ఖండ ఖండానికి ఒకే మాదిరి ధాతువు తిరిగి తిరిగి వచ్చి పై కాలంలో సాగే చివరి ఒకటి రెండు ఖండాలకు తర్వాత ముక్తాయింపుతో చరణం ముగిసి పల్లవిని అందుకుంటుంది. కొంచెం వ్యత్యాసంతో, సుబ్రహ్మణ్య కవి కీర్తనలో కూడా క్షేత్రయ్య పదాలలో కొన్ని కృతులలో వలెనే ధాతు, మాతువులకు రెండింటికీ సమాన ప్రాధాన్యం ఉంటుంది. వేదాంత బోధా భారం వల్ల సంగీత రచన కంటే సాహిత్యం కొంచెం ఎక్కువ పటిష్టంగా ఉన్నట్లు కన్పిస్తుంది.

104 కీర్తనలకి దాదాపు 58 రాగాలను స్వీకరించాడు. ఇది, త్రిపుట, రూపక, ఝంపె మొదలైన ప్రచారంతో ఉన్న ప్రసిద్ధ తాళాలనే వాడుకొన్నాడు.

అన్నమాచార్యుల గేయాలు – సంకీర్తనాత్మకములు

క్షేత్రయ్య పదాలు – అభినయాత్మకాలు కాగా

సుబ్రహ్మణ్య కవి కీర్తనలు – ఆఖ్యానాత్మకములు.

అంటే ఒక వ్యక్తి, కథ చెప్పుతున్నట్లుగా కీర్తనలను గానము చేయడానికి వినియోగించేవి.

ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు వినని వారు ఉండరు. వాటిని గానం చేసే గాయకుల సంఖ్య మాత్రం నానాటికి అపురూపమైపోతుంది. కీర్తన రచయిత జీవిత చరిత్రాంశములు ఎరిగున్న వారు కూడా చాలా కొద్ది మందే.

పూజ్యపాదులు కీ.శే. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రుల వారు, వారి శిష్యులు తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు తిరుపతిలో లభించిన తాళపత్ర గ్రంథముల పరిశోధనల ద్వారా కవి జీవితాంశములలో కొన్నిటిని బయల్పరిచారు.

దామెర్ల తిమప్ప నాయడు, కుమారుడు వేంకటాద్రి, మనుమడు కుప్పుస్వామి గార్లకు సుబ్రహ్మణ్య కవి విద్యాగురువు గాను, ఆస్థాన వాగ్గేయకారుడు గాను ఉండినట్లు తెలియుచున్నది.

కాళహస్తి లోని శ్రీ కాళ హస్తీశ్వరుడూ, తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడూ – ఇద్దరు సుబ్రహ్మణ్య కవికి ఇష్ట దైవములే. ఆయన కేవలం మోక్షావేక్ష కోసం, ఆధ్యాత్మిక తత్వ బోధ కోసం, చేసిన స్వతంత్ర రచన. శబ్దాలు, పదాలు కూడా వ్రాసారు. సంగీతపు బాణీలు దొరకలేదు కాని శబ్దాలు కూచిపూడి భాగవత మేళ బృందం వారు పారంపర్యంగా తమ భాగవత ప్రదర్శనలలో మధ్య మధ్య ప్రత్యేకాంశములుగా అభినయించడం కద్దు.

వాటిలో ఒక శబ్దంలోని సాహిత్యాన్ని ఇక్కడ ఉదహరించడం అప్రస్తుతం కాదు. ఎందుకంటే సుబ్రహ్మణ్య కవి పోషకుడైన వేంకటాద్రిని నాయకుడుగా పేర్కొని రచించిన శబ్దం అది.

రారా, దామోర తిమ్మింద్ర కుమారా, శతకోటి మన్మథాకారా, భాసుర భుజబల రణశూరా, నారీ జన మానస చోరా, మహామేరు సమాన ధీరా, కవిజన పోషక మందారా, పర రాజ శత్రు సంహారా, భరత శాస్త్ర నిదినీవేరా, వెద వేంకటేంద్ర హమ్మి రా సరసత గల దొర నీవేరా, నను కరుణ చూచుటకు ఇది వేళరా, చల మెలరా, మది బూనరా నీ దాసరా, నన్నేలరా, దాన రాధేయ రాజ బహుదూరు సెబాసు సలాము సలాము.

ఆయన రచనలో పదములు, శబ్దములు ఒక ఎత్తు, ఆధ్యాత్మిక రామాయణ సంస్కృతాంధ్ర సంగీత, నాట్యాలంకార, వేదాంత శాస్త్రంలో కీర్తనలు ఒక ఎత్తు.

అపారమైన వైదుష్యం కలవాడు మాత్రమే గాక గేయరచనా దక్షుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here