ప్రాచీన తెలుగు కవయిత్రుల రచనలు – చారిత్రక, సామాజిక, సాంస్కృతిక ధృక్పథం

3
13

[dropcap]ప్రా[/dropcap]చీన తెలుగు సాహిత్యం పరిశీలిస్తే చరిత్రకెక్కని కవులూ కవయిత్రులూ చాలా మంది ఉన్నారు. కానీ స్త్రీ సౌందర్యాన్ని తమ కవిత్వంలో కళాత్మకంగా చిత్రించని కవులు లేరంటే అతిశయోక్తి కాదు. కవులకు స్ఫూర్తినిచ్చి కవితావస్తువులుగా బంధింపబడిన స్త్రీలు కవిత్వం రాశారా? రాయలేకపోయారా? సమాజం రాయనివ్వలేదా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెదికే ప్రయత్నం చేసిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం నాటి సామాజిక కట్టుబాట్లు ఆమె ఆర్తికి ఆనకట్టలు వేశాయి. ఆచారాలూ, సాంప్రదాయాలూ ఆమె తపనను కట్టడి చేశాయి. పురుషాధిక్యతకు లొంగిఉండటమే స్త్రీత్వమనే భావన ఆమె ఆలోచనాపరిధిని కుదించింది. ఆవేశకావేషాలను అదుముకుని కుటుంబబాధ్యతలు స్వీకరించిన ఆమె పురుషుడ్ని కవిగా ఎదిగించింది. అతనికి జన్మనిచ్చి వ్యక్తిత్వ విద్యాబుద్ధులు నేర్పి అతని విజయాలు చూసి ఆనందించింది. కానీ కాలక్రమేణా స్త్రీ తన ఉనికిని వ్యక్తీకరించేందుకు భాషను ఆసరా చేసుకుని సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించింది.

ప్రాచీనాంధ్రయుగంలో ప్రసిద్ధులయిన చాలామంది కవిపండితులు, స్త్రీలు కవిత్వం రాయలేరని కూడా చెప్పారు. “తథ్య మిథ్యా విముక్తి ముగ్ధలకు గలదే” అనే శ్రీనాథుని ప్రశ్నను చాలామంది అంగీకరించారు. అటువంటి ప్రతికూల వాతావరణంలోకూడా కవిత్వం చెప్పిన కవయిత్రుల రచనలను, నాటి చారిత్రిక, సామాజిక, సాంస్కృతిక దృక్పథం గురించి లభ్యమైన సమాచారం మేరకు పరిశీలించటం ప్రస్తుతాంశం.

చానమ, ప్రోలమ:

13వ శతాబ్దిలోనే కవిత్వం చెప్పిన ఖడ్గతిక్కన భార్య, తల్లి ఆశువుగా కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవయిత్రులని డా. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ‘ఆంధ్ర కవయిత్రులు’ గ్రంథంలో పేర్కొన్నారు. యుద్ధరంగంలో వెన్నుచూపి ఇంటికివచ్చిన భర్తకు స్నానానికి నీళ్ళతోబాటు పసుపుముద్దను ఉంచిన భార్య పద్యరూపంలో ఇలా బదులిచ్చింది.

పగరకు వెన్నిచ్చినచో /నగరే నిను మగతనంపు నాయకులందున్
ముగురాడువారమయితిమి/వగపేటికి జలకమాడవచ్చిన చోటన్

తల్లి కూడా అతనికి భోజనంలో విరిగినపాలు వడ్డించింది. ఆదేమంటే ఇలా చెప్పింది.

అసదృశ్యముగా నరివీరులం/బసమీరగ గెలువలేక పందక్రియన్న
వసివైచి విరిగివచ్చిన/బసులున్విరిగినవి, తిక్క పాలున్విరిగెన్

ఖడ్గతిక్కన వీరత్వం కొరకు చాటువులుగా చెప్పిన ఈ కందపద్యాలు తప్ప వీరి ఇతర రచనలేవీ లభించటం లేదు. సోమశిల దగ్గరఉన్న సోమేశ్వర ఆలయమండపం ఎదుట ఉన్న వీరుని విగ్రహం ఖడ్గతిక్కనదేనని అంటారు. లింగాలకొండ, సోమశిల యుద్ధవీరుల గాథలు నెల్లూరు ప్రాంతంలో నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. కాటమరాజుతో జరిగిన యుద్ధంలో ఖడ్గతిక్కన వీరమరణం విని తల్లిదండ్రులు మరణించారు. ఆనాటి సామాజిక ఆచారం ప్రకారం భర్తతో చానమ్మ సహగమనం చేసింది. నాడు కవితాశక్తిగల ఇలాంటి స్త్రీలు రాజ్యంకోసం, భర్త, పుత్రుల కీర్తికోసం త్యాగాలు చేశారు. నాడు కన్యాశుల్కం కూడా ఉన్నది. యుద్ధరంగంలో తొలిదశలో ధర్మం, నీతి ఉన్నాయి.

కుప్పాంబిక:

తెలుగులో తొలి కవయిత్రిగా భావించబడుతున్న కుప్పాంబిక తొలి తెలుగు రామాయణకర్త గోనబుద్దారెడ్డి కుమార్తె. మాల్యాల గుండనాథుని భార్య. ఈమె తండ్రి ఆస్థాన పండితుడు. ఈమె రచించిన కావ్యాలు దొరకలేదు గానీ అయ్యలరాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక రచించిన ఒక పద్యాన్ని ఉదహరించటం జరిగినది. తల్లి దండ్రుల గౌరవమర్యాదలు కాపాడే బాధ్యత కుమార్తెదేనని చెప్పే ఈ పద్యం చూద్దాం.

వనజాతాంబకుడేయు సాయకములన్ వర్ణింపగారాదు నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన ధైర్యంబు రానీయ, ద
త్యానురక్తిన్, మిము బోంట్లకున్ దెలుపనాహా! సిగ్గుయైకాదు, పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే!

ఈ పద్యం ప్రకారం నాటి సమాజంలో స్త్రీలు కుటుంబమర్యాద, పరువు, తండ్రి – భర్త గౌరవం కాపాడేవారుగా జీవించారు. 1276వ సం.లో భర్త మరణించినపుడు కుప్పాంబిక వేయించిన బుదపూరు శాసనం ద్వారా తన కవితాశక్తిని చూపి చరిత్రలో మిగిలింది.

గంగాదేవి:

స్వర్ణయుగమని ప్రశంసింపబడిన విద్యానగర కాలంలో 1370వ సం.లో రాజ్యం పాలించిన మూడవ రాజు కంపరాయల దేవేరి గంగాదేవి ‘మధురా విజయం’ అనే సంస్కృత కావ్యాన్ని తన ప్రభువు వస్తువుగా కాళిదాస మహాకవికి దీటుగా కావ్యరచన చేసింది. ఈ కావ్యానికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు తెలుగు అనువాదం చేశారు. పోతుకుచ్చి సుబ్రమణ్య శాస్త్రిగారు ఈ కావ్యానికి వ్యాఖ్య రాసి గంగాదేవి అనే నవల కూడా రాశారు. గంగాదేవి రాసిన తెలుగు రచనల సమాచారం లభ్యంగా లేదు.

తాళ్ళపాక తిమ్మక్క:

తొలి తెలుగు కావ్యరచన చేసిన కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క 15వ శతాబ్దికి చెందిన హరిసంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య భార్య. ఈమెకు తిరుమలాంబ, తిమ్మాంబ అనే పేర్లు కూడా ఉన్నాయి. తిమ్మక్క మహాభారతంలోని సుభద్రాకళ్యాణాన్ని కథావస్తువుగా ‘సుభద్రా కళ్యాణం’ అనే 1163 పాదాలున్న ద్విపదకావ్యం రాసింది. ఈమె ఏ గురువు వద్ద విద్య నేర్వలేదు. తిమ్మక్కలోని విద్యార్తి, భక్తిసాధన భావాభివ్యక్తిగా మారింది. నాటి సమాజంలో స్తీలు భర్తలకు నీడలు మాత్రమే. భక్తి అనే అంశం ఒక్కటే నాడూ నేడూ స్త్రీలకు కొంచెం స్వేచ్ఛనిచ్చే రంగం.

పొలతి నమ్మగరాదు – పురుషులనెప్పుడు
పలురీతి కృష్ణ సర్పములై యుండు

అనటంలో పురుషుల మనస్తత్వాన్ని తేట తెలుగుపదాలలో చెప్పింది. కథాకథనం, పాత్రచిత్రణ, రసపోషణ, అలంకారవైచిత్రి, మనోహరశైలి ఈమె సొంతం. సుభద్ర చేత ఆడించిన ఆటలలో ఆనాటి ఆటలు తెలుస్తాయి. ఈ కావ్యంలో పెళ్ళిపాట చాలా ప్రజాదరణ పొందింది. తర్వాతి తరం వాడైన చేమకూర వెంకటకవి తిమ్మక్క కవిత్వంలోని పాదాలను యథాతథంగా స్వీకరించిన వైనాన్ని అనేకులు సోదాహరణంగా నిరూపించారు. సుభద్రా కళ్యాణం స్త్రీలకోసం స్త్రీ రచించిన కావ్యం.

ఆతుకూరి మొల్ల:

సరళ గంభీర రామాయణ కవయిత్రి మొల్ల ఆతుకూరి కేసయశెట్టి కుమార్తె. శ్రీకంఠ మల్లేశుని శిష్యురాలు. స్త్రీలకు విద్య అందునా కవిత్వం నిషిద్ధమయిన కాలంలో మొల్ల రామాయణం రాయటం విపరీతమయిన వ్యతిరేకతను కలిగించింది. ఎందుకంటే ఆమె కిందికులంలో జన్మించినది కూడా కాబట్టి. అందుకే మొల్ల ఇలా చెప్పింది.

చెప్పుమని రామచంద్రుడు/చెప్పించిన పలుకుమీద చెప్పేదా నేనె
ల్లప్పుడు నిహపరసాధన/మిప్పుణ్య చరిత్ర, తప్పులెంచకుడు కవుల్

మొల్ల ఏ రాజాస్థానంలోనూ లేదు. అన్నమయ్యకు కొంత వెనుకకాలానికి చెందిన కవయిత్రి.

భూజన కల్పకంబగుచు, భుక్తికి ముక్తికి మూలమంచు నా
రాజును దైవమైన రఘురాము నుతించిన దప్పు గల్గునే!

అంటూ నాటిసమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొంది మొల్ల. ఈమె కవిత్వం చక్కని తెలుగులో హాయిగా చదువుకోవటానికి వీలుగా ఉంటుంది.

తేనె సోక నోరు తీయన యగురీతి/తోడ నర్థమెల్ల దోచకుండా
గూఢశబ్దములను గూర్చిన కావ్యము/మూగ చెవిటివారి ముచ్చటగును

అందుకే తెలుగుభాష అందాన్ని చాటిచెప్పే కవిత్వం రాసిన మొల్ల అహల్య,శబరి, మంధర, త్రిజట, కైక, లాంటి స్త్రీ పాత్రల గురించి ఎక్కడా అవమానకరంగా చెప్పకపోవటం ఆమె సంస్కారాన్ని తెలియజేస్తుంది. రాముడు తాటకి మీద బాణం వేస్తున్నప్పుడు ఎలా ఆలోచన చేశాడో.. మొల్ల ఇలా రాసింది..

ఈ యాడుదాని జంపగ/నా యమ్మునకేమిగొప్ప?నగరే వీరుల్
ఛీయని రోయుచు నమ్ముని/నాయకు భయమెరిగి తన మనమ్మున నలుకన్

రాజుల ఆస్థానంలోఉన్న కవులకే కీర్తి ప్రతిష్ఠలు దక్కేకాలంలో స్వంత వ్యక్తిత్వంతో సమాజానికి ఎదురీది రామాయణం మనకు అందించిన ధీరకవయిత్రి మొల్ల.

మోహనాంగి:

ఈమె అసలుపేరు తిరుమలాంబ. మోహనాంగి అనేది తండ్రి అయిన శ్రీకృష్ణదేవరాయలు పెట్టుకున్న ముద్దుపేరు. ఈమె ‘మరీచీ పరిణయం’ అనే కావ్యాన్ని రాసి రాయలకాలం నాటి చారిత్రక సత్యాలనెన్నింటినో వివరించి చరిత్ర పరిశోధకులకు సహాయకారి అయింది. ఇది ఉపలబ్దం. కావ్యపీఠిక చదివితే మనకి శ్రీకృష్ణ దేవరాయలను గురించిన అభిప్రాయాలు మార్చుకోవలసి ఉంటుందని పండితుల అభిప్రాయం. ‘మరీచీ పరిణయం’లో

స్త్రీల నన్నంతనే చుల్కన చేయుట/కుమారీ మౌఢ్యమే సుమ్ము
నారీలోకంబున శేముషీయుతలు లేరే/పూర్వమింతేటికిన్

అంటూ స్త్రీల రచనలపట్ల తన అభిమానాన్ని చాటిన కవయిత్రి మోహనాంగి. ఆ గ్రంథాలకు తాను కృతిపతీత్వం అంగీకరిస్తానని చమత్కారంగా చెప్పిన ఈమె చిత్రకారిణి కూడా!

నాయని కిష్టమౌ కథయె నాదు ప్రబంథముగా నొనర్తు, రా
మాయణమన్న నాయనకు మక్కువ మిక్కిలి యెక్కువౌట
నాయది కొంచు, కల్పితమునందు నొకించుక చేర్చి కూర్చెదం
దోయజ సన్మరందరస తుందిల సుందర కందళోక్తులన్

అని చాటుకున్న కవయిత్రి మోహనాంగి ఆళియ రామరాయల అర్ధాంగి. ఈమె తన తండ్రి అయిన శ్రీకృష్ణదేవరాయల పట్ల గల ప్రేమను వ్యక్తం చేసే ఒక పద్యం చూద్దాం:

చతురంగ బలయుత సైన్యముల్ నడపెడు నతడు నాతో జతురంగమాడు
గంగార్భటిని నాకు కవిత చెప్పునతడు నా సమస్యాపూర్తి కాసచెందు
దిక్కుడ్యములను సత్కీర్తి జిత్రించు నాతండు నా రాయు చిత్రముల మెచ్చు
రాగ సంభరితాంగుడౌ నతడు నే రాగ మాలాపింప రక్తి గాంచు
నన్ను మన్నాథునింట మన్ననలతోడ గన్నులంగప్పుకొని ప్రోచె గాదె యట్టి
పిత, మహాకావ్యకర్త, నన్ గృతినిగోరె నాదు భాగ్యంబు వర్ణింపగా దరంబె!

తుక్కాదేవి:

శ్రీకృష్ణదేవరాయల దేవేరులలో ఈమె కూడా ఒకరని చరిత్రకారుల అభిప్రాయం. రాయలు ఓఢ్రదేశమును జయించి గజపతులసుత అయిన తుక్కాంబను వివాహమాడాడు.

రాయలకు తమవారు ప్రాణహాని తలపెట్టినప్పుడు రాయలను హెచ్చరిస్తూ అన్నపూర్ణ అని నామాంతరం ఉన్న తుక్కాదేవి పంపిన పద్యం.

పడకటింటను నో ప్రభూ! పాన్పు వెలితి,/ పేరటాండ్రు నారులుగారు, వీరకులము
తొందరించిన పనులెల్ల తోన చెడును/సావధానత నే హాని జరుగబోదు

ఈమె రాసినట్లు చెప్పబడుతున్న తుక్కాపంచకం కర్తృత్వం గురించి ఇంకా స్పష్టత రాలేదు.

తిరుమలాంబ:

అచ్యుతదేవరాయల పట్టపురాణి వరదాంబిక. తమ దంపతుల పరిణయగాథను వరదాంబికాపరిణయంగా రాసింది. ఇది పరిశోధకులకు చారిత్రక గ్రంథంగా ఉపయోగించింది. ఈమె రాసుకున్న గద్యప్రకారం ఎంతో ప్రజ్ఞాశాలినిగా కనిపిస్తుంది. 1530సం. ప్రాంతంలో ఉన్న తిరుమలాంబ గ్రంథం చివర తిరుమల వేంకటేశ్వరుని స్తుతించింది.

నాచీ, లీలావతి, శారద, త్రివేణి:

ఏలేశ్వరోపాధ్యాయుని కుమార్తె నాచీ సకల విద్యలు గల విదుషి. ఈమె కాశీ పండితులను గెలిచింది. ‘నాచీ విజయం’ పేరుతో సంస్కృతనాటకం రాసింది. లీలావతి గణితశాస్త్రం కావ్యంగా రాసింది. త్రివేణి దేవరాయల ఆస్థాని అని తెలుస్తున్నది . వీరి రచనల గురించి ఇంకా పరిశోధన జరగాలి.

రామభద్రాంబ:

శ్రీకృష్ణదేవరాయల అనంతరం విద్యానగర సామ్రాజ్యవైభవం తంజాపురీ పాలకులైన నాయకరాజుల్ని ఆశ్రయించింది. రాయలకాలం తర్వాత దాదాపు 100 సం. దాకా తెలుగు కవయిత్రుల గురించి ఎటువంటి సమాచారం దొరకటం లేదు. దక్షిణదేశంలో రాజ్యాన్ని స్థాపించిన నాయకరాజులలో మూడవరాజు రఘునాధనాయకుడు సకల కళా విద్యా పోషకుడు. స్వయంగా కవి. తన ఆస్థానంలో అనేకమంది కవయిత్రులను ఆదరించి గౌరవించాడు. అటువంటి కవయిత్రులలో రామభద్రాంబ తెలుగు కావ్యాలు రాసినట్లు ఆమె గురువయిన చెంగల్వ కాళకవి రచించిన ‘రాజగోపాల విలాసం’ ద్వారా తెలుస్తున్నది. కానీ అవి లభ్యం కావటంలేదు. ఈమె తెలుగులో, ప్రాకృతంలో ఆశుకవిత, సమస్యాపూరణ, చిత్రకవితాప్రక్రియలు తెలిసిన అష్టభాషావిదుషి. ‘రఘునాథాభ్యుదయం’ అనే సంస్కృతకావ్యం రాసిన రామభద్రాంబ చేసిన సమస్యాపూరణ ఇది:

ఏరీ నీ సరిరాజులు/భూరమణులు నిన్ను చాలా పొగడుచు
భళీ రారాజని/రేరాజని అచ్యుతేందు రఘునాథనృపా!

మధురవాణి:

సంస్కృతాంధ్ర రచనలో గణుతికెక్కిన మధురవాణి రామాయణసారం, (సుందరకాండ వరకు), కుమారసంభవం, నైషధం రచనలు చేసినా అవి అందుబాటులో లేవు. రామాయణసారం తాళపత్రం బెంగళూర్ లోని మల్లేశ్వరం వేద వేదాంగ మందిర గ్రంథాలయంలో ఉన్నది కానీ సమగ్రంగా లేదు. మధురవాణి మాఘకవిలా మూలప్రయోగాలు చేయగల పండితురాలు. ఈమె అసలుపేరు శుకవాణి. రఘునాథ నాయకుడు ఈమెను మధురవాణిగా సంభావించాడు. శబ్దాలద్వారా అవ్యక్త మధుర నాదవిశేషాన్ని సాధించిన ఈ కవయిత్రి పేశల మృదూక్తుల కావ్యరచనలో శారద, రాజహంస, కేతకులను వర్ణించిన శబ్దశ్లేషలతో మధురకావ్య దురంధర, ‘ఘటికార్ధ నిర్మిత శతశ్లోకి’, వీణావాదనానైపుణ్యం కలదిగా రాణించింది.

రంగాజమ్మ:

రఘునాథనాయకుని కుమారుడైన విజయరాఘవ నాయకుడు తండ్రిలా కళాప్రియుడు. రంగాజమ్మ ఈ రాజు ఆస్థాన కవయిత్రి. సాహిత్యలోకంలో విశిష్టస్థానం సంపాదించుకున్న రంగాజమ్మ బహుళోక్తిమయ కావ్యప్రపంచ స్రష్ట. విజయరాఘవుని ఉపకాంతనని ఉషపరిణయ ప్రబంధంలో రాసుకుంది. రాజగురువైన తాతాచార్యులు

చతురాస్యుండగు నీ పతి ఇటు గారవించి
బహుమతి దోపన్ కృతి రచియింపు మనెన్ భారతికిన్
బ్రతివత్తువమ్మ రంగాజమ్మా!

..అని ప్రశంసించాడు.

ఈ కవయిత్రి రామాయణ కథాసంగ్రహం, భారత కథాసంగ్రహం, భాగవత కథాసంగ్రహం, మన్నారుదాసవిలాస ప్రబంధం, యక్షగానం, ఉషాపరిణయ ప్రబంధం, మొ. కావ్యాలు రచించింది. ఇందులో మన్నారుదాసవిలాసం ముద్రితం. ఉషాపరిణయం కొంతభాగం దొరుకుతున్నది. రంగాజమ్మను రంగాజీ అని కూడా అంటారు. లలితకళలలో నిష్ణాతురాలు. కథాసంవిథానంలో, కవితాపటిమలో పూర్వకవులను తలపిస్తుంది.

అంత కోపము రెట్టింప అంతకోప/మాకృతిని వైష్ణవజ్వరం బావహిల్ల
మస్తకంబులు నిజఘోర హస్తములను/చదిపి మోదుచు మరియు వక్షంబు నడచె

ఈమె గ్రంథాంతగద్యలో తన వివరాలన్నీ నిక్షిప్తం చేసింది. పసుపులేటి వెంకటాద్రి, మంగమాంబలు తల్లిదండ్రులు. తనను తాను సార సారస్వత ధూరీణగా, విజయరాఘవ మహీపాల విరచిత కనకాభిషేక గ్రహీతగా, శృంగార రసతరంగిత పదకవిత్వ మహనీయమతిగా, అష్టభాషా కవితా సర్వంకషా మనీషా విశేష విశారదగా పేర్కొన్నది. రంగాజమ్మ విజయరాఘవుని ఉపపత్ని. నాయకరాజులు స్త్రీ విద్యను, కవయిత్రులను ఆదరించారు. యక్షగాన ప్రక్రియను రంగాజమ్మ ప్రాచుర్యంలోకి తెచ్చింది. నాయకరాజులు కులాన్నిబట్టికాక వైదుష్యాన్నిబట్టి కవులను గౌరవించారు. తన కావ్యాలలో రంగాజీ పాత్రోచితమయిన భాష, నాటి వేశ్యల జీవితాలు, హాస్యం, బ్రాహ్మణుల సంభావనలూ, సామాజిక జీవితచిత్రణ, ప్రజల వేషధారణ, నాటి చోళదేశ వర్ణన, తంజావూర్ రాజగోపాలస్వామి రథోత్సవం గురించి వివరంగా రాసింది. ఈమె సంస్కృతం, తెలుగు రెండు భాషలలో ప్రవీణురాలు. తులలేని వెలలేని ప్రణయభావన, తరగని కావ్యప్రభావం రంగజమ్మది.

కృష్ణాజీ, చంద్రరేఖ, సౌందరి:

విజయరాఘవుని ఆస్థానంలోని ఈ కవయిత్రుల గురించి చెంగల్వ కాళకవి రాయగా తెలుస్తున్నది. వీళ్ళు ఆశుకవిత సమస్యాపూరణలో దిట్టలు. సౌందరి రంగాజమ్మ రచనలనే కొంతమార్చి తన పేర ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తున్నది.

ముద్దుపళని:

ఈమె తంజావూరు మరాఠారాజు ప్రతాపసింహుని భోగపత్ని. రాజు ఆమెకు అనేక చామీకర ఆభరణాలు, గౌరవాలు ఇచ్చాడు. ఈమె తండ్రి ముత్యాలు, తల్లి ఒక వేశ్య అంటారు. ముద్దుపళని రాధికాసాంత్వనం లేదా ఇళాదేవీయం అనే 4 ఆశ్వాసాల శృంగారకావ్యం రాసింది. ఇది బాలకృష్ణునికి అంకితం. స్త్రీల అంగాంగవర్ణనలతో మితిమీరిన కవితాధోరణి ఆ కాలంలోఉన్నది. దానినే ముద్దుపళని అనుసరించింది. కవితామాధుర్యం, లోకోక్తులు, అచ్చతెలుగుపదాలు, బహుభార్యాత్వంలోని స్పర్థలు విపులంగా వర్ణించింది.

చక్కనిదానవంచు రతిసారమెరింగిన దానవంచు నా
అక్కర దీర్తువంచు నను హాయిగ కౌగిటజేర్తువంచు నే
నిక్కమ్ము నమ్మివచ్చునెడ నీ వీపుడీ మటుమాయలాండ్రు నే
నక్కట ఒప్పగించినటుల నారడిసేతువె రాధికామణీ!

అనే కృష్ణుని పద్యం ఆమె కవితామాధుర్యానికి ఉదాహరణ.

తరిగొండ వెంగమాంబ:

కడప ప్రాంతంలో తరిగొండలో జన్మించిన వెంగమాంబకు కవయిత్రులలో విశిష్ట స్థానముంది. ఈమె బాలవితంతువు. తండ్రి కృష్ణయామాత్యుడు, తల్లి మంగమాంబ. వేంకటాచల మాహాత్మ్యం (పద్యకావ్యం), వాశిష్ట రామాయణం(ద్విపద), నరసింహశతకం, శివనాటకం, ముక్తికాంతావిలాసం, కృష్ణమంజరి (ద్విపద) ఈ కవయిత్రి రచనలు. ఆధ్యాత్మిక వేదాంత రచనలు చేసి రాజయోగాన్ని ప్రచారం చేసింది. వెంగమాంబ రాసిన రాజయోగసారం అనే ద్విపదకావ్యం ఒక మోక్షమార్గం. ఈమె చివరికృతి ద్విపద భాగవతం. తాను అసభ్యవర్ణనలు చేయనని చెప్తూ..

శృంగారాకృతి తోడ వచ్చి పదముల్
శృంగార సారంబుతోడన్ గూఢంబుగచెప్పు నీవనగ,
అట్లే చెప్పలేనన్న నన్ను ముంగోపమ్మున జూచి
ఏనలేచి యటనే మొక్కంగ మన్నించి తత్
శృంగారోక్తులు బల్కికొను నా శ్రీకృష్ణు సేవించెదన్

అన్నది. 1840 సం.ప్రాంతంలో జీవించిన వెంగమాంబ చివరి రోజులు తిరుమలలో గడిపింది. తన రచనలన్నీ ఆత్మసంతృప్తి కోసం రాశానన్న వెంగమాంబ

“వినరయ్య కవులార! విద్వాంసులార!/వినరయ్య మీరెల్ల విమలాత్ములార!
ఘన యతి ప్రాస సంగతులు నేనెరుగ/వరుస ఆక్షేపింపవలదు సత్కృపను”

అన్నది. శ్రీ వీరేశలింగంగారు కూడా వెంగమాంబ కవిత్వం అతి మనోహరం అని మెచ్చుకున్నారు.

ముగింపు:

చరిత్రకెక్కని తెలుగు కవయిత్రులు ఎందరో ఉన్నారు. ఇంకా పరిశోధన జరగాలి. చారిత్రికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా రెండవ స్థానంలో చూడబడినా నాటి తెలుగు కవయిత్రుల కృషి ఎన్నదగింది. తర్వాతి కవయిత్రుల సృజనాత్మకతను పెంచి, అక్షరాస్యులుగా చేసి ప్రశ్నించేస్థాయికి ఎదిగించింది. ఈనాటి రచయిత్రులు సాహిత్యరంగంలో ప్రతిభావంతంగా తమ స్వరాన్ని వినిపిస్తున్నారంటే ఈ చైతన్యప్రవాహం మొదలైన మూలబలాన్ని స్మరించుకోవటం మన కర్తవ్యం. ఈ కవయిత్రులందరికీ తెలుగుజాతి ఋణపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here