ప్రాణం మాకు తృణపాయం!

2
11

[త్వరలో సంచిక ప్రచురించనున్న ‘సైనిక కథలు’ సంకలనం కోసం పాణ్యం దత్తశర్మ గారు పంపిన కథ. కొత్తగా రాసి పంపిన కథలు ముందు సంచికలో ప్రచురితమవుతాయి. ప్రతిపాదిత సంకలనంలో, ఇప్పటికే ప్రచురితమైన కథలతో బాటు, సంపాదకుల ఎంచుకున్న ప్రమాణాల ప్రకారం కొత్తగా రాసి పంపిన కథల్లోంచి కొన్ని స్వీకరించబడతాయి.]

[dropcap]టెం[/dropcap]త్ ఫలితాలు ప్రకటించారు. పిల్లలకంటే తల్లిదండ్రులకీ ఎక్కువ టెన్షన్! ఎందుకంటే టూర్లు, ఇతర సరదాలు మానుకుని పిల్లలను చదివించుకున్నారు కదా! “మీవాడేం చదువుతున్నాడు?”, “ఈ సంవత్సరమే టెంత్ కొచ్చాడు!”. “అమ్మో! అయితే జాగ్రత్తగా ఉండాలి”. ఇలాంటి సంభాషణలు మామూలే.

‘అభి’ కి 8.7 గ్రేడ్ వచ్చింది. ఇప్పటి ప్రమాణాలతో పోలిస్తే అది తక్కువే. 9.3 వచ్చినా, 9.8 రాలేదే అని బెంగపెట్టుకునే పేరెంట్స్ ఉన్నారు. కాని, అభి వాళ్ల నాన్న, అమ్మ, అలాంటి వాళ్ళు కాదు. కొడుకును అభినందించారు.

అభి పూర్తి పేరు అభిమన్యు కుమార్. వనస్థలిపురం లోని ‘రవీంద్రభారతి’ పబ్లిక్ స్కూల్లో చదివాడు. అదేమీ ట్లాప్ రేటెడ్ స్కూలు కాదు. కానీ మధ్యతరగతి మందహసాలకు వాళ్ళ ఫీజు అందుబాటులో ఉంటుంది. అభి వాళ్ల నాన్న కొండలరావు. అమ్మ అంజని. వాడికి ఒక చెల్లి. యమున. అదే స్కూల్లో సిక్స్త్ చదువుతూంది.

కొండలరావు హయత్‍నగర్-2 ఆర్.టి.సి. డిపోలో సీనియర్ కంట్రోలర్‌గా పని చేస్తున్నాడు. మొదట కండక్టరుగా చేరి తర్వాత క్లర్క్, తర్వాత ఈ పోస్ట్‌కు వచ్చాడు. వాళ్ళ స్వస్థలం ఎమ్మిగనూరు. అంజని గృహిణి. కాని ఇంట్లోనే జాకెట్లు, శారీ ఫాల్స్, జిగ్ జాగ్, హెమ్మింగ్ లాంటి పనులు చేస్తూ నెలకు ఇరవై వేల వరకూ సంపాదిస్తుంది. నూటపది గజాల్లో, భూలక్ష్మినగర్‌లో పదేండ్ల క్రిందట ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు.

టెంత్ తర్వాత ఏం చదవాలి అన్నది మధ్యతరగతి వారికి ఎదురయ్యే మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రస్తుతం కొండలరావు ఇంట్లో అదే చర్చ. ఆ రోజు అతనికి ఆఫ్. అతని మిత్రుడు యాదగిరిరెడ్డి ‘బస్ భవన్’లో పనిచేస్తాడు. సూపరింటెండెంట్. ఒక ప్రయివేట్ స్కూల్లో తెలుగు పండిట్‌గా పనిచేస్తూ, ఆర్.టి.సి లోకి వచ్చాడాయన. కథలు రాస్తాడు కూడా.

“రా, రా, యాదగిరి! ఈ రోజు ఆఫీసు లేదానే?” అని ఆప్యాయంగా ఆహ్వానించాడు కొండలరావు.

“ఈరోజు సెలవు పెట్టిన. మీ చెల్లెలికి కొంచెం తబియత్ ఖరాబయింది. గీడ కమలానగర్‍ల గామెకు ఇడ్లీ తీస్కపోనీకి వచ్చిన. సరే, నిన్ను గూడ చూసినట్లు ఉంటదని..”

“మంచి పని చేసినావు. అంజనీ, మీ అన్న వచ్చిండు” అని కేకేశాడు కొండలరావు. ఆమె లోపల్నించి వచ్చి, “అన్నా, బాగున్నావానె? వొదిని బాగుందా?” అనడిగింది. “చాయ్ తెస్త” అని లోపలికి వెళ్లింది. దశాబ్దాల తరబడి హైదరాబాద్‌లో ఉండడం వల్ల వాళ్ల భాష మారింది. అది సహజం.

ఇంతలో సైకిలు బయట స్టాండ్ చేసి లోపలికొచ్చాడు అభి. “నమస్తే అంకుల్” అని పలకరించాడు యాదగిరిరెడ్డిని. ఆయన వాటిని తేరిపార జూస్తూ, “జబర్దస్త్ గున్నావుర! ఓరి నీ! మీసాలు గూడ రాబట్టె” అన్నాడు. అభి సిగ్గుపడ్డాడు. ఇద్దరూ చాయ్ తాగుతున్నారు.

“పోరడు టెంత్ పాసయ్యిండు గద! తర్వాత ఏం చదివిపించాలని?”

“అదే సోచాయిస్తున్నం. ఇంటర్ ఎం.పి.సి దీయిచ్చి, తర్వాత ఇంజనీరింగ్‌కు పంపుడా, లేక బైపిసి దీయిచ్చి, మెడిసిన్‌కు పంపుడా అని..”

“నాకు ‘శతాంధాః కూపం ప్రవిశన్తి’ అన్న నానుడి యాదికస్తుంది.”

“అదేదో తెలుగులో చెప్పరాదె?”

“ఒక గుడ్డోడు పోయి బాయిల వడితె, వందమంది వానెనక బోయింది బాయిల బడిరన్నట్లు”

“మొత్తానికి తెలుగు టీచరనిపిచ్చుకుంటివి “

ఇద్దరూ నవ్వుకున్నారు.

“మన మిడిల్ క్లాసోల్లకు ఎంతసేపూ ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో చదువు తోచదు కొండా! అడ్మిషన్లు లేక శానా ఇంజనీరింగ్ కాలేజీలు మూతబడుతున్నాయి. ఐ.ఐ.టిలు మనతో అయ్యే పని గాదు. ఇంజనీర్లు జాబ్‌లు లేక సడక్ లెంట తిరగవట్టిరి. ఇగ మెడిసినంటవా, మనకు సీటు యాడికెల్లి వస్తది? వచ్చినా, సిర్ఫ్ ఎంబిబిఎన్ తోన ఏమయితది? మల్ల పిజి జెయ్యాలె. గది మరీ గగన కుసుమమాయె.”

“నిజమేరా, మరి మా వాడిని ఏం చదివిద్దాం? నీవే చెప్పు.”

“చెప్త గాని, నన్ను తిట్టకూడదు మల్ల.”

“అయ్యో, నిన్నెందుకు తిడతానురా, చెప్పు!”

“ఆర్మీ లోకి పంపిస్తే బాగు. లైఫ్ మంచిగుంటది.”

“అదేదో ‘అగ్నివీర్’ పథకం అంటుండ్రు. అదేనా?”

“అది ‘అగ్నిపథ్’. దాంట్లో చేరినవారు అగ్నివీర్‌లు అవుతారు. వీళ్లు కమిషన్డ్ ఆఫీసర్లకు క్రింది ర్యాంకు. కానీ వీరిది పర్మనెంట్ జాబ్ కాదురా. నాలుగేళ్ళకు తీసుకుంటారు. వీరికి లాంగ్ టెన్యూర్ ఉండది. పెన్షను ఉండది. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వీరు తర్వాత, CISF, BSF, RPF లో చేరడానికి 10% రిజర్వేషన్ ఉంటుంది.”

కొండల రావన్నాడు “చివరికి ఆర్మీలో కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిందన్నమాట. నాకైతే దీనికి పంపుడు ఇష్టం లేదు.”

“పూర్తిగా వినురా! దీని గురించి కాదు నేను చెప్పేది. మనోడు హైటు, వెయిటు, మస్తుగున్నడు. ఎన్.డి.ఎ.కు పంపిస్తాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని యు.పి.ఎస్.సి. వాండ్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్‌ల ఎంట్రన్స్ పెడతారు. తర్వాతే యస్.యస్.బి. ఇంటర్వ్యూ. దాంట్ల సెలెక్టయితే డైరెక్ట్‌గ జూనియర్ కమీషన్డ్ ఆఫీసరవుతాడు”

అంకుల్ చెప్పింది శ్రద్ధగా వింటున్నాడు అభి. అంజని కూడా వచ్చి చేరింది. యాదగిరిరెడ్డి కొనసాగించాడు.

“మనకు ఘట్‌కేసర్‌ల, హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజి అని ఉంది. వాండ్లకు ఇంకో బ్రాంచ్ కీసరలో కూడా ఉంది. వాండ్లు పోరగాండ్లను ఇంటర్ ఎం.పి.సి గ్రూప్‌లో చేర్చుకోని, NDA పరీక్షకు కోచింగ్ ఇస్తారు. NDA ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కోర్సు అన్నమాట. ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రెయినింగ్, రిటన్ టెస్ట్ కోచింగ్ కూడా ఇస్తరు. ఇంటర్ తర్వాత NDA పరీక్ష రాసుడే. శానామంది మిలిటరీ అంటే భయపడి చేరరుగాని మంచి కోర్సు. మా బావమరిది జగిత్యాలల ఉంటడు. వాని కొడుకు సెలెక్టయిండు. లెఫ్టినెంటో ఏదో నాకు తెల్వది, మంచి ర్యాంకులో ఉన్నడు.”

అంజని అన్నది “అన్నా, ఒక్క కొడుకు! వాన్ని ఆర్మిల జేర్పిస్తే మాకు కాకుండ పోతడేమో.”

యాదగిరి రెడ్డి నవ్వాడు “చెల్లే, ఇంజనీరింగ్ చేసి అమెరికాకు బోయి ఆడ ఎమ్మెస్ చేసి ఆడనే సెటిలయితున్రు గదా ఇయ్యాల్రేపు? దానికేమంటవు? ఇగ ప్రాణానికి రిస్క్ అంటవా? అమెరికాలో మనోల్ల మీద కాల్పులు జరుపుతున్రు. చావు రాసి పెట్టి ఉంటే తప్పదు. కెరీ మటుకు శానా బాగుంటది.”

అంజనీ అంగీకరించింది.

“ఏరా? ఎన్.డి.ఎ.కి బోతావా మల్ల?” అని అడిగాడు రెడ్డి అభిమన్యుని.

“చేరతా అంకుల్!” అన్నాడు. వాడి గొంతులో ఆత్మవిశ్వాసం!

***

ఒక రోజు స్నేహితులిద్దరూ అభిని తీసుకొని ఘట్‌కేసర్ లోని హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజికి వెళ్లారు. నాలుగంతస్తుల భవనం. దాని ప్రిన్సిపాల్ సంజీవరాయుడు. ఆయన మాజీ సైనికాధికారి. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాడు. సర్వీసు నుండి రిటైరయిన తర్వాత ఈ ఇన్‌స్టిట్యూట్ పెట్టాడు. ఆయనది కడపజిల్లా రాయచోటి. దాదాపు ఆరు అడుగుల నాలుగంగుళాలున్న జైజాంటిక్ పర్సనాలిటీ. “పిల్లోడు ఫిజిక్ పరంగా ఒ.కె. మా దగ్గర డే స్కాలర్ విధానం లేదు. తప్పని సరిగా హాస్టల్‌లో ఉండాల్సిందే. తెల్లవారు జామున 4.30 కి లేపుతాం. రన్నింగ్ చేయిస్తాం. కొంచెం టఫ్ ట్రెయినింగే.”

“ఫీజు..”

“హాస్టల్, NDA ఓరియంటేషన్‌తో సహా సంవత్సరానికి అరవైఐదు వేలు.”

“కొంచెం తగ్గిస్తే మీకు ఋణపడి ఉంటాం సార్” అన్నాడు కొండల రావు.

ఆయన కాసేపు అలోచించి “సరే ఐదు వేలు తగ్గిస్తాలెండి” అన్నాడు. కొండల రావు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.

“సార్, NDA గురించి కొంచెం బ్రీఫ్‌గా వివరించండి ప్లీజ్” అన్నాడు యాదగిరిరెడ్ది. ప్రిన్సిపాల్ ఇలా చెప్పాడు.

“NDA పరీక్షకు అర్హత 12 వ తరగతి ఉత్తీర్ణత. ఈ ఇంటర్మీడియట్ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. దేశంలో ఎక్కడా లేదు. అన్ని రాష్ట్రాలలో హైయర్ సెకండరీ కోర్సు అంటారు. NDA, INA అని రెండు భాగాలు. రెండోది నేవీ.

పరీక్ష సమయానికి పిల్లల వయసు 16½ — 19½ సంవత్సరాల మధ్య ఉండాలి. మొత్తం 900 మార్కులు. దానిలో GATకి 600, మ్యాథ్స్ కు 300. ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 20-25 శాతం తెచ్చుకోవాలి. రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయితే యస్.యస్.బి. ఇంటర్వూ. దానికి 900 మార్కులు.”

“ప్రతి సంవత్సరం ఎంతమంది కూర్చుంటారు సార్ దీనికి? ఎంతమంది సెలెక్టవుతారు?”

“రెండు మూడు లక్షలమంది రాస్తారండి. కాని రిటన్ టెస్ట్ క్లియర్ చేయగలిగేది కేవలం ఎనిమిది వేల నుండి పదివేల మందే. వారినే ఇంటర్వ్యూకు పిలుస్తారు. అందులో 10 నుండి 15 శాతం సెలెక్టవుతారు. మెడికల్ గ్రవుండ్స్‌లో చాలామంది రిజెక్ట్ అవుతారు మెరిట్ లిస్ట్ లో 580 నుండి 650 మంది ఉంటారు. చివరికి 350 నుండి 380 మంది తేలతారు. కొందరు చేరరు. కొందరు టఫ్ ట్రెయినింగ్ భరించలేక వెళ్లిపోతారు. NDAను క్రాక్ చేయడానికి కనీసం ఆరునెలలు కావాలి.”

“ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే సర్?”

“హైటు 157 సెం.మీ, వెయిట్ 45- 48 కిలోలు, కాలి పొడవు 99.120 సెం.మీ. 157.20, తొడ పొడవు 64 సెం.మీ, కూర్చుంటే హైట్ 81.5 సెం.మీ. నుండి 96 సెం.మీ. ఉండాలి!

ఇంటర్యూలు, ఫిజికల్ ఎకామినేషన్ అన్నీ న్యూఢిల్లీ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో జరుగుతాయి. డైరెక్టర్ జనరల్, రిక్రూటింగ్ వారి ఆధ్యర్యంలో, ఇది ఆర్.కె. పురంలో, వెస్ట్ బ్లాక్- III లో ఉంటుంది. ఇక కంటి చూపు డిస్టన్స్ విజన్ 6/6 ఉండాలి. చెవిలో గులిమి, వరిబీజం, ఎక్కువ/తక్కువ బరువు, రొమ్ము కొలత తక్కువ, పైల్స్, టాన్సిల్స్ వంటి వ్యాధులు ఉండకూడదు. మణికట్టుకు ఎల్బో లోపల టాటూస్ ఉండకూడదు.”

“వీండ్లకు జీతాలు ఎలా ఉంటాయి సార్?”

సంజీవరాయుడు నవ్వాడు. “ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇదే మరి! జీతాలు చాలా బ్రహ్మండంగా ఉంటాయి లెండి. మొదటి మూడేండ్లు ట్రెయినింగ్. ఆ పీరియడ్‌లో నెలకు 56 వేలు స్టయిఫండ్ ఇస్తారు. సర్వీసు రెగ్యులర్ అయినాక ర్యాంక్‌ను బట్టి నెలకు రెండు లక్షల వరకు రావొచ్చు.” చెప్పాడు.

***

అభిమన్యును ఆ కాలేజీలో చేర్చారు. ఆదివారాలు కూడా ఇంటికి పంపరట. పేరెంట్స్ వెళ్లి ఒక గంట ఉండి చూసి రావచ్చు. కాని ఇంటి నుంటి తెచ్చే ఫుడ్, స్నాక్స్‌కు అనుమతి లేదు.

మొదట్లో. తెల్లవారు జామున లేవడం, చన్నీటి స్నానం, నార్త్ ఇండియన్ భోజనం, ఎక్సర్‌సైజులు, డ్రిల్, ఇవన్నీ దుర్భరంగా ఉండేవి అభికి. దసరా, సంక్రాంతికి మాత్రం 3 రోజులు సెలవులిచ్చేవారు. కానీ వాడే నాడూ తాను మానేస్తానని అనలేదు. చిక్కిపోయి, మేని చాయ తగింది. మూడు నాలుగు నెలల లోనే చక్కని శరీర సౌష్టవం వాడి సొంతమైంది. వారి నియమాలన్నింటినీ పాటిస్తూ, అకడమిక్స్‌లో కూడా రాణిస్తున్నాడు అభిమన్యు కుమార్ .

***

మొదటి సంవత్సరం పూర్తయింది. అన్ని జూనియర్ కాలేజీల లాగే హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీ కూడా నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డుకు అనుబంధంగా పనిచేస్తుంది. కానీ ఈ NDA orientation తో బోర్డుకు సంబంధం ఉండదు. UPSC అనుమతి కూడా కాలేజీకి ఉండదు.

రెండవ సంవత్సరంలో ఇంటర్ విద్యకు ప్రాధాన్యత తగ్గించి, NDA ప్రవేశపరీక్షపై ఎక్కువ ఫోకస్ పెట్టసాగింది కాలేజీ యాజమాన్యం. ప్రిన్సిపాల్ సంజీవరాయుడు గారు స్వయంగా GAT క్లాసులు బోధించేవారు. ఫిజికల్ ఫిట్‌నెస్ శిక్షణను పర్యవేక్షించేవారు.

మార్చిలో ఇంటరు పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సంవత్సరం ఏప్రిల్ 24న NDA పరీక్ష అని ప్రకటించారు. సరిగ్గా 40 రోజులుంది. ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వసాగింది కాలేజి. మ్యాథ్స్ సబ్జెక్ట్‌కు ఆ నలభై రోజులూ వరంగల్ నుంచి భద్రమూర్తి అన్న రిటైర్డ్ లెక్చరర్‍ను పిలిపించారు. పిల్లలు ఒకవేళ ఏప్రిల్‌లో సెలెక్ట్ కాకపోతే, సెప్టెంబరు వరకు వారికి ఇంటెన్సివ్ కోచింగ్ కొనసాగుతుంది. దానికి ఎటువంటి ఫీజూ వసూలు చేయరు. NDA కోచింగ్ కేవలం ఆ కాలేజీలో చదివిన పిల్లలకే. బయటివాళ్లకివ్వరు.

NDA ఫలితాలు వెలువడ్డాయి. అభిమన్యు రిటన్ టెస్ట్ సెలెక్ట్ అవలేదు. కానీ ఆ అబ్బాయి నిరుత్సాహపడలేదు. ప్రిన్సిపాల్ గారతన్ని ప్రోత్సహించారు. సెప్టెంబరు వరకు ‘మరింత’ ఇంటెన్సివ్ కోచింగ్ తీసుకున్నాడు. సంజీవరాయుడుగారు అతనికి ఒక సూక్తిని చెప్పారు.

“ఒరేయ్ అభీ! కన్‌ప్యూసియస్ అన్న ఒక గ్రీకు ఫిలాసఫర్ ఏమన్నాడో తెలుసా? ‘ది గ్రేటెస్ట్ గ్లోరీ ఇన్ లివింగ్ లైస్ నాట్ ఇన్ నెవర్ ఫాలింగ్, బట్ ఇన్ రైజింగ్ ఎవ్వెరీ టైమ్ వుయ్ ఫాల్’ అని.

జీవితంలో అసలు పడిపోకుండా ఉండడంలో మన గొప్పతనం లేదు. కానీ పడిపోయినప్పుడల్లా లేస్తూ ఉండడమే నిజమైన గొప్పతనం.”

ఈ మాట సరిగ్గా అభిమన్యు హృదయానికి హత్తుకొంది. ‘డబుల్ ఎనర్జీ’ అంటారే, దానితో అతడు మరింత కష్టపడసాగాడు. ‘ఉద్యమే నహి సిధ్యన్తి కార్యాణి న మనోరథై’ అని కదా ఆర్యోక్తి.

***

న్యూఢిల్లీ. రామకృష్ణాపురం. ఆర్మీ ప్రధాన కార్యాలయం. వెస్ట్ బ్లాక్ 3. డైరెక్టర్ జనరల్ (రిక్రూటింగ్) వారి ఛాంబర్‍లో యస్.యస్.బి. ఇంటర్వ్యూ జరుగుతోంది. రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన ఎనిమిదివేల రెండు వందల ఆరు మందిలో అభిమన్యు ఒకడు.

ముందు రోజు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో, అభిని తీసుకోని కొండల రావు డిల్లీ చేరుకున్నాడు; స్లీపర్ క్లాస్‍లో. వారి అదృష్టం, న్యూఢిల్లీ రైల్వేస్టేషను లోనే వారికి రిటైరింగ్ రూమ్ దొరికింది. డార్మిటరీ. రోజుకు కేవలం ఐదు వందలే.

“అభిమన్యు కుమార్, ఫ్రం హైదరాబాద్” అని పిలిచారు. అభి లేచి లోపలికి వెళ్లాడు. బోర్డు చైర్మన్ విశ్వామిత్ర బెనర్జీ, ఇతర సభ్యులు మహేందర్ సింగ్, నటరాజు మొదలియార్ ఆసీనులై ఉన్నారు. వారికి వినయంగా నమస్కరించాడు అభి.

“NDA కెరీర్‌ను ఎందుకు ఎంచుకున్నావు?” మొదటి ప్రశ్న.

“సాహసోపేతమైన జీవితాన్ని అందిస్తుందని, సర్స్”

“రిస్కీ కెరియర్ ఇది. నీకు భయం అనిపించలేదా?”

“లేదు సర్. ఎగ్జయిటింగ్‌గా ఉంది.”

“ప్రస్తుతం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఎవరు?”

“జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు”

“నీవు జీవితంలో ఎక్కువ ప్రేమించేది ఎవరిని?”

“మా చెల్లి యమునను.”

“ఎందుకు?”

“చెప్పలేను.”

“భారతమాత గురించి ఏదైనా చెప్పు.”

“జయజయజయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి – జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి” అని శ్రావ్యంగా ఆలపించాడు అభి.

“వండర్‌ఫుల్. దీనిని ఎవరు రాశారు?”

“తెలుగువారు గర్వించదగిన కవి మా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు.”

“గుడ్ లక్. యుకెన్ లీవ్ నౌ.”

“థాంక్ యూ సర్స్. వెరీ కైండ్ ఆఫ్ యు.”

***

మరో నెల రోజుల్లోనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లు రిజిస్టర్ లెటర్ వచ్చింది. సంజీవరాయుడుగారికి దాన్ని చూపి, పాదాభివందనం చేశాడు అభి. అతనితో బాటు ఆ సంవత్సరం ఆ కాలేజీ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. రెండో అభ్యర్థి యశోదారెడ్డి. ఆమెది కర్నూలు జిల్లా కోవెలకుంట్ల.

3 సంవత్సరాల శిక్షణ కోసం మహారాష్ట్ర, పూణె వద్ద ‘ఖడక్ వాస్లా’ చేరుకున్నాడు అభి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో సెలెక్టయిన వారికందరికీ అక్కడే ట్రయినింగ్. క్యాంపస్ లోని సూడాన్ భవనం మీద ఉన్న NDA లోగో అతన్ని ఆకర్షించింది. దాని మీద లోగో ‘సర్వీస్ బిఫోర్ సెల్ఫ్’ అని రాసి ఉంది. దాన్ని చదివి అతని యువ హృదయం ఉప్పొంగింది.

ఈ సంస్థను 74 సంవత్సరాల క్రిందట డిసెంబరు 7 1949లో ప్రారంభించారని తెలుసుకున్నాడు. 7 వేలకు పైగా చదరపు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉందా సంస్థ. దాని కమాండెంట్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచార్ గారు.

అక్కడ శిక్షణ తీసుకొన్న వారిలో ముగ్గురు ‘పరమవీరచక్ర’లు, 12 మంది ‘అశోకచక్ర’లు ఉన్నారని, 27 మంది సర్వీస్ చీఫ్‍లని ఆ సంస్థ దేశాని కందించిందనీ తెలిసి అభి హృదయం ఉద్విగ్నభరితమైంది.

పుణె నగరానికి 17 కి.మీ. దూరంలో ఉంటుంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అరేబియా సముద్రాన్ని అనుకోని ఉంటుంది. దగ్గరలోని లోహగావ్‌లో ఒక ఆపరేషనల్ ఎయిర్ బేస్ కూడా ఉంది.

సూడాన్ బ్లాక్ మూడంతస్తుల భవనం. గ్రానైట్ స్టక్చర్. జోధ్‌పూర్ రెడ్ శాండ్ స్టోన్ నిర్మాణంతో మెజెస్టిక్ అప్పియరెన్సును కలిగి ఉంటుంది.

తనను అంత గొప్ప సంస్థలో భాగం చేసినందుకు, తమ కులదైవం తిరుపతి వేంకటేశ్వరునికి, NDA గురించి చెప్పిన అంకుల్ యాదగిరి రెడ్డికి, ప్రోత్సహించి చదివించిన తల్లిదండ్రులకు, కాలేజీ ప్రిన్సిపాల్ సంజీవరాయుడు గారికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు అభి మనసులో.

“అలసత్వానికి ఆమడదూరం, ధైర్యానికి, సాహసానికి ఆధారం, నిస్వార్థతకు నిలువెత్తు రూపం, దేశభక్తికి ఆలవాలం, ఈ సైన్యంలో కర్తవ్యం” అని తొలిరోజు మెసేజ్‍లో కమాండెంట్ గారు చెప్పారు. ఎంతో ప్రేరణాత్మకమైన మాటలవి.

NDA ప్రార్ధన మతాతీతమైంది. అది ఇలా ఉంటుంది.

“ఓ భగవంతుడా! మమ్మల్ని భౌతికంగా శక్తివంతులుగా, మానసికంగా చైతన్యవంతులుగా, నైతికంగా ఋుజువర్తనులుగా చేయి తండ్రీ! నీ పట్ల, దేశం పట్ల మేం నిర్వహించే కర్తవ్యంలో మా సేవలు మచ్చలేకుండా, గౌరవాన్ని పొందాలి. బాహ్యమైన దాడులనుండి, అంతర్గతమైన అలజడుల నుండి మా దేశాన్ని సంరక్షించుకునేలా మాకు బలాన్నివ్వు. నిజాయితీగా వ్యవహరించడం, స్వచ్ఛమైన ఆలోచనలు, మాకివ్వు. సులభతరమైన తప్పును కాకుండా, కఠినతరమైన ఒప్పును ఎంచుకోనేలా మాకు మార్గదర్శనం చేయి.

మా సాటి సైనికుల పట్ల అభిమానాన్ని, మా పై అధికారుల పట్ల విధేయతను, క్రింది వారి పట్ల ప్రేమను మా హృదయాలలో వెలిగించు. ఏదైతే గొప్పదో, దాని పట్ల ప్రేమ నుంచి ఉద్భవించిన ధైర్యాన్ని మాకివ్వు దేవా! సత్యము, ధర్మము ప్రమాదంలో పడినపుడు వెనక్కి తగ్గని, రాజీపడని తత్త్వాన్ని మాకనుగ్రహించు. నీకు, మా దేశానికి సేవ చేసే అవకాశాలనివ్వు. మా స్వార్థానికి అతీతంగా మా సేవ ఉండేలా కరుణించు ప్రభూ.”

అద్భుతమైన ఈ ప్రార్థనను శిక్షణకు ముందు రోజూ చెప్పించేవారు. అది వారిలో ఒక చైతన్య స్ఫూర్తిని నింపేది. ప్రాణాలు తృణపాయంగా తోచేవి. ఎప్పుడెప్పుడు శిక్షణ పూర్తవుతుందా, క్రియాశీల యుద్ధరంగంలోకి ఎప్పుడు దూకుదామా అని తహతహగా ఉండేది.

శిక్షణలో మొత్తం 18 స్క్వాడ్రన్ లుంటాయి. క్యాడెట్‌ను ఏదో ఒకదానికి కేటాయిస్తారు. ఒక్క స్క్వాడ్రన్‌లో వంద నుంచి నూట ఇరవైమంది ఉంటారు. వారందరి శరీరాలు ఉక్కువి. మనసులు వజ్రాయుధాలు.

వారంతా ప్లస్ టు పాస్ ఔట్స్ కాబట్టి వారికి బి.ఎస్.సి, బాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఆ డిగ్రీలు – జె.యెన్.టి.యు, ఢిల్లీ యూనివర్సిటీలు ఇస్తాయి. ఇవి కాక ఔట్‌డోర్ స్కిల్స్, పి.టి, గేమ్స్ కూడ ఉంటాయి.

అభి ఆర్మీ విభాగంలో ఉన్నాడు. అతనికి వెపన్ హ్యాండ్లింగ్, ఫైరింగ్, ఫీల్డ్ ఇంజనీరింగ్, టాక్టిక్స్, మ్యాప్ రేటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇది, ఇండియన్ మిలిటరీ అసోసియేషన్ (IMA) తో వారు తర్వాత పొందబోయే శిక్షణకు పునాది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడంలో వారికి ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు.

***

శిక్షణ ముగిసింది. నెల రోజులు సెలవులిచ్చారు. హైదరాబాదుకు వెళ్లి కుటుంబంతో గడిపి వచ్చాడు. తిరుపతి వెళ్లివచ్చారు. అభిని జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా అరుణాచల ప్రదేశ్ లోని ఆర్మీ బేస్‍కు పోస్ట్ చేశారు. అన్ని వసతులు గల టెంట్ అలాటయింది. రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు జీతం. సంవత్సరానికి రెండు నెలలు సెలవులు. కానీ ఎమర్జెన్సీ వస్తే సెలవులు రద్దు చేసుకోని రావలసి ఉంటుంది.

చైనా సరిహద్దు అది. అక్సాయ్‌చిన్ ప్రాంతం అది. చైనా ఆధీనంలో ఉన్నా, భారత్ తనదని క్లెయిం చేస్తుంది. అక్కడ జనావాసాలు ఉండవు. సముద్రమట్టానికి చాలా ఎత్తు. ఊసర క్షేత్రం. కాశ్మీరు, టిబెట్, క్సింజయాంగ్ లను స్పృశిస్తూ వెళుతుంది. క్సింజియాంగ్ – టిబెట్ హైవేను క్రాస్ చేస్తుంది.

ఇంకొకటి మెక్ మోహన్ లైన్. ముందు కొన్ని NEFA అనేవారు (నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజన్సీ). అరుణాచలప్రదేశ్ భారత్‍లో అంతర్భాగం ఐనా, చైనా తనదని వాదిస్తుంది.

చైనీస్ మిలిటరీకి అరుణాచల్ సరిహద్దులో ఒక ఇంటిగ్రేటెడ్ వెస్టర్న్ థియేటర్ కమాండ్ (WTC) ఉంది. అది LAC (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వెంట వ్యాపించి ఉంది. LAC లో ఇండియన్ ఆర్మీకి 3 సెక్టార్లు ఉన్నాయి. లడఖ్ వెంట నార్తరన్ సెక్టార్. అక్కడ 225,000 మంది సైనికులు మోహరించబడి ఉంటారు వారిని స్ట్రయికింగ్ ఫోర్సెస్ అంటారు.

***

అభిమన్యు తన సబార్డినేట్స్‌కి ఇలా చెబుతున్నాడు -”ఫ్రెండ్స్, చైనా మన అరుణాచల్ ప్రదేశ్ లోని వివాదాస్పద భూభాగంలో చిన్న చిన్న గ్రామాలను నిర్మించిందని మీకు తెలుసు. నిజానికి ఆ గ్రామాలు గ్రామాలు కావు. ఆ గ్రామస్థులు గ్రామస్థులు కారు. వారంతా చైనీయులు. గ్రామస్థుల రూపంలో ఉన్న ‘బార్డర్ గార్డియన్స్’. వారికి చైనా ప్రభుత్వం వార్షిక సబ్సిడీలనందిస్తుంది.

మన కర్తవ్యం ఏమిటంటే ఆ గ్రామాల మీద మెరుపుదాడులు చేసి, వాటిని నేలమట్టం చేయాలి. చైనా దురాక్రమణదారులను హతం చేయాలి. మనకు నాలుగు గ్రామాలనిచ్చారు మన కమాండర్ శంతను కులకర్ణి గారు. మీకు నేను నాయకుడిని. కాని మీరు నన్ను స్నేహితుడిగా భావించండి. మనం రాత్రి పూట స్ట్రయిక్ చేస్తాము. మన బృందంలో మొత్తం పదిహేను మందిమి. ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్ ముందే చెక్ చేసుకోండి. వాటర్, బిస్కెట్స్, బ్రెడ్ రడీగా ఉంచుకోండి ఫస్ట్ ఎయిడ్ కిట్ సరే. బీ రెడీ ఫర్ ది అటాక్!”

అభిమన్యులో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రాణభయం ఇసుమంతైనా లేదు.

అర్ధరాత్రి ఒక గ్రామాన్ని చుట్టుముట్టారు అభి బృందం. గ్రామమంటే మహా అయితే యాభై అరవై ఇళ్ళు, అవీ పక్కావి కావు. దాడి మొదలైంది. చైనీస్ రిటాలియేషన్ ప్రారంభించారు. హోరాహోరీ కాల్పలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాని ధర్మం ముందు అధర్మం ఓడిపోయింది. అభి బృందంలో ఇద్దరికి బులెట్స్ తగిలాయి. వారిని ఇటానగర్ లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించారు. ఆ గ్రామంలో చనిపోయినవారు చనిపోగా, ఆరుమంది బందీలుగా పట్టుబడ్డారు

తమకు అసైన్ చేసిన నాలుగు గ్రామాలనూ నిశ్శత్రుమయం చేసింది అభి బృందం. అలాగే మిగిలిన బృందాలు కూడా అక్రమ గ్రామాలను నిర్మూలించాయి.

లడఖ్ లోని నార్తన్ సెక్టార్‍లో అడ్మిరల్ హుమాయూన్ ఖాన్ వీర సైనికులకు విజయోత్సవం ఏర్పాటు చేశాడు. అందరికీ అభినందనలు తెలిపాడాయన.

“మీలాంటి యువ సింహాలున్నంతవరకు భారతమాతకు వచ్చిన ముప్పు లేదు. పొరుగు దేశాలు తోక ముడవాల్సిందే. ఇదే స్ఫూర్తితో పని చేయండి. జైహింద్!”

అభి నినదించాడు “మేరా భారత్ మహాన్!” అంటూ.

అతని కన్నుల్లో దేశభక్తి జ్యోతులు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here