ప్రాణశక్తి

9
6

[dropcap]”యా[/dropcap]క్సిడెంట్… యాక్సిడెంట్” అంటూ జనం కేకలు పెట్టారు. ఆ మాట విని కొంతమంది ఆ వైపుకు పరుగులు తీశారు. స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళను వెనకనుంచి వచ్చిన లారీ గుద్దేసి వెళ్ళిపోయింది.

“ఆ స్కూటర్ మీద వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయుంటారు. ఈ లారీ వాళ్ళకెక్కడలేని దూకుడు. ఎదురుగా వచ్చే వాహనాలను, మనుష్యులను ఏదీ పట్టించుకోరు. మన వెనకాల లారీ వచ్చినా మనకే ఇబ్బంది అవుతుంది. ఇంతకీ అంబులెన్స్‌కి ఎవరైనా ఫోన్ చేశారా?” అంటూ ఒకతను హడావుడిగా మాట్లాడాడు.

“ఇంతకుముందు ఒకతను ఫోన్ చేయటం చూశాను. ఈ పాటికి వస్తూనే వుంటుంది. అదుగో అంబులెన్స్ హరను వినబడుతుంది. తప్పుకోండి… తప్పుకోండి” అంటూ జనాన్ని హెచ్చరించాడు మరొకతను.

అంబులెన్స్ సిబ్బంది స్కూటరు మీదనుంచి అంతదూరాన పడివున్న ఇద్దర్నీ, మోసుకుంటూ అంబులెన్స్ లోకి తీసుకెళ్ళారు. రక్తం కారే గాయాలతో, ఒంటినిండా రక్తపు మరకలతో ఇద్దరూ మాంసపుముద్దల్లా ఉన్నారు. వాళ్ళను లేవనెత్తిన చోట కూడా రక్తం మడుగుకట్టింది.

అది చూచిన వాళ్ళందరి ఒళ్ళు జలదరించింది. మనసంతా దేవినట్లనిపించింది. “కాసేపట్లో ఏం జరుగుతుందో తెలియదుగదా” అని కొందరు నిట్టూర్చారు.

“పాపం! వాళ్ళు ఏ ఆఫీసుకని బయలుదేరారో? సాయంకాలం కాగానే ఇంటికొస్తారు గదా అని భార్యా పిల్లలు, తల్లిదండ్రులు ఎంతగా ఎదురుచూస్తూ వుంటారో? ఇది విని వాళ్ళ గుండెలు ఎంత అవిసిపోతాయో గదా?” అని సున్నితమనస్కులు మరీ మరీ వాపోయారు.

“అయ్యో! ఇద్దరిలో ఒకతను పడగానే రోడ్డు కొట్టుకొని చనిపోయాడట. రెండవ అతను కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు” అని అనుకోసాగారు. కొన వూపిరితో ఉన్న అతను చంద్రశేఖర్. అతడిని ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‍లో పడుకోబెట్టారు. జిల్లా ఆసుపత్రి కాబట్టి ఎమర్జెన్సీ డాక్టర్లు, సర్జన్లు అందరూ అందుబాటులోనే ఉన్నారు.

“చాలా రక్తం పోయింది ఇంకసేపట్లో గుండె కూడా పనిచేయటం ఆగిపోతుంది. మనమెంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండకపోవచ్చు.”

“అవును శ్రీనివాస్ గారూ! నేనూ అలాగే అనుకుంటున్నాను. కాని మన ప్రయత్నం మనం చేయాలిగా. అతనికి ఆక్సిజన్ అందించండి. నేను ఇప్పుడే రెండు నిమిషాలలో థియేటర్‍కు వస్తాను” అంటూ డాక్టర్ నీరంజన్ బయటకు నడిచాడు.

సమాచారం తెలుసుకున్న చంద్రశేఖర్ భార్య రమ అప్పటికే అక్కడికి వచ్చేసింది. థియేటర్ తలుపులు తెరుచుకుని బయటకు వస్తున్న నిరంజన్‍ను చూస్తూనే “డాక్టర్! నా భర్తను చూసి వస్తున్నారుగా. ఎలాగైనా ఆయన్ని బతికించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను” అంటూ వంగబోయింది.

”వద్దమ్మా, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. మీరు కొంచెం ధైర్యం వహించి నేను చెప్పే మాటల మీద శ్రద్ధ పెట్టండి. నేనొకటి చెప్తాను. మీరు అధైర్యపడవద్దు”

“ఏంటి డాక్టర్! నా భర్త అవయవ దానానికి పర్మిషన్ కావాలనా మీరు చెప్పేది” అంటూ పెద్దగా రోదించింది.

“అయ్యో! కాదమ్మా. మీ మాట తీరుతో మీరు బాగా చదువుకున్నవారని తెలుస్తుంది. ఇప్పుడు నీ భర్తను బతికించడానికి నేనొక ప్రయోగం చేస్తానని చెప్పబోతున్నాను”

“ఇప్పుడు ప్రయోగాలేంటి డాక్టర్! ఎక్కువ సమయం లేదంటూనే మీరు చికిత్స చేయటానికి ఆలస్యం చేస్తున్నారు. త్వరగా వెళ్ళండి. నా భర్తను కాపాడండి ప్లీజ్!”

“లోపల మా డాక్టర్లు చేయగలిగినదంతా చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం నా మాటల్ని జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడూ చూసే కప్పల్ని గుర్తు తెచ్చుకోండి. వేసవికాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది. కొన్ని కప్పలు వెంటనే ఆ వేడినుండి కాపాడుకోవడానికి నేలలో బొరియలు చేసుకుని దూరిపోతాయి. మరికొన్ని శీతల ప్రాంతాలలోని కప్పలు చెరువుల అడుగునో, కాలవల బురదలోపలో చేరి చలిగాలులు, తగలకుండ కొంతకాలం పాటు సుషుప్తావస్థలోనే వుంటాయి. మన ప్రాంతంలోని కప్పలు వర్షాలు పడి నేల మెత్తగా, చల్లగా అయిన తర్వాత బొరియల నుండి పైకి వచ్చి బెకబెకమంటాయి. నాకప్పుడు కబీరుదాసు వ్రాసిన ‘దోహా’ గుర్తుకువస్తుంది. వసంతకాలంలో కోయిల మధురంగా కూసి వర్షాకాలపు చిత్తడిలో చీదరలో మౌనంగా ఉంటుంది. ఆ చిత్తడిలో, చీదరలో కప్పల బెకబెక మాత్రమే వినబడుతుంది. అనువుగాని సమయంలో నోరు విప్పకూడదని కోయిలలాంటి జ్ఞానులు నోరు విప్పరని భావమట. బాగా పోల్చాడు కబీరుదాసు అనిపిస్తుంది. మరికొన్ని దేశాలలో పక్షులు, గబ్బిలాలు కూడా ఇలాగే చేసి నెలల పర్యంతం సుషుప్తావస్థలో వుండిపోతాయి. తమను తాము కాపాడుకుంటాయి. ప్రాచీనకాలంలోని మన ఋషులు కూడా తపస్సు పేరుతో తక్కువ శ్వాసలు తీసుకుంటూ ఇలా సుషుప్తావస్థలో వుండిపోతారు. వాళ్ళ చుట్టూ పుట్టలు పెరిగిపోయినా పట్టించుకోరు. తపస్సు పూర్తయిన తర్వాత మామూలు స్థితిలోనికి వచ్చి చైతన్యవంతులవుతారు. కప్పలు, పక్షులు, గబ్బిలాలు, ఋషులు ఇలా కొంతకాలం సుషుప్తావస్థలో వుండీ మామూలు స్థితికి వస్తున్నారు. తక్కువ శ్వాసలు తీసుకోవటం వల్లనే ఇదంతా సాధ్యపడుతున్నదని తెలుస్తున్నది. ఇదంతా కప్పల్లో, ఋషుల్లో సహజంగా జరిగింది. ఈనాడూ సైన్సు ఇంత పెరిగింది. అలాగే వైద్యం ఎంతో అభివృద్ది చెందింది. మనం ప్రయత్నించి వైద్య సహాయంతో మానవుణ్ణి కూడా కొంతకాలం సుషుప్తావస్థలో వుంచలేమా అని ఆలోచించి కొన్నిసార్లు ప్రయోగాలు చేశాను. సాధ్యమే అనిపించింది. ఇప్పుడు మరోసారి నీ భర్తను అలా సుషుప్తావస్థలోకి తీసుకువెళతాం. అవసరమైన చికిత్సంతా చేస్తాం. అది పూర్తయిన తరువాత మరలా సాధారణ స్థితిలోనికి తీసుకొని వస్తాం. అతను బతకటానికి చాలా ఛాన్సులు ఉంటాయి. మీరు ఒప్పుకోండి. మీకు చెప్పకుండా నేను చేయవచ్చు. కాని ‘ఎథిక్స్’ ప్రకారం మానవతా విలువల దృష్ట్యా మీకు చెప్తున్నాను.”

“లోపల నా భర్తకు వైద్యం అందుతున్నది గదా డాక్టర్? అయినా మీరు ప్రయోగం అంటున్నారు అది ఎలా చేస్తారు డాక్టర్?”

“వైద్యం బాగానే అందుతున్నది. గాయాలు ఎక్కువగా తగిలితే రక్తం ఎక్కువగా పోతుంది. దాదాపు గుండె కొట్టుకోవటం కూడా ఆగిపోయే స్థితిలో వుండేవారి మీదే ఈ ప్రయోగం చేస్తున్నాను. ఇప్పుడూ నీ భర్త పరిస్థితి కూడా అదే”

“అయ్యో డాక్టర్! నా భర్తను కాపాడలేరా?” అంటూ ఏడ్పును ఆపుకోవటానికి ప్రయత్నం చేసింది.

“ఏడవకండమ్మా! మీ స్థితికి నేను కూడా బాధపడుతున్నాను. మీరు బాగా ధైర్యంగా ఉండండి. నాకు సహకరించండి. నేనూ ఒక సాహసంతో కూడిన ఒక ప్రయత్నమే చేయబోతున్నాను. వైద్యవిజ్ఞానంలో మరో అడుగు వేసి ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించాలనే తపన పడుతున్నాను. ఇప్పుడు నేనేం చేయదలచుకున్నానంటే గాయాలతో చాలా రక్తం పోయిన నీ భర్త శరీరంలోకి మంచు అంత చల్లగా వుండే సెలైన్ ఎక్కిస్తాం. శరీర ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి. గుండె కొట్టుకోవడం బాగా తగ్గి శ్వాసక్రియ బాగా మందగిస్తుంది. అప్పుడు మెదడు కూడా చురుగ్గా ఉండదు. మానవ శరీరంలో కణజాలపు పాత్ర చాలా ప్రధానమైనది. మామూలుగా అయితే ఈ కణాలకు నిరంతరం ఆక్సిజన్ కావాలి. అది అందకపోతే ప్రాణమే పోతుంది. మనం చేసే పనిలో కణాలలో స్పందన తగ్గుతుంది. స్పందన తగ్గినది కాబట్టి వాటికి ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుంది. శ్వాసక్రియ చాలా మందగిస్తుందని కూడా అనుకున్నాం గదా. ఇలా చేయటాన్ని మేం ‘ఎమర్జెన్సీ ప్రిజర్వేషన్ అండ్ రిససిటేషన్’ అని పిలుస్తాం. నేను పైన చెప్పినవన్ని చేయటం వలన గాయాలు తగిలిన వ్యక్తి చనిపోడు, కేవలం సుషుప్తావస్థలోకి వెడతాడు. ఆ అవస్థలో డాక్టర్ల దగ్గర దాదాపు రెండుగంటల సమయముంటుంది. మామూలు అవస్థలో డాక్టర్లకు కొద్ది నిముషాలే సమయం ఉంటుంది. చికిత్స బాగా అందించలేడు. నేను చెప్పే పద్థతిలో అయితే డాక్టరు అవసమైన చికిత్స చేయగలుగుతాడు. ఆ తర్వాత అతన్ని సాధారణ స్థితిలోనికి తీసుకువస్తాం. నెమ్మదిగా గుండె యధావిధిగా లబ్‍డబ్‍లను వినిపిస్తుంది. చేతనస్థితిలోకి వచ్చాడు కాబట్టి మెదడూ, కణజాలం అన్నీ చురుకవుతాయి. మనిషి కోలుకుంటాడని నా నమ్మకం. నేను దీన్ని కొంత సాహసించే చేస్తున్నాను. ఇప్పటికి కొన్ని సార్లు కొన్ని దశలవారీగా చేశాను. ఈ రోజుతో నా సాహసం, నా ప్రయత్నం ఫలిస్తాయనే నాకు నమ్మకముంది. కప్పలు, ఋషులు సుషుప్తావస్థనుండి, బయటపడినట్లే మనుషులూ వైద్యవిజ్ఞాన సహాయంతో సుషుప్తావస్థనుండి సాధారణ చేతన స్థితికి తప్పకుండా వస్తారు. నాకొక బృందం ఉంది. వాళ్ళ సహకారంతో ముందుకు వెళుతున్నాను.”

”మీ తపన, పట్టుదల నా కర్థమయింది డాక్టర్. నా భర్తను బ్రతికిస్తారన్న నమ్మకమూ నాకు కలిగింది. మీరే పేపరు మీద సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను”

“అలాగేనమ్మా థ్యాంక్స్” అంటూ నిరంజన్ చకచకా లోపలికి వెళ్ళారు.

కబురు తెలిసి రమ తల్లిదండ్రులూ, చంద్రశేఖర్ తల్లిదండ్రులూ హస్పిటల్‍కొచ్చారు.

’అయ్యో! నా కొడుకును చూడాలి’ అని చంద్రశేఖర్ తల్లి ఒకటే ఏడ్వసాగింది.

“ఏమ్మా! డాక్టరేమన్నారు? మాట్లాడేవుంటావుగా?” అన్నారు చంద్రశేఖర్ తండ్రి. డాక్టర్ నిరంజన్ చెప్పిన విషయాలన్ని రమ చెప్పింది.

“అయ్యో! అదేదో కొత్త పేరు పెట్టి నా కొడుకు కళ్ళూ, గుండె, మెదడూ అన్నీ కాజెయ్యటానికే నీకిలా చెప్పివుంటారు. పిచ్చికోడలా! వాళ్ళమాటలు నువ్వు నమ్మేశావా?” అంటూ రమ అత్తగారు శోకాలు తీసింది.

“చూడండమ్మా! హాస్పిటల్‍లో అలా బిగ్గరగా ఏడ్వకూడదు. బయట లాన్‍లో కెళ్ళి కూర్చోండి” అంటూ సిస్టర్ ఆమెను బయటికి తీసుకెళ్ళటానికి ప్రయత్నించింది.

రమ వాళ్ళ మామగారికి కూడా అంతా అయోమయమన్పించింది. “ఇది సాధ్యమా?” అనుకుంటూ ఎవరెవరికో ఫోన్లు చేసి తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు.

***

డాక్టర్ నిరంజన్ ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే హాస్పిటల్ సూపర్నింట్ వారించారు. “డాక్టర్ నిరంజన్! ఇది ఊహలతో అల్లుకుపోయే సినిమాకాదు. కల్పనలు జోడించి రచయిత వ్రాసే ఫిక్షన్ నవలా కాదు. జీవితాలతో చెలగాటం ఆడటం అవుతుంది. బాగా గాయపడిన వ్యక్తిని ప్రాణాపాయం నుండి రక్షించడానికి వైద్య సహాయం అందించాలి. అంతేకాని లేనిపోని రిస్క్ పనికిరాదు. మన ఎక్విప్‍మెంట్, మన లాబ్స్, మన ఆపరేషన్ థియేటర్లు వీటన్నిటి పరిధి చాలా చిన్నది. వీటిని నమ్ముకుని నువ్వు లేనిపోని ప్రయోగాలు చేయకు. ఇప్పటివరకు మన హాస్పిటల్‍కు మంచిపేరున్నది. దాన్ని చెడగొట్టకూడదు”

“లేదు సార్! నాకు నమ్మకుంది. దీన్ని ‘ఈపీఆర్’ పద్ధతని పిలుస్తారు. మన పి.జి. స్టూడెంట్స్ క్కూడా డెమాన్‌స్ట్రేషన్ ఇద్దామనుకుంటున్నాను. బతికున్నవాళ్ళ ప్రాణాలేమీ మనం తియ్యటం లేదు. కొనవూపిరితో ఉన్నవాళ్ళనే మనం ఎంచుకుంటున్నాం” అంటూ అక్కడినుండి వెళ్ళాడు నిరంజన్.

మరలా ఈ రోజు కూడా డాక్టర్లలో అదే చర్చ వచ్చింది. “నిరంజన్ సార్‍కు వైద్యం మీద శ్రద్ధ ఎక్కువ. మా ఆఫ్తమాలజీ గురించి కూడా నన్ను అడిగి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వుంటారు” అన్నారు ఆఫ్తమాలజిస్.

“మనిషి ఎప్పుడూ ఏవో ఆలోచనలతో, ఆశలతో ముందుకు వెడుతూ వుంటారు. డిగ్రీవాళ్ళకు, పీ.జీ వాళ్ళకు, వాళ్ళ మెదళ్ళకు కూడా ఎప్పుడూ పదును పెడుతూ వుంటారు” అన్నారు రేడియాలజిస్టు.

“ఈ పేషంట్లందరికీ నేను ఎనస్తిషియా ఇచ్చి టెస్టులప్పుడు, ఆపరేషన్లప్పుడూ మత్తువచ్చేటట్లు చేస్తుంటే నిరంజన్ సార్ తన మాటలతోనే నాకు ఎనస్తీషియా ఇచ్చి నన్నేదో ట్రాక్స్ లోకి తీసుకువెళ్తారు” అంటూ నవ్వేశారు ఎనస్తీస్ట్.

“ఇంతకీ ఈరోజు చేయబోయే ‘ఈపీఆర్’ సక్సెస్ అవుతుందంటారా?” గైనకాలజిస్ట్ సందేహాన్ని వ్యక్తం చేశారు.

“అదే గనుక సక్సెస్ అయితే వైద్య చరిత్రలోనే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. దేశ విదేశాల్లో మన హాస్పిటల్ పేరు, నిరంజన్ గారి పేరు మారుమోగిపోతుంది. తాననుకున్నట్లుగానే ఆ గాయపడిన వ్యక్తిని కొన్నిగంటలపాటు సుషుప్తావస్థలోకి పంపగలగటం ఒక అద్భుతం. ఆ అద్భుతంలో కొన్ని గంటలు సమయం సంపాదించి ఆ వ్యక్తికి ఆ స్థితిలో వైద్యం చేయగలగటం ఇంకా అద్భుతం. ఇదంతా సాధ్యమేనా అనిపిస్తుంది” అన్నారు సైకాలజిస్ట్.

“ఏది ఏమైనా నిరంజన్ చాలా సాహసమే చేస్తున్నారు. తన ప్రయోగం విఫలమైతే ఆ వ్యక్తి సుషుప్తావస్థలోకి కాదు, మరణావస్థలోకి వెళ్తాడు. ఎలాగూ కొనవూపిరితో ఉన్నవారినే ఎంచుకుంటున్నారు కాబట్టి నో ప్రాబ్లెమ్. ఇలా సస్పెండెడ్ యానిమేషన్‍లో ఒక మనిషిని ఉంచగలగటం సాధ్యమేనని నిరంజన్ గట్టిగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా మనం నిరంజన్‍ను ఎప్రిషియేట్ చేయవలసిందే అన్నారు పేధాలజిస్ట్.

“నిరంజన్ సార్ చెప్పే రీజన్ బాగానే ఉంది. ఈ విధానంలో చాలా తక్కువ శ్వాస తీసుకోబడుతున్నారు కాబట్టి అవయవాలు ఏమీ డామేజ్ అవవు. ఆ వ్యక్తి శరీరంలో ఉన్న ప్రాణశక్తి అంతసేపూ అతడ్ని బతికించడానికి సరిపోతుంది” అన్నాడు కార్డియాలజిస్ట్.

చంద్రయాన్ ప్రయోగాన్ని వీక్షించే ఇస్రో శాస్త్రవేత్తల్లాగా ఈ హాస్పిటల్లో డాక్టర్లందరూ డాక్టర్ నిరంజన్ చేసే సాహస ప్రయోగ ఫలితం  కోసం ఎదురుచూస్తున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. గంట గడిచింది.

ఇటు డాక్టర్ నిరంజన్ తన బృంద సహాయంతో పరిసరాలు మరచి తననుకొన్న ప్రయోగం చంద్రశేఖర్ మీద చేస్తున్నాడు. అతని ఒంట్లోకి చల్లని సెలైన్‍ను పంపి గుండె, మెదడు పనితీరును నియంత్రించారు. శరీర ఉష్ణోగ్రతను బాగా చల్లబరిచారు. శ్వాసక్రియ చాలా మందంగా నిమిషానికి ఒకసారో, అరసారో అన్నట్లుగా జరగసాగింది. ఆ స్థితిని చూచి నిరంజన్ బృందానికి చాలా సంతోషం కలిగింది. ఉత్సహం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు చంద్రశేఖర్‍కు నింపాదిగా వైద్యసహాయం అందించవచ్చు. అలాగే అందించారు. చికిత్స పూర్తయింది. క్రమంగా చంద్రశేఖర్ శరీర ఉష్ణోగ్రతను పెంచారు. గుండె లబ్‍డబ్‍లు వినపడసాగాయి. మెదడు యథావిధిగా సంకేతాలు ఇవ్వసాగింది. కణజాలానికి ఆక్సిజన్ అందుతున్నది. నిరంజన్ సాహసం శిఖరాగ్రాన నిలచింది. వైద్యరంగంలో కొత్త అధ్యాయం మొదలయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here