ప్రబంధ సాహిత్యంలో ‘సలము’లు

0
5

[box type=’note’ fontsize=’16’] “వసుచరిత్ర సాహిత్య సౌరభాలు నేటికి నిలిచి ఉన్నా, సంగీత సాంప్రదాయాలు ఆధునిక కాలానికి పూర్తిగా లుప్తం అయిపోవడం ఆంధ్రుల దురదృష్టం” అంటున్నారు రవి ఇ.ఎన్.వి. ఈ వ్యాసంలో. [/box]

నాంది

[dropcap]తె[/dropcap]లుగు ప్రబంధసాహిత్యంలో వసుచరిత్ర – ఒక అనుపమానమైన కావ్యం. ఆ కావ్యాన్ని రచించినది భట్టుమూర్తి అన్న మహాకవి. ఈయనకే రామరాజభూషణుడని పేరు. ఆ కవి ’సంగీతకళారహస్య నిధి’. సంగీతసాహిత్యాలలో దిట్ట. వసుచరిత్ర కావ్యమంతటా ఆ కవి సాహిత్య ప్రౌఢితో బాటు సంగీతమేధ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని కవి కావ్యంలో యెడనెడ చెబుతుంటాడు. ఈ కావ్యపు నాయిక – గిరిక. ఈమెను వర్ణించే సందర్భంలో పరోక్షంగా సంగీతశాస్త్ర ప్రాగల్భ్యాన్ని గురించి కూడా ఉద్యోతిస్తూ ఈ పద్యం చెబుతాడు కవి.

మ.

పదమెత్తన్ కలహంసలీల, యధరస్పందంబు సేయన్ శుభా

స్పదమౌ రాగకదంబకంబు, శ్రుతి చూపన్ శ్రీవిలాసంబు, కే

ల్గదలింపన్ సుకుమారపల్లవనవైలాలక్ష్మి, వీక్షింప ష

ట్పదియుం బొల్చుఁ దరంబె కన్నెఁ గొనియాడన్ గేయవాక్ ప్రౌఢిమన్. (3.59)

తా: పదము పాడుటకారంభింపగానే కలహంస రాగ విశేషము, పెదవి కదలింపగనే రాగసమూహము, శ్రుతి చూపినంతనే శ్రీరాగ సంపద, హస్తము కదలింపగానే షట్పదీగీతావిశేషమూ పొసగును. ఇవి ఆ గిరిక సంగీతవిద్యాప్రౌఢికి సంకేతములు.

గిరికాదేవి నడక కలహంసలా, ఆమె పెదవి కెంపువలె, కేలు చివురు లా, చూపులు తుమ్మెదల్లా ఉన్నవి. ఆమె సొగసును వర్ణింపనలవి కాకున్నది – అని మరొక అర్థం.

పైని పద్యంలో సాధారణార్థాలే కాక, సంగీతవిశేషాలు కలవని వ్యాఖ్యాతలు చెబుతారు. కలహంస, శ్రీ – ఇవి రాగముల పేర్లట. సుకుమారపల్లవనవ ఏలాలక్ష్మి – ఏలపాటలకు ప్రతీకయట. షట్పది – ఓ గేయఛందము.

ఈ వసుచరిత్ర కావ్యం ప్రసక్తి వచ్చినప్పుడు కావ్యజ్ఞులు అందులోని   ప్రసిద్ధమైన పద్యాన్ని స్మరించడం కద్దు. వసంతకాలపు ఆరంభసంరంభాన్ని వర్ణించే ఆ సీసపద్యం యిదీ.

సీ.

లలనా జనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగ దోః ప్రసంగ

మలసానిలవిలోల దళ, సాసవరసాల ఫలసాదరశుకాలాపన విశాల

మలినీ గరుదనీకమలినీ కృతధునీ, కమలినీ సుఖిత కోక కులవధూక

మతికాంత సలతాంత లతికాంత రనుతాంత రతికాంత రణతాంత సుతనుకాంత

తే.

మకృతకామోదకురవకా వికల వకుళ ముకుల సకల వనాంత ప్రమోద చలిత

కలిత కలకంఠకులకంఠ కాకలీవిభాసురము పొల్చె మధువాస వాసరంబు! (1.126)

తాత్పర్యము : వసంతమందు గోరంటలు పూచి, పొగడలు మొగ్గలు తొడిగి, కోకిలలు కూయసాగెను. కాముకులు ఆలింగనసుఖమును అనుభవింపసాగిరి. చిలుకలు తీయమానిపై చేరి మధురముగా భాషింపసాగెను. తుమ్మెద ఱెక్కలచే నల్లనైన తమ్మితీవియలలో జక్కవలు మెలగదొడగెను. స్త్రీపురుషులు వసంతకాల వశమున పుష్పితములై మనోహరముగా పొదరిండ్లలో అలసిపోవునట్లు కామకేళికలలో తేలిరి.

పైని పద్యం – గొంతెత్తి చదువుకుంటే ఇలా ఉంటుంది.

లలనాజ-నాపాంగ-వలనావసదనంగతులనాభి-కాభంగ-దోః ప్రసంగ

మలసానిలవిలోలదళసాసవరసాలఫలసాదరశుకాల– పన విశాల

మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీసుఖిత కోక-కులవధూక

మతికాంతసలతాంతలతికాంతరనుతాంతరతికాంతరణతాంత-సుతనుకాంత

మకృతకామోదకురవకా వికల వకుళ ముకుల సకల వనాంత ప్రమోద చలిత

కలిత కలకంఠ కులకంఠ కాకలీవిభాసురము పొల్చె మధువాస వాసరంబు!

పద్యాన్ని ఇలా చదువుకుంటే వ్యత్యాసం కనిపిస్తూనే ఉంది కదూ! లలనాజ, వలనావ, సదనంగ, తులనాభి…ఇత్యాది పంచమాత్రల లయబద్ధమైన శబ్దాల ఆవృత్తి ఈ సీసపద్యానికి చక్కటి లయను సంతరింపజేస్తోందని తెలుస్తూంది. సీసపద్యాలలో ఈ విధమైన లయను ప్రత్యేకంగా ఏర్పరిచి, సీసానికి గేయస్వరూపాన్ని సమకూర్చినది ప్రబంధకవులు. అందులో ముఖ్యుడు భట్టుమూర్తి. వసుచరిత్రలో పలు పద్యాలకు వీణియపై స్వరాలు కట్టి వాయించేవారని రెండు మూడు తరాలకు ముందు పండితులు పేర్కొన్నారు. ప్రబంధసాహిత్యంలో ఈ విధమైన సీసపద్యాలను కొన్నిటిని ప్రస్తావించుకోవడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

ఆ విషయానికి నాందిగా ముందు, సీసపద్యం గురించి, దాని పుట్టుపూర్వోత్తరాలను గురించి, సీసపద్యంలో గేయసంవిధానానికి ప్రధాన ఆకరమైన ఇంద్రగణాల గురించి ముచ్చటించుకోవాలి.

సీసపద్యం

అనియతాక్షర మాత్రాసంఖ్యాకమైన సీసపద్యం – తెలుగు, కన్నడ భాషల లోని శుద్ధ దేశీయ ఛందము. సాధారణంగా దేశీజాతి పద్యాలను తాళభేదాలననుసరించి రగడలు అంటారు. ఇవి వైతాళీయాలు. సీసము, తేటగీతి, ఆటవెలది – వీటిని ఉపజాతులు అంటారు. సీసములో ప్రతి పాదానికి ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి. చివర్న ఆటవెలది గాని, తేటగీతి కాని ఉండవలె. కన్నడభాషలో ఇంద్రగణాన్ని – విష్ణుగణమని, సూర్యగణాన్ని బ్రహ్మగణమని అంటారు.

సూర్యగణాలు, చంద్రగణాలు ఇవి. (I = ఒక మాత్ర; U = రెండు మాత్రలు)

సూర్య గణములు:

న = న = III

హ = గల = UI

ఇంద్ర గణములు:

నగ = IIIU

సల = IIUI

నల = IIII

భ = UII

ర = UIU

త = UUI

(పైని ఇంద్రగణాలలో భ, నల – ఈ రెండు గణాలు మాత్రం నాలుగు మాత్రల గణాలు. మిగిలినవి అన్నీ ఐదుమాత్రల గణాలు. )

సీసపద్యం తెనుగున మిక్కిలి ప్రసిద్ధి పొందిన పద్యఛందము. ఈ సీసపద్యం – మొత్తంగా ఎనిమిది పాదాల పద్యం అవుతోంది. అయితే ప్రాచీనకాలంలో తాళపత్రాలపై లిఖించేప్పుడు, తాటాకుపై గల స్థలాన్ని పొదుపుగా ఉపయోగించుకునేందుకు తేటగీతిని, ఆటవెలదిని రెండుపాదాలలో ముగించేవారని, దరిమిలా సీసపద్యం, పైని నాలుగుపాదాలు, తేటగీతి/ఆటవెలదిగా రెండుపాదాలు, వెరసి ఆరుపాదాల ఛందస్సు అని కొందరు లాక్షణికులన్నారు.

“తన పాదంబులు నాలుగు

మొనసిన పైగీతి పాదములు రెండునుగా

’నిను మూడై’ సీసమునకు

జను నడుగులు వ్రాలు వళ్ళు సరి యన్నింటన్” – (కావ్యాలంకార చూడామణి – 8.36, విన్నకోట పెద్దన)

తన = సీసం యొక్క పద్యాలు నాలుగు, ఎత్తుగీతి పాదాలు రెండు, మొత్తం ’ఇనుమూడై’ అంటే రెండు మూళ్ళు ఆరై, వ్రాలు వళ్ళు – గణములు అన్ని పాదాలకు సమానంగా ఉన్నది సీసపద్యం.

దేశీ భాషల్లో గేయమే సీసపద్యంగా మారినదని కొందరు పండితులన్నారు. సీసపద్యం తొలినాళ్ళలో ఎత్తుగీతి గా ఆటవెలదిని ఎక్కువగా ఉపయోగించేవారు. తెనుగు ప్రాచీన శాసనాలలో సీసపద్యం తో ఆటవెలదియే ఎక్కువగా కనిపిస్తుంది. నన్నయ కూడా సీసపద్యంతో ఆటవెలదినే ఎక్కువగా ఉపయోగించాడు. ఆయన రచించిన 251 సీసపద్యాలలో 225 సీసపద్యాలకు ఎత్తుగీతి ఆటవెలదియే. పాల్కురికి సోమనాథుని చతుర్వేదసారంలో సీసపద్యాలలో ఆటవెలదియే ఎత్తుగీతి. నాగవర్మ అనే కన్నడ లాక్షణికుడు సీసపద్యలక్షణాలను వింగడించి, సీసపద్యానికి ఎత్తుగీతిగా ఆటవెలదియే ఉండాలని, ప్రాస నియతమని పేర్కొన్నాడు. విషమపాద ఛందమైన ఆటవెలది నడత – సీసపద్యానికి దగ్గరగా ఉంటుందని, సీసపద్యం+ఆటవెలది కలిసి గేయపు నడతగా చక్కగా కుదురుకుంటాయని అందుచేతనే, సీసపద్యం గేయంగా ఉన్న తొలినాళ్ళలో పుట్టిన ఆటవెలదిని కూడి ఉన్నదని పరిశీలకులన్నారు.

అయితే సీసపద్యానికి తేటగీతి ఎత్తుగ ప్రయోగించటం క్వాచిత్కంగా లేకపోలేదు. పొత్తపి వేంకటరమణ కవి తన లక్షణ శిరోమణిలో “శుభ్రగీతా సీసాన్వితా కేచిత్ గాగయతిః ప్రవళి” అని ఋగ్వేదబ్రాహ్మణం నుంచి లక్షణాన్ని ఉదాహరించినాడు. శుభ్రగీతా అంటే తేటగీతి. దీనికి మరొక పేరు ప్రవళి. కొన్ని మతములలో సీసముతో కూడవచ్చును అని అంగీకరించాడు.

అంతే కాదు, ఐదుమాత్రలు గేయగతులకు దగ్గర కాబట్టి సీసపద్యంలో ఇంద్రగణాలు ఎక్కువని లాక్షణికులంటారు. ఇంద్రగణాలలో నలము (IIII), భ గణము(UII) లో నాలుగు మాత్రలే ఉన్నాయి. మౌఖిక సాంప్రదాయంలో ఈ రెండు గణాలనూ దీర్ఘంగా పలకడం ఉందని, దరిమిలా నలము, భ గణము వీటిని – నలల, భల గణాలుగా ఉపయోగించారని అంటారు. దీనికొక దృష్టాంతంగా సర్వలఘుసీసంలో నలము నకు బదులు ఐదుమాత్రల నల+ల గణాలను ఉపయోగించారని పేర్కొన్నారు. ఇటువంటి సర్వలఘుసీసాన్ని అప్పకవీయంలోనూ, పోతన భాగవతంలోనూ కనుగొనవచ్చు. పోతన భాగవతంలో “నలల (IIIII) ” గణాలతో కూర్చిన సర్వలఘు సీసం యిది.

సీ.

నవ వికచ సరసి రుహ నయన యుగ ! నిజ చరణ గగన చర నది! నిఖిల నిగమ వినుత!

జలధి సుత కుచ కలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజ హృదయ! ధరణి భరణ!

ద్రుహిణ ముఖ సుర నికర విహిత మతి కలిత గుణ! కటి ఘటిత రుచిరతర కనక వసన!

భుజగ రిపు వరగమన ! రజత గిరిపతి వినుత! సతత వృత జప నియమ సరణి చరిత!

తే.గీ.

తిమి! కమఠ! కిటి! నృహరి! ముదిత బలినిహిత పద! పరశు ధర! దశ వదన విదళన!

ముర మథన! కలుష సుముదపహరణ కరివరద! ముని నరసుర గరుడ వినుత!

(ఆంధ్ర మహా భాగవతము 11.4.72.)

గేయం మూలంగా ఉద్భవించిన సీసపద్యం, నన్నయ తదనంతర కాలంలో పాఠ్యంగా (చదువుకునే పద్ధతికి) మారింది. శ్రీనాథుని కాలానికి సీసపద్యం లో ఎత్తుగీతిగా తేటగీతి ప్రాధాన్యత సంతరించుకొన్నది. ఈ మార్పులు ప్రధానంగా భావాలను ఉద్యోతించడానికి, (యత్తత్ అర్థాలు, క్రమాలంకారము), ఆది, అంత్య ప్రాసలతో పద్యానికి ఒక ఒడుపును కల్పించటానికి, పద్యాన్ని రసప్రవిష్టంగా మార్చుటకు ఉద్దేశింపబడినవి. ఈ అంత్యప్రాసలలో, త్ర్యక్షర అంత్యప్రాస, చతురక్షరములు, షష్టాక్షరములు, చివరకు ఏకాదశాక్షర అంత్యప్రాస కూడా కవులు కూర్చి ఉన్నారు. ఇంతే కాక, సమప్రాస, అక్కిలిప్రాస వంటి గతులను కూడ సీసపద్యపు గతులలో చేర్చినారు కవులు. తొలినాళ్ళలో హెచ్చుభాగం ’ఆటవెలది’ తో కూడిన సీసపద్యం తర్వాతి కాలంలో తేటగీతిని ఎత్తుగీతిగా సమకూర్చుకున్నది. ఇలా సీసపద్యము తెనుగుభాషాకవిత్వంలో అనేక నడకలు నడచినది.

నలము

సీసపద్యములో ఒకానొకటి – సర్వలఘుసీసము. ఈ సర్వలఘుసీసాన్ని కొంత ముచ్చటించుకోవాలి. సర్వలఘుసీసం (నలము – IIII, న గణము III) లతో ఏర్పడినది. నలము అంటే నాలుగు లఘువుల గణం. ( IIII ). భారతీయ భాషల్లో లఘువులు ఎక్కువగా ఉన్న భాషలు తెలుగు, కన్నడ భాషలు (అజంతములు). ఉత్తరభారతంలో హిందీ, హిందీతో సన్నిహితమైన భాషలు – స్వభావతః హలంత శబ్దాలతో కూడి ఉన్నందువలన ఆయా భాషలలో లఘువులతో కూడిన శబ్దముల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది.

తెలుగు భాష లో లఘువులతో కూడిన శబ్దాలు అనేకం ఉన్నందు వలన పద్యాలలో, ముఖ్యంగా దేశీ ఛందస్సులో ఉన్న పద్యాలలో – సర్వ లఘు సీసపద్యాలు, సర్వలఘు కందాలు, సర్వలఘు తేటగీతులు ఎడనెడ మనకు   కనిపిస్తాయి. పోతనామాత్యుని గజేంద్రమోక్ష ఘట్టంలోని “అడిగెదనని కడువడి జను..” అన్న పద్యం తెలుగున సుప్రసిద్ధమైనది. నలము లలో “రుసరుస, ఎడనెడ, గబగబ, భగభగ వంటి అనేకమైన ధ్వన్యనుకరణ శబ్దాలతో బాటూ, ప్రథమావిభక్తి, నామవాచకములైన – మదనుడు, తిరిపెము, అణకువ, కపిలుడు, అలజడి, భరతము, అలజడి, సరసము – ఇత్యాది అనేకమైన అందమైన శబ్దాలు గుర్తుకు వస్తాయి. అందుచేత సమర్థులైన కవులకు లఘువుల వినిమయంలో గొప్ప స్వేచ్ఛ చేకూరుతోంది.

పద్యకావ్యాలే కాక; ఆఖరుకు తెలుగు చలన చిత్రం సాహిత్యంలోనూ కూడా లఘువులతో కూడిన పాటలు కొన్ని అగుపిస్తాయి. వేటూరి సుందరరామమూర్తి వ్రాసిన ఒకానొక పాట చరణం యిది – “మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసె కలికి చిలుక; కసికసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవిని గనక” – అన్నీ లఘువులే.

సలము

నాలుగక్షరాల లఘువులతో కూడిన చతుర్మాత్రాగణమైన “నలము” (IIII) గణం మధ్యలో ఒక్క గురువును ప్రతిక్షేపిస్తే – ఏర్పడిన గణం “సలము” (IIUI). ఇట్లా సలముతో ఏర్పడిన శబ్దాలలో – (జలజాక్షి; అలివేణి; శితికంఠ; మదనారి; అనిరుద్ధ;పులకింత;గుణభద్ర, శివకామి ఇత్యాది;) చక్కని శబ్దాలు తెలుగు భాషలో కలవు. సలముతో ఏర్పడిన ఈ శబ్దాలలో ఒక విధమైన శ్రవణ సుభగత్వం అగుపిస్తుంది. ఈ లయ – గేయానికి గొప్పగా ఉపకరిస్తుంది. ఇలా ఐదు మాత్రల గణాలతో ఏర్పడిన గతిని ఛందస్సులో “ఖండగతి” అన్నారు. దీనికే “ద్విరదగతి” (ఏనుఁగు నడక) అని కూడా పేరు. ఇటువంటివి మూడు మాత్రల గణాలైతే త్రస్యగతి, నాలుగు మాత్రల గణాలైతే చతురస్రగతి. వీటితో ఏర్పడే వైతాళీయ జాతి పద్యాలను రగడలు అన్నారు.

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య అభేరి రాగంలో కూర్చి, ఆలాపించిన ఈ క్రింది కీర్తనను గమనించండి.

 

పల్లవి:

నగుమోము గనలేని నా జాలిఁ దెలిసి

నను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ || నగు మోము ||

అనుపల్లవి:

నగరాజ ధర ! నీదు పరివారు లెల్ల –

ఒగి బోధన జేసెడు వారలు కారె ? అటు లుండుదురే ? (||నగుమోము||)

చరణం:

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేదొ

గగనాని కిలకూ బహుదూరం బనినాడొ

జగమేలు పరమాత్మ

యెవరీతొ మొరలిడుదు

వగ జూపకుము తాళ; నన్నేలు కోరా

త్యాగరాజనుత;

పైని కీర్తనలో సలము (IIUI)లు, ఆ సలములతో ఏర్పడిన లయ స్ఫుటంగా, గమనించవచ్చు. (ఈ కృతి సంగీతప్రధానమైనప్పటికీ ఛందోలయ కు ఉదాహరణగా స్వీకరించటాన్ని సహృదయులు మన్నిస్తారని ఆశిస్తాను.)

పలునడకల సీసాన్ని, తిరిగి గేయసంవిధానంలో రూపొందించే ప్రక్రియ ప్రబంధకాలంలో మొదలైనది. ఈ సంవిధానం మొదలయినది నందితిమ్మనతో అయితే, ప్రాముఖ్యత సంతరించుకున్నది భట్టుమూర్తి కవితో. సీసపద్యంలో గేయసంవిధానానికి ప్రధానంగా ప్రబంధకవులు “సలము (IIUI) ” ను ఉపయోగించారు. మహాప్రతిభాశాలి, పండితుడు, అలఘు వ్యుత్పన్నుడు అయిన భట్టుమూర్తి తన వసుచరిత్ర కావ్యంలో పద్యాన్ని, పద్యం యొక్క శబ్దార్థాలను అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ, శ్లేష, వక్రోక్తి – ఇత్యాది శబ్దార్థ గుణాలను నిర్వహించటమే కాక, పద్యం ద్వారా గేయానికి కావలసిన లయను కూడా ఉద్యోతించాడు. వసుచరిత్రకు శిష్టా కృష్ణమూర్తి అనే మహానుభావుడు గొప్ప వ్యాఖ్యానాన్ని రచించటమే కాక, అనేక పద్యాలకు రాగాలను కూడా నిర్దేశించాడట. దురదృష్టవశాత్తూ ఆ వ్యాఖ్యానం కాలగర్భంలో కలిసిపోయినది.

సీసపద్యం లో మొత్తం 24 ఇంద్రగణాలు. అంటే 24 సలములకు   అవకాశం ఉంది. ఆపై తేటగీతిని ఎత్తుగీతిగా స్వీకరిస్తే, అందులో పాదానికి 2 చొప్పున – మొత్తం 8 ఇంద్రగణాలు సాధ్యం. 24 +8 వెరసి 32 ఇంద్రగణములు ఒక సీసపద్యంలో చేర్పగల అవకాశం ఉంది.

సీసపద్యంలో “సలము”లు

సీసపద్యంలోని ఖండగతి, సలము గణ ఆవర్తనము పురాణకవిత్వంలో క్వాచిత్కంగా ఉంది. శ్రీనాథుని శృంగారనైషధంలో ఓ సీస పద్యంలో అట్టి ఛాయ కొంతమేరకు కనిపిస్తుంది.

సీ||

రతిదేవి నెవ్వీఁగు రారాపుఁ జన్నులు గడకన్నులకు నింపు గడలుకొలుప:

గుడుసైన పూవింటఁ గూడి కమ్మని తూపు కటకాముఖపుఁగేలఁ గరము మెఱయఁ;

గటి మండలంబుపైఁ గనకంపుఁ జెఱఁగుల జిలుఁగుఁ బచ్చని పట్టుఁజేల మమర;

నాలీఢ పాద విన్యాసంబు శృంగార వీరాద్భుతములకు విందు సేయఁ….

పైని పద్యంలో సలము – గణ ఆవర్తం ఉంది కానీ, క్రమ పద్ధతిలో లేదు. పైగా చివరి పాదాన ఆ సౌష్ఠవం భంగమయింది. శ్రీనాథుని ప్రధానమైన ఉద్దేశ్యం – శ్రీహర్షుని సంస్కృతకావ్యాన్ని భావయుక్తంగా అనువదించటమే కానీ, పద్యాన్ని మెరుగుపెట్టటం కోసం శబ్దసౌష్ఠవాన్ని, సంగీతనాదాన్ని ఉద్యోతించటం కాదు. ఈ సీసపద్యంలో ఖండగతి – యాదృచ్ఛికంగా ఇలా అమరింది.

సీసపద్యంలో “సలము” గణముల ఆవృత్తితో ఒక సంగీత లయను నిర్మించటానికి అద్యుడు బహుశా నందితిమ్మన కవి. ఆయన కావ్యం పారిజాతాపహరణంలోని ఈ సీసపద్యాన్ని చూడండి.

సీ ||

మగమీల నగఁ జాలు తెగఁ గీలుకొను వాలుఁ గనుఁగవ కొక వింత కాంతి యొదవె

వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు చనుదోయి కొక వింత చాయ దోఁచె

నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము గలవేణి కొక వింత నలుపు మీఱె

నల చెందొవల విందు చెలువెందు వెదచిందు మొగమున కొక వింత జిగి దొలంకెఁ

గీ||

జక్కఁదనమున కొక వింత చక్కఁదనము జవ్వనంబున కొక వింత జవ్వనంబు

విభ్రమంబున కొక వింత విభ్రమంబు గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి. (1.56)

స్వర్గలోక పారిజాతం రుక్మిణీదేవి జడలో చేరగానే ఆమె సోయగము ఇలా పరిణమించిందని వర్ణన.

తాత్పర్యం: గండుచేపలను పరహసించే రుక్మిణి కళ్ళకి ఒక వింత కాంతి వచ్చి చేరింది. గుండ్రని చక్రవాక పక్షుల గొప్పలు (పెక్కువలు) లుప్తం చేసే ఆమె నిక్కిన చనుగవకి ఒక వింత నిగారింపు వచ్చింది. లేప్రాయపు తేనెటీగల గర్వాన్ని దూరంగా పారద్రోలే అందమైన ఆమె శిరోజాలకి ఒక అనూహ్య సౌందర్యం ఏర్పడింది. ఎర్ర కలువలకి పండుగ అయిన చెలికాడు – చంద్రుడు. చంద్రుని అందాన్ని అన్నివైపులకీ వ్యాపింప చేస్తుందా అన్నట్టు ఉండే ఆమె ముఖబింబానికి ఒక మెరుపు వచ్చి చేరింది. ఇలా ఆమె చక్కదనానికి మరింత చక్కదనము, యౌవనానికి ఒక విత యౌవనము; విలాసానికి మరొక విలాసము ఆ దివ్య కుసుమము వలన ఆమెకు కలిగినవి.

పైని పద్యంలో 26/32 సలములు ఉన్నవి. మధురకవి వ్రాసిన పద్యాల్లో ఒకానొక అందమైన పద్యం అది. అయితే సీసపద్యం మొదటి చివరి పాదాలలో 6 వ గణం (నలము) చతుర్మాత్రా గణం కావడంతో గేయం కాస్త నొక్కువడింది.   ఈ వ్యాసంలో మొదట పేర్కొన్న “లలనాజ నాపాంగ వలదావ సదనంగ..” అన్న పద్యాన్ని – నందితిమ్మన పద్యంతో పోల్చి చూస్తే, భట్టుమూర్తి – పద్యంలో ఖండగతిని ఎంత సులభంగా, హృద్యంగా నిర్వహించాడో తెలుస్తూంది.

అల్లసాని పెద్దన, కృష్ణరాయలవారు ఈ నాదంలో తక్కువ తినలేదు. ఈ క్రింది పద్యం, స్వారోచిష మనుసంభవంలోనూ, ఆముక్తమాల్యదలోనూ రెంటిలోనూ ఉంది. రెంటిలోనూ తేటగీతి మారింది.   శ్రీ మహావిష్ణువు మనోహరమైన ఆకారవిశేషాన్ని అపురూపంగా ఉద్యోతించిన ఈ వర్ణన చూడండి.

సీ.

నీల మేఘముడాలు డీలు సేయఁగఁ జాలు మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ

నరవిందములకచ్చు లడఁగించు జిగి హెచ్చు నాయతం బగు కన్నుదోయి తోడఁ

బులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు హొంబట్టుజిలుఁగు రెంటెంబుతోడ

నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడఁ

తే.

జయజయధ్వని మౌళి నంజలులు సేర్చు శర్వశతధృతి శతమన్యు శమన శరధి

పాలకైలబిలాది దేవాళి తోడ నెదుటఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు.

14/32.

తాత్పర్యం: కారుమేఘాలను తృణీకరించే నిగనిగలాడే నీలి శరీరము, తామర పూరేకుల గర్వమును అణగద్రొక్కే అందమైన నేత్రాలు, గరుత్మంతుని రెక్కల బంగరు కాంతిని వన్నెపెట్టు బంగారు జరీతో కూడిన నూత్నమైన పట్టువస్త్రములు, బాలార్క బింబమును మించిన కాంతులు గలిగిన కౌస్తుభమణి కలిగిన వక్షస్థలం, బ్రహ్మరుద్రయమవరుణ, ఇంద్రాదులతో సేవింపబడు శ్రీ మహావిష్ణువు స్వారోచిషునకు ప్రసన్నుడాయెను.

సీ.

నీల మేఘముడాలు డీలు సేయఁగఁ జాలు మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ

నరవిందములకచ్చు లడఁగించు జిగి హెచ్చు నాయతం బగు కన్నుదోయి తోడఁ

బులుఁగురాయనిచట్టుపలవన్నె నొరవెట్టు హొంబట్టుజిలుఁగు రెంటెంబుతోడ

నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడఁ

తే.

దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు లేము లుడిపెడు లేఁజూపు లేమతోడఁ

దొలఁకు దయఁ దెల్పు చిఱునవ్వుతోడఁ గలఁ దదంధ్ర జలజాక్షుఁ డిట్లని యాన తిచ్చె.

17/32 సలములు.

ఆంధ్రమహావిష్ణువు వర్ణన యిది.

తాత్పర్యం: కారుమేఘాలను తృణీకరించే నిగనిగలాడే నీలి శరీరము, తామర పూరేకుల గర్వమును అణగద్రొక్కే అందమైన నేత్రాలు, గరుత్మంతుని రెక్కల బంగరు కాంతిని వన్నెపెట్టు బంగారు జరీతో కూడిన నూత్నమైన పట్టువస్త్రములు, బాలార్క బింబమును మించిన కాంతులు గలిగిన కౌస్తుభమణి కలిగిన వక్షస్థలం, ఒకచేత కమలం, మరొక చేత లక్ష్మీదేవి కరము – ఈ లక్షణములతో కృపతో కూడిన చిరునవ్వుతో స్వామి దర్శనమిచ్చాడు.

పెద్దన, రాయల వారు పంచమాత్రల లయలను సమర్థంగానే నిర్వహించారు. అయితే “సలము”ల వినియోగం కొంత తక్కువ. “సలము” లెలా ఉన్నా, డాలు-జాలు;అచ్చు-హెచ్చు;చట్టు-వెట్టు;బింబంబు-డంబంబు – ఇలా ప్రాసాక్షరాలతో ఈ సీసపద్యం సోయగాలీనుతోంది.

పింగళి సూరన – ప్రభావతీప్రద్యుమ్నములో నాయిక వర్ణననూ – పైని పద్యపు నడకలో చిత్రించాడు.

సీ ||

నిబిడంపు జిగితోడ నిండుపూగుత్తులు, బిగువు పాలిండ్ల యొప్పిదము నెరప

నునుఁగెంపు గ్రక్కు నూతన పల్లవంబులు, కరతలంబుల సోయగంబుఁ దెలుప

నెలమిఁ బర్వెడునట్టి యెల దీఁగియల సొంపు, సుకుమార బాహు విస్ఫురణము జరుపఁ

గడుఁ బేరెములు వాఱు గండుతుమ్మెద చాలు, కడగంటిచూపుల బెడఁగు నడప

తే.గీ.||

విరుల తెలిడాలు చిఱునవ్వు సిరులఁ జిలుక, మధురసపు నిగ్గు లావణ్యమహిమ గులుక

నతని చూడ్కికిఁ జూడ నుద్యానభాగ, మంతయుఁ బ్రభావతీ మయం బగుచు దోఁచె.

తాత్పర్యం: ప్రద్యుమ్నుడు ఓ తోటలో విహరిస్తున్నాడు. ఆతనికి ప్రభావతీదేవియే గుర్తొస్తోంది.

ఆ తోటలో పూలగుత్తులు పయ్యెద విధముగా, లేత చివురులు చేతుల మాడ్కి, తీగలు భుజముల వలెను, గండుతుమ్మెదలు క్రేగంటి చూపుల కరణి, కుసుమముల ధవళ కాంతులు చిఱునవ్వుల మాదిరి, మకరందముల తీపి మేని యందము పొల్కి, తెలుపుచుండగా, ప్రభావతీదేవియే ఆ పూలతోట రూపములో ఉన్నట్టు ఆ తని దృష్టికి గోచరించినది.

ఇక్కడ – 16/32 సలములు.

వసుచరిత్రలో ఈ సలములను ప్రధానంగా సంగీతపు నాదానికి ఉపయోగించుకున్న పద్యాలు పదులలో కనిపిస్తాయి. అలాంటివి –

తెనుఁగు సాహిత్యాన ఒక అపురూపమైన పద్యం

వసుచరిత్రలో నాయిక గిరిక యొక్క వర్ణన యిది. వీలైతే గొంతెత్తి పైకి చదువుకోగలరు.

సీ||

మెఱుఁగొప్పు నెఱిగొప్పు నెఱగప్పు తఱిగప్పు (IIUI IIUI IIUI IIUI)

జలదమాలిక చొప్పు దెలుపలేదొ

బలువాలు గల నేలు తెలివాలు గనుడాలు (IIUI IIUI IIUI IIUI)

కలువపూదెర మేలు దెలుప లేదొ

నలువైన కళ లీనఁగల లేనగవు సోన (IIUI IIUI IIUI IIUI)

కలశాబ్ధి తెర మేన నిలుప లేదొ

కనకంపు ననసొంపు కడ నుంపు రుచిపెంపు (IIUI IIUI IIUI IIUI)

పసిఁడితీఁగల గుంపు మెసఁగ లేదొ

తే||

ప్రాణసఖులార నెయ్యంపుటలుకఁ బూని,

యేల యీ బాల యీ వేళ నీ విశాల

యవనికాభ్యంతరమ్మున కరిగె ననఁగ

ననుఁగు నెచ్చెలి మఱియు నెయ్యమున జేరి.

(3.69)

ఈ పద్యాన్ని గురించి, భావాన్ని గురించీ కూడా వివరంగా ముచ్చటించుకొనక తప్పదు.

22/32 – అంటే, 32 ఇంద్రగణాలకు గాను, 22 సలములు ఉన్న ఈ పద్యం – భట్టుమూర్తి సర్వతోముఖ ప్రతిభకు పరాకాష్ట. మెఱుఁగొప్పు నెఱిగొప్పు నెఱగప్పు తఱిగప్పు; కనకంపు ననసొంపు కడ నుంపు రుచిపెంపు; ఈ ప్రయోగాలతో గేయపు నడతను, లయను, మధురమైన నాదాన్నే కాకుండా, పద్యానికి సొబగైన శబ్దాంతప్రాస ఆవృత్తిని కూడా అద్భుతంగా కూర్చినాడు కవి. మూడవ పాదం తప్ప మిగిలిన ప్రతిపాదపు ఐదవగణంలో పంచమాత్రాగణమే కాక, “నగము” (IIIU) ను కూర్చాడాయన. ఈ ఎత్తుగడ మనోహరం. ఎత్తుగీతి లో “ఏల ఈవేళ ఈబాల ఈ విశాల..” అన్న చోట – లయ రోమాంచితం., అనుభవైకవేద్యం. ఈ పద్యం కేవలం శబ్దాలంకారాలకే కాదు; అద్భుతమైన భావానికి కూడా ఆటపట్టే.

టీక

మెఱుగొప్పు = కాంతులీను; నెఱి కొప్పు = గొప్పదైన అమ్మాయి సిగ కొప్పు; నెఱగప్పు = సంపూర్ణమైన నీలికాంతితో ; తఱి గప్పు = వర్షాకాలాన్ని ధిక్కరించు; జలదమాలిక చొప్పు = మేఘపంక్తి రీతిని; తెలుపలేదొ!

పలు = అనేకములైన; వాలుగలన్ = మత్స్యముల (వాలుగ అనగా ఒక విధమైన మత్స్యము.) ; ఏలు = జయించు; తెలి వాలు కనుడాలు = తెల్లని సోగ కన్నుల కాంతి; సోగకన్నుల చూపులు; కలువపూతెర మేలున్ = కలువపూల యొక్క తెరను మించినదన్నట్టు ; తెలుపలేదొ = పొందింపలేదా?

నలువైన కళలీనగల = ఒప్పిదమైన తళతళమను కాంతులు ప్రభవింపగల; లేనగవు సోన = అమ్మాయి మందహాసమనే చిరు వాన; కలశాబ్ధి తెరన్ = పాలకడలి తరంగాల తెరను; మేన నిలుపలేదొ = నా శరీరమున వ్యాపింపజెయ్యలేదా?

కనకంపు నన = (పసిడి కాంతుల) మొగలి పువ్వు యొక్క; సొంపు = సొబగు; కడనుంపు = తృణీకరించు (చివర్న నిలుపు); రుచి పెంపు = శరీరలావణ్యాతిశయము; పసిడితీగల గుంపున్ = బాంగారు పోగుల బారును; మెసగలేదొ = కలుగజెయ్యలేదా?

ప్రాణ సఖులార! నెయ్యంపుటలుకన్ పూని = ప్రణయకలహంతో; ఏల ఈ బాల ఈ వేళ; ఈ యవనికాభ్యంతరమ్మున = ఈ తెరచాటుకు; అరిగెన్ = వెళ్ళెను? అనగా = అని చెప్పగా; అనుంగు నెచ్చెలి = ప్రియసఖి; నెయ్యమున చేరి = స్నేహంగా ఆమెవద్దకు చేరి; (పై పద్యంతో అన్వయం)

వసురాజు – గిరికాదేవిని చూడగానే ఆ అమ్మాయి సిగ్గుచేత తెరచాటుకు వెళ్ళినది. ఆ సందర్భాన ఆతడు (చిఱునగవుతో) పరోక్షంగా ఆమెను ఉద్దేశించి అంటున్నాడు.

తాత్పర్యం: ” గిరికాదేవి ప్రాణసఖులారా! ప్రణయకలహాన్ని తెచ్చిపెట్టుకుని ఈ బాలిక, ఈ వేళ ఆ విశాలమైన తెరచాటుకు వెళుతోంది. ఆ అమ్మాయికి ఆ తెరచాటు ఎందుకూ?

ఆ అమ్మాయి జడ కొప్పు యొక్క నీలికాంతి కాలమేఘము క్రమ్మినటుల క్రమ్మి, తనను (ఎలానూ) కనపడకుండ చేస్తోంది కదా. ఆ చిన్నదాని సోగకన్నుల తెల్లని కాంతి, మీల సోయగాన్ని ధిక్కరిస్తూ, కలువపూలతెరను మరిపిస్తోందిగా. తళతళమను కాంతులీనే సుదతి మందహాసం, పాలకడలి అలలను నా శరీరాన వ్యాపింపజేయలేదా? మొగలిపూల సొబగును పరిహసించే ఆమె శరీరలావణ్యం అనేకమైన బంగారుపోగులను కళ్ళముందు నిలుపలేదా?” (మరి చాటెందుకు?) “

– అలా రాజు అడుగగానే, గిరిక సఖి ఆమె వద్దకు స్నేహంతో చేరింది. (పై పద్యంతో అన్వయం)

సుదతి సోగచూపులు, మందహాసం – ధవళకాంతులు; బిబ్బోకవతి కురులవి – నీలికాంతులు;   లావణ్యవతి లావణ్యం – పసిడికాంతుల మయం. మూడవ పాదంలో భావం – ఆ సుదతి మందహాసం పాలసముద్రపు అలల తరగల వలె ఆతని మేనిని కమ్మేస్తున్నదట. ఏమి అపురూపమైన భావసౌందర్యం! “మెఱుఁగొప్పు నెఱిగొప్పు నెఱగప్పు తఱిగప్పు…” –

(సరిగ్గా ఇదే భావాన్ని చేమకూర వేంకట కవి ఉపయోగించాడు. ఆయన కూడా తేటతెనుగునే వాడాడు. సుభద్ర వర్ణనలో భాగమైన ఆ పద్యం –

ఆ.వె.

నువ్వుఁ బువ్వు నవ్వు జవ్వని నాసిక, చివురు సవురు జవురు నువిదమోవి,

మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి, మెఱపు నొఱపుఁ బఱపుఁ దెఱవ మేను.

మూడవ పాదం – మబ్బు నుబ్బు గెబ్బు బిబ్బోకవతి వేణి – ఇది గిరిక అంశ.)

సీసపద్యపు పాదాంతాన తెలుపలేదొ; నిలుపలేదొ; మెసగలేదొ; లేదొ ఆ చివరన హ్రస్వం – వసురాజు మనసులో మెదలు చిఱునవ్వును, కొంటెతనాన్ని ఉద్యోతిస్తోంది. ఈ పద్యం – వరసైన యువకుడు, సొగసైన భామ (సౌందర్యాన్ని) ను చూచిన అబ్బురపాటు, ఆనందం, ఆమెతో పరిచయం పెంచుకోవలెనన్న ఆత్రుత, అనురక్తి, కొంచెం హాస్యం, అన్నిటి మేళవింపు. శ్లేష, ఉపమ, అపురూపమైన నాదం ఇవన్నీ పద్యపు నడతలో కనిపిస్తున్నాయి.

ఎత్తుగీతిలో “ఏల ఈ బాల ఈ వేళ” – ఈ భాగం చదువుకునే వరుసలో ’నాదం’ అనుభవైకవేద్యం. దాదాపు అచ్చతెనుగులో సాగిన ఈ పద్యం చివరన మాత్రం అమ్మాయి “యవనికాభ్యంతరమ్ము” న కెందుకు వెళుతోందని ప్రశ్నిస్తున్నాడు. యవనికాభ్యంతరమ్ము = సంస్కృత సమాసం! (అలతి అలతి పదాల తెనుగును వదలి సమాసభూయిష్టమైన సంస్కృతానికి!) ఇదేదో పద్యగతిలో యాదృచ్ఛికంగా కవికి అమరిన పూరణ కాదు. సాభిప్రాయమై ఉండవలె; భట్టుమూర్తి ఇటువంటి చమత్కారాలను కావ్యం నిండా రాశులుగా పోసాడని విమర్శకులన్నారు. సీసపద్యపు నాలుగు పాదాలలో ఉపమాలంకారం వాచ్యం, అపహ్నవం వ్యంగ్యం. దరిమిలా ఈ పద్యం మనోహరమైన అలంకారధ్వనికి నిదర్శనం కూడా.

ఈ పద్యం “సమాధి” అన్న అర్థగుణానికి ఉదాహరణగా శేషాద్రి రమణకవులు తమ వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. “అవర్ణిత పూర్వోయమర్థః; పూర్వవర్ణితచ్ఛాయః ఇవ ఇతి కవేరాలోచనం సమాధిః ” అని రసగంగాధరం. అంటే వర్ణన – అదివరకు పూర్వం లేదు, కానీ పూర్వవర్ణన యొక్క నీడ ప్రస్తుతం అగుపిస్తున్నది. ఇలా ఆలోచించటాన్ని “సమాధి” అంటారు. నిజమే; గిరికాదేవి ని ఎంతో హృద్యంగా అదివరకే నఖశిఖపర్యంత వర్ణించాడు కవి. కానీ ఈ పద్యంలో వర్ణన – ఇతః పూర్వం వర్ణనలకు భిన్నంగా, నవనవోన్మేషంగా ఉంది. అయితే ఆమె సౌందర్యమే ప్రస్తావనాంశం. అందుచేత “సమాధి” గుణం.

ఈ ఒక్క పద్యానికే అనేక పేజీల విస్తృత వ్యాఖ్యానం చేయవచ్చు. తెనుగు సాహిత్యంలో అపురూపమైన సీసపద్యాలలో ఇది ఒకటి.

పరిశిష్టము

ఈ వ్యాసం మొదటే మనం “లలనా జనాపాంగ..” అన్న సీసపద్యం గురించి చెప్పుకున్నాం. భట్టుమూర్తికి సమకాలికుడైన సురభిమాధవరాయల వారి కావ్యం ’చంద్రికా పరిణయ’ కావ్యంలో ఆ పద్యానికి సమాంతరమైన వసంత వర్ణన ఉంది.

సీ||

సుమనోగ సమచూత సుమనోగణపరీత సుమనోగణిత సారశోభితాళి

కలనాద సంతాన కలనాదసమనూన కలనా దలితమాన బలవియోగి

లతికాంతరిత రాగలతికాంత సపరాగ లతికాంత పరియోగ లక్ష్యకాళి

కమలాలయాస్తోక కమలాలయదనేక కమలాలసిత పాక కలితకోకి

తే||

జాలక వితానక వితానపాళిభూత చారు హరిజాత హరిజాత తోరణోల్ల

సద్వ్రతతికా వ్రతతిగా వ్రజ క్షయాతి భాసురము పొల్చె వాసంతవాసరంబు. (4.25)

ఇందులో 27/32 సలములు ఉన్నాయి. భట్టుమూర్తి పద్యం, లేదా పైని పద్యం – రెండింట ఏదో ఒకటి మరొకదానికి ప్రేరణగా తెలిసిపోతూనే ఉన్నది.

వసుచరిత్రలో కోలాహలపర్వతవర్ణన – ఈ క్రింది పద్యం చూడండి.

సీ||

ఒకచాయ ననపాయ పికగేయ సముదాయ మొకసీమ నానామయూర నినద

మొకవంక నకలంక మకరాంక హయహేష లొక క్రేవ వనదేవ యువతి గీత;

మొకచెంత సురకాంతల కరాంత తతనాద మొకదారి నవశారి కోదితంబు;

లొకయోరఁ బటుచార కుమార ఫణితంబు లొకదండ నలిమండ లికలగాన

తే||

మొక్క మొగి మ్రోయఁ గదళీగృహోపపన్న కిన్నరీ బృంద సంగీత గీత రీతి

నమరు నతివేల కోలాహలముల కలిమి నధిప ఈ యద్రి కోలాహలాఖ్యమొక్కొ. (1.7)

తాత్పర్యము: ఈ పర్వతమునందు ఎడతెగని కోకిలపాటలు, నెమళ్ళ క్రేమ్కారవములు, చిలుకపలుకులు, వనదేవతాగానములు, వేల్పుచెలువుల వీణాగానములు, గోర్వంకల నుడుపులు, చారణయువకుల సల్లాపములు, తుమ్మెదల ఝంకారములు కలసి మెలసి మ్రోయ కిన్నరీబృందగీతరవమందు లీనమై కోలాహలముగా ఉండుటచేత కాబోలు కోలాహలము అని పిలువబడుచున్నది!

(24/32 సలములు)

ఇంకా ఇదే రీతిలో –

“తలిరు బ్రాయము వాని వలరాజు నలరాజు నలరాజుఁ దెగడుసోయగము వానిఁ…” (3.46)

“కాఁబోలు నివి బాల కమనీయపదలీల లిచటఁ బల్లవజాల లినుమడించె..” (3.80)

పెనుగట్టు గోటమీటినమేటి కిపుడెంత యరుదయ్యెఁ గన్యాకుచాద్రి గరిమ…” (3.99)

పవమాన మానవ ప్లవమాన కైరవ చ్యవమాన రజము మై నంటఁ దివురుఁ…” (3.117) –

“వలుద గుబ్బలు ప్రసేవక వృత్తి దగు గుబ్బ కాయల నపరంజి చాయలొసగ..”

ఇత్యాది అనేకములు;

సీసపద్యాన్ని రసప్రవిష్టం చేయడంతో బాటు, శబ్దగుణాలతో, ధారాశుద్ధితో, శ్లేష, ధ్వని ఇత్యాది అర్థగుణాలతో పరిపుష్టం చెయ్యడమే కాక, సీసపద్యానికి మూలమైన గేయము/పాట/గీతము లకు సీసాన్ని తిరిగి చేర్చే అర్థవంతమైన, ఫలవంతమైన ప్రయోగాన్ని భట్టుమూర్తి ఓ లక్ష్యంగా నిర్వహించినాడు. ఈ వ్యాసం సీసపద్యానికి పరిమితమైనా, వసుచరిత్ర (ఇతర ప్రబంధకృతులు కూడాను) లో ఇతర పద్యాలు కూడా సంగీతస్పర్శకలిగినవి కోకొల్లలుగా ఉన్నాయి.

ఆంధ్రుల దురదృష్టం కాబోలును, వసుచరిత్ర సాహిత్య సౌరభాలు నేటికి నిలిచి ఉన్నా, సంగీత సాంప్రదాయాలు ఆధునిక కాలానికి పూర్తిగా లుప్తం అయిపోయినాయి. కాలమహిమ. అంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here