ప్రాచీన వృక్షం పోక చెట్టు

0
11

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘ప్రాచీన వృక్షం పోక చెట్టు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]కు, వక్క అరటి పండు పెడితే తాంబూలం అవుతుంది. ఆకు, వక్క, సున్నం కలిపితే కిళ్ళీ అవుతుంది. ఆకు, వక్కలు ప్రతి పూజ లోనూ ప్రధాన దినుసుగా వాడుతారు. చాలా మంది అన్నం అన్న తర్వాత వక్క పలుకుల్ని నములుతూ ఉంటారు. ఇలా మానవుల జీవితంలో అత్యధిక ప్రాధాన్యాన్ని ఏర్పరచుకున్న వక్క చెట్ల గురించి తెలుసుకుందాం.

అరికేసి కుటుంబానికి చెందిన ఈ పోక చెట్టు చూడటానికి కొబ్బరి చెట్టులా ఉంటుంది. కాకపోతే కొబ్బరి చెట్టంత ఎత్తుగా పెరగదు. ఈ చెట్టుకు కూడా పూత, కాయలు గుత్తులుగా కొబ్బరి కాయల్లానే కాస్తాయి. కొబ్బరికాయలు పెద్ద పెద్ద బోండాలుగా మారితే ఇవి చిన్న చిన్నపండ్లుగా కాస్తాయి. పండిన వక్క కాయలు పసుపు రంగులో ఉండి ఖర్జూర పండ్లు ఆకారాన్ని కలిగి ఉంటాయి. చెట్టు ఆకులు, మట్టలు అచ్చం కొబ్బరి చెట్టునే తలపిస్తాయి. కాండం మాత్రం వక్క చెట్టుకు సన్నగా ఉంటుంది. నున్నగా ఉంటుంది. చెట్టు కాండం లావుగా బిరుసుగా ఉంటుంది.

వక్కల చెట్టు యొక్క శాస్త్రీయ నామం ‘అరెకా కాలేడు’ అంటారు. వక్కల చెట్టును పోక చెట్టు, క్రముకము పూగము, ఖపురము అని కూడా పిలుస్తారు. నేను ఈ చెట్లను ఎక్కువగా కేరళ రాష్ట్రంలో చూశాను. దీనిని ‘పాక్ చెట్టు’ అంటారని తెలిసింది. దీనిని ఇంగ్లీషులో ‘బీటిల్ పామ్’ అనీ, ‘అరెకా పామ్’ అనీ, ‘అరెకానట్ పామ్’ అనీ రకరకాల పేర్లతో పిలుస్తారు. వక్కను కన్నడ బాషలో ‘అడికె’ అనీ, తమిళంలో ‘పాకె’ అనీ అంటారు. వక్కను కిళ్ళీలు, పాన్‌, తాంబూలాలలో ప్రధానంగా ఉపయోగిస్తారు. అలాగే దైవ సంబంధ కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, పూజలలో ప్రధానంగా ఉపయోగించే పూజా ద్రవ్యం.

ఈ చెట్టు ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి పొడవైన ఆకులను మట్టలు అంటారు. ఈ మట్టలు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల పొడవు ఉంటాయి. ఒక్కొక్క మట్టకు రెండువైపులా సన్నని రిబ్బన్ల వంటి పొడవైన ఆకులు ఉంటాయి. ఆకులు, మట్టలు పూర్తిగా కొబ్బరి చెట్టును పోలి ఉంటాయి. పుష్పవిన్యాసం కూడా కొబ్బరి చెట్టు వలె పటుంది. పుష్పగుచ్ఛంలో స్త్రీ, పురుష పుష్పాలు రెండూ ఉంటాయి. ఈ చెట్లను వాణిజ్య పంటగా పెంచుతారు. ప్రతి శాఖకు పై బాగాన కొన్ని ఆడ పుష్పాలు అడుగు బాగాన మగ పుష్పాలు పుడతాయి. ఈ పువ్వులు మీగడ తెలుపు రంగులో ఉండి సువాసనలను వెదజల్లుతుంటాయి. ఆడ పుష్పాలు ఒకటిన్నర రెండు సెంటీమీటర్ల పొడవుతో ఆరు చిన్నచిన్న కేసరాలు, త్రిభుజాకార కీలాగ్రం, మూడు గదుల అండాశయంతో ఉంటాయి. మగ పుష్పాలు కూడా ఆరు కేసరాలుతో, బాణం తల ఆకారం గల పరాగ కోశాలను కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలాలు అండాకారంలో ఉండి పీచును కలిగి ఉంటాయి. పక్వానికి వచ్చిన పండు పసుపు రంగులో కానీ ఇంకా పండితే నారింజ లేదా ఎరుపు వర్ణానికి మారతాయి. దీనిలోపల వక్క విత్తనం ఉంటుంది ఇది గుండ్రంగా ఉంటుంది. దీనిని ఎండ బెట్టి పగలగొట్టినపుడు మనం చూసే వక్కలు తయారు అవుతాయి. లేదా కొంతమంది పచ్చి వక్కల్ని కూడా కిళ్ళీలలో పూజల్లో వాడుతూ ఉంటారు. నేను వక్క పుష్పాలను, పండ్లను కేరళ నుంచి కోసుకొచ్చి అనేక పుష్పాలంకరణల్లో వాడాను. ఒక్క పుష్పగుచ్ఛంలో దాదాపు 200 కాయలు తయారవుతాయి.

ఈ చెట్లు ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతాయి. పసిఫిక్, ఆసియా, తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో పెరుగుతుంది. ఫిలిప్పీన్స్‌లో తొలిగా ఉద్భవించిందని చెప్పినప్పటికీ ఇండియా, బంగ్లాదేశ్, తైవాన్, సౌత్ చైనా, శ్రీలంక వంటి దేశాలలో వాణిజ్య పంట కాలం సాగు చేస్తున్నారు. అరేకా కాటేచులో అనేక జాతులు ఉన్నాయి. ‘అరేకా హిమాలయాగ్రిఫ్’, ‘అరేకా పాఫెల్ గేర్న్ట్’ వక్కలను నమిలినపుడు కొద్దిగా మత్తు వస్తుంది. అందుకే ఇది వ్యసనంగా మారుతుంది. విత్తనంలో అరెకైడిన్, అరెకోలిన్ అనేటువంటి ఆల్కరాయిడ్లు ఉంటాయి. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా ఇండియా, తైవాన్‍లో అరేకా పామ్ లను వక్కల విత్తనాల కోసమై పంటలు పండిస్తారు. కొబ్బరి గెలల్లాగానే వక్క విత్తనాల గెలలు కూడా వేస్తాయి. ఈ విత్తనాలలో ‘అరేకాటానిన్లు’ అనే ఘనీభవించిన టానిన్లు కూడా ఉంటాయి. ఇవి కాన్సర్ ను కలగజేసే కారకాలు. అరేకా గింజల్ని నమలడం వల్ల నోటి కాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. నోట్లో ‘సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్’ కు ఈ గింజలు నమలడమే కారణం. భారతదేశంలో పొడిగా ఉన్న లేక రాలిపోయిన ఆకులతో అన్నం తినే ప్లేట్లు తయారు చేస్తున్నారు. వీటిని పామ్ లీఫ్ ప్లేట్లు అంటారు.

ప్రపంచవ్యాప్తంగా అరేకా గింజల్నీ అంటే వక్కల్ని ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం అధిక శాతాన్ని కలిగి ఉన్నది. 2017వ సంవత్సరంలో భారతదేశం 54.7% వక్కల్ని ఉత్పత్తి చేసి ప్రపంచం లోని మిగతా దేశాలకు ఎగుమతి చేసింది. కేరళ, కర్ణాటక, అస్సాం మూడు రాష్ట్రాలూ కలిపి భారతదేశంలో 88.59% శాతం వక్కల్ని ఉత్పత్తి చేశాయి. ప్రాచీన భారతీయ నాగరికతలో పూర్వ వేద కాలాల నుండి వక్కలని తాంబూలంలో కలిపి సేవించినట్లుగా చెప్పబడింది. హిందూ మతంలో పుట్టుక, పెళ్ళి చావు దేనికైనా వక్కలను వాడాల్సిందే. ఇంటికి వచ్చిన వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చే విషయం లోనూ రెండు తమలపాకులు, వక్క, పండు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే.

ఈ చెట్లు ఇసుక నేలల్లో ఎక్కువగా పండుతాయి. నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చాక ఇవి పుష్పించడం మొదలుపెడతాయి. ఇవి 60 సంవత్సరాల వరకూ జీవిస్తాయి. కొన్నిసార్లు 100 సం॥ల చెట్లను కూడా చూస్తాము. వీటికి సాధారణంగా బడ్ రాట్, ఫ్రూట్ రాట్, పసుపు ఆకుల వ్యాధులు వంటివి వస్తాయి. అవసరమైన మందులను చల్లటం ద్వారా వ్యాధులను నివారించవచ్చును. వక్క చెట్లు ఆకులతో ప్లైవుడ్, గిన్నెలు, టోపీలు, కళాకృతులు తయారు చేస్తారు. పామ్ వైన్ కూడా తయారుచేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here