ప్రాడో

21
6

[dropcap]కు[/dropcap]క్కని పెంచుకుని ఎవరైనా సుఖపడ్డారేమో నాకు తెలియదు కానీ, నేనైతే నరకయాతన పడ్డాను.

కుక్కను పెంచుకోవాలి అన్నది ఎందుకో చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. కానీ ఇంట్లో సానుకూలంగా స్పందించే వారు కాదు.

నా చిన్నతనంలో మా అమ్మ నొప్పింకక తానొవ్వక అన్న విధంగా ‘కుక్క వద్దు’ అని నన్నుఎప్పటికప్పుడు ఎలాగో ఒప్పించేది.

ఆవిడ ప్రధాన ఆయుధం ఏమిటీ అంటే నాన్నగారికి ప్రతి సంవత్సరం ట్రాన్స్పర్స్ అవుతాయి కద, ఊరు మారితే నీరు మారితే కుక్క బ్రతకదు, మనకు పాపం వస్తుంది అని. గుడ్డిగా ఆమె మాటలు నమ్మేసే వాడిని. ఇప్పటికీ నమ్ముతున్నాను, ఊరు మారితే కుక్క బ్రతకదని.

నాన్న రిటైర్ అయ్యాక పెంచుకుందాములే అనేది. సరే ఏమి చేద్దాం, ఇంటి దగ్గర చుట్టు ప్రక్కల వుండే వీధి కుక్కలకే ఆహారం వేసి వాటినే పెంచుకుంటున్నట్టు ఫీలయ్యేవాడిని. అలా నా బాల్యం గడిచిపోయింది.

ఆ తర్వాత వంతు మా అవిడ తీసుకుంది. “మనం స్వంత ఇల్లు కొన్నాక తప్పక కుక్క ను పెంచుకుందాం అండి” అని నన్ను ఊరడించేది.

సరే స్వంత ఇల్లు, కారు, ఇద్దరు పిల్లలు ఇలా ఒక ఇంటికి కావాల్సిన హంగులు అన్నీ వచ్చాయి. కాని నేను జీవన సమరంలో పడిపోయి ఈ కుక్క స్వప్నాన్ని మరచి పొయాను.

‘నీవు బలంగా కల కంటే విశ్వంలో శక్తులన్ని కుమ్మక్కయి నీ కలను నెరవేరుస్తాయని’ ‘ది ఆల్కెమిస్ట్’ లో పౌలో ఖుయిలో చెప్పారు కద. సరిగ్గా ఇలాగే జరిగింది నా కుక్క స్వప్నం విషయంలో.

స్వంత ఇంటి గృహ ప్రవేశం ముహూర్తం నిర్ణయం అయ్యాక పూజా సామాగ్రి, ఇతర సరుకులు, వంట వాడిని ఎవర్ని మాట్లాదాం, పూజాదికాలకి ఏ పండితుడిని పిలుద్దాం అని కద ఎవరయినా ఆలోచిస్తారు.

కాని మా ఇంట్లో కాస్తా విచిత్రమయిన తంతు నడిచింది.

మా పిల్లలు అప్పటికి హైస్కూలు చదువులు చదువుతూ ఉండినారు. మా ఆవిడ మాటల్ని వాళ్ళు ఎప్పటినుంచో గుర్తుంచుకున్నారులా ఉంది. స్వంత ఇల్లు అన్న మాట వినిపించే సరికి ‘అయితే కుక్కని తెచ్చుకుందాం మొదట’ అని గట్టిగా గోల మొదలెట్టారు.

పాల ప్యాకెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలను, కూరగాయలు ఎక్కడ అమ్ముతారో చెప్పగలను, కార్లు ఎక్కడ అమ్ముతారో చెప్పగలను ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కో దగ్గర దొరుకుతుంది అని మనకు ఇదమిత్థంగా తెలుసు. కానీ ఈ కుక్కలు ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు కద.

సరే నా చిన్నప్పటి పద్ధతి ప్రకారం ఏదయినా వీధిలో దొరికే కుక్క పిల్లకి మెడలో ఒక పురికోస తాడు కట్టి పెంచేసుకుందాం చక్కగా అని ఒక బ్రహ్మాండమయిన అయిడియా కూడా ఇచ్చేశాను. అక్కడితో సమస్య తీరిపోయింది అని భావించాను. కానీ అలా అయ్యుంటే ఇంత కథేం ఉంది?

మా పిల్లలు ససేమిరా అన్నారు, మంచి జాతి కుక్కనే ఏదయినా ప్రొఫెషన్ కెన్నెల్స్ లో తెచ్చుకుందాము అని వారు డిమాండ్ చేశారు.

అవును సుమా కుక్కల్ని పోషించే ప్రదేశాన్ని కెన్నెల్ అంటారని చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తొచ్చాయి. అయిడియా అయితే ఇచ్చారు కానీ, వారు చిన్న పిల్లలు కద, ఇక నేనే పూనుకోవాల్సి వచ్చింది.. ఒకట్రెండు కెన్నెల్స్ ఫొన్ నెంబర్లు నెట్‌లో చూసి నోట్ చేసుకుని ఫోన్లు చేయటం ప్రారంభించాను.

వారి వ్యవహారం అంతా హై క్లాసుగా వుంది. మొదట ఒకటి నొక్కండి, రెండు నొక్కండి, ఆ తర్వాత పీక నొక్కండి వంటి ఫార్మాలిటిస్ అన్నీ పూర్తయ్యాక, ఒక రిసెప్షనిస్ట్ లాంటి అమ్మయి ఫోన్ ఎత్తి స్టయిల్‍గా, మీకు ఏ బ్రీడ్‌కి సంబంధించిన విభాగానికి కనెక్ట్ చేయమంటారు అని అడిగింది. అమ్మో ఇదేదో కొత్త సమస్య వచ్చి పడిందే అని అనుకున్నాను.

ఏ కెన్నెల్ కి ఫోన్ చేసినా, అవతలి నుండి మీకు ‘ఏ బ్రీడ్ కావాలి’ అని ఒక ప్రశ్న సంధించేవారు తొలుత.

ఇంచుమించు మనకు కావాల్సిన బ్రాంచి మనసులో సెలక్ట్ చేసుకున్న పిమ్మట ఇంజినీరింగ్ కాలేజి కౌన్సెలింగ్‌కి వెళ్ళినట్టు, ఈ బ్రీడ్ ఏమిటో తెలియజేస్తే కానీ వారు మనకు ఏ విధమైన సహాయం అందించలేమని స్పష్టాతి స్పష్టంగా చెప్పారు.

ఈ పరంపరలో ఒక దయామయురాలు, మీ పర్పస్ ఏమిటో చెప్పండి మీకు బ్రీడ్ సెలక్ట్ చేసుకోవటంలో సాయ పడతాను అని ఆపన్న హస్తం అందించింది.

“కుక్కతో పర్పస్ ఏమిటండీ నాన్సెన్స్” అని అనబోయి తమాయించుకున్నాను.

అప్పుడు ఆవిడనే తిరిగి తెలుగులో చెప్పింది, నాకు ఇంగ్లీష్ రాదని అనుమానపడిపోయి, “కుక్కతో మీకు ఏ అవసరం ఉంది?” అని టిక్కు టిక్కు మంటూ తెలుగులో అడిగింది. ‘

హతవిధి కుక్కతో నాకేమి అవసరం ఉంటుంది తల్లీ’ అని అనుకుని ఏమీ మాట్లాడాకుండా ఉండి పోయాను కాసేపు. అప్పుడు ఆ అమ్మాయే తిరిగి చెప్ప సాగింది.

“ఊరి బయట ఫార్మ్ హవుస్ లాంటి వాటి కాపలాకా, ఇంట్లో దొంగలు పడి దోచుకోకుండా కాపలాకా, మీరు వేటకు వెళుతుంటే మీకు సాయానికా ( ఈమె నా మొహం చూడలేదనుకుంటా, నా మొహానికి వేట ఒక్కటే తక్కువ), సరదాగా ఆడుకోవటానికి బొచ్చు కుక్కా ఇలా ఆవిడ అందించిన జ్ఞానం ఎన్‌సైక్లోపిడియాతో సరిపోల్చవచ్చు.

టమోటాలలో నాటు టమోటా, హైబ్రీడ్ టమోట అని వెరైటీలు ఉన్నట్టు ఈ కుక్కలలో కూడా వివిధ జాతులు ఉంటాయి, పైగా ఒక్కొక్క జాతి ఒక్కొక్క పనికి ఉపయోగపడతాయి అన్న ప్రాథమిక జ్ఞానం కలిగింది నాకు . ‘కారణ జన్ములు’ అన్న పదం కుక్కలలొ ఇలా వాడుకోవచ్చన్నమాట.

‘ఓకే అయ్ విల్ గెట్ బాక్ టు యూ’ అని వారికి ఆంగ్లంలోనే సమధానం చెప్పి పిల్లల వంక తిరిగి మనం ఏ బ్రీడ్ తీసుకుందాం అని ఒక కఠినమైన ప్రశ్నని సంధించిన వాడిలా ముఖం పెట్టి అడిగాను.

డాల్మేషన్

జెర్మన్ షెపర్డ్

హవుండ్

లాబ్రడార్

బీగిల్

బ్లడ్ హవుండ్

గోల్డన్ రిట్రయివర్

పాయింటర్

డాషుండ్

పామేరియన్

ఇలా అనేక పేర్లు వల్లె వేశారు పిల్లలు. నాకు మిడిగుడ్లు పడ్డాయి. వీళ్ళు చాలానే అధ్యయనం చేశారన్న మాట ఈ విషయంలో. మరి టెక్స్ట్ బుక్స్ కూడా ఈ స్థాయిలో చదువుతున్నారో లేదో.

చివరికి ఒక్కో కుక్క గురించి మళ్ళీ ఇంటర్‌నెట్‍౬లో క్షుణ్ణంగా అధ్యయనం చేశాము. ఆ ఫోటోలు అవీ కూడా చూశాము.

మా అవిడ పామెరియన్‌కి ఓటు వేసింది. మా అమ్మాయి కూడా అదే కావాలంది.

మా వాడు ”ఛీ, ఛీ అవి ఆడపిల్లలు పెంచుకునే కుక్కలు, నాకు హంటింగ్ డాగ్స్, అందునా భారీ భయంకరమయిన డాగ్స్ కావాలి” అని ఆర్మీ ఆఫీసర్ రేంజిలో అడిగాడు.

చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సిద్ధాంతం అమలు చేస్తూ, మా శ్రీమతి వాకౌట్ చేస్తూ ఏక వాక్య తీర్మానం చేసింది ‘అలాంటి భయంకరమైన కుక్కలు ఇంట్లో కి తెస్తే తాను పుట్టింటికి వెళ్ళిపోతా’నని.

మళ్ళీ అన్ని పక్షాలని ఏక త్రాటి మీదకు తెచ్చి, మా ఆఫీస్‌లో గోడకు ఉన్న నిలువెత్తు ఫోటొ ఫ్రేంలో వ్రాసి ఉన్న మోటివేషనల్ కొటేషన్ ‘ఎ డయలాగ్ కన్ సాల్వ్ ఎవ్వ్రీ ప్రాబ్లెం’ అన్న వాక్యం గుర్తు తెచ్చుకుని, నువ్వే అలా అలిగితే ఎలా అని తనను బుజ్జగింఛి అందర్నీ ఒప్పించే ప్రయత్నాలు మొదలెట్టాను. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన తరువాత, చివరికి రెండు కుక్కల జాతులు చివరి వరుసలో నిలిచాయి సెలక్షన్ కమిటీ ముందు (అంటే మా ఆవిడన్న మాట).

మా చిన్నప్పుడు ఆల్సేషన్ డాగ్ అనే వారం, దాన్ని ఇప్పుడు జెర్మన్ షెప్పర్డ్ అనాలట ఇది ఒకటి, రెండోది లాబ్రడార్.

మా సెలక్షన్ కమిటీ వారు జెర్మన్ షెప్పర్డ్ కు ఉన్న క్రూరమైన రూపురేఖల కారణంగా దానిని వీటో అధికారంతో రద్దు చేశారు. చివరికి మిగిలింది ‘లాబ్రడార్’. ఇది చూడ్డానికి గంభీరంగా, రాజసంగా బాగా ఉంటుంది, స్నేహ గుణం ఎక్కువ, మనుషులకి హాని చేయదు, కాని కుక్కల గురించి తెలియని వారికి దానిని చూస్తే భయం కలుగుతుంది, కానీ అది చాలా స్నేహ గుణం గల శునకం అని తెలిసాకా దాన్ని ఇష్టపడతారు.

పెళ్ళికి ముందు ఆడవారు భర్తలో కూడా ఇలాంటి లక్షణాలే చూస్తారేమో అని మనసులోనే అనుకున్నాను, ఇప్పటి దాకా తనతో చెప్పలేదు.

లాబ్రడార్ జాతికి చెందిన ఈ శునకాన్ని,ముఖ్యంగా దానికి ఉన్న ఘ్రాణ శక్తి కారణంగా పోలీసు డిపార్ట్మ్ంట్ వారు ఎక్కువ కొంటారట.

ఇక ఆ రోజు నుంచి లాబ్రడార్‌కు సంబంధించి ఇంటర్‌నెట్‌లో తీవ్ర అధ్యయనం చేయటం ప్రారంభం చేశాము. తవ్వేకోద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

ఇదిలా ఉండగా మా వెనుక వీధిలో ఒక ఆంటీ గారికి కుక్కల గురించి అందునా లాబ్రడార్ బ్రీడ్ గురించి క్షుణ్ణంగా తెలుసు అన్న విషయం మాకు తెల్సి, ఆవిడని కలిసాం.

ఆవిడ కూడా సరదాగా కుక్కను పెంచుకోవడానికి అయితే లాబ్రడార్‍తో సరిసమానం అయిన బ్రీడ్ లేదు పొమ్మని తేల్చేశారు.

సరే అని తల ఊపి వచ్చేశాము కానీ, ఇంటికి వచ్చాక మాకు అర్థం అయింది, మంచి లాబ్రడార్ కిశోర శునకం (కుక్కపిల్ల) ఎక్కడ దొరుకుతుందో అని ఆవిడని అడగనే లేదు అని.

మరుసటి రోజు ఉదయాన్నే, నేను, మా ఆవిడ , పిల్లలం అందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఉత్త చేతులతో వెడితే బాగుండదు కద, పూలు పండ్లూ తీసుకుని శాస్త్రోక్తంగా వాళ్ళింటికి వెళ్ళాం.

ఆవిడ వృత్తిరీత్యా డాక్టర్, ప్రవృత్తి రీత్యా పోరాటవాది, మహిళా హక్కులు, పౌరహక్కులు, సామాజిక సమరసత ఇలా సోషల్ ఇష్యూస్ పై పోరాడుతూ ఉంటారు.

మేము వెళ్ళే సరికి ఎవరో టీవీ ప్రతినిధులు ఆవిడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు.

“పెళ్ళిళ్ళు అనేవి ఎవరి కులంలో వాళ్ళూ చేసుకోవటం మానేసి, అగ్రవర్ణాల వారి పిల్లలనందరిని కట్టకట్టి వెనుకబడ్డ వర్గాల వారి అబ్బాయిలకు ఇచ్చి పెళ్ళి చేస్తే ఒక్క రాత్రిలో కుల వ్యవస్తని నిర్మూలించవచ్చని……” ఇలా ఆవిడ ఆవేశంగా టీవీ కేమెరా కేసి భీకరంగా చూస్తు సమాజానికి ఒక సవాల్ విసిరారు.

మమ్మల్ని కూచోమని సైగ చేసారు.

సరే ఇంటర్వ్యూ అయిపోయింది కెమెరా బృందం వారు వాన్ ఎక్కి వెళ్ళిపోయారు.

“ఎమర్రా బాగున్నారా, సరే ఏ కుక్కని కొనాలని నిర్ణయం తీసుకున్నారు?” అని ఆవిడ శునక సంబంధ కుశలప్రశ్నలు వేశారు.

పూలు పండ్లు ఆవిడ ఎదురుగా టీపాయ్ మీద పెట్టి సవినయంగా చెప్పుకున్నాం, చివరికి ఆవిడకి ఇష్టమైన బ్రీడ్ అయినట్టి లాబ్రడార్ కొనటానికే నిర్ణయం తీసుకున్నామని.

“మంచిది. మీరు ఒక ఆరేడు నెలలు ఆగి అయినా సరే, లాబ్రడార్ పెంచుకుంటున్న వాళ్ళలో, బాగా తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ముందుగా చెప్పి పెట్టి, ఒక పప్పీ కావాలని చెప్పి అది పిల్లల్ని కన్నాక అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే, మనకు మంచి పప్పీ దొరుకుతుంది.”

“అదేంటండి. ఎందుకు అలాగా?” అడిగాను నేను అర్థం కాక.

“దాని పేరెంట్స్ ఎవరో మనకు ముందుగా తెలుస్తుంది కాబట్టి, అది క్రాస్ బ్రీడ్ కాదని మనకు ఖాయంగా తెలుస్తుంది, భరోసాగా తీసుకోవచ్చు. కెన్నెల్స్ లో దొరికే కుక్కలకు పేరెంట్స్ ఎవరో మనకు తెలియదు, అప్పుడు మనకు వాటి పెడిగ్రీ తెలిసే అవకాశం లేదు (పుట్తు పూర్వోత్తరాలు, కులగోత్రాలు లాగా అన్నమాట). అది రిస్కు కద., కాబట్టి కెన్నెల్స్ ని నేను సజెస్ట్ చేయను” అని ఆవిడ తెగేసి చెప్పారు.

“మాకు అంత టైం లేదు అండీ, పిల్లలు ఆత్ర పడుతున్నారు” అన్నాను

“సరే మీ ఇష్టం” అంది ఆవిడ.

మొత్తమ్మీద మనుషుల్లో సామాజిక సమానత్వం తేవాలని ఆమె కంకణబద్దురాలు అయి ఉంది కానీ కుక్కల విషయంలో అవి వర్ణ సంకరం కావటం ఆవిడ సుతరాము ఇష్టపడటం లేదు. ఏమిటొ నాకేమి అర్థం కాలేదు. సరే ఆమెని నేను ఎడ్యుకేట్ చేయలేను కద. ఇన్నిని బ్రీడ్లు, ఇన్నిన్ని తెగలు ఏమి బాగులేదు. నాకైతే కుక్కలన్నిట్లో కూడా సమానత్వం తెప్పిద్దామని బలంగా అనిపించింది. ఖర్మ నా మాట ఎవడు వింటాడు.

సరే గూగుల్ లో సెర్చ్ చేసి, జస్ట్ డయల్‌కి ఫోన్ చేసి కొన్ని కెన్నెల్స్‌కి మళ్ళీ ఫోన్లు చేస్తే దాదాపు అయిదువేల నుంచి ఇరవై వేల దాకా చెబుతున్నారు ఒక్కొ పప్పీకి.

నాకు కుక్కపిల్లకు పోయి అంత డబ్బు వెచ్చించడం ఇష్టం లేదు. సరే ఇదిలా ఉండగా ఓల్డ్ సిటీ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి వాళ్ళీంటి దగ్గర ఒక నవాబు గారి దగ్గర లాబ్రడార్ బ్రీడ్ పప్పీలు ఉన్నాయి ఉత్తినే నామకార్థ రుసుముతో వాటిని తీసుకోవచ్చని ఆయనకి కుక్క పిల్లలతో వ్యాపారం చేసే ఉద్దేశం లేదు సరదాకి పెంచుతున్నాడు, ఎవరికయినా నామకార్థ రుసుముతో ఇస్తూ ఉంటాడని ఇప్పుడు నాలుగు పప్పీలు రెడీగా ఉన్నాయని చెవుల్లో తేనె పోసినట్టు చెప్పాడు.

సరే ఇంకేముంది, ఆ నవాబు గారి ఫోన్ నెంబర్ ఇప్పించుకుని, ఒక శుభముహూర్తంలో నేను మా ఆవిడ ఇద్దరు పిల్లలు కారేసుకుని బయలు దేరాము. నల్గొండ క్రాస్ రోడ్ దగ్గర ఎడమ వైపుకు మలుపుతీసుకుని చంచల్‌గుడా జైలు వరకు వెళ్ళీ, జైలు దగ్గర మలుపు తీసుకుని ఓల్డ్ సిటీ వైపుకి ప్రయాణం ప్రారంభించాము.

అప్పటి దాకా మేము ఓల్డ్ సిటీ చూసిందే లేదు. రోడ్డుకు అటూ ఇటూ చంచల్ గూడా జైలు. (అప్పటికి రోడ్డు బ్లాక్ చేయలేదు ఇంకా)

అక్కడి నుంచి వాతా వరణం గంభీరంగా మారింది. జైలు పరిసరాలు దాటి కాస్త ముందుకు వెళ్ళిన తరువాత, ఒక ఫ్లై ఓవర్ వచ్చింది, అది దాటి ముందుకు వెళ్ళేకొద్ది వాతావరణం పుర్తిగా కొత్తగా అగుపించసాగింది.

నాకు ఎన్నడూ పరిచయం లేని భాషలో బోర్డులు, పుర్తి ఇస్లాం సంప్రదాయ బద్ధంగా వేష ధారణలో స్త్రీ పురుషులు. నాకు సడన్‌గా ఏదో దేశంలోకి వచ్చేశామా అన్నట్టు అనిపించింది.

సరే అడ్రసు సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళీ ఒక పాడు పడిన పురాతన బంగ్లా ముందుకు చేరుకున్నాము. బాగా పాత పడి దుమ్ముకొట్టుకుని పోయిన మెర్సిడిస్ బెంజ్ కారు వాడకం లేక అవసాన దశలో ఆ బంగ్లా ముందు ఉంది. అదే విధంగా పాత రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్టు ఒకటి, కాడిలాక్ కారు ఒకటి ఇవన్నీ కూడా దుమ్ముకొట్టుకుని పోయి గతించి పోయిన ప్రాభవానికి చిహ్నాలుగా ఆ భవంతి ముందు ఉన్నాయి. మేము కారు దిగి గేటు దాటి లోపలికి అడుగు పెట్టాము.

గొలుసుతో కట్టేసిన జెర్మన్ షెపర్డ్ ఒకటి భీకరంగా అరిచింది నన్ను చూసి.

దాని ఊపు ఉత్సాహాలకు, మెడలోని గొలుసు అడ్డుకట్ట వేయకుంటే అది నన్ను ఖండ ఖండాలుగా చీల్చేసేది అనుకుంటా. నాకింకా భూమ్మీద నూకలున్నాయి కాబోలు. ‘కుక్కలున్నాయి జాగ్రత్త’ అని బోర్డు ఎందుకు పెడతారో నాకర్థం అయింది ఆ క్షణంలో.

‘ఊర్కో, ఊర్కో’ అని దానిని ఉర్దూలో సముదాయిస్తూ ఒక వృద్దుడు లోపలి నుంచి వచ్చాడు. ఆజానుబాహుడు, తెల్లటి తెలుపు. పొడుగ్గ పెరిగిన గడ్డం, రంగు వేసి, వేసి మానేయటం వల్ల ఆ గడ్డం ఒక విధమైన ఎర్రటి రంగులో ఉంది .

అయన నడకలో వృద్ధాప్యం వల్ల వేగం లోపించింది గానీ ఏదో దేశానికి మహరాజు కుండే స్థాయి రాజసం ఆయనలో ఉంది. ఒక ముసలి సింహం లాగా మెల్లిగా వచ్చాడు ‘ఎవరూ బేటా’ అంటు నన్ను ప్రశ్నించాడు. ఆయన కంఠంలో ఒక రాజసంతో కూడిన దయ ఉంది. అడిగితే, ‘ఇంద’ అని వరహాల మూట చేతిలో పెట్టేలాగా ఉన్నాడు.

నేను వచ్చిన విషయం చెప్పగా ఆయన గుర్తు పట్టి, “అవునవును మీరు పొద్దున ఫోన్ చేశారు కద, రండి రండి” అంటూ ఆదరంగా ఆహ్వానించి కాంపౌండ్ లో ఒక వారగా తీసుకు వెళ్ళాడు. అక్కడ సింహంలాంటి రంగులో ఒక వృద్ధ శునకం దాని చుట్టూ గెంతులు వేస్తు ఉంది, ఒక అయిదు పప్పీలు ఉన్నాయి.

“ఇదిగో వీటిలో ఒక దాన్ని తీసుకోండి, ఈ మూడు మగవి, ఇది ఆడది” అంటూ ఆయన నేరుగా విషయానికి వచ్చాడు.

వాటిల్లో ఒక పప్పి విపరీతమయిన చురుకుదనంతో ఉంది. అది మిగతా పప్పీలని అణగదోస్తూ గెంతులు వేస్తోంది. మిగతా వాటి అన్నింటి మీదకి అది చాలా చురుకుగా మాకు తోచి దాన్నే ఎన్నుకున్నాము.

మేము తీసుకున్న ఆ నిర్ణయం మా అతి గొప్ప పొరపాటు నిర్ణయాలలో అది ఒకటి అని కాలక్రమేణా మాకు తెలియవచ్చింది.

ఆ కుక్కను అదే పప్పీని, మేము తీసుకుని వచ్చి దానికి ప్రాడో అని నామకరణం చేసి హరి ఓం అని పెంచుకోవటం మొదలెట్టాం.

దానితో మేము పడ్డ కష్టాలు, మేము అనుభవించిన నరక సదృశ్యమయిన అనుభవాలు చెబుతాను వినండి.

****

బ్రతికి చెడిన ఆ నవాబు గారి దగ్గర లాబ్రడార్ బ్రీడ్‌కి చెందిన పప్పీని తీసుకుని కారెక్కి ఇంటి ముఖం పట్టాం.

మా పిల్లలు ముందు చూపు కలిగిన వారై ముందుగానే తమ వెంబడి ఒక ప్లాస్టిక్ బాస్కేట్ (మనకు షాపింగ్ చేసేటప్పుడు మాల్స్‌లో ఇస్తారు చూడండి అలా లోతుగా ఉండే ప్లాస్టిక్ బాస్కెట్) ఒకటి ముందుగానే పట్టుకొచ్చారు. అందులో చక్కగా పాత దిండు ఒకటి కుషన్‍గా వేసి దాని మీద మెత్తగా పాత టర్కీ టవల్ ఒకటి పరిచి దానికి సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లూ చేశారు.

అది కార్లో కాసేపు గంతులు వేసి ఆ బుట్టలో ఒదిగి ఉండటానికి ససేమిరా అన్నట్టు బాగా మొరాయించింది. అది తల్లి పాలు తాగుతూ ఉండే లాంటి మరీ చిన్నదేమి కాకపోవటం వల్ల మేము కూడా ధైర్యంగా తెచ్చుకున్నాము.

నాకు ఉండుండి ఆ బ్రతికి చెడిన నవాబు గారే గుర్తు వస్తున్నారు.

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వ్రాసిన ‘స్మోకింగ్ టైగర్ అను పులి పూజ’ కథ ఎప్పుడో చదివినది పదే పదే గుర్తు వస్తోంది ఆ వేళ నాకు. అందులో బ్రతికి చెడిన జమీందారు భూపతి పాత్ర గుర్తు వస్తోంది.

అందులో భూపతి పాత్ర గురించి ఆ కథలోని వాక్యాలు వ్రాస్తాను రావి శాస్త్రి గారి మాటల్లోనే “వడలిపోయినప్పటికీ బలంగా కనిపించేవాడు. బలంగా కనిపించినప్పటికీ అసహాయంగా ఉన్నట్టుండేవాడు. ముఖం గజం చదరం ఉండి, అతను చాలా ఎత్తుగా వెడల్పుగా ఉండేవాడు. చాలా పళ్ళూడిపోయి, దవడలు మడతలు పడి సంచుల్లా వేళ్ళాడేవి. కారా కిళ్ళీవల్ల నోరు ఎర్రగా ఉండి నవ్వినప్పుడల్లా నాలిక ఎర్రగా కనిపించేది.

ఆ నోరు, పళ్ళు లేని పాము నోర్లా ఒక్కోసారి నాక్కనిపించేది. అతనెప్పుడూ ఓ మాసిన పంచె మీద మాసిన చొక్క వేసుకుని అంచుమీద ఓ మాసిన ఖాళీకోటు తొడుక్కుని ఉండేవాడు. చేతిలో తరచుగా ఓ షోకైన చేతికర్ర మాత్రం ఉంటుండేది. ఆ చేతికర్ర వల్లనో మరెందువల్లనో గాని ఆయనొక చెడిపోయిన రాజు గార్లా ఉండేవాడు.

ఆ చేతి కర్ర ఊతే లేకపోతే అతను ముష్టికి దిగిపోయిన ముసలి రాక్షసుడిలాగానో, పొట్లకాయలు నవులుకొని పొట్టపోషించుకునే ముసలి పులిలాగానో కనిపించిఉండేవాడు” ఈ వర్ణన ఇంచుమించు ఈ నవాబు గారికి కూడా సరిగ్గా సరిపోతుంది.

ఈ బ్రతికి చెడిన నవాబు కూడా చేతులు చాచి మేము ఇచ్చిన కొద్దిపాటి వందల రూపాయలను అపురూపంగా అందుకుని ఎవరూ చూడకుండా అటు ఇటు చూసి తన జుబ్బా జేబులో దాచుకున్న వైనం నన్ను బాగా కలచి వేసింది.

వస్తూ వస్తూ దారిలోనే కుక్కలకు సంబంధించి గొలుసులు వగైరాలు అమ్మే దుకాణంలో దాని మెడకు ఒక బెల్టు, గొలుసు, దాని ఆహారం కోసం పెడిగ్రీ అనే బ్రాండెడ్ ఫుడ్ ప్యాకెట్లు కొనుక్కున్నాము.

చెప్పాను కద ఇంకో పదిరోజుల్లో కొత్త ఇంటి గృహప్రవేశం పెట్టుకుని కూడా శుభకార్యానికి సంబంధించిన ఒక్క ఏర్పాటూ సక్రమంగా మొదలెట్టలేదు ఈ శునక సేవ సరిపోయింది.

ఓల్డ్ సిటీ నుంచి వనస్థలిపురం చేరేలోగా కారులోపల దుర్వాసన అలుముకునిపోయింది. అది ఆ బుట్టలోనే చేయగల చండాలం అంతా చేసేసింది. భరించక తప్పదు కద.

పక్క సీట్లోనే కూర్చుని ఉన్న శ్రీమతి నా వంక కొరకొర చూస్తోంది. ఆ విషయం తెలుస్తూనే ఉన్నప్పటికి, అవసరమయిన దానికన్న ఎక్కువ ఏకాగ్రతతో రోడ్డును చూస్తూ కారు నడపడం ఇంత కష్టమా అని ఇతరులకు అనిపించేలా పూర్తి దృష్టిని రోడ్డు మీదకు సారిస్తూ నడుపుతున్నాను.

పొద్దుపొడిచేకొద్ది ఆకాశంలో తారలు ఒక్కొక్కటిగా బయటకి వచ్చినట్టు, రోజులు గడిచే కొద్ది మేము పడే కష్టాలు ఒక్కొక్కటి పెరుగసాగాయి.

మొదటి రాత్రే (అపార్థం చేసుకోకండి, పప్పీని ఇంటికి తెచ్చిన మొదటి రాత్రి) అది మాకు చుక్కలు చూపించింది.

కాంపౌండ్ వాల్ లోపలే కార్ పార్కింగ్ దగ్గర దాన్ని గొలుసు వేసి కట్టేసి మేము లోపల పడుకున్నాము. మా ఇంట్లో ఉన్న జంతుప్రేమికుల సంఘం (అదే పిల్లలు) ఈ చర్యని తీవ్రంగా నిరసించారు. వాళ్ళు ఉద్దేశం ప్రకారం దానికి కూడా మా బెడ్ రూంలో ఒక పరుపు ఏర్పాటు చేస్తే సబబుగా ఉంటుంది అని., అది తల్లి దగ్గర నుంచి అప్పుడే వచ్చిన పిల్ల కద, ఓంటరిగా ఉండటానికి భయపడుతుంది అని వారి వాదన.

అది వారి మనసు చదివిందో ఏమో, బయటి నుంచి రోదన ప్రారంభించింది. మాలో ఎవరో ఒకరు బయటకు పోతే అది తోకాడిస్తూ ఆడుకోవటానికి సిద్దపడుతోంది. దానికి నిద్ర రావటం లేదు కాబోలు. నాకు నిద్ర చాలా అవసరం , మళ్ళీ పొద్దున నుంచి ట్రెయినింగ్ సెషన్స్, క్లాసులు ఈ హడావుడి సరిపోతుంది.

సరే ఏతావాతా పిల్లలు, మా అవిడ తలా కాసేపు వంతులు వేస్కుని దానికి కంపెని ఇచ్చారు ఆ రాత్రి అంతా. ఇది దానితో తొలిరాత్రి.

చెప్పాను కద అది అద్దె ఇల్లు అని. ఈ లోగా పై పోర్షన్ లో ఉంటున్న ఓనర్ గారు వచ్చి అకారణంగా కాంపౌండ్‌లో సంచరిస్తున్నారు. ఆయన చూపుల్లో ఏదో నిరసన కనిపిస్తూనే వుంది. ఏమిటి విషయం అని అడిగితే ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు “కుక్క రోదన ఇంటికి మంచిది కాదు. మీరు దానిని ఎక్కడనా వదిలేసి రండి, లేదా మీరు దానిని చూస్తూ కూర్చోంటారో, లేదా దానితో ఆడుకుంటూ కూర్చుంటారో నాకు తెలియదు, దాని ఏడుపు నాకు ఎన్నటికి వినపడకూడదు” అని పెదరాయుడు సినిమాలో రజనీకాంత్‌లా తాను చెప్పదలచుకున్న విషయం చెప్పేసి చక్కా పోయాడు. కండువా స్టయిల్‌గా తిప్పుతాడేమో అని తెగ ఎదురుచూశాను. ఊహు తిప్పలేదు.

ఆయన మాట్లాడుతుంటే దానికి తెగ వినోదంగా అనిపించింది అనుకుంటా, మాట్లాడుతున్న ఆయన్ని బాగా వినోదంగా చూసి అయన అటువెళ్ళీపోగానే అది కుయ్య్ కుయ్య్ మని చిన్నగా అరవటం మొదలెట్టింది. వామ్మో ఇది ఏడిస్తే కొంపలు అంటుకుంటాయి మళ్ళీ రజనీకాంత్ వచ్చేస్తాడని కంగారు పడ్డాం. ఆ విధంగా ఆ రాత్రి గడిచింది.

ఆ తరువాత చెప్పుకోదగ్గ అంశం దాని కాలకృత్యాల ప్రహసనం.

నేను చాలా మందిని గమనించాను వారి శునకాలను ఉదయన్నే గొలుసు పట్టుకుని సరదాగా అలా రోడ్డు మీదకు తీసుకు వస్తే అది ఏ చెట్టు కిందో, చేమ కిందో తన పని కానిస్తుంది. దాన్ని చూసి స్థానిక వీధి కుక్కలు వెంటబడ్డా కూడా అవి వాటిని ఏ మాత్రం పట్టించుకోక తమ యజమాని కనుసన్నల్లో మెలుగుతు ఆయన చెప్పినట్టు వింటూ ఆయన వెంబడి గృహోన్ముఖులు అవటం చూశాను. కానీ ఇది కూడా అంత సునాయాసమైన విషయం కాదని మా అనుభవంలో తెలిసొచ్చింది. ఇలాంటి వ్యక్తిత్వాన్ని శునకం అలవరచుకోవాలి అంటే, దానికి ప్రత్యేక శిక్షకుల వద్ద బాల్యంలోనే శిక్షణ ఇచ్చే నిపుణులు ఉంటారట. కాకపోతే, వారు భారీగా రుసుము వసూలు చేస్తారట.

ఈ మాత్రం దానికి శిక్షకులు ఎందుకు, మనమే చెప్పి చేయించుకోలేమా దానితో అని నిర్ణయం తీస్కున్నాను. అలా మొదలైంది మా మార్నింగ్ వాక్ ప్రహసనం.

దీన్ని గొలుసుతో బయటికి వ్యాహ్యాళికి తీసుకువెళితే ఉదయాన్నే ఆ తాజాగాలిని పీలుస్తూ హాయిగా నాతో బాటు నడిచి, దానిని అలా బయటకు తీస్కువచ్చినందుకు కృతజ్ఞతతో నా వంక చూస్తుంది.

అంతే గానీ అసలు తీసుకువచ్చిన పని చేయదు. నేనే ఏదయినా కరంటు స్థంభం దగ్గర నిలబడి కొద్దిగా కాలు ఎత్తి సూక్ష్మంగా దానికి అర్థం చేయించే ప్రయత్నం చేశాను. ఏ మాటకామాట చెప్పుకోవాలి, , దాని కళ్ళలో భావాలు బాగా పలుకుతాయి. నేను అలాగా కరంట్ స్థంభం దగ్గర నిలబడి దానికి సైగల భాషలో ఏదొ చెప్పే ప్రయత్నం చేస్తుంటే అది నన్ను జాలిగా చూసినట్టు బాగా గుర్తు.

“ఊ, కానివ్వు, మనం వచ్చిన పని కానివ్వు” అని దానికి ఎంత నచ్చజెప్పినా దానికి అర్థం అయ్యేది కాదు. జల్సా సినిమాలో పవని కళ్యాణ్ చెప్పినట్టు “కుక్కలతో లాంగ్వేజ్ ప్రాబ్లెం” అన్న మాట ఎన్ని సార్లు గుర్తొచ్చిందో అప్పట్లో.

సరే ఈ ప్రయత్నాలతో విసిగి వేసారి ఇంటికి తిరిగి వచ్చి నేను బాత్ రూంకు వెళ్ళగానే, అది కూడా హాయిగా కాంపౌండ్‌లో సిమెంట్ ఫ్లోరింగ్ పై తన పనులు కానిచ్చేది. అవి ఎత్తిపోయలేక మా ఆవిడ తీవ్రమయిన ఇబ్బందికి గురయ్యి నన్ను కొరకొర చూసేది. లేకుంటే ఏ క్షణానైనా రజనీకాంత్ వచ్చే ప్రమాదం ఉంది.

‘అందరి లాగా కుక్కతో బయట కాలకృత్యాలు తీర్పించి తీసుకురాలేని మీరేమి ట్రెయినర్’ అన్నట్టు చురకలు వేసేది. నేనేమయినా డాగ్ ట్రెయినర్‍నా చెప్పండి.

కుక్కను పెంచుకోవటం మొదలెట్టాక ప్రతిరోజూ దాన్ని కాలకృత్యాలకు తీసుకువెళతాం అని నమ్మబలికిన మా పిల్లలు నాకు చల్లగా మాట మార్చేశారు. హోం వర్కులని, ప్రాజెక్టు వర్కులని ఇలా వంక పెట్టుకుని మొహం చాటేసేవారు.

మొత్తం మీద ఈ కుక్క కాలకృత్యాల కార్యక్రమానికి నేను మా శ్రీమతి బలయ్యే వాళ్లం చెరొక రకంగా. ఫలితం, లేని కాలి తిప్పట నాకు, ఎత్తిపోసుకోలేక అగచాట్లు తనకు.

సరే ఇదిలా ఉండగా, అది తనను గొలుసుతో కట్టి పడేసే విషయంలో తీవ్రమయిన పొరాటాలు జరిపి గొప్ప విజయం సాధించింది. మా ఇంట్లో జంతు ప్రేమికులు ఉన్నారు కద, వారు దాని పోరాటానికి పూర్తి మద్దతు.

కాబట్టి దాన్ని గొలుసుతో కట్టేయటం అనేది మూడు రోజుల ముచ్చటే అయింది.

వాక్సినేషన్ చేయిస్తే మంచిది అన్న హితోక్తి ప్రకారం దాన్ని స్థానిక వెట్ (పశువుల డాక్టర్‌ని అలా అనాలట) వద్దకు తీస్కు వెళ్ళాం. ఆయన దాని పేరుతో ఒక ఫైల్ ఓపెన్ చేసి దానిక్ ఒక సీరియల్ నెంబర్ ఇవ్వటం వంటి ఫార్మాలిటిస్ అన్నీ పూర్తి చేసి, దానికి ఎన్నెన్ని రోజులకు ఒకసారి ఏయే ఇంజెక్షన్ చేయించాలో వ్రాసి ఇచ్చాడు.

ఆ సందర్భంలోనే ఆయన చూచాయగా చెప్పాడు ‘అది ఒరిజినల్ బ్రీడ్ కాదు, దాని తల్లో తండ్రో లాబ్ అయ్యుంటే అయ్యుండచ్చేమో అన్నాడు.

ఆ నవాబు గారి శీలాన్ని శంకించాల్సి వచ్చింది మరి.

లాబ్రడార్ ఆంటీ గారు (మా వీధిలో లాబ్‌ల తాలూకు నడిచే విజ్ఞాన సర్వస్వం) చెప్పిన ప్రకారం ఒక ఆరు నెలలు ఎదురు చూసి ఒక మంచి కులమూ గోత్రం ఉండే కుక్కని అటేడు తరాలు ఇటేడు తరాలు వివరాలు కనుక్కుని సంబధం కలుపునే ముందే మంచి చెడ్డలు మాట్లాడుకున్నట్టు, అన్నీ చూసుకుని తెచ్చుకునింటే ఎంత బాగుండేది అని బాగా పశ్చాత్తాప పడ్డాను. ఇదేదో వర్ణ సంకరం కుక్క అని తెలిసి కూడా ఏమి చెయలేని పరిస్థితిలో ఇరుక్కుపోయాము.

ఇదంతా ఆరంభం మాత్రమే. సరే దాని లీలలు ఒక్కొక్కటి చెబుతాను.

సైజులో అది చిన్నగా ఉండటం వల్ల మా గేటు తాలుకు గ్రిల్ లోంచి దూరి వెళ్ళకుండా గేటుకు ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ తెప్పించి ఏర్పాటు చేశాము. అది పోరాడి సాధించుకున్న విజయం కారణంగా గొలుసు అన్నది దాని చరిత్రలోనే లేదు కద. అది రాత్రంతా కాలక్షేపం కోసం అనుకుంటా ఆ షీట్‌ని ఒక క్రమ పద్ధతిలో కొరికి తాను బయటకు వెళ్ళగలిగేలా రంధ్రం ఏర్పాటు చేసుకోగలిగింది. జైలు గదిలోంచి సొరంగం తవ్వి తప్పించుకున్న ఖైదీల గాథలాగా ఒక కథ వ్రాసుకోవచ్చు కూడా అది, కుక్కలకి చదివే అలవాటు ఉంటే.

ఈ ప్లాస్టిక్ షీట్ మాత్రమే కాక, కాదేది కవితకి అనర్హం అన్న స్థాయిలో టెర్రస్ పైకి వెళ్ళి ఆరేసిన బట్టల్ని విధిగా కొరికేది. అవి మరి ధరించటానికి వీలు లేనంతగా చినిగి పీలికలు అయ్యేవి. దీనివల్ల బాగు పడ్డవాడు ఎవడు అంటే బిగ్ బజార్ వాడు. తరచు వెళ్ళీ కొత్త బట్టలు తెచ్చుకునే వాళ్ళం, అప్పటికి ఇంకా మాకు దగ్గర్లో బ్రాండ్ ఫాక్టరీ, స్టార్, పాంటలూన్స్, వెస్ట్ ఎండ్ ఇలాంటివి రాలేదు వనస్థలిపురంలో.

ఇవన్నీ ఒకెత్తు. ఇంకో ముఖ్య విషయం చెప్పకుంటే ఈ కథకే అందం ఉండదు.

కుక్కకి అందునా పెంపుడు కుక్కకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి, ఎవరైనా అపరిచితులు వస్తే అది ‘భౌ, భౌ’మని అరిస్తే మనం స్టయిల్గా దాన్ని విసుక్కుని, ఆ అతిథుల వంక అపొలజెటిక్‌గా చూస్తూ “రండి రండి” అని ఆహ్వానించాలని నాకు చాలా కోరికగా ఉండేడి.

పెంపుడు కుక్కలున్నవారు అందరూ ఇలాగే చేస్తు ఉంటారు కద మరి.

ఆ విధంగా ఆ కోరిక ఒకటి జనించింది నాలో. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది చెప్పటానికి చింతిస్తున్నాను.

సరే ఇలా కాదన్చెప్పి ఎవరయినా వచ్చినప్పుడు అరవాలి అని దానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసాను. ఎవరయినా అతిథో, పోస్ట్‌మానో, కరెంట్ బిల్లు వాడో, ఇలా ఎవరో ఒకరు దూరంగా కనపడంగానే, నేను కాంపౌండ్ వాల్ పక్కన నక్కి, వారికి కనపడకుండా ‘భౌభౌ’ అని చిన్నగా అరిచి దానికి దాని కర్తవ్య బోధ చేసే వాడిని.

దాని దుంపతెగ. దాని కళ్ళలో భావాలు బాగా పలుకుతాయి. అది నన్నుజాలిగా చూసేది ఆ టైం లో.

‘ఒకె, ఎవరయినా వస్తే అరవాలా. సరే దానికి ఇంత హైరానా పడతారెందుకు’ అన్నట్టు భరోసా ఇచ్చినట్టు చూసి ఎవరయినా రాగానే ‘భౌ భౌ’ అని అరిచి నా వంక విజయ గర్వంతో చూసేది.

ఇదంతా బాగుంది కాని చిక్కెక్కడ వచ్చింది అంటే నేను చూస్తున్నప్పుడు మాత్రమే అది అలా అరిచేది. మేమంతా లోపల ఉన్నప్పుడు ఎవరొచ్చినా సరే తోక ఊపుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీదకి ఎగబడేది.

క్రమంగా అది పెరిగి పెద్దగయింది. దాని సైజు చూసి భయపడేవారు జనాలు నిజానికి. కాని వట్టి లొట లొట అని తెలియదు వారికి. రోడ్డు మీద మా ఇంటి ముందు ఎవరు వెళ్ళినా వారితో బాటుగా నడుచుకుంటూ వెళ్ళేది. దీని స్నేహభావం వారికి తెలియదు. భయపడి చచ్చేవారు.

ఒకరిద్దరు కుర్రాళ్ళూ మోటారు సైకిళ్ళపై నుంచి కింద పడ్డారు కూడా. ప్రతి ఒక్కర్ని విధిగా ఇలా వెంట పడి వారితో వీధి చివరి వరకు నడిచేది. ఇది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

ఇంకా చిత్రమయిన విషయం ఏమిటంటే, ఎవరి వెంబడి అయితే తోక ఊపుకుంటూ తిరుగుతుందో, మేము చూస్తున్నామని తెలియగానే వారిని చూసి గట్టిగా అరిచేది ‘భౌ భౌ’ అని. తాను అలా అరిస్తే మాకిష్టం అని దానికి ఒక అంచనా.

దాంతో వాళ్ళకు మరింత బిత్తర ఎతుకొనేది. రోడ్డు మీద వెళ్ళే వారు కట్రాట లాగా నిలబడి పోయేవారు దీని దెబ్బకు. ఇదొక ప్రహసనం. దేవుని దయ వల్ల మమ్మల్ని ఎవ్వరూ పల్లెత్తు మాట అనలేదు. లేకుంటే మేము వారి తిట్లకు అన్ని విధాల అర్హులమే.

సరే ఇదిలా ఉండగా దానికి యవ్వనం ఎంత సేపట్లో వస్తుంది. ఆ తరుణం రానే వచ్చింది.

హిందీ సిన్మా పాటలలో, తరచుగా చెబుతుంటారు ‘ప్రేమికులని ఆపగల గొలుసులు ఏవీ ఇంకా పుట్టలేదు’ అని. సరిగ్గా అలాగే జరిగింది దీని విషయంలో. దీనికి గొలుసులు అసలు అలవాటు ఎలాగు లేదు.

కొంత వయసు వచ్చాక అది గోడలు దూకడం కూడా నేర్చుకుంది. దానికి వీధిలో ఆడ కుక్కల మధ్య ఒక స్టార్ ఇమేజి కూడా ఉంది. ఆడకుక్కలు దీన్ని ఆరాధనగానూ, వీధిలోని మొగకుక్కలు అసూయగానూ చూడటం గమనించాను. సరే, గోడలు దూకడం అన్నది రూపకాలంకారంగా కూడా నప్పింది దాని విషయంలో.

మా తృప్తి కోసం గేటు వేసి ఉంచటమే కానీ దాని స్వేచ్చా విహారానికి ఏ గేటు, ఏ గోడ అడ్డుకట్టలు వేయలేక పోయాయి.

ఇటీవల చలం గారి మైదానం గూర్చి కిరణ్ ప్రభ గారు తమ టాక్ షోలో యూ ట్యూబ్‌లో చెబుతుంటే మా ప్రాడో గురించి చెబుతున్నట్టే అనిపించింది.

అది క్రమంగా మా ఇంట్లో ఉండటం తక్కువ బయట గడపటమే ఎక్కువ అయింది. కేవలం తిండి కోసం వచ్చేది ఇంటికి, కాలకృత్యాలు తీర్చుకోవటానికి వచ్చేది. అన్నట్టు చెప్పనే లేదు కదు, దానికి బయట కాలకృత్యాలు తీర్చుకోవటం అన్న అలవాటు అవనే లేదు. దానికి చెడ్డ నామోషి అలా బయట కూర్చోవటం. మూత్ర విసర్జన కావచ్చు, మల విసర్జన కావచ్చు చక్కగా ఏకాంతంగా మా ఇంటి టెర్రస్ పైకి వెళ్ళీ గుట్టుగా ముగించుకుని వచ్చేది.

ఉండేది ఉండగా ఒక మధ్యాహ్నం అది ఒక పెద్ద చేపని తెచ్చుకుంది. మేము కంగారుపడ్డాం ఎక్కడిదబ్బా ఇది అని. కాసేపట్లో కొందరు యువకులు లబలబ లాడుతూ వచ్చారు.

మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంది. వనస్థలిపురంకి సంబధించి దీన్ని మినీ ట్యాంక్ బండ్ అంటారు. ఇక్కడ చేపలు పట్టుకోవటానికి వచ్చేవారు తాము పట్టిన చేపలు అన్ని ఒక వారగా బుట్టలో పెట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ శ్రద్ధగా చేపలు పట్టటంలో నిమగ్నమవుతారు. ఇది అదును చూసి ఆ చేపల్ని రోజూ గుటకాయస్వాహ చేస్తోంది అట.

మేము పూర్తి శాఖాహారులం కావటం వల్ల దానికి ‘పెడిగ్రీ’ తెప్పిచ్చి ముక్కు మూసుకుని పెట్టే వారమే కాని దానికి సంబంధించిన సహజ ఆహార అలవాట్లకు అనుగుణంగా ఏర్పాట్లుచేయలేకపోయే వాళ్ళం. అది విషయం.

ఆ విధంగా అది మాంసాహారం తానే సంపాయించటం మొదలెట్టాక మా ఇంటికి రావటం కూడా తగ్గించింది. క్రమంగా దాని నివాసం వీధిలోనే ఏర్పాటు చేసుకుంది. ఎంత పిలిచినా రాదు.

ఇలా ఓ రెండు మూడేళ్ళు కాలగతిలో కలిసిపోయాయి.

ఇప్పటికీ, అది వీధిలో తారస పడుతుంది కానీ విశ్వాసం వినయం స్థానే, ఒక దేశాధ్యక్షుడు మరో దేశాధ్యక్షుడిని పలకరించిన స్థాయిలో తల ఎగరేసి ‘ మీ రాజ్యంలో అంతా కుశలమా’ అన్నట్టు చూస్తుంది.

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి దాని కళ్ళలో భావాలు బాగా పలుకుతాయి.

ఇంతటితో ఈ శునక పురాణం సమాప్తం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here