ప్రజా సందేశం

0
13

[dropcap]ధ[/dropcap]ర్మ దేశానికి రాజు పురుషోత్తముడు. ఆ దేశ పేరుకు తగ్గట్టే ప్రజలు ఎంతో ధర్మ బద్ధంగా బతుకుతున్నారు. రాజు పురుషోత్తముడు కూడా అనేక మంచి పథకాలు అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరకొన్నాడు.

అలా పరిపాలన సాగి పోతుండగా పురుషోత్తముడు తన కోటను కొంత మేర విస్తరించాలనుకొన్నాడు. అందుకోసం ప్రస్తుతం ఉన్న కోట పక్కనే ఉన్న స్థలాన్ని పునాదుల కోసం త్రవ్వించసాగాడు. అలా త్రవ్వుతుండగా చిత్రంగా ఐదు పెద్ద వెండి పెట్టెలు కొంత లోతులో లభించాయి. రాజు ఆశ్చర్యపోయి ఆ పెట్టెలను తెరిపించాడు. అక్కడి వారందరికీ కళ్ళు జిగేల్ మన్నాయి! వాటిలో వజ్రాలు, మణులు, అపారమైన బంగారం ఉన్నది! ఆ నిధి భూమిలో దొరికింది కనుక ఆ సంపద ప్రజలందరికీ పంచుదామని పురుషోత్తముడు అనుకుని పక్కనే ఉన్న మంత్రి సుహస్తుడితో ఆ విషయం చెప్పాడు.

“రాజా ఈ సంపదను అలా పంచే బదులు దీనితో ఏం చేయాలో ప్రజల్నే అడుగుతాము, వారందరిలో ఎక్కువమంది ఏది చెబితే దాన్ని అమలు చేద్దాము” తన ఆలోచనను రాజుగారికి చెప్పాడు.

“మంచి సూచన ఇచ్చారు మంత్రీ, మీరు చెప్పినట్టు రేపే మన కోట మైదానంలో ప్రజలతో సభ పెడతాము, అందరినీ అక్కడకు రావల్సిందిగా దండోరా వేయించండి” రాజు చెప్పాడు.

రెండోరోజే మంత్రి జరగబోయే సభను గురించి నగర వీధుల్లో దండోరా వేయించాడు.

ఆ సభకు ప్రజలందరూ వచ్చారు. రాజు గారు వారందరికీ దొరికిన సంపద పెట్టెలు, వాటిలోని సంపదను గురించి వివరించి ఆ సంపదను ప్రజలందరికీ పంచుదామని అనుకున్నట్టు చెప్పాడు.

పక్కనే ఉన్న ఆస్థాన పండితుడు విద్యాపతి ఒక్కసారి పెట్టెలను పరిశీలిస్తానని చెప్పాడు. దానికి రాజు సమ్మతించాడు. విద్యాపతి పెట్టెలను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆ పెట్టెలమీద ఉన్న నగిషీల మధ్యలో ఒక్కొక్క పెట్టె మీద ‘ధర్మరాజు’, ‘భీమసేనుడు’, ‘అర్జనుడు’, ‘నకులుడు’, ‘సహదేవుడు’ పేర్లు ఉన్నాయి. అవి చూసిన విద్యాపతి మొహంలో చిరునవ్వులు చిగురించాయి!

“మహారాజా, ఇవి మహాభారత కాలం నాటివి. వీటిని పంచ పాండవులు పాతిపెట్టినట్టున్నారు! ఇవి ఎంతో పవిత్రమైనవి” వివరించాడు.

ఈ విషయాన్ని ప్రజలకు వివరించాడు పురుషోత్తముడు. ఆ మంచి విషయం విని ప్రజలు చప్పట్లు కొట్టారు.

ప్రజలందరి తరపున ఐదు మంది పెద్దలు ఈ విధంగా చెప్పారు.

“మహారాజా ఈ సంపదను ప్రజలకు పంచితే అందరూ ఏదో ఒక విధంగా ఖర్చు పెడతారు. అదే ఆ ధనంతో మన రాజ్యాన్ని సుందర రాజ్యంగా తీర్చిదిద్ది, మంచి కళాక్షేత్రాలు, విద్యాలయాలు, సందర్శన శాలలు, అధ్బుత తోటలతో సుందరంగా తీర్చిదిద్దితే అన్నిదేశాలనుండి ప్రజలు చూడటానికి వస్తారు. అలా వచ్చిన వారి వలన మన రాజ్య సంపద పెరిగి రాజ్యానికి మంచి పేరు వచ్చి మీ పేరు కూడా సుస్థిరంగా నిలచిపోతుంది. ఈ సుందరీకరణ వలన అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. వారు సృష్టించిన కళ వారికి శాశ్వత కీర్తి, మానసిక సంతృప్తి మిగులుతాయి, ఆలోచించండి మహారాజా” అని వివరించారు వారు.

ప్రజల మంచితనానికి రాజు, మంత్రి, విద్యాపతి మది పులకించిపోయింది.

“మాకు పంచండి” అనే స్వార్థం లేకుండా అందరి మేలు కోరి ఆ సంపదను సద్వినియోగం చెయ్యమనడం వలన రాజు, మంత్రి, విద్యాపతి హర్షం వెలిబుచ్చారు. రాజు తమ మాట మన్నించినందుకు ప్రజలందరూ లేచి నిలబడి పట్టరాని ఆనందంతో చప్పట్లు కొట్టారు.

స్వర్గం నుండి పంచ పాండవులు ఆశీర్వదించినట్టు మేఘాలు చిరు జల్లులు కురిపించాయి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here